శివమెత్తిన జనసాగరుడు

శివసాగర్  వెళ్లిపోయి ఆరేళ్ళు దాటిపోయాయి.
ఆయన చల్లిన విత్తనాలు మొలకెత్తుతున్నాయి.
అంబేద్కర్ సూర్యుడ్ని నల్ల నల్ల సూరీడుగా చూపిన ఆయన తలపుల తోవలో ఇంకా అనేకులు నడుస్తున్నారు.

క్షుల రాగాల నడుమ
గరికపూల పాన్పు మీద
అమ్మా నను కన్నందుకు
విప్లవాభి వందనాలు

శివసాగర్.. మెత్తటి స్వరం ఉన్నోడు.  స్పష్టమైన ధిక్కారం ఉన్నోడు. బతికున్నప్పుడు రాం నగర్లో అనేకసార్లు కలిశాను.

ఆయన ఆదేశిస్తేనే హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ సమీప చౌరస్తాలో చలపతి – విజయవర్ధన రావుల ఉరిశిక్షలను వ్యతిరేకిస్తో మేము కాగడాలమై నిలబడ్డాం.

ఏకలవ్య కోసం సీరియస్ గా పని చేస్తూనే రచన  ఎట్లా చెయ్యాలో ఇవాళ్టి అనేకమంది రచయితలు, ఉద్యమకారులకు నేర్పారు ఆయన. ఉద్యమంలో తనతో పాటు పని చేసి, బయటికి వచ్చి జీవించిన పార్వతి గారు పోయినప్పుడు ఎంతగా విలవిల్లాడారో చూశాన్నేను.

దాడులకు ప్రతిదాడులు సమాధానం అని చెప్పకుండానే చేయించారాయన. సామాన్యమైన తెగువ కాదాయనది. ‘పార్థసారధి’ కోసం ప్రతీకారం తోనే ఆయన పట్టుదల ఏమిటో తేలిపోయింది.

శివసాగర్ ఆత్మకథ వస్తే బావుండేది అనుకునేవాడ్ని. ఆయన అంతిమయాత్రలో ఓ కోపు ఎత్తుకోడం కోసం నేను పడిన తపన, ఆయన అక్షరాల వెంట పడడానికి కూడా ఇప్పటికీ పడుతున్నా.

కవిత్వం, ఉద్యమం, విమర్శ, సిద్ధాంత విశ్లేషణ, జర్నలిస్టు దృక్పధం, ఎట్లా ఉండాలో ఆయన నడత, రాత చెప్పేస్తాయి.

శివసాగర్  వెళ్లిపోయి ఆరేళ్ళు దాటిపోయాయి.

ఆయన చల్లిన విత్తనాలు మొలకెత్తుతున్నాయి.

అంబేద్కర్ సూర్యుడ్ని నల్ల నల్ల సూరీడుగా చూపిన ఆయన తలపుల తోవలో ఇంకా అనేకులు నడుస్తున్నారు.

◆◆◆

నడుస్తున్నప్పుడు పాదం నిటారుగా నిలబడాలన్నట్టు, మాట్లాడుతున్నప్పుడు పెదాల్లోకి కొత్త రక్తం ఉరకలెత్తాలన్నట్టు వారి స్ఫూర్తి నాకగుపిస్తుంది.

కవిత్వంలో ఆకలిని తుదముట్టించే, అవమానంపై కత్తులు దూసే వ్యూహం ఉండాలంటారు.

నంగి నంగి మాటలతో నిజాన్ని కొంచెం కొంచెం వధిస్తో అవార్డులు, కిరీటాల కోసం అంగలార్చే వంచనకు ఆయన సాహిత్యం సుదూరం. పీడితుల పక్షాన స్పష్టంగా మాట్లాడే స్వరం ఆయనది.

ఏం రాయాలో తెలియనప్పుడు ఏం మాట్లాడాలో తెలియనప్పుడు, శివసాగర్ ని చదవడం ద్వారా రాయడం, చదవడం, మాట్లాడడం కూడా తెలుసుకుంటాం.

నిజం మీద స్వరం పూని రాయడం, అబద్ధం మీదా అక్రమం మీద చిరుతపులిలా తిరగబడటం నేర్చుకుంటాం మనం. రాయడం అంటూ మొదలెడితే అన్యాయం మీద తొడగొట్టే రాతలుగా,  ప్రతిఘటనని చాటే చేతలుగా రాయడం జరుగుతుంది. ప్రవాహంలో నిలబడడం ప్రమాదాలకు ఎదురొడ్డడం ఆయన్నుంచి నేర్చుకోవచ్చు.

శివుడు
పస్తులతో కవిత్వానికి కాపడం పెట్టినోడు.
అవమానాల అగ్నితో కవిత్వ పాదాల్ని కడిగి
మనువు గుండెల మీద తన్నే
రణ నినాదం చేసినోడు.

యుద్ధం రచించడమే కాదు, యుద్ధరంగంలో నిలబడి శత్రువుని గేలి చేసినోడు, పచ్చల పిడిబాకులాంటి క్రియాశీలుడు సాగరుడు.

సత్యమూర్తిగా అతన్ని చంపి, లేని మీసం మెలేసినోళ్ళకి శివసాగర్ గా కలల్లో ఝడుపుజ్వరం తెచ్చినోడు.

అతనేం చేసాడో చెప్పుకునేవాళ్ళం అతని కోసం ఏం చెయ్యాలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అసమసమాజం పై అతను దూసిన కత్తిని మనం ఎట్లా దుయ్యాలో ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.

◆◆

విప్లవ కవిత్వాన్నే కాదు, దళిత కవిత్వాన్నీ ఒక మలుపు తిప్పినోడు. పదాలని ఆయుధాలుగా మల్చిన కవి.

సమాజాన్ని లోతుగా చదివినవాడు. ఇండియా అట్టడుగు పొరల్లోంచి తాత్వికతని ఒడిసిపట్టుకున్నోడు. బతుకంతా యుద్ధమే. సాహిత్యం అంతా పీడితుల పక్షాన శంఖారావమే. శత్రువుతో కించిత్తు కూడా రాజీ పడనోడు. సామ్రాజ్యవాదం మీద, పెట్టుబడిదారీ వ్యవస్థ మీద, బ్రాహ్మణ వాదం మీద, ఫ్యూడల్  నిరంకుశ పాలన మీద నిరంతరం యుద్ధం చేసినోడు. అనేకమంది విప్లవ కవుల మీద తనదైన ముద్ర వేసినవాడు.

‘నరుడో..భాస్కరుడో’ కవిత జానపద బాణీల్లోంచి విప్లవ కవితకి మెరుగులు దిద్దింది. నినాద ప్రాయంగా ఉన్న విప్లవ కవితకి జానపద సంస్కృతితో కొత్త సొబగులద్దాడు.

ప్రకృతిని, దాని అంతః సౌందర్యాన్ని తాపి విప్లవ కవితకు కొత్త ఊపుని, ఉత్తేజాన్ని ఇచ్చాడు.  కొత్త పలుకుబడులు, కాల్పనికత, నూత్న సౌందర్యాన్ని సమన్వయిస్తో కవిత్వానికి కొత్త నడకలు నేర్పాడు. శ్రీశ్రీ ప్రభావం ఉందని అనుకున్నప్పటికీ, ఆ క్రమంలో తనదైన అధ్యయనంతో కవిత్వాన్ని మరింత సంపన్నం చేశాడు.

“చెల్లీ.. చంద్రమ్మ” గేయం కొన్ని వేలమందిని నడిపించింది. తెలుగు గేయ సాహిత్యంలో చంద్రమ్మ ఒక ట్రెండ్ సెట్టర్. గురజాడ పూర్ణమ్మ తన బతుకుని ఆత్మహత్యతో ముగించుకుంది. చంద్రమ్మ అలా కాదు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన కాశిరెడ్డిని మట్టుబెడుతుంది.  పూర్ణమ్మకి వచ్చినంత ప్రాచుర్యం ఈ గేయానికి రాకపోడానికి చాలా కారణాలు, వాటినలా ఉంచితే, ఈ గేయంలో ఒక కొత్త రంగస్థలం మనల్ని వివేచనాపరులని చేస్తుంది. కొండలు, యేర్లు, వెన్నెల, చీకటి, దుబ్బుగడ్డి, జొన్న కంకులు, చిలుకలతో పాటు ఒక కొత్త జానపద గిరిజన ప్రపంచంలోకి వెళ్లిపోతాం. అక్రమం మీద యుద్ధం చెయ్యడం నేర్చుకుంటాం. చెల్లీ చంద్రమ్మా.. గొప్ప కావ్యంగా భాసిల్లేంత కాన్వాస్ ఉన్న గేయం. ఇందులో తెలుగు నుడికారం, శబ్ద ధ్వని మనల్ని పరుగులు తీయిస్తుంది.

◆◆

విప్లవ కవిత్వాన్నే కాదు, దళిత కవిత్వాన్నీ హిందూ సంస్కృతి ప్రభావం నుంచి తప్పించడంలో ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. విప్లవ/దళిత కవిత్వానికి జానపద సంస్కృతిని ప్రాణప్రదం చేసి, వాటిని మరింతగా తెలుగు నేల మీద సుప్రతిష్టం చేశాడు.

“నరుడో..భాస్కరుడా” లో బర్రెంక, గొట్టంకి, విప్ప, సింగేరి పదాలు ఆదివాసీ సంబంధమైనవి. కామ్రేడ్ చాగంటి భాస్కర రావు ని తలుస్తో రాసిన ఈ గేయాన్నే శ్రీశ్రీ ‘ టైమ్ లెస్ సాంగ్’ అన్నారు. శివసాగర్ కవిత్వం తర్వాతి కాలంలో జన నాట్యమండలికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనడంలో అతిశయోక్తి లేదనుకుంటాను. మార్క్స్ ని, లెనిన్ ని, మావో ని, హోచిమిన్ ని ఎంత ఇష్టంగా చదివాడో, అంతే ఇష్టంగా ఆయన అంబేద్కర్ ని చదివారు.

మౌఖిక సంస్కృతి నుంచి లిఖిత సంస్కృతి నేర్చుకోవాల్సింది చాలా ఉందనేది శివసాగర్ కవిత్వం నుంచి చూడొచ్చు.

జాషువాలో ఉండే కరుణార్ద్రత శివసాగర్ లో సాయుధం అవుతుంది.

కవిత్వంలో, గేయంలో సామాన్య ప్రతీకలకి కావ్య గౌరవం కల్పించడం ఆయన ప్రత్యేకత.

విప్లవ పార్టీ మీద విమర్శ ‘ డాక్టర్ కామ్రేడ్”లో కనిపిస్తుంది.

నిజానికి దళిత కవిత్వం లో శివసాగర్ ఒక మేలిమలుపు. 

“మండే మాదిగ డప్పులా
ఉదయిస్తున్న సూరీడుపై
చిర్రా.. చిటికెన పుల్లా తీసుకుని
తొలకరి పాటకు దరువేస్తున్నాను.
చెప్పులు పారేసుకుని
నెత్తుటి మడుగు దాటుతోన్న కాలానికి
కత్తీ.. ఆరే తీసుకుని
కన్నీళ్లతో చెప్పులు కుడుతున్నాను.
ఎద్దు కొమ్ముల్లో మిగ్ పాపను
మునివేళ్ళతో ముద్దాడుతున్నాను.
పంజరాల చీకటి చరిత్రను
లందెల్లో బంధిస్తున్నాను” ఈ గేయం దళిత కవిత్వంలో ఓ పెద్ద సంచలనం.

కారంచేడు తెలుగు నాట సామాజిక ఉద్యమాల గతిని మార్చిన సంఘటన. అక్కడి నుంచే… శివుడి బాటే కాదు, అనేకమంది మార్గం మారింది.

కవిత్వాన్ని ప్రతీకాత్మకం చెయ్యడంలో శివసాగర్ ది ఒక ప్రత్యేక బాణీ.

నిజానికి కవిత్వంలో, వచనంలో తన తర్వాతి వాళ్ళు ఎండ్లూరి సుధాకర్, సతీష్ చందర్, కలేకూరి ప్రసాద్, మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు లాంటి ఎందరి పైనో శివసాగర్ ప్రభావం ఉందంటాను.

నిత్య భావుకుడు. నిత్య పోరాటాల సైనికుడు. తాత్వికుడు. తన ప్రతీ అక్షరాన్నీ పల్లె మొగదల కాపలాగా పెట్టినోడు.

” పొలాలలో పరిగ గింజలేరుకునే వేళలందు
  అమ్మా.. నను కన్నందుకు విప్లవాభివందనాలు” అన్న విప్లవ ప్రేమికుడు. గుడిశల పక్షాన నిత్య యుద్ధ నాదమైనవాడు. గొప్ప హృదయ శిల్పం ఉన్నోడు. ఎందరో శిష్యుల్ని సంపాదించుకున్న అత్యున్నత మానవతా వాది. ఎంత కటువు ఐనా సత్యాన్నే చెప్పినోడు.

మార్క్స్ ని అంబేద్కర్ ని సమన్వయం చెయ్యాలని తలపోసి కొత్త యుద్దాన్ని కలగన్నవాడు. గొప్ప పాత్రికేయుడు. అంబేద్కర్ ని “నల్ల నల్ల సూరీడు” గా అభివర్ణించి ‘అంబేద్కర్ సూర్యుడు’ అని తెలుగు నేల మీద ఆయన స్థానాన్ని పదిలం చేసినోడు.

ఉద్యమంలో, సాహిత్యంలో తల్లి హృదయం ఉన్నోడు.

తెలుగు భాషకు, కవిత్వానికి ఎంతో సేవ చేసినోడు. తెలుగు సమాజంలో పేదల పోరాటాలకి కొత్త చేవ తెచ్చినోడు.

పోరాటాల రస్తాలో ఒక తిరుగులేని ప్రయాణికుడు.

– రవికుమార్ నూకతోటి

 

రవికుమార్ నూతకోటి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తయారు చేసిన విద్యార్థి యోధులలో ఒకరు. ఉద్యమాలు వట్టి గొప్పలు చెప్పుకోడం కాకుండా అంబేద్కర్ దారిలో అన్ని విధాలుగా దాడులకు గురవుతున్న  దలితుల కోపు  నిలబడాలని మొహమాటం లేకుండా మాట్లాడుతున్న నిత్య జీవన యోధుడు. తన చుట్టు పక్కల జీవితంలో జన సమస్యలలో పేదల పక్షాన కలుగ జేసుకుంటూ క్రియాశీలిగా రచయితగా కష్జజీవుల కోసం పని చేస్తుంటారు, రాస్త్రుంటారు.

***

రవికుమార్ డాక్టర్ నూకతోటి

రవికుమార్ నూకతోటి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తయారు చేసిన విద్యార్థి యోధులలో ఒకరు. ఉద్యమాలు వట్టి గొప్పలు చెప్పుకోడం కాకుండా అంబేద్కర్ దారిలో అన్ని విధాలుగా దాడులకు గురవుతున్న  దలితుల కోపు  నిలబడాలని మొహమాటం లేకుండా మాట్లాడుతున్న నిత్య జీవన యోధుడు. తన చుట్టు పక్కల జీవితంలో జన సమస్యలలో పేదల పక్షాన కలుగ జేసుకుంటూ క్రియాశీలిగా రచయితగా కష్జజీవుల కోసం పని చేస్తుంటారు, రాస్త్రుంటారు.

4 comments

 • ఎన్నాళ్లకెన్నాళ్లకు పెద్ద పెద్ద కవులంతా ఉద్దేశ పూర్వకంగా మరిచి పోవాలని ప్రయత్నిస్తున్న శివసాగరుణ్ణి మళ్లీ ఇలా భుజానికెత్తటం… సంతోషం
  హెచ్ఆర్కే సాబ్ మీకూ, నూతకోటి రవికుమార్ గారికీ థాంక్యూ

 • Chaala bavundi anna
  Maa taramki sr gurunchi telusukune veelunna adbhutamaina article…
  💐💐💐

 • ‘మార్క్స్ ని అంబేద్కర్ ని సమన్వయం చెయ్యాలని తలపోసి కొత్త యుద్దాన్ని కలగన్నవాడు. గొప్ప పాత్రికేయుడు. అంబేద్కర్ ని “నల్ల నల్ల సూరీడు” గా అభివర్ణించి ‘అంబేద్కర్ సూర్యుడు’ అని తెలుగు నేల మీద ఆయన స్థానాన్ని పదిలం చేసినోడు’
  శివసాగర్ మీద మంచి అంచనా! ఆయన మీ అక్షరాలలో మళ్ళీ నెలవంకై మెరిశాడు
  బావుంది రవీ! శివసాగర్ కవిత్వమంత గొప్పగా వుంది వ్యాసం.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.