జూసి……!!

సరిగా తడి అందక అంతంత మాత్రమే ఉన్న పూల మొక్కల మధ్య చాపకింద నీళ్లులా విస్తరిస్తున్న గడ్డీ గాదాన్ని చేతనయినంత మట్టుకు గిల్లి పారేసి, ఇంటి ముందున్న తోటలో నుంచి వచ్చి అప్పుడప్పుడే వరండాలో కూర్చొన్నాను.

సుమారు నలభై యేళ్లు పైబడ్డ ఒక వ్యక్తి నా ముందుకొచ్చి నిలబడి “నమస్తే సార్! బాగున్నారా??” అన్నాడు.

ప్రతి నమస్కారం చేస్తూ అతని వైపు కళ్లు చికిలిస్తూ “ఎక్కడో చూసినట్లుంది! ఎవరా?” అని అంచనా వేస్తున్నంతలో… అతనే కల్పించుకొని, “సార్! మీరు గుర్తు పట్టినట్టు లేదు. కొన్ని యేళ్లకు ముందు మీరు మా ఊరి దగ్గర హయిస్కూల్లో పని చేశారు. ఇడుగో మా అబ్బాయి శొంఠి శ్రీకర్. అప్పుడు మీరు వీడ్ని ప్రేమతో శుంఠాకర్ అని పిల్చేవారు కదా!!” అంటూనే ఇరవై ఏళ్ల వయస్సుకు దాదాపుగా ఉన్న ఒక శాల్తీ పళ్లిగలిస్తూ వచ్చి నా ముందు నిలబడింది.

ఎలుక శ్రవణాల్లా పక్కలకు నిక్కబొడుచుకొన్న చెవులు, ఈత చెట్ల రెమ్మల కొనల్లా తలనిండా నిటారుగా మేకులు దిగగొట్టినట్లున్న వెంట్రుకల ఆకారాన్ని జ్ఞాపకాల అడుగు పొరల నుంచి బయటికి లాగి గుర్తుపట్టాను.

ఆ అబ్బాయి ఆరు చదివే సమయంలో మొదటి సారి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం మొదలయ్యింది.

ఆ సమయంలో వయస్సు పైబడిన నన్ను పిలిచి హెడ్మాష్టరు, “ఆంగ్ల అక్షరాల్ని కొంచెం బాగా చదవడం, రాయడం చేయగలిగిన వార్ని గమనించి ఆంగ్ల మాధ్యమలో చేర్చుకోండి” అని నన్ను పురమాయించాడు.

అప్పుడు ఈ శ్రీకర్ గాడికి తెలుగు అక్షరాలు కాదు కదా వాని పేరు కూడా రాయడం వచ్చేది కాదు. అందుకే తెలుగు మీడియంలోనే ఉంచేశాను.
అయితే మరుసటి రోజు వాళ్ల నాన్న రెడ్డీరాయల్ చౌదరి బడికి వచ్చి వాళ్ల బాబును ఆంగ్లానికి మార్చుకొమ్మని హెడ్మాష్టరును అడిగితే అతన్ని నా దగ్గరకు పంపాడు.

ఇంగ్లీషు రాక తానెంత నష్టపోయిందీ ఏకరువు పెట్టి, ఎలాగైనా వాళ్ల అబ్బాయి పేరును ఆరోజే ఆంగ్లానికి మార్చమన్నాడు. అప్పుడు నేను….
“అయ్యా! మీరు ఆశపడడంలో తప్పు లేదు. అయినా మీ అబ్బాయికి అమ్మ, ఆవు.. అనే పదాలు రాయడం పలకడం కూడా రాదు. అలాంటప్పుడు పరభాష నేర్చుకోవడం అంత సులభం కాదు!!” అన్నాను.

దానికతను “అక్కడే మీరు పొరబడు చున్నారు సార్!! తెలుగు పూర్తీ చదవడం, రాయడం వచ్చాక తలలో ఖాళీ మిగలదు! ఇక ఇంగ్లీషును చేర్చుకోవడానికి చోటెక్కడ ఉండి చస్తుంది!! మా అబ్బాయి బుర్రంతా ఖాళీయే కాబట్టి అందులోకి ఇంగ్లీషు అక్షరాల్ని చేర్చడం చాలా సులభం” అనే అతిపిత్తం లాజిక్కును లేవనెత్తాడు.

ఆ మాటల్తో నా ఒంట్లో కంపరం మొదలై హెడ్మాష్టరుకు విన్నవించుకొన్నాను.

అప్పుడు హెడ్మాష్టరు ఒంటరిగా నన్ను బయటికి లాక్కెళ్లి “అతను మామూలు వ్యక్తి కాదు! ఒళ్లంతా రాజకీయం బుద్ధులు జీర్ణించుకొన్న పొరుగూరి ప్రసిడెంటు. వీడికి డిపాజిట్టు కూడా రాదని ఆ వూరి ప్రజలంతా అనుకొన్నప్పటికీ ఏవో కుయుక్తులు చేసి అరకొర మెజార్టీతో గెల్చి ప్రసిడెంటు గిరీ చెలాయిస్తూ వుంటాడు. ఇటువంటి వారితో వాదించీ ప్రయోజనం ఉండదు. “గుడిలో గంట పోతే పూజారికి… అదేదో పోయినట్లు” అనే సామెత మీకు తెలియంది కాదు!! అని హితబోధ చేస్తే ఇంగ్లీషు సెక్షనుకు మార్పుచేశాను.

అయితే వాడు ఏ పరీక్షలోనూ ఒకటి రెండు మార్కులకు మించి ఎదగలేక పోయాడు. సరికదా…అయ్యవార్లే పిల్లలకు సరిగా పాఠాలు చెప్పడం లేదని రెడ్డీరాయల్ చౌదరి గారు తల్లిదండ్రుల సమావేశాల్లో మా మానాలు తీసేవాడు.

మేము నోరు విప్పేవారం కాము.

చివరికి ఒకరోజు మా ఇంటికి వచ్చి “సారూ! మీరు అడిగినంత ఫీజు ఇస్తాను, మావాడిని మీ ఇంటి దగ్గరే వదిలేస్తాను నాలుగు ఇంగ్లీషు ముక్కల్ని నేర్పండి” ప్రాధేయపడాడు.

“అయ్యా! నాకు రెండు రకాల బుద్ధులు, రెండు రకాల బోధనలూ రావు!! వెనుకబడిన వారినంతా కొంతైనా ముందుకు తేవాలనే ప్రయత్నాన్ని శాయశక్తులా బడిలోనే చేస్తున్నా..” అని సున్నితంగా తప్పించుకొన్నాను.

అదే సమయానికి ఆ ఊళ్లో ఉన్న చిన్న బ్యాంకుకు బదిలీ పై కేరళ ప్రాంతపు వ్యక్తి వస్తే అతని భార్య అంతో ఇంతో చదివి బొత్తిగా రాని తెలుగుతో పిల్లలకు ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టింది.

అంతలో నేను బదిలీ పై ఆ పల్లెకు దూరం అయ్యాక తెలిసింది ఏమిటంటే…..ఆర్ ఆర్ చౌదరి ఇంటి వెనకాల పెద్ద పశువుల కొట్టు వుంటే దాన్ని కాన్వెంటుగా మార్చి “అంగట్లో ఆంగ్లం” అనే పేరుతో “అదర్ ద్యాన్ మదర్ టంగ్ అదరగొట్టక పోతే అడగండి” అనే కాన్సెప్టుతో కేరళ అతని భార్యనే హెడ్మాష్టరుగా మొదలు పెట్టి ఆ ప్రాంతంలో చాలా తెలుగుబళ్ల వాకిళ్లకు కంపలు కొట్టేలా చేశాడట!! ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తూ ఉండేవి.

ఇక ఉద్యోగ విరమణ తరువాత ఈ బళ్ల చదువుల గురించిన వార్తలు నాకు తెలిసేవి కాదు.

ఇప్పుడు ఆ రెడ్డీరాయల్ చౌదరి గారు నన్ను కలవడానికి ఎందుకొచ్చాడో ఏమో? అర్థం కాక కుర్చీ చూపించి కూర్చొమ్మని చెప్పి విషయం అడిగాను.
అతను మరో ఉపోద్ఘాతం లేకుండా నేరుగా” సార్! ఆనాడు మా అబ్బాయికి ఇంగ్లీష్ రాదన్నారుకదా? ఇటు చూడండి ఇరవై యేళ్ల లోపు పిల్లలు రాసిన ఉగాది కవితల పోటీల్లో మా శ్రీకర్ గాడికి రాష్ట్రస్థాయి బహుమతి వచ్చింది. ఏ తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్ని చదివినా, ఏ ఫేసుబుక్కు, ఏ వాట్స్ యాపు గుంపుల్ని తెరిచి చూసినా వీడు రాసిన కవిత్వమే! ఎక్కడెక్కడో జరిగిన సన్మానాల ఫోటోలే…” అంటూ నాకు చూపబోయాడు.

అప్పుడు నేను “అయ్యా! నాకు కళ్లు సరిగా కనిపించవు”అని బయట అడుకొంటున్న మనుమరాల్ని కేకేసి పిల్చి మేడ మీది గదిలోని అద్దాల్ని తెమ్మని, అతని నోటి ద్వారానే విందామని చదవ మన్నాను.

ఆ అబ్బాయి ఏదో పత్రికలాంటిది తీసి “పాడింది కోకిల, కూసింది చిలక, ఎగిరింది గువ్వ, తిరిగింది ఈగ, పూసింది వేప, కాసింది మామిడి, కట్టండి తోరణం, చేయండి సంబరం, మే మిప్పుడు పిల్లలం, రేపౌతాం పెద్దలం… అంటూ చదువుతున్నాడు.
అంతలో మనుమరాలు సులోచనాలు తెస్తే ఇంకా ఏముందో చదువుదామని పేపరు చేతికి తీసుకొన్నాను….

padindi kokila
kusindi chilaka
tirigindi ega….అని

ఇంగ్లీషు అక్షరాల్తో తెలుగు పదాలు…వాటిని కూడబలుక్కొని చదవలేక పోయి “ఇది తెలుగా? అంగ్లీషా? నువ్వు రాసింది కవిత్వమా???” అని ముఖాన్ని చిట్లించు కొన్నాను.

“అవును సార్! ఇంటర్ నెట్టు రావడంతో ప్రపంచం కుంచించుకు పోవడం మీకు తెలిసినట్లు లేదు. దానికి తోడు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అంటూ చదువరులంతా రెండు వర్గాలుగా విడిపోతున్నారు. ఆ ఇద్దర్నీ ఒకే తాటి మీదికి తేవడానికి ఆ మధ్య అంతర్జాతీయ విశ్వశాంతి సంస్థ ఇరవై యేళ్ల లోపు వారి కందరికీ కవితల పోటీ పెట్టింది!! అదికూడా పెన్నూ, పేపరు యూజు చేయకుండా యూనీకోడ్ ద్వారా టైపు చేసి ఇంటర్నెట్లో ఒక వెబ్లో పెట్టమన్నారు.

అప్పటికప్పుడు స్మార్టు ఫోను తెచ్చి ఉగాది ప్రాశస్త్యాన్ని గూగులు నుంచి తెలుసుకొని కవిత రాశాను.

చూస్తే ఇంగ్లీష్…చదివితే తెలుగు…రెండు భాషలకూ వారధిలాగా ఉన్నదని చాలా మంది భాషోద్యమ కారులు తెగ మెచ్చుకొన్నారు. ఇప్పుడు “జూ సి” అనే పేరుతో వస్తున్న కవితలన్నీ నేను రాసినవే “అంటూ మరికొన్ని కాగితాల్ని నా మీదకు తోశాడు.

వాటిని తాకడానికి ఝడుసుకొని “అవునూ నీ పేరు శొంఠి శ్రీకర్ కదా!! ఈ “జూ సి” ఏంది జూలుకుక్క తోక లాగా “అన్నాను.

“సార్! జూ అంటే జూనియర్ అని. సీ అంటే చిదంబరం… అది మీ పేరే!! “జూ చి” అంటే అదేదో చీదరింపులాగుంటుందని “చి” ని, “సి” చేసి “జూ సి” అనే కలం పేరుతో రాస్తున్నాను. మీ తదనంతరం మీ పేరు నిలబెట్టడానికి కంకణం కట్టు కొన్నాను…” అని ఇంకా ఏదో చెప్ప బోయాడు.

అంతలో నా తల తిరిగినట్లయింది. మరలా ఏమి జరిగిందో నే నెక్కడున్నానో తెలియడం లేదు! తెలిస్తే చెప్పండి!!

–  సడ్లపల్లె చిదంబర రెడ్డి

 

సడ్లపల్లె చిదంబర రెడ్డి ఎమ్మే బియిడి చేసి, తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైరయ్యారు. రెండు కథల పుస్తకాలు, రెండు కవిత్వం పుస్తకాలు ప్రచురించారు. మరి మూడు పుస్తకాలు త్వరలో వెలువడనున్నాయి. 4 కథలకు, 10 కవితలకు రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నారు. వందకు పైగా కథలు, 200 పైగా కవితలు రాశారు. అనంతపురం జిల్ల హిందూపురానికి చెందిన చిదంబర రెడ్డి ప్రధానంగా సీమ ప్రాంతం మాండలికంలో అక్కడి జీవితం నేపధ్యంగా రాస్తారు. అరవయ్ ఆరేళ్ల వయసులో అలుపెరుగక సాగిస్తున్న ఆయన సాహిత్య వ్యవసాయం నుంచి ఇంకా చాల ఫలాలు ఆశిద్దాం. ఆయన కాంటాక్టు నంబరు 9440073636.

సడ్లపల్లె చిదంబర రెడ్డి

సడ్లపల్లె చిదంబర రెడ్డి ఎమ్మే బియిడి చేసి, తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైరయ్యారు. రెండు కథల పుస్తకాలు, రెండు కవిత్వం పుస్తకాలు ప్రచురించారు. మరి మూడు పుస్తకాలు త్వరలో వెలువడనున్నాయి. 4 కథలకు, 10 కవితలకు రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నారు. వందకు పైగా కథలు, 200 పైగా కవితలు రాశారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన చిదంబర రెడ్డి ప్రధానంగా సీమ ప్రాంతం మాండలికంలో అక్కడి జీవితం నేపధ్యంగా రాస్తారు. ఆయన కాంటాక్టు నంబరు 9440073636.

4 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.