కోదండ రామ్ కొత్త అడుగు…

నేనూ కోదండ్ రామ్ ఆ మధ్య మహబూబ్ నగర్ లో ఒక పిడియెస్యూ (PDSU) సభలో మాట్లాడి తిరిగి హైదరాబాద్ వస్తున్నప్పుడు… తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజెఎసి) రాజకీయ పార్టీ ఏమైనా పెట్టాలనుకుంటున్నదా…  అని నేను అడిగాను. అలాంటి ఆలోచనలయితే ఉన్నాయి, పార్టీ వొద్దనే వాళ్లూ వున్నారు అన్నాడాయన. వొక ప్రెజర్ గ్రూపుగా కమిటీకి జనాల్లో మంచి పేరుంది, రాజకీయ పార్టీ పెడితే ఈ మంచి పేరు పోతుందేమో అన్నాన్నేను. అలా ఏం జరగదన్నాడు. ఇవాళ దేశంలో ఎన్నికల రాజకీయాల సంగతి తెలిసిందే, ఇలాంటి చోట ఇప్పటికే పాతుకుపోయిన పార్టీల ధన బలం, కండబలంతో ఓ కొత్త సంస్థ పోటీ పడగలదా అని నేను రెట్టించి అడిగాను. రాష్ట్రంలో ప్రజలు టిఆరెస్ తో బాగా విసిగిపోయారు, మనం ఎన్నికల రాజకీయాల్లో కలుగజేసుకోక తప్పదు అన్నారు కోదండ్. అందరితో ఆలోచించాకే  తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. మేము మాట్లాడుకున్నది నిరుడు డిసెంబర్ లో. వాళ్లు తుది నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల సంఘం వాళ్లు టిజెఎస్ (తెలంగాణా జన సమితి) పార్టీకి కి ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చినట్టు మార్చ్ 31 న ప్రకటించారు. తెలుపు, నీలి, ఆకుపచ్చ రంగులతో పార్టీ జెండాను కూడా గత నెల ఏప్రిల్ 4న ఆవిష్కరించారు. ప్రజా హక్కులకు సంబంధించిన రాజకీయ సిద్ధాంతాన్ని విస్తరించాల్సిన అవసరం వుందనీ, సామాజిక తెలంగాణా సాధనే సమితి (తెలంగాణా ప్రజా సమితి) లక్ష్యమనీ ఆ సందర్భంగా కోదండ్ స్పష్టం చేశారు. ఇవాళ వున్నది…. వందలాది మంది దేని కోసమైతే ప్రాణ త్యాగాలు చేశారో ఆ తెలంగాణా కాదన్నారు. అధికారం కొద్ది మంది కాంట్రాక్టర్ల, పెద్ధ వ్యాపారుల చేతుల్లో వుండిపోయిందన్నారు. ప్రస్తుత టిఆరెస్ ఏలుబడిలో ప్రజాతంత్ర చర్యకు అవకాశం లేకుండా పోయిందన్నారు. చిన్న సంస్థలుగా మొదలై అధికారం చేపట్టే వరకు ఎదిగిన ఆప్ (ఎఎపి), బిఎస్పి పార్టీల మాదిరిగానే… తెలంగాణా జన సమితి కూడా ముందుకు వస్తుందని కోదండ్ వివరించారు.

తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ కథ:

తెలంగాణా రాజకీయాల్లో తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చాల పెద్ద పాత్ర నిర్వహించింది. ప్రత్యేక తెలంగాణా వుద్యమం చివరి సారి వూపందుకున్న తరువాత, 2009 డిసెంబర్ లో ఈ కమిటీ ఏర్పడింది. విభిన్న రాజకీయ శక్తులు, ప్రజా సంఘాలు… ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అనే ఒకే ఒక్క అజెండాతో చేతులు కలిపి ఈ సంస్థను రూపొందించాయి. టిఆరెస్ పార్టీ ఏర్పడ్డానికి బాగా ముందు నుంచే… ఎటువంటి తెలంగాణా కావాలనే విషయమై చాల అభిప్రాయాలు వినిపించాయి, చాల చర్చలు జరిగాయి. బహుజన తెలంగాణా, ప్రజాతంత్ర తెలంగాణా, సామాజిక తెలంగాణా వంటి రకరకాల నినదాలు హోరెత్తాయి. తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా ఈ అభిప్రాయాలు, నినాదాలు ప్రతి ధ్వనించాయి. వేర్పాటు కోసం పోరాటం మీదనే అందరి దృష్టి వుండడం వల్ల, ఆ భావాలు కమిటీలో ప్రామఖ్యం సంతరించుకోలేదు.

మొదట 2009 డిసెంబర్ 25న తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీని ప్రకటించే నాటికి అందులో వున్న పార్టీలు మూడు: టిఆరెస్, బిజెపి, సిపిఐ ఎంఎల్న్యూ డెమోక్రసీ. కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి కొందరు వ్యక్తులు కూడా అందులో పాల్గొన్నారు. పలు ప్రజా సంఘాలు కూడా వచ్చి కమిటీలో చేరాయి.

ఉద్యమం పదునెక్కి తెలంగాణా మూలమూలలకు వ్యాపించే కొద్దీ, పోరాట రూపాల గురించి భిన్న భిన్న భావనలు వ్యక్తం కావడం కూడా మొదలయ్యింది. మిలియన్ మార్చ్ అనేది ఉద్యమ గతిలో ఒక మూల మలుపు. తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీకి… ముఖ్యంగా కోదండ్ రామ్ కూ…. టిఆరెస్ ప్యాట్రియార్క్ కెసియార్ కూ మధ్య సంబంధాల్లో కూడా అదొక పెద్ద మలుపే.  ఈ ఆందోళన టిఆరెస్ ప్యాట్రియార్క్ కి ఇష్టం లేదు. కోదండ్ రామ్ వెనక్కి తగ్గకుండా నిలబడి వుమ్మడి నిర్ణయాన్నే అమలు జరిపారు. బయటికి చెప్పకపోయినా, దీంతో ప్యాట్రియార్క్ కోదండ్ మీద వైమనస్యం పెంచుకున్నారు. కోదండ రామ్ ను కమిటీ అధ్యక్ష పదవి నుంచి తీసేయాలనే ఆలోచన కూడా చేశారు. కోదండ్ తన సృష్టే అని… ఆమాట కొస్తే కమిటీ కూడా తమ సృష్టే అని వాళ్లు చెప్పుకుంటారు. 2014 జూన్ లో తెలంగాణా రాష్ట్రం వాస్తవ రూపం ధరించే సరికి, ఇక కమిటీని కొనసాగించడమే అనవసరం అనడం మొదలెట్టారు టిఆరెస్ నాయకులు. ఈ క్రమంలో, రాజకీయ పార్టీలు వెళ్లిపోగా మిగిలిన ప్రజాసంఘాల వేదిక అయిపోయింది తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ.  భూమి స్వాధీనాలు, ప్రజల్ని నిర్వాసితుల్ని చేయడం వంటి ప్రజా సమస్యలపై కమిటీ టిఆరెస్ ప్రభుత్వం మీద కొరడా ఝళిపించింది. అటు వైపు పేట్రియార్క్, ఆయన పార్టీ ఫ్రొఫెసర్ కోదండ్ మీద కారాలు మిరియాలు నూరడం మొదలెట్టాయి. ఆయన హైదరాబాదులో సభలు పెట్టుకోకుండా అడ్డుకోడం మొదలెట్టారు.

2019 లో దేశానికీ తెలంగాణాకూ ఎన్నికల సంవత్సరం. రానున్న ఎన్నికల బరి ఎలా వుంటుందనేది ఉత్కంఠ భరితమే. ఇప్పుడిప్పడే పుట్టిన తెలంగాణా జన సమితి కూడా ఎన్నికల్లో ఉండడం ఉత్కంఠను మరింత పెంచుతుంది. సమితి ఏ రాజకీయ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోదని, సొంతంగానే పోటీ చేస్తుందని కోదండ రామ్ ఇప్పటికే చెప్పేశార. కాంగ్రెస్ వంటి పార్టీలకు ఇది మింగుడు పడడం లేదు.కొత్త పార్టీ ప్రతిపక్షం ఓట్లను చీల్చుతుందా లేక టిఆరెస్ ఓట్లకు గండికొడుతుందా అనే ప్రశ్నలు ముందుకు వస్తాయి.

ఈ వ్యాసం వెలుగు చూసే సమయానికి, ఏప్రిల్ 29న తెలంగాణా జన సమితి బహిరంగ సభ జరిగిపోయి వుంటుంది. అనుకున్నట్లు జరిగితే పార్టీ కార్యక్రమం జనం చేతిలో ఉంటుంది. కాని, కోదండ్ రామ్ ఫొటో ఒక పక్క, పోటీలో వుంటాడనుకుంటున్న అభ్యర్థి ఫొటో మరో పక్క పోస్టర్లు తెలంగాణా గోడల మీద అప్పుడే దర్శనమిస్తున్నాయి. కొత్త పార్టీ టిక్కెట్లు ఆశించే వారికి కొదవేమీ వుండదు. టిఆరెస్, తదితర పార్టీలలో సీట్లు దొరకని వాళ్లు చాల మంది ఎలాగూ ఉంటారు. ఏమంత సీరియస్ వ్యవహారం కాదనిపిస్తున్న ఈ ఇస్యూని పక్కన పెడితే, నేటి ఎన్నికల రాజకీయాలలో… విలువలు పతనమవుతున్న నేపధ్యంలో… తెలంగాణా జన సమితి రాజకీయ సిద్దాంతం ఏ రకంగా ఉంటుందనే దానికి మాత్రం చాల ప్రాముఖ్యం ఉంటుంది. పార్టీ సారథి కోదండ్ రామ్. పార్టీలో ప్రజామోదం పొందిన వుమ్మడి నాయకత్వం పెద్దగా లేదు. ఈ నేపధ్యంలో, కోదండ్ రామ్ దృక్కోణం మీదనే పార్టీ రాజకీయ దిశ ఆధారపడుతుంది. కోదండ్ రామ్ వామపక్ష భావాల వైపు మొగ్గిన పౌరహక్కుల వుద్యమ కారుడిగా జీవితం మొదలెట్టారనేది ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తెలంగాణ జన సమితి మీద ఆయన గతం ముద్ర ఏమైనా ఉంటుందా?

అల్లప్పుడు, 1969 వుద్యమ కాలంలో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణా ప్రజా సమితి (టిపిఎస్) పద్నాలుగింట పది పార్లమెంటు సీట్లు గెలిచి, తరువాత తెలంగాణా ఆశయానికి ద్రోహం చేసి కాంగ్రెస్ లో కలిసిపోయింది. తెలంగాణా రాష్ట్ర సమితి, ప్రత్యేక తెలంగాణా వుద్యమ బలంతో ముందుకొచ్చి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికార పీఠమెక్కింది. కాని ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యింది. ఇప్పుడు తెలంగాణా జన సమితి సామాజిక తెలంగాణ నిర్మిస్తానని ఒట్టేసుకుంటోంది. కోదండ్ రామ్ ఏ వైపు, ఎలా నడుస్తారో చూద్దాం.

– బూర్గుల ప్రదీప్ కుమార్

బూర్గుల ప్రదీప్ కుమార్: జార్జి  మార్గంలో నడిచి కాకలు తీరిన విద్యార్థి యోధులలో ఒకరు. వుస్మానియా పోరాట చరిత్రలో ముఖ్యంగా  ‘పి డి ఎస్ యూ’ నిర్మాణంలో మొదటి వరుస నాయకుడు. ప్రస్తుతం సిపిఐ ఎంఎల్ – న్యూ డెమాక్రసీ లో, ఐ ఎఫ్ టి యూలో క్రియా శీల పాత్ర నిర్వహిస్తున్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర వుద్యమంలో పాల్గొన్న రాజకీయ పార్టీలలో ప్రదీప్ పని చేస్తున్న సిపిఐ ఎంఎల్ పార్టీ ప్రముఖ పాత్ర నిర్వహించింది. ఆనాడు కోదండరామ్ తదితరులు నినదించిన సామాజిక తెలంగాణా సహజ మద్దతు దారులు కావడం వల్ల ఇప్పుడు కోదండ్ కొత్త పార్టీ గురించి తెలుసుకోడానికి ఓ మంచి వనరు బూర్గుల ప్రదీప్.

బూర్గుల ప్రదీప్ కుమార్

బూర్గుల ప్రదీప కుమార్: సి పి ఐ ఎం ఎల్ (న్యూ డెమోక్రసీ) నాయకులు. వుస్మానియా లో జార్జి రెడ్ది నాయకత్వంలో ముందుకు వచ్చిన యువ నేతలలో ఒకరు. ప్రస్తుతం ఐ ఏఫ్ టి యూ (కార్మిక సంస్ట)లో, జాతీయ స్టాయి నాయకుడు.

7 comments

 • రాష్ట్రము లో రాజకీయ అస్థిరత్వం , గందర గోళం లేదు. ప్రజాసమస్యల పై చెప్పుకోదగ్గ స్థాయిలో ఆందోళనలు లేవు. కావున రాష్ట్రము లో రాజకీయ శూన్యం ఉంది అనే నిర్ధారణ కు రావటం సరికాదని నా అభిప్రాయం . నియంతృత్వ పోకడలు , అప్రజాస్వామిక పాలన, ఒకే వ్యక్తి లేదా వ్యక్తి కుటుంబం చేతిలో పరిపాలన పగ్గాలు ఉండటం నిజమే . రాజకీయ శూన్యం అనటానికి ఇవి మాత్రమే సరిపోవు.

  కావున కోదండ రామ్ , అయన పార్టీ శూన్యాన్ని భర్తీ చేస్తున్నాం అనుకోవటం సరికాదు. తన కు తానుగా స్తానం సంపాదించుకోవాలి. అస్తిత్వాన్ని , ఉనికి ని నిర్మించుకోవాలి .

  • హరిమూర్తి గారు, శూన్యం అనే మాట వ్యాసంలో ప్రదీప్ అన్నది కాదు, ఫేస్ బుక్ లో నేను అన్నాను. అదీ గాక, నేను రాజకీయ శూన్యం వుందని అనలేదు, ప్రతిపక్షం స్థలం శూన్యంగా వుందని అన్నాను. వుంది. మునుపటి రాజకీయంలోని ఒక వుపాంగమే ప్రతిపక్షం లా వ్య్వహరించింది, ఆ శూన్యం కారణంగా. ఇప్పుడదే ఒక పూర్తి రాజకీయ పార్టీ గా మారింది. మంచి పరిణామం. (కాంగ్రెస్ ,మీద అలాంటి ఆశలు జనానికి వున్నాయనుకోను.). ప్రజాందోళనలు లేవనే మీ మాట కూడా సరి కాదేమో. కోదండ్ ఇల్లు పగుల గొట్టి మరీ చేసిన దాడిలో కనిపించేది, నేటి పాలకుల ప్యానిక్ మాత్రమే. ప్రజాందోళన వుంది, వాస్తవంగానూ, పొటెన్షియల్ గానూ.

   • ప్రతి పక్షం స్తలం శూన్యంగా ఉంది అని మీరు అనటం లో ఉన్న ప్రతి పక్షం ( అన్నీను ) సమర్థవంత గా పని చేయదనే , ప్రభుత్వాని ఎదుర్కోనలేదనే అర్థం లో తీసుకుంటున్నాను . ఉపాంగం గా JAC ఆ పని సమర్థవంతంగా చేసింది , చేయగల్గింది అనే అభిప్రాయం తో ఏకిభవించ లేక పోతున్నాను.
    నిజమే కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యం చేసి , చిన్న పాటి ప్రజాస్వామిక నిరసనకు అవకాశం ఇవ్వలేదు.
    అయినా కోడండ్ రామ్ పార్టీ పెట్టటానికి అనుకూలమైన పరిస్తితులు ఉన్నవని నేను భావించటం లేదు.

    కోడండ్ రామ్ పదే పదే AAP , కానిశిరాం BSP ఉదంతాలను పేర్కొంటూ అలాగే మేము అధికారం లోకి వస్తాము అనుతుంటాడు. అలాంటి , అంత తీవ్రమైన ప్రజా ఆందోళనలు , ఇప్పటికే ప్రజల చైతన్య స్థాయి అంత ఎత్తుకు ఎదిగియని లేదా రాబోయే ఎన్నికల లోపు ఆ పని చేయగలరని అనుకోవటం లేదు. ఆ అర్థం లోనే అదోలనలను ప్రస్తావించాను. పార్టీ పెట్టటం కోసం పార్టీ అనే భావం కుదరదు . మనము ఒక సంవత్సరం ఎదురు చూడాలి .

    • హరిమూర్తి గారు,
     కోదండ్ రామ్ తో ఒక సమగ్ర ఇంటర్వ్యూ దీనికి నెక్స్ట్ సంచిక, జూన్ సంచికలో వచ్చింది. ఒక సారి చూడండి.

     • HRK గారు,
      చూసాను. ప్రజలు కేంద్రంగా ఉండే పాలన , భిన్నమైన అభివృద్ధి నమూనా . నమూనా కింద ప్రజా వైద్యం, విద్య , చిన్న పరిశ్రమలు – ఇవి తరుచు వినబడేవి కొత్తగా పార్టీలు పెట్టేవారు మాట్లాడివే . కోడండ్ రామ్ తన అజెండా ను ఎంత లోతుగా ప్రజలోకి తెసుకేల్లుతారు . ఎంత గొప్ప ప్రజా స్పందనను సృస్తి గల్గుతారు , అందుకు అయన అయన ఉన్న సంపత్తి పై నేను pessimistic గా ఉన్నాను. అది సంగతి.
      ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తాను. ప్రత్యెక తెలంగాణ కోర్కె ప్రభలంగా ఉందని , తీవ్ర స్తాయి లో మానసిక ఉద్రేకత ఉందని TRS , ఇతరులు ఉదరగోట్టారు. డిసెంబర్ 9 , 2009 కు ముందు పొత్తులతో జిత్తులు ఆడిన TRS పార్టీ పోటీ చేసినా స్థానాలలో సగం కూడా గెల్చుకో లేక పోవటానికి కారణం ఏమిటి ? ఆ సందర్బం లో కూడా నేను అయన తో మాట్లాడి ఉన్నాను. పార్టీ పెట్టిన వాళ్ళకు , సమర్ధించే వాళ్ళకు కోర్కె బలంగా ఉంటే సరిపోదని నా స్తిర అభిప్రాయం

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.