అడిగి తెలుసుకోడం ఆరోగ్యప్రదం

హైబీపీ, షుగరు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక జబ్బుల మీద  కనీస ప్రాథమిక అవగాహన ఉండటం ఎంతో అవసరం. మన దేశంలో ఇటువంటి ప్రాథమిక అవగాహన దాదాపు శూన్యమనే చెప్పాలి. అవగాహన లేకపోవడమే కాక ఇటువంటి వ్యాధుల చుట్టూ ఎన్నో అపోహలూ ఉంటాయి.

నా క్లినిక్ కి తరచుగా ఒక ఎనభై ఐదేండ్ల పెద్దాయన వస్తూ ఉంటాడు. ఆయన వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలియదుగానీ, ఒంటరిగా ఉంటాడని మాత్రం తెలుసును. చాలా చలాకీగా నవ్వుతూ పలుచటి కాటన్ వైట్ షర్ట్ తో ఇస్త్రీ చేసిన ప్యాంటు తో స్టైలుగా ఇన్షర్ట్ చేసుకుని ముద్దుగా తయారై కనిపిస్తాడు. నీట్ గా కనిపించడంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడని ఆయన్ని చూడగానే చెప్పవచ్చు. అందమంతా ఆయన నవ్వడంలోనే ఉంటుంది. పెట్టుడు దంతాలు ఉండటం వలన అసలు ముసలితనం ఉన్నట్టే అనిపించదు ఆ నవ్వులో. బహుశా ఆయన లక్ష్యం కూడా అదేనేమో.  మొదటి సారి ఆయన్ని చూచినప్పుడు ఆయనకు హెల్త్ కాన్సియస్నెస్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉందేమో అనిపించింది. “ఒంటరిగా ఉంటానండీ నన్ను నేనే పట్టించుకోవాలిగా” అన్నాడు. నిజమే కదా అనుకున్నాను. కొద్దిగా కళ్లు తిరుగుతున్నాయండీ ఈ మధ్య అన్నాడు. చూస్తే బీ.పీ. 200/100mm of Hg వుంది. సరే అందుకు తగ్గ మందులు మొదలు పెట్టడం ఆయన వేసుకోవడం ఇత్యాది మామూలే. ఈ పెద్దాయన లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… డాక్టరు పేషంటు రిలేషన్షిప్ లో ఈయన యాక్టివ్ పార్టీసిపెంట్. హై బీపీ మందులు మొదలు పెట్టాక follow up visits  షెడ్యూల్ ని క్రమం తప్పకుండా పాటించే వాడు. నేను మందులు రాసి ఇచ్చిన తరువాత మొదటి follow up visit కి పది రోజుల తరువాత రమ్మని చెప్పాను. పదో రోజు ఠంచనుగా క్లినిక్ లో కనబడ్డాడు.

ఇక్కడ చెప్పాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ పది రోజుల్లో ఆయనకు వచ్చిన సందేహాలనూ మందులు వేసుకోవడం వలన ఆయనకు అనిపించిన మార్పులనూ అన్నింటినీ ఒక A4 size paper మీద రాసుకుని తీసుకు వచ్చాడు. అన్నీ ప్రశ్నలే. పేపర్ కి రెండు వైపులా ప్రశ్నలు నింపేసాడు. ఒక్కొక్కటిగా అడగడం మొదలు పెట్టాడు. దాదాపు ఇరవై నిముషాలు సాగింది ఆ ప్రశ్నలు పరంపర. పైగా బీపీ కూడా చాలామటుకు కంట్రోల్ లోకి వచ్ఛేసింది. ఉన్న సందేహాలూ తీరాయి. హాయిగా నవ్వుతూ వెళ్ళాడు.

ఐతే తరువాత follow up visits కి కూడా ఇలాగే ప్రశ్నలు పేపర్ మీద రాసుకుని వచ్చేవాడు. రాను రానూ ఆయన హై బీ.పీ. కంట్రోలై ఎలా తగ్గుతూ వచ్చిందో అలాగే ప్రశ్నల చిట్టా కూడా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఆయన వచ్చినపుడు ఆ తెల్లకాగితం మీద ఒకటీ రెండు ప్రశ్నలు ఉంటాయి అంతే. వాటికి సమాధానాలు తెలుసుకుని హాయిగా నవ్వుతూ వెళ్లిపోతాడు. మొదట అడిగే ప్రశ్నలు కూడా చాలా అసంబద్ధంగా ఉంటుండేవి. అంటే ఆ ప్రశ్నలలో  చింతపండు తినొచ్చా…రాత్రి పూట టీవీ చూడొచ్చా, తలనొప్పికి జండూ బామ్ వాడొచ్చా వంటివే ఎక్కువగా ఉండేవి. మధ్య మధ్యలో హైబీపీ ఎందుకొస్తుంది? ఈ టాబ్లెట్లకు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి? వస్తే ఎట్లా?… వంటి ప్రశ్నలు ఉండేవి. రాను రానూ ఆ ప్రశ్నలు తగ్గిపోయాయి. ప్రశ్నలలో క్వాలిటీ పెరిగింది. హైబీపీకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉండేవి. ఇలా ఎందుకు జరిగింది అంటే…ఆయన రాను రానూ well informed patient గా మారాడు కనుక. ఆయన కున్న అపోహలు ఒక్కొక్కటిగా సమసి పోవడం అపోహల స్థానంలో అవగాహన పెరగడం జరిగింది.

హైబీపీ, షుగరు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక జబ్బుల మీద  కనీస ప్రాథమిక అవగాహన ఉండటం ఎంతో అవసరం. మన దేశంలో ఇటువంటి ప్రాథమిక అవగాహన దాదాపు శూన్యమనే చెప్పాలి. అవగాహన లేకపోవడమే కాక ఇటువంటి వ్యాధుల చుట్టూ ఎన్నో అపోహలూ ఉంటాయి. పక్కింటి వాళ్ళకు ఇలా జరిగిందనో, ఎదురింటాయన ఇలా చెప్పాడనో… అనవసరమైన అపోహలు పెంచుకుంటూ పోతారు. ఈ పేషంటుని ఎందుకు ఉదహరించానంటే అతనికున్న అపోహలను తొలగించుకోవడానికి ఆయన ఏ స్నేహితుడినో ఏ బంధువునో అడగలేదు, తనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరునే అడగడం సరైన పని. Uninformed patients కంటే informed patients కు జబ్బుకు, ట్రీట్మెంట్ కు సంబంధించిన complications తక్కువగా ఉంటాయి అనేది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన స్టడీస్ వలన తెలిసిన అంశం.

Informed patient గా మారడం అంటే తమకున్న జబ్బుమీద కనీసం ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం. చాలా మంది పేషెంట్లు పక్కింటి వాళ్లు చెప్పారనో, ఇంకెవరో ఇటువంటి జబ్బు ఉన్నవాళ్ళే సలహా ఇచ్చారనో అంటూ ఉంటారు.  ఇపుడు చాలా మంది గూగుల్ లో ఏవేవో వెతికి మిడిమిడి అవగాహనతో సొంత ప్రయోగాలు చేస్తుంటారు. ఒక ఉదాహరణ… ఆ మధ్య ఒకాయనకు హైబీపీ కోసమని ARB అనే రకానికి చెందిన టాబ్లెట్లు రాశాను. ఈ మందుల వలన రక్తంలో పొటాషియం శాతం పెరిగే అవకాశం ఉంటుందని గూగుల్ లో చదివి ఆయన ఆ మందులు వాడటమే మానేశాడు. కొంతకాలానికి బీపీ పెరిగి పక్షవాతం బారినపడి ఇపుడు మంచానికే పరిమితమయ్యాడు. ARB మందులు పొటాషియం ను పెంచే మాట వాస్తవమే గాని, ఆ సంగతి డాక్టరు చూసుకోగలడు. ఎంత డోసులో వాడాలి, ఎపుడు పొటాషియం స్థాయిలను రీచెక్ చేయాలి అనేది డాక్టరు చూసుకునే అంశం. ఒకవేళ ఆ విషయం గూగుల్ లో చదివినా, డాక్టరుతో మాట్లాడి సందేహ నివృత్తి చేసుకోవచ్చు. స్వంత నిర్ణయం వలన అతడికి మంచానికి పరిమితమైన పరిస్థితి వచ్చింది. ఇది గూగుల్ వంటి మాధ్యమం ద్వారా వచ్చిన అదనపు సమాచారమే ఐనా అది అవగాహనను పెంచే బదులు అపోహలను పెంచింది.

నమస్తే డాక్టర్ శీర్షిక ద్వారా జబ్బుల మీద అవగాహన పెంచుకుందాం. అపోహలను దూరం చేసుకుందాం. సామాన్యులకు సులువుగా అర్థమయ్యే రీతిలో సమాధానాలను రాయటానికి ప్రయత్నం చేస్తాను. ప్రశ్నలను అడగటం పాఠకుల వంతు. ఈ శీర్షిక ద్వారా అందరితో కలిసి మాట్లాడే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. హెచ్చార్కే గారికీ, రస్తా వెబ్ మ్యాగజైన్ నిర్వాహకులకూ శుభాభినందనలు.

– విరించి విరివింటి

 

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

5 comments

  • మంచి విషయాలు చెప్పారండి. కానీ, ఇలా ప్రశ్నలు రాసుకొని వస్తే సహనంగా విని సమాధానం చెప్పే డాక్టర్స్ తక్కువే. మీలాంటి డాక్టర్స్ ఉంటే, పేషెంట్స్ సొంత వైద్యం మాని, ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు 😊.

    • సురేష్ వెంకట్ గారూ ఓ.పీ. విభాగంలో పేషంట్ల అనుమానాలను చాలామటుకు నివృత్తి చేయటానికి డాక్టర్లు సిద్ధంగానే ఉంటారనేది వాస్తవం. ఐతే డయాగ్నోసిస్ కాకముందే వివరించటానికి ఇష్టపడరు. ఫైనల్ డయాగ్నోసిస్ అయ్యాక తీరికగా చెప్పటానికి ఇష్టపడతారు.

  • చక్కటి ఉదాహరణతో మావంటి సామాన్యులని కూడా మీ శీర్షిక వైపు చూసేలాగా చేశారు. Doctors అందరూ writers అయితే బాగుంటుందేమో అనిపించేలా చేశారు. బాగుంది.

  • Doctergaru nenu suddenga weight periganu thyroid test cheste ledu ani vachindi weight taggalante emicheyali

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.