తొలి అడుగు

దొక అద్భుతమైన సమయం. అద్భుతాలన్నీ అందంగా వుండవు. చార్లెస్ డికెన్స్ తన రచనాద్భుతం ‘రెండు నగరాల కథ’ను మొదలెడుతో అంటాడు… ‘అది వర్స్ట్ ఆఫ్ టైమ్స్, బెస్ట్ ఆఫ్ టైమ్స్’… అని. మన సంక్షుభిత సమయానికి అతికినట్టు సరిపోతుందా మాట, డికెన్స్ మాటల్లో అది ఆయన కాలానికి సరిపోయినట్టే.

కడుపులో తిప్పినట్టవుతుంది, చిట్టితల్లి అసిఫాకు జరిగిందేమిటో గుర్తుకొచ్చినప్పుడల్లా. గుర్తుకురాని  సమయం లేదు. వెన్నెముకలో వణుకు పుడుతుంది అమెరికాలో బడి పిల్లలకేమయిందో వార్త చదువుతుంటే. ఆ వార్త లేని పత్రిక లేదు. కనిపించే యింట్లోని అమ్మ ఎలా వుందో అని దుఃఖమవుతుంది బజారులో నడుస్తుంటే. మనసును బాష్ప సముద్రం చేయని బజారు ఏ  ప్రపంచంలో ఏ వూళ్లో లేదు.

ఇంతేనా? బతుకంటే అంతులేని వ్యథయేనా?

అదేం కాదు. ఇక్కడ మనుషులున్నారు. అన్యాయాన్నెదిరించి కదులుతున్నారు. వీధులకెక్కి బాధ్యులను ప్రశ్నిస్తున్నారు. ఎదిరిస్తున్నారు. ఇండియాలో సేద్యగాళ్ల సమస్యలను పరిష్కరించాలని రైతులు లాంగ్ మార్చ్ చేశారు. ఒక భరోసా. అమెరికా నగరాల్లో స్కూలు పిల్లలు తుపాకి సంస్కృతిని తుదముట్టించాలని హోరెత్తారు. ఒక నిర్భయం. స్పెయిన్ లో ఆడవాళ్లు ఇళ్లలో హింస లేని సమాజం కావాలని, సమాన పనికి సమాన వేతనం వుండాలని, అన్ని వివక్షలు పోవాలని వీథులకెక్కారు. ఒక గొప్ప ఆశ.

ఔను, ఇది వీధి పోరాటాల సమయం

ఇప్పుడు ప్రజల ఆరాటాలకు, పోరాటాలకు అడవుల బ్యారికేడ్లు అక్కర్లేదు. పల్లెలు, పట్టాణాలు, నగారాలు, దేశాలు, అంతర్జాతీయ స్థలాలు… అన్ని చోట్ల జన హృదయాలే యోధుల బ్యారికేడ్లు.

ఎక్కడో కాదు, ఇక్కడే… ఎక్కడికక్కడే.

గతంలో మంచి ఎందుకు లేదు? చాలా వుంది! చాల చెడు కూడా వుంది!! మంచిని పెంచడానికి వుత్సాహపడదాం. చెడును తుంచడానికి బరి తెగిద్దాం. సమస్యలకు పరిష్కారాలు గతంలో వుండవు. భవిష్యత్తులో వుండవు. గతం కాదు, భవిష్యత్తు కాదు. ఇప్పుడే. ఎప్పటికప్పుడు ఇప్పుడే.

ఇప్పుడే.. ఇక్కడే…. హియర్  అండ్ నౌ….

నిరాశలకు లొంగిపోవద్దు. అత్యాశల తోక పట్టుకుపోవద్దు.

ఆలోచన. ఆచరణ రెండు కాళ్లు.

అది సాహిత్యం కావొచ్చు. కళా రంగం కావొచ్చు. ఆర్థికమో రాజకీయమో రాజకీయార్థికమో కావొచ్చు. మాట్లాడుకుందాం. మెత్తమెత్తగా వాదించుకుందాం. పాటలు పాడుకుందాం. కైతలు అల్లుకుందాం. కథలు చెప్పుకుందాం. పసిపిల్లలమై కార్టూన్లు గీసుకుని నవ్వుకుందాం. మంచి వైద్యుడు కనిపిస్తే సం’దేహ’ సందోహాలమవుదాం.

మంచి రచన కనిపిస్తే మెచ్చికోళ్ల కొక్కొరొకోలమవుదాం.

వీటన్నిటి కోసమే ఈ వల పత్రిక… నెట్ మ్యాగ్.

ఇది వామ పక్ష పత్రిక కాదు.

వామపక్షమని దేన్నీ పక్కన పెట్టదు.

కులం, మతం, పేద ధనికత్వం వంటి నేలబారు సంగతులకు కూడా ఇందులో స్ఠలం వుంటుంది. అర్థమనర్థమనే ఉత్తరాధునిక గావుకేకలకు, మెత్తగా నిశ్శబ్దంగా సాగిపోయే అత్యాధునిక ఫుకయోకా జెన్ పొలాలకు, ఛందోబందోబస్తుల అలనాటి పద్యాల అందచందాలకు, వాటి నడుముల్ విరగ్గొడ్తామని ప్రగల్భించే వచన పద్యాల దుడ్డు కర్రలకు…. అందరికీ అన్నిటికీ ఇక్కడ స్థలం వుంది. సాదర ఆహ్వానం వుంది.

లోకంలో బాగా వున్న వాళ్లే కాదు, తీరిగ్గా ఆలోచించగల వాళ్లే కాదు… పేద వాళ్లున్నారు. జీవన క్రమంలో నాలుగు రాళ్లు దొరికించుకుని కాస్త కథకూ కవిత్వానికి చేరువైన మాజీ పేదలున్నారు. చాల బాధ పడి వున్నారు. మోసపోయి వున్నారు. అలసిపోయి వున్నారు. కోపమొచ్చి అరుస్తారు. తీరికలో పుట్టి పెరిగిన వాళ్ళ వలె నిశ్శబ్దంగా మాట్లాడలేరు. చాల సార్లు వాళ్ల కేకలు, వాళ్ల మూల్గులు వ్యాకరణ బద్ధంగా వుండవు. అవి కూడా వినాలి. సంస్కృతి ‘నిష్కదలికం’ కాదు….  స్టాటిక్ కాదు. సంస్కృతి ఒక క్రమం. ఒక నడక. ఇదిగో ఇదొక రస్తా.  

రస్తా కాదు,  రాస్తా అంటారా? అలాగే రాయండి!

మెత్తని మాటలకు, కాఠిన్యాలకు… సాహిత్యోప జీవుల కొత్త నడకలకు, పాత రీతులకు…  అందమైన దేనికీ ఈ వల పత్రిక తన పేజీ మూయదు.

అందరిదీ అయిపోదామని ఆతృత కాదిది. అందరికీ…. అవకాశం వుండాలన్న పేరాశ. ఒక్క మాటలో ఇది ఎక్స్ క్లూజివ్ కాదు, ఒక ఇంక్లూజివ్ స్టోరీ. ఇది ఒకరి సుఖసంతోషం కాదు. ఒక వూరేగింపు. ఒక పరేడ్.

ఇది ఏ లీడరు కబ్జా లోనో వుంటో, స్థానిక గుండాలకు ముడుపులు కట్టే ఘెట్టో కాదు. ఘెట్టోయిజం, గ్రూపిజం ఛోటా మోటా లీడర్లకే గాని జనులకు మేలు చేయదు.

మరింకేం…

లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్…. పడండి ముందుకు పదండి ముందుకు

ఇది తొలి అడుగు.

ఈ పని చూడ్డానికి మేం ముగ్గురం. ముగ్గురం కలం సేద్యగాళ్లమే. రాయడం మీద ఆసక్తి వున్న వాళ్ళమే. ఈ రైలు పట్టాలెక్కి తనకు తాను కదిలే కొద్దీ మేము ఈ కదిలే రైలులో ఓ మూల కూర్చుని చదువుకుంటాం, రాసుకుంటాం… రైలు తనకు తాను నడుస్తున్నప్పుడే. భయం లేదు. దీన్ని ఒక పట్టాన బోల్తా పడనివ్వం. సారధ్యానికి మీ సాయం కూడా కావాలి.  ఇక్కడ అందరూ పాఠకులే. అందరూ రచయితలే. ఒకరికొకరు నేర్పిస్తారు. మీరు కవులు, కథకులు కావొచ్చు. వ్యాఖ్యా రచయితలు కావొచ్చు. అందరం నిజాయితీకి పెద్ద పీట వేద్దాం. అతి పొగడ్తలు వొద్దు. అబ్యూజ్ వొద్దు. ఆ రెండూ హత్య ఆయుధాలే. సమ తూకం, పైకి కఠినమనిపించే లోన వెన్న అనిపించే  హృదయం … … నేర్చుకుందాం, నేర్పిద్దాం.

హెచ్చార్కె

18 comments

 • ప్రతి అక్షరం స్ఫూర్తి భరితం! అద్భుతంగా మీ హృదయాన్ని ఆవిష్కరించారు. సరికొత్త ఆలోచనల రస్తాలు తెరిచే సత్తా తొలి అడుగులోనే ప్రతిధ్వనించిన ‘రస్తా’కు స్వాగతం.👌👍👏👏👏

 • మొదటి సంపాదకీయం స్ఫూర్తి దాయకంగా ఉంది. అభినందనలు.

 • Congratulations …. all the best …

  Ponangi Bala Bhaskar,
  News Reader & Commentator,
  All India Radio & Doordarshan,
  Hyderabad

 • మీ తొలి అడుగు మహాప్రస్థానానికి నాంది కావాలి.

 • బావుంది మీ రస్తా పరిచయం. మీ మాగ్ కూడా నీట్ గా ఉంది. ఫాంట్ మారిస్తే ఇంకా బావుంటుంది.

  • థాంక్స్ రమణ! ఫాంట్ మారింది, గమనించారా? -)

 • వర్తమానాన్ని వాస్తవాల్ని
  అవసరాల్ని అనవసరాల్ని చక్కగా తెలియజేసిన “రస్తా”తొలి అడుగుకి ,
  స్ఫూర్తివంతమైన వాక్యాలకు నమస్సులు….సర్…
  చక్కగా ఉంది💐💐💐

 • సంపాదకులకు అభినందనలు! మీరు తలపెట్టిన సత్కార్యానికి శుభాకాంక్షలు!!

 • Welcom Rasthaa into my now shrunken but open little world. Sure some shining milestones will be created as you move forward on the road. Good luck , HRK ! ~ dp

 • Please add a separate section for Art. Or if possible theatre, music and dance. The most important performing art forms are going to be vanished which are most important to a writer to develop his or her craft.

 • I’ve been surfing online more than 3 hours today, yet I never found any interesting article like
  yours. It’s pretty worth enough for me. In my opinion, if all website owners and bloggers made good
  content as you did, the internet will be a lot more useful than ever before.

 • హియర్ అండ్ నౌ. హెచ్చ్చార్కె అంటే నిజాయితీ అన్న నమ్మకం తన కవిత్వం చదివి తెలిసింది. ఆ నమ్మకం పోనివ్వని ప్రయత్నమిదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అభినందనలు. వినిపించాలంటే దు:ఖిత ప్రపంచపు గొంతుకలో కన్నీళ్లు తడిపిన మానవ గీతమొకటి ఎప్పుడూ తడి తడిగా ఉండనే ఉంటుంది…ఆ స్వరం కోసం అదే ఆశ తో…

 • థాంక్స్ చెప్పడానికి కావాలనే చివరి వరకూ ఆగాను. రేపు రాత్రి జూన్ ‘రస్తా’ రిలీజ్ చేయాలి. భలే ఉత్సాహంగా వుంది. ఈ సంచిక సంపాదకీయంలో ప్రకటించిన ‘పాలసీ’ని మరింత మెరుగు పర్చుకుంటామేమో గాని, దీన్నుంచి వైదొలగం. ఇందుకు మీలో ప్రత్రి ఒక్కరి సహకారం కోరుకుంటాం. సహకారమంటే ప్రశంసలు, విమర్శలు రెండున్నూ. ఇందులో ఏది ఎక్కడుండాలో అక్కడుంటేనే అందమని వేరే చెప్పనవసరం లేదుగా. 🙂

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.