కర్నూలులో కథల సందడి

సాంప్రదాయ సాహిత్య సమావేశాలకూ, పద్య నాటకాలకూ, అవధానాలకూ నెలవైన చోట కథ సామాజిక ప్రయోజనం కోసమే అని నమ్మి ఆధునిక కథను భుజాలకు ఎత్తుకుని మోసిన నిన్నటి కథాసమయం మిత్రులనుండి సాహిత్యాంశంగా  కథకు పెద్ద పీట వేస్తున్న కర్నూలు నగరంలో 2018 ఏప్రిల్ 28, 29న ‘కర్నూలు కథామిత్రులు’ ఒక కార్యశాలను నిర్వహించారు. కథా సమయం సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడ అప్పుడప్పుడు నిర్వహిస్తున్న ఈ సమావేశాలు విజయవంతం ఆయ్యేందుకు… ప్రణాళికాబద్దంగా నిర్వహించడం ఒక కారణమైతే కథకోసం కర్నూలు వచ్చే కథకులూ, కథాభిమానులూ మరొక కారణం.

రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలలనుండీ కథా కార్యశాలకు వచ్చిన మిత్రులు సమావేశాలలో ఆసక్తిగా పాల్గొన్న తీరు ఆధునిక కథ పట్ల తెలుగు కథకులకు ఉన్న మమకారాన్ని మరొక్కసారి రుజువు చేసింది.

కథా మిత్రులు కథా కార్యశాల ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచీ సామాజిక మాధ్యమాలలో, దినపత్రికల సాహిత్య విభాగాలలో విడుదల చేసిన ప్రకటనలు వినూత్నంగా ఉండి కథకులను ఉత్సాహ పరిచాయి. ప్రకటనలలో కథా కార్యశాలలో చర్చకు వచ్చే అంశాలను మాత్రమే ప్రకటించారు గానీ చర్చలో పాల్గొనే ఉపన్యాసకుల పేర్లను ప్రకటించకపోవడం ఒక వినూత్న ప్రయోగం.

సమావేశంలో నిర్దేశిత అంశాలన్నీ చర్చా పద్దతిలో సాగడం కథా కార్యశాలకు మరొక అదనపు అలంకారమైంది.

కర్నూలులో జరిగే కథా సమావేశాలకు ఒక ప్రత్యేక ఒరవడి ఉంది. సమావేశాల స్వరూప స్వభావాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ నూతన విషయాలను చేర్చుకుంటూ కథకులకు స్పూర్తినివ్వగల ప్రణాళికతో అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. క్రితం సారి జరిగిన సమావేశంలో కథకులు తాము రాసిన కథలలో ఉత్తమమైన ఒక కథను చదివి దాని నేపథ్యాన్ని వివరించగా ఈ సారి సమావేశంలో చర్చ మొత్తం కథా నేపథ్యం పైనా, కథాంశాల పైనే జరిగింది.

మొదటి రోజు కథా రచయితల స్వ పరిచయాలతో ప్రారంభమైన సమావేశం ఆనంతరం చిన వీరభద్రుడు గారు  ఇరవై ఒకటవ శతాబ్దం వరకు మారిన కథా రూపాలను గురించి వివరించారు. ఆయన ఉపన్యాసంలో కథాసరిత్సాగరం నుంచి కాలానుగుణంగా మారుతూ వచ్చిన కథా వస్తువులు, కథా కథనాల గురించి ఆసక్తిగా సాగింది. భోజనానంతర సమావేశంలో ‘సమకాలీన సమాజంపై కథ ప్రభావం’ అనే అంశంపై చర్చను ఆహ్వానించారు. సమావేశానికి హాజరైన కథకులందరూ పాల్గొన్న ఈ చర్చ ఆ సాయంత్రం ఆరు గంటలవరకు కొనసాగింది. ప్రధానంగా కథ ప్రయోజనం గురించీ, సమాజానికీ కథకూ పరస్పర ప్రభావాల గురించీ నడిచిన చర్చ కథకులను ఆలోచింపజేసింది. ఆ సాయంత్రం ఇండస్ స్కూలు ఆవరణలోని పచ్చిక మైదానంలో కథకుల మధ్య జరిగిన సాహిత్య సంభాషణలూ, కథకులు పాడిన పాటలూ ఆ సాయంత్రాన్ని మరింత ఆసక్తికరంగా తయారు చేశాయి. యువ కథకులూ, సాహిత్య పరిశోధనలో ఉన్న విద్యార్థులూ సాహిత్య సమావేశంలో వేదిక పైనుండి తెలుసుకున్న విషయాల కన్నా సమావేశాల అనంతరం రచయితల గోష్టులలో చర్చించిన అంశాలు తమకు ఎక్కువ ఉత్సాహాన్ని ఇచ్చాయని మరు రోజు సమావేశ విరామ సమయాలలో ప్రకటించారు.

రెండవ రోజు మొదటి సమావేశాన్ని ‘కథ – సమకాలీనత, సర్వకాలీనత’ అనే అంశంపై వాసిరెడ్డి నవీన్ ప్రారంభించారు. సామయికంగా విషయాలు కథలలో చోటు చేసుకున్నప్పుడు అవి మానవ సంబంధాల ప్రేరణతో కథగా నడిచిన మేరకు ఆ కథకు సర్వకాలీనత సిద్ధించవచ్చునని కథలలోని తాత్విక అంశం కథలకు సమకాలీనతతోపాటు సర్వకాలీనతను కూడా ఇస్తుందని కథకులు అభిప్రాయపడ్డారు. రెండవ సమావేశంలో ‘ఇరుగు పొరుగు కథల’ పోకడలను పరిశీలించ వలసిన అవసరాన్ని సమావేశం చర్చించింది.

భోజన విరామం తర్వాత ‘కథ నుండి నవల ప్రయాణం’ అనే అంశంపై సాగిన చర్చ కథనుండి నవలకు రచయితల ప్రయాణాన్ని గురించి చర్చించింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నవల నుండి తక్కువ నిడివిగల అంశాన్ని అందించేందుకు పుట్టిన ఆధునిక కథ పెరిగి నవలకు ప్రేరణ ఇవ్వగలదని రచయితలు భావించడం. సమాజం అభివృద్ధితో ముడిపడిన అనేక అంశాలతో సంక్లిష్టతను సంతరించుకుంటున్న కొద్దీ తదనుగుణంగా మారవలిసిన రూపాలు కథకులకు కొత్త సవాళ్ళను విసురుతున్నాయి. తెలుగు కథలలో సరళతను మాత్రమే చూసిన కథకులు సంక్లిష్టమైన అనేక విషయాలను చెప్పడానికి కథ నుండి నవలకు ప్రయాణాన్ని కోరుకుంటున్నారని ఈ సమావేశం సూచించిందా  అనిపించింది.

‘పిల్లల కథలు ఎందుకు రాయరు’ అనే చర్చతో ప్రారంభమైన చివరి సమావేశంలో పిల్లల  కథలు ఎందుకు రాయడం లేదు? అని పిల్లల కథా రచయిత దాసరి వెంకటరమణ సవాలు విసిరారు. ఒక్కొక్క కథకుడికి ఎదురైన ఈ ప్రశ్నకు కథకులు సానుకూలంగా స్పందించారు. వాసిరెడ్డి నవీన్ మాట్లాడుతూ తను ఒక సాహిత్య కార్యకర్తను మాత్రమేననీ పిల్లల కథలు పెంపొందడానికి తన వంతు కృషి చేస్తాననీ అందులో భాగంగా బాలల కథా కార్యశాలలూ, శిక్షణా శిబిరాలూ ఏర్పాటు చెయ్యగల అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

సమావేశాలకు హాజరైన చాలామంది కథకులు భోజన వసతి ఏర్పాట్ల పట్ల కథా కార్యశాల నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యశాలల నిడివి పెంచవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కథా కార్యశాల జరుగుతున్న సమయంలో క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కోసం ఆజీవాంతం పనిచేసిన మాస్టర్ విజయకుమార్ కొడుకు క్రాంతి వేసిన వర్ణ చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రాంతి వర్ణచిత్రాలలో కొన్నింటిని కథకులు కొనుగోలు చెయ్యడం కూడా క్రాంతి ప్రతిభను విశదపరిచింది.

 

గాయత్రి – చంద్రశేఖర్.

కర్నూలు.

గాయత్రి-చంద్ర శేఖర్

గాయత్రీ దేవి: పుట్టడం, చదవడం, పెళ్ళీ, ఉద్యోగం... అన్నీ కర్నూలు పట్టణంలో. ప్రస్తుతం ఒక ప్రైవేటు స్కూలులో టీచర్ గా ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. 50 కి పైగా పిల్లల కథలతో కలిపి సుమారుగా 60 కథలు వ్రాశారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో డజనుకు పైగా వ్యాసాలూ వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన కథలూ ప్రసారమయ్యాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.