సరళ కవితకు ఆద్యుడు నన్నెచోడుడు

 

పాశ్చ్యాత్య సాహిత్య ధోరణుల ప్రేరణ కావచ్చు లేక మారుతున్న కాల ప్రభావం కావచ్చు,  ఆధునిక కవిత్వ సృజన అధిక శాతం వచనంలోనే సాగుతోంది. భావనా శక్తి ఉండాలే గానీ ఛందో బద్ద  పద్యంలోనే కాదు ప్రతీ ఆలోచననూ స్వేచ్చగా సరళమైన వాడుక భాషలో వ్యక్తం చేయవచ్చు. ఇది కవులకు అందిన ఒక వెసలుబాటుగా భావించాలా లేక పాఠకుల ఉదార గుణం అనుకోవాలా ? రెండు జవాబులూ సరైనవే. అయితే మొదటిగా చొరవ తీసుకుని పాఠకులకు తన రచనా శైలిని పరిచయం చేసి ఒప్పించి రంజింప చేయవలసిన భాద్యత కవిదే.

“నిరంకుశః కవయః” – ప్రాచీన పండితులు సూత్రీకరించినట్లు కవి తన భావనల సామ్రాజ్యంలో  తానే సర్వాధికారి, నిరంకుశుడు. తనకు ప్రేరణ కలిగించిన ఏ అంశాన్నైనా తన సాహిత్య ప్రక్రియలో వస్తువుగా సంధించవచ్చు.  కానీ మెజారిటీ పాఠకుల ఆదరణ పొందితేనే కాలం పోటుకు తట్టుకొని ప్రకాశించగలడు. ‘శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ ధధతో’ (ఆదికవి నన్నయభట్టు  మొదటి పద్యం) నుండి ‘కాదేదీ కవిత కనర్హం’ (మహాకవి శ్రీ శ్రీ) వరకూ తెలుగు సాహిత్యం తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎంతోమంది ప్రతిభావంతుల నేర్పరి తనం వల్ల కొత్త కాంతులను ప్రసరించింది. ఆయా కాలాలలోని సమాజ స్థితిగతులకనుగుణంగా కొత్త భావజాలాన్ని తనలో కలుపుకొని ప్రవహించింది. కొత్త ప్రయోగాలకు చోటు కల్పించి నూతన దృక్పథాల ఒరవడికి స్పూర్తినిచ్చింది. తమ శక్తివంతమైన రచనలతో ఆదరణ పొందడమే కాక పాఠకుల ఆలోచనా సరళి పై ప్రభావం చూపిన సాహితీ మూర్తులు యుగ కవులుగా వన్నెకెక్కి ప్రజల నాలుకలపై నిలిచిపోయారు . అలాంటి వారిలో ‘ఒరవడి పెట్టిన ఒజ్జ(గురువు)’ నన్నె చోడుడు. నన్నయకు తిక్కనకు మధ్యనున్న కాలంలో (12 వ శతాబ్దం)  జన్మించి శివ సాహిత్య త్రయంలో మొదటి వాడుగా చరిత్రకెక్కాడు. శైవ కవిత్రయం లోని మిగిలిన ఇరువురు పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితారాధ్యుడు.

తెలుగు సారస్వతంలో మొదటిసారి ఒక సాహిత్యకారుడు ఏయే రచనాంగాలు ఎలా ఉండాలో సూటిగా చెప్పిన కీలకమైన ఘట్టం నన్నెచోడుడి ఈ పద్యం. పద్య శిల్పమే కాదు ఏ సాహిత్య ప్రక్రియలో కావ్యాన్ని వెలువరించినా అందులో  భావము, వర్ణన, అర్థము, శబ్ద సౌందర్యము, కావ్య జీవములు పొదిగి ఉండాలి. పండితులను మెప్పించ గలగాలి. ఏదో కృత్రిమంగా బట్టీ పట్టినట్టుగా కాకుండా ప్రతీ అంశం ప్రసన్నతతో కూడినదై ఉండాలి అన్నాడు నన్నెచోడుడు. ఒక్కొక్క అంశానికి ఏయే లక్షణాలు ఉండాలో కూడ స్పష్టంగా చెప్పాడు. కుమారసంభవ కావ్యంలోని ఈ పద్యం తరువాతి తరం కవులకు ఆయన నేర్పిన పాఠంగా నిలుస్తుంది.

 

సరళము గాగ భావములు జానుతెనుంగున నింపు పెంపుతో

పిరిగొన, వర్ణనల్ ఫణితి పేర్కొన,  అర్థములొత్తగిల్ల, బం

ధురముగ ప్రాణముల్ మృదు మధుత్వ రసంబున కందళింప, అ

క్షరములు సూక్తులు ఆర్యులకున్ కర్ణ రసాయన లీల క్రాలగాన్.

 

పిరిగొన = పెనవేసుకొని ఉండు;  ఫణితి పేర్కొన = వాక్కు ప్రసిద్ధములుగా నుండు; బంధురముగా = సుందరముగా;  ప్రాణముల్ = కావ్య జీవములు; కందళింప = అంకురింపగా; సూక్తులు = సు + ఊక్తులు = మంచి మాటలు; ఆర్యులకున్ = పండితులకు;  కర్ణ రసాయన లీలన్ = వీనుల విందగు విధమున; క్రాలగాన్ = తగినట్లుగా, అందంగా

తాత్పర్యము = భావములు సరళతతోనూ, స్పష్ఠమై అందరికీ తెలిసిన జాను తెలుగు పదాలతో నిండి ఉండాలి.  మరి వర్ణనలు వాక్కు ప్రసిద్ధములుగా ఉండాలి అంటే అవి యెప్పటికీ నోటికి గుర్తుండి పోయే విధంగా ఉండాలి. అర్థములు పొడి పొడిగా కాక ఒత్తుకొనిపొయి సాంద్రతరంగా ఉండాలి.  కావ్య జీవములు ఒప్పుగా మృదు మధురంగా అంకురించాలి. అక్షరములు మరియు సూక్తులు పండితులకు వీనుల విందుగా ఉండి మెప్పించగలగాలి. కావ్య రచనను అలా చేయాలి అని ఈ పద్య తాత్పర్యం. ఇక్కడ కవి జాను తెనుగు అనే కొత్త పదాన్ని వాడాడు. అంటే సంస్కృత పద భూయిష్టమైన ‘మార్గ ‘ కవిత్వం కంటే సందర్భానికి తగినట్లు ఉండే తేట తెలుగు మిశ్రమమైన ‘దేశీ’ కవిత్వాన్ని  వాడమన్నాడు. జాను అను పదము కన్నడ భాష నుండి వచ్చి చేరినది. జాణ్ణుడి అనగా అందమైన నుడికారము కల భాష అని అర్థం. మార్గ కవిత అనగా క్లిష్టమైన ఛందో స్వరూపంలో రాసిన పద్యాలు, ఉదాహరణకు చంపకమాల ఉత్పలమాలలలో అల్లిన పద్యాలు . దేశీ కవిత్వము సరళ చందస్సుతో కూడుకొని పాడుకోవడానికి కూడా సులభంగా అనుకూలించేది గా ఉంటుంది ఉదాహరణకు ఆటవెలది , తేటగీతి మరియు సీసం లాంటివి

ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో నన్నెచోడుడుని ఇలా అభివర్ణించారు. “ఆదికవి అన్న బిరుదు లేకపోతే పోయింది కానీ నన్నెచోడుడు నిజంగా చాలా విషయాలలో ఆద్యుడు. ప్రతీ ప్రబంధంలోనూ మనం మొట్టమొదట చదివే ఇష్టదేవతా ప్రార్ధన , పూర్వకవి స్తుతి, కుకవి నింద, గ్రంధ కర్త స్వీయ వంశ వర్ణన , కృతిపతి వర్ణన, షష్ట్యంతాలు మొదలైనవి నన్నెచోడుడే మొదలుపెట్టాడు. అది తరువాతి కవులకు ఒరవడి అయింది. అందుకే నన్నెచోడుని కావ్యాన్ని సాహితీపరులు సీరియస్ గా అధ్యయనం చేయాలి. ఇది మన ప్రప్రధమ సద్రసబంధుర ప్రబంధం.  ప్రబంధాలకు మరి కొన్ని ఉదాహరణలు : రాయల వారి ‘ఆముక్తమాల్యద’ , పెద్దన వారి ‘మను చరిత్ర’.

అలాంటి మార్గదర్శి అయిన నన్నెచోడుని స్మరించి, ఆయన రచనలు అధ్యయనం చేయడం ద్వారా ఆ మహాకవికి నివాళులర్పిదాం.

 

 

 

 

 

 

  • లెనిన్ వేముల

 

లెనిన్ వేముల

లెనిన్ బాబు వేముల: వృత్తికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఎమ్మే లో చదువుకున్న తెలుగు భాషా సాహిత్యాల సౌందర్యం మత్తు వదలని పాఠకుడూ వ్యాఖ్యాత. ప్రస్తుతం అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి టాంటెక్స్ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్)  నెల నెలా తెలుగు వెన్నెల క్రియాశీలురలో ఒకరు.

4 comments

  • చాలా బావుంది లెనిన్‌ గారు. నన్నెచోడుడి పద్యం కూడా.

    ఇంద్రాణి.

  • బావుంది. మీ వ్యాసాలు చదివినపుడల్లా అనిపిస్తుంది జీవితకాలం సరిపోదు ఇవన్నీ చదవటం అని

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.