‘గూఢ చారుల’ వంతెన మీద కాసేపు

కొన్ని నగరాల పేర్లు మనకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. వాటి పరిమాణం కూడా చాలా చిన్నది కావచ్చు. అలాగని  వాటి చారిత్రాత్మక ప్రామఖ్యాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. అటువంటిదే బెర్లిన్ సరిహద్దులోని పోట్స్డామ్ నగరం. పోట్స్డామ్ (Potsdam) జనాభా రెండు లక్షలకు మించదు కానీ  చాల ప్రాచీన, ఆధునిక రాజకీయ, సాంస్కృతిక చరిత్ర వున్న నగరమది. యూరోప్ లోని చాలా దేశాలకు తీసిపోని చరిత్ర ఆ నగరానికుంది.

మేము బెర్లిన్ పోయేవరకు కూడా మాకు పోట్స్డామ్ (Potsdam)గురించి తెలియదు, మూడు రోజుల పాటు బెర్లిన్ నగరంలో కాలినడకన, సిటీ బస్సులో, మెట్రో లో తిరిగాక నాలుగో రోజు మా ప్రయాణం పోట్స్డామ్ వైపు సాగింది. పోట్స్డామ్ చాలా చిన్న నగరం, నగరం ఈ చివర నుంచి ఆ చివరకు పోవడానికి  అరగంట కంటే ఎక్కువ సమయం పట్టదు. అయితే నగరం లోని నివాస ప్రాంతాలు సైతం ఒక క్రమ పద్దతిలో రూపొందినట్లు కనిపిస్తాయి. ప్రతి ఐదు నిమిషాల కొక సారి ట్రామ్, బస్సు ఉండటం వలన రద్దీ చాల తక్కువగా వుం

ది. ప్రతి రోజు ఆ నగరానికొచ్చే టూరిస్టుల సంఖ్య ఆ నగర జనాభా కంటె ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది.

మేము పోట్స్డామ్ పోవడానికి బెర్లిన్ లోని “జూ” ప్రాంతం నుంచి ఎస్- బన్ (s -bahn… బెర్లిన్ అర్బన్ ప్రాంతం లో ఎం ఎం టి ఎస్ లాంటి ట్రైన్ సర్వీస్ ) నుంచి బయలుదేరాం. దాదాపు ముప్పై నిమిషాల  తరువాత ( మునుపటి తూర్పు జర్మనీ ప్రాంతం లోనే మా ప్రయాణం ఎక్కువగా సాగింది) మేము పోట్స్డామ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. మేము మొదట గా చూడాలనుకున్న ప్రదేశం గ్లిఎనికె వంతెన(Glienicke birdge ). 1907 సంవత్సరం లో మొదట నిర్మించినప్పటికీ, రెండు జర్మనీలు తిరిగి ఏకమైన తరువాత మరమ్మతులు జరిగి ఇప్పటికీ వాడకం లో వుంది. ఆ వంతెన మీద దాన్ని నిర్మించిన సంవత్సరంతో పాటు రెండు జెర్మనీలు పునరైక్యమయిన తేదీ కూడా రాశారు.  రెండో ప్రపంచ యుద్ధకాలం లో ఆ వంతెన కొంచెం దెబ్బ తిన్నదని మేము చదివిన పుస్తకాలలో చూశాం. గతంలో పశ్చిమ జర్మనీ కి తూర్పు జర్మనీ కి పోట్స్డామ్ లోని సరిహద్దు గా ఆ వంతెన ఉండేది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం (cold war ) లో పశ్చిమ జర్మనీ తూర్పు జర్మనీ దేశాలు తాము పట్టుకొన్న గూఢచారులను హావెల్ నది (Havel river ) మీద నిర్మించిన ఈ గ్లిఎనికె వంతెన (Glienicke bridge )మీదే మార్పిడి చేసుకొనే వారు. అందుకే ఆ బ్రిడ్జి ని “బ్రిడ్జి అఫ్ స్పైస్” (గూఢచారుల వంతెన) అని అంటారు. 2015  లో స్టీవెన్ స్పీల్బర్గ్ ఆ వంతెన బ్యాక్ డ్రాప్ తో “ది బ్రిడ్జి అఫ్ స్పైస్” (bridge of spies ) అనే సినిమా కూడా తీసాడు. ఒకవేళ మేము లోకల్ ట్రైన్ లో కాకుండా రోడ్ మార్గం లో పోట్స్డామ్ వచ్చినట్లైతే బొటనికల్ గార్డెన్, గ్లిఎనికె బ్రిడ్జి మాకు మార్గమధ్యం లోనే వచ్చివుండేవి. 

అక్కడ మేము చూసిన మరో ప్రదేశం సిసిలిఎంహోఫ్ ప్యాలెస్ (cecilienhof palace ). అలనాటి జర్మన్  రాజు ప్రిన్స్ విల్హెమ్ II (prince wiliams ) భవనం. సిసిలిఎంహోఫ్ ప్యాలెస్ (cecilienhof palace). దీనికి పోట్స్డామ్,  జర్మన్ చరిత్ర లోనే కాదు ప్రపంచ చరిత్ర లోనే పెద్ద స్థానమే వుంది. రెండో ప్రపంచ యుద్ధ ముగింపు చర్చలు ఇక్కడే జరిగాయి. ఈ చర్చల సారాంశాన్ని “పోట్స్డామ్ డిక్లరేషన్ “”పోట్స్డామ్ కాన్ఫరెన్స్ ” (Potsdam declaration or Potsdam conference) అంటారు. అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమాన్ , రష్యా ప్రెసిడెంట్ స్టాలిన్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ (మొదటి కాన్ఫరెన్స్ కు చర్చిల్ హాజరైనా ఆ తదనంతరం జరిగిన ఎన్నికల్లో అయన ఓడిపోవడంతో ఆ తరువాత జరిగిన  కాన్ఫరెన్స్ కు ఆయన స్థానంలో అట్లీ హాజరయ్యారు ). చారిత్రక సాక్ష్యంగా ఈ నాటికి వారు కాన్ఫరెన్స్ జరిపిన గదులను, ఫర్నిచర్ ను అలాగే ఉంచారు. ప్రతి ఏటా జర్మన్స్ తో పాటు లక్షలాది మంది ఇతర దేశస్తులు కూడా రాజరికానికి, ఈ ఆధునిక చరిత్ర నిలువెత్తు సాక్షాన్ని చూడటానికి వస్తున్నారు.

మేము చుసిన మూడో ప్రదేశం పోట్స్డామ్ ఫిలిం మ్యూజియం (film museum ). ప్రతి రోజు సాయంత్రం అక్కడ రెండు ప్రపంచ సినిమాలు ప్రదర్శిస్తుంటారట.  మేము పగలు పోవడం వలన అవి చూడలేక పోయాము. కానీ ఫిలిం మేకింగ్ లో వస్తున్న మార్పులు, సినిమా తీయడానికి గత కాలంలో వాడిన సాధనాలు, బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్(berlin film festival), పాత తరం నటుల స్వరాలు, సినిమా కు సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఎలా ఉంటుందో…   లాంటివి అక్కడ చూశాం. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ మనకు సినిమా మేకింగ్ లో A టు Z సమాచారం తెలుస్తుంది. ఫిలిం మేకింగ్ లో క్విజ్ లు, స్క్రిప్ట్ ను తయారు చేసుకొనే విధానం, ప్రాక్టికల్ గా సినిమా తీసే పద్ధతి… లాంటి కొన్ని యాక్టీవిటీస్ (activites) మనం ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చు. చాలా సినిమాలలోని సన్నివేశాలు వాటిని ఎలా చిత్రకరించారో అక్కడా చూపిస్తారు.  దాదాపు గా మేము అక్కడ నాలుగు గంటలు పైగా గడిపాము.

అక్కడ నుంచి మేము సన్తస్సౌసి పాలస్ (Sanssouci palace ), సన్తస్సౌసి గార్డెన్ (Sanssouci garden )పర్యటనకు వెళ్ళాం. సాధారణంగా పోట్స్డామ్ టూరిజం కు  వచ్చే వాళ్ళు మొదట గా చూడాలనుకునే ప్రదేశం సన్తస్సౌసి పాలెస్. జర్మనీ ని పాలించిన ఫ్రెడిరిక్ ది గ్రేట్ నివాస భవనమది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పోట్స్డామ్ తూర్పు జర్మనీ కి పోవడం తో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం దీనిని టూరిస్ట్ ప్రదేశంగా మార్చింది. గత కాలం నాటి అద్భుతమైన భవనాలను చూడాలనుకునే వారు ఈ భవనాలను, తోటలను చూసి చాలా ఆనందిస్తారు.

ఇంకో విషయం ఇటు బెర్లిన్ కానీ అటు పోట్స్డామ్ లో కానీ అలాగే యూరోప్ లో చాలా చోట్ల అటు షాపింగ్ మాల్స్ లో కానీ అటు రైల్వే స్టేషన్ లో కానీ టాయిలెట్ లకు డబ్బులు చెల్లించక తప్పదు .

మేము ఉదయం పోట్స్డామ్  చేరుకొని సాయంత్రానికి తిరిగి బెర్లిన్ చేరుకున్నాం నిజానికి ఒక రోజు లో పోట్స్డామ్ ను తృప్తిగా చూడలేము ఎదో చూశామన్న ఆనందం తప్పితే. ఈ విషయం మాకు మొదటిలోనే అర్థమైంది కాబట్టే ప్రపంచ  సినిమా చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం సంపాదించుకొన్న బాబెల్స్బెర్గ్ సినిమా స్టూడియో (babelsberg film studio)ను మేము చూడాల్సిన లిస్ట్ నుంచి కొంచెం బాధ కలిగినా తొలగించాల్సివచ్చింది. బాబెల్స్బెర్గ్ స్టూడియో ను  పోట్స్డామ్ లో 1912 లో నిర్మించారు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ఫిలిం స్టూడియో ఇది. 1927 లో వచ్చిన “మెట్రోపొలిస్” ఈ స్టూడియో నుంచే వచ్చింది.

తిరిగి సాయంత్రం ఆరు గంటలకు బెర్లిన్ కు మా తిరుగు ప్రయాణం మొదలయ్యింది.

 

                                                 

 

 

 

–    జి ఎల్ ఎన్ రెడ్డి

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

2 comments

  • వెరీ ఇంటరెస్టింగ్ రెడ్డి గారు! మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు.

  • మీరు చూసివచ్చిన ప్రదేశాల గురించి మా కళ్ళకు కట్టినట్లు రాసారు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.