మనఃశరీరాల మధ్య, రేయింబవళ్ళ మధ్య, ఊహావాస్తవాల మధ్య, వాదానుభవాల మధ్య, స్వప్నజాగ్రదవస్థల మధ్య అవిరామ సంఘర్షణలోని సంవేదనతో శివలెంక రాజేశ్వరీదేవి (16.01.1954-25.04.2015) కవి హృదయం శత పద్మంలాగ వికసించింది. జననంతో ప్రాప్తించిన ఏకాకితనంలోంచి, దివాస్వప్నంలో కరిగిన యవ్వనంలోంచి, ఒంటరిగదిలో కొనసాగిన ప్రపంచ యానం లోంచి, సంగీత, సాహిత్యాలు తోడునీడలుగా తనలో తాను సంభాషించిన శూన్యావరణం లోంచి, ఏ ఒక్క సంతోష రేణువునో గుప్పెట బంధించాలన్న జాగరూకత లోంచి ఆమె అద్భుతమైన కవిత్వం సృజించింది.
. . .
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో పుట్టి పెరిగిన రాజేశ్వరీదేవి బి.ఎస్.సి. చదువుకొంది. కొంతకాలం ఉపాధ్యాయినిగా పనిచేసింది. ఆమె బాల్యం నుంచీ రేడియో శ్రోత. ఆ సంగీతం అపరిమితంగా ప్రభావితం చేయడంతో సాహిత్యం లోకి ప్రవేశించింది. సంగీత శ్రవణం, సాహిత్య పఠనం ఒక వ్యసనంగా పరిణమించింది. మంచికో చెడుకో, పొందడానికో పోగొట్టుకోవడానికో కవిత్వ జ్వరం పట్టుకుంది. ఆమె రచనా వ్యాసంగం కోసం సమాయత్తమయ్యే నాటికి తెలుగులో విప్లవకవిత్వం ఉధృతంగా వెలువడుతోంది. అయితే ఆ దశలో వీచిన హోరుగాలి ఆమెని స్పృశించిన దాఖలాలు కనిపించవు. రాజేశ్వరీదేవి జీవితంలో 1980నుంచి 2000వరకు ఇరవయ్యేళ్ళ కాలం ఉజ్జ్వలమయింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వీయ కవిత్వ పఠనం; పత్రికల్లో రచనలు అచ్చుకావడం; నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, వేగుంట మోహనప్రసాద్ వంటి సాహిత్యకారుల పరిచయం; అప్పుడప్పుడే గొంతువిప్పిన పలువురు వర్ధమాన కవుల సాంగత్యం; వడ్డెర చండీదాస్ ‘అనుక్షణికం’ నవల ధారా వాహిక కావడం; ఆర్ట్ సినిమాలు చూడడం, తనివి తీరా పాటలు వినడం, కవిత్వం చదువుకోవడం; రమ్యమైన కలలు కనడం…అదీ ఆమె ప్రేమించిన ప్రపంచం. ఆ రెండు దశాబ్దాల్లోనే ఆమె మేలిమి కవిత్వం పలికింది. ఆ ఆనంద భరిత కాలాన్ని తన గుండెమీది పొరగా చుట్టుకొంది.
. . .
శరత్, చలం, చండీదాస్ రచనల్లోని ఒక అసాధారణమైన పాత్రవలె మన మధ్యకి రాజేశ్వరీదేవి రెక్కలు కట్టుకు వచ్చింది. అందుకనే తెలుగు కవిత్వంలో ఆమె కంఠస్వరం ప్రేమార్ధ్రతతో వినవస్తుంది. ప్రపంచంలోకి కొత్తగా కనులు తెరిచిన హృదయంలోని భావుకత్వం గోచరిస్తుంది. తొలినాటి కవిత ‘ఊరకనే’లో కవి ఒక బాలికతో సంభాషణ సాగిస్తుంది: ”ఎందుకలా వర్షంలో/ డాబామీదకి వెళతావ్ పాపా?/”ఊరికేనే”/ఎందుకలా పని ఆపేసి/ పాట వింటావ్ పాపా?/ ”ఊరికేనే”/ ఎందుకనవసరంగా వాళ్ళ దిగులు నీకు పాపా?/”ఊరికేనే”/ఎందుకా టెలిఫోన్ టాక్ పాపా?/ ”ఊరికేనే, ఆ స్వరం తీయగా ఉంటేను/ ఇక్కడ ఆగి అక్కడ ఆగి పనేమైనా ఉందా?/ ”ఊరికేనే, పనేం లేదూ పలుకరించిపోదామని”/ ఇదిగో ఇదే చెపుతున్నా గుర్తుంచుకో పాపాయ్/ పనేం లేకపోతే/”ఊరికేనే” పలుకరించకూడదు ఎవరినీ/ అలా చూడకు నా కళ్లలోకి ”ఊరికేనే”/ అదో ప్రశ్నార్థకమై నన్ను భయపెడుతుంది.” వాస్తవానికి ఈ కవితలోని అమాయకమైన అమ్మాయే రాజేశ్వరీదేవి. ఇటువంటి ప్రాథమిక దృక్పథమే ఆమె జీవిత వైఖరిగా విస్తరిల్లింది. మనస్స్వాతంత్య్రాన్ని ప్రశ్నించే సమాజానికి, కలలని సైతం సంకెలతో బంధించే కుటుంబ వ్యవస్థకి ఆమె ఆద్యంతం ప్రతిధ్రువంగానే నిలిచింది.
‘నేను’ అంటే కేవలం నేను మాత్రమే కాదని, నేను నేనుగా ఇమడలేక మరో పాత్రగా రూపాంతరం చెందినట్టు కవి మననం చేసుకొంటుంది. ఎక్కడెక్కడి విభిన్నమైన నేనులనో తనలో దాల్చుతుంది. ఆ పెక్కు నేనుల సముదాయంలోంచి ఒకొక్కరినీ ‘ద్వైతం’ కవిత ద్వారా మనకి పరిచయం చేస్తుంది: ”నేనసలే గంగను కదా/నాకు పర్వతమూ ఇష్టమే పొలమూ ఇష్టమే/గండశిలల్నించి కరిగి కిందికొచ్చినందుకే/ఈ మునిగిపోయిన పేదపల్లెల కన్నీళ్ళు ఇష్టం/రాళ్ళు పగిలితేనే గానీ కన్నుచెమ్మగిలదు/మీరేదో అనుకుంటారు ఆ గుండె అగాధమని/కానీ ఎంత నొప్పో ప్రథమ శిశువుకి పాలు తాపేప్పుడు/ఆ తీయని బాధలో మృత్యువుని జయించిన లోయల కేక/కాశీ వారణాసి బెనారస్‌లో చూడండి నన్ను/నా దేహమ్మీద కాలీకాలని ఎన్ని కళేబరాలో/కానీ ప్రేమహర్మ్యాంల్లోంచి మీరంతా రిక్తహస్తాలతోనే కదా/ఈ నా పుణ్యక్షేత్రానికి చేరుకునేది/కేదారనాథ్ బదరీనాథ్ అమర్నాథ్ అన్నీ నేనే/ఏనాటి వాడో ఆదిశంకరాచార్యుడ్ని తల్చుకుని/మీ పాపాల చేతుల్నీ పాదాల్నీ కడిగేసుకుంటున్నామనుకుంటున్నారో/ కానీ అదంతా హిమాలయాలపైకి మీ ఒట్టి ఎగశ్వాస, దిగశ్వాస/ ఎండమావినీ నేనే, తొలకరి మబ్బునీ నేనే/ కలకత్తా కాళికనీ నేనే, సలాం బాంబేనీ నేనే/ మదర్ థెరీసానీ నేనే, ‘బీస్ట్ అండ్ బ్యూటీ’నీ నేనే/ పుట్టిన కేకనీ నేనే, ఆఖరి కౌగిలినీ నేనే”. కవిలోని సుప్త చైతన్యం ఉలికిపాటుతో మేల్కొని ఇటువంటి మిరుమిట్లు గొలిపే కవితలనేకం కూర్చింది.
A word is dead/when it is said,/ some say./ I say it just/ Begins to live/ That day – Emily Dickinson (A Word). రాజేశ్వరీదేవికి పలుకరింత పైపై మాట కాదు. ఎవరూ హృదయాన్ని ఒంపి మాట్లాడటం లేదెందుకని యోచిస్తుంది. అందరూ మస్తిష్కంతోనే మాట్లాడతారేమని ప్రశ్నిస్తుంది. మిత్రుల మాటల్లోంచి ఒకానొక మనోస్పర్శ కోసం వెతుకుతుంది. అందుకనే నువ్వు పలుకరించావంటే అవతలి మనిషి ఆసాంతం పులకరించిపోవాలని, వాతావరణమంతటా కాంతి ప్రసరించాలని, బోగన్‌విలా పూలకి విరజాజుల ఫ్రాగ్రెన్స్ పట్టాలని కోరుతుంది. ఒఠ్ఠి మాటలకంటే మౌనంగానే ఉండి పొమ్మంటుంది. కవి దృష్టిలో ధనాధికారాలకు, కీర్తిప్రతిష్ఠలకు ఇసుమంత కూడ ప్రాధాన్యం లేదు. ప్రేమ, కరుణలనే చైతన్య స్వరూపాలుగా భావించింది. అందుకనే బంధాలు లేని, ఋణాలు లేని, ఋణానుబంధాలు అసలే లేని ‘స్థితప్రజ్ఞులు’ గురించి గొప్ప కవిత రాసింది. ఆకాశానికి దుస్తులు తొడిగేటంత నాగరికుల తెలివిని ఎగతాళి చేసింది. ‘నీ పిచ్చిగానీ నీ మిణుగురుల మీంచి సైతం వెలుగు చూస్తానంటే నవ్విపోతారమ్మా’ అనగలిగింది. రాత్రి వర్షాన రాలిన పున్నాగ పూలని చేతుల్లోకి తీసుకునే అమాయకత్వాన్ని ఎన్నటికీ తను పోగొట్టుకోలేదని నిరూపించుకొంది.
. . .
ఒంటరి రేయిని రాజేశ్వరీదేవి ఆశ్రయించేదో లేక ఆమె ఏకాంతంలోకి రాత్రి ప్రవేశించేదో గాని కవి అంతరంగంలోకి ఓ శక్తిపాతం ప్రవహించేది. అందుకనే ప్రతి అక్షరమూ వెన్నెల వేళనే రాసింది. ‘చీకటి గది’, ‘చీకటి మరపు’, ‘స్వప్నాక్షరాలు’, ‘ఇక ఎలా! ఎలా!’, ‘నా రాత్రి సుదీర్ఘమైనది’ తదితర కవితలే కాక అనేక చోట్ల రాత్రి, ఆకాశం, చంద్రుడు, తారలు, చీకటిలో పూచే పూల ప్రస్తావన చేసింది. ”నా రాత్రి సుదీర్ఘమయిన రాత్రి/ జాగరణ రాత్రి స్నేహరాత్రి స్నిగ్ధరాత్రి/ స్వప్నాలు పూలలా రాలిపోయిన రాత్రి కూడా” అని కొనియాడింది. ”ఎట్లనైన/ చీకటి గదిలోంచి/ బయట పడాలనే/ సాధ్యం కావడం లేదు/ ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి/ ఒక్కొక్కసారి కొన్ని కాంతి కిరణాలు వచ్చిపోతుంటాయి/ ఆ కిరణాల దారిలో వెళ్ళిపోవాలని” ఆశపడింది. ”రాతిరి రాతిరికి నూతికాడ దీపం పెడతాను/ రాత్రికి నా దగ్గర ఉండిపోతావా చెప్పు?/ నేనేమడిగానని? కరెన్సీ పెట్టి కొనలేనిది/ కావాలని అడుగుతున్నాను/ చెప్పు చెప్పు/ ఈ రాతిరికి ఒక్క కలని కానుకగా ఇవ్వు చాలు/ మాటలో కూడా బీదతనమెందుకు?” అని అర్థించింది. ఈ రాత్రి పరంపరలో పూర్వకవులు సౌదామిని, బంగారమ్మ, విశ్వసుందరమ్మ, రేవతీదేవి తదితరుల కవిత్వపాదాలు మనల్ని తరుముకొని రాకమానవు. కానీ రాత్రిని రాజేశ్వరీదేవి తన గుత్తాధిపత్యంలోకి తీసుకొంది.
. . .
రాజేశ్వరీదేవి స్త్రీవాద కవులతో స్నేహపూర్వకంగానే మెలగుతుండేది. స్త్రీవాద ఉద్యమం పట్ల విమర్శనాత్మకంగానే ఉండేది. శరత్, చలం రచనల మూలంగా పొందిన స్ఫూర్తిని కడవరకూ కాపాడుకొంది. ఆ నిప్పుకణం ఆరిపోనీయ కుండా వడ్డెర చండీదాస్ వేపు చేతులు చాచింది. అయితే ఆమె స్త్రీ హృదయంలోంచి, స్త్రీ దృక్కోణంలోంచి, స్త్రీ చైతన్యంలోంచి అప్రయత్నంగానే కవిత ప్రాణం పోసుకొంది. ‘అసలు సంగతి’ కవితలో అంటుంది: ”వంటిల్లూ అవసరమే మసిగుడ్డా అవసరమే/ఎవరి సొంత వంటిల్లు వాళ్ళకి కావాల్సిందే/సామూహిక వంటశాల కల కూలినపుడు/ ఒక దశాబ్దానికి వొదిగిన/ ఒకానొక కాల్పనిక సిద్ధాంతపు క్రేజ్‌లో/ వాస్తవం స్వప్నమవుతుంది/ ఇవాళ నాకంటూ సొంత వంటిల్లు/ లేకపోవడం అవమానకరమే/ అందుకే మొన్నొకమ్మాయి ఆత్మహత్య చేసుకుంది/ నేను కవిత్వాన్ని చదివి కరుడుకట్టాను కనుక బతికివున్నాను.” కవి స్వతంత్రమైన ఆలోచనలతో ఎంతగానో తర్జనభర్జన పడింది. అందుకు తన జీవిత పోరాటమే ఆద్యంతం కారణమయింది. అంబటి సురేంద్రరాజు అంటారు: ”రాజేశ్వరీదేవి అండర్‌గ్రౌండ్ కవి. కవిగానే కాదు మనిషిగా కూడా అండర్‌గ్రౌండ్ జీవితాన్ని ఎంచుకున్నందున, అందుకు అడ్డుగా నిలిచే ఉద్యోగ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని తోసిరాజన్నారు. ఆధునికతానంతర సౌందర్య శాస్త్రానికి మూలవిరాట్టు నీషేకి రాజేశ్వరీదేవితో ఏకాభిప్రాయం ఉంది. ఆయనా ఆ మాటే అన్నారు తనదైన రీతిలో..we have art in order not to die of the truth.
. . .
రాజేశ్వరీదేవి కవిగా హృదయ సంబంధి. రాయకుండా ఉండలేని సమయంలోనే రాసింది. కవితని ఆద్యంతం నవీన కల్పనా శక్తితోనూ, ప్రత్యేకమైన శైలితోనూ నిర్మించింది. అంతశ్శరీరంలో విశిష్టమైన భావావేశం రగుల్కొల్పింది. దానితో అనేక పంక్తులను కాంతిమయం చేయగలిగింది. అలంకరణగా సందర్భానుసారం ఆంగ్లపదమో, వాక్యమో, పాటలోని చరణమో జోడించింది. అక్కడక్కడా చలం వాక్యంలోని మెరుపుతో పాటు మో ‘పలుకుబడి’ కూడ స్ఫురిస్తుంది. ‘ఊరకనే’, ‘ద్వైతం’, ‘వాక్యం తెగదు’, ‘రాగ రాగిణి’, ‘చీకటి మరపు’, ‘స్థితప్రజ్ఞులు’, ‘అట్లా చేశానా?’, ‘స్వప్నాక్షరాలు’, ‘కవితాత్మకత’, ‘రాస్తా’, ‘అసలు సంగతి’, ‘నా రాత్రి సుదీర్ఘమయినది’, ‘నీ కోసం’, ‘నాకు సత్యం వద్దు స్వప్నమే కావాలి’ ఇత్యాది కవితలు చదివిన పాఠకులకు ఆమె ఔన్నత్యం తెలియవస్తుంది. ఇన్ని కవిత్వ గుణాలు కలిగిన కవి తెలుగు సారస్వాతాన శాశ్వత స్థానంలో నిలుస్తుంది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ అంటారు: ”తెలుగు కవిత్వచరిత్రలో 1980ల నుంచి తరగలెత్తిన ఒక తరహా అనుభూతి కవిత్వం యువకవుల భావుకత్వ శక్తికి నిదర్శనంగా భావిస్తాను. అటువంటి కవుల్లో అరుదైన కవిగా రాజేశ్వరీదేవిని పరిగణిస్తాను.”
. . .
రాజేశ్వరీదేవికి నాపట్ల పుత్రవాత్సల్యం ఉండేది. ఆ తల్లిని ఒకే ఒకసారి చూడగలిగాను. పారదర్శకమైన తెల్లని గాజుబొమ్మమల్లే అనిపించింది. అలా ముట్టుకుంటే చిట్లిపోతుందన్నంత సున్నితంగా కనిపించింది. ఆమె నేపథ్యం తెలియజెప్పే మాటలు కొన్ని నాకొక ఉత్తరంలో రాసింది: ”ఎపుడైనా ఎవరైనా నువ్వెవరూ నీ పేరేమిటి అని అడుగుతారు. అడిగిన ప్రతిసారీ నేను తడబడిపోతాను. ఇది నా పేరనీ, ఇది నా ఊరనీ, ఇది నా పననీ, ఇది నా ప్రేమనీ స్పష్టంగా చెప్పడానికి తోచదు. ఏమయినా నేను ఈ శతాబ్దానికి చెందనిదాన్ని. ఈ వ్యవస్థకు సరిపడను లేదా ఈ సిస్టమ్‌లో ఇమడలేని దాన్ని, అందుకనే నన్నెవరూ నువ్వెవరూ అని అడగవద్దు. నేను బుద్ధిజీవిని కాను. ఎలా జీవించకూడదో, ఎలా జీవించాలో నిర్ణయించడానికి. నేను పగిలిన బెల్జియం అద్దాన్ని. అవమాన భారంతో కళ్ళు పైకెత్తి చూడలేను ఒక్కోసారి. చీకటి కాంతిస్వప్నాన్ని. నేను రాగహీనను, రాగలీనను.”
అరవయ్యేళ్ళ జీవితకాలం సౌందర్యతృష్ణతో తపస్సు చేసిన రాజేశ్వరీదేవి తన కవితల పుస్తకం అచ్చువేయడంలో తగినంత ఆసక్తి చూపలేదు. ఆమె జీవితం నుంచి ఆకస్మికంగా నిష్క్రమించిన ఏడాదికి ప్రేమలేఖ ప్రచురణగా ‘సత్యం వద్దు స్వప్నమే కావాలి’ (2016) వెలువడింది. ఆమెని సత్యం బలిమితో వశపరుచుకొన్నప్పుడు, స్వప్నం కోసం గొంతు పొగిలివచ్చిన ఆక్రందనతో పాటు నిజాన్ని ఢీకొని ఓడిపోయినప్పటి నిశ్వాసమూ ఆమె కవిత్వంలో మనకి హోరుపెడుతోంది. అనాథ స్త్రీల అవమానాలన్నీ, చరిత్రహీనుల బాధావమానాలన్నీ, సమస్త మానవాళి జీవన విషాదాన్నంతటినీ మోస్తున్నట్టుగా ఉంటుంది. అంతేనా! చంద్రుడికి జతగా ఆమె జాగరణ చేసిన శ్వేతరాత్రు ల్లోంచి ‘నీ కోసం మళ్ళీ పుట్టి పెరగాలనుంది. నీ కోసం అమృతం తాగాలనుంది’ అనే జీవితేచ్ఛతో ఓ తారాదీపమూ రెపరెపలాడుతోంది.
– నామాడి శ్రీధర్
నామాడి శ్రీధర్: కవి, మానవ హక్కుల కార్యకర్త, ‘ప్రేమలేఖ ప్రచురణ’ సంపాదకుడు.రాజమండ్రిలో కార్మికోద్యమంలోను, హైదరాబాద్‌లో పాత్రికేయుడిగాను పనిచేశాడు.
ఒమ్మి రమేష్‌బాబు, తల్లావజ్జల శశిశేఖర్లతో కలిసి ‘కంజిర’ పొయిట్రీ బులెటిన్ తీసుకొచ్చాడు. ‘ఆకుపచ్చలోయ’, ‘బంధనఛాయ’ స్వీయ కవిత్వ సంపుటాలను ప్రచురించాడు.
శివలెంక రాజేశ్వరీదేవి ‘సత్యం వద్దు స్వప్నమే కావాలి’ సంకలన కర్త.
namadisreedhar@gmail.com
భళిరా.
అందుబాటుకి ఈ కవనం మూడోమారూ ఇలా తట తటాలున తట్టాల్సి వచ్చే డోరు పేరు నీ మాట తీరు.
వన్స్ మోరయినా
నీ పూడిక తీత జరూరు హోరు.
నిక్కము పల్కితిరీతీరున
అరుదారుద కవయిత్రి రాజేశ్వరీ దేవి గారి వంటరి కవితను ఒంటి చేత్తో సంకలితం చేసీ..ఆమె కవితా శిఖరాగ్రతను ఆంధ్ర సాహితీ లోకానికి విడమర్చిన కవి కుమారుడు శ్రీధర్ గారికి మరింత రుణపడ్డామని….అందరి మాటా నానోట