సంబరం

ది కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి సంవత్సరం. ఒక వుద్వేగం. ఒక వుత్సాహం. ఆలోచనల చరిత్ర చేసుకుంటున్న సంబరం.

వంతెన కింద చాల జలాలు ప్రవహించాయి. ‘అయామ్ డన్ విత్ మార్క్సిజం’ అనడం ఒక ఫ్యాషన్ అయిపోవడం, ఆ ఫ్యాషన్ అర్థరహితమయిపోవడం కూడా జరిగి పోయింది. ‘మార్క్సిజంలో గ్యాప్స్’ అనే విమర్శ కూడా… అది పుట్టినప్పుడు ఎంత బలహీనమో ఇప్పుడూ అంతే బలహీనం.  

రాలేదని కాదు, కొత్త ఆలోచనలు చాల వచ్చాయి. గొప్ప ఆలోచనలు వచ్చాయి. తమ మేళ్ళు తాము చేశాయి. మునుపు మనం చూడని సమస్యల్ని సమస్యలుగా చూపి, ఆలోచింప జేశాయి.

సందట్లో సడేమియా అన్నట్లు కొందరు మేధావులు.. ‘మరే.. మరే.. అందువల్ల మార్కిజం తప్పు’ అంటో పాత గొణుగుడుకు కొత్త ముసుగులు తొడగబోయారు. ‘ఎందువల్ల’ అని ఎదురడిగితే నోరెళ్ళ బెట్టారు. ఎందుకంటే, కొత్త ఆలోచనలు మార్క్సు వ్యతిరేకులకు వుపయోగపడేవి కావు.

మెటీరియలిజం పునాది మీద నిలబడే గతితర్కం… మార్క్సు ఆలోచన.

దానికి మించి కొత్త ఆలోచనలు మౌలికంగా పురోగమించింది లేదు, ఆకుకు పోకకు పొందని కొన్ని చమత్కారాలు తప్ప.

ఓరియెంటలిజం, పవర్/నాలెడ్జ్, డీకన్స్ట్రక్షన్ వంటి పనికొచ్చే కొత్త ఆలోచనల్ని ముందుకు తెచ్చిన వాళ్లు కూడా మార్క్సిస్ట్ డయలెక్టిక్స్ ను దాటి వెళ్ళారనిపించదు. అదే డయలెక్టిక్స్ ను మరిన్ని కోణాలకు విస్తరించి జీవితాన్ని మరింత వెలిగించారయితే. సో,

‘ఫలానా ‘అందువల్ల’, మార్క్సిజం తప్పు…’ అనే వన్నీ కొన్ని విష్ఫుల్ కపాల పేటికల్లో పుట్టి అక్కడే మరణించిన తుపానులు. మానసిక చక్కిలిగింతలు.

సోవియెట్ రష్యాలో, చైనాలో మరో చోట జరిగినవి మార్క్సిజం నుంచి వైదొలగి చేసిన ప్రయోగాలు. మునుపటి, నేటి ప్రజా వీరుల తెగువలకు, వారి చర్యల్లోని నిజాయితీకి ఎర్రెర్రని సలాములు చెబుతూనే, మూడో ఇంటర్నేషనల్ పరిధిలో జరిగిన ప్రయోగాల వైఫల్యాల్ని గుర్తించక తప్పదు. గుర్తించడం ఎవరినీ తప్పు పట్టడానికి కాదు. సరైన ప్రజా చర్య కోసం వేదికను శుభ్రం చేయడానికి.

ఇది జీవితం. కాల్పనికత (రొమాంటిసిజం) కోసం మనం చేసే నిరంతర ప్రాణ త్యాగాలు ఎదిరి పక్షానికి మేలు చేస్తాయి. అవసరాల వేట కుక్కలచే తరుమబడే పేదలూ, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయవు. ఇది మన వుద్దేశం కాకపోయినా, జరిగేది ఇదే, జరిగింది ఇదే.

మన పోరాట శక్తులు వ్యర్థంగా ఖర్చయిపోవడం ఎదిరికి మేలు చేస్తుంది. అలా మనతో ఖర్చు చేయించడం ఎదిరి సమర వ్యూహంలో ముఖ్య భాగం. ఇది తెలుసుకోడానికి ఎవరూ మిలిటరీ శాస్త్రాల్ని అధ్యయనం చేయనక్కర్లేదు. ప్రయోగ కర్తలు తమ వునికిని కాపాడుకోడానికి ఇంటల్లెక్చువల్ జగ్లరీ తో యువజనం కళ్ళు మిరుమిట్లు గొల్పనక్కర్లేదు.  అక్కర్లేదు నయా బ్రాహ్మణ వాదం.

సోవియట్ రష్యాలో, చైనాలో ఏం జరిగిందో బెతల్ హ్యాం బాగానే చెప్పారు. ‘మంచి మాట చెప్పడానికి మనోడయితేనేం మావో అయితేనేమ’ని ప్రజా కవి కాళోజీ అన్నాడని భలే మురిశాం అప్పుడు?! ఇప్పుడు మంచి మాట చెప్పడానికి మనోడయితేనేం పాశ్చాత్యుడయితేనేం అని అనరేం మనోళ్ళు? బెతల్ హ్యాం చర్మ వర్ణం వెనుక దాక్కుంటారెందుకు? ‘వెస్టర్న్ ప్రాపగాండా’ అని తప్పుకుంటారెందుకు, బెతల్ హ్యాం రష్యా డాక్యుమెంట్లను సైతం మన ముందుంచిన తరువాత కూడా?

ఒక సారి స్టాలిన్ ను తప్పు బడితే, ఇక మనం మన స్టాలినిస్టు పాలిటిక్స్ ను సమర్థించుకోలేమని భయం కదూ?!

‘ఉక్కు మనిషి’ జోసెఫ్ స్టాలిన్ ఉక్కుపాదం కింద నలిగింది ‘పెట్టుబడి’ కాదు, శ్రామికులు.

ఆ ప్రభుత్వ ఛత్రం కింద ప్రవర్ఢమానమయ్యింది సోషలిజం కాదు. ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం.

మేలు పడింది రైతులు, కార్మికులు కాదు. వాళ్లు మరిన్ని పని గంటలు పని చేసి, మరింత నిర్బంధ శ్రమ బరువు కింద నలిగిపోయారు. హింసల పాలయ్యారు. (‘లక్షల’ మంది ‘ప్రజా శత్రువుల’ట, వాళ్ళ మీద హింసలు, నిర్బంధం సరైనదట. అన్ని లక్షల మంది ప్రజా శతృవులుండేది… అదొక దేశమా, నరక లోకమా?)

డెభ్భయ్ ఏండ్ల తరువాత… ఒక తెలుగు కవి వుపమించినట్లు…  బ్యాండేజ్ విప్పి చూస్తే పుండు ఎక్కడున్నది అక్కడే వుంది. నిజానికి మరింత చీము పట్టి వుంది. మనోళ్ళంతా పార్టీ కార్డులే ప్లేన్  టిక్కెట్లుగా మాస్కో ప్రయాణాలు చేసొచ్చి, అక్కడ అంతా భూతల స్వర్గమని మనకు చెప్పింది పచ్చి అబద్ధమని లేదా కళ్ళకు గంతలు కట్టిన మచ్చిక గుర్రాల దృక్-పథమని తెలిసిపోయాక… ఇంకా… ఇంకా…  ఎందుకు వ్రేలాడ్డం మూడో ఇంటర్నేషనల్ పుచ్చిన కొమ్మలు పట్టుకుని?!

ఏండ్లు పూండ్లు గడిచినా… మరి కొన్ని ఉడుకు నెత్తురు పొంగి పొర్లే యవ్వనాగ్నులు భగ్గున మండి ఆరిపోవడమే గాని… ఒక్క ఎకరా భూమి దున్నే వాడి పరం కాకపోయినా, అసలిపుడది ఒక పోరాడదగిన జీవన్మరణ సమస్యే కాకపోయినా… ఇంకెన్నాళ్లు వ్రేలాడతారు ‘అర్థ భూస్వామ్యం’ అనే అర్థ రహిత నినాదం చూరు పట్టుకుని.

ఇంతకూ మన పోరాటాల ధ్యేయం ఏమిటి?

భూమి పంపిణీ కాదు. ఎందుకంటే, ఇప్పుడు ఫ్యూడల్ భూస్వాముల్లేరు, వాళ్ళ భూముల్లేవు.

ఫ్యాక్టరీలపై ప్రజా యాజమాన్యం కాదు. మన ట్రేడ్ యూనియన్లు అలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు లేవు. అసలది మన అజెండాలోనే లేదు.

అందరి ధ్యేయం ఒక్కటే. రాజ్యాధికారం. అయితే వోట్లూ సీట్ల లెక్క. లేకుంటే శవాల లెక్క. ధ్యేయం మాత్రం రాజ్యాధికారం. రాజ్యాధికారం ఎవరికి? కమ్యూనిస్టు పార్టీకి? పార్టీకి రాజ్యాధికారం ఎందుకు? సోషలిజం నిర్మించడానికి! అదీ సంగతి. తిరిగి తిరిగి తిరిగి స్టాలిన్ దగ్గరికే వస్తాం. రాజ్యాధికారంతో సోషలిజం అనే భావనకి. రాజ్యాధికారంతో సోషలిజం అంటే ‘పై నుంచి సోషలిజం’. పైన ఎవరుంటే వారి సోషలిజం. పై వాడు శ్రామిక వర్గం వాడు కానక్కర్లేదు, పార్టీ వాడయితే చాలు. పార్టీలో నాయకుడు కాగలిగితే చాలు.

లెనిన్ ని ఎందుకనవు అని అడగొద్దు. లెనిన్ బతికుంటే ఎలా వుండేదో తెలియదు.  బహుశా ఆయన తలపెట్టిన ‘న్యూ ఎకనామిక్ పోలసీ’ ప్రజావసరాలకు అనుగుణంగా మరింత విస్తరించేది. ఎన్ ఈ పీ అనేది సోషలిజం కాదు. ‘ప్రజాస్వామ్యం’.

‘పై నుంచి సోషలిజం’ అనే తబలా మీద స్టాలినిస్టు తరహా అపశృతులే పలుకుతాయి. ఆ అపశృతులను ఇప్పటి పార్టీలలోనూ వినొచ్చు, ఓపిక వున్న వాళ్ళు.

ఇటాలియన్ మార్క్సిస్టు ఆంటోనియో గ్రాంసీ చెప్పినట్లు మార్పు పైనుంచి కాదు, కింద పౌర సమాజం (సివిల్ సొసైటీ) నుంచి పెల్లుబుకాలి. నిలబడేది అదే. ప్రజలకు మేలు చేసేది అదే. సోషలిజానికి బాట వేసేదీ అదే.

అది ఎప్పుడో  ఎక్కడో కాదు. వూరు, పట్నం, నగరం నడి బొడ్డున ఎగరాలి శ్రామిక పతాకం. ఎవరెవరం ఎక్కడున్నామో అక్కడే. ఎవరెవరం ఏయే పనులు చేస్తున్నామో ఆ పనుల చెమట మరకలతోనే ఎగరాలి జనం జెండా. ఇవాళ దానికి చాల ఆస్కారం వుంది. పేరు పెట్టి గాని, పెట్టక గాని ‘పెట్టుబడిదారీ’ని, దాని క్రుయెల్టీని జనం ప్రశ్నిస్తున్నారు. ‘పెట్టుబడి’ కేంద్రమయిన అమెరికాలో శ్రీ డొనాల్డ్ ట్రంపు దొర గారిని గెలిపించిన ‘ఎర్ర’ (రిపబ్లికన్) రాష్ట్రాల్లోనే… కేవలం తమ కోసం గాక, తమ చేతుల్లోని భావి ప్రపంచం కోసం టీచరమ్మలు… మైళ్లకు మైళ్ళు కదం తొక్కారు.

తమిళనాడు, తూత్తుకూడిలో ‘వేదాంత’ గారి స్టెర్లైట్ ఫ్యాక్టరీ మా కొద్దు, దాని ప్రాణాంతక కాలుష్యం మాకొద్దని ప్రజలు ప్రాణాలకు తెగించి నినదించారు.

మరి పలు చోట్ల మరి పలు పోరాటాలు…

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ అన్యాయం వుందో, దోపిడి వుందో, ఎక్కడ ఆకలి అవమానాలున్నాయో అక్కడంతా ఎదిరింపు వుంది.

హరాకిరీ లే కాదు; దుర్మార్గం మీద, అన్యాయం మీద పోరాడ్డానికి వేవేల మార్గాలున్నాయి.

మనకు చాల తక్కువ నష్టం ఎదిరికి చాల ఎక్కువ నష్టం కలిగించేదే మంచి పోరాటం అని ప్రజలకు తెలుసు. మార్క్సిజానికి తెలుసు.

బాగా వెనుక బడిన దేశం అనే బలహీనమైన లింకును తెగ్గొట్టడం… వింటానికి బాగుంది గాని, బాగా ముందు-పడిన దేశాల్లోనే… పెట్టుబడి కోటల్లోనే ‘మొదట సోషలిజం’ అన్న మార్క్సు భావన ఇప్పటికీ సత్యమని… ఇటీవలి చరిత్ర మనకు తెలియజేసింది. దానికి దోహదం చేయడమే సరి దారి.

ఔను, మార్క్సు వైపు, మార్క్సిజం వైపు ఇప్పుడు ప్రపంచ పవనాలు వీస్తున్నాయి. ఆరోగ్యప్రదమైన పవనాలు. ఈ పవనాలు జీవ దాయినులు.

కాల్పనికత పునాది మీద నిర్మించే గాలి మేడలు కూలి, పేద యువత నలిగిపోవడం కాదు, దానికి మన పద్య గద్యాలతో నిప్పులు ఎగదోయడం కాదు ఇవాళ జరగాల్సింది… అది నయా బ్రాహ్మణ వాదం… నియో ఇంటెల్లెక్చువలిజం.

సాంస్కృతిక విప్లవ కాలంలో చైనా పిల్లలు ప్రొఫెసర్ల నెత్తుల మీద పేడ తట్టలు ఎత్తడం వంటి ‘అతి చర్యల’ (ఎక్సెసెస్) కు పాల్పడ్డారని ఆనాడు ఈసడించినది మనలోపలి నయా బ్రాహ్మణ వాదమే.

భౌతిక శ్రమ కన్న ఇంటల్లెక్చువల్ శ్రమ ఏమంత పవిత్రం కాదు. అందరూ అన్ని పనులూ చేయాలి, చేయగలరు. దానికి తగిన సంస్కారం మప్పేదే, అలాంటి సంస్కృతిని నిర్మించేదే మార్క్సిజం. మిగిలింది.. అది ఏ వేషం వేసుకున్నా, ఏ రంగు పూసుకున్నా… మార్క్సిజం కాదు.

వాస్తవికత పునాది మీద మార్క్సు కన్న కల, స్వప్న శాస్త్రం మార్క్సిజం. అది పదిలంగానే వుంది. అడుగడుగున రుజువవుతున్నది. మన వాస్తవిక పునాది మీద మనమూ కొత్త కలలు కందాం.

ఆలోచించడానికి మార్క్సిజాన్ని మించిన కరదీపిక లేదు.

మిగిలింది ఏదయినా ట్రంపులకు, మోడీలకు ఎర్రనివో మరే రంగువో తివాచీలు పరిచేదే.

మార్క్సుకు మనఃపూర్వక ద్విశత నివాళి!

హెచ్చార్కె

7 comments

 • ఇక్కడ రావిశాస్త్రిగారు రాసిన ఒక చిన్న కథ గుర్తొస్తోంది. కథపేరు “బాధ్యత-భద్రత” జీవులెవరికైనా త బాధ్యత తెలియక పోయినా తమ భద్రత మాత్రం తెలుస్తుంది అని చెప్పే ఆ చిన్న కథ మార్క్సిస్టు మూల సూత్రాన్ని చెప్పింది .మార్క్స్ నీ మార్క్సిజాన్నీ తమ అవసరాలకోసం ప్రజల్ని కన్ఫ్యూజ్ చెయ్యడానికి ఉపయోగించుకున్న వాళ్ళూ, తమకు తెలిసిందే మార్క్సిజమని బుకాయించిన వాళ్ళూ, దారి తెలియని అడవిలో తామే దారిగా మారాలని ముండుకురికిన వాళ్ళూ తమ చుట్టూ ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం తమ భద్రతను పదిలపరచుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అయితే భద్రత ఏదో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత భుజానికెత్తుకుని ప్రజలతో పాటు నడిచే వాళ్ళే మార్క్సిజం ఆచరణకు ఉదాహరణ కాగలరు. నాయకులు నడవ వలసినది ప్రజలకు ముందూ కాదూ, వెనుకా కాదు.

 • ఆలోచించడానికి మార్క్సిజాన్ని మించిన కరదీపిక లేదు. ఇది వాస్తవం.

 • బేతేలీహెల్మ్ సంగతి అటుంచి సుదీర్ఘంగా సోవియెట్ విప్లవ కుదింపు, పతనం గురించి రాసిన ఐసాక్ డోయిశ్చర్ గురించి ఇప్పటికి చర్చ లేదు. పాత మావోయిస్టు సమర్ధకులు ఆ ప్రస్తావన వస్తే ఎదో ఒక రకంగా దాట వేసే ప్రయత్నం మాత్రమే చేసారు.

  భారత దేశంలో చైనా తరహా విప్లవం (సారాంశంలో వామపక్ష జాతీయ వాద విప్లవం) ఇంకా సాధ్యం అని వాదించటానికి వారి దగ్గర సాధనాలు మిగలలేదు. చరిత్రలో అసమాన కలగలుపు (అనీవెన్ అండ్ కంబైన్డ్ డెవలప్మెంట్ ) అనేది పరమ సూత్రం (అబ్సొల్యూట్). ఇండియా ఇందుకు మినహాయింపు ఏమి కాదు. తూర్పు దేశాల్లో బూర్జువా వర్గం వదిలేసిన హేతుబద్ధ (రేషనల్) లిబరల్ డెమోక్రాటిక్ కార్యక్రమాన్ని కూడా కార్మిక వర్గమే పూర్తిచేయాలి, కానీ దానికి పరిమితం కా కూడదు.
  సామ్యవాద విప్లవం సాధించే మార్గంలోనే, చరిత్ర మిగిలిచిన ఆ చెత్త, చెదారాన్ని ప్రక్షాళన చేసి కార్యక్రమాన్ని పూర్తిచేయాలి కానీ ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం అనే స్టేజియస్ట్ మార్గం లో మాత్రం సాధ్యం కాదు. ఆచరణలో మావోయిజం వామపక్ష జాతీయవాదం గా మిగిలింది. మావోయిజం స్టాలింసిం కి తమ్ముడు.

 • Excellent piece. Some body has to take first step to get away from the old rut and start anew. We need a path away from Stalinist thinking of manipulating the truth and suppressing the dissent in the C parties. Not an easy task in the face of old built up prejudices. Right-minded people need to work for such a revolutionary turn today.

 • మార్కిస్న్ పధ్ధతిలో , నియంతృత్వం లేదా దాని నిర్వహణ సరైన పధ్ధతిలో కానీ లోపం కావచ్చు .
  ఎందుకంటే .ప్రతి నాయకుడు బేసిక్ కాన్సెప్టును అర్ధం చేసుకోలేక పోవచ్చు మరియు పాటించక పోవచ్చు .నిజాయితీ అయిన విజ్ఞుడయిన నాయకులే దాన్ని అర్ధం చేసుకో గలరు .నాయకత్వాన్ని ప్రతి సారి సమీక్షించి ,సరిదిద్దు తుండాలి .మార్క్సిజం తప్పు కాదు .అది అమలు పరచిన తీరు తప్పు కావచ్చు ,బహుశా . మరింత జాగ్రత్తగా ,మరింత ప్రజలకు చేరువగా ,మెరుగుగా ఉంది ఉంటె అది విజయవంతమయి ఉండేదేమో .కొత్త సిద్హంతాన్ని అమలు చేసేతప్పుడు జాగ్రత్తగా ఉండాలి .విజయవంతమయ్యే వరకు కష్టపడాలి ,అదీ ప్రజలకు సంభందించిన , ఒక ఆదర్శవంతమయిన సిద్ధాంత మయినప్పుడు మరియు భవిష్యత్తును ప్రభావితం చేసేదయినప్పడు .ఇప్పటికి ఎక్కడయినా ఆర్ధిక అపజయాలను పొందినప్పుడు ,మార్క్సిజం వయిపు చూస్తారు కొందరు .కొందరు జరిగిన పరిస్థితులను బట్టి దాన్ని అనుమానిస్తూ ఉండొచ్చు ఇప్పటికీ ప్రజలు సమానత్వ సమాజం కోసం ఆలోచిస్తారు, అందరూ మెరుగయిన సమాజం కోసం,మెరుగయిన అవకాశాల కోసం ఆలోచిస్తారు . . నా అభిప్రాయంలో , మార్క్సిజం సిద్ధాంత పరమయిన లోపము కాక పోవచ్చు ,అడ్మినిస్ట్రేటివ్ సమస్య అయి ఉండొచ్చు లేక వేరే సమస్య అయి ఉండొచ్చు .ఒక సారి విఫలమయినా మరిన్ని సార్లు ప్రజలు దాని కోసం ప్రయత్నించొచ్చు ,భవిష్యత్తులో . .మంచి సంపాదకీయం .కృతజ్ఞతలు . శుభ దినం .

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.