ప్రశ్నలూ జవాబులూ

వచ్చిన విప్లవాలు కొంత కాలానికి విఫలం కావటం ఎందువల్ల, ఎవరి వల్ల, జరుగుతున్నది? అది చూసినవారు నేర్చుకుంటున్న పాఠాలు ఏమైనా ఉన్నాయా?

సుప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ ప్రధానంగా కాల్పనిక రచయిత్రిగా ప్రారంభమయినా, అనతి కాలంలోనే రామాయణ విష వృక్షం వంటి అర్థ కాల్పనిక పుస్తకాలతో తెలుగు మెదళ్ల బూజు దులిపే పని చేసి, మార్క్సిజమే మానవాళికి నిజమైన కరదీపిక అనే నిర్ణయానికి వచ్చాక, వామపక్ష ఉద్యమాలను, ఆ ఉద్యమాల మునుపటి ఫలితాలైన సోవియెట్, చైనా రాజ్యాధికార అనుభవాలపై ఛార్లెస్ బెతల్హ్యామ్ వంటి వారి సునిశిత పరిశీలనలు ఆధారంగా పాఠాలు తీస్తున్నారు. దాదాపు ప్రతి ప్రజా సమస్య పైనా అవసరమైన అవగాహన అందిస్తున్నారు. లేదా ఆరోగ్యకరమైన చర్చకు తెర తీస్తున్నారు. ఇక్కడ కేవలం సైద్ధాంతిక సంగతులపైనే గాక  సాహిత్యం, సంస్కృతి సమస్యల పైనా, చుట్టూరా జీవితం పైనా పాఠకుల ప్రశ్నలకు ఇక్కడ జవాబులిస్తున్నారు. 

 

  1.టంకశాల అశోక్, హైదరాబాదు

ప్రశ్న: విప్లవాలు ఆలస్యం కావటాన్ని, లేదా అసలు రాకపోవటాన్ని, ఆయా దేశాల్లో గల పరిస్థితులను బట్టి అర్ధం చోసుకోవచ్చు. కానీ, వచ్చిన విప్లవాలు కొంత కాలానికి విఫలం కావటం ఎందువల్ల, ఎవరి వల్ల, జరుగుతున్నది? అది చూసిన వారు నేర్చుకుంటున్న పాఠాలు ఏమైనా ఉన్నాయా?

జవాబు: “విప్లవాలు” అంటే, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన జరగవలిసిన విప్లవాల మాటే మీరు అడుగుతున్నారు కదా? ‘విప్లవాలు’ ఆలస్యం కావడాన్నీ, లేదా అసలు రాక పోవడాన్నీ, ఆ యా దేశాల్లో గల పరిస్తితుల్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు- అన్నారు మీరు. అలాగే, విప్లవాలు వచ్చినా, అవి కొంత కాలానికే విఫలం కావడం జరిగితే, అది కూడా ‘ఆ యా దేశాల పరిస్తితుల్ని బట్టే’ జరిగి వుంటుందని ఎందుకు అనుకోకూడదు మీరు? అసలు  “విప్లవం” అంటే, అమలులో వున్న దోపిడీ రాజ్యాధికారాన్ని, శ్రామిక వర్గం ఆక్రమించడమే ‘ విప్లవం’ అవుతుందా? అది, విప్లవానికి మొట్టమొదటి అడుగే అవుతుంది. అది, ‘ప్రారంభం’ మాత్రమే. ఆ తర్వాత జరగవలిసిన సరైన కొత్త మార్పులు ఇంకా జరుగుతూ వుంటే, అవి రెండో అడుగూ, మూడో అడుగూ అవుతాయి. ‘శ్రమ దోపిడీని తీసివేయడం’ అంటే ‘ఉత్పత్తి సంబంధాల్ని మార్చడం’తో మొదలుపెట్టి, ‘దోపిడీ శ్రమ విభజన’ని మార్చడం వరకూ చేరి, సరుకు విధానాన్నీ, డబ్బు పద్ధతినీ తీసివేయడం వరకూ క్రమ క్రమంగా జరుగుతూ వుంటేనే, దాన్ని “విప్లవం” అనవచ్చు. అంతేగానీ, రాజ్యాధికారం తీసుకోవడమే “విప్లవం” అయిపోదు. తర్వాత కూడా సరైన మార్పులు జరుగుతూ వుంటేనే అది ‘విప్లవం’! రాజ్యాధికారాన్ని, ఒక రాజు నించి మరో రాజు ఆక్రమించేస్తే, అది, ‘విప్లవం’ అవుతుందా? కానీ, కమ్యూనిస్టుల ద్వారానే రాజ్యాధికారాలు తీసుకోగలిగిన రాజ్యాలలో, ప్రైవేటు ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తులుగా చెయ్యడం కూడా కొంత జరిగి వుండవచ్చు. అక్కడితోటే ‘విప్లవం’ అవదని, ‘శ్రమ దోపిడీ’ని తీసివేసే సిద్ధాంతం తెలిసినవారికి తెలిసే వుండాలి. కానీ, రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, యుద్ధాల సమస్య వచ్చి, సమస్య నుంచి బైట పడ లేకపోతే, అది వేరు. కానీ, బైట పడ్డ తర్వాత, ‘దోపిడీ రకపు ఉత్పత్తి సంబంధాల్ని మార్చే’ ప్రయత్నాలు క్రమంగా ప్రారంభం అయితే విప్లవం సాగుతూ వుందని అర్ధం. అదేమీ లేకుండా, కార్మికులు, కార్మికులుగానే; మేనేజర్లు, మేనేజర్లుగానే; పార్టీ నాయకులు, ఎప్పుడూ మీటింగులు జరుపుతూ, ఉపన్యాసాలు ఇస్తూ, గడిపేవారిగానే వుంటూ వుంటే, విప్లవం, తర్వాత అడుగులు వేయడం లేదని అర్ధం కాదా? ‘ఉత్పత్తి సంబంధాల మార్పు’ గురించి కార్మికుల్లోనూ, నాయకుల్లోనూ ,’ చర్చలే’ కనబడవు. అసలు, కార్మిక నాయకులే పనులు చేయరు! పార్టీలో కొందరు నాయకులకు సరైన అవగాహనలే వున్నా, అది చాలదు. అది, అతి, చిన్న సంఖ్య అయితే, వాళ్లు మైనారిటీయే కదా? అసలు ‘శ్రమ దోపిడీ’ గురించీ  ‘అదనపు విలువ’ గురించీ, శ్రామిక జనాలకు గ్రహింపులు వున్నాయా? శారీరక శ్రమలకూ, మేధా శ్రమలకూ వుండే విలువల్లో తేడాల గురించి, గ్రహింపులు వున్నాయా? ఈ విషయాలన్నిటినీ నాయకత్వం, శ్రామిక జనాలకు నేర్పి వుందా? తను నేర్చుకొని వుందా? జరగవలిసిన మార్పులేమిటో శ్రామిక జనాలకు తెలుసా అసలు? తెలియకపోతే, వాళ్ళు ఏ ‘నాయకుణ్ణి’ అయినా, ప్రశ్నించగలరా? ‘రాజ్యాధికారం’ పార్టీ చేతిలో వుంది కాబట్టి, దానికే ‘సోషలిజం’ అని, ఆ దేశమూ అనుకుంటుంది; ఇతర దేశాలూ అనుకుంటాయి. అసలు, విప్లవం’, అంటే రేపు జరగవలిసిన మార్పుల గురించి, శ్రామిక ప్రజలందరికీ, రాజ్యాధికారానికి ముందే తెలిసి వుండాలి! రేపు చెయ్యబోయే మార్పు గురించి, ఇవ్వాళే తెలిసి వుండాలి! అది తెలియడం అంటే, ‘శ్రమ దోపిడీ’ గురించి తెలియడమే కదా? ఏ యే దేశాల్లో విప్లవాలు వచ్చాయి- అని ఇతర దేశాల జనం అనుకున్నారో, అసలు ఆ విప్లవాల్లో ఏం జరిగాయో, ఏం జరుగుతున్నాయో, ఇతర దేశాల జనాలకు నిజమైన సమాచారం తెలీదు. ‘కమ్యూనిజం’ అంటే, ‘నిజాయితీ’కి మారు పేరు! కానీ, ఆ విప్లవ దేశాల్లో ఆ ‘నిజాయితీ” కనపడదు. అన్నీ అతిశయ వార్తలే అందుతూ వుంటాయి. మహా ఉత్తమ నాయకులు అని, ఇతర దేశాల ప్రజలు ఏ నాయకుల్ని నమ్ముతూ వుంటారో, ఆ నాయకులు తమ ‘వ్యక్తి పూజల్లో’ తన్మయత్వాలతో మునిగివుండడం తప్ప, ఏ విప్లవ కార్యక్రమాల్లో  వున్నారో తెలియదు. ఆ దేశాల గురించి, మన ప్రజలు, మన కమ్యూనిస్టు పార్టీల్లో నాయకుల్ని అడిగితే, వారు చెప్పలేరు. వారికీ తెలీదు. విమర్శించదగ్గ విషయాలు వున్నాయని గ్రహించరు. కమ్యూనిస్టుకి వ్యక్తి పూజా? వ్యక్తి పూజను కోరేవాడు కమ్యూనిస్టా? – అనరు. ‘రాజ్యాధికారాన్ని’ సాధించిన తర్వాత కూడా విప్లవాలు ఎందుకు కొనసాగలేదో చెప్పుకోవాలంటే, ఆ తర్వాత జరగవలిసిన మార్పుల గురించి పార్టీ నాయకులు గ్రహించలేదనీ, పట్టించుకోలేదనీ, భావించడం తప్ప, ఇంకెలా భావించగలం? పార్టీల ప్రవర్తనల్లో తప్పులు జరిగాయి- అనుకోవడం  తప్ప, “సిద్ధాంతంలోనే తప్పు వుంది; అది ఆచరణకు తగదు; అందుకే విప్లవాలు కొనసాగవు” అనుకోవాలా? జరుగుతోన్న తప్పు “శ్రమ దోపిడీ”! దాన్ని తీసివేసే మార్గాన్ని చెప్పిన సిద్ధాంతం వుంది! దాన్ని ‘ఆచరించడం’ లేదంటే, అది పార్టీల తప్పూ, శ్రామికవర్గం అవివేకమూనూ- అవుతాయి. ఈ కారణాలే గానీ, ఇతర కారణాలేమీ వుండవు.” విప్లవాలు విఫలం కావడం చూసినవారు, నేర్చుకునే పాఠాలు ఏమైనా వున్నాయా?”- అన్నారు మీరు. ఉన్నాయి. విప్లవం అంటే, ఆస్తి సంబంధాలను చట్టపరంగా మార్చడం మాత్రమే కాదనీ; ఉత్పత్తి సంబంధాలనూ, అసమాన శ్రమ విభజననూ మార్చాలనీ; వ్యక్తి పూజ తగదనీ- ఇవీ నేర్చుకోవలసిన పాఠాలు!

2.రేవణ్, కందుకూరు

ప్రశ్న : కమ్యూనిజం గురించి తెలుసుకోవాలంటే, అధ్యయనం చేయవలసిన పుస్తకాలు తెలుగులో ఏమిటి?

జ: మార్క్సు రాసిన ‘కాపిటల్’ తో మొదలుపెట్టాలి. ఈ పుస్తకానికి తెలుగులో, విశాలాంధ్ర వారి అనువాదం వుంది. తర్వాత, “కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక” కూడా. ఎంగెల్సు రాసిన “ఇంగ్లాండులో కార్మిక వర్గ స్తితిగతులు” అనీ,”కుటుంబమూ, స్వంత ఆస్తీ, రాజ్యాంగ యంత్రం పుట్టుకా” అనీ, ఇంకా మార్క్సు ఎంగెల్సులు రాసిన ఇతర పుస్తకాలు కూడా.

 1. కమ్యూనిస్టు సిద్ధాంతంలో తప్పు లేదనీ, పార్టీ నాయకుల అవగాహనలలోనే పొరపాట్లు వుండి వుండవచ్చనీ, ప్రజలకు తెలియజెప్పాలంటే ఏం చేయవలసి వుంటుంది?

జ: కమ్యూనిస్టు సిద్ధాంతం, ‘శ్రమదోపిడీ’ జరుగుతోందనీ, దాన్ని తీసివెయ్యాలనీ చెప్పింది కాబట్టి, ఆ సిద్ధాంతంలో తప్పు వుందనడానికి లేదు. అటువంటి సిద్ధాంతం వుండగా, పార్టీల ద్వారా మంచి ఫలితాలు కనిపించడం లేదంటే, పార్టీ నాయకత్వంలోనే లోపం వుందని భావించవలిసిందే. ఈ విషయాలు శ్రామిక ప్రజలకు చెప్పాలంటే, ఆ చెప్పవలసిన విషయాలు ఆ చెప్పే వ్యక్తికి కొంత వరకైనా తెలిసి వుండాలి. ఒక పార్టీ సభ్యులు గానీ, సానుభూతి పరులుగానీ, ఆ పార్టీతో సంబంధం లేని విడి కమ్యూనిస్టులు గానీ, ఆ పార్టీ అవగాహనల్లోనూ, ఆచరణల్లోనూ వున్న పొరపాట్లు ఏమిటో తమ విమర్శనా దృష్టితో గ్రహించాలి, ఆ గ్రహించిన విషయాలనే ఆ పార్టీ పత్రికకో, ఇతర పత్రికలకో రాయవచ్చు. లేదా, చిన్న బుక్ లెట్స్ గా అయినా. ఆ విమర్శల మీద ‘చర్చలు’ జరిగితే, మంచి చెడ్డలు తెలుస్తాయి. ఏ విషయం మీదైనా విమర్శలూ, చర్చలూ, లేకపోతే, ఎక్కడ వున్న వాళ్ళం అక్కడే వుంటాం!

 1. ప్రపంచ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిన కమ్యూనిస్టు పాలన, నేడు అతి కొద్ది దేశాలలో మాత్రమే సాగడానికి కారణాలు ఏమిటి?

జ: కమ్యూనిస్టు పాలన, ప్రపంచ వ్యాప్తంగా ఉవ్వెత్తున సాగడం ఏ నాడు జరిగింది? ఏ నాడూ లేదు. రష్యా, చైనాల్లో కూడా జరిగినవి ప్రభుత్వాధికారాల్ని సాధించడమూ, ప్రైవేటు ఆస్తి హక్కుల్ని కొంత మార్చడమూ – వంటి మొదటి అడుగులు మాత్రమే. ‘ఉత్పత్తి సంబంధాల్లో’ శ్రమ దోపిడీ సాగకుండా చేసే మార్పులు, ఎక్కడా ప్రారంభం కాలేదు. క్రమ క్రమంగా వెనక అడుగులే పడ్డాయి గానీ, ముందు అడుగులు లేవు. ఇప్పుడు కమ్యూనిస్టు పాలన అతి కొద్ది దేశాల్లో అయినా జరుగుతోందని మీరు భావిస్తున్నట్టున్నారు. ‘ఉత్పత్తి సంబంధాల్లో మార్పులూ, పాత కాలపు దోపిడీ శ్రమ విభజనలో మార్పులూ’ వంటివి ప్రారంభమై సాగుతూ వుంటేనే కదా, దాన్ని ‘కమ్యూనిస్టు పాలన ప్రారంభం అవడం’గా భావించేది? ఒక పార్టీకి, ‘కమ్యూనిస్టు పార్టీ’ అనే పేరు వున్నట్టే, దేశాలకు కూడా అటువంటి పేర్లు వుండొచ్చు. ఆ పేర్లనే చూసి, అక్కడ కమ్యూనిస్టు పాలనే సాగుతోందని భావించవచ్చా?

 1. భారత దేశంలో, వేరు వేరు కమ్యూనిస్టు పార్టీలున్నాయి. ‘లక్ష్యం’ ఒకటే అయినప్పుడు, ఈ తేడాలకు కారణాలు వుంటాయా?

జ: అన్ని కమ్యూనిస్టు పార్టీలకూ ‘లక్ష్యం ఒకటే’ అయితే వాటి నడతలు తేడాలతో ఎందుకు వుంటాయి? ఆ తేడాల్ని చూసి, ‘అన్నిటికీ లక్ష్యం ఒకటే కాదు’ అని అర్ధం చేసుకోవలిసి వుంటుందేమో- అనే ప్రశ్న రాదా? ఒక వేళ, ‘లక్ష్యం’ ఒకటే అయినా, దాన్ని సాధించడానికి ఎంచుకున్న మార్గాలు, వేరు వేరు కావొచ్చునేమో! లేకపోతే నడతల్లో తేడాలు ఎందుకు వుంటాయి? ‘సిద్ధాంతం’ ప్రకారమే నడిస్తే, తేడాలకు అవకాశం వుండకూడదనేది నిజమే కదా? ఒక లెక్కని, 10 మంది పిల్లలు చేసి, 10 రకాల జవాబులు చూపించారనుకుందాం. ఆ జవాబుల్లో, ‘ఒక్కటే’ సరైనదై వుండవచ్చు. లేదా, అసలు 10 జవాబులూ పొరపాట్లే అయి వుండవచ్చు. కమ్యూనిస్టుల అవగాహనల్ని, చిన్న పిల్లల చదువుతో పోల్చడం సరైన పోలిక కాదు. పిల్లలు ఇప్పుడు తప్పులు చేసినా, రేపు సరిగానే నేర్చుకుంటారు. పార్టీల వారు, అలా నేర్చుకుంటున్నారా? పార్టీల విషయాల్ని పిల్లల విషయాలుగా చూడకూడదు. ‘శ్రమ దోపిడీ’ జరిగే మానవ సంబంధాల్ని తీసివెయ్యడానికి ఏం జరగాలో, సిద్ధాంతం చక్కగానే చెప్పింది. కానీ, కమ్యూనిస్టు పార్టీల్లో ‘శ్రమ దోపిడీ’ అనే మాట ఎంతో అరుదుగా తప్ప, అది అసలు కనపడదు, వినపడదు. ప్రారంభంలో ఒక్క పార్టీయే వుండేది కదా? అది ఇన్ని పార్టీలుగా ఎందుకు అయిందో తెలిస్తే, అవి తిరిగి కలిసే ప్రశ్నే వుండదనీ, వాటి లక్ష్యం ఒకటి కాదనీ, అర్ధం అవుతుంది.

 1. తమ హక్కులకై, సమానత్వానికై పోరాడాల్సిన స్త్రీలు, శ్రామికులు, తమ సామాజిక స్తితి గతులను గుర్తించే స్తితిలో వున్నారా?

జ: స్త్రీలలో గానీ, పురుషుల్లో గానీ, అధిక సంఖ్య, శ్రామిక వర్గంలో వారే. కానీ, వారికి ఆ ‘వర్గం’ అనే మాటే తెలీదు. వారు తమకు వుండవలిసిన ‘వర్గ చైతన్యం’తో లేరనే అనాలి. వారికి ఆ చైతన్యం కలిగించవలిసిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీదీ, కమ్యూనిస్టు వ్యక్తులదీనూ. కార్మిక వర్గం, యుగ యుగాల మకిలితోనే, అంటే తప్పు భావాలతోనే వుందని మార్క్సు అన్నాడు. శ్రామిక వర్గ స్త్రీ పురుషులూ, కమ్యూనిస్టు పార్టీ నాయకులూ, నేర్చుకోవలిసిన సిద్ధాంతం అయితే, సిద్ధంగానే  వుంది. దాన్ని ముట్టుకోకపోతే, ఆ తప్పు సిద్ధాంతానిదీ కాదు; శ్రామిక వర్గానిదీ కాదు.

 1. ఒక కమ్యూనిస్టు పార్టీ, పెట్టుబడిదారీ పార్టీలకు మద్దతు ఇస్తూ, వాటితో పొత్తులు పెట్టుకుంటూ, ఇతర కమ్యూనిస్టు పార్టీలతో మాత్రం విమర్శలతో కొనసాగుతూ వుంటే, ఆ రకం పార్టీ, ‘కమ్యూనిజం’ గురించి శ్రామిక ప్రజలకు నమ్మకం కలిగించగలదా?

జ. ఒక కమ్యూనిస్టు పార్టీ గురించి మీరు, అది పొరపాటుగా చేస్తోందని చెప్పారు. అటువంటి పార్టీ, శ్రామిక ప్రజలకు కమ్యూనిజం గురించి నమ్మకం కలిగించగలదా- అన్నారు. ఆ సందేహం ఎందుకు? అటువంటి తప్పు నడతలో వున్న పార్టీ, తనకు వ్యతిరేకమైన పని చెయ్యదు కదా? మీ జవాబు, మీ ప్రశ్నలోనే వుంది.

 1. యువ, ఔత్సాహిక రచయితలకు మీరు ఇచ్చే సూచనలూ, సలహాలూ, ఏమిటి?

జ: ఒక రచయిత రాసే పుస్తకాలు చదివితే, ఆ రచయిత ఇచ్చే సూచనల వంటివి ఏమిటో తెలుస్తాయి. యువ రచయితలు, తమ బ్రతుకు దెరువుల కోసం, స్వంత వ్యాపారాల వంటి వాటిలో వున్నప్పటికీ, అసలు ‘సరుకు అమ్మకం’ అంటే ఏమిటో, ‘లాభం’ అంటే ఏమిటో, తెలుసుకోవడం అవసరం. తమ జీవిత విధానం ఏమిటో, తమ ప్రవర్తన ఏమిటో, తెలియని అమాయకత్వంలోనో, అగ్న్యానంలోనో వుండడం గాక, నిజానిజాలు తెలుసుకుంటే, ఆ వ్యక్తుల భావాల్లో మార్పులు జరగడానికి అవకాశం వుంటుంది. ‘ప్రకృతి’కి సైన్సులు వున్నట్టే, సమాజానికి కూడా ‘సైన్సులు’గా వినపడేవి వున్నాయి. కానీ, సమాజానికి సరైన సైన్సు ఒక్కటే వుంటుంది; రెండు అయినా వుండవు. ఆ ఒక్కటీ ఏమిటో తెలుసుకోవాలి. ఇది మనిషి బాధ్యత!

– రంగనాయకమ్మ

రంగనాయకమ్మ

3 comments

 • మనిషికి నడిపించేది ‘ఆశ’ కదా. మానవ జీవన చోదక శక్తి అయిన ఆశ గురించి కమ్యూనిజం ఏమి చెప్పింది? దానిని పరిగణనలోకి తీసుకునే సిద్ధాంతం రూపొందిందా?

  • Dhurasha ni pariganaloki thisukundhi…Manavudu swardha jeevi ani aristatile annaspati ,,atuvanti thappudu bavalani pempondhinchedhi matram pettubadi dhari vyavastha..!

 • ఆదిమ కమ్యునిష్టు సమాజం గురించి కొంచెం శాస్త్రీయమైన వివరణ ఇవ్వఫలరా?

  ఎందుకంటే, మార్క్స్ గారు ప్రతిపాదించిన మానవాళి యొక్క అంతిమలక్ష్యమైన వర్గరహితసమాజం కొన్ని తేడాలతో ఇదే దశను ప్రతిఫలిస్తుందని చెప్పారు కదా – మరి ఆ దశ ఉనికిలోకి ఎలా వచ్చింది!మానవాళి చరిత్రని అక్కణ్నించే ఎందుకు మొదలుపెట్టాలి?గతితార్కికచారిత్రకభౌతికవాదం ప్రకారం ప్రతి దశ యొక్క స్వభావం దాని ముందరి దశ యొక్క ధీసిస్,యాంటిధీసిస్ కలిసి ఏర్పడిన సింధీసిస్ కదా!ఈ ఆదిమ కమ్యునిష్టు సమాజం అనే దశ యొక్క పూర్వ చరిత్రని వదిలివెయ్యడానికి గల కారణం ఏమిటి?మళ్ళీ వర్గరహితసమాజం అనేది ఇక యాంటిధీసిస్ ఆనెది లేని అంతిమదశ అయితే అసలు “ధీసిస్+యాంటిధీసిస్->సింధీసిస్” సిద్ధాంతమే అబద్ధం అవుతుంది కదా!

  ఇది నాకు చాలా గందరగోళంగా ఉంది.కొంచెం అర్ధం అయ్యేలా వివరించగలరా?

  P.S:మీ జవాబు వీలున్నంతవరకు మార్క్సుగారి మౌలిక విశ్లేషణకి దగ్గిరగా ఉంటే బాగుంటుంది.

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.