కాకులూ, గంధపు చెట్లూ

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథాశిల్పం గురించి కొన్ని ఆలోచనలు

‘కథలంటే వింతవిషయాలే గదా’

(‘ఆర్ముగం-అనంతలక్ష్మి’కథలో కథకుడు)

 

పెద్దిభొట్ల సుబ్బరామయ్య (1938-2018) ఆధునిక తెలుగు కథని రెండడుగులు ముందుకు నడిపించిన కథకుడిగా తన జీవితకాలంలోనే గుర్తింపు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారంతో పాటు వివిధ గౌరవాలూ, విమర్శకుల ప్రశంసలూ ఆయనకు లభించాయి. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రగతిశీల భావాలూ, అభ్యుదయ దృక్పథం ఉన్న రచయితగా ఆయనకు ప్రకాస్తి పొందాడు.

ఆయన కథలు రెండవ సంపుటానికి (2010) మరొక ప్రసిద్ధ అభ్యుదయ రచయిత కేతు విశ్వనాథ రెడ్డి ముందుమాట రాస్తూ ఇలా అన్నాడు:

‘పెద్దిభొట్ల నాల్గవ తరం తెలుగు కథకుడు. స్వాతంత్ర్యా నంతరం వచ్చిన సామాజిక మార్పును, పరివర్తనను అనుభవించినవాడు. దిగజారిపోతున్న ఆర్థిక స్థితిగతుల్ని,పట్టణీకరణ, అమానవీయ పరిస్థితుల్ని గమనించిన పెద్దిభొట్ల బడుగుజీవుల బతుకు బాధల్ని విన్నంత,కన్నంత అక్షరీకరించారు. పట్టణీకరణ నిజమైన అభివృద్ధికి చిహ్నం కాదు. పట్టణీకరణ క్రమంలోని అధోజగత్తు విస్తరీకరణ, చీకటి నేరసామ్రాజ్య వికాసం, సనాతన వృత్తుల్లోని వారు కూడా కౄరవాణిజ్యసంస్కృతిముందు మోకరిల్లే స్థితి, విషమయ వస్తు సంస్కృతి-కథకుడిగా పెద్దిభొట్లను కలిచివేసిన అంశాలు. అయితే పెద్దిభొట్ల రచయితగా నిరాశావాది కాదు. ఒకరకంగా చెప్పాలంటే విమర్శ్నాత్మక వాస్తవికావాది.’

దాదాపుగా పెద్దిభొట్ల కథల పట్లా, ఆ కథలద్వారా ఆయన వ్యక్తం చేసిన జీవితదృక్పథం పట్లా సమకాలిక తెలుగు సాహిత్య ప్రపంచం అంచనాలను ఈ వాక్యాలు ప్రతిబింబిస్తున్నాయని చెప్పవచ్చు. కాని,పెద్దిభొట్లని ఒక విమర్శనాత్మక వాస్తవికతావాదిగా పరిగణించడం ద్వారా ఆయనలోని ప్రత్యేకతను, ఆయన తెలుగు కథకు అందించిన విశిష్ఠ ఉపాదానాన్ని తెలుగు విమర్శకులు గుర్తుపట్టలేకపోయారనే చెప్పాలి. ఈ అంశాన్ని వివరించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.

వాస్తవికతావాదం అంటే ఏమిటి?

వాస్తవికతావాదం (రియలిజం) పందొమ్మిదో శతాబ్దపు యూరోప్ లో తలెత్తిన ఒక కళా ఉద్యమం. ముందు చిత్రకళలో మొదలైన ఆ ఉద్యమం తర్వాత రోజుల్లో సాహిత్యంలో కూడా గణనీయమైన స్థానాన్ని ఆక్రమించింది. ఇరవయ్యవ శతాబ్దంలో మరెన్ని కళా ఉద్యమాలు తలెత్తినప్పటికీ, వివిధ రూపాల్లో ప్రధాన స్రవంతి కళాతాత్త్వికధోరణిగా వాస్తవికతావాదమే కొనసాగుతూ వచ్చింది.

వాస్తవికతావాదమంటే చుట్టూ ఉన్న జీవితాన్ని యథాతథంగా చిత్రించడం కాదు. అలా చిత్రించడం నాచురలిజం అనిపించుకుంటుంది. చుట్టూ ఉన్న జీవితాన్ని పట్టుకోవడంలో, చిత్రించడంలో, సామాన్యమానవుడిమీద దృష్టి పెట్టి, అతడి సాధారణ, దైనందిన జీవితాన్ని చిత్రిస్తూ, ఆ చిత్రణ విశ్వసనీయంగా ఉండటానికి, వీలైనన్ని వివరాల్ని అందిస్తూ, ఒక సాదృశ్యభావనను (verisimilitude) కలిగించడం వాస్తవికతావాదధోరణి ముఖ్య లక్షణం. హేతువుమీదా, కార్యకారణసంబంధం మీదా ఆధారపడ్డ ప్రాపంచిక దృక్పథం అది. మనుషుల జీవితాల్ని ఆర్థిక సంబంధాలు నిర్ణయిస్తాయనీ, రచయితలు తామే వర్గానికి చెందినవారో, తామెవరి జీవితాల్ని చిత్రించాలనుకుంటున్నారో ఆ వర్గస్పృహ కలిగి ఉండాలనీ, సామాజిక జీవితాన్ని నిశితవిమర్శకు గురిచెయ్యడమే రియలిస్టు కళాకారుడు ఆశించే సాహిత్యప్రయోజనమనీ రియలిజం భావిస్తుంది.

రియలిజం గురించి యూరోప్ లో వచ్చిన చర్చలో అంతగా ప్రముఖంగా కనిపించనదీ, తెలుగులో మటుకే ఒక ప్రత్యేక భావనగా రూపొందిందీ, విమర్శనాత్మక వాస్తవికత అనే పదం. నిజానికి రియలిజాన్ని నాచురలిజం నుంచి వేరు చేసేది ఈ విమర్శనాశీలమే. కాని తెలుగు విమర్శకులు విమర్శనాత్మక వాస్తవికత అనే ధోరణిని ఒకదాన్ని ఊహించడమే కాకుండా, గురజాడని దానికి ఆద్యుడిగా కూడా పేర్కొంటూ వచ్చారు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో గోపీచంద్ కొంతవరకూ, కొడవటిగంటి కుటుంబరావు చాలావరకూ ఈ విమర్శనాత్మక వాస్తవికతకు ప్రతినిధి రచయితలుగా గుర్తింపుకొచ్చారు. ముఖ్యంగా, వామపక్ష భావజాలం కలిగి,జీవితాన్ని వర్గస్పృహతోనూ, శాస్త్రీయ దృక్పథంతోనూ సమీపిస్తూ, తమ చుట్టూ జరుగుతున్న సామాజిక పరివర్తనని విమర్శనాత్మకంగా చిత్రిస్తూ, పాఠకుల్లో ఒక అవగాహన కలిగించే రచయితలకి కుటుంబరావు ఒక కొండగుర్తుగా మారిపోయేడు. ఇప్పుడు పెద్దిభొట్లను అంచనావేస్తూ కేతు విశ్వనాథరెడ్డి చెప్పిన మాటల వెనక కుటుంబరావు అనే ఒక కథకుడు రోల్ మోడల్ గా ఉన్నాడని మనం గుర్తించవచ్చు.

కాని తెలుగు రచయితలు, కుటుంబరావుతో సహా, నిజంగా రియలిస్టు రచయితలేనా, యూరోప్ లో రియలిస్టు రచయితలుగా చెప్పదగ్గ బాల్జా, డికెన్సు, ఫ్లాబే, జోలా, టాల్ స్టాయి, చెకోవ్ వంటి రచయితల స్థాయిని వారెవరన్నా అందుకోగలిగారా అన్నది చర్చనీయాంశం. ఇప్పుడు నేనా చర్చ లేవనెత్తబోవడం లేదు. కాని కథకుడిగా పెద్దిభొట్ల విశిష్ఠత అటువంటి దృక్పథానికి లోబడ్డ వాస్తవిక రచనలు చేయడంలోకాక, వాస్తవికతావాద సూత్రాల్ని ఉల్లంఘించడంలో ఉందన్నదే నేను చెప్పాలనుకున్నది.

వాస్తవికతావాదం పరిమితులు

యూరోప్ లోనూ, అమెరికాలోనూ కూడా వాస్తవికతావాదం మీద తిరుగుబాటుగా వచ్చిన కళా ఉద్యమాలు, ప్రపంచయుద్ధకాలానికి కొద్దిగా ముందూ వెనకా వచ్చిన  ఇంప్రెషనిజం, మాడర్నిజం, ఎక్స్ ప్రెషనిజం, సర్రియలిజం , ఇరవయ్యవశతాబ్దపు చివరిదశాబ్దాల్లో వచ్చిన మాజికల్ రియలిజం ప్రధానంగా రెండు అంశాల్ని లేవనెత్తాయి.

మొదటిది, రియలిస్టు కథకుడు ఒక సర్వజ్ఞ కథకుడిలాగా తనకి అన్నీ తెలుసునన్నట్టు, ప్రతి ఒక్క వివరాన్నీ, తాను ఆ ఘటనాస్థలంలోలేకపోయినా కూడా చెప్తాడు, అది అవాస్తవమనేది.

రెండవది, జీవితగతి మనకు తెలిసిన లేదా మనం ఊహిస్తున్న కార్యకారణసంబంధం ప్రకారం, లేదా భౌతికశాస్త్ర చలనసూత్రాలప్రకారమే నడవట్లేదనీ, మనం ఊహించని విధంగా  ప్రకృతికశక్తులూ, సామాజిక శక్తులూ కూడా పనిచేస్తున్నాయనీ, వాటిని పట్టుకోవడమే కళా ప్రయోజనమనీ వాదించడం.

కార్యకారణసూత్రాల ప్రకారం ప్రపంచాన్ని వివరించడం ప్రాకృతిక,సాంఘిక శాస్త్రాలు చేసే పని. కాని, ఆ సూత్రాలు ఎక్కడ విఫలమవుతున్నాయో, ఎందుకు విఫలమవుతున్నాయో దాన్ని విమర్శించడం కళాకారుడి, సాహిత్యకారుడి పని. ఈ పని చెయ్యగల రచయితల్నే ఇరవయ్యవ శతాబ్దపు పాశ్చాత్య సాహిత్యం మార్గదర్శకులుగా భావించింది. అంటే ఈ రచయితలు కార్యకారణసంబంధాన్నీ, శాస్త్రీయ దృక్పథాన్నీ తిరస్కరిస్తారని కాదు. వాటిపట్ల వారికి గొప్ప నమ్మకం ఉంటుంది.  కానీ, జీవితాన్నీ, మానవప్రవృత్తినీ మరింత విశ్వసనీయంగా వివరించగల మార్గాల కోసమే వారి అన్వేషణ సాగుతుంది.  గత శతాబ్దపు చివరిరోజుల్లో ప్రపంచమంతా కార్చిచ్చులాగా వ్యాపించిన మాజికల్ రియలిజం తాపత్రయమిదే: ఎంత చెప్పినా, ఎంత వివరించినా, జీవితంలో ఎంతో కొంత సశేషంగానూ, విశదీకరణకు అందకుండానూ మిగిలిపోతోందన్నదే.

తెలుగులో కూడా ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తిన రచయితలు లేకపోలేదు. కాని, ఇక్కడ, సంప్రదాయ, ఆధునిక శిబిరాలు స్పష్టంగా ఒకదానికొకటి ఎదురెదురుగా మోహరించినందువల్ల, ఒకవేళ ఎవరేనా ఆధునిక రచయిత, శాస్త్రీయ దృక్పథానికి కూడా అందకుండా జీవితం ఉండగలదనే మాట చెప్పినట్టయితే,అతణ్ణి తిరోగామిగానో, అభ్యుదయ వ్యతిరేకిగానో భావించే ప్రమాదం ఉంది. చివరికి, తెలుగులో మాజికల్ రియలిస్టు కథలు రాసారని చెప్పుకునే రచయితలు కూడా తమ రచనల్లో ‘మాజిక్’ కన్నా ‘లాజిక్’కే పెద్ద పీట వెయ్యకతప్పలేదు.

కాని, అభ్యుదయ శిబిరానికి చెందిన రచయితల్లోకొనసాగుతూనే, ఈ ధోరణి వ్యక్తం చేయడమే కాకుండా, దీన్నొక బాధ్యతగా నెరవేరుస్తూ వచ్చిన రచయిత సుబ్బరామయ్య.

అతడి రంగులపెట్టె చాలా పరిమితం

సుబ్బరామయ్య 350 కథలు రాసాడని అంటారు. కాని,ఆయన కథాసంపుటాలు మూడింటిలోనూ మొత్తం 76  చిన్న కథలూ, రెండు పెద్ద కథలూ ఉన్నాయి. మూడవసంపుటంలో నాలుగు కథలు మొదటి రెండు సంపుటాల్లోనూ వచ్చినవే. కాబట్టి, ఈ కథల మేరకు ఆధారపడే నేను నా ప్రతిపాదనలు చేయబోతున్నాను.

సుబ్బరామయ్య కూడా తక్కినవాస్తవికతావాద రచయితల్లాగా సామాన్యమానవుణ్ణీ, ముఖ్యంగా పట్టణీకరణలో భాగంగా పెరుగుతున్న అధోజగత్ నీ చిత్రించిన మాట నిజమే కాని, ఆ జీవితం చాలా పరిమితమైన ప్రపంచం. చిత్రలేఖనభాషలో చెప్పాలంటే ఆయనది చాలా limited palette. దాదాపుగా ఆ కథలన్నిటికీ నమూనాగా ఉన్నదొకటే కథ.కథకుడో లేదా కథకుడు చిత్రించే మనుషులో రైల్వే ఉద్యోగులై ఉంటారు. వాళ్ళ ముందు తరం స్వాతంత్రోద్యమంలో పోరాడి తమ ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుని పిల్లలకి చదువులు కూడా చెప్పించుకోలేకపోయినవాళ్ళు. తాను నమ్మినదానికోసం తన సర్వస్వం పోగొట్టుకున్న ఆ స్వాతంత్ర్య యోధుడు తనకి కొడుకు పుడితే గాంధీ అనీ, కూతురు పుడితే స్వరాజ్యలక్ష్మి అనీ పేరుపెట్టాలనుకుంటాడు. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్ది, రెండు దశాబ్దాల తరువాతఅతడు చెప్పే కథ మొదలవుతుంది. కొత్త పాలకవర్గం దోపిడీదారులుగానూ, స్వాతంత్ర్య పోరాటకాలం నాటి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చేవాళ్ళుగానూ ఉండే రోజులు. ఆకలి, అవినీతి, దారుణమైన పేదరికం,ఎడతెగని క్యూల మధ్య నడిచిన అరవైల్లోనూ, డెబ్భైల్లోనూ నడుస్తాయి ఆ కథలు.

బహుశా సుబ్బరామయ్య ఈ జీవితాన్ని మరింత విస్తృతితోనూ, మరింత వైవిధ్యంతోనూ చిత్రించి ఉంటే రావిశాస్త్రిలాంటి కథకుడు అయి ఉండేవాడు. నిజానికి అతడి కథల్లో చాలావరకూ కనిపించే మధ్యతరగతి జీవితం అరవైల నాటి చాలమంది కథకులు చిత్రించిన జీవితమే. కాని, అరవైల చివరికి వచ్చేటప్పటికి కళింగాంధ్ర కథ కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి చేతుల్లో ఒక పెద్ద మలుపు తిరిగింది. అది గ్రామీణ, దళిత జీవితసంఘర్షణకు మరింత చేరువగా జరిగి, మరింత చలనశీలంగా మారింది. కాని,అదే సమయంలో, పెద్దిభొట్ల కథ, వాస్తవికతావాద పరిమితుల్ని దాటి, మరొక రకమైన చలనశీలతను సంతరించుకుంది.

కొత్త చలనశీలత

పెద్దిభొట్ల కథల్ని తక్కిన కథలనుంచి ప్రత్యేకంగా నిలబెట్టిన ఈ లక్షణం, ఆ కథల్లో ఆయన వర్ణించిన, చిత్రించిన సంఘటనల్లోని strangeness. ఒక వింత. మామూలు వాస్తవికతావాద సూత్రాలు ఆ వింతను పట్టుకోలేవు. ఒకవేళ అటువంటి వింతను చూసినా చిత్రించడానికి ఉత్సాహపడవు. ఎందుకంటే, ఆ వింత కార్యకారణ సంబంధాన్ని పక్కకునెట్టేసే ప్రమాదముంది. కాని, కథ వెనక కథలో,  సుబ్బరామయ్య మనుషుల్లో, వాళ్ళ ప్రవర్తనలో, సంఘటనా క్రమంలో ఆ వింతని అన్వేషిస్తోనే ఉన్నాడు. ధైర్యంగా చిత్రిస్తోనే ఉన్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే,  తన కథల్లో చూపించిన bizarreలక్షణం వల్లనే తన కథల్తో పాఠకుల్ని కట్టిపడేస్తో వచ్చాడు.

ఆ వైచిత్రి ఒక్కో కథలో ఒక్కోలా ఉంటుంది. నిజానికి ఆ వైచిత్రి ఒక్కటే ఆయన కథల్లో ఒకదాన్నుంచి మరొకటి వేరుచేసేది. ఆ విచిత్రమైన, ఆ వింత విషయం మినహా,ఆ కథలన్నీ ఒక్కలాంటి కథలే. కాని, ఆ కథల్లో కనిపించే ఆ వింత మాత్రం మనం ఊహించలేనిది. మనం భావించగల సంభావ్యతలన్నిటినీ తోసిరాజనేది.

అది ‘ముసురు’కథలోలాగా భరించలేని బీదరికంలో, డబ్బుకోసం కాయకిరసనాయులు తాగడానికి పందెం కట్టడంలో ఉంటుంది. మద్యనిషేధం రోజుల్లో వచ్చిన రావి శాస్త్రి ‘ఆరుసారా కథలు’ చూడండి. అందులో ఇటువంటి bizarre సంఘటన ఒక్కటి కూడా కనిపించదు. అవన్నీ మనం ఊహించలిగిన జీవితానికి అనుగుణంగానే ఉంటాయి. కాని, తాను ప్రేమించి, దేశంకాని దేశానికి తెచ్చుకున్న తన భార్యని పోషించుకోడం కోసం,రెండు రూపాయలొస్తాయన్న ఆశతో, కాయ కిరసనాయులు తాగడానికి పందెం కట్టడంలో,అసలు అటువంటి ఒక సంఘటనని ఊహించడంలో, చిత్రించడంలో, సాధారణ తర్కాన్ని మించిన సాహిత్య తర్కం ఉంది.

‘ఎక్ స్ట్రా’కథలోలాగా,  తనను ప్రేమిస్తున్న ఒక స్త్రీ మెళ్ళో బంగారు గొలుసు కాజేసి తాను అభిమానిస్తున్న సినిమా నటి వివాహం చూడటానికి వెళ్ళిన వేలాయుధం ప్రవర్తనలో కనిపించేది ఆ ఊహాతీత లక్షణమే. ఆ కథలో ఆ ముందూ, ఆ తర్వాతా చిత్రించిన జీవితంలో విశేషమేమీ లేదు. దాదాపుగా అధోజగత్ లోకి ఒరిగిపోతున్న సాధారణ జీవితమే. కాని ఆ ఒక్కసంఘటన ఆ కథను సాధారణవాస్తవికతావాద కథనుంచి ఒక అడుగు పైకి లేపి నిలబెట్టింది. అట్లానే, ‘గాలి’ కథ. గాలికోసం ఒక మనిషి అల్లాడి చనిపోతాడనీ, ఆ మనిషికి ఒక ఫాను సమకూర్చడంకోసం అతడి కూతురు తన శరీరాన్ని తాకట్టుపెట్టడానికి సిద్ధపడుతుందనీ మనం ఊహించగలమా? ‘కోరిక’ కథ చూడండి. అందులో ఎప్పుడో తన భర్త చిన్నపాత్రలో నటించిన సినిమా చూడటంకోసం ఒక వృద్ధురాలు ఎట్లానో తాపత్రయపడి వెళ్తే తీరా ఆ సన్నివేశం వచ్చేటప్పటికే ప్రమాదం జరిగి ఆ దృశ్యం ఆమె చూడలేకపోవడాన్ని ఏమనాలి? అది కార్యకారణసంబంధాన్నివివరించే కథనేనా?

గొగోల్ తోనే ఈ లక్షణం మొదలయ్యింది

సాధారణ జీవితంలోని అసాధారణతను చిన్నచిన్న ఆశాభంగాల్లో చూపడంలో ఒక grotesque లక్షణం ఉంటుంది. మనకి బాగా పరిచయమైనదాన్ని defamiliarizeచెయ్యడం కాదిది. అసలు మనం ఊహించని తావుల్లో జీవితాన్ని పట్టుకోవడం, చూపించడం. అలా చూపించడం ద్వారా మనల్ని నివ్వెరపరచడం. అసలు రియలిజానికి ఆద్యుడని కీర్తించబడ్డ గొగోల్ నుంచే ఈ ధోరణి మొదలయిందని సాహిత్యవిమర్శకులు అంటున్నారు.

రష్యన్ సాహిత్యం మీద చేసిన ప్రసంగాల్లో నబొకొవ్, గొగోల్ ‘ఓవర్ కోటు’ (1842) కథ గురించి ఎత్తుకుంటూనే ఇలా అన్నాడు:

‘గొగోల్ ఒక విచిత్రమైన (strange) ప్రాణి. కాని ఆ మాటకొస్తే ప్రతిభ కూడా ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. ఆరోగ్యవంతుడిగా ఉండే రెండోరకం సాహిత్యకారుడు మాత్రమే విధేయుడైన తన పాఠకుడికి పాతకాలపు విదురనీతి బోధించాలనుకుంటాడు. జీవితం గురించి పాఠకుడు తనకై తాను ఏర్పరచుకుంటున్న అభిప్రాయాలకి చేయూతనిస్తూంటాడు. గొప్ప సాహిత్యం మాత్రమే అహేతుకత్వం (irrational)అంచుల్లో కదలాడుతుంటుంది.  హామ్లెట్ నే తీసుకోండి. అదొక న్యురోటిక్ పండితుడు భీకరస్వప్నం. గొగోల్ ఓవర్ కోట్  కూడా ఒక వికృతమైన, కఠోరమైన పీడకల. వెలిసిపోయిన జీవితనిర్మాణంలో నల్లటిమచ్చల్ని బయటపెట్టే పీడకల. ఆ కథని పైపైన చదువుకుంటూ పోయే పాఠకుడికి అందులో ఒక హాస్యాడంబరం మటుకే కనిపిస్తుంది. లేదా దాన్ని గంభీరంగా చదవాలనుకున్నవాడికి రష్యన్ బ్యురోక్రసీని ఎండగట్టడంకోసమే గొగోల్ ఆ కథ రాసాడనిపిస్తుంది. కాని, కేవలం నవ్వుకోడానికో, లేదా తనని ‘ఆలోచింపచేసే’ పుస్తకాలకోసం వెతుక్కునేవాడికో ‘ఓవర్ కోటు’ కథ నిజంగా దేనిగురించో అర్థం కానే కాదు. వాళ్ళిద్దరూ కాక, ఒక సృజనాత్మకపాఠకుణ్ణి నాకు చూపించండి. ఈ కథ అతడికోసమేనంటాను.’

నిజానికి, నబొకొవ్ చేసిన ఈ ప్రసంగం గొగోల్ ని అర్థం చేసుకోవడానికి ఎంత అవసరమో, పెద్దిభొట్లని అర్థం చేసుకోవడానికి కూడా అంతే అవసరం. ఈ ప్రసంగంలో మొదటి భాగమంతా ఇక్కడ ఎత్తిరాయవలసి ఉంది. స్థూలంగా చెప్పాలంటే, ఓవర్ కోటు  కథద్వారా గొగోల్ మన హేతుబద్ధ ప్రపంచం ఒక పక్కకి అకస్మాత్తుగా ఒరిగిపోవడాన్ని చిత్రించాడంటాడు నబొకొవ్. అందుకనే, తర్వాతి కాలంలో మాజికల్ రియలిస్టు రచనాధోరణికి కూడా గొగోల్ నే ఆద్యుడిగా భావించడంలో ఆశ్చర్యం లేదు.

అసాధారణతని వింతగా చూపించడం ఎందుకు?

అసలు అసాధారణతని వింతగా ఎందుకు చూపించాలి? ఎందుకంటే,జీవితం ఒక కార్యకారణసంబంధం ప్రకారం, కొన్ని నిశ్చల చలనసూత్రాల ప్రకారం నడుస్తుందని వినడంలో పాఠకుడికొక సౌకర్యం ఉంది. అదొక ఓదార్పు. అందులో అతణ్ణి అస్థిరపరిచేదేమీ ఉండదు. కానీ, జీవితం నీ లెక్కల ప్రకారం నడవట్లేదని చెప్పడంలో, అది కూడా నువ్వు ఊహించని పార్శ్వాల్లో జీవితం విఫలమవుతోందని చెప్పినప్పుడు నీకొక నివ్వెరపాటు కలుగుతుంది. దాన్ని మనం strange, weird, bizarre లాంటి పదాలతో మటుకే సూచించగలం. అలాగని ఇది, మధ్యయుగాల రొమాన్సుల్లోలాగా uncanny, gothic కాదు. ఈ కథలు అద్భుత కథలు కావు. ఇందులో జీవితపు అస్తవ్యస్తతని ఒక్కక్షణంలో మార్చేసే మంత్రదండమేదీ ఉండదు. నిజానికి అలా మార్చడం నువ్వనుకున్నట్టుగా సాధ్యం కాకపోవచ్చుననీ, నీ శాస్త్రీయ దృక్పథం జీవితపు అనూహ్యగతిని అందుకోలేక ఎప్పటికీ వెనకబడిపోతూనే ఉంటుందని చెప్పడమే ఈ కథల్లోని కళాత్మకత.

జీవితాన్ని నువ్వు పూర్తిగా ఎప్పటికీ వివరించలేవు

జీవితాన్ని నువ్వు ఎంత శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా, వివరించలేని అంశమొకటి మిగిలిపోతూనే ఉంటుందనీ, దాన్ని పట్టుకోవడమే సాహిత్యకారుడి కర్తవ్యమనీ సుబ్బరామయ్య పదేపదే చెప్తూ వచ్చాడు. అలా మన విశదీకరణలకు అందకుండా మిగిలిపోవడమే జీవితంలోని వింత, weirdness అన్నదాన్ని ఆయన ఎంతో వ్యంగ్యంగా ‘ఇంగువ’ కథలోనూ, ఒకింత ఆవేదనతో ‘ద్రణేవుడు’ కథలోనూ చెప్పుకొచ్చాడు. ప్రపంచం గురించీ, జీవితం గురించీ మరింత సమాచారం దొరికితే మరింత బాగా అర్థం చేసుకోగలం అనుకునే సమాచార విప్లవాన్ని ప్రశ్నించిన కథ ‘ద్రణేవుడు’.

ఆ కథ మొదలుపెడుతూనే కథకుడు ఇలా అంటాడు:

‘సమాచార విస్ఫోటం అనీ, పోటీ అనీ అనేక నామధేయాలతో, ఆధునిక యుగం విషయపరిజ్ఞానం ప్రధానలక్షణంగా శోభిల్లుతున్నది. ఎవడికి ఎక్కువ వివరాలు తెలుసునో వాడు జ్ఞానికింద లెక్క. రరకాల టెస్టులు, కివ్జ్ లు, కెబిసిలు, ఇవన్నీ యువతరం సమాచార సేకరణ సామర్థ్యం గురించే. నాలుగు పేపర్లు తిరగేసినవాడు సాయంకాలం నలుగురిముందు నాలుగు విషయాలు ఉగ్గడిస్తే వాణ్ణి జ్ఞాని అనేస్తారు. మనసును అత్యవసర పరిజ్ఞానంతో కాక, అత్యవసర విషయ పరిజ్ఞానంతో కూడా నింపడం, అట్లా కొందరికంటే ఎక్కువ విషయాలు తెలిసి జ్ఞాపకముంచుకున్నవాణ్ణి బిరుదులతో గౌరవించడం జరుగుతున్నది. వాడెవడో అంత బతుకూ బతికి ఇంగువ అంటే ఏమిటో తెలుసుకోకుండా తెలుసుకునే అవకాశం లేకుండగానే దాటిపోయాడు.’

కాబట్టి తన తోటి రచయితలు సమాజాన్నీ, జీవితాన్నీ తమకు  తెలిసిన పరిజ్ఞానంతో వివరించడానికి ప్రయత్నిస్తున్నవేళ, సుబ్బరామయ్య, తనకు పూర్తిగా అంతుచిక్కని జీవితపు వింతల్ని పసిగట్టడం మీదా, చిత్రించడం మీదా దృష్టిపెట్టడం గమనించవచ్చు.

వింతని చిత్రించడంలో సాహిత్యప్రయోజనం ఏమిటి?

జీవితంలోని వింతని చూపించడం ద్వారా పెద్దిభొట్ల   రెండు ప్రయోజనాల్ని ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. మొదటిది, పాఠకుల్ని విభ్రాంతికి గురిచెయ్యడం. ఆ విభ్రాంతి చాలాసార్లు విషాదకరంగా ఉండటమే కాక, మనల్నొక నిస్సహాయతకు గురిచేస్తుంది కూడా. ఉదాహరణకి ‘చిలిపితనం’ అనే కథలో, టైపిస్టు ఆఫీసుకు వస్తూ, మతిస్తిమితం లేని తన తండ్రిమీద కోపమొచ్చి రోజంతా బల్లమీద నిలబడమని పనిష్మెంటు ఇస్తుంది. ఆమె సాయంకాలం ఇంటికి వెళ్ళి తలుపు తీసేటప్పటికి, ఆ తండ్రి బల్లమీద అలా నిల్చునే ఉంటాడు. ‘ఏస్ రన్నర్’ కథలో ఒకప్పుడు గొప్ప క్రీడాకారుడిగా, ఇవ్వాళ గుమస్తాగా జీవించవలసిన వ్యక్తి, రోజూ ఆఫీసుకు లేటుగా వస్తున్నాడని, అతణ్ణి ఆఫీసరు వ్యంగ్యంగా, ఆఫీసుకు రోజూ పరుగెత్తుకు రమ్మంటాడు. ఆ సాయంకాలం వయసు పైబడ్డ ఆ గుమస్తా, ఒకప్పుడు ఏస్ రన్నర్, నిజంగానే పరుగెత్తి ఇంటికి చేరుకుని పక్షవాతానికి గురవుతాడు. ‘శనిదేవత పదధ్వనులు’ కథలో ఒకప్పుడు గొప్ప గాయకుడు, తర్వాత రోజుల్లో చెవిటితనం ఆవహించిన రవీంద్ర తన ఒకప్పటి పాటల రికార్డు సంపాదించి పక్కింటికి వెళ్ళి గ్రామఫోను మీద వినిపించమని అడుగుతాడు. ఆ పాట అంతా విని ఆనందిస్తారుగాని,అతడికి వినపడదు. తన హియరింగు ఎయిడ్ లో బాటరీ అయిపోయిందని తర్వాత తెలుస్తుందతడికి. తన మిత్రుడు, రోజూ కలుసుకోకపోతే గడవని స్నేహితుడు తన మీద వేళాకోళంగా ఏదో రాసాడనీ,అది పోర్చుగీసు భాష అని నమ్మించాడనీ, అనంతరామయ్య తన మిత్రుడు కొళందవేలు మరణిస్తున్నా పోయి చూడడు. కానీ, తీరా అది పోర్చుగీసుభాషనేననీ,అందులో తన గురించి మంచిమాటలే రాసాడనీ అతడికి తెలిసిరావడం ‘దెయ్యంపట్టింది’ కథ. ఒక జతచెప్పులకోసం దొంగతనానికి పాల్పడిన ఒక దూరపుబంధువుని బంధుగణమంతా పూనుకుని మరీ కనిపెట్టడం ‘చెప్పుల జత’ కథ. ఇటువంటి కథల్లో కనవచ్చే వింత, ఆ ఇతివృత్తంలోనో, లేదా ఒక చిన్న జీవితవివరంలోనో ఉంటుంది కాని అది అంతిమంగా మనల్నిunsettle చేస్తుంది.

జీవితసంఘటనలవెనక ఒక నైతికసూత్రం కూడా ఉందా?

జీవితంలోని ఆకస్మికత, యాదృచ్ఛికత, కాకతాళీయతలను పట్టుకోవడం, వాటిని మనముందు చూపించి మనల్ని నివ్వెరపరచడం వెనక రచయిత కొన్నిసార్లు  ఒక నైతికసూత్రాన్ని చూస్తున్నాడా అనిపిస్తుంది. ‘అందని ఆ రెండు ఫలాలు’ అనే కథని ఆయన ‘విద్య-వైద్యం’ అనే పేరుతో కూడా రెండు సార్లు ప్రచురించాడు. ఆ కథలో ఇసాకు ఒక డ్రైవరు. ఒకరోజు అతడి బస్సుకింద ఒక ఉడత పడి ప్రమాదవశాత్తూ మరణిస్తుంది. అది చూసి అతడు చాలా విషాదానికి లోనవుతాడు. సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి, అతడి ముసలి తండ్రి, మరణించి ఉంటాడు. ‘పీట’ కథలో సన్యాసయ్య తనకి ఏ మాత్రం బంధువులుకాని ఒకరింటికి అంత్యక్రియలసందర్భంగా హాజరయి, దానాలూ, దక్షిణలూ స్వీకరిస్తాడు. వాళ్ళు తక్కిన దానాలతో పాటు అతడికొక పీట కూడా దానం చేస్తారు. ఆ పీట దానం చెయ్యడంలో అర్థం లేదనుకుని అతడు దాన్ని దారినపొయ్యేవాడెవడికో అమ్మేస్తాడు. పైగా ఎవరో తన వెంటపడి మరీ ఆ పీట తనకి అంటకట్టారని చెప్తాడు. ఆ రాత్రి అతడు తన ఊరికి పోవడానికి ఎక్కిన బస్సు కిక్కిరిసిపోయి ఉంటుంది. కూర్చోడానికి కాదు సరికదా, నిలబడటానికి కూడా చోటు దొరకదు.దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే కూర్చోడానికి చోటు దొరికితే చాలనిచెప్పాలనుకుంటాడు. ‘గుండెలో పాము’ కథలో టైపిస్టు చలపతి తనకి పోటీగా తయారైన సుందరం అనే టైపిస్టుకి అశుభం కోరుకుంటాడు. కాని ఇంటికి వచ్చేటప్పటికి అతడి తండ్రిని హాస్పటల్లో చేర్పించారని తెలుస్తుంది. చలపతి ఆలోచనలో పడతాడు. తాను సుందరానికి కీడు కోరుకుంటే, ఆ కీడు తన ఇంట్లో సంభవిస్తుంది. అతడికి ఆ సంగతి అర్థం కాగానే అతడి తండ్రి కోలుకుంటాడు. మర్నాడు సుందరం తనకి వేరే ఉద్యోగం వచ్చిందనీ, తాను వెళ్ళిపోతున్నాని చెప్తూ, తన కొత్త టైపు మిషను చలపతికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ‘మిగిలిందేమిటి’కథలో ఇద్దరు కరటక దమనకులు ఒకరి ఆస్తిని అన్యాయంగా కాజెయ్యాలని చూస్తారు. చివరికి, నికృష్టమైన చావు చస్తారు.

ఈ నైతిక సూత్రానికీ, శాస్త్రీయ చలనసూత్రాలకీ తేడా ఏమిటి?

మనుషులు తమ తోటి మనుషుల పట్ల చూపించే ప్రవర్తనకీ, వాళ్ళకి ఆకస్మికంగా సంభవించే అనుభవాలకీ మధ్య ఒక అగోచర సంబంధం ఉందని సుబ్బరామయ్య నమ్మినట్టే చాలా కథలు సాక్ష్యమిస్తాయి. చూడటానికి కర్మసిద్ధాంతంలాగా ఉండే ఈ ప్రాచీన విశ్వాసాన్ని ఆయన ఈ ఆధునిక కథల్లో ఎందుకు ప్రతిపాదిస్తున్నట్టు?

ఈ ప్రతిపాదనని మనం పూర్తి లౌకిక పరిభాషలో అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పేదేమంటే, జీవితం కొన్ని చలనసూత్రాల ప్రకారం, భౌతిక కార్యకారణసంబంధం ప్రకారం నడుస్తోందని భావించడం మొదలుపెట్టగానే, నువ్వు నెమ్మదిగా నిష్క్రియాపరుడివిగా మారడం మొదలుపెడతావు. నువ్వు కోరుకున్నా, కోరుకోకపోయినా, సామాజిక చలనసూత్రాల ప్రకారం మార్పు సంభవించకతప్పదనీ,అందులో నీ వంతు పాత్ర నువ్వు పోషిస్తే చాలనీ అనుకుంటావు. అంటే అక్కడ నీ బాధ్యత యాంత్రికంగా మారిపోతుంది. కాని, సుబ్బరామయ్య చెప్తున్నది మరోలా ఉంది. ఆయనేమంటాడంటే, నీ బాధ్యత పరిమితం కాదనీ, జీవితం నీ ఊహలకి, సూత్రాలకీ ఎక్కడైనా, ఎప్పుడైనా విరుద్ధంగా పరిణమించే పరిస్థితి లేకపోలేదనీ, కాబట్టి నువ్వు అపరిమితమైన జాగరూకతతో ఉండకతప్పదంటాడు. తన పాఠకుల్లో ఆ జాగరూకతని మేల్కొల్పడమే అతడు అంతిమంగా ఉద్దేశించిన సాహిత్యప్రయోజనం అని చెప్పవచ్చు. ఎదుటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు, ఏమి చేసయినా ఆ కష్టాన్ని తీర్చడమే, అందుకు ప్రతిఫలంగా ఏమీ ఆశించకపోవడమే మానవుడి నిజమైన బాధ్యత అని చెప్పడమే ఆయన సాహిత్యసందేశం. ‘ముసురు’, ‘పూర్ణాహుతి’,  ‘దగ్ధగీతం’, ‘అన్నదాత సుఖీభవ’ కథల్లో మనకి స్పష్టంగా వినిపించేది ఈ సందేశమే.

కర్మసిద్ధాంతం కూడా కార్యకారణసంబంధంలాంటిదే. కేవలం దాన్నే నమ్మి ఉంటే, ‘పూర్ణాహుతి’ కథలో రామేశానికి బదులు కథకుడు మరణించి ఉండాలి. కాని, రామేశం మరణించడం వెనక మృత్యుంజయదానాల ప్రభావం లేదనీ, చివరికి తన శాపనార్థాల ప్రభావం లేదనీ కూడా కథకుడికి తెలుసు. కాని అతణ్ణి తన పోటీగా భావించి అకారణంగా శపించినా కూడా, తనకి మేకు గుచ్చుకుని జ్వరం వచ్చినప్పుడు, ఆ రామేశమే తనని చూసుకున్నాడు. అకారణమైన ఆ మానవత్వానికి బదులు తీర్చవలసిన బాధ్యత తన మీద ఉందని కథకుడికి అర్థమవుతుంది. ఆ కథలో రామేశం మరణించడం పూర్ణాహుతి కాదు. కథకుడు,కర్మసిద్ధాంతంమ్మీదా, కార్యకారణసంబంధం మీదా నమ్మకాన్ని పక్కనపెట్టెయ్యడమే పూర్ణాహుతి. ఎదటి మనిషి పట్ల నువ్వు చూపించే అగౌరవానికీ, అకారణ ద్వేషానికీ అంతిమంగా నువ్వే బాధ్యత పడవలసి ఉంటుందని చెప్పడమే ఈ కథని అత్యుత్తమ కథానికని చేసింది.

కథకుడిగా సుబ్బరామయ్యను ఆదర్శవాది అనవచ్చా?

సుబ్బరామయ్య చిత్రించిన కథల్లో చాలా కథలు సాధారణమైన మధ్యతరగతి కథలు. అధోజగత్ ను అతడు చిత్రించకపోలేదుగానీ, ఆ విషయంలో అతడికన్న ప్రతిభావంతంగా చిత్రించినవాళ్ళు రావిశాస్త్రి వంటివాళ్ళున్నారు. సుబ్బరామయ్య కథల్లో పాఠకుల్ని ఆకట్టుకున్నవీ, ఆయన్ను వారికి చేరువచేసినవీ, ‘నీళ్ళు’, ‘గాలి’, ‘ముసురు’,  ‘దగ్ధగీతం’,‘ఏస్ రన్నర్’, ‘పూర్ణాహుతి’, ‘కళ్ళజోడు’, ‘కోరిక’,’ఇంగువ’, ‘ద్రణేవుడు’, ‘పీట’, ‘ఎక్ స్ట్రా’, ‘నీడ’, ‘దుర్దినం’ వంటి కథల్లో ప్రధానంగా ఉన్నది weirdnessనే. ఒకరకంగా చెప్పాలంటే కథకుడిగాఆయన గొగోలైజ్ అయ్యాడు. కాని, జీవితంలో ఆయనకు కనిపించిన ఆ bizarre పార్శ్వం ఆయన్ను నిరాశావాదిగా మార్చలేదు. పైగా, కథాశిల్పరీత్యాకూడా అత్యున్నత పరిణతి సాధించిన ‘పూర్ణాహుతి’, ‘దగ్ధగీతం’,‘ముసురు’ లాంటి కథల్లో ఆయన మనిషి తన తోటిమనిషి పట్ల నిష్కారణంగా చూపించవలసిన బాధ్యతనే పైకెత్తి చూపిస్తున్నాడు. అందువల్ల ఆయన్ను ఆదర్శవాది అనే చెప్పవలసి ఉంటుంది. ఈ లక్షణంలో సుబ్బరామయ్యకు చేరువగా కనిపించే మరొక కథకుడు మునిపల్లె రాజు మాత్రమే. అందుకనే, సుబ్బరామయ్య కథలు మొదటి సంపుటానికి ముందుమాట రాస్తూ (2010) మునిపల్లె రాజు సుబ్బరామయ్యను a conscious keeper of his hometown’s soul అని అభివర్ణించాడు. అంతేకాదు, సుబ్బరామయ్య ‘ఒక కథాస్రష్ట రూపంలో ఒక ఉన్మత్త పథికుడి కాలిగుర్తుల్లో, ఒక ఉద్విగ్న భావుకుడి సనాతన చింతనలో, కథానికే ఒక చిరుకావ్యంగా పరివర్తన చెందింది’ అని కూడా రాసాడాయన.

కవితాత్మక పార్శ్వం

కథానిక సుబ్బరామయ్య చేతుల్లో చిరుకావ్యంగా పరివర్తన చెందింది అని మునిపల్లె రాజు చెప్పిన మాట చాలా విలువైన పరిశీలన. తనముందు కనిపిస్తున్న నిష్ఠుర జీవితాన్ని ఎదుర్కోడానికి సుబ్బరామయ్య తనలోని కవిహృదయాన్ని ఆశ్రయించాడు. నిజానికి, ఇది రావిశాస్త్రి స్వభావం. అరవైల్లో, ‘పిపీలికం’ కథకి ముందు రావిశాస్త్రి రాసిన ప్రతికథలోనూ ఒక ఆకుపచ్చని పార్శ్వం ఉంటుంది. జీవితం వీగిపోడాన్ని చిత్రించవలసివచ్చిన ప్రతి సందర్భంలోనూ, రావిశాస్త్రి, ఒక ఆకుపచ్చని స్పేస్ ను తలచుకుంటూనే ఉంటాడు.

సుబ్బరామయ్య కథల్లో దాదాపుగా ప్రతి కథలోనూ ప్రధాన పాత్రకి ఒక కల వస్తుంది. జీవితం నిష్ఠురంగా కనిపిస్తున్నప్పుడు, ఆ కలల్లో కాకులూ, మేకులూ  కనిపిస్తాయి.

‘సినిమారీలులోలాగా, తన వూరు…చెల్లాయిలూ, తల్లీ, గడ్డికూడా మొలవని చవిటినేలా, రాళ్ళు పగిలే ఎండలూ, వెచ్చనిగాలీ, నీళ్ళులేని బావులూ, నీళ్ళకోసం పాట్లూ, ఎక్కడ చూసినా నీరసంగా, నిస్తేజంగా ఉండే జనమూ..’ (నీళ్ళు)

‘క్షుద్రదానాల్లో వచ్చిన లెక్కలేనన్ని ఇనుపమేకులు కళ్ళముందు గిర్రున జల్లెడలా పరిభ్రమిస్తున్నాయి..’(పూర్ణాహుతి)

‘నిద్ర..మధ్యలో మాత్రం ఒక చిన్న కల. అందులో కాకులు గుంపులు, గుంపులుగా కనిపించాయి.’(కళ్ళజోడు)

‘రోడ్డుమీద,సత్రంలో,వరండాలో అంతటా కాకులే రణగొణ ధ్వనిగా..’(దుర్దినం)

‘మరికాసేపట్లో రెండో కల, ఆకాశంలో అంగుళమైనా ఖాళీలేకుండా అసంఖ్యాకంగా లక్షలూ, కోట్లాదిగా కాకులు కిక్కిరిసి కనిపించాయి, అవన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయట..’ (భ్రమ)

జీవితంలోని కష్టాన్నీ, ఇరుకునీ చిత్రించవలసి వచ్చినప్పుడు అతడు ఎన్నుకునే రూపకాలంకారాలు, పోలికల్లో కూడా అదే weirdness.

‘చువ్వవంటి మనిషేమో పాముపాకినట్టు నడిచిపోగలడు.’(మబ్బు విడిచిన ఎండ)

‘ఆకాశంలోనుంచి ఏదో అదృశ్య రాక్షస హస్తం సిరా ఒలకబోసినట్టుగా చిక్కగా వ్యాపించి ఉంది.’(మబ్బు విడిచిన ఎండ)

‘ఆ చిక్కని చీకటిలో కూడా రేకుపెట్టె మీద ఉన్న ఫ్యాను తెల్లగా పడగ ఎత్తిన పాములాగా కనబడింది.’(గాలి)

‘కనకయ్య శాస్త్రి కదలకుండా కళ్ళు తెరుచుకుని వెల్లకిలా పడుకున్నాడు. అతని చుట్టూ పైనా కిందా అంతటా చీమలు అసంఖ్యాకంగా పాకుతున్నాయి’ (దుర్దినం)

‘ఆ రైలు ఒక పెద్ద బెల్లం బుట్టలా ఉంది. దాని చుట్టూ లోపలా పైనా ఈగల్లాగు, దోమల్లాగు ముసిరి వున్నారు మనుషులు.’ (మూగపిల్ల)

‘సిటీ బస్సు జనంతో కిటకిటలాడుతూ కడుపుతో ఉన్న దయ్యపుతేలులాగా..’(శనిదేవత పదధ్వనులు)

‘నీళ్ళు పాముల గుంపు వలె..’ (మరో వీథిపాప)

అదే జీవితం ఆశావహంగానూ, ప్రాణప్రదాయకంగానూ స్ఫురించినప్పుడల్లా, పాత్రలు కనే కలల్లో గంధపు చెట్లు కనిపిస్తాయి. చాలాసార్లు గతజీవితం గురించి తలచుకున్నప్పుడు పాత్రలకి స్ఫురించేది పచ్చటి జీవితమే.

‘అబ్బో!తానిదంతా ఎప్పుడు చదివింది?ఎన్నేళ్ళ క్రిందటిమాట! అప్పుడు జీవితమంతా పచ్చపచ్చగా హాయిగా వుండేది. ఎన్ని పండుగలు? ఎన్ని శ్రావణ మాసాలు!ఎన్ని వర్షాలు?ఎన్ని ఎండలు? ఆ పూలరంగులన్నీ ఏమైపోయాయి? అసలా పూలన్నీ ఏమైపోయాయి?’ (కళ్ళజోడు)

‘చిన్నతనంలో ఎక్కడో చూసిన నిలువెల్లా పూచిన చెట్టు గుర్తుకు వచ్చింది. తాను చూచినప్పుడు దానినిండా పువ్వులే, ఆకులే ఉన్నట్టు లేవు.’(దుర్దినం)

‘అక్కడిగాలి అద్భుతమైన సంగీతం పాడుతున్నట్టు వీచేది. ఆ సముద్రం దూరతీరాల గాథలను అరవంలో పాడి వినిపిస్తున్నట్టుగా ఘోషిస్తూ ఉండేది, అక్కడి పక్షులు అరవంలో రాగాలు తీస్తూ ఉండేవి..ఆమెకు అంతలో నిద్ర ముంచుకు వచ్చింది. కదలకుండా బరువుగా ఊపిరి తీస్తూ పడుకుండిపోయింది. నిద్రలో ఆమెకు రెండు చిన్న కలలు వచ్చాయి. తన వూళ్ళో ఇళ్ళన్నీ మాయమైపోయాయట. ఇక్కడ ఇప్పుడంతా గంధపు చెట్లు దట్టంగా లెక్కలేనన్ని పెరిగి ఉన్నాయట.’(భ్రమ)

‘నిద్రలో మంచుతో నిండిన అందాల పర్వత శిఖరాలు, రంగురంగుల సముద్రాలూ, పువ్వులూ కనిపించాయి సుబ్రమణికి.’ (చుక్కమ్మ కథ)

‘నిద్రలో నయాగరా జలపాతమూ,అందాల ఎవరెస్టు శిఖరమూ, ఆఫ్రికన్ నైలు నదీ, మంచుతోనిండిపోయిన నయనానందకరంగా ఉన్న ధ్రువప్రాంతమూ, రంగురంగుల మబ్బులూ, ఒక హరివిల్లు, దట్టమైన గంధపుచెట్ల అరణ్యాలూ, పొడవైన, ఎత్తైన పెద్ద వంతెన కింద భయంకరమైన వేగంతో ప్రవహిస్తున్న సట్లెజ్ నది, ఆ పైన ఎక్కడిదో ఒక చక్కని దేవాలయమూ కనిపించాయి..కళ్ళముందు ఏవేవో రంగులు, కొన్ని మెరుపులు, కొంత చీకటి, ఆ తర్వాత ఒక మైదానం, అందులొ అంతటా పరుచుకున్న పచ్చని గరిక.అంతా కన్నుల పండుగ అనిపించింది. తర్వాత ఒక అందమైన పసిపాప ముఖం కనిపించింది. చిరునవ్వులు చిందిస్తూ..’ (జబమలై ఆత్మహత్య)

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథల్ని చిరస్మరణీయం చేసేది, అతడి వాస్తవికతావాదం వల్లకాక,  అతడు చిత్రించిన జీవితపు వింతపార్శ్వాలవల్లా, ఆ వింత మనల్ని నిరాశకు గురిచెయ్యకుండా, ఆ సందుల్లో ఇమిడ్చిపెట్టిన ఈ కవితాత్మక పార్శ్వాలవల్లా మటుకేనని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

వాడ్రేవు చినవీరభద్రుడు

వాడ్రేవు చినవీరభద్రుడు: 1962 లో తూర్పుగోదావరి జిల్లా మన్యప్రాంతంలో పుట్టిపెరిగారు. తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేసారు. గత ముప్పై ఏళ్ళకు పైగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాదులో సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ ఇన్ పబ్లిక్  సిస్టమ్స్ లో సలహాదారుగా ఉన్నారు. ఇప్పటిదాకా మొత్తం 34 పుస్తకాలు వెలువరించారు. వాటిలో కవిత్వం, కథలు, సాహిత్యవిమర్శ, యాత్రాకథనాలతో పాటు విద్యమీద కూడా స్వీయ రచనలతో పాటు కాంట్, కబీరు, బషొ, కలాం, గాంధీ, టాగోర్ మొదలైన రచయితల అనువాదాలు కూడా ఉన్నాయి. కవిత్వానికి, సాహిత్య విమర్శకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలతో పాటు, అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.

1 comment

  • చాలా లోతైన విశ్లేషణ..గోగోల్ తో పోల్చడం బాగుంది..
    సుబ్బరామయ్యగారు బ్రతికే వుండి ఇది చదువు కుంటే ఎంతబావుణ్ణు..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.