‘గెలుపు సరే; బతకడం ఇలా’

కాకర్ల నారసింహ యోగ పతంజలి అంటే అందరికీ తెలీదు. కె.ఎన్.వై. పతంజలి అంటే జగమెరిగిన, జనాన్ని కాచి వడబోసిన మహా రచయిత అని ఎందరికో తెలుసు. గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, వీరబొబ్బిలి, ఒక దెయ్యం ఆత్మకథ వంటి వ్యంగ్య సాహితీ విజ్ఞాన సర్వస్వాలు ఆయన తెలుగు జాతికి ప్రసాదించిన జ్ఞాన గుళికలు. మానవ నైజాన్ని కాచి వడబోసిన పతంజలి సాహితీ వ్యక్తిత్వం ఆయన నిర్భీతికి, అక్షర రమ్యతకు అద్దం పడతాయి. ప్రతి మనిషిలోను ఇద్దరు మనుషులుంటారని మానసిక శాస్త్రవేత్తలంటారు. ఇద్దరు కాదు, తనలో పది మంది మనుషులున్నా, వారిని ప్రపంచం ముందు ప్రదర్శించడానికి ఏ మాత్రం జంకని జగమొండి పతంజలి. ఆత్మ న్యూనత కన్నా ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, తన చేతల్లో కూడా ‘పోరా కుయ్యా’ అన్న తెంపరితనం ఆయన జీవితాంతం కాపాడుకున్న ఆస్తులు. ‘ఇక ఈయన అభిప్రాయం మనం ఒప్పుకోక తప్పదు’ అని ఆయనతో పది సెకన్లు మాట్లాడితే మనకే తెలిసొస్తుంది. వేదికలెక్కి ఉపన్యాసాలు దంచడం ఆయనకి ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా కలిశామా ఇక ఆయన కబుర్లు, బోధలు, పూయించే నవ్వులు జీర్ణించుకోవడం కష్టం. అందుకే ఆయన తన బాధనంతా అక్షరాల సిరింజిలో కూరి జనాలకు ఇంజెక్షన్లు ఇచ్చారు. కొండొకచో అవి వాచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రపంచం బాధని, ఆక్రోశాన్ని, మోసకారితనాన్ని, ఆత్మన్యూనతను, మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తన పాత్రల ద్వారా బొమ్మ కట్టించిన అపురూపమైన రచయిత పతంజలి. ఆయన పుస్తకాలు చదివి మనం చాలా నేర్చేసుకున్నామనిపిస్తుంది. ఇంతగా మానవ నైజాన్ని కాచి వడబోసిన మాన్నుబావుడు అద్భుతంగా జీవించారని కూడా మనకనిపిస్తుంది. నొప్పింపక, తా నొవ్వక తిరిగినా,  నొప్పిస్తూ తిరిగే ప్రపంచాన్నించి తప్పించుకోలేక జీవితాంతం తిప్పలు పడ్డారు. అందుకే ఆయన అక్షరాలకంత పదును. డబ్బులివ్వలేదని సగం సినిమాకే మాటలు రాసినా నంది అవార్డు సాధించిన ఘనత ఆయన సొంతం. పాత్రికేయ జీవితం ఆయన ఆత్మ విశ్వాసంతో ఫుట్ బాల్ ఆడినా, పచ్చళ్ళు అమ్మారు. ఆయుర్వేద వైద్యం చేశారు. ఎందరో మేధావుల్లా ‘బతకడం చేతకాని బడుద్ధాయి’ అని పరోక్షంగా ఎత్తి పొడిపించుకున్నా, ఆయన మూటకట్టుకున్న అభిమాన జన సంద్రం  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అమేరికా దాకా ఉన్నారు. ఒక మనిషి వ్యక్తిత్వం తెలీకుండా ఆయన సాహిత్యాన్ని అర్ధం చేసుకోలేము. ఆయన సృష్టించిన  సాహిత్యం ద్వారా కొంత అర్ధం చేసుకోవచ్చు. తాను చూసిన జీవితాన్ని అక్షరీకరించి మనం తినలేనంత ప్రసాదంలా ప్రసాదించి, పరుసవేదిలా తాను తాకిన ప్రతి జీవితాన్ని  బంగారం చేసిన అక్షర బ్రహ్మ పతంజలి. ఆయన సృష్టించిన సాహిత్యమంతా వ్యక్తిత్వ వికాస సాహిత్యమే. ఆయన ఉద్గ్రంధాలేమీ రాయలేదు. అన్నీ చిన్న చిన్న పుస్తకాలే. ఏకబిగిన ఆసక్తి రేకెత్తిస్తూ చదివింపచేసే పుస్తకాలే. ఆయన సాహిత్యమంతా ఒక ఎత్తు. ఆయనే వ్యక్తిత్వ వికాస దృక్కోణంతో రాసిన ‘గెలుపు సరే…బతకడం ఎలా? ‘ అని రాసిన పుస్తకమొకటీ ఒక ఎత్తు. ఈ పుస్తకాన్ని స్థాలీపులాకంగా సమీక్షించే సాహసం చెయ్యడమే ఇక్కడ నాతక్షణ కర్తవ్యం. ‘ఆధునిక యుగంలో జీవిత స్వభావం గురించి వేమన చాలా చెప్పారు. అందుకనే ఆయన కవి కాదు పొమ్మన్నారు. పొమ్మన్న వాళ్ళే పోయారు గానీ వేమన జన జీవితంలో కలిసిపోయాడు. వర్తమాన జీవితం పూర్వకాలపు రాజుల దర్బారు రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. మాయ, మోసం, దగా, వంచన, కపటం, దయాదాక్షిణ్యాలు, కనికారం లేకపోవడం, దొంగ నాటకాలూ దర్బారులో ఎంత ముఖ్యమో నేటి సమాజ జీవితంలో కూడా అంతే ముఖ్యం. ఆ విషయాలు మొగమాటం లేకుండా రాయడానికి నేను ఈ పుస్తకంలో ప్రయత్నించాను. నేను లోగడ రాసిన చిన్న నవలల్లో ఈ ప్రయత్నమే చేశాను గానీ ప్రజలు దాన్ని సాహిత్యం అనుకున్నారు. వేమన కవిత్వం ఎందుకు కవిత్వం కాదో నా పుస్తకాలు అందుకే సాహిత్యం కాదు. ఈ పుస్తకంలో అటువంటి అనుమానానికి ఏ మాత్రం ఆస్కారం లేదు. ఇది జీవితం ఎలా ఉందో చెప్పటమే కాకుండా, జీవితంలో ఏ మెలకువలు అవసరమో, ఎలా జీవించాలో చెప్పాను. ఇలా జీవించడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు గానీ, జీవితం మన ఇష్టాయిష్టాల్తో నిమిత్తం లేకుండా నడుస్తుంది.’ అంటారు పతంజలి ఈ పుస్తకం ముందు మాటలో. కపట నాటకాలాడుతూ, లౌక్యంగా బతకడం ఇష్టం లేదని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు.

ఒక పాత్రికేయుడుగా విస్తృతంగా విశ్వ సాహిత్యాన్ని చదివిన వారిలో పతంజలిని అగ్రగణ్యుడుగా చెప్పచ్చు. అంతే ఆసక్తితో ఆయన మామూలు వార్తల్లోంచి జీవిత వాస్తవాల్ని వెలికితీసి పాఠకులకి అందించారు. వార్తల్ని, వార్తల్లోని కథల్నీ ఉటంకిస్తూ, తనకు తెలిసిన, చదివిన రాజుల మూర్ఖత్వాన్ని ఉదహరిస్తూ, దానిలో మనం, జనం నేర్చుకోవలసిన పాఠాల్నీ, గుణపాఠాల్నీ అక్షరాలా కుప్ప పోశారు ఈ పుస్తకంలో పతంజలి. వార్తలకు ఆయుష్షు మహా అయితే ఒక్క రోజు. వాటికి ఫాలో అప్ ఉండదు. తర్వాత ఏం జరిగిందన్నది పాఠకులకు తెలీదు. అందుకే కొత్త వార్తలందించడంలోనే తలమునకలవుతాయి పత్రికలు. పాత వార్తల, పాచి వార్తల పరిణామాలు ప్రజలకు తెలియడం బహు తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. వార్తలను వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తిగత వికాసానికి ముడిపెట్టి, సమన్వయంతో రాసిన ఈ పుస్తకం చదివేటప్పుడు మనం ఆ వార్తలను కూడా జ్ఞప్తికి తెచ్చుకోవడం అవసరం. ఎవ్వరికీ ఊహకందని యుద్ధ తంత్రంతో ఒసామా బిన్ లాడెన్ జంట భవనాలను కూల్చి అమెరికాకు షాకిచ్చాడు. అలా సృజనాత్మకంగా ఆలోచించడం నేర్చుకోవాలంటారు. ఒసామా బిన్ లాడెన్ని జగద్గురువని శ్లాఘిస్తారు. ప్రతి వ్యాసానికి అతికినట్టు సరిపోయే నానుళ్ళు,సామెతలు ఇవ్వడం, అవి కూడా ఆయన ధోరణిలో ఉండటం గమనార్హం. ఉదాహరణకి ‘పామును పట్టుకోడానికి నీ శత్రువు చెయ్యి వాడాలి ‘ పర్షియన్ సామెత. పాలిచ్చే గోవులు, పాలు తాగే మనుషులు కూడా గడ్డే తింటారు’ బెజవాడ సామెత, ‘ధాన్యం నుంచి పేలాలు వస్తాయి గానీ; పేలాల నుంచి ధాన్యం రావు’ జామి నానుడి, ‘నోరు మూసుకోవాల్సిన సమయం ఏదంటే నువ్వు ఏదైనా చెప్పాలని అనుకుంటావే అప్పుడన్నమాట’ సూర్యాపేట సామెత, ‘జ్ఞానం ఎవరైనా ఇస్తారు, భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి’ జమ్మాదేవిపేట సామెత – ఇలా ఎన్నో జీవన సత్యాలు చదువుతున్నప్పుడు చిరునవ్వు మన పెదాల మీద అనివార్యంగా నాట్యమాడుతుంది. ప్రతి పేజిలో పుస్తకమంతా వ్యాపించి ఉన్న ఈ సామెతలు ఆయన వ్యంగ్య వైభవానికి అద్దం పడతాయి. కొన్ని ఆంగ్ల సామెతలు కూడా తనదైన శైలిలో అనువదించి మట్టి వాసనలద్దుతారు. అసలీ పుస్తకం శీర్షికే సార్త్ర్ కొటేషన్ గుర్తుకు తెస్తుంది.‘Everything has been figured out, except how to live.’ అంటాడు జాన్ పాల్ సార్త్ర్.  ‘Fall down seven times; get up eight’ అని జపనీస్ సామెత. దీన్నే ‘ఏడు సార్లు ఓడిపో… ఎనిమిదోసారి ప్రయత్నించు ‘ అని అంటారు పతంజలి ఎంతో సరళంగా. వ్యక్తిగత వికాస సాహిత్యంలో (Behavioural Science) దీన్నే’Resilience Skills’ అంటారు. జలగం వెంగళరావు కాలం నాటి వార్తలు, ఊసులు, ట్రాయ్ రాజు కొయ్య గుర్రం బహుమతిగా స్వీకరించి శత్రువుల్ని కోటలోనే తెచ్చిపెట్టుకుని నాశనమైన వైనం, ఓ పంతులిచ్చిన పండు తీసుకుని పరీక్షిత్తు తక్షకుడికి బలైపోయిన వివరం, సుబ్బిరామిరెడ్డి పంపిన మిఠాయి డబ్బా తీసుకుని జాగ్రత్తగా తెరచి, దాన్ని పోలీసులకందించి, ఆయన్ని అరెస్టు చేయించిన పి.వి.ఆర్.కె.ప్రసాద్ చాకచక్యం – ఇవన్నీ చెబుతూ బహుమతులు తీసుకోవడం బహు ప్రమాదం అని హెచ్చరిస్తారు. అక్కినేని, చార్లీ చాప్లిన్ని పోలుస్తూ తన ప్రభ కొంత తగ్గాక వార్తల్లో ఉండటానికి అక్కినేని ప్రతి సాయంత్రం సాంస్కృతిక సభలకు హాజరయ్యేవారని, చివరి 20 ఏళ్ళు చాప్లిన్ అసలు అభిమానుల్ని కలవనే లేదని అంటారు. రాత్రి పూట ట్యూబ్ లైట్లకు ఉండే గౌరవం సూర్యుడికి ఉండదు. ప్రజల అవసరాలను బట్టి మనకిచ్చే గౌరవం ఆధారపడి ఉంటుంది. మన మీద ఆధారపడే వాళ్ళ సంఖ్యను బట్టి, మన గౌరవం తగ్గడం, పెరగడం ఉంటుంది. గౌరవమనేది స్థిరంగా ఉండదు. దానికంత ప్రాముఖ్యం ఇవ్వకూడదంటారు పతంజలి. ఇలా ఎన్నో జీవిత రహస్యాలు, జీవన నైపుణ్యాలు నేర్పే వార్తల్ని నేర్పుగా అన్వయించి బతకడం ఎలాగో చెబుతూ పతంజలి ఈ పుస్తకంలో అద్భుత వ్యాసాలుగా అందించారు. ఆయన దృష్టిలో ఆయన విజయాన్ని సాధించారు జీవితంలో! గెలుపు ఆయన పిలుపు విని ఉండకపోవచ్చు. ‘నేను ఇల్లైనా కట్టుకున్నాను సార్; మీరు అది కూడా కట్టలేదుగా’ అని ఒక ప్రముఖ తెలుగు సినిమా పత్రిక సంపాదకుడు ఆయనతో అనడం నాకు తెలుసు. కాలం సైతం కూలగొట్టలేని శాశ్వత కీర్తి భవనం కట్టుకున్నారాయన! అభిమానులు, స్నేహితులు ఆయనకు తమ గుండెల్లో గుడి కట్టారు. తెగ డబ్బులు సంపాదించే ఉద్యోగం ఆయన చేయలేదు కాబట్టి సమాజం దృష్టిలో ‘అసమర్ధుని జీవయాత్ర’ లా ఆయన జీవితం సాగి ఉండవచ్చు. చివరి రోజుల్లో ఆయన్ని చూడటానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఓ గ్రంధాన్ని ఆయన చాలా నిశితంగా, ఓపిక లేకపోయినా ఎంతో ఓర్పుగా చదువుతున్నారు. ‘నా రచనల మీద ఒకావిడ పి.హెచ్. డి. చేశారు ‘ అని చెబుతున్నప్పుడు ఆయన కళ్ళలో వెలుగు నాకు ఇప్పటికీ గుర్తు. సాహితీ మూర్తిగా ఆయన సాధించిన విజయం అనితర సాధ్యం. పతంజలి జీవితం ఆయన సాధించిన యోగం. ఆయన మనకందించిన భోగం. అక్షరం ఉన్నన్నాళ్ళూ ఆయన అక్షరాలు తెలుగు జాతికి వెలుగు దివ్వెలై బతుకు బాటను చూపిస్తూనే ఉంటాయి.

చివరగా ఈ పుస్తకం ఎన్నో ప్రచురణలకు నోచుకుంది. ఇంకా మార్కెట్లో, పుస్తకాల సంతలలో లభిస్తోంది. కొని చదవండి. కాసిన్ని వెలుగులు జేబులో వేసుకుని బతుకు బాట వెలుతురులో వెతుక్కోండి.

– చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి – వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి (అని కొందరంటారు), రచయిత. కొన్నాళ్ళు
గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం ‘త్రిశంకు నరకం’ కు ఆంధ్ర మహిళా సభ వారి ‘దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం’ అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో  వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

3 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.