సరస్సులూ, అగ్నిపర్వతాలూ, కవిత్వం – నికరాగువా

“సరే సరే, బాగా వెతకండి. కానీ ఇక్కడ మీకు దొరికేది కేవలం కవిత్వం మాత్రమే.”
మిలిటరీ కూప్ ద్వారా చిలీ డిక్టేటర్ అయిన పినోచిట్ కు చెందిన ఆర్మీ మనుషులు,  తన ఇంటిని సోదా చెయ్యడానికి వచ్చినప్పుడు ప్రజాకవి పాబ్లో నెరుడా వాళ్లతో అన్నమాట అది.

చిలీ, లాటిన్ అమెరికాలో ఒక దేశం. లాటిన్ అమెరికా అంటే ఉత్తరాన మెక్సికో దేశం నుంచి మొదలై దక్షిణాన చిలీ దేశంలో భూమి అంచున ఉన్నట్లుండే ‘కేప్ హార్న్ ‘ దాకా విస్తరించి, ప్రజా విరుద్ధ సైనిక పాలనలకూ, స్వాతంత్రోద్యమాలకూ, విప్లవాలకూ, అద్భుత సాహిత్యానికీ  మారు పేరైన జీవగడ్డ.

వెళదాం పదండి, లాటిన్ అమెరికా ప్రజా చరిత్రలోకి! ఎప్పటికప్పుడు దారి చేసుకుంటూ, వెళ్లిన దారుల్లోకే  మళ్ళీ మళ్ళీ వెళుతూ, వెనక్కీ ముందుకీ అడుగులేస్తూ, సమాధానాలనూ, వాటితో పాటే ప్రశ్నలనూ వెతుక్కుంటూ, కవిత్వం చదువుకుంటూ…

ఈ ప్రయాణం మొదట్లోనే మీకు చెప్పుకోవలసిన ముఖ్య సూచన: అన్యాయాన్ని ఎదిరించి కొసప్రాణం వరకూ పోరాడిన ఎందరో మనకు ప్రతి మలుపులో తారసపడతారు. తుపాకులు పట్టుకుని వాళ్లు చేసిన పోరాటాలు ఇప్పుడు చెల్లవు. ఈ ప్రయాణంలో స్ఫూర్తిగా తీసుకోవలసింది ఆ ప్రజా వీరుల  నిబద్ధతనీ, ధైర్యాన్నీ, మానవత్వాన్నీ, సమసమాజం కోసం తపననీ. ఎందుకంటే, ఇది బహిరంగ, వీధి పోరాటాల సమయం!

ఈ ప్రయాణానికి, ‘హోకా హే’ అని పేరు పెట్టుకుందాం. తమ భూమిని ఆక్రమించుకుంటున్న అమెరికా సైనికులపై విరుచుకుపడే ముందు, ‘లకోట’ తెగ వీరుడు ‘తాషుంక వీట్కో’ (Crazy Horse) వేసిన పొలికేక, ‘హోకా హే’. అంటే, ‘చచ్చిపోవడానికి ఇది మంచి రోజు’ (It is a good day to die).

Off we go!

*

నికరాగువా – సరస్సులూ, అగ్నిపర్వతాలూ, కవిత్వం

ఉత్తర అమెరికాకు దక్షిణ అమెరికా అందిస్తున్న చేతి పిడికిలిలా ఉంటుంది నికరాగువా. రెండు మంచి నీటి సరస్సులూ, ఎన్నో అగ్నిపర్వతాలతో పాటు, కాఫీ, వేరుశనగ, పొగాకు, చెరుకు వంటి పంటలతో పాటు బంగారు పండే భూమి అది.

16వ శతాబ్దంలో స్పెయిన్ రాజ్యం ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునే ముందు వేల ఏళ్లుగా ఎన్నో తెగల ప్రజలు ఇక్కడ నివసించేవారు. స్పెయిన్ సైన్యాన్ని ఎదిరించిన ఒక తెగ నాయకుడైన “నికరాఒ” (Nicarao) పేరు మీదా, ఈ ప్రాంతంలోని మంచినీటి సరస్సుల  వలనా ఈ ప్రాంతానికి నికరగువా అన్న పేరు వచ్చింది. ‘ఆగుఅ’ (Agua) అంటే స్పానిష్ లో ‘నీరు’ అని అర్థం.

ఈ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం స్పానియార్డ్ లు ఇంగ్లండ్ వంటి ఇతర రాజ్యాలతో, తమలో తామూ యుద్ధాలూ చేస్తూనే ఆక్కడి ఆదివాసుల పతనానికీ, వారి సంస్కృతి వినాశనానికీ కారకులయ్యారు. ఎన్నో తెగలు నామరూపాలు లేకుండాపోయాయి.

ఎన్నో యుద్ధాల తరువాత, రాజ్యాల మార్పిడి తరువాత 1838లో స్వతంత్ర దేశమయింది, కానీ సంప్రదాయవాదులకూ, ఉదారవాదులకూ మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగుతూ ఉండేది. ఉదారవాదులకు సహాయం చేస్తానంటూ, 1850ల్లో ‘విలియం వాకర్’ అనే అమెరికా సంయుక్త రాష్ట్రాల (ఇకపై యు.ఎస్.ఏ అని ప్రస్తావిస్తాను)  దేశస్థుడు యు.ఎస్.ఏ. ప్రభుత్వ సహాయంతో నికరాగువా, ఎల్ సాల్వడోర్ (El Salvador), హొండురస్ (Honduras) దేశాలను ఆక్రమించి ఆ ప్రాంతానికి నియంత అయ్యాడు. ఆ ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాల క్రితం రద్దయిన బానిసత్వాన్ని పునఃస్థాపించాడు. లాటిన్ అమెరికా అంటే తన ఇంటి వెనకాల ‘పెరడు’ అన్న తెల్ల ఆధిపత్య భావనతో ప్రపంచ రాజకీయాల్లోకి అడుగు పెట్టింది యు.ఎస్.ఏ.  ఈ కాలంలో యు.ఎస్.ఏ. నికరాగువాను కొన్ని దశాబ్దాల పాటు ఆక్రమించుకుని నికరాగువా ఆర్థికవ్యవస్థను యు.ఎస్.ఏ. లోని బడా వ్యాపారవేత్తలకు పనికి వచ్చేట్టు మలిచింది.

బెంజమిన్ సెలదోన్

1893లో ఉదారవాది అయిన ’హోసే సాంతోస్ సెలాయా’ (Jose Santos Zelaya) ప్రెసిడెంట్ అయ్యాడు. సమాన హక్కులూ, ఆస్తి హక్కులూ, వోటు హక్కులూ, విద్యావైద్య సదుపాయాల వంటి ప్రాథమిక పౌరహక్కులు ప్రజలకు చేరేందుకు చర్యలు తీసుకున్నాడు. జాతీయవాది అయిన సెలాయా పనులు యు.ఎస్.ఏ కు కంటగింపు అయ్యాయి. 1909 లో ఆయనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు ఆర్థిక సహాయం చేసింది యు.ఎస్.ఏ. మూడేళ్ల తరువాత, 1912 లో, యు.ఎస్.ఏ కనుసన్నలలో అధికారంలో ఉన్న ‘అదోల్ఫో దియెస్’ (Adolfo Diaz) ప్రభుత్వం మీద  ‘బెంజమిన్ సెలదోన్ ‘ (Benjamin Zeladon) నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 4 ఆయన నికరాగువా ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అక్టోబరు 4 న యు.ఎస్.ఏ. సైన్యంతో జరిగిన యుద్ధంలో ప్రత్యర్థికి దొరికిపోయాడు. అక్టోబరు 4 ఆయన పుట్టిన రోజు కూడా. అదే రోజున, ముప్పైమూడేళ్ల చిరుప్రాయంలో, ‘సెలదోన్’ సైనికుల చేతిలో హతమయ్యాడు. తరువాత యు.ఎస్.ఏ. సైనిక పాలన మొదలైంది.  

నికరాగువా అధ్యక్షుడు ‘సెలాయా’ పై తిరుగుబాటునూ, ‘సెలదోన్’ తిరుగుబాటు అణిచివేతనూ ఆమోదించిన అమెరికా అధ్యక్షుడూ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతా అయిన ‘థియోడార్ రూజ్ వెల్ట్’ (Theodore Roosevelt) కోసం, ‘మోడర్నిస్మో’(Modernismo) అని లాటిన్ అమెరికన్ ప్రజలు అభిమానంగా పిలుచుకునే అభ్యుదయ కవి ‘రూబెన్ దారియో’ (Ruben Dario),  ఇలా రాస్తాడు:

 

రూజ్ వెల్ట్ కోసం

బైబిలు గొంతుకతోనో, వాల్ట్ విట్మన్ పద్యాలతోనో
నిన్ను చేరుకోగలను, ఓ వేటగాడా!
నువ్వు పురాతనమైన నూతనుడివి, సాధారణ క్లిష్టమైన వాడివి
కొంత వాషింగ్టన్ నుంచి, మరికొంత నెమ్రోద్ నుంచి
నువ్వే యు.ఎస్.ఏ.

ఆదిమానవుల రక్తమే కలిగినా
ఇంకా జీసస్ క్రైస్టును ప్రార్థిస్తూ, స్పానిష్ భాష మాట్లాడుతున్న అమాయక అమెరికాను
ముట్టడించబోయేవాడివి నువ్వే.

నువ్వు మహత్తరమైనవాడివి, నీ జాతికి నువ్వొక గొప్ప మార్గదర్శివి;
నీది గొప్ప సంస్కారం, నువ్వు సమర్థుడివి; నువ్వు టాల్ స్టాయిని  ఎదిరిస్తావు.
జీవితం అంటే అగ్గి అనీ
ప్రగతి అంటే విస్పోటనమనీ నువ్వు అనుకుంటావు;
నువ్వు బుల్లెట్ ను ఎక్కడ పెడతావో
సరిగ్గా ఆక్కడే భవిష్యత్తును పెడతావు.
వద్దు!

అమెరికా దేశం పెద్దదీ, బలవంతమైనదీ.
ఆ దేశ వాసులు వణికితే తీవ్రమైన ప్రకంపన ఒకటి
మహత్తరమైన ఆండెస్ పర్వతాల వెన్నెముకలోంచి సాగిపోతుంది.
నీ అరుపు, సింహగర్జనను తలపిస్తుంది.
ప్రెసిడెంట్ ‘గ్రాంట్ ‘ తో, హ్యూగో అంటాడు: “నక్షత్రాలన్నీ నీవే”.
నువ్వు ధనవంతుండివి
నువ్వు హెర్క్యూలిస్, మమ్మోన్ వంటి గొప్పవాడివి
అతి సులభంగా నీకు అందిన విజయపథాన్ని వెలిగిస్తూ
న్యూ యార్క్ లో స్వేచ్చ దివిటీని ఎత్తి పట్టుకుంటుంది.

కానీ, మా అమెరికా
పూర్వీకుల కాలం నుంచీ పద్యాలు పాడుకున్నదీ,
నక్షత్రాలను సంప్రదించేదీ, అట్లాంటిస్ ను ఎరిగి ఉన్నదీ,
జీవితంలోని మారుమూల క్షణాల్లోని
వెలుగులో, అగ్నిలో, పరిమళంలో, ప్రేమలో
ప్రతిధ్వనించే పేరుతో మమ్మల్ని చేరుకున్నదీ.
మా అమెరికా
‘ఇన్ కా’ ప్రజలకూ, వారి చక్రవర్తి మక్తెజుమాకూ చెందినది.
ఇది క్రిస్టఫర్ కొలంబస్ అమెరికా,
కాథలిక్ అమెరికా, స్పానిష్ అమెరికా
“నేను ఉన్నది పువ్వుల పాన్పు” కాదు అని
అన్న ‘ఆజ్టెక్ ‘ రాజు ‘కౌతెమొక్’ (Guatemoc)కు చెందిన అమెరికా;

కలలు కంటూ, ప్రేమిస్తూ, కంపిస్తూ;
పెనుతుపానుల్లో వణికి, ప్రేమ నుంచి బతికే
ఆటవిక ఆత్మను కలిగిన అదే అమెరికా;
ఈ అమెరికా, సూర్యుడి కూతురు.

జాగ్రత్త!
ఇక్కడ వేల కొద్దీ సింహం పిల్లలు ఉన్నాయి.
మమ్మల్ని నీ ఇనుప పంజాల్లో చిక్కించుకోవాలంటే
గొప్ప వేటగాడైన రూజ్ వెల్ట్ దేవుడై రావలసిందే.

సర్వమూ కలిగినందుకేమో, నీ దగ్గర ఒక్కటి మాత్రం ఉండదు: దేవుడు!

1912లో జరిగిన తిరగబాటు పర్యవసానాన్ని చూపి నికరాగువా ప్రజలను భయపెట్టాలని ‘సెలదోన్ ‘ శవాన్ని ఒక గుర్రపు జీనుకు కట్టి దుమ్ములో ఈడ్చుకువెళ్లారు అమెరికా సైనికులు. భయపెట్టి మూలకు కూర్చోబెట్టాల్సిన ఆ దృశ్యం పదిహేడేళ్ల  ‘అగస్టో సందీనో’ అనే యువకుడి గుండెల్లో అగ్నిజ్వాలలు రేపి, మరో ఉద్యమానికి నాంది పలికింది.

కొడిదెల మమత

2 comments

  • డేగ రెక్కల విసురులకింద కకావికలమైన ఎండుటాకుల వంటి దరిద్రదేశాల కధలూ కవిత్వాలెన్నో కావాలిప్పుడు.మంచి ప్రయత్నం సర్.అభినందనలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.