త్రీ ఛీర్స్ టు పొయెట్రీ

 

  1. నీలోకి దారి తెలియక…

నీలోకి చూసే ముందు
నాలోకి నన్ను చూసుకోవాలి
లోపల్లోపలికి చూసుకున్న కొద్దీ
నీ నీలికళ్ళ వలయ లయల్లోకి
మంద్రస్వర మార్మిక తుషారాల లోయల్లోకి-

నిను స్పృశించే ముందు
నా చర్మం పొరల వెనుక జ్వలించిన
కాంక్షా సౌగంధ సౌరభాల్ని తడుముకోగలగాలి
తడుముకున్న కొద్దీ
తరళ తరళంగా నీ కౌగిట్లో
వెచ్చని కన్నీటి బొట్టునై నీ గుండెల్లోకింకిపోవడం
నాలో నిను నులివెచ్చగా తడిపేయడం-

నీలోకి దారి తెలుసుకునే ముందు
నాలోకి దారులు తెలుసుకుని…
ద్వారాలు తెరుచుకుని
వెళ్ళిపోవాలి….
ఆ దారిలో
నీ కనురెప్పల తలుపులను
నీవే తెరిచి పిలిచినప్పుడు మాత్రమే
కనిపించే మంత్రనగరి రహస్సమీరంలో
దేహం ధూపమయ్యే వైనం..
తెలియకే
ఈ తికమక
ఈ మూర్ఖత్వం
ఈ రాక్షసత్వం-

 

  1. చీకట్లో చెట్టు

కాశాన్ని కప్పుకున్నట్టు
నక్షత్రాల్ని పూసినట్టు
నదిని ప్రసవించినట్టు
అందరూ పడుకుంటే తనొక్కత్తే ఆకుల కళ్ళతో
కలయచూస్తూ గలగలమని పాడుతున్నట్టు
చీకట్లో చెట్టు చాలా అందంగా ఉంటుంది
ఆనందంలా వినిపిస్తుంది
హాయిగా పలకరిస్తుంది
ఆత్మీయంగా పరామర్శిస్తుంది-

చీకట్లో చెట్టును
దగ్గరకు వెళ్ళి చూస్తున్న కొద్దీ
రారమ్మని పిలుస్తున్నట్టే ఉంటుంది-
కొంత చీకటిని, కొంత వెన్నెలను, కొన్ని నక్షత్రాల్ని దాచిపెట్టి
వచ్చి తీసుకోమని చేతులు చాస్తున్నట్టే ఉంటుంది-

చీకట్లో చెట్టు
ఆకాశానికి అతుక్కున్న బొమ్మలా ఉంటుంది
రంగులన్నీ కడిగేసుకుని స్వచ్ఛంగై నల్లగా మెరుస్తూ ఉంటుంది
ఆకాశాన్ని వందల చేతుల్తో మోస్తున్నట్లుంటుంది
భూమిలో పాదాల్ని నాటుకుని.. భూమితో పాటే విశ్వమంతా ప్రయాణించే చెట్టు
బుద్ధునిలా తపస్సు చేస్తుంది చీకట్లో ఆకాశం చెట్టు కింద-
ఆకుల గలగలలతో అల్లరి చేసే గాలి కూడా
చీకట్లో ధ్యానముద్రలో ఉన్న చెట్టుకు ఊపిరి బిగబట్టి నమస్కరిస్తుంది
దట్టమైన ఆకుల మధ్య నుంచి ఒడుపుగా దారి చేసుకుని బుద్ధిగా వెళ్ళిపోతుంది-

చీకట్లో చెట్టు
చూపున్న శిల్పం
మాట్లాడే మౌనం
స్పృశించే దేహం
స్పృహించే దైవం
ఎడతెగని ధ్యానం-

చీకట్లో చెట్టు కింద జ్ఞానోదయం కాదు
చీకట్లో చెట్టును
అలా దూరం నుంచే చూడాలి
చీకట్లో చెట్టుకు చేతులు జోడించి ప్రదక్షిణం చేయాలి
ముడుపులు కట్టుకుని వెళ్ళిపోవాలి…
మళ్ళీ అదే దారిలో ఎపుడైనా వెనక్కి వస్తున్నప్పుడు
ఇక్కడొక చెట్టుండాలి కదా అన్న ప్రశ్న ఎదురవనూ వచ్చు-

శీతల హేమంత సౌందర్యంలోకి శిశిరం చొరబడినప్పుడు
చీకట్లో చెట్టు…
కూకటి వేళ్ళతో తన లోతుల్లోతుల్లోకి ప్రయాణిస్తుంది
లోపల్లోపల పచ్చని దీపమై ప్రాణం పోసుకుని కొత్త మిణుగురులతో పులకరిస్తుంది-
అయినా…
చైత్రం గురించి చిత్రంగా పాడుకునేదేముంది?
మార్గశిరం చీకట్లో చెట్టు ముందు మోకరిల్లాలి కాని-

 

  1. నువ్వు – నేను – మృత్యువు

వెలుగులోకి చీకటి జూలు విదిల్చి నెమ్మదిగా అడుగుపెడుతున్నట్టు ప్రాణంలోకి మృత్యువు చొరబడుతున్న క్షణాల్లో గుర్తొచ్చే బతికిన క్షణాల్లో వినిపించే రాగాల నయగారాలు ఉవ్వెత్తున ఎగసిపడి మీద పడి తడిమేసి తడిపేసి తోసేసినప్పుడు నువ్వు నేను మృత్యువు కలిసే కదా ఆ సంబరంలో కొట్టుకుపోయాం?

***

లోలోపల తవ్వుకుంటూ విత్తనాలు జల్లుకుంటూ నైరుతి రుతుపవనాల కోసం రెప్పలు తెరుచుకుని తాటి తోపులో ముంజలు వొలిచిన కాయలమై ఏటి ఇసుకలో దొర్లుకుంటూ పోయినప్పుడు వేసవితో వేసారి ఆవిరైన వాగు శకలాల్లో కనిపించిన ఆకాశమే కదా మన ప్రతిబింబం అనుకున్నాం!

***

పుట్టి బుద్ధెరిగినప్పటినుంచీ ప్రతి రాత్రీ చీకటితో కలల ముడుపులు కట్టి మొలతాడుకు వేలాడేసుకుని నదీ స్నానంతో సూర్యోదయంలోకి వెళ్ళి దహన సంస్కారం చేసుకుని సూర్యాస్తమయం నుంచి నివురు గప్పిన నిప్పులా నిష్క్రమిస్తున్నప్పుడు కాలిన గాయమైన దైహికైహిక ధూపంలోంచి విడిపోతున్న సాంబ్రాణి సువాసన నువ్వే కదా?

***

ఎండిన కుంటలో కళ్ళన్ని ముళ్ళు చేసుకుని నిలబడ్డ తుమ్మచెట్ల మీద ఆరేసుకున్న వెన్నెల బొంత మీద చిరుగుల్ని నిమిరి కుమిలిపోతున్నప్పుడు ఊరినంతా కప్పేసిన అమాస గబ్బిలం రెక్కల్లో మృత్యువు వెచ్చదనాన్ని అనుభవించిన మొక్కవోని ధైర్యంతో ఒంటరిగా మనమేగా?

***

గుత్తులు గుత్తుల తంగేడు పూలను బస్తాలో వేసుకుంటూ గుట్టలెంబడి పుట్టలెంబడి గునుగు పూలు తెంపుకుంటూ సజ్జ కంకుల గింజలను ఒడుపుగా తింటూ చెట్టు మీది మక్క సిత్ఫాల పండ్లను తిని తరించిన కాలం చిన్నప్పటి దోస్తులా చేజారిపోతే వెనక్కితిరిగి చూసుకోలేక ఆ తరువాతెపుడో బస్టాపుల్లో రైల్వే ఫ్లాటుఫారాల మీద దేవులాడుతుంటే నువ్వొక రేపటి జ్ఞాపకంలా నను చేయిపట్టుకుని తీసుకువెళ్ళినప్పుడు చితి వెలుగులాంటి గమ్యం కనిపించింది కదా మనిద్దరికీ?

***

రణమైనా.. ప్రణయమైనా… గమ్యం చేరని ప్రయాణమే కదా మనం కోరుకున్నాం!
వలపుల తలపుల మలుపుల ఝరిలా సముద్రాన్ని ధిక్కరించాలని కదా నిర్ణయించుకున్నాం-
ఇంద్రజాలికుడి కత్తుల పంజరంలో మాయమైన పావురంలా మృత్యువు కూడా ఈ ప్రయాణంలో మనకు తోడుగా వచ్చే బాటసారేనని కూడా తెలుసుకున్నాం-

***

తలమీంచి టోపీ తీసి పావురాన్ని అలా ఒయ్యారంగా గాలిలోకి వదిలేసిన మాయావిని చూసి అందరూ చప్పట్లు కొడుతుంటే..
మనం మాత్రం నవ్వుకుంటూనే ఉన్నాం కదా!

                                                          – పసునూరు శ్రీధర్ బాబు

 

పసునూరు శ్రీధర్ బాబు: నల్లగొండ జిల్లా మోత్కూరు లో పుట్టి పెరిగారు. న్యాయ శాస్త్ర పట్టభద్రుడు. వృత్తి రీత్యా జర్నలిస్టు. ప్రింట్, విజువల్ మీడియాలో చిరకాలంగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి. తన కవితా సంపుటి ‘అనేక వచనం’ అనేక ప్రశంసలు అందుకుంది. వైయక్తిక అనుభవాల్ని తాను చూసినంత సాంద్రంగా పఠితలకు అందించే పదునైన కలం. శ్రీధర్ బాబు ప్రస్తుతం ఢిల్లీలో, బిబిసి న్యూస్ ఛానల్ లో సీనియర్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. శ్రీధర్ బాబు కవిత్వ శక్తికి మచ్చుతునకలుగా ఈ మూడు కవితలు. సో, త్రీ ఛీర్స్ టు పొయెట్రీ అఫ్ శ్రీ.

పసునూరు శ్రీధర్ బాబు

పసునూరు శ్రీధర్ బాబు: నల్లగొండ జిల్లా మోత్కూరు లో పుట్టి పెరిగారు. న్యాయ శాస్త్ర పట్టభద్రుడు. వృత్తి రీత్యా జర్నలిస్టు. ప్రింట్, విజువల్ మీడియాలో చిరకాలంగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి. తన కవితా సంపుటి ‘అనేక వచనం’ అనేక ప్రశంసలు అందుకుంది. వైయక్తిక అనుభవాల్ని తాను చూసినంత సాంద్రంగా పఠితలకు అందించే పదునైన కలం. శ్రీధర్ బాబు ప్రస్తుతం ఢిల్లీలో, బిబిసి న్యూస్ ఛానల్ లో సీనియర్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.

1 comment

  • కవితా సౌరభం తన్ను తాను లోపలికి చూసుకున్నట్లు ఉంది….. కవితా శరీరం తనపై తాను బాడీ స్ప్రే చల్లుకున్నట్లు ఉంది…. అక్షరాలకూ పరిమళాలు ఉంటాయి అంటాడు కృష్ణ శాస్త్రి! వాక్య నిర్మాణం లో ప్రవాహశీలత ఉంది…. భావంలో శీలం ఉంది

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.