నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగుల పాట ‘వేకువ పిట్ట’

“దళిత, ఆదివాసీ, ముస్లిం స్త్రీలు సమాజపు ఆఖరి మెట్టు మీద నిలబడి పీడితులలో పీడితులుగా  ….. హక్కుల నిరాదరణకు గురౌతున్నారు” అనే వాక్యంతో మొదలవుతుంది కవయిత్రి చల్లపల్లి స్వరూపరాణి ‘వేకువపిట్ట’ కవితా సంపుటికి రాసిన ముందుమాట. ఆలోచనాపరులు కేవలం వ్యాఖ్యానించడంతో సరిపెట్టకుండా సమూలంగా మార్చాల్సిన అత్యాచారం ఒకటి మన సమాజంలో కొనసాగుతోంది.  ఆ పనిని ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టాలంటుంది ఈ సంపుటి.

కవిత్వం నా గ్రూపులో సబ్జెక్ట్ కాదు. హైస్కూలు చదువు పూర్తి చేసి కాలేజీలో చేరే సమయంలో  అందరూ తమ అకడమిక్ గ్రూపుల్ని ఎంచుకుంటుంటారు. ఎంపీసి, బైపిసీ, సిఇసి, హెచ్ఇసి … ఇలా. జీవితంలో నాకు అలాంటి సందర్భం వచ్చినపుడు సోషియాలజీ, పొలిటికల్ ఎకనామిక్స్, ఫిలాసఫీలను నేను నా ఉద్యమ గ్రూపు సబ్జెక్టులుగా ఎంచుకున్నాను. ఆ తరువాత చాలా అరుదుగా మాత్రమే నేను కవిత్వాన్ని ఆలపించాను. అయితే కవిత్వానికి  నేపథ్యంగా వుండే సమాజం, రాజకీయార్ధిక పరిణామాలు, కవుల తాత్విక దృక్పధాలు నిరంతరం  నా  గ్రూపు సబ్జెక్టులే. దేన్ని ముట్టుకున్నా అవే రాస్తాను.

దేశంలో మతతత్త్వ నియంతృత్వం భరించలేనంతగా విజృంభిస్తున్నదన్నది ఇప్పుడు అందరి అనుభవంలోనికీ వచ్చేసింది.    సామాజిక దొంతరల్లోని అనేకానేక సమూహాలు దీనికి బలవుతున్నాయి.   అయితే, మతతత్త్వ నియంతృత్త్వానికి అందరికన్నా ఎక్కువగా  అణిచివేతకు గురయ్యేది సాంఘీకంగా అణగారిన నమూహాలు.  ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, బహుజనులతోపాటూ  పెత్తందారీ కులాలలోని పేదలు, స్త్రీలను  వర్తమాన సమాజపు అణగారిన నమూహాలు  అనాల్సివుంటుంది.

భారత ఉపఖండపు అణగారిన సమూహాల విముక్తి ఆరాటానికి పోరాటానికి  దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్రవుంది.  ఆయా చారిత్రక దశల్లో వాళ్ళు విడివిడిగా చార్వాకం, భక్తివుద్యమం, సత్యశోధన  ఉద్యమం వంటి తత్త్వాలనీ, బౌధ్ధం, క్రైస్తవం, ఇస్లాం, శిక్కు వంటి మతాల్ని ఆశ్రయించారు. స్వాతంత్ర్యానంతరం విభిన్న రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారు.

ఉపఖండంలో  విముక్తి  ఉద్యమాలు సాగిస్తున్న విభిన్న అణగారిన సమూహాలను ఒకే వేదిక మీదికి తెచ్చిన ఘనత కమ్యూనిస్టు పార్టీలకు చెందుతుంది.   అణగారిన సమూహాలను ఏకం చేయడానికి  మార్క్సిజం-కమ్యూనిజం ఒక ‘బైండింగ్ వైర్’ గా పనిచేశాయి. అణగారిన సమూహాలకు 1930ల నుండి దాదాపు ఐదున్నర దశాబ్దాలు  కమ్యూనిస్టు పార్టీల మీద అభిమానం, గట్టి విశ్వాసం వుండేది. మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలను క్లుప్తంగా  మా.లె. పార్టీలంటారు. కొందరు మాలెను మాల-మాదిగా పార్టీలు అని కూడా అనేవారు. దళిత, బహుజన సమూహాలతో కమ్యూనిస్టు పార్టీల అనుబంధం అంత బలంగా వుండేది.

సందర్భం వచ్చిందిగాబట్టి కమ్యూనిస్టు పార్టీతో ముస్లింల అనుబంధాన్ని కూడా ఒకసారి గుర్తు చేయాలి. 1925లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ముజఫ్ఫర్ అహ్మద్, కాజీ నజ్రుల్ ఇస్లాం వున్నారని చాలామందికి తెలుసు. అయితే, అంతకు ముందే 1920లో తాష్కెంట్ లో ఏర్పడిన ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ముహమ్మద్ ఆలీ, ఆచార్య ముహమ్మద్ షఫీఖ్ వున్నారని చాలా మందికి తెలీదు.   అలాగే, భారత ఉపఖండంలో అభ్యుదయ భావాలకు నాందీగా భావించే 1932 నాటి కథా సంపుటి ‘అంగారే’ రచయితలు – ఒకరిద్దరు మినహా – అందరూ ముస్లింలే.

అయితే, కమ్యూనిస్టు పార్టీలు ఆర్ధికవర్గ పీడనను మాత్రమే పట్టించుకుని కులవర్గమత పీడనను పట్టించుకోవడానికి భయపడ్డాయి.  కులమతాల్ని పట్టించుకుంటే మార్క్సిజం మైలపడుతుందనో, కులం గురించి కార్ల్ మార్క్స్ ఎక్కడా చెప్పలేదనో   వింత వాదనలు చేసేవి. అన్నీ కార్ల్ మార్క్సే చెప్పేస్తే  ఇంక కమ్యూనిస్టు పార్టీలకు  నాయకులు దేనికీ? తగలడనూ!

 మరోవైపు, కమ్యూనిస్టులు తమ స్థూల ఆర్ధిక వర్గ పీడనను మాత్రమే పట్టించుకుంటూ సూక్ష్మ కులమత వర్గ పీడనల్ని పట్టించుకోవడంలేదనే భావం అణగారిన సమూహాల్లో బలపడసాగింది. భావోద్వేగాలు చాలా బలంగా వుండే ఆసియా దేశాల్లో ఆర్ధిక అణిచివేతకన్నా సాంస్కృతిక అణిచివేత ప్రస్పుటంగా కనిపిస్తుంటుంది. అణగారిన సమూహాలకు కుల, మత  అణిచివేత రోజువారీ జీవితంలో ప్రధాన సమస్యగా మారుతుంది. దాన్ని గుర్తించని కమ్యూనిస్టు పార్టీల మీద అసంతృప్తితోనే దేశంలో స్వతంత్ర అస్తిత్త్వ ఉద్యమాలు మొదలయ్యాయి.  దానితో ‘బైడింగ్ వైర్ ‘  కాస్తా తెగిపోయింది. అణగారిన సమూహాలు ఎవరి దారి వారు వెతుక్కున్నారు. ఎర్రజెండా. ఆకుపచ్చ జెండా, నీలం జెండాలు చెరోదారి అయిపోయాయి.

కులం గురించీ, కుల అణిచివేతను అంతం చేసే మార్గాలను గురించి మార్క్స్ ప్రత్యేకంగా ప్రస్తావించని మాట నిజమే. అయితే, కుల  అణిచివేతనేకాకుండా సమాజంలో ఏ అణిచివేతను అయినా సరే  పరిష్కరించే ఒక విశ్వజనీన సూత్రాన్ని  మార్క్స్ చాలా వివరంగా చెప్పాడు.  “ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే”  అనే ఒక మహత్తర ప్రకటనతో కమ్యూనిస్టు ప్రణాళిక ఆరంభం అవుతుంది. ఇక ముందు  సాగే చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే  అనే అర్ధం కూడా ఆ ప్రకటనలో వుంది.

భారత సమాజపు అస్తిత్త్వం కులం. అది మనదేశపు సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక వ్యక్తీకరణ. హిందూత్వవాదులు మైనానార్టీలను సాధారణంగా మతం జాబితాలో విడిగా వేస్తారుగానీ, కులవాదులు వాళ్ళనూ ఒక కులంగానే పరిగణిస్తారు. కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం ఆరోజుల్లో కొంచెం సృజనాత్మకతను ప్రదర్శించివుంటే మన సమాజంలో కులం రూపంలో సాగుతున్న వర్గపోరాటాన్ని స్పష్టంగా  చూసివుండేది.

నిజానికి మార్క్స్ చెప్పని అనేక పనుల్ని కమ్యూనిస్టు పార్టీలు చేశాయి. అత్యయిక పరిస్థితిలో కాంగ్రెస్‍ నియంతను సమర్ధించమనిగానీ, ఎన్టీ రామారావును  మళ్ళీ గద్దె మీద కూర్చోబెట్టమనిగానీ, బషీర్ బాగ్ పోలీసు కాల్పుల తరువాత కూడా  చంద్రబాబుతో మహాకుటమిని నిర్మించమనిగాని మార్క్స్ ఎక్కడా చెప్పలేదు. పెత్తందారీ కులాల విషయంలో చూపెట్టిన సృజనాత్మకతను కమ్యూనిస్టు నాయకులు అణగారిన కులాల విషయంలో చూపలేదు. “కులాల్లోనూ యజమానికులాలు, శ్రామికకులాలు వుంటాయి” అనే ఒక్క వాక్యాన్ని ప్రధాన కమ్యూనిస్టు పార్టీల్లో ఏ ఒక్కటి అయినా  అనివుంటే దేశ సామాజిక సన్నివేశం చాలా ఉత్తేజకరంగా మారిపోయివుండేది. కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటి వరకు ఆ వాక్యాన్ని పలకలేకపోవడానికి కూడా కులమే ప్రధాన కారణమనే వాదనను కొట్టిపడేయలేం.

కమ్యూనిస్టు పార్టీల నాయకులు కులాన్ని అంటరానిదిగా భావిస్తే, అస్తిత్త్వ ఉద్యమాలు వర్గాన్ని అంటరానిదిగా భావించడం మొదలెట్టాయి.  ఒక విధంగా కమ్యూనిస్టు పార్టీలు చేసిన తప్పునే అస్తిత్వ సంఘాలు కూడా మరో విధంగా చేశాయి. ఫలితంగా, మొదట్లో కొత్త ఆశలు రేపిన అస్తిత్త్వ ఉద్యమాలు కూడా క్రమంగా చల్లారియాయి.

ఇటీవల ఇటు కమ్యూనిస్టు శిబిరంలోనూ, అటు అస్తిత్త్వవాదుల శిబిరంలోనూ పునరాలోచన మొదలయింది.  ఎర్రజెండా, నీలం జెండా ఏకం కావాలనే ఆలోచన ముందుకు వచ్చింది. వాటితో ఆకుపచ్చ జెండా కూడా మళ్ళీ చేరింది. నీల్ సలామ్, లాల్ సలామ్, హర్యాలీ సలామ్! Blue, Red, Green, (BRG) పతాకాలు ఇప్పుడు దేశమంతటా కలిసి విస్తరిస్తున్నాయి. జై భీమ్, జై మీమ్ నినాదాలు ఇప్పుడు ప్రతిచోటా వినిపిస్తున్నాయి. జై భీం అంటే భీం రావు అంబేడ్కర్ మాత్రమేకాదు; కొమురం భీం కూడా. జై మీం అంటే ముస్లింలు. హర్యాలీ సలామ్ అంటే ముస్లింలు మాత్రమేకాదు; ఆదివాసులు కూడా. నీల్ అంటే దళితులు, బహుజనులు. లాల్ అంటే శ్రామికులు. నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో మెరిసే కొత్త త్రివర్ణ సమాజానికి దాడిచూపే దిక్సూచిగా వచ్చింది  ‘వేకువపిట్ట’

స్వరూపరాణిలో  మూడు పార్శ్వాలున్నాయి. మొదటిది ఆమె narrative ఒక సంపూర్ణ తల్లి.  సంపుటిలోని కవితలన్నింటిలోనూ కవయిత్రి ఒక తల్లిలా తన పాత్రల్ని లాలిస్తుంది; ఒదారుస్తుంది, ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తుంది.  అయితే, పిల్లలు తప్పు చేస్తే వీపు మీద గట్టిగా రెండు దెబ్బలు వేయడానికి కూడా వెరవదు.

కవి: పల్లి స్వరూప రాణి

కవయిత్రికి బౌధ్ధ మతం మీద  అభిమానం వున్నప్పటికీ, మయన్మార్ లో అధికార మతంగావున్న బౌధ్ధం అ దేశంలో రోహింగ్యాల మీద సాగిస్తున్న నరమేధాన్ని ఆమె తీవ్రంగా ఖండిస్తుంది. “/నేనో రసికారుతున్న గాయాన్ని/ రోహింగ్యా ముస్లింని/ నన్ను చూస్తే / శాంతి కపోతాలు సహితం/ మనిషి నెత్తురు మరిగిన/ తోడేళ్లయ్యే చోట/” (తిరస్కృతుడు) అంటూ  నోబెల్ శాంతిదూత ఆంగ్ సాంగ్ సుకీ  నియతృత్వాన్ని చీల్చిచెండాడుతుంది.

ఆమె రెండో పార్శ్వం అక్షర ప్రేమ. కొందరి జీవితాల్లోనికి అకలంత సహజంగా, అన్నమంత అవసరంగా సాహిత్యం వచ్చేస్తుంది. అలాంటివాళ్ళే “/కలత పడితే/ నేను అక్షరం నీడకెళ్ళి / కళ్ళు తుడుచుకుని వస్తాను /” (అమ్మ చీరకొంగు)  అని రాయగలరు.

కవయిత్రి మూడో పార్శ్వం సాహిత్యాన్ని ఉద్యమంగా మలచడం.  చాలామంది కవులు, రచయితలు మనిషి మీద ప్రేమను అక్షరంగా మార్చి ఊరుకుంటారు. మనుషుల మీద స్వరూపరాణి ప్రేమ అంతకన్నా ప్రగాఢమైనది. “/మనిషితనం మీద/ పిచ్చి వ్యామోహం లేనివాడు/ ముళ్ళకిరీటం ధరించలేడు/” ( పరాజితుడికో ప్రేమలేఖ) అని ప్రకటిస్తుంది.

విడివిడిగా కవితల్లో  అరకొరగా కనిపించే కవుల వ్యక్తిత్వం కవితా సంపుటుల్లో  పరిమాణం పెరిగి  గుణత్మక మార్పు చెంది  మన ముందు సంపూర్ణంగా ఆవిష్కారం అవుతుంటుంది. ‘వేకువపిట్ట’ వంటి అమ్మతో  మొదలయ్యి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వంటి తండ్రిని (నా ఆకాశం) చేరుకునేలోపు  ఈ కవితా సంపుటి ఒకసారి వర్తమాన  ప్రపంచాన్ని చుట్టివస్తుంది.  సెంట్రల్ యూనివర్శిటీకి వెళ్ళి రోహిత్ వేములను, కాశ్మీర్  వెళ్ళి ఆసిఫానూ, మయన్మార్ వెళ్ళి రోహింగ్యాలను, సిరియా వెళ్ళి బాంబు బాధితులయిన పసిపిల్లల్ని  పరామర్శించి వస్తుంది. అత్యున్నత న్యాయస్థానాల్లో చుండూరు హంతకులకు ఆశ్రయం కల్పించిన వాళ్ళను తిట్టిపోస్తుంది. “ఈ దేశపు అభ్యుదయం/ రంగేమిటో/ అభివృధ్ధి గోత్రమేమిటో/” బిగ్గరగా ప్రకటిస్తుంది. కులనిర్మూలన చేస్తామని బయలుదేరి కుల ఊబిలో కూరుకుపోయిన సమూహాలని చూసి “ఇప్పుడు మనువు / అగ్రహారం వీడి / అంబేడ్కర్ కాలనీకి వచ్చాడు/” అని ఈసడించుకుంటుంది.

వేకువపిట్టలోని  ప్రతి కవితా అణగారిన సమూహాలు ఏకమవ్వాల్సిన చారిత్రక అవసరాన్ని చాటి చెపుతుంది. 170 ఏళ్ళ క్రితం కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకంకండూ; పోరాడితే పోయేదేమీలేదు; బానిస సంకెళ్ళుతప్ప అన్నాడు. కులశ్రామికుల్లారా! ఏకంకండి. తిరగబడితే పోయేదేమీలేదు; కులసంకెళ్ళుతప్ప అని చాటుతుంది వేకువ పిట్ట.

 ‘వేకువపిట్ట’ (కవితా సంపుటీ), చల్లపల్లి స్వరూపరాణి; బీమ్ భూమి ప్రచురణ, విజయవాడ..

https://www.amazon.in/dp/8192937429/ref=cm_sw_r_fa_dp_c_U_CHFfBbKXQTPSJ

వెల 120 రూపాయలు.

ఉషా యస్ డానీ

ఉషా ఎస్ డానీ

ఉషా యస్ డానీ: అసలు పేరు అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ జర్రానీ.  తెలుగు. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్, ఏపీ టైమ్స్, సీ-టీవీ, ఎన్-టీవీ, ఎక్స్ ప్రెస్ టీవీల్లో ఆయన పనిచేశారు.  ఇండియన్ పత్రిక, జైకిసాన్ టీవీల్లో   ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు.  ప్రస్తుతం స్వతంత్ర పాత్రికేయునిగా,  డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా వుంటున్నారు. నరసాపురం ఆయన పుట్టిన వూరు. నివాసాన్ని విజయవాడకు మార్చి విప్లవ కమ్యూనిస్టు ఉద్యమాలలో క్రియాశీలంగా పనిచేశారు. కారంచేడు ఉద్యమంలో పీపుల్స్ వార్ ప్రతినిధిగా పనిచేశారు. చినగంజాం ఉప్పుఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటానికీ, వాడరేవు షిప్ బ్రేకింగ్ కూ వ్యతిరేకంగా జరిగిన పోరాటానికీ  నాయకత్వం వహించారు.  జూలియస్ ఫ్యూజిక్ (1981), డానీ వ్యంగ్యం (2011) పుస్తకాలను ప్రచురించారు. సమాజం, సాహిత్యం, రాజకీయాలపై చాల్ వ్యాసాలు రాసారు. ప్రస్తుతం ముస్లిం ఆలోచనాపరుల వేదికకు కన్వీనర్ గా, బహుజన ప్రతిఘటన వేదికకు కో-కన్వీనర్ గా, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజానికి కార్యదర్శిగా వుంటున్నారు.

2 comments

  • వర్తమాన రాజకీయ కోణాలని విశ్లేషిస్తూనే ..స్వరూపరాణి గారి కవిత్వాన్ని పరిచయం చేశారు . తప్పక చూడాల్సిన కవితా సంపుటి ఇది. ధన్యవాదాలు డానీ గారూ ..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.