గోడ కుర్చీ

కొండలాంటి వాడివి కావొచ్చు
లంకంత ఇల్లు లాంటి వాడివీ కావొచ్చు
సముద్రం లాంటి గోడ మీద మాత్రం. నువ్వొక వలకి చిక్కిన జాలరివి…!!


1
పెరటి గోడమీద నాచు, యవ్వనం కాలేస్తే జారిపోయే బొమ్మల్ని చూపిస్తుంది..!
ఇంటి ప్రహరీ గోడ, ఏళ్ళతరబడిగా ఊసరవిల్లిలాంటి నినాదాల్ని మోస్తుంది..!!
అసలో మాయో, పువ్వో ముల్లో… గోడ
రక రకాల ముఖచిత్రాల్ని వేలాడదీసి
జింక రూపం ధరించిన పులిని దాస్తుంది..!
ఇద్దరు కలిసి పంచుకోలేని జీవితాన్ని
నీడల పేజీల్లో తోలు బొమ్మలాట చేస్తుంది.!!

గోడ మీద చూపుడు వేలు, నీ ఇష్టాల చుక్కల్ని కలుపుతూ భావోద్వేగాల భాషని మెల్లగా మంత్రగాడి ముగ్గులోకి దింపుతుంది
నువ్వెందుకు నవ్వుతావో, ఏది నీ కంట్లో నీరు తెప్పిస్తుందో, నీ గదిలో ఏ పుస్తకాలున్నాయో
నువ్వే గుడికి వెళ్తావో, నీ హృదయ సంగీతం ఏ రాగం పలుకుతుందో…
దాని డప్పు శబ్దం కుడివైపో ఎడంవైపో
నీకే తెలియకుండా, నువ్వెవరో
ప్రపంచం మొత్తానికీ షేర్ చేయబడతావు
నీ స్నేహం దాహాన్నెప్పటికీ తీర్చలేని గోడ
కామెంట్ల వానచినుకుల్లో
ముద్ద ముద్దగా నానిపోతుంది.

వేల సమూహాల్తో కరచాలనం చేయించిన
కోతుల గుంపులాంటి కొన్ని ఆలోచనలు
పాత మిత్రుల్లా గోడ మీద కూర్చుని
ఉబుసుపోక కబుర్లు చెప్తాయి..
పుట్టిన తేదీ నుంచీ నీ చరిత్రనంతా గోడ తెల్లని సున్నంలా రాసుకుంటుంది.
ప్రపంచమంతా తిరిగే మేధ వున్న నువ్వు
బల్లి వీపులా గోడ మీదే అతుక్కుపోతావు


2
గోడ అప్పుడప్పుడూ
తిన్న ఉప్పు గుర్తొచ్చి తిరగబడుతుంది
సీతని ఎత్తుకెళ్ళినవాణ్ణే నయమంటుంది.
గోతికాడ నక్కల్లా రక్తం మరిగిన మూడు సింహాల తోకల్ని మెలిపెట్టి తిప్పుతుంది.
కర్మ కాండ కోసం మూతబడ్డ ముంబై నగరం మీద అసహనంగా ఉమ్మూస్తుంది

రక్త మాంసాలున్న మనుషులెప్పుడూ ఇటుకరాళ్ళవ్వలేదు…..గోడలేమీ పావురాయి రెక్కల్లాంటి శాంతి సౌధాలు కాదు
మంగోలులు చైనా గోడ ని దాటి వచ్చినట్టు
సామాన్యులు బెర్లిన్ గోడని బద్దలుకొట్టినట్టు
విధ్వంస చరిత్రలో గోడలెప్పుడూ కూలిపోయిన కలల్ని గూళ్ళు కట్టుకుంటాయి

 

3
మొండి గోడల మధ్య
ఏ మూలనో కుర్చీ వేసుకుని…….నువ్విక్కడ నీది కాని నీ దినచర్యని ముక్కలు ముక్కలుగా అతికించుకుంటుంటావు.
నిన్ను సమాచారం చేసి అమ్ముతూ
ఖండాంతారాల్లో ఎక్కడో ఇంకొడు
అదే పనిగా చేతులు కడుగుతుంటాడు..?

—- శ్రీరామ్

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

12 comments

 • Excellent poem..ఈ కవిత పై అభిప్రాయం చెప్పటమంటే ఒక సాహసమే! నన్ను నేను ముక్కలుగా చేసుకొని నాలుగో సింహం గా పుట్టినప్పుడే సాధ్యమేమో.. చూడాలి..గొప్ప కవిత్వం రాస్తున్న, గొప్ప సాహితి విశ్లేషకుడు అయిన శ్రీరాం నాకు మిత్రుడని చెప్పుకోవడం గర్వంగా వుoది ..నేను, నామిత్రుడు ఒకే వేదికపై జులై 15 న అనంతపురం లో డా.రాధేయ పురస్కారం తో మా కవిత్వానికి దక్కిన అరుదైన గౌరవం స్వీకరించబోతున్నాము…అభినందనలు మిత్రమా..

  • అన్నా, ధన్యవాదములు. నీ ప్రతి మాట ఆశీర్వచనమే.

 • నమస్తే సర్…కవిత చాలా బావుంది .
  మీరు కవిత్వం అల్లే విధం గొప్పగా వుంటుంది….
  శుభాకాంక్షలు

 • కవిత గోడలను బద్దలు కొట్టే చర్యను ప్రతి ఒక్కరి అవసరంగా చాలా సూటిగా చెప్పింది. కవి హృదయంలోని ఆర్థ్రతను ఆవిష్కరించింది. అభినందనలు రాంజీ.

 • kavitha chalaa baagundhi sir..
  cheppalanukunna vishayaanni mottham maalooki yekkinchesaaru ee kavitha dvaraa..

  • థ్యాంక్యూ సార్. నా గోస మీకందినందుకు ధన్యుణ్ణి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.