రెండు కథలు ఒక పోలిక

ది ‘ప్రాతినిధ్య 2014’ కథల సంపుటిలోని రెండు కథల మీద చిన్న పరామర్శ. ఆ రెండు కథలు: ఒకటి అరిగె రామారావు రాసిన ‘కొత్తనెత్తురు’, రెండోది వేంపల్లి షరీఫ్ రాసిన ‘తలుగు’. ఈ రెండు చదివాక ఈ కథల్లోనూ ఒక అంతర్లీనమైన ఒక పోలిక చాలా ఆలోచనల్ని రేకెత్తించింది. అది సామాజిక ప్రాముఖ్యం వున్న అంశం కూడా.

ఒక దళిత యువతి తమ పెత్తందార్ల పైన చేసిన తిరుగుబాటు ‘కొత్తనెత్తురు’. ఒక దళిత ముస్లిం తమ పెత్తందార్ల పైన చేసిన తిరుగుబాటు ‘తలుగు’.

ఇది వాటి మధ్య లేని పోలికని ఆపాదించడం కాదు. ఈ పోలికతో కథల్ని విశ్లేషించినపుడు ఆంధ్రప్రదేశ్ భూస్వామ్యానికి సంబంధించిన పార్శ్వాలు కనిపిస్తాయి.

భూస్వామ్య వ్యవస్థ అని మనం సాధారణీకరించి అనేస్తాం గాని ఒక రకంగా దానిలో సాధారణం కన్నా ప్రత్యేక అంశాలే ఎక్కువ. కులంతో, దానిలోని ఈ భూస్వామ్యం ఉన్నత హీనత్వాలతో ముడివేసుకుని ఉన్నది. వ్యవసాయం ప్రధానంగా, కులం అనే ఉత్పత్తి సంబంధం పునాదిగా రూపొందిన మన గ్రామాలలో నిజానికి వ్యక్తే కాదు మనిషి కూడా లేడు.

ఈ రెండు కథల్లోనూ అంతర్లీనంగా వున్న అంశం పారిశ్రామిక ఉత్పత్తి సమాజం- దానిలో రూపొందిన మార్కెట్ సూత్రాలు.

‘తలుగు’ కథలో వెంకటప్ప చావడానికి సిద్ధంగా వున్న ఎనుముని కొనడానికి ఇష్టపడకపోయినా బలవంతంగా దౌలుకి అమ్ముతాడు. ఈ ‘బల’వంతం అతని కున్న గ్రామీణ నేపధ్యం వల్ల వచ్చింది. పైగా కొనడానికి ఇష్టపడని దౌలుతో “ఊరందరితో పడుకునే లంజ పనోని దగ్గరకొచ్చే సరికి నేను సస్వరినీ అందట. అట్టుంది నీ యవ్వారం. కసాయి నా కొడుకువు. నీకు బాదేందివోయ్…మాట్లాడింది సాలు గానీ మూస్కోని ఎంతో కొంత ఇచ్చేసి పట్టుక పో..” అంటాడు. అంచేత దౌలు అనే బోరెవాలకి అమ్మకాలు కొనుగోళ్లలో తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు.

ఎనుము చావ కుండా ఈనిన తరువాత దౌలుకి ‘ఎనుము మన్దా ఎంకటప్పదా అర్తం కావడంలా’ అన్నప్పుడు అతనికి ఏం జరగబోతోందో తెలుసు. అమ్మకాలూ కొనుగోళ్లూ అనే దాన్లో ‘స్వేచ్ఛ’లేని తెగకు చెందిన వాడు కాబట్టి అతనికి ఎనుము మన్దా…ఎంకటప్పదా అనే మీమాంస వచ్చింది. తను కొనుగోలు చేసిన సరుకు మీద తనకి సంపూర్ణ హక్కు లేని భూస్వామ్య కుల సమాజంలో వున్నాడు దౌలు. నిజానికీ కథ పంచాయితీ తెంచడం అనీ పెద్దమనుషులు అనీ మొదలౌతుంది గానీ అది పంచాయితీ కాదు. వాళ్ళు పెద్దమనుషులూ కాదు. దౌలుకి తోడు వచ్చిన వాళ్ళు. అయితే కథలో దౌలు తన మీద అంత దౌర్జన్యం చేసిన వెంకటప్ప మీద అకస్మాత్తుగా ఎలా తిరగ బడ్డాడు? అతనికి హైదరాబాద్ తో పరిచయం వుంది. ఒక రకంగా ఇది తానెదుర్కున్న పరిస్థితి నించి వచ్చిన తప్పనిసరి స్థితి.

ఈ స్థితి చైతన్యంగా మారిన పై దశ ‘కొత్తనెత్తురు’లోని స్వరూపరాణి. ఈ కథ మొదలవడమే “మా మమ్మీ పంపించింది” అన్న స్వరూపరాణితో మొదలౌతుంది. వేదలక్ష్మి అనే చక్కని పేరుని నిమ్నీకరిస్తూ పలికే యాదీ అనే పిలుపుని తిరస్కరిస్తూ వేదలక్ష్మి అని ఠక్కున పలికే స్వరూపరాణి, తన పేరుని అపభ్రంశంగా పలికిన అహంకారాన్ని ఎగతాళి చేస్తుంది.

స్వరూపరాణికి భూస్వామ్య భావజాలాన్ని ఎదిరించడానికి ఆధునిక మార్కెట్ అనే ఆలంబన ఉంది. ఆమె మార్కెట్ వల్ల వచ్చిన స్వేచ్ఛాయుత భావజాలంలో వుంది. ఆమె పని మనిషిగా పని చేస్తుంది. కానీ అది తన తల్లిలా చాకిరీగా కాదు. కార్మిక వనితగా. తనకిష్టం లేకపోతే కుండబద్దలు కొట్టినట్టు చెప్పగలదు. ఆధునిక పరికరాలని వినియోగించగల నైపుణ్యంతో, సామర్థ్యంతో ఆమె వెనుకటి సమాజానికి చెందిన యజమానురాలి పైన ఆధిపత్యంలో ఉండగలదు.

దౌలూ జన్మతః తన కంటే అధికుడైన వెంకటప్పకి ముడి పడిన వాడు. కానీ స్వరూపరాణి ఆ సంబంధం నించి బయటకి వచ్చి ఆత్మగౌరవంతో పాత సంబంధాల్ని పటాపంచలు చేసింది. ఆమె కొత్త నెత్తురు కెరటంలాగా, ఎగసి పడే అగ్నికీలలాగా సుడిగాలిలాగా పెనుతుఫానులాగా ఈ వ్యవస్థని నెట్టివేసి దూసుకు పోగలదు.

అద్దేపల్లి ప్రభు: పేరు అద్దేపల్లి ప్రభాకరరావు. ప్రభు అనే పేరుతో కవిత్వం,కథ రాస్తుంటారు. కవిత్వంలో ఆవాహన,పారిపోలేం,పిట్టలేనిలోకం ప్రచురితమయ్యాయి.దాదాపు 30పైగా కథలు రాశారు. సీమేన్ అనే పేరుతో మొదటి కథా సంకలనం ఇటీవలే వచ్చింది. మానవుల మధ్య సంబంధాలూ మానవునికీ ప్రకృతికీ ఉండే సంబంధాలలోని ఎమోషనల్ అనుబంధాన్నీ చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు..

అద్దేపల్లి ప్రభు

పేరు అద్దేపల్లి ప్రభాకరరావు. ప్రభు అనే పేరుతో కవిత్వం, కథలు రాస్తుంటారు. కవిత్వంలో ఆవాహన, పారిపోలేం, పిట్టలేని లోకం ప్రచురితమయ్యాయి. దాదాపు 30పైగా కథలు రాశారు. సీమేన్ అనే పేరుతో మొదటి కథా సంకలనం ఇటీవలే వచ్చింది. మానవుల మధ్య సంబంధాల్నీ, మానవునికీ ప్రకృతికీ ఉండే సంబంధాలలోని ఎమోషనల్ అనుబంధాన్నీ చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.