మార్క్సిస్ట్ సినిమా: ఐజెన్ స్టీన్ ప్రయోగాలు

ష్యా విప్లవ శతజయంతి ఉత్సవాలు ఏడాది క్రితమే ముగిశాయి. ఈ సంవత్సరం కార్ల్ మార్క్సు ద్విశత జయంతి. ఈ రెండు సందర్భాలను సినిమాకు అన్వయించుకుంటే, వెంటనే గుర్తొచ్చే పేరు ఐజెన్ స్టీన్. సినీ నిర్మాణంలో మార్క్సు పద్ధతిని ప్రయోగించిన దిట్ట ఆయన.

మార్క్సు చనిపోయింది 1883లో. సినిమా పుట్టింది ఆయన మరణించిన పన్నెండేళ్లకు. లూమియర్ సోదరులు- ఆగస్టె లూమియర్, లుయిస్ లూమియర్ పారిస్ లోని గ్రాండ్ కేఫె హోటల్లో మొట్టమొదటి సినిమా ప్రదర్శన జరిపింది 1895 డిసెంబరు 28న. ఆ తేదీనే చలనచిత్రం పుట్టిన రోజుగా చెప్పుకుంటారు. అందువల్ల సినిమా మీద మార్క్సిజం ప్రభావం ఏమిటీ అనే వింత ప్రశ్న వేయొచ్చు కొంతమంది.

మార్క్సిజం ఒక బలమైన వైజ్ఞానిక సిద్ధాంతం కాబట్టి, అది కళారూపాలన్నింటినీ ప్రభావితం చేసి తీరుతుంది. మార్క్సిస్టు సాహిత్య విమర్శలానే, సినీ నిర్మాణంలో గతితార్కిక పద్ధతి అనేది వుంటుందని ప్రయోగపూర్వకంగా నిరూపించిన దర్శకులున్నారు. సోవియెట్ చరిత్రతో ఆ చరిత్ర ముడిపడి వుంది.

మొదటి ప్రపంచయుద్ధం తర్వాత రష్యాలో ముడి ఫిల్మ్ కొరత ఏర్పడిన రోజుల్లో పాత చిత్రాల ముక్కలతో కొన్ని ఎడిటింగ్ ప్రయోగాలు చేశారు కుశలోవ్ తదితరులు. ఏ హావభావాలూ లేని ఒక నటుడి క్లోజప్ తీసుకొని దాని తర్వాత ఒక సూప్ గిన్నెను చూపారు. వెనువెంటనే ఈ రెండు దృశ్యాలు చూసిన ప్రేక్షకుడు ‘ఆకలి’ని గుర్తించాడు. అలానే నటుడి ముఖం +కాఫిన్ లో పడున్న శవం= విచారం; నటుడి ముఖం+ వాలుకుర్చీలో వొయ్యారంగా పవళించిన అమ్మాయి= కోరిక. రెండు దృశ్యాలను ఒకటి తర్వాత ఒకటి చూపడం ద్వారా ప్రతీదీ ఒక సరికొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. ప్రేక్షకుడి  కల్పనలో ఒక సరికొత్త భావనను కల్పిస్తుంది. ఇదే ‘ మాంటాజ్’ కు ప్రాతిపదిక. ఫ్రెంచ్ లో ‘మాంటాజ్’ అంటే ‘జోడించడం’. దీన్ని కుశలోవ్ ఎఫెక్ట్ అన్నారు. కుశలోవ్ తన ఎడిటింగ్ టెక్నిక్కులను ‘ది బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ డైరెక్షన్’ లో గ్రంథస్థం చేశాడు. ‘మాంటాజ్’ ని మరింత అభివృద్ధి పరిచాడు సెవలోడ్ పుదోవ్కిన్. గోర్కీ ‘అమ్మ’ ఆధారంగా తీసిన ‘మదర్’ (1916)లోని ఒక దృశ్యాన్ని చూద్దాం. పావెల్ కు జైలు నుండి విముక్తుడ్ని కాబోతున్నానన్న వార్త స్నేహితులు రహస్యంగా పంపిన జాబు ద్వారా తెలుస్తుంది. ఆ ఆనందాన్ని తెలుపడానికి పావెల్ ముఖ కవలికలే కాక, ప్రకృతిలోని ఎన్నో దృశ్యాల్ని వాడుకుంటాడు దర్శకుడు. ఉరకలు వేసే సెలయేళ్లు, ఎగసిపడే కెరటాలు, ఎగిరే పక్షులు, చిరునవ్వులు చిందించే చిన్నారుల మొహాలు- ప్రకృతిలోని ఈ దృశ్యాలన్నీ పావెల్ ఆనందాతిశయాన్ని వర్ణించేలా వుంటాయి. కాబట్టి పుదోవ్కిన్ ప్రకారం ఎడిటింగ్ అంటే రెండు ఇమేజీలను కలిపే నిర్మాణం మాత్రమే కాదు, ప్రేక్షకుడికి మానసిక దిశానిర్దేశం చేసే పనిముట్టు కూడా. మరో ఉదాహరణ: ‘గాడ్ ఫాదర్’ ఆధారంగా తీసిన ‘నాయకుడు’ లో వేలు నాయకన్ భార్య అంత్యక్రియల దృశ్యంతో ఇంటర్ కట్ లో శతృవులు ఒక్కొక్కర్నీ చంపేయడం. దీన్ని ‘రిలేషనల్ ఎడిటింగ్’ అన్నారు. మొత్తం ఐదు రకాల ఎడిటింగ్ పద్ధతుల్ని వివరించాడు పుదోవ్కిన్.

కానీ మార్క్సిస్టు భావనలను మరింత ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా సినిమాకు అన్వయించినవాడు ప్రఖ్యాత రష్యన్ సినిమా దర్శకుడు సెర్గీ మైఖలోవిచ్ ఐజెన్ స్టీన్. సివిల్ ఇంజనీరింగు మధ్యలో ఆపేసి, రెడ్ ఆర్మీలో చేరి, అక్కడ్నించి నాటకరంగం మీదుగా సినిమాలోకి వచ్చిన వాడీయన. థిసీస్ x ఏంటిథిసీస్ = సింథసిస్. రెండు విరుద్ధ భావాల సంఘర్షణలోంచి కొత్త భావం పుడుతుంది. ఇది హెగెల్ గతితర్కం. ఇదే మార్క్సువాదానికి తాత్విక ప్రాతిపదిక. ఈ సూత్రాన్ని చిత్ర నిర్మాణంలో వినియోగించాడు ఐజెన్ స్టీన్. నిరక్షరాస్యులైన జనాలను విప్లవోన్ముఖులుగా చేయించే సాధనం సినిమా అని చెబుతాడు లెనిన్. అలా నమ్మబట్టే ఐజెన్ స్టీన్ సాంప్రదాయిక ‘మాంటేజ్”తో సంతృప్తి పడలేదు. సంబంధం కలిగిన దృశ్యాలను జోడించడం మాత్రమే కాదు, ప్రకృతిలో ప్రతిచోటా వున్న సంఘర్షణ షాట్ ల మధ్య కూడా కన్పించాలి. ఫ్రేమ్ లోనే పరస్పర విరుద్ధాంశాల ఎలిమెంట్స్ ని జొనిపి, షాట్ల మధ్య సంఘర్షణ సృష్టించి ప్రేక్షకుడిని భావోద్రేకానికి గురిచేయాలి, సినీ రూపకాల్ని సృష్టించాలని వక్కాణిస్తాడు ఐజెన్ స్టీన్. ఎన్ని మార్పులు చేసినా గుర్రపు బండిని రైలింజన్ చేయలేము. రైలింజనులాంటి చోదకశక్తి, చలనశక్తి సినిమాకి కావాలన్నాడు ఐజెన్ స్టీన్. తన మాంటేజ్ ఎడిటింగ్ పద్ధతిని ‘ఫిల్మ్ ఫార్మ్’, ‘ది ఫిల్మ్ సెన్స్’ అనే పుస్తకాలో వివరించాడు. మెట్రిక్, రిథ్మిక్, టోనల్, ఓవర్ టోనల్, ఇంటలెక్చువల్ మాంటాజ్ లను అభివృద్ధి చేశాడు. ఇంజనీరింగు చదివినవాడు కనుక ఆ రంగంలోని డైనమిజమ్ ను సినిమాల్లో ప్రవేశపెట్టాడు. ఆ డైనమిజమ్ తోనే మూకీ యుగంలో కూడా ప్రేక్షకులను కుదిపేసే సినిమాలెన్నో తీశాడు. ఐజెన్ స్టీన్ మరో ప్రత్యేకత ఏంటంటే హాలివుడ్ సినిమాల్లోలా ఒక కథానాయకుడు లేక కథానాయకురాలికి సంబంధించినట్టు కాక, ఒక సమూహానికి మరో సమూహంతో, శ్రమజీవికి రాజ్యాంగయంత్రంతో సంఘర్షణ జరిగే రీతిలో వుంటాయి అతడి సినిమాలు. ప్రేక్షకుడు తనూ ఆ సమూహంలో అంతర్భాగమౌతాడు.

   ఐజెన్ స్టీన్ కెరియర్ లో అతిముఖ్యమైన సినిమా ‘బ్యాటిల్ షిప్ పోటెమ్కిన్’ (1925). అతడి పేరు తలచుకోగానే గుర్తొచ్చే సినిమా ఇది. 1905 రష్యాలో జార్ చక్రవర్తిపై ప్రజలు తిరుగుబాటు చేసిన రోజులు. బ్లాక్ సీ లో రష్యా నావికాదళపు యుద్ధనౌకలో సైనికుల తిరుగుబాటుకు సంబంధించిన కథ ఇది. యుద్ధం నుండి తిరిగొస్తున్న ఆ నౌకలో, సైనికుల పట్ల అధికారుల అమానవీయ ఆచరణకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుంది. జార్ పై ఉద్యమించిన తోటి రష్యన్ సోదరులకు బాసటగా మనం కూడా తిరగబడాలని చెబుతాడు సైనికుల నాయకుడు.  నావికులకు పురుగులు పట్టిన మాంసం వండిపెడుతున్నారని తెలుస్తుంది. యుద్ధనౌకలో తిరుగుబాటు జరుగుతుంది. నౌకను స్వాధీనపరుచుకుంటారు సైనికులు. కానీ, వారి నాయకుడు వకులించుక్ చనిపోతాడు. నౌక ఒడెస్సా నగరం రేవు సమీపానికి చేరుతుంది. ‘చెంచాడు సూప్’ కోసం తిరుగుబాటు చేసి, ప్రాణాలొడ్డిన సైనికుడికి నివాళులర్పించడానికి ప్రజలు బారులు తీరుతారు. పోటెమ్కిన్ తిరుగుబాటుదారులకు ఆహారపదార్థాలు, సహాయక సామగ్రి అందించడానికి చిన్న చిన్న పడవల్లో చాలామంది బయలుదేరుతారు. వొడ్డు నుండి సైనికులకు అభివాదం చేస్తూ చాలా మంది తమ టోపీలు గాల్లో వూపుతుంటారు, నౌకపై ఎర్రజెండా రెపరెపలాడుతుంది. ఇంతలో జార్ సైనికులకు ఆదేశాలందుతాయి. ఒడెస్సా మెట్లపై గుమికూడిన ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు. ఈ దృశ్యీకరణ దర్శకుడి అసాధారణ ప్రతిభకు అద్దం పడుతుంది. రియల్ టైంలో కేవలం రెండు మూడు నిమిషాలకు మించని ఈ ఒడెస్సా మెట్ల సీక్వెన్సును రకరకాల వ్యక్తుల నేపథ్యంలోంచి 11 నిమిషాల పాటు చూపుతాడు. గాయపడిన బిడ్డతో సైనికులకెదురెళ్లే మాతృమూర్తి, పసికందుతో మెట్లపై నుంచి గెంతుకుంటూ పోతున్న పెరాంబులేటర్ వంటి దృశ్యాలు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. తిరుగుబాటుదారులు గురిచూసి కాల్చిన ఫిరంగి గుళ్ళకి రాజభవన ద్వారం కుప్పకూలుతుంది. ఆ రాజభవనంపై కొలువుదీరిన సింహం విగ్రహాలు తునాతునకలౌతాయి. ఇది ఇంటలెక్చువల్ మాంటేజ్ కి మంచి వుదాహరణగా చెప్పవచ్చు. ‘అధికారానికి ఆఖరు ఘడియలన్నమాట!’. పోటెమ్కిన్ ని జార్ నౌకలు చుట్టుముడుతాయి. తిరుగుబాటుదారులు లొంగుబాటుకి చిహ్నంగా తెల్లజెండా వూపుతారు. జార్ కోసం పనిచేస్తున్న సైనికులు తమ సోదర తిరుగుబాటుదారులకు అభివాదం తెలుపుతూ, పోటెమ్కిన్ క్షేమంగా వెళ్ళేందుకు దారి వదులుతారు. “నీ శత్రువెవరో ప్రభుత్వాలు చెబితే, అది యుద్ధం, నీ శత్రువెవరో నీవే తెలుసుకుంటే అదే విప్లవం.” శ్రామికవర్గ ఐక్యతను చూపే మరో దృశ్యం మరోచోట చూడొచ్చు. చనిపోయిన నాయకుడిని చూసి, భావోద్వేగానికి గురై, ‘మన శత్రువు భరతం పట్టాలి’ అని కొందరు అరుస్తున్నప్పుడు, ప్రభుత్వ ఏజెంటు ఒకడు, ‘అవును మనం యూదులపై దండెత్తాలి’ అని ప్రజల కోపాన్ని ప్రక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు. ప్రజలంతా వాడిని చితకబాదుతారు. వర్గదృక్పథం వుండాలనీ, ప్రభువుల విభజించి, పాలించు నీతిని పసిగట్టాలనీ ప్రభోధిస్తాడు దర్శకుడు. ఈ సినిమాను బెర్లిన్, లండన్ లలో నిషేధించారు. చాలా కత్తిరింపులతోనే న్యూయార్క్ లో విడుదల చేశారు. ప్రస్తుతం హెచ్ డీ క్వాలిటీ డీవీడీలు అందుబాటులో వున్నాయి.

ఈ సినిమాకి ఏడాది ముందు వచ్చిన ‘స్ట్రయిక్'(1924) మరో మరుపురాని సినిమా. 1903లో తమ డిమాండ్ల కోసం సమ్మెకు దిగిన శ్రామికుల కథతో వచ్చిన సినిమా. విపరీత ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా శ్రామికుల గుండె నిబ్బరాన్నీ, ఐక్యతనూ విడదీయ లేకపోయిన ఫ్యాక్టరీ యాజమాన్యం, జార్ బలగాలతో కలిసి, కుట్రపన్ని, కార్మికులను ఊచకోత కోస్తుంది. ఇందులో కూడా కార్మికులను వ్యక్తులుగా విడివిడిగా కాకుండా వారినో సమూహంగానే చూపాడు ఐజెన్ స్టీన్. నీ ప్రయోజనాలు నీ వర్గం వారి ప్రయోజనాలతో ముడిపడివున్నాయన్న కమ్యూనిస్టు చైతన్యమే ప్రతి షాట్ లోనూ కన్పిస్తుంది. ప్రభుత్వ గూఢచారులకు కోతి, గుడ్లగూబ వంటి ప్రతీకాత్మక పేర్లుంటాయి. కార్మికుడ్ని ఒకవైపు పోలీసులు కొడుతుంటే, ఆ ప్రక్కనే కారులో ప్రేయసితో సయ్యాటలాడుతున్న మిల్లు యజమానిని చూపుతాడు దర్శకుడు. ఒకే ఫ్రేములో ప్రేక్షకుడ్ని భావోద్వేగాలకు గురిచేసే విరుద్ధాంశాల్ని చొప్పించాలని చెప్పిన తన చిత్రనిర్మాణ సూత్రానికి ఉదాహరణ ఇది. చివర్లో సారా గోడౌన్ కి నిప్పెట్టారన్న నిందమోపి, కార్మికులను ఊచకోత కోస్తున్నప్పుడు, పశువుల కొట్టంలో ఓ పశువు వధను ఇంటర్ కట్ లో చూపుతూ, ఆ టెన్షన్ ను తారాస్థాయికి చేర్చుతాడు దర్శకుడు.

‘బాటిల్ షిప్ పోటెమ్కిన్ ‘ లో సింహం విగ్రహాన్ని విరగ్గొట్టే దృశ్యం ఒక అర్థాన్ని మోసుకొస్తే, ’అక్టోబర్’ (1928) లో నిద్రలేచిన సింహం విప్లవవీరులకు ప్రతీకగా మారుతుంది. సింహం నిద్రిస్తోంది- విప్లవకారులు పేల్చిన ఫిరంగి గుండు చక్రవర్తి ప్యాలెస్ గేటునూ, బాల్కనీనీ కూల్చుతుంది- ఇప్పుడు సింహం మేల్కొని తల పైకెత్తి చూస్తుంది- మరో గుండు పేల్తుంది- సింహం లేచి నిలబడుతుంది. ఐదు షాట్లతో ఈ దృశ్యం ఓ గతిశక్తిని పుంజుకుంటుంది. ఓ లెక్క ప్రకారం హాలివుడ్ లో 300 షాట్లతో తయారైన దృశ్యాన్ని ఐజెన్ స్టీన్ మాంటేజ్ లో 1000 షాట్లతో తీస్తాడట! షాట్ల సంఖ్యను పెంచుతూ సాధించిన మాంటేజ్ సినిమాకు ఒక నూతన చలన శక్తిని అందిస్తుంది. జాన్ రీడ్స్’ ప్రపంచాన్ని కుదిపేసిన పదిరోజులు’ నవల ఆధారంగా అక్టోబరు విప్లవ జయంతి సందర్భంగా తయారుచేశారు ‘అక్టోబర్’ సినిమాను.

చిత్ర నిర్మాణం విషయంలో తన అభిప్రాయాలకూ, అధికారం అభిప్రాయాలకూ తేడా రావడంతో, స్టాలిన్ హయాంలో యూరప్ లోని కొన్ని దేశాల్లో కొన్నేళ్లు గడిపాడు ఐజెన్ స్టీన్. తన మెక్సికో మజిలీలో ‘కె వివా మెక్సికో’ పేర ఓ భారీ డాక్యుమెంటరీని నిర్మించాడు. కాని నిధుల కొరత వలన ఈ చిత్రం పూర్తికాలేదు. 1998లో ఈ ఫుటేజ్ ని ఎడిట్ చేసి  ‘మెక్సికో ఫేంటసీ’ గా విడుదల చేశారు. టాకీ యుగం ఆరంభమైనప్పటికీ మూకీ సినిమాలనే తన వ్యక్తీకరణకు అనుకూలమైనవిగా భావించాడు ఐజెన్ స్టీన్. సోవియట్ కి తిరిగొచ్చిన తర్వాత, జార్ చక్రవర్తి ఇవాన్ పై ‘ఇవాన్ ది టెరిబుల్’ అనే మూడు భాగాల భారీ చిత్రాన్ని ప్లాన్ చేసి, కేవలం రెండు భాగాలనే పూర్తి చేయగలిగాడు. చాలా కాలంగా క్షయవ్యాధితో బాధపడుతూ వస్తోన్న ఐజెన్ స్టీన్ 1948లో యాభై యేళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు.

మార్క్సిస్టు ప్రభావంతో చిత్రనిర్మాణం చేసిన ప్రపంచ దర్శకులు ఇంకెందరో వున్నారు. ఇటలీ నవ్యవాస్తవికతకు దారిచూపిన డీ సికా, పసోలినీ, బర్టోలుసీ, ఫ్రెంచి దర్శకులు జీన్ రెన్వా, జీ-లుక్ గోదా, మన దేశంలో మృణాల్ సేన్, బ్రిటీష్ దర్శకులు స్టాన్లీ కుబ్రిక్, కెన్ లోచ్- ఇలా ఎందరి పేర్లనో ఉదహరించొచ్చు. 1995లో లార్స్ వా ట్రయర్, వింటర్ బర్గ్ వంటి దర్శకులు సోవియట్ సినిమా పేరణతో ‘ డోగ్మె95’ అనే చిత్రనిర్మాణ పద్ధతిని ఏర్పాటు చేసుకుని, దాని నియమాలను తామే నిర్వచించుకుని తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారు. వీటిని ‘డోగ్మే’ సినిమాలంటారు. ఈ సినిమాలు ప్రపంచ చలన చిత్రోత్సవాల్లో ప్రసంశలు పొందుతున్నాయి. అలనాటి సోవియట్ సినిమాలను ‘ప్రాపగాండా’ (ప్రచార) సినిమాలుగా గేలి చేసే బూర్జువా విమర్శకులు ఆ బూర్జువా ప్రపంచం కూడా తన అభిప్రాయ నిర్మాణ సాంస్కృతిక పనిముట్టుగానే సినిమాను వాడుకుంటుందనీ, దాని నిర్మాణంలో సోవియట్ సూత్రాలనే వినియోగిస్తుందనే విషయాన్ని మరుగున పెట్టేస్తున్నారు.

 – బాలాజీ ( కోల్ కతా)

 

 

 

 

 

 

 

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్టాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు వెలువరిస్తుంటారు. ‘ముందడుగు తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాభ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

9 comments

 • చాలా మంచి రచన. బట్టలేషిప్ పొటెంకిన్ తరువాత చెప్పుకోదగ్గ భారీ చిత్రం ఇవాన్ ది టెర్రిబిల్. ఐసెన్స్టైయిన్, కురొసావా, ఆర్సన్ వెల్స్ ముగ్గురు నాకు నచ్చే దర్శకులు.

 • కొంత జ్ఞానం సంపాదించుకున్నాను. ధన్యవాదాలు.

 • మంచి పరిచయం . చాలా తెలుసుకోవలసిన వివరాలున్నాయి .

 • థీసిస్ + యాంటీ థీసిస్ కాదనుకుంటా.
  థీసిస్ x యాంటీ థీసిస్ అనుకుంటా
  వ్యాసం సోదాహరణ పూర్వకంగా వుంది.
  మాంటేజ్ లాంటి వాటితో పాటు వీలయితే
  ఇతర రూపాలు — ఉదా!! స్లా( ప్ స్టిక్ , ఎలీనేషన్ —
  మొదలయినవి సినిమా దృశ్య వివరణలతో
  పాఠకులకు పరిచయం చేస్తే బాగుంటుంది.
  ప్రయత్నం చేయండి … దివికుమార్

  • మీరు చెప్పింది కరెక్ట్ దివికుమర్ గారూ, అది టైపింగ్ ఎర్రర్.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.