పాఠకులే విలేకరులు

… ఇప్పుడు న్యూస్ స్వరూపం మారిపోయింది. ‘పేపర్’ కనుమరుగవుతూ ఉంది. మెళ్లిగా పేపర్ లెస్ పరిపాలన, న్యూస్ పేపర్ లెస్ జీవితం మొదలయింది. ఈ దశకు తగ్గట్టు న్యూస్ కూడా అవతారం మార్చుకుంటున్నాయి. పొద్దన లేస్తూనే న్యూస్ పేపర్ పట్టుకోవడానికి బదులు స్మార్ట్ ఫోన్ తెరుస్తున్నారు. న్యూస్ చూస్తున్నారు, చదువుతున్నారు, ..

పూర్వం న్యూస్ పేపర్లు చదివేందుకు ఒక పద్ధతి, ఒక టైం ఉండేది. నిజానికి దినంలో ఎపుడైనా న్యూస్ పేపర్ ను తిరిగేయవచ్చు. అలా కాకుండా, పొద్దునే తీరుబడిగా ఇతర కార్యక్రమాలు మొదలుపెట్టడానికి ముందే, ఈ తంతు విధిగా పూర్తి చేయాలనే అదుర్దాతో న్యూస్ పేపర్ చదవడం అలవాటయింది. పొద్డన్నే పేపర్  కోసం ఎదురుచూడ్డం అనేది ఒక ఇంట మాత్రమే కాదు,దేశ మంతా, ఆ మాటకొస్తే విశ్వవ్యాపితంగా కనిపించే అలవాటు. దేశ ప్రజలంతా సామూహికంగా చేసే ముఖ్యమయిన తతంగాల్లో ఇదే మొదటిది. పొద్దున్నే పేపర్ అని కేక వినకపోతే, చిరాకు పడేవాళ్లు. పేపర్ బాయ్ కోసం ఎదురుచూడ్డం, పేపర్ వరండాలో పడ్డాక ఎగబడ్డం ఏ ఇంట జరగలేదు? బంగ్లాదేశ్ యుద్ధం మొదలయిందని ఆకాశవాణి వార్తల్లో విన్న మా వాళ్లు, మరుసటి రోజు పది కిలో మీటర్ల దూరాన ఉండే  జమ్మలమడుగుకు పంపించి ఆంధ్రపత్రిక పేపర్ తెప్పించుకున్న రోజు నాకు బాగా గుర్తుంది. ఇపుడే కాదు న్యూస్ పేపర్ చదవడం అనే mass ceremony 19వ శతాబ్దంలో కూడా ఉండింది.అందుకే హెగెల్ న్యూస్ పేపర్ చదివే అలవాటును modern man’s morning prayer అన్నాడు. The newspaper has substituted morning prayer of modern man ఆయన ఆ రోజే న్యూస్ పేపర్ తీసుకు వచ్చిన ఒక కొత్త సాంఘిక వ్యాపకం గురించి ఒక్క మాటలో చెప్పాడు. ఈ అలవాటే తర్వాత్తర్వాత నేషనలిజం పుట్టుకకి ఎలా దారితీసిందో  బెనెడిక్ట్ యాండర్సన్ (Imagined Communities) చూపించాడు.

ఇప్పుడు న్యూస్ స్వరూపం మారిపోయింది. ‘పేపర్’ కనుమరుగవుతూ ఉంది. మెళ్లిగా పేపర్ లెస్ పరిపాలన, న్యూస్ పేపర్ లెస్ జీవితం మొదలయింది. ఈ దశకు తగ్గట్టు న్యూస్ కూడా అవతారం మార్చుకుంటున్నాయి. పొద్దన లేస్తూనే న్యూస్ పేపర్ పట్టుకోవడానికి బదులు స్మార్ట్ ఫోన్ తెరుస్తున్నారు. న్యూస్ చూస్తున్నారు, చదువుతున్నారు, వింటున్నారు. ఇవన్నీ ఏకకాలంలో జరిగిపోతున్నాయి.  అయితే, ఇది పొద్దుటికి మాత్రమే పరిమితమయిన వ్యాపకం కాదు.  అంతేకాదు, అప్పటికి ఇప్పటికి న్యూస్ చదివే పద్దతిలో చాలా  తేడా వచ్చింది. చాలా కాలం కిందట ఆంధ్ర భూమి వారపత్రిక ప్రకటన లో ‘కవర్ పేజీ నుంచి చివరి పేజీ’దాకా అని రాసి ఉండింది. అంటే వార్తలకు లేదా సమాచారానికి మొదటి పేజీతో మొదలయి, ఒక పద్ధతి ప్రకారం చివరి పేజీదాకా తీసుకెళ్లే శక్తి ఉండాలని, అలాంటి శక్తి ఆంధ్రభూమికే ఉందని ఈ ప్రకటన చెబుతుంది. మొదటి పేజీలో చాలా ముఖ్యమయిన వార్తలుంటాయి. ఇవెంత ముఖ్యమయినవవో, మొదటి పేజీలో ఏ వార్తలుండాలో నిర్ణయించేది తలనెరసిన జర్నలిస్టులు. డిజిటల్ యుగంలో ఈ వ్యవహారం తలకిందులయింది. ఏది ముఖ్యమో నిర్నయించేది జర్నలిస్టులుకాదు. పాఠకుడే. పాఠకుడికి ఏది నచ్చుతుందో ట్రెండింగ్ బట్టి అదే వార్త అవుతుంది.  అదే రాయాలి. దాన్ని కూడా అతగాడికి నచ్చేలా రాయాలి. ఇందులో కవిత్వం, కాకరకాయలు నింపితే… చెల్లదు. చెల్లినా అది లాభసాటి కాదు. డిజిటల్ జర్నలిజం పచ్చి వ్యాపారం. మిలెన్నియళ్ల ఆవేశాన్ని, బలహీనతలను, బలాన్ని వడుపుగా వాడుకోవడమే డిజిటల్ జర్నలిజం. డిజిటల్ ఆడియన్స్, న్యూస్ పేపర్ పాఠకుల లాగా వార్తలు చదవరు. న్యూస్ పేపర్ పాఠకులు పఠనా యాత్రను మొదటిపేజీతో మొదలుపెడితే, డిజిటల్ ఆడియన్స్ తమకు నచ్చిన గండి లోనుంచి న్యూస్ పోర్టల్ లోకి దూరుతారు. ఎలా వస్తారో ఎవరూ చెప్పలేరు. కచ్చితంగా మొదటిపేజీ (హోం పేజీ) ద్వారా రావడం లేదు. వైబ్ సైట్ లోకి వచ్చే ఆడియన్స్ లో 80 శాతం మంది సోషల్ మీడియా ద్వారా వస్తున్నారు.  వీళ్లెవరూ హోం పేజీ ద్వారా న్యూస్ పోర్టల్ లోకి ప్రవేశించడం లేదు. హోం పేజీ ద్వారా న్యూస్ పోర్టల్ లోకి ప్రవేశించే వారు నాలుగయిదు శాతం మించరు. అంటే డిజిటల్ జర్నలిజం మొదటి పేజీని చంపేసింది. పోర్టల్స్ అందంగా హోం పేజీని ముస్తాబు చేసుకున్నా దాని ప్రయోజనం చాలా తక్కువ.

ఎదో ఒక న్యూస్ గురించి ఏదో రూపంలో తెలుసుకుని  న్యూస్ పోర్టల్ లోకి ప్రవేశించి, ఆ వార్త చదివేసి అటే వెళ్లిపోతుంటారు. ఎటు వెళ్లిపోతున్నారనేది మరొక ఆసక్తికరమయిన పరిశోధన. ఆడియన్స్ కు నచ్చిందే ముఖ్యమయిన వార్త. పాతకాలపు ఎడిటర్లకు నచ్చిన వార్తలు చాలా మటుకు డిజిటల్ ఆడియన్స్ కు నచ్చవు. డిజిటల్ ఆడియన్సంతా 1990 దశాబ్దంలో పుట్టిన మిల్లెనియల్స్. మొన్నామధ్య మోదీ చైనా పర్యటనకు వెళ్లిన వార్తను చదివిన వారి కంటే,  అనుకోకుండా వేసిన అడల్ట్ కంటెంట్ వార్త వైరలయ్యిందని బిబిసి లో పనిచేసే మిత్రుడొకాయన వాపోయాడు. వార్తని వైరల్ చేయడం మిల్లెనియల్స్ ప్రధాన వ్యాపకం. జర్నలిజానికి డిజిటల్ యుగం తీసుకువచ్చిన గొప్ప గుణం ఇది. నచ్చిన సమాచారాన్ని ప్రపంచం నాలుగు మూలలకు తీసుకుపోయేది వాళ్లే. అందుకే వాళ్లకి నచ్చిందే వార్త. ఈ తరానికి న్యూస్ పేపర్ ముట్టుకునే అలవాటు లేదు.

ఇలాంటి ఒక తరం మొత్తంగా న్యూస్ పేపర్లను చదవడం మానేస్తే ఏమవుతుంది? వీళ్ల దెబ్బకి అమెరికాలో వేళ్లూనుకుని ఉండిన న్యూస్ పేపర్లన్ని కుప్పకూలిపోయాయి.

ఇండియాకు ఆ ప్రమాదం ఇప్పట్లో లేదని పండితులు చెబుతున్నారు. ఇక్కడ ఇంకా అక్షరాస్యత 66 శాతం మించలేదు. ఆక్షరాలు నేర్చుకోవలసిన వాళ్లే కోట్లలో ఉన్నారు. వాళ్లంత చక్కగా తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు. వాళ్ల వోట్ల కోసం నేతలంతా తెలుగులోనే మాట్లాడుతున్నారు. అసెంబ్లీ చర్చలన్నీ చక్కగా తెలుగులోనే సాగుతున్నాయి.  చాలా మంది చెబుతున్నట్లు మాతృభాషలకు అంతప్రమాదం మేమీ లేదు. అదే సమయంలో ఇంగ్లీష్ భాష నేర్చుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అందుకే భారతదేశంలో న్యూస్ పేపర్లు చదివే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అందులో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’వార్షిక వృద్ధి ప్రపంచంలోనే ఎక్కువగా ఉందని 2012లో భారత దేశ పత్రికా రంగం మీద Citizens Jain పేరుతో Ken Auletta ‘The New Yorker’ లో ఒక అద్భుతమయిన పరిశోధనా వ్యాసం రాశారు. తెలుగు పేపర్ల సర్క్యు లేషన్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.

ఇపుడు నడుస్తున్న కాలం మిల్లెనియల్  తరానిదే. ఈ తరానికి చెందిన వారిలో 94 శాతం మందికి స్మార్ట్ పోన్లున్నాయి. ఇందులో 64 శాతం మంది ప్రపంచంలో  ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. వీళ్లు చదివే పద్ధతివేరు. చదివాక వార్తకు ప్రతిస్పందించే పద్దతి వేరు. సోషల్  మీడియా వీళ్ళ నేషనల్ హైవే. మరొక దారి గురించి పట్టించుకోవడం చాలా అరుదు. స్వచ్ఛమయిన వార్తలంటే వీళ్లకి బోర్. మిల్లెనియల్స్ గవర్నమెంటు వార్తలను,  ప్రెస్ రిలీజ్ వార్తలను చదవనే చదవరు. ముఖ్యమంత్రులు ప్రసంగాలను వినే వాడే లేడు. వార్తలను ఆవేశపూరితంగా చెప్పడం వీళ్లకి నచ్చుతుంది. ఆనందం కావచ్చు, ఆఘాయిత్యం కావచ్చు, అతగాడి మనసును తాకాలి. వార్త ఏదో విధంగా వీళ్లకి పల్లేరు కాయలాగా తగులుకోవాలి. అంతే, వార్తతో ‘ఎంగేజ్’అవుతారు. దీనిఫలితమే వార్త (ఏదేనీ సమాచారం) వైరల్ కావడం. వైరల్ అవుతున్నాయని చెప్పుకుంటున్న వార్తలన్నీ ఇలాంటి పల్లేరు కాయలే. వార్తతో ఏదో ఒక విధంగా బాంధవ్యం తెచ్చుకుంటారు. అలాంటి వార్తలకే ప్రాముఖ్యం ఇస్తారు.

ఒక  ఆదివారం రాత్రి పదిగంటలపుడు ఒక అమ్మాయి, అబ్బాయి  కె ఎఫ్ సి లో కాలక్షేపం చేసి, చెట్టపట్టాలేసుకుని, సరదగా కబుర్లాడుకుంటూ రోడ్డెంబడి వస్తుంటారు. వాళ్ల హాస్టల్ మలుపు తిరుగుతారు. అక్కడ వీధి లైట్లు వెలగడం లేదు. ఇంతలో ఎవరో చిల్లరగాడు బైక్ మీద పోతూ ఆ ఆమ్మాయి భుజాన్ని తట్టి వెళ్లిపోతాడు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఫేస్ బుక్ లో ఈ ఘటనని, పారిపోతున్న బైక్ మసకలోనే వీడియో తీసి పోస్టు  చేస్తారు. ఇలా రాత్రి సరదగా కొద్ది సేపు గడిపి ఇళ్లకో, హాస్ఠళ్లకో వెళ్తున్నవాళ్లకు, అలాంటి అవకాశం కోసం ఎదరుచూస్తున్న అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ పోస్టు చూశాక వొళ్లు జలదరిస్తుంది. వాళ్లలో వీళ్లు తమని చూసుకుంటారు. ఈ దుర్ఘటన తమకు జరగవచ్చు. తమ కుటుంబ సభ్యులకు జరగవచ్చు. ప్రేమలో పడి సరదాగా తిరుగుతున్నవాళ్లు, ప్రేమలో పడేందుకు, సరదాాగా ఇలా కలసి నడవాలనుకుంటున్న వాళ్లంతా ఈ పోస్టుతో ఆవేశానికి లోనవుతారు. డిప్రెషన్ లో పడిపోతారు. ఎందుకంటే చీకటి రోడ్డు మలుపులు, వీధి దీపాలు వెలగక పోవడం, మహిళల మీద అత్యాచారాలు రోజు చూస్తున్నవే. ఇవన్నీ కళ్ల ముందు ప్రత్యక్షమయి ఆ చిల్లరగాడు చేసిన పని భయంకరమయిన సామాజిక వాస్తవమయి మనసును కలచి వేస్తుంది. అంతే, ప్రపంచాన్ని అలర్ట్ చేసే పనిలో పడిపోతారు. ఈ వార్త ని లైక్ చేస్తారు, కామెంట్ తో బలపరుస్తారు.  షేర్ చేసి దానిని వైరల్ చేస్తారు. వొళ్లు పులకరింప చేసే మంచి ఉపన్యాసం, పాట, లేదా జోక్ విషయంలో కూాాడా ఇలాంటివి జరగుతుంటాయి. ఢిల్లీ నిర్భయ సంఘటన, ప్రియా ప్రకాశ్ వారియర్ కనుసైగ పాట, జలీల్ ఖాన్ బికాం ఫిజిక్స్ వీడియో వైరలయింది ఇదే పద్ధతిలోనే.

“Newsworthiness of the story would be closely connected to the voluntary behavior of the audience and would shift according to the needs of the audience. The story would then erupt into user-driven multimedia package  with nearly infinite incarnations involving perhaps one mobile journalist, several staffers and freelancers, citizen journalist, bloggers and consumers providing different informational pieces of the totally puzzling experience,” అని Michele Weldon బాగా సూక్ష్మీకరించారు.

  • జింకా నాగరాజు

జింకా నాగరాజు

జింకా నాగ రాజు సుప్రసిద్ధ పాత్రికేయులు, ప్రింట్, విజువల్ మీడియాలో  చిరకాలం అనుభవం ఉన్న ప్రజా ప్రేమి

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.