స్వర రాగ గంగా ప్రవాహమే

సుస్వరమో అపస్వరమో తెలియదు,  అదొక రాగం . రాగం పేరు ఆరునొక్క రాగం.. ప్రవాహమంటారా అది జారుతోనే ఉంది. ఆకలా అంటే కాదు, నిద్రా అంటే అదీ లేదు…మరి ఇంక వంటి మీద రాష్ లాంటిదేమైనా ఉందేమో అని జాన్సన్, నైస్ లాంటి చెమట పొక్కుల పవుడర్లన్నీ వాడి పడేసారుట.. ఆముదం లాంటివి రుద్దేసారుట.. అబ్బే ఆగదూ ఆగదూ ఆగితే సాగదూ లాగా నేను నిదురించకుండా ఉన్నా సరే ఇంట్లో వాళ్ళని నిదురపోనిస్తే మజా ఏముంటుందని సాగ దీసీ దీసీ.. అప్పుడప్పుడో చిరునవ్వు విజయ గర్వంతో చిందించడం చూసి శివుడి గుళ్ళో నెత్తి మీద చుక్కలు చుక్కలు గా నీళ్ళు కారడానికి పెట్టే కుండలాంటిదేదో నా సిస్టం తయారీ లో డిఫాల్ట్ గా వచ్చేసిందని మా అమ్మకనుమానమొచ్చిందిట…డిలీట్ బటన్ ఉందేమో అని వెతుకుతుంటే చెవి వెనుక ఏదో తగిలిందిట. డాట్రారు కి చూపించిందిట.. ఆయనేమో అవునమ్మోయ్ ఇదే బటన్ ఆ ఆరునొక్క రాగానికి కారణం. ఇది తీసేయాలన్నాడుట. అటూ ఇటూ తిప్పి దాన్ని పుటుక్కున కోసి హమ్మయ్య అనుకున్నాడు డాట్రారు..

అబ్బే, మీరు ఆనందించకండిఅలా వదిలేస్తే మన విలువేముంటుందీ!. అలా సాగదీసీ రాగాలాపన చెయ్యడం అలవాటయ్యిందంతే. ఒక సారి మా చిన్నక్క సంగీతం కాలేజీలో ఏదో ఫంక్షన్  ఉంది  అని తీసికెళ్ళింది.. పరమ ఉత్సాహం కలిగించే మాటలు చెప్తూ,  సికందరాబాదు స్టేషన్ నించి మారేడు పల్లి వరకు నడిపించింది.. అర కొర నృత్యాలయ్యాక ఒకాయన అందుకున్నాడు.. రాగం , ఎక్స్ ప్రెషన్ లు చూసి భయపడిపొయ్యా!!… నేను ఓడిపొయ్యినట్టనిపించింది!!.. అంతే నేనూ అందుకున్నా.. అక్క ఆశ్చర్యం గా చూసి ఏమయ్యిందే అంది.. ఆయన ఎందుకేడుస్తున్నాడనడిగాను. దాన్ని హిందుస్తానీ సంగీతం రాగాలాపన అంటారనేదో చెప్పి అందరూ నవ్వారు..నాకు కోపమొచ్చి రాగం పెంచాను. అక్కడ ఉండడానికి ఇబ్బంది పడిన అక్క అక్కడే ఒక చాక్లెట్ కొనిచ్చి, మళ్ళీ సికందరాబాద్ స్టేషన్ వరకూ నడిపించి , బసెక్కించి ఇంటికి తీసుకుపోయింది..అలా ఆనాడు నాకంటే ఘనులున్నారని అర్థం చేసుకున్నా కాని  ఓడిపోవడం ఇంటా వంటా లేదు.. వంట అంటే వంట కాదు.. తినడం తప్ప మనకి అలాంటివి చెయ్యడం రాదు.. అసలే ఇంట్లో ఆరో దాన్ని, పైగా ఆరునొక్క రాగం అందుకునే టైపు, ఇంట్లో అందరూ వద్దులే తల్లీ నువ్వలా ఉంటే చాలనేసే వారు..

పోను పోనూ, చదువుల్లో సారమెల్ల చదివితి తండ్రీ అని అందామని ఉండేదిఏదీ,, అసలెవరూ సహకరించరు.. అదే నాకు కోపం!.. మాస్టారు ఏదో చెపుతారు.. మనం నోట్ బుక్కులో వ్రాస్తున్నట్టు పక్క పిల్లకి జోకులో, కేకు బొమ్మలో వేసి చూపించడం అది కిసుక్కున నవ్వడం తోనే సరిపొయ్యేది.. మాస్టారు కోప్పడడం తప్ప నా సారాలు చదివే అవకాశం అసలు ఇస్తేనా.. అసలిలా అయితే మరి నాలాంటి జ్ఞానులకి ఎలాగో మీరే చెప్పండి.. రిసల్ట్స్ వచ్చిన రోజు మాత్రం నన్ను ఏమీ అనకముందేఅబ్బా!  మీరు భలే క్యాచ్ చేస్తారు.. అందుకే మీరంటే నాకిష్టం..

ఇలా చదువు, సంగీతం, చేతి పనులు , కుట్టు పనులు, అల్లికలు,  డ్యాన్సు ,వంటలు.. ఇవన్నీ రాకపోయినా ఫర్వాలేదు కానీ కాస్త నీటుగా గోటుగా అందరు అమ్మాయిల్లా రెడీ అవ్వమనేది మా అమ్మ. ఐదుగురి  తరువాత పుట్టా కదా మరి పతంగులెగరెయ్యడం, గిల్లి దండా ఆడడం, గోలీలతో బొంబాయి ఆటలు, సీతాఫలం గింజలతో చీటింగులు నేర్చిన నాకు చుట్టాలు, పక్కాలు..(పక్కాలంటే ఇంటి పక్కన పక్కాగా ఉండేవాళ్ళని అర్థం ). ఏమన్నా , ఎవరేం చెప్పినా ఆయుధం ఉందిగా.. అదే అండీ స్వర రాగ గంగా ప్రవాహమే….

ఎవడొస్తాడో దీనికి అని అమ్మ భయపడుతుండేది కానీ సీతయ్య అని ఒకానొక రాజకుమారుడు తనిష్టం అంటూ మా నాన్న దగ్గరికొచ్చి చెప్పేసాడు.. మా నాన్న ధ్యానం లో ఉన్న మహర్షిలా కళ్ళు తెరిచి ఉచ్చ్వాస నిశ్శ్వాసములు సరిగ్గానే ఉన్నాయో లేదో అని సీతయ్యని పరీక్షించారు. అన్నీ బానే ఉన్నాయిటమరి ఎందుకబ్బా .. అసలెలా.. వైఅని ఆలోచిస్తూ తను నమ్మే గురువు గారి దగ్గరికి పరిగెత్తారు. .. ఎక్కడో తేడా కొడుతుంది అసలిది ఎవరికైనా నచ్చడమేంటి, పాపం పిల్లాడు!! ఒక సారి చెప్పి చూడండని అని అమ్మ మొత్తుకుందిమొత్తానికి గురువుగారి గ్రీన్ సిగ్నల్ తో పెళ్ళయ్యింది.. ఏతా వాతా ఏందంటే సీతయ్య ఎవరి మాటా వినడు..!!!!

కళ్ళల్లొ నీ బొమ్మ చూడు అంటాడు తను.. ముందు నా కళ్ళల్లోకి చూడు అంటాను నేను కనులు పండు వెన్నెల గనులు అనుకోడానికేమీ లేదు. అవెప్పుడూ నీటి చెరువులే..అందుకే,..తన కళ్ళల్లోకే చూడాలంటాడు.. నాకు నా కళ్ళల్లో నిండిన నీళ్ళు తప్ప బొమ్మ గిమ్మ ఏమీ కనపడదు.. పోనీ లే రాగమో సరాగమో అంటాడు.. నాకొచ్చింది ఒకటే రాగం.. ఇవన్నీ నాకు తెల్వద్ అంటాన్నేను. రేడియోలో అమ్మ పాటలొస్తే అమ్మ గుర్తొచ్చి ఏడుపొచ్చేస్తుంది.. సినెమా కి తీసికెళితే కష్టాలు ఏంటో అని ఏడుపొచ్చేస్తుంది.. నా పిల్లలకి లాలి పాట అంటూ నాకిష్టమైన చందురుని మించు అందమొలికించు పాట రెండు లైన్ లు పాడగానే గొంతు పూడుకుపొయ్యి ఏడుపు..!! పిల్లలు ఏడుస్తుంటే ఆపుతారా తల్లులే ఏడుస్తారా ఏంటిది అని మందలిస్తాడాయన.. పాపా లాలీ అని పాడుకుని ఏడుస్తూ పడుకుంటా నేను..  . ఛీ పాపం ఆయనని బాధ పెట్టానా, అయ్యో అయ్యో అని మాళ్ళీ నాకేడుపొచ్చేస్తుంది. పిల్లలు పడినా, అత్త గారికి జొరమొచ్చినా,, మావగారు వాంతి చేసుకున్నా అందరూ నన్ను ఊరుకోబెట్టడమేఅసలిదంతా ఎందుకు  భరిస్తున్నారో  అని మీకు ఆతృతగా ఉంది కదూఅబ్బా చెప్పేస్తారేం.!!! ఆశ  ..అప్పడం వడ దోశ…!!!

కొత్తల్లో అప్పుడప్పుడు అమ్మకో నాన్నకో చెప్పేవాడు,  కుండలు కుండలు గా నీళ్ళొలకబోసే వైనం.. చిన్న పిల్ల బాబూ తను కడుపులో ఉన్నప్పుడు  మాకు నీటి కరువొచ్చింది. నీళ్ళు ధారాళం గా ఇయ్యి దేవుడా అని మొక్కుకున్నాము, ఆయనిలా అర్థం చేసుకున్నట్టున్నాడు ,క్షమించు బాబూ.. అని సర్దుకొచ్చారు..పాపం వినేసాడనుకునేరు. అసలాళ్ళ మాట ఇంటాడని మీరెలా అనుకుంటున్నారండీ.. ఆయన అసలెవరి మాటా ఇనడు..

హఠాత్తుగా  అమ్మా నాన్న పూర్తి సమాధి స్థితికి వెళ్ళిపోయారు. నా ప్రవాహం కట్టలు తెంచుకుంది.. చీటికి మాటికి కుళాయి కట్టెయ్యడం కష్టమయ్యి ఇంక సీతయ్యకు సర్దుకోక తప్పలేదు. ఏడ్చే వాళ్ళ ఎడమ చెయ్యి వైపు, కుట్టే వాళ్ళ కుడి చేతి వైపు కూచోకూడదని అంటారు గానీ అసలు జనాలు నాకు ఎటువైపు కూచోడానికీ ఇష్ట పడట్లేదు..ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండీ.. అనుకుంటూ.. పక్కన ఉండి నా పనేదో చేసుకుపోతున్నా

అలా సాగిన  ప్రవాహం అలా అలా చెరువులై, నదులై, వాగులై, వంకలై చుట్టూ 4 కాలనీలనీ, 10 ఊర్లనీ చుట్టబెట్టేసింది.. అలాంటి ప్రవాహం ఒక రోజు గడ్డ కట్టేసింది.. అబ్బ ! చలికి కాదెహె! .అదేంటంటారా వస్తున్నా వస్తున్నా….

మా అక్కొంచిందోసారి ఇంటికి.. కొత్త ఫోన్ కొందిట ఫుటోలు గట్రా చూపిస్తోంది. భలే భలే ఇంక ఎక్కడికెళ్ళినా కెమేరాలు తీసుకెళ్ళక్కరలేదు కదా అని బోల్డు హాస్చర్యపోయా. అప్పుడే ఏం చూసావు.. వీడియోలు కూడా తియ్యచ్చు తెలుసా అంది.. ఏవో చెట్లు, పక్షులు, పార్కులూ, పిల్లల తాడాట, డాన్సులు.. అబ్బో భలే ఉందే అని ఉత్సాహపడిపొయ్యా.. వెంటనే మా అమ్మ గుర్తొచ్చింది.. తాడాట ఆడుతుంటే మురిపెంగా చూసేది కదా అంతే ఏడుపొచ్చేసింది.. వా….వా

ఛీ ఊర్కో ! అని మా అక్క కసిరికొట్టింది.. ఇది చూడు అని ఇంకో వీడియో నొక్కింది.. ఎవరిదో చావు ఇల్లు. చావు పేరు వినగానే మళ్ళీ తన్నుకొచ్చిందిఛీ అదేంటక్క చావులు అలా తీయకూడదు తెలుసా అన్నాను వెక్కుతూ.. తెలుసులేవే నీకో తమాషా చూపిద్దామని ! అంది..చావులో తమాషా ఏంటే నీ ఎంకమ్మ అని కళ్ళు తుడుచుకుని నవ్వా..

వీడియోలో చనిపోయినావిడ కూతుళ్ళూ కోడళ్ళూ అనుకుంటా కప్పు మందం మేకప్పేసుకుని వచ్చిన జనాల్ని పలకరిస్తూ కాఫీలు గట్లా అందిస్తున్నారు.. కొడుకులు బిజీగా చావు పనుల్లో పడున్నారు.. ఇంటి అటుపక్క వాళ్ళు ఇటు పక్కవాళ్ళు కొంచెం ఎడం గా కూచుని దిగులు మొహాలు పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.. డేరాలేసేవాళ్ళు, పాడె కట్టేవాళ్ళూ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.. బ్రాహ్మడు కాస్త దూరం గా నించుని అదీ ఇదీ తెమ్మని పురమాయిస్తున్నాడు.. . పోయినోళ్ళందరూ మంచోళ్ళనుకున్నారేమో, వీడియో తీసినోళ్ళు శవాన్ని మాత్రం తియ్యలేదు.. అబ్బో భలే క్లియర్ గా వచ్చిందే నీ ఫోనులోనేనా అంటూ చూస్తున్నా.. అంతా నిశ్శబ్దం గా ఉంది కానీ  శవం పక్కనెవరో కట్టలు తెంచుకుని ఏడుస్తున్నారు . అందరివీ ఎక్స్ప్రెషన్ లే గానీ ఏడుపు మాత్రం అందరికీ సరిపడేలా ఉంది..  పరిసరాలన్నీ కవర్ చేస్తూ వీడియో చివరికి శవం దగ్గరికొచ్చింది.. చీర నా చీరలాగుంది కదూ అన్నాన్నేను.. నీ చీర కాదు నువ్వే, చేతిమీదొకటేస్తూ  చిరాగ్గా చూసింది.. ఏంటి నేనా! అంటూ ఆతృతగా చూసానుఅవును నేనే!.అంతలా ఏడ్చానా ఎందుకూఆవిడేమైనా మన అమ్మా, అత్తా అన్నాన్నేను , అసలు పరిచయం కూడా లేదు. 4 కాలనీల అవతల ఎవరో చనిపోయారు తోడొస్తావా చూసొద్దామని పక్కింటి పంకజం అడిగితే కదూ వెళ్ళాను.. అసలు వీళ్ళెవరినీ చూడనేలేదా నేను.. పోతూ పోతూనే శవం పక్కన పడి ఏడ్చానా.. అందరూ ఏడవకుండా నేనొక్కదాన్నీ ఏడవడం ఎబ్బెట్టుగా ఉందసలు.. ఇంక ఆపు అక్కా చిరాగ్గా ఉంది. అయినా అక్కడికి నువ్వెప్పుడొచ్చావ్ అన్నాను

నేను రాలేదు.. మధ్య ఎవరో ఓవర్ ఆక్షన్ అని వాట్సాప్ లో పెట్టారు ఏంటా,  అని చూసి డెలీట్ చెయ్యబోతుంటే నువ్వు కనిపించావు.. చాలా కోపమొచ్చేసింది. ఎన్ని సార్లు చెప్పాను నీకు .. ఇలా చూపిస్తే అయినా బుద్ధి వస్తుందేమో అంది కటువుగా..!

అవును! మధ్య చుట్టాలెవరింట్లో విషాదాలు జరిగినా నన్ను పట్టుకుపోవడం మొదలెట్టారు.ఏదో నేనంటే ఇష్టం వల్ల అనుకున్నా కానీ అక్క చెప్పింది….నిన్ను తీసుకెళుతున్నారు,  ఎందుకంటే మధ్య ఏడవడం బాగోదని ఎవరూ ఏడవట్లేదుట.. మరీ చావన్నాక ఏడవకపోతే ఏంబాగుంటుందనుకోగానే నువ్వే  గుర్తొస్తున్నావుట..డబ్బులిచ్చి పెట్టుకోవచ్చుట కానీ ఎందుకు ఇక్కడ ఫ్రీగా వాగులు వంకలు ఏరులై పారుతుంటే డబ్బు దండుగ అనుకుంటున్నారుట విని షాక్ అవ్వడమే కాదు కుత కుతా ఉడికిపోయా. ఎందుకంటే ఒక పక్క నా అమూల్య సంపదని వాడుకుంటూ ఇంకో పక్క నవ్వుకుంటున్నారుట..!!

అక్క ఎన్ని సారులు చెప్పిందో నాకు అలా అందరి ఇళ్ళల్లో ఏడవకురా బాగోదు అని,  మనం వినే రకం కాదుగా అసలే సీతయ్య గారి తాలూకు మరి! అదేంటో మరి నాకు ప్రవాహం  కట్టలు డ్యాం లు తెంచుకుంటుదని మీకు తెలిసిపొయ్యుంటాది..కానీ ఇంక బంద్ ఇందాకా ఉడికిన ఉడుక్కి నీళ్ళు మరిగి ఆవిరై గడ్డ కట్టేసాయి.. ఇంక కరగవు గాక కరగవుడిఫాల్టు గా వచ్చిన బిందె కరిగిపోయిది..

రాగానికి పెట్టే ఓపిక పెడితే బోల్డు అందమైన రాగాలు పాడచ్చనేది మా అమ్మ. అందుకే మధ్య రాగం మార్చి ఇంకో రాగం అందుకున్నా లెండి!!!!!

..ఇదిగో ,.. ఒకసారొస్తారూ వినిపోదురు…!!!

– ఎన్నెల, కెనడా

 

రచయిత స్వీయ పరిచయం

కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

***

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

7 comments

  • ఎన్నెల అంటే ఎవరో అనుకున్నా ఓ రాయవరపులక్ష్మీగారా నాకు బాగా తెలుసండీ ఓ జీవితకాల పరిచయం 2017లో అనుకుంటా పలకరించారు. ఓ ఇలాగే నూటొక్క రాగాలు పలికించారు. ఈ ఫూట కోట నవ్వులు సరిపోవు గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని ముసిముసి నవ్వులు నవ్వేసుకోవచ్చు. ఎన్నేల ముచ్చెట్లని తెలంగాణ భాషలో చెప్తారు ఇంక విన్న రోజు భోజనం అవసరంలేదు.

    • నీ పాదం మీద పుట్టుమచ్చనై అక్కమ్మో..తోడబుట్టిన ఋణం తీర్చుకుంటలే…..

      అవును ఒక జీవితకాలపు పరిచయం..మీ కథలతో ,కవితల్లోని
      లోతైన వెతలతో…ప్రాణం పెట్టేసే ఆ యాసతో…

      ధన్యవాదాలు జ్వలితమ్మో…ఉజ్వలితమ్మా

  • చెల్లెమ్మా ! ముందు నీ దుఃఖము చూసి నాకూ ఏడుపు వచ్చినా , చివరలో కడుపుబ్బా నవ్వు తెప్పించావు. వివిధ రంగాలలో అద్భుతమైన ప్రతిభ చూపిస్తావు. చాలా బాగుంది. హృదయపూర్వకాభినందనలు. సీతయ్యగారు అదృష్టవంతులే.

  • లక్ష్మి మేడం– రుడాలి —చూసినప్పుడు ఎడ్చేవాల్లని– ఇలా కూడా— అనుకునేదాన్ని——అహహహహ మీ— నిజమైన ఏడుపును లోకులు ఇలా —–అహహహహ్–

  • జైశ్రీమన్నారాయణ . ఎన్నెలమ్మా .. చాలా పెద్ద కథే ఉందమ్మా .. ఈలాటి మంచి మంచి కథలు వ్రాస్తారా మీరు .. చాలా బాగుంది మీ స్వగతం ( దీన్ని ఆటో బయోగ్రఫీ అంటారేమో ) .. ఇది ఒక కళ .. ఏడుస్తూ అందరినీ నవ్వించడం .. బాధా తప్తమైన మనస్సు పరిసరాలను పరికింపదు అందుకే అలా ఏడుపు వచ్చేస్తుంది .. కొంచెం జాలి గుండె వాళ్ళకు మరీ ఎక్కువగా వస్తుంది ..
    పోనీ లెండి ఇదీ ఒక మధుర స్మృతియే కదా .. ఇలా ఉన్నది నేనేనా అనుకోవటానికి ..
    మరోక కథ కోసం నిరీక్షిస్తాం ..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.