వీధులకెక్కుతున్న రైతులు పిల్లలు స్త్రీలు!

ఆకాశంలో నల్లమబ్బు కనిపించగానే ఉరకలు వేసే ఉత్సాహంతో పొలం పనులకు సిద్దమయ్యేవి పల్లెలన్నీ. రైతన్నలు నాగళ్లు సరిచేసుకుంటుంటే, రైతమ్మలు విత్తనాలు శుద్ది చేసేవాళ్లు. వానకు తడిసిన పొలాలు మట్టి వాసనలతో పరిమళించేవి . పొలంలో విత్తనాలు వేయడం ఒక పండుగలా జరిగేది. ఇప్పుడేవి ఆ మట్టిపరిమళాలు? ఆ పండుగ సంబరాలు?

రైతుల లాంగ్ మార్చ్

వానలు కురుస్తుంటే రైతులు విత్తనాల కోసం, ఎరువులకోసం బ్యాంకుల ముందు, దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఆ విత్తనాలు ఎలాంటివో, మొలకెత్తుతాయో లేదోనని అనుమానంగానే పొలంలో నాటుతున్నారు. మొలకెత్తినా  ఆ మొక్కలకు పూత, కాయ వస్తుందో లేదోనని బాధగా చూస్తుంటారు. పంట పండినా గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలవుతుంటారు. అప్పులు ఎగరగొట్టి విదేశాలకు విమానాల్లో పారిపోవడానికి విజయ మాల్యాలు కాదు కదా? సామాన్య మానవులు. ఊరిడిచి పోలేక ఉరిపెట్టుకొంటున్నారు. ఇది ఒక రైతు సమస్యగా మొదట్లో అపోహ పడ్డా,  ఇపుడు రైతులు తెలుసుకుంటున్నారు ఇది ఒక ఊరి రైతుల సమస్యో, ఒక రాష్ట్రంలోని రైతుల సమస్యో కాదని. దేశ సమస్య అని ఎలుగెత్తిన రైతులు రైతు సంఘాల ద్వారా సంఘటితమయి, తమ సమస్యలపై వీధుల్లోకి వచ్చి ఊరేగింఫులు, ధర్నాలు చేస్తున్నారు.

గత మార్చి 6న మహారాష్టృకు చెందిన 35,000 మంది రైతులు నాసిక్ నుంచి ముంబైకి 180 కిలో మీటర్లు నిరసన ర్యాలీ తీశారు. ఆలిండియా కిసాన్ సభ  నేతృత్వంలో రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తూ మార్చి 11న ముంబై నగరం చేరుకున్నారు. పంట రుణాలు మాఫీ చేయాలని, పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లించాలని, కరెంటు బిల్లులు రద్దు చేయాలని, స్యామినాధన్ రికమెండేషన్స్ ను అమలు చేయాలని. ఆదివాసీలు పంటలు పండిస్తున్న ఫారెస్ట్ లాండ్ రైట్స్ అమలు చేయాలని, రైతులకు పెన్షన్ స్కీం అమలుచేయాలని నిరసన ర్యాలీ ద్వారా ప్రకటించారు.  యువకులు, వృద్ధులు, స్త్రీలు, ఆటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే ఆదివాసీలు ఒక ప్రవాహంలా కదిలిపోతుంటే, వారికి తాము అండగా వుంటామని దారి పొడుగునా ప్రజలు అన్న పానీయాలు, దుప్పట్లు, పాదరక్షలు ఇచ్చి తమ మద్దతు తెలిపారు.

 సరిగ్గా ఏడాది క్రితం 2017 మార్చి 14 నుంచి 41 రోజుల పాటు తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించారు.  గత జులై 6న మధ్యప్రదేశ్ లోని మంద్ సార్ లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా రైతు సంఘాలు, అనేక స్వచ్చంద సంస్థలు రైతుల సమస్యలపై గత ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్నాయి.   చెదరుమదురుగా విడివిడిగా జరిగే నిరసన ర్యాలీలు ఆయా సంఘాల బలప్రదర్శనగా మిగిలిపోయే ప్రమాదం వుంది. రైతు సంఘాలు ఏకం కావడం అవసరం. లేకపోతే, రైతుల్లో సంఘటిత శక్తి సన్నగిల్లే ప్రమాదం వుంది. రైతుల సమస్య అంటే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్య. స్వయం పోషకంగా వుండిన గ్రామాలు సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భం.   పర్యావరణంకు కలుగుతున్న ప్రమాదం. విద్యార్థులో, యువజనుల్లో, అశేష ప్రజానీకంలో వ్యవసాయ రంగం సమస్యలపై అవగాహన కలిగించి, వారిని రైతులకు అండగా నిలబడేట్లు కదిలించాలి.

‘మార్చ్ ఫార్‍ అవర్ లైవ్స్‍’ ( ‘March for our lives)

“స్కూల్లో ఎప్పుడైనా కాల్పులు జరగవచ్చని భయంతో బతుకుతుంటాం. తుపాకీ కాల్పులు జరిగితే  నేలపై పడుకోవాలని మాకు ఎల్లప్పుడు డ్రిల్ చేయిస్తూ వుంటారు. ఇలాంటి జీవితం ఎవరికీ వద్దు” (“ We have lockdown drills all

 the time. We live the constant fear that there is the possibility of school shooting. No one should have to live like that”).

ఇది స్కూల్ కు వెళ్ళే పిల్లల్లో వుండే భయమైతే, స్కూల్ నుంచి పిల్లలు  క్షేమంగా ఇంటికి వస్తారా అని తల్లిదండ్రులు నిత్యం ఆందోళనపడుతుంటారు. భూతల స్వర్గంగా భావించబడే అమెరికాలో స్కూల్ పిల్లల పరిస్థితి ఇది.

ఫిబ్రవరి 14 వాలెంటైన్ డే న ఫ్లోరిడా రాష్టృం, పార్క్ లాండ్ లోని మార్జోరి స్టోన్ మెన్ డగ్లస్ హైస్కూల్లో 19 ఏళ్ళ నికొలస్ క్రుజ్  జరిపిన కాల్పుల్లో 17 మంది పిల్లలు మరణించారు. ఈ దారుణాన్ని సహించలేక తోటి విద్యార్థులు “సర్వైవర్స్ ఆఫ్ షూటింగ్” అనే పేరుతో సంఘటితమై  తుపాకుల అమ్మకాన్ని నియంత్రించాలంటూ మార్చి 24 న వాషింగ్టన్ డి.సి. లో ప్రదర్శన నిర్వహించాలని దేశవ్యాప్తంగా ఊరేగింపులు తీయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా వీరు తమ పిలుపును ప్రపంచవ్యాప్తంగా వినిపించగలిగారు. “మార్చ్ ఫర్ అవర్ లైవ్స్” నినాదంతో  మార్చి 24 న వాషింగ్టన్ కు 2 లక్షల మందితో ర్యాలీ జరిగితే, అదే రోజున అమెరికాలో ఎక్కడికక్కడ చిన్న, పెద్ద నగరాలలో వేలాది మంది పాల్గొన్న ప్రదర్శనలు 800 కు పైగా జరిగాయి, ఈ ప్రదర్శనల్లో ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్నుంచి హైస్కూల్ పిల్లల వరకు పాల్గొన్నారు. ఆరేళ్ళ క్రితం కనెక్టికట్ రాష్ట్రం లోని ‘సాండీ హుక్’ ఎలిమెంటరీ స్కూల్ లోని క్లాస్ రూంలో జరిగిన కాల్పుల్లో  28 మంది పిల్లలు చనిపోయారు. పంతొమ్మిదేళ్ల క్రితం కొలరాడో లోని కొలంబైన్  హైస్కూల్లో ఇలాంటి దారుణమే జరిగింది. ఇలా స్కూల్లో, క్లాస్ రూంలో కాల్పులు జరిగిన సందర్భాల్లో అమెరికా అంతా ఉలిక్కిపడుతుంది. స్కూల్ కు పోతున్నప్పుడో, ఇంటికి వస్తున్నప్పుడో మధ్య దారిలో స్కూల్ పిల్లలు ఒకరే కాల్పులకు గురయ్యే సంఘటనలు అత్యధికమైనా అవి లెక్కలోకి రాకుండా పోతుంటాయి. ప్రతి రెండుమూడు నెలలకు ఒకసారి మాస్ షూటింగ్స్ జరగుతుంటాయి. ప్రైవేటు వ్యక్తుల తుపాకీ కాల్పుల్లో ఆఫ్రికన్-అమెరికన్లు, బ్రౌన్ కలర్ ప్రజలు మరణించడం అత్యధికం.  ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోడానికి తక్షణ కారణం ఎవరు పడితే వారు తుపాకులు కొనగలడం. వాల్ మార్ట్‍ లాంటి షాపుల్లో తుపాకుల వంటి మారణాయుధాల్ని విచ్చలవిడిగా అమ్మడాన్ని నిషేధించాలని అమెరికాలోని స్కూల్ పిల్లలు డిమాండ్ చేస్తున్నారు. “ మేమంతా మంచి సమాజాన్ని కోరుతున్నాం. మేమంతా మార్పు తీసుక రావాలనుకుంటున్నాం” అని ఎనిమిది లక్షల గొంతులు ఒక్కటై అమెరికా అంతా ప్రతి ధ్వనించేలా నినదించాయి. ఆయుధాగారంలా మారి, యుద్ధాల్ని ఎగుమతి చేస్తున్న అమెరికాకు తన పిల్లల నుంచే ఒక సవాల్ ఎదురయింది.

స్పైయిన్ లో స్త్రీల సమ్మె

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ప్రపంచమంతటా మహిళలు ఒక పండుగలా జరుపుకునే సంప్రదాయాన్ని తిరుగ రాశారు స్పైయిన్ దేశ స్త్రీలు. శ్రామిక మహిళల పోరాట దినం స్ఫూర్తికి ధీటుగా మార్చి 8న దేశవ్యాప్త సమ్మెకు దిగారు. ఆ రోజు స్పైయిన్ లో రైళ్లు, విమానాలు ఆగిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. 50 లక్షలకు పైగా స్త్రీలు తాము చేసే అన్ని పనుల్ని మానేసి ఇళ్లలోంచి, ఆఫీసులోంచి వీధుల్లోకి వచ్చారు. గృహ హింసకు, వేతనాల్లో అసమానతలకు వ్యతిరేకంగా  10 యూనియన్ల నాయకత్వంలో దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులు, గృహిణులు, రాజకీయాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న స్త్రీలు, సినిమా యాక్టర్లు…ఇలా… సమస్త రంగాల్లో పని చేస్తున్న అన్ని వయసుల్లోని స్త్రీలు ఇళ్లల్లో పిల్లల్ని, ఇంటి పనుల్ని భర్తలకు వదిలి వీధుల్లోకి వచ్చారు. “స్త్రీలు పనిచేయడం ఆపితే ప్రపంచం ఆగిపోతుంది”. ”ఫెమినిజం ఎవరినీ ఎప్పుడు చంపలేదు కానీ సెక్సిజం ప్రతిరోజు చంపుతున్నది”. “నిన్ను నీవు ప్రేమించుకో”  వంటి నినాదాలతో స్పైయిన్ దేశం మారుమోగింది.

“మార్చి 8 అంటే సమానత్వం కోసం కొనసాగుతున్న పోరాటం”. “యువర్ సెక్సిజం మేక్స్ మీ సిక్”. “మేము అణగిమణగి వుండం, అణకువగా వుండం. మేము బలవంతులం, స్వతంత్రులం, ధైర్యస్థులం”. ’’ స్త్రీల హక్కులు మానవహక్కులు’’ వంటి నినాదాలు రాసిన ప్లేకార్డ్స్, బ్యానర్లు పట్టుకొని దేశ రాజధాని మాడ్రిడ్  లోనే కాక దేశంలోని అన్ని నగరాలలో, ముఖ్యపట్టణాలలో ప్రదర్శనలు నిర్వహించారు. స్త్రీల ఒకరోజు ఈ సమ్మెను స్పైయిన్ లోని 82% మంది ప్రజలు సమర్థించారు.

ప్రజలంటే స్త్రీలు, పురుషులు. ప్రజల్లో సగం స్త్రీలు. సగం జనాభాని అబలలని, వారిని రక్షించే పేరిట ఇంటికే పరిమితం చేసి వారిపై హింసను కొనసాగిస్తుంచడం నేటికీ ప్రపంచమంతటా సాగుతున్నది. ఇళ్ళల్లోనే స్త్రీకి రక్షణ లేదు. గత ఏడాది ఆ దేశంలో భర్తల చేతుల్లో మరణించిన స్త్రీల సంఖ్య 49.  ఒక లక్షా 43 వేల మంది గృహహింసలకు లోనయినట్టు రికార్డులు చెబుతున్నాయి. స్త్రీలు అడుగడుగున ఎదురవుతున్న అన్ని అడ్డంకుల్ని అధిగమించి ముందుకు వస్తున్నా ఉద్యోగాల్లో అసమానత, వేతనాల్లో అసమానత కొనసాగుతున్నది. చిన్నప్పట్నుంచే ఆడపిల్లలు తక్కువ, మగ పిల్లలు ఎక్కువ అనే భావనను కలిగించడం కొనసాగుతున్నది. స్త్రీలు ప్రజల్లో భాగంగా గుర్తింపు, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, వేతనాలు, హక్కులు సాధించగలిగినప్పుడే నిజమైన సమానత్వం లభిస్తుంది.   స్త్రీలను లైంగిక వస్తువులగా( సెక్స్ ఆబ్జక్టివ్స్) పరిగణిస్తూ తక్కువగా చూడడం, వారికి ఇల్లే, ఇంటి పనులే ముఖ్యం కనుక వారు ఎన్ని పనులు చేసినా గుర్తింపు లేకపోవడం, వేతనాల్లో అసమానత పాటించడం జరుగుతున్నది. స్త్రీలు కోరే స్వేచ్చను లేదా స్వాతంత్ర్యాన్ని స్త్రీల లైంగిక (సెక్స్)స్వేచ్చగా కుదించడం అమానవీయం. అవమానకరం. చాలా ప్రమాదకరం. ఇంటా, బయటా సాగుతున్న అన్నిరకాల హింసలకు, లైంగిక దాడులకు, అసమానతలకు కారణం సెక్సిస్ట్ భావనలే నని ఒక రోజు సమ్మె చేయడం ద్వారా ప్రపంచ ప్రజలకు చైతన్యం కలిగించారు స్పైయిన్ మహిళలు.

ఇది సామాజిక విప్లవమని, స్త్రీ, పురుషుల సమానత కోసం కొనసాగుతున్న పోరాటమని, స్పైయిన్ స్త్రీల సమ్మెను అభివర్ణించవచ్చు.

–  ఎస్. జయ

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

2 comments

  • మూడు వేర్వేరు ఉద్యమాలను .. మూడూ అత్యవసరమైన వే, కీలకమైన స్థితిలో ఉన్నవే, .. వీటిని ఒకే త్రాడుగా పేనడం బావుంది కానీ అసమగ్రంగా ముగించేసినట్ట్టుగా ఉంది. మూడూ కూలంకషంగా చర్చించ వలసిన విషయాలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.