ప్రశ్నలూ జవాబులు

 

 • రంగనాయకమ్మ

 

తెలుగు సాహిత్యంలో అచ్చమైన తిరుగుబాటు బావుటా రంగనాయకమ్మ. మానవ స్వేఛ్చకోసం దీర్ఘకాలికంగా ఏం చేయాలో చెబుతూనే, ఎప్పటికప్పుడు ముందుకొచ్చే చిటిపొటి సమస్యలనూ శోధించి మాట్లాడుతున్నారామె. కేవలం సైద్ధాంతిక సమస్యలే కాదు. కుటుంబాలు, పిల్లలు, బళ్ళు, గుళ్ల వంటి దైనందిన జీవన సమస్యలపై కూడా మీరు ప్రశ్నలు పంపించ వచ్చు. ఆ విధంగా ఇవాళ అత్యవసరమైన డిస్కోర్సును ముందుకు తీసుకెళ్లవచ్చు. మీ ప్రశ్నలను <rastha.hrk@gmail.com> కు పంపించండి….. ఎడిటర్                                                           

 1. ప్రశ్న:  పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశకు చేరకముందే దాని బలహీనమైన లింక్ ను తెంచడం ద్వారా సోషలిజం సాధించవచ్చని, రష్యాలో మార్క్సిజాన్ని సృజనాత్మకంగా అన్వయించాడని లెనిన్ ను కీర్తించారు అందరూ. లెనిన్ మార్క్సిజానికి చేసిన ఈ కొత్త సూత్రీకరణ రివిజనిజం అవదా? లెనిన్ చేసింది మార్క్సిజమేనా? కాదు కాబట్టే, లెనిన్ అవగాహనని,’లెనినిజం’ అనే లేబుల్ వేసుకోవడం జరిగిందా? జార్ రాచరిక పాలన తరువాత, అసంఖ్యాకంగా వున్న నిరక్షరాస్యులతో,’సోషలిజం నిర్మించడం’ సాధ్యమా? నాయకులూ, ప్రజలూ, కనీస చదువులు కూడా లేకుండా ఫ్యూడల్ సంస్కృతిలో వున్న వారికి, మార్క్సిజం ఎలా తెలుస్తుంది?
 • ఎం. విజయ, హైదరాబాదు.

జవాబు: మీరు రాసిన చాలా ఎక్కువ చర్చలో మీరు అడిగిన ప్రధానమైన అంశాల్ని మాత్రమే తీసుకున్నాను. మీ చర్చలో ఇతర అంశాలన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయి.- మీ ప్రశ్నలకు, నా జవాబుగా మొదట క్లుప్తంగా చెప్పేది, లెనిన్ చేసింది ఏ మాత్రమూ పొరపాటు కాదు- అని. దీన్ని వివరంగా చూస్తాం తర్వాత. ఏ దేశంలో అయినా, ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా, ‘ మార్క్సిజం’ తెలిసి వుండి, ఆ గ్న్యానంతో తన వుద్యమాన్ని నడుపుతూ వుంటే, అది ‘మార్క్సిజం’ కోసమే అవుతుంది గానీ, అది వేరే ‘’ఇజం’’ అవదు. లెనిన్ అభిప్రాయానికి ‘’లెనినిజం’’ అని పేరు పెట్టాం- అంటే అది ‘మార్క్సిజం’కాని, ఇంకో ఇజం అవుతుంది. ప్రతీ దేశంలోనూ కమ్యూనిస్టు పార్టీలూ, దాని నాయకత్వాలూ, దాని ఉద్యమాలూ, వుంటాయి. అవి మార్క్సిజం దృష్టితోనే నడుస్తూ వుంటే, అలాగే నడవాలని ప్రయత్నిస్తూ వుంటే, అది వేరే “ఇజం” అవదు. అవుతుందా? ఒక్కో దేశంలో, ఒక్కో పార్టీది, వేరే “ఇజం” అవుతుందా? ఏ దేశంలో పార్టీ అయినా, మార్క్సిజం దృష్టితోనే వుంటే, అది మార్క్సిజమే. దానికి వేరే “ఇజం” పేరు పెట్టకూడదు. “మార్క్సిజం” అనీ, “లెనినిజం” అనీ, వేరువేరుగా వుంటే, అవి ‘వేరు వేరు ఇజాలు’ అనే అర్ధాలు ఇవ్వవా? లెనిన్ నీ, ఆ బృందాన్నీ, ఆ దేశ నాయకత్వంగా చెప్పవచ్చు గానీ, దాన్ని ఒక “ఇజం”గా చెప్పడం ఏమిటి? ఇలాగైతే, ఒక్కో దేశంలో, ఒక్కో ప్రాంతానికి ఒక్కో’ఇజం’ వున్నట్తు చెప్పుకోవలిసిందే. ఇది శుద్ధ తప్పు- అని నేను గతంలోనే రాశాను. దాన్ని గురించి పార్టీల్లో చర్చలే జరగలేదు.- మీరు అడిగిన ఇతర ప్రశ్నల గురించి చెప్పుకుందాం. పెట్టుబడిదారీ విధానం ‘అత్యున్నత దశ’కు చేరక ముందే సోషలిజాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చునా- అన్నారు. ఈ సందేహం, యాంత్రికమైనదే. ‘శ్రమ దోపిడీ’ అయితే, వేల సంవత్సరాల నాడే బానిసత్వ కాలంలోనే ప్రారంభమైనప్పటికీ, దాన్ని అర్ధం చేసుకోవడం పెట్టుబడిదారీ విధానంలోనే సాధ్యమైంది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే, ‘కాపిటల్’ లో నేర్చుకోవలిసిందే. ‘శ్రమ దోపిడీ’ గురించి తెలియని కాలంలో, శ్రామికుల బాధల గురించి, పై పై సంస్కరణలు తప్ప ఇతర మార్గం వుండదు. కానీ, పెట్టుబడిదారీ విధానంలో, ‘సరుకుల’ పద్ధతి, అత్యధికంగా ప్రారంభమై, ‘డబ్బు అంటే శ్రమ’ అనీ; వడ్డీ- లాభాలంటే ‘అదనపు విలువ’లో భాగాలనీ; వగైరాలన్నీ తెలిసిపోయిన తర్వాత, ఇంకా పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ కోసం ఎదురుచూస్తూ కూర్చోవాలా? ప్రపంచంలో, అనేక దేశాలు వున్నాయి. ఆ దేశాల్లో, ఉత్పత్తి సంబంధాల్లో, తేడాలు వున్నాయి. ‘బ్రిటన్’ వంటి దేశంలో పెట్టుబడిదారీ విధానమే ప్రధానంగా వున్నప్పటికీ, ఇంకెక్కడో ఒక దేశంలో ‘బానిసత్వమే’ సాగుతోందనుకుందాం. ఆ దేశంలోనే, ‘ శ్రమ దోపిడీ’ గురించి తెలిసిన వ్యక్తులు వున్నారనుకుందాం. వాళ్లు, బానిసలకు శ్రమ దోపిడీ నించి విముక్తి చెందాలని చెప్పకూడదా? ఆ బానిస పోరాటాలు జరగాలనీ, తర్వాత కౌలు రైతు విధానం రావాలనీ, అప్పుడు కూడా రైతు వుద్యమాలు జరగాలనీ, ఆ తర్వాత పెట్టుబడిదారీ విధానం ప్రారంభం కావాలనీ, అది అత్యున్నత దశకి చేరాలనీ, అలా, అంత వరకూ, తర తరాల వరకూ చూస్తూ వుండి, అప్పుడు ‘సోషలిజం’ మాట ఎత్తాలని, అనుకోవాలా?-’ బానిసత్వం’లోనే ఒక ప్రాంతం వుండవచ్చు. కానీ, అప్పటికే ‘శ్రమ దోపిడీ’ గురించి తెలిసి పోయిన సిద్ధాంతాన్ని తెలుసుకున్న వ్యక్తులు వుంటే, వాళ్లు, బానిస బృందాలతో, రహస్య పద్ధతుల్లో, శ్రమ దోపిడీ గురించి చెప్పవచ్చు. అక్కడ జరగవలిసిన వుద్యమం అంతా బానిసలకు ‘విముక్తి’ మార్గం నేర్పడమే. ‘మార్క్సిజం’ అనే సిద్ధాంతం, ‘శ్రమ దోపిడీ’ గురించి కనిపెట్టిందనీ, కాబట్టి బానిసత్వాన్నే భరిస్తూ కూర్చోనక్కర లేదనీ, బానిసలకు బోధించకూడదా? వాళ్ళకి తెలుస్తుందా? అంటారా?’  చెప్పేవాళ్ళకి తెలిస్తే, వినే వాళ్ళకి ఎందుకు తెలీదు? నేర్పే బృందాల శక్తి మీద అధారపడి వుంటుంది అది. బొలీవియాలో, ఒక కార్మిక నాయకుడు, కార్మికులకు ‘శ్రమ దోపిడీ’ గురించి ఎలా చెప్పాడంటే, ఒక కాయితం చూపించి,”మనం చేసే మొత్తం శ్రమ, ఈ కాయితం అంత అనుకుందాం” అన్నాడు. ఆ తర్వాత, ఆ కాయితంలో ఒక మూల చిన్న ముక్క చింపి, “ మనం చేసిన మొత్తం శ్రమలో నించి, ఈ చిన్న ముక్క అంత భాగమే మనకు వచ్చే జీతాల భాగం. మిగతా భాగం అంతా, అదనపు విలువే. అది మన శ్రమే. అది, ఏ శ్రమలూ చెయ్యని వాళ్ళకి పోతుంది. అందుకే మనం ఇంత బికారులుగా వుంటాం.” అని చెప్పాడు. అసలు ‘ కాపిటల్’ చదివి వినిపిస్తూ చెప్పవచ్చు. చక్కగా అర్ధం అవుతుంది.- అసలు, పెట్టుబడిదారీ విధానం ‘ అత్యున్నత దశకి చేరడం’ అంటే, ఎక్కడి దాకా చేరితే ‘అత్యున్నత దశ’ అవుతుంది? అది, యుద్ధాలు చేస్తూ వుంటే, అది అత్యున్నత దశా? అలాగైతే, యుద్ధాలు జరిగిపోతూనే వున్నాయి. ఇంకా ఎంత దాకా ఎదురుచూడాలి? పెట్టుబడిదారీ విధానాన్ని అడ్డుకుంటేనే అది ఆగుతుంది గానీ, దానికై అది ఎప్పటికీ ఆగదు. దాన్ని ఆపాలి. ఎక్కడైనా ఆపవచ్చు. భూస్వామ్య విధానమే వున్నప్పుడు, దాన్ని ఆపడానికే ఉద్యమం చేయవచ్చు. నాయకులకూ, శ్రామిక ప్రజలకూ అంత చైతన్యం వుంటుందా?- అనేదా ప్రశ్న? ఆ చైతన్యం గల నాయకులు వుంటేనే శ్రామిక ఉద్యమం అనేది ప్రారంభం అవుతుంది, లెనిన్ బృందానికి ఆ చైతన్యం వుంది కాబట్టే, అది ‘సోషలిజం’ కోసం ప్రయత్నం ప్రారంభించింది. ఆ ప్రయత్నమే లేకుండా, ప్రజలకు నేర్పాలని ప్రయత్నించకుండా, ‘’ జారిజం పోయే దాకా ఆగుదాం, పెట్టుబడిదారీ విధానం ఇంకా పెరిగే దాకా ఆగుదాం’’ అని చేతులు ముడుచుకుని కూర్చోవాలా? లెనిన్ బృందం, శ్రమ దోపిడీ సంబంధాల్ని తీసివేసే సోషలిజం గురించి తెలిసి, దాని కోసం ప్రయత్నించడం ‘రివిజనిజం’ అవుతుందా? ఎంత తప్పు అవగాహన ఇది! ‘రివిజనిజం’ అంటే, ‘మార్క్సిజం’లో, ఆచరణకు సాధ్యం కాని ‘వర్గ పోరాటం’ అనే అవగాహన వుందనీ; అది జరిగేది కాదనీ; ‘వర్గ సామరస్యాన్నే’చెప్పాలనీ; దోపిడీ వర్గంతో సామరస్యంతో ప్రవర్తించాలనీ; చెప్పేది, రివిజనిజం. లెనిన్ బృందం చెప్పింది, అది కాదు. అది ఎంత మైనారిటీ(చిన్న) బృందం అయినా, దాని అవగాహన ‘వర్గ పోరాటమే’ గానీ,’ వర్గ సామరస్యం’ కాదు.

    పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశకు చేరక ముందే సోషలిజం సాధించవచ్చునా- అనే ప్రశ్న యాంత్రికమైనదే. ఎలాగంటే, సోషలిజం అయినా, దాని ‘ఉన్నత దశ’ అయిన కమ్యూనిజం అయినా, ఏదో ఒక దశ దగ్గర ప్రారంభమై క్రమంగా సాగవలిసిందే. ఈ విషయం అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని పాయింట్లు ‘ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో కనబడతాయి. ఈ విధంగా: … సకల ఉద్యమాలలోనూ వాళ్ళు ( కమ్యూనిస్టులు) ఆస్తి సమస్యను ప్రధాన సమస్యగా ముందుకు తెస్తారు- ఆ నాటికి ఆస్తి వ్యవస్థ యే మేరకు అభివృద్ధి చెంది వుండినా సరే’’  ( అది, బానిసత్వంగానీ, భూస్వామ్యం గానీ, ఏది కానీ అని అర్ధం.)

“ కార్మిక వర్గ విప్లవంలో మొదటి మెట్టు- కార్మిక వర్గం, పాలక వర్గం కావడమనీ, అది ప్రజాస్వామ్యాన్ని గెలుచుకోవడమనీ, పైన తెలుసుకున్నాం”.

      “కార్మిక వర్గం, తన రాజకీయ ఆధిపత్యం ఉపయోగించి, బూర్జువా వర్గం నుండి సమస్త పెట్టుబడిని క్రమ క్రమంగా స్వాధీన పర్చుకొని, ఉత్పత్తి సాధనాలన్నిటినీ రాజ్యం చేతుల్లో- అనగా పాలక వర్గంగా సంఘటిత పడిన కార్మిక వర్గం చేతుల్లో- కేంద్రీకరించి……..…………………………………’’

   “ఈ చర్యలు భిన్న దేశాల్లో భిన్న భిన్నంగా వుండడం సహజమే.”- ‘ కార్మిక వర్గం’ అని వుంది కాబట్టి, ఆ శ్రామిక వర్గ ఉద్యమం, పెట్టుబడిదారీ విధానంలోనే, పైగా, దాని అత్యున్నత దశలోనే, జరగాలని కాదు. సిద్ధాంతం తెలిసి వున్న తర్వాత, ‘శ్రమ దోపిడీ’ నించి బైట పడే ప్రయత్నం, ఏ దశలో అయినా ప్రారంభించవచ్చు. సిద్ధాంతమే  లేకపోతే, ‘విముక్తి’ దాకా జరగదు.

  ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ లోని ఆ మాటల్ని బట్టి మనకి అర్ధమెయ్యేది ఏమిటంటే, పెట్టుబడిదారీ విధానం “ ఏ మేరకు అభివృద్ధి” చెందిందీ అనేది ప్రధానం కాదు. అలాగే, సోషలిజం దాకా చేరాలంటే, అనేక ‘మెట్లు” ఎక్కాల్సి వుంటుంది. ఆ దశకు చేరాలంటే, భిన్న దేశాల్లో భిన్న చర్యలు చేపట్టాలి.

  ఈ దృష్టితో చూసినప్పుడు రష్యాలో లెనిన్ బృందం చేసిన ప్రయత్నాలూ, అన్వయింపులూ, పూర్తిగా సరైనవే అవుతాయి.

    

 1. ప్రశ్న: గతంలో కంచ ఐలయ్య అనే ప్రొఫెసర్ గారు ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’ అనే పుస్తకం రాసినప్పుడు, అనుకూలురు, వ్యతిరేకులు, సుమారు రెండు నెలల దాకా వాదనలూ ప్రతివాదనలతో హోరెత్తించారు. వీధులకి ఎక్కారు, దాడులకు దిగారు. ‘ఆంధ్రజ్యోతి’ అయితే, ‘సంయమనం పాటించండి’ అంటూ ఒక సంపాదకీయమే రాసింది. అభ్యుదయవాదులనే వారు సైతం, ‘ఆయన వాస్తవాలే చెప్పారు, కాకపోతే టైటిలే బాగాలేదు, రెచ్చగొట్టేలా ఉంది’ అని అభిప్రాయపడ్డారు. వామపక్షాలు కూడా ‘ చేతనైతే మీరూ పుస్తకం రాయండి’ అంటూ ఇంకా ఆజ్యం పోశాయి. సమాజంలో, ఇలాగ ఒక తరహా అశాంతినీ, మనస్పర్ధనీ పెంచిన ఈ విషయంపైన మీరు ఏమీ స్పందించలేదు. ఇంతకంటే తక్కువ తీవ్రత గల అంశాల్లో సైతం కలుగజేసుకొని, మాట్లాడిన మీరు, ఈ విషయంలో ఎందుకనో మౌనం వహించారు. మీకభ్యంతరం లేకపోతే, ఇప్పుడైనా, ఈ వేదికలో దానిపైన ఏమన్నా చెప్పండి. మీ స్పందన కోసం ఎదురుచూసేవాళ్ళు వుంటారు, నా లాగ.

            పి. సాంబశివరావు, గుంటూరు

జవాబు: ఏ సమస్య మీదైనా స్పందన వుంటుంది. అయితే, మీరు తెచ్చిన విషయం మీద నా స్పందన, దానికి పూర్తిగా వ్యతిరేకమైనదే. ఒక ‘కులం’ పేరు ఎత్తి, వాళ్ళని ‘’ సామాజిక స్మగ్లర్లు’’ అనడం, సంస్కారవంతమైన విమర్శా? ఆ స్మగ్లింగు ఏమిటో చెప్పిన కారణాలు ‘కోమట్ల కులానికి’ తప్ప, ఇతర కులాల్లో దేనిలోనూ లేవా? ఆ పుస్తకం రాసిన వ్యక్తి కులంలో కూడా అటువంటి ధోరణి, అతి చిన్న స్తాయిలో అయినా వుండదా? అనేక కులాల్లో వుండే ధోరణిని ఒక్క కులానికి ప్రత్యేకంగా అంటగడితే, అది ‘వర్గ దృష్టి’ అవదు సరికదా, కనీసం ‘కుల విధానం దృష్టి’ కూడా అవదు. స్మగ్లింగు మీదే ఆగ్రహం అయితే, అది ఒక్క ‘కోమట్ల’ కులంలోనే జరుగుతున్నట్టు, ఒక్క ‘కులం’ మీద ఆగ్రహమా? ‘స్మగ్లింగు’ లాంటిది, ‘కుల సమస్య’ కాదు, దోపిడీ వర్గ సమస్య’ అవుతుంది. ఇంత స్పష్టమైన విషయం తెలియని వాళ్ళే, ఆ తప్పుడు పుస్తకానికి సమర్ధకులుగా నిలిచారు. కమ్యూనిస్టు పార్టీ మేధావులు కూడా అలా వుండబట్టే, ఇలాంటి పుస్తకాలు పుట్టుకొస్తాయి. ఒక్క కులాన్ని విమర్శించడం అంటే, వివేకం వున్నట్టా? ఈ రకం విమర్శల మీద నాకు ఆసక్తి లేదు.

 1. ప్రశ్న: మనిషిని నడిపించేది, ఆశ కదా? మానవ జీవన చోదక శక్తి అయిన ‘ఆశ’ గురించి, కమ్యూనిజం ఏమి చెప్పింది? ‘ఆశ’ ని పరిగణనలోకి తీసుకునే సిద్ధాంతం రూపొందిందా?
 • శ్రీనివాసుడు (గతా సంచిక  ‘రస్తా’ నుంచి తీసుకున్న ప్రశ్న)

జవాబు: మనుషుల ‘స్తితిగతులే’ ఒకే రకంగా లేనప్పుడు, మనుషుల ఆశలు ఒకే రకంగా వుంటాయా? బిచ్చగాడుగా తిరిగే మనిషికి, ‘కొంత ఎక్కువ బిచ్చం ఈ పూట దొరకాలి’ అనే ఆశ వుండడం సహజం, న్యాయం!  అతని స్తితి, మర్నాటికి మారకపోతే, ఆ ఆశ మర్నాడు కూడా వుండదా? ఆ స్తితి ఎప్పటికీ మారకపోతే, ఆ బిచ్చగాడి ఆశ ఎప్పటికీ అదే. తిండి పుష్కలంగా వున్న వాడికి, ఏదో జబ్బు ప్రారంభమై మంచి వైద్యం దొరక్కపోతే, ‘ నా జబ్బు తొందరగా పోవాలి’ అనే ఆశ వుంటుంది. అంతేగానీ, అతనికి ‘తిండి కావాలి’ అనే ఆశతో అవసరం వుండదు. ఒక వ్యాపారికి ‘ఈ సంవత్సరం నాకు ఎక్కువ లాభం వస్తే బాగుండును! లాభం పెరిగితే, అందులో కొంత భాగం దేవుడి గుడికే ఇస్తా! లాభం పెరగాలి’ అనే ఆశ అతన్ని రాత్రింబవళ్ళూ తినేస్తూ వుంటుంది. అంటే, మనుషుల స్తితిగతులు ఒకే రకంగా లేనప్పుడు, ఆశలూ, మొక్కులూ, నమ్మకాలూ, ఒకే రకంగా ఎప్పుడూ వుండవు. అందరికీ ‘ఆశలు’ అయితే వుంటాయి. అలా వున్నా, ఆ ఆశల స్వభావాలు తేడా అయిపోతాయి. అంటే, ఆ ఆశలకు, ‘న్యాయమైనవీ, అన్యాయమైనవీ’- అనే తేడాలు వుంటాయి. నిజమైన అవసరాల కోసం ఆశ న్యాయం! ‘లాభాల’ కోసం ఆశ అన్యాయం! అదే,’ ఆశల’ స్వభావాల్లో తేడా! ‘శతృ వర్గాలతో’ వున్న సమాజంలో, మానవుల ఆశల్లో, న్యాయాన్యాయాలు వుంటాయి. ఆ మానవులకు, ‘వర్గాల్లో తేడా’ల విషయాలు తెలియకపోతే, ఆశల్లో తేడాలు అర్ధం కావు. ‘’ ఆశలు వుండరాదు’’ అనో, ‘’ఆశలే జీవితాన్ని నడుపుతాయి’’ అనో, పై పై సూత్రాలు పుట్టుకొస్తాయి. శ్రామికులు, ’ జీతాలు పెరగాలి’ అని ఆశతో వుంటే, శ్రామికుల యజమానులు, ‘జీతాలు ఇంతింత ఇవ్వాలా? బాగా తగ్గితే బాగుండును’ అనే ఆశలతో వుంటారు. కార్మికులకు, తమ సమ్మెలు జయించాలనే ఆశలు వుంటే; యజమానులకు, కార్మికుల సమ్మెల్ని నాశనం చెయ్యాలనే ఆశలు వుంటాయి.- ఈ ‘ఆశల్ని’ మీరు, ఎప్పుడూ వుండే సహజత్వాలుగా భావించారు. మానవ శరీరంలో ‘ రక్త ప్రసరణ’ వంటి ఏదో ఒక శారీరక లక్షణం, ఎంత ప్రకృతి సహజమైనదో, అలాగే మానవుల్లో పుట్టే ‘ ఆశల్ని” ఎప్పుడూ జరిగే సహజ విషయాలుగానే భావించారు. – ఈ ఆశల రహస్యం ఏమిటంటే, మానవులందరి స్తితి గతులూ సమానమైన అవగాహనతో వుంటే, మానవుల ‘ ఆశలకు’ కారణాలే మాయం అవుతాయి. న్యాయమైన ఆశలూ వుండవు; అన్యాయమైన ఆశలూ వుండవు.

  ‘ ఆశలు’ ప్రకృతి సహజత్వాలు కావు. కానీ ‘శతృ వర్గ భేదాలు’ వున్న సమాజంలో, ఎవరి ఆశలకీ ముగింపు వుండదు. ఒక చక్రవర్తి అయిన వాడికి కూడా ఆశలు నశించవు. ప్రపంచానికే అధికారిని అవ్వాలనే ఆశతో వుంటాడు. నిజంగా, అతను అలా అవగలిగితే, అతని మీద, ఇతర రాజుల పోరాటాలూ, నిరుపేదల పోరాటాలూ, సాగుతూ వుంటాయి. కాబట్టి, ఆ చక్రవర్తిని, ఆ పోరాటాలన్నిటినీ నాశనం చెయ్యాలనే ఆశ తినేస్తూ వుంటుంది. ఆ ఆశకి ముగింపు వుండదు.- మీరు, ‘ఆశ’ అన్నదాన్ని, కొందరైతే, ‘స్వార్ధం’ అంటారు. ‘మానవ జీవితానికి స్వార్ధమే సహజం’ అంటారు. ఒక బిచ్చగాడు ఎక్కడైనా ‘దొంగతనం’ చేస్తే, ‘అదిగో, అదే స్వార్ధం’ అంటారు.’మానవ జీవితం’లో, ఒక ‘వ్యక్తిని’ అయినా, ఒక ‘వర్గాన్ని’ అయినా, వర్గ భేదాల దృష్టితో చూడకపోతే, అలా చూడని వాళ్ళకి, ఆ వ్యక్తి ఆశలూ, ఆ వర్గపు ఆశలూ, అర్ధం కావు. మీరు, ‘’ ఆశ గురించి, కమ్యూనిజం ఏం చెప్పింది?” అన్నారు. ఇది చిన్న జవాబుతో అర్ధం చేసుకోగలిగే విషయం కాదు.

  ఒక ప్రయాణంలో, ‘గమ్యానికి చేరాలనే’ ఆశ, దారి పొడుగునా వుంటుంది. ‘ గమ్యానికి చేరడం’ జరిగిపోతే, ఆ ఆశ ఏమవుతుంది? ‘కొత్త ఆశ రాదా’?  అంటారా? ‘ఆశ’ అనేది, ఎప్పుడూ సాగే ‘సహజత్వం’ కాదు. స్తితి గతుల్లో తేడాల్ని బట్టి మాత్రమే అది, ఇప్పుడు ‘గొప్ప సూత్రం’గా కనబడుతుంది. ‘ మానవులకు కోరికలు వుండరాదు’ అని స్వాములార్లు చెప్పగలుగుతారు, వాళ్ళ ఆశలు వాళ్ళు వుంచుకుంటూనే!- చివరి మాట! ఆశ, సహజమైనది కాదు; దాన్ని పుట్టించే కారణమే లేకపోతే, ఆశలే వుండవు.

                                                          ***

 1. ప్రశ్న:  మీరు రాసిన ‘పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం; చదివి మా స్కూల్లో కూడా పెట్టాను చాలా కాలం క్రిందటే. ‘ కాపిటల్’ని ‘ఒరిజనల్’ గానీ, ‘పరిచయం’ గానీ కొని పెట్టాను గానీ, ఇంకా చదవలేదు. ఈ సిద్ధాంతం కొంత తెలిసినట్లు వున్నా, వాటిని పూర్తిగా చదవక పోవడం నా నేరమే. నేనూ, కార్మికురాలినే, టీచర్ని. టీవీ 9 లో ‘ కాపిటల్’ మీద, మీరు కొన్ని వారాలు చెప్పబోతున్నారని తెలిసి ఎంతో సంతోషించిన వారిలో నేనూ ఒకదాన్ని. కానీ, చిన్న సందేహమండీ. మీరు గతంలో టీవీ 10లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి యున్నారు. ఆ ఛానలు సీపీయం వారిది. అటువంటి కమ్యూనిస్టు ఛానల్ లో మీరు చెప్పే పాఠాలు వస్తే ఇంకా సంతోషించే వాళ్ళమండీ. మీరు బూర్జువా ఛానల్ కి ఇచ్చారేమిటని ఆశ్చర్యం కలిగింది నాకు. నా సందేహం కోసం రాశాను.
 • రమ. హైదరాబాదు

జవాబు: అవును, సందేహాన్ని ఆపుకోవడం ఎందుకు? టీవీ 10లో ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత, ఈ ‘కాపిటల్’ పాఠాల గురించి వారినే మొదట అడిగాను. వారేమన్నారంటే, వారానికి 20 నిముషాల చొప్పున ఒక్క వారం గానీ, 2 వారాలు గానీ, ఇవ్వగలం అన్నారు! ‘కాపిటల్” లో వున్న విషయాలు చెప్పడానికి, చాలా దయగా, 40 నిముషాల టైము ఇవ్వడానికి అంగీకరించారు. ‘ మార్క్సిస్టు’ గా పేరు పెట్టుకున్న పార్టీ ఛానల్ అది. మొదట కొంత నమ్మకంతోనే వారిని అడిగాను. కానీ, అలా అయింది. ఆ తరువాత టీవీ 9 వారిని అడిగాను, ‘ కనీసం 10,12 వారాల పాటు ఇవ్వగలరా’ అని. ‘ అంత లెక్క అక్కరలేదు. మీరు చెయ్యగలిగినట్టే చెయ్యండి’ అని జవాబు రాశారు. మొదట కొన్ని వారాల వరకూ రాసి ఇవ్వమన్నారు. అలాగే ఇచ్చాను. మే 13 వ తారీకున మొదటి వారం ప్రోగ్రాం ప్రారంభమైందని మీకు తెలిసి వుండొచ్చు.*

రంగనాయకమ్మ

1 comment

 • కంచ ఐలయ్య గారు, కుల పరంగా చెప్పడం సరిగా లేదు అంటున్నారు.
  వర్గ దోపిడీ ఒక కులమే చేస్తుంటే ‘దోపిడి వర్గం’ అని మాత్రమే అనాలా? సమాజ పునాదుల లోనే వర్గ దృక్పథం నుండే కులాలు ఏర్పడిన పుడు అలా అనడం లో తప్పు ఏంటాంటారు.సమాజంలో లేని కులాల ను ఆయన చూపించాడా? అది కేవలం ఊహాత్మక మైనదే నంటారా? కలాల అన్నింటి లో దోపిడీ వర్గం దృక్పథం ఉందని అనటము వేరు.

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.