గుండెలు రెండూ
ఎత్తుకున్న
జెండాలు ఒకేలా ఎగురుతున్నప్పుడూ…
పేగులపై రాసుకుంటున్న పదాల భాష ఒకటైనప్పుడూ
భూమికి చెరో వైపు నిలబడ్డ పాదాల సంభాషణలో
మాట ఓ అపూర్వ వంతెనవుతుంది….
యే ఉదయాస్తమయాలలోనైనా
ఉత్సాహంగానో
నెమ్మదిగానో
ఒరుసుకు పారే నది తీరాలను
వారధి లాంటి వాక్యమేదో కలుపుతున్నట్టు….
కాలం ఒడిలో
కాలుతున్న భూగోళం గురించో
రాలుతున్న పచ్చనాకులగురించో
పిడికెడు మాటల్ని పేర్చి కలల ఇంటిని కట్టుకుంటూ..
సముద్రం చేతులపై ఊగుతూ సాగే
మంటల నౌకల్ని చల్లార్చడానికి
మాటల ప్రవాహం సాగుతుంది…
క్రమంగా..
చేరడు నీళ్లలో చేప పిల్లలు ఉలికులికిపడుతున్నట్టూ
చెట్టు గుబురు లోంచి పిగిలిపిట్టలు తుర్రున వెళ్తున్నట్టూ
మాటల వానేదో కురుస్తూనే వుంటుంది
ఆశల పక్షులు విహరిస్తుంటాయి …
కొన్ని మాటల్ని
రెండు గోడల మధ్యో
రెండు చెట్లమధ్యో
కొన్ని వాక్యాలుగా పేని తాడులా కట్టి
ఉతికిన బట్టల్ని ఆరేసినంత తేటగా…
ఒక దరిన నిలబడి
అవతల దరి పైనున్న మిత్రుణ్ణి పిలవడానికి
నోటిలో వేలు పెట్టి నాలుక మడతపెట్టి
ఊపిర్ని ఉగ్గబట్టి ఈలేసి పిలిచినంత ప్రేమగా….
మాటల వంతెనపై మనసులు అటూఇటూ
ప్రయాణిస్తూనే ఉంటాయి…
గాయాల్ని
పువ్వులుగా పూయించడానికో
కన్నీళ్ళని
నవ్వుల గాలి పటాలుగాఎగరేయడానికో…
కొన్ని ఉదయాల్ని తుంచి బడి సంచిలో పోగేయడానికో
కొన్ని అక్షరాల్ని దీపాలుగా వెలిగించడానికో….
(మౌళి అన్నతో ఉదయాన్నే చాలాసేపు మాట్లాడినప్పుడు లోపలి కదిలిన..)
– పల్లి పట్టు
పల్లి పట్టు పేరుతో కవిగా సుపరిచితులైన పల్లిపట్టు నాగరాజు చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయులు. తెలుగు ఎమ్మే చేసి, ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర యూనివ్సిటీలో పి. హెచ్ డి కూడా చేస్తున్నారు. 600కు పైగా కవితలు మినీ కవితలు, 6 కథలు రాశారు. ఆకాశవాణిలో వినిపించారు, పలు పత్రికల్లో కనిపించారు. కవిగా చాల పురస్కారాలు అందుకున్నారు. నాగరాజు చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’లో, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ సభ్యలుగా క్రియాశీలురు కూడా. నాగరాజు కాంటాక్ట్ నంబరు 9989400881.
***
Good poem.
థాంక్స్ అన్నా….
😊💐
Bagundi
ధన్యవాదాలు సర్ నమస్సులు.💐
Thanks sr namaste..💐
నాగరాజు ఎంత కొత్తగా రాస్తాడో. ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈల వేయడం, సముద్రపు చేతులపై ఊగడం…లాంటివి బాగున్నాయ్. థ్యాంక్యూ సార్.
నమస్తే సర్..హృదయ పూర్వక ధన్యవాదాలు…😊💐