‘ఒంటరి’ కానిదెవ్వరు’?!

గ్రామీణ జీవిత నేపథ్యంగా రచనలు సాగిస్తున్న వారిలో సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకరు. ఆయన ఇప్పటికే 7 నవలలు, రెండు కథా సంపుటాలను ప్రచురించినారు. సాహితీ క్షేత్రంలో ఆయన పండించిన మరో పంట ‘ఒంటరి’ నవల.  ఇది ‘తానా’ నవలల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది (2017). ఈయన స్వస్థలం కడప జిల్లా కాశినాయన మండలం బాలరాజు పల్లె. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు.

వ్యవసాయ విధ్వంస నేపధ్యంలో చోటు చేసుకుంటున్న ఆధునిక మార్పులు, వాటి కారణంగా కనుమరుగైపోతున్న తృణధాన్యాలు, మారుతున్న జీవన విధానంతో పాటుగా మనిషిని నీడలా వెంటాడుతున్న ‘ఒంటరి’తనం, ముంచుకొస్తున్న వింత జబ్బులు, ఈ రుగ్మతలకి ప్రకృతిలో పరిష్కారాన్ని వెతుక్కోవడంలో ఈ నవల ఎంచుకున్న విధం ఎంతో సందర్భోచితం అనిపించాయి.

నగర జీవితంలో నలిగిపోయి, శారీరకంగా శిధిలావస్థకు చేరుకున్న ఒక వైద్యుడు (డాక్టర్ రాఘవ) తన జబ్బుకు ‘ఆరికెల్లో’ పరిష్కారాన్ని వెతుక్కునే క్రమంలో ఒక మెట్ట ప్రాంతపు రైతును (రైతు నర్సయ్య) చేరుకోవడం, అక్కడ ఆ రైతు కుటుంబం ప్రకృతి ఆలంబనగా సాగించే కృషీవలత్వం చూడటం , చివరికి ఆయనకు అక్కడి ‘మాసుల’తో, ప్రకృతితో ఏర్పడ్డ ఆత్మిక, సజీవ సంబంధాలను  తెంచుకోలేక జరిగే మానసిక సంఘర్షణ నవలలోని ప్రధానాంశం.

“…ఇప్పటి నుంచి ఆరిక పంట సాగుకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా…ఎరువులకు డబ్బిస్తా…సేద్యాలకు డబ్బిస్తా…కలుపులకూ కోతలకూ కల్లంలో గింజలు రాల్చినందుకు అన్ని కూల్లకూ లెక్కగట్టి డబ్బిస్తా…నువ్వు చేసిన పనికి కూడా. ఒక్క రూపాయి నీ చేత ఖర్చు బెట్టించను” చెప్పాను. (డాక్టర్ రాఘవ ).

“పెట్టుబడిని పెద్దగా ఆశించే పైరు గాదులే సారూ యిది,” …” పాస్పేటు ఎయ్యాల్సిన పన్లే…పురుగుమందులు కొట్టాల్సిన పన్లే…విత్తేదానికి పదనయితే సాలు…పెరిగేదానికి ఒక వాన…పండేదానికి ఇంగోవాన…అంతే…” అన్నాడు( రైతు నర్సయ్య ).( పేజీ 44 ).

ఇరవయ్యేండ్ల కిందటి మాట. రాయలసీమలో పనులన్నీ అయిపోయినాక ఉగాది పండగకంతా పల్లెల్లో ‘మట్టిబండ్లు’ కట్టి వంకలోని ఇసికెనో, సెర్లో( సెరువులో ) మట్టినో సేండ్లకి తోలేవాళ్ళు. ఇసికెను ఒక కుప్పగా ఇర్సి (విడిచి), దాన్ని కొంచం నెరిపి మళ్ళా దానిపైన దిబ్బ లోని ప్యాడనో కల్లంలోని దుగ్గునో, కుళ్ళిన కట్టెనో( సెనిక్కాయ కట్టె ) ఇర్సే(విడిచే) వాళ్ళు . అట్లా ఒకదాని మీద ఒకటి నాలగైదు వరసలు తోలి ‘మండె’ కట్టేవాళ్ళు. దాన్ని మళ్ళా ఒకపక్క నుంచి బండితో సేనంతా కువ్వలిర్సి ‘తిరగదోలే’ వాళ్ళు . ఈ మొత్తం విధానాన్ని ‘సతవ’ తోలడం అనేవాళ్ళు. ‘మండెడుగు’ పైరు ఒక వాన తక్కువైనా తట్టుకుని పచ్చగుండేది.  అప్పుడు పాస్పేట్ తో పనిలేదు , యూరియా అవసరం లేదు. నర్సయ్య మాటల్లోనే ‘పెట్టుబడి’తో పనిలేదు. విత్తనాలు కూడా ఊర్లోనో లేదంటే పక్కూరు రైతులదగ్గరో కొనేవాళ్ళు. వెరసి పల్లెకు మార్కెట్ తో పన్లేదు. మార్కెట్ చక్రాల కింద నలగాల్సిన అవసరమూ లేదు.

కానీ అవన్నీ అంతరించిపోయాయి, అర్ధాంతరంగా. ఇప్పుడిదంతా ఒక గతం. మనోపలకంపై చెక్కబడి వెంటాడే జ్ఞాపకం.

“ఈ భూమ్మీంచి ఒక జాతి అంతరించిపోవడం ఎంత విషాదకరమో ఆమెకు అర్ధమయ్యేలా చెప్పలేకపోతున్నట్లుంది” ( పేజి 39 ).

“చివరి తోడేలు కూడా రేపో మాపో అనేట్టుంది”, అంటూ వాపోతాడు రైతు నర్సయ్య.

చివరి తోడేలు లాగే అంతరించే దశకు చేరుకున్న పల్లెను గురించి చెబుతూ, దానికి అంటగట్టబడ్డ అవసరాలను గురించి చెబుతూ..

నవల రచయిత

“చుట్టూ చేలు నడుమన ఊరు ఆనుకొనే రోజులు లోగడ. ఇప్పుడు ఇండ్ల మధ్యన రోడ్డుంటేనే ఊరు. టౌనుతో సుట్టరికం ఉంటేనే వూరు. రోడ్డు మీద మోజు.. బస్సు మీద మోజు.. పెద్దపులుల్ని తరిమినోల్లం ఈ రోడ్డు మోజుని తరమలేకపోయినం….” (పేజి 52 )  

“వరికుంట్ల గ్రామానికీ ఈ ఒంటికొట్టానికీ దూరం రెండు కిలోమీటర్లే. అయినా నాగరికతలో రెండు పదుల సంవత్సరాల తేడా ఉంది. అవసరాల ప్రాముఖ్యతనే నాగరికతగా భ్రమిస్తూ వుండటం…అది వేరే విషయం.“

“నగరాల్లో విచ్చలవిడిగా విస్తరించి ఉన్న అవసరాల ప్రతిబింబాలు వరికుంట్లలో కూడా ఉన్నాయి. ఆ పల్లె కూడలిలో జనాల అవసరాలు తీర్చేందుకు ఎన్ని అంగళ్లున్నాయనీ! ….. రహదారులు వాళ్లకు అవసరాల్ని అంటించినాయి”.

“ఆ నాలుగురోడ్ల కూడలిలో అవసరాలు అనుకున్నవేవీ ఒంటి కొట్టం వద్ద అవసరాలు కాలేకున్నాయి” ( పేజి 83 ).

“వరికుంట్ల వీధుల్లో తాగుబోతులు దండిగానే కనిపిస్తున్నారు. మద్యం బెల్టుషాపులు బడి గుడి పరిసరాల్ని కూడా వదలటంలేదు”. ( పేజి 85 )-

ఇది కేవలం వరికుంట్లకు మాత్రమే పరిమితమైన విధ్వంస దృశ్యం కాదు. దేశమంతా విస్తరించిన విశృంఖల చిత్రం. తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు దొరక్కపోవచ్చు గానీ, తాగి తలకు పోసుకునేంత మద్యం పల్లె ముంగిట పొర్లి  పారుతోంది. పల్లె పొలిమేరలు తాగి పారేసిన బీరు బాటిల్లతోనే, లేదంటే వాడి పారేసిన పురుగుమందు డబ్బాలతోనో ‘కలకల’లాడుతున్నాయి. ‘మందు’ కొట్టని వాడు అనాగరికుడు అనేటటువంటి ‘నాగరిక’ వక్రీకరణలు కూడా బయల్దేరాయి.  

పైన చెప్పినట్లు డబ్బు, హోదా , కావలసినన్ని సదుపాయాలతో నిరంతరం రద్దీగా ఉండే ‘నాగరిక’ జీవితంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించే ఒంటరితనం , శ్రమైక జీవన సౌందర్యంలో మనిషికీ ప్రకృతికి మధ్య ఉండే బలీయమైన ఆత్మిక సంబంధాలని ఈ నవలలో చూడవచ్చు. మన చుట్టూ ఉండే సున్నితమైన అంశాలను ఒడిసిపట్టి వాటిని అనుభూతి చెందడానికి మనకు కేవలం కళ్ళుమాత్రమే ఉంటే సరిపోదు, మన మనసుకు చూపుండాలి అంటుంది ఈ నవల. అందుకే మనం కోల్పోతున్న ‘స్పందన’ అనే సంపదను మరేదీ పూరించలేదని చెప్పకనే చెప్పే రచన ఇది.

“ఆరికె పైరుకు బరక నేలకు బో లంకెలే సారూ! పైరు పండేసరికి కుందేల్లు పిల్లల్జేసుకొంటాయి. జింకలు పొర్లేడతాయి. పైరుకోసేటప్పుడైతే బో కుశాలగుంటాదిలే…నాలుగు కర్రల్ను పెనేసి ఏదో పిట్ట గూడు కట్టుకొని ఉంటాది. గుడ్లు పెట్టుకోనుంటాది. ఆ గుమి కొయ్యకుండా వదిలెయ్యాల. ఆరికె పైరు రేగ్గంపా కలిసిపోయి బాగా మరుగున్న చోట కుందేలు పిల్లల్జేసుకోనుంటాది. కండ్లు కూడా తెరవని చంటి పిల్లలు….ఆ పొదనంతా తగలకుండా విడిసిపెట్టాల…….”( పేజి 44 )

“ అనుకున్నెంతా అయ్యింది దొరా! కబోదుల (చెట్టుకు వ్రేలాడుతూ కళ్లు మూసుకునే పక్షుల) మాన్లకు సంచకారం కూడా తీసుకొన్నాడు. రెండు మాన్లూ పదైదు వేలకు అమ్ముకున్నేడు. ..రేపటో మాపటో కొట్టకపోతారు. మందలు మందలు కబోదులుండాయి. వాటి వుసురు బోసుకుంటాడు. పాపంలో బడిపోతాడు నా కొడుకు…నేదరి పిల్లోల్లుండారు..వాటినికొట్టి ఆ సొమ్ముతో బతక్కుంటే- వూరూరా జోలెపట్టి అడుక్కుని బతుకుతేనేం..” అంటూ గోడు గోడు మన్నాడు ( పేజి 185 )

కాలం మళ్ళీ వెనక్కి తిరగదు. కరెంటు లేకుండానూ పోదు. బావుల్లో నీళ్లూరే పరిస్థితి దాదాపుగా లేదు. కపిలతోలే కాలం మల్లా రానే రాదు కానీ “కొన్ని తరాల సావాసం గదా! మనిషి ఇంతదూరం పయనమై వచ్చేందుకు వాటి సాయం ఎంతో ఉంది కదా! ఇంకొంత కాలమన్నా వాటిని గుర్తుపెట్టుకుందామనీ!…నా తరమన్నా…”( పేజి 127 )

అప్పుడే పొదిగిన కోడి  “బుల్లి పిల్లల్ని మునివేళ్ళతో తాకుతూ, అరచేతిలోకి తీసుకొని వేల్ల సందుల్నించి జారిపోతూ ఉన్న వాటిని మురిపెంగా చూస్తూ, ఓ కోడిపిల్లను చేతిలోకి తీసుకొని బుగ్గకు ఆనించుకుని మైమరిచిపోతూ…” (పేజి 92 )

“పుట్టిన జీవి మళ్లా పుట్టదు గదా! ప్రతి జీవి కొత్తగానే పుడుతుంది గదా! …” ఇలా ఇదంతా ఓ సజీవతత్వం, ఆ తత్వంలో అనుభవించే తన్మయత్వం..

అందుకే ఈ నవలలో కేవలం మనుషులు మాత్రమే పాత్రదారులు కారు. చెట్లూ , పిట్టలు, పశువులు, పొదలూ, వాగులు, కుంటలు ఇలా ప్రకృతి పురుడు పోసుకున్నెట్లుంటుంది.  అందులో వేటి భాష వాటికుంది. వేటి స్వరూప స్వభావాలు వాటికున్నాయి. అలాంటి వాటి మధ్య మెదిలే ‘మాసుల’కు తెలిసో తెలియకో ఇవ్వన్నీ వాళ్ళ స్వభావంలో భాగమౌతాయి. వాళ్ళని మనుషులుగా మలచడంలో వాటిపాత్ర ఎంతో ఉంది..బర్లతో మాట్లాడటం, ప్రకృతితో కొట్లాడటం ఇవ్వన్నీ అందుకే.

వానని కొలిచే మాటలు ( 103 ), పొద్దుతో పగటిని, చుక్కలతో రాత్రిని కొలవడం ( 104 ), సెనిక్కాయలు కాల్చుకొని తినడం( 193 ),  ఒదెగొరుకులు(206), జంగిడి గొడ్లు( 206 ), వొట్టి సియ్యలు(224 ), పట్టెడ, నేరగోల కట్టె(227), పడుగు(237), ఋతువులు, కార్తులు లాంటి మట్టి మాటలు, తడి పదాలు తారస పన్నెపుడు ఎప్పుడో తప్పిపోయిన బరుగుడ్డు తిరిగి ఇండ్లు చేరినప్పుడు కలిగే అపురూపమైన ఆనందం పొందవచ్చు.  బహుశా మరెక్కడా ముద్రణకు నోచుకోని అరుదైన పదాలు మనసుపై గాఢమైన ముద్రవేసి పోతాయి. వాటికి కొర్రకూడు మీద పుల్లగూర ఏసినట్లు రాయలసీమ యాస కూడా తోడై చదువుతుంటే శానా కమ్మగా ఉంటుంది. అంతేకాదు, రాయలసీమ ప్రజల్ని గత ఏడు దశాబ్దాలుగా మభ్యపెడుతూ, ‘వాళ్ళని శాశ్విత బిక్షగాళ్ళుగా’ మారుస్తున్న ప్రభుత్వాలపై (పేజి 162) విసిరిన నిరసన కూడా ఇందులో ఉంది.

కేవలం పంట దిగుబడి పైనే కాకుండా గ్రామాల్లో నిత్య జీవనానికి అవసరమైన ఆర్ధిక వనరుల్ని సమకూర్చే ‘పాడి’ ప్రాముఖ్యత ఎలాంటిదో, పాడి ఎందరు తల్లులను కష్టకాలంలో కనురెప్పలా కాపాడుకుంటూ వచ్చిందో, ఎందరు పిల్లల చదువులకు అది ఆదరువు అయ్యిందో చెప్పడానికి కింది  పంక్తులు చాలు.

“అదే ఆధారం అత్తా! ఆ పాలతోనే పిల్లోన్ని సదివిచ్చాండ. ఇప్పుడు మళ్ళా గొడ్డును కొనాలంటే నాతో కాదత్తా. ఆ ముండాకొడుకు ఎప్పుడూ తాగి సచ్చాండే. ఎట్టజేయ్యాలత్తా.” ( 102 )

ఇలాంటి స్వయం జీవనం కూడా నేడు ప్రమాదంలో పడింది.

“ఈ చేనంతా నువ్వొక్కదానివే ఎప్పుడు తవ్వకం పెట్టి కలుపుతీస్తావు తల్లీ?” అడిగాను( డాక్టర్ రాఘవ )

“ ఏంజెయ్యా? కూలోల్ల పిల్చుకోవాలంటే ఈ బెట్టకాలాల్లో లెక్కేడ తేవాల? చేసుకుంటా పోతాంటే వారానిగ్గాకుంటే పదిరోజులకు గట్టెక్కలేనా?” అంది. (85 )

ఏ విధంగా అయితే పదార్థ లక్షణాలు ఆ పదార్థ నిర్మాణంలోని అణువులపై ఆధారపడి ఉంటాయో, ఒక సమాజ ఆర్ధిక స్వభావం ఆ సమాజానికి పునాది అయినటువంటి కుటుంబ ఆర్ధిక పరిస్థితి పై ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాడన్నది ఆ మనిషిలోని 37 లక్షల కోట్ల జీవ కణాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం దేన్నయితే ‘సూక్ష్మ’మని చిన్నచూపు చూస్తున్నామో అదే దేనికైనా మూలమన్నమాట.

పెట్టుబడే పోషకంగా బ్రతికే బిలియనీర్ల బహుళజాతి కంపెనీలకి ఈ ‘సూక్ష్మ’వ్యవస్థలు, ‘చిరుధాన్య’ పంటలు అక్కర్లేదు.  ఎందుకంటే వాటి సాగు విధానంలో విత్తనాల కోసం గాని, ఎరువుల కోసం గాని, పురుగుమందుల కోసం గాని రైతు అటు ప్రభుత్వాల పైన గానీ ఇటు కార్పొరేట్ కంపెనీల పైన గానీ ఆధారపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి.  క్రయవిక్రయ సూత్రాలకు మార్కెట్ యంత్రాలకి అది రుచించదు. అందుకే అవి క్రమంగా మన పొలాల నుంచి దూరమయ్యాయి. దాంతో అవి మనం తినే ఆహారంలో నుంచి జారిపొయ్యాయి.

1950 దశకంలో దేశం మొత్తంగా 40% తృణధాన్యాల సాగు ఉండగా అది నేడు 10% గా ఉంది. మరోపక్క 2000 లో 3 కోట్ల మధుమేహం వ్యాధిగ్రస్తులుండగా అది కాస్తా 2015 కంతా 6కోట్ల పైచిలుకుకు చేరుకుందంటే దానికి ప్రధాన కారణం అదే.  

పురుగుమందులంటే ఏమిటో తెలియని గ్రామీణ రైతాంగం మందులు కొట్టకుంటే పంటలు పండవన్నంత మానసిక దాస్యంలోకి నెట్టివేయబడ్డారు. విత్తనాలపై మొన్సాంటో లాంటి గుత్తాధిపత్య కంపెనీల పెత్తనం, పండిన పంటపై దళారీల పెత్తనం, కాళ్ళ కింద భూమిపై కార్పొరేట్ సంస్థల పెత్తనం స్పష్టంగా కనబడుతోంది. అన్నీ వెరసి సాగులోని సమతుల్యం దెబ్బతింది. వీటన్నిటి పర్యవసానంగా దేశానికి పట్టుకొమ్మలు కావలసిన పల్లెలు నేడు సంక్షోభ సీమలయ్యాయి.

నవలలో ‘వివరణ’లు కొంత తగ్గించి పాఠకుడికి కూడా పని చెప్పింటే బాగుండేదనిపించింది. ముఖ్యంగా డాక్టర్ రాఘవ పాత్రకు సంబంధించి. నవలా సాహిత్యానికి  ‘రీడబిలిటీ’ అనేది చాలా ముఖ్యం. రచన కేవలం సీరియస్ రీడర్స్ నే కాకుండా సామాన్య పాఠకుల్ని కూడా ఆకర్షించగలగాలి. పాఠకుల గుండెపై ప్రగాఢమైన ముద్ర వేయగలగాలి. అప్పుడే ఆ సాహిత్యం రచయిత ఆశించే సామాజిక చైతన్యానికి, మార్పుకి తోడ్పడగలదు.

శ్రమ దోపిడీ గురించి గానీ , మరే ఇతర వివక్షల ప్రస్తావన ఈ నవలలో లేకపోయినప్పటికీ ఇంతటి సున్నిత స్వభావులైన మనుషుల ఆదరణకి  స్వయానా నర్సయ్య ముసలి తల్లి నోచుకోకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ ‘నిరాదరణను’ సమర్థించే బలమైన ఆధారాలు కూడా నవలలో ఎక్కడా కనిపించవు.

“ఆరికలు తయారవగానే నేనిక్కన్నుంచి బయల్దేరి తలకాడు సాధువు వద్దకు వెళ్ళాలి. ఆరికె ధాన్యంతో బాటు నా శరీరాన్ని కూడా ఆయన పాదాల వద్ద కుప్పగా చేర్చాలి”( పేజి 230 ). ఇలా అనేక అ’సందర్భాల’లో సాధువు ప్రస్తావనకు రావడమనేది కూడా కొంత ఎబ్బెట్టుగా ఉంది. ఆవు నుంచి ఓట్లు పిండుకునే కుట్రతో మనుషుల రక్తాన్ని తాగుతున్న మతోన్మాద పాలకులు రాజ్యమేలుతున్న కాలంలో ఇది చాలా ప్రమాదకర ధోరణి కూడా.!

ఒక ఇంటికి నిర్మాణంలో ఇటుకల పాత్రేమిటో బ్రతికున్న జీవి నిర్మాణంలో జీవకణాల పాత్ర అటువంటిదనీ , అలాంటి జీవకణాల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సూక్ష్మ పోషకాలు చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయని, అలాంటి  సూక్ష్మపోషకాలు వరి గోధుమలతో పోలిస్తే చిరుధాన్యాలలో 80-300% అధికంగా ఉంటాయని వైద్య సమాజం కంటే సాధు సమాజానికి ఎక్కువగా తెలిసింటుందనుకోడం అతిశయోక్తి.

రక్తంలో కలిసే గ్లూకోజ్ శాతం (గ్లైసీమిక్ ఇండెక్ష్) బియ్యంతో పోల్చుకుంటే చిరుధ్యాన్యాల్లో చాలా తక్కువగా ఉండటం వలన డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువని సాంకేతిక పరిజ్ఞానం చెబుతోంది. మరి అంతటి విలువైన ఆహార సంపదని విస్మరించి, బియ్యాన్ని, గోధుమల్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేయడం దేనికి అన్న ప్రశ్నకు నర్సయ్య లాంటి వ్యవసాయవేత్తల దగ్గరే సమాధానం దొరకవచ్చన్నది వేరే విషయం.

ముగింపు విషయంలో కూడా రచయిత కొంత జాగ్రత్త వహించింటే బాగుండుననిపించింది. “ ‘ఏమన్నావ్ సార్! ఒంటరిననా? కానిదెవరు ? గుంపులో ఉన్నప్పుడు ఒంటరితనం పోయినట్లనిపిస్తాది గానీ ఆలోచనలన్నీ  ఒంటరివే కదా సార్ “(పేజి 229). నిజానికి ఇవే నవలకు ముగింపు వాఖ్యాలు. వీటి తర్వాత కూడా నవల మరో 20 పేజీలు నడుస్తుంది. లేదంటే ఈ పేరాని చివరికి మార్చిండవచ్చు. రచయిత ఇలాంటివి ‘చిన్నచిన్న’ జాగ్రత్తలు తీసుకునింటే మరింత బాగుండేది.

ఏది అభివృద్దో, ఏది విధ్వంసమో నిర్ణయించుకోలేని సందిగ్ధ సందర్భంలో ఇలాంటి నవల రావడం ఎంతో ఆహ్వానించదగ్గ విషయం. కేవలం ‘మార్కెట్ వెలల’ ప్రాతిపదికన కాకుండా ‘మానవీయ విలువల’ ప్రాతిపదికన జరిగే ఉత్తమ సమాజ నిర్మాణానికి ఇలాంటి సాహిత్యం ఎంతో అవసరం. ఈ నవలను అందించిన రచయితకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి రచనలు మరెన్నో రావాలనే ఆశతో……

  • సోదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సోదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటాడు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, మరియు రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితం అయ్యాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

5 comments

  • సమీక్ష బాగుంది శ్రీకాంత్. ఏది అభివృద్ధో ఏది విధ్వంసమో స్పష్టంగా తెలుసు. ప్రభుత్వాలు మభ్యపెడుతున్నాయి. అంతే.

  • చాలా మంచి సమీక్ష అన్నా.. మోహమాటాలకు పోకుండా మంచి సలహాలు ఇవ్వగలిగినందుకు సంతోషిస్తున్నాను. ఈ సమీక్ష చదువుతున్నప్పుడు ఒంటరి నవలలో ఉన్న పచ్చదనమేదో నన్ను పిలుస్తున్నట్లనిపించింది. తప్పకుండా చదువుతాను. Thank you

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.