నీటి కోసం రాసీమ ఉద్య‌మాగ్ని – దశరథ రామి రెడ్డి

‘రాయ‌ల‌సీమ‌లో వ్య‌వ‌సాయ యోగ్య‌భూమి 90 ల‌క్ష‌ల ఎక‌రాలు, ఇందులో 8 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు మాత్ర‌మే సాగునీరు ల‌భ్య‌త‌.
రాయ‌ల‌సీమ ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తినిధుల‌ను కానివారిని మా నాయ‌కులుగా గుర్తించం’
                                                                                                -రాయ‌ల‌సీమ హ‌క్కుల కార్య‌క‌ర్త బొజ్జా ద‌శ‌ర‌థ‌రామిరెడ్డి

త‌ను నీళ్ల‌ను క‌ల‌గంటున్నాడు. త‌న క‌ల‌ను సాకారం చేసుకునేందుకు ఊరూ,వాడా అలుపెర‌గ‌క తిరుగుతున్నాడు. ఎండిన రాయ‌ల‌సీమ బ‌తుకుల్లో త‌డి నింపాలంటే ఉద్య‌మ‌బాట ప‌ట్ట‌క త‌ప్ప‌ద‌ని ప్ర‌జానీకాన్ని మేల్కొలుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే రెండేళ్ల క్రితం సిద్ధేశ్వ‌రం అలుగుకు రాయ‌ల‌సీమ ప్ర‌జానీకం స్వ‌యంగా శంకుస్థాప‌న చేసే కార్య‌క్ర‌మానికి నాయ‌క‌త్వం వ‌హించాడు. పాల‌క‌, ప్ర‌తిప‌క్షాలు నిర్ల‌క్ష్య వైఖరిని వీడ‌కుంటే నీళ్లే నిప్పులై రాయ‌ల‌సీమ ఉద్య‌మాగ్నిని ర‌గుల్చుతాయ‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నాడు. భ‌విష్య‌త్ రాయ‌ల‌సీమ ఉద్య‌మానికి దిక్సూచిగా నిలుస్తున్న  బొజ్జా ద‌శ‌ర‌థ‌రామిరెడ్డిది క‌ర్నూలు జిల్లా నంద్యాల. ఎంబీఏ ప‌ట్ట‌భ‌ద్రుడు. ఉద్యోగ‌రీత్యా మార్కెటింగ్‌ శాఖ‌లో 15 ఏళ్లు ప‌ని చేశాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతు సంఘాల స‌మాఖ్య రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా , అఖిల‌భార‌త రైతు సంఘాల స‌మాఖ్య దేశ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నాలుగేళ్లుగా రైతుల కోసం ప‌ని చేస్తున్నాడు. రైతుల‌కు సంబంధించిన విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో సూచ‌న‌లు భార‌త‌ ప్ర‌భుత్వానికి చేస్తున్నాడు. ‘బొజ్జా వెంక‌ట‌రెడ్డి అగ్రిక‌ల్చ‌ర్ ఫౌండేష‌న్‌’ను ఏర్పాటు చేసి గ్రామీణ వికాసానికి, గ్రామీణ విద్యాభివృద్ధికి తగిన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాడు . ఐదారేళ్లుగా ‘రాయ‌ల‌సీమ సాగునీటి సాధ‌న స‌మితి’ ఏర్పాటు చేసి సీమ‌కు సంబంధించి నీటి లెక్క‌లను, నీటి హ‌క్కులను ప్ర‌జ‌ల‌కు వివరిస్తూ,  ప్ర‌చారక‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే, వేలాది ప్రజలు త‌ర‌లి వ‌చ్చి సిద్ధేశ్వ‌రం అలుగు శంకుస్థాప‌న చేసే కార్యక్ర‌మానికి నాయ‌క‌త్వం వ‌హించాడు. సిద్ధాంత‌ప‌రంగా వైరుధ్యాలున్నా , సీమ క్షేమం ఏకైక ధ్యేయంగా రైతు, ప్ర‌జా, విద్యార్థి సంఘాలను ఏక‌ం చేసే పనిలో వున్నాడు. ‘రస్తా’ కోసం… ప్రముఖ జర్నలిస్టు, సమాజ హితైషి సోదుం రమణా రెడ్డి ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు.  

ప్ర‌శ్నః నాటి రాయ‌ల‌సీమ‌కు, నేటి రాయ‌ల‌సీమ‌కు తేడా వివ‌రిస్తారా? 

జ‌వాబుః నాటి రాయ‌ల‌సీమ రతనాల సీమ‌ అని పెద్ద‌లు చెబుతారు. ఆనాడు నీటిపారుద‌ల  కోసంపెద్ద ప్రాజెక్టులు లేక‌పోవ‌డం గుర్తించుకోవాల్సిన విష‌యం. ఉన్న‌దల్లా భూగ‌ర్భ‌జ‌లాలు, వాగులు, వంక‌లు, చెరువులు, కుంట‌లు. ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకున్నారు. వాటిమీద ఆధార‌ప‌డి సాగుచేసి రత్నాల వంటి పంట‌లు పండించారు. విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్య ప‌త‌నానంత‌రం   నిజాం ప్ర‌భుత్వం త‌న రాజ్యాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్ర‌భుత్వానికి వ‌దిలి వేయ‌డంతో అనాథ‌గా మిగిలింది. ఏ దిక్కూలేని ఈ ప్రాంతాన్ని స్వాతంత్రానంతరం ఏర్ప‌డిన ప్ర‌భుత్వాలు కూడా అనాథ‌గానే భావిస్తూ సాగునీటి ప్రాజెక్టుల ఊసే ఎత్త‌లేదు. దీంతో రాయ‌ల‌సీమ నిర్వీర్యమవుతూ వ‌చ్చింది. ఈ రోజు రాయ‌ల‌సీమ నాలుగు రోడ్ల కూడ‌లిలో అనాథ‌ బిడ్డ‌లా  గుక్క‌ప‌ట్టి ఏడుస్తోంది. రాజ‌కీయ నాయ‌కుల హృద‌యం చ‌లించ‌డం లేదు. అస‌లు వారికి మ‌న‌సు ఉంద‌ని నేను అనుకోవ‌డం లేదు. ఎన్నిక‌ల సంద‌ర్భంలో రాజ‌కీయ పార్టీలు రాయ‌ల‌సీమ‌ను మ‌భ్య‌పెట్టేందుకు య‌త్నిస్తున్నాయి. అంతే త‌ప్ప, రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం లోతైన చ‌ర్చ‌ను ఏ రాజ‌కీయ పార్టీ చేప‌ట్ట‌డం లేదు. ఇది ఈ నాటి రాయ‌ల‌సీమ దుస్థితి.

ప్ర‌శ్నః నేటి రాయ‌ల‌సీమ దుస్థితికి కేవలం రాజకీయ నాయకులే కారణమంటారా?

జ‌వాబుః ప్రధాన కారణం నాయకుల వంచన అని చెప్పవచ్చు. రాయ‌ల‌సీమ‌లో చ‌దువుకున్న విజ్ఞాన‌వంతుల‌తో పాటు సామాన్య ప్ర‌జ‌లు కూడా రాయ‌ల‌సీమ‌కున్న వ‌న‌రుల‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం,  స్వాతంత్ర్యానంతరం పాల‌కుల మోసాల‌ వల్ల ప్ర‌జ‌లు నైరాశ్యంలోకి వెళ్లిపోవ‌డం, విష‌యాన్ని అవ‌గాహ‌న చేసుకున్న వారు కూడా చైత‌న్య‌వంతులు కాక‌పోవ‌డం, ఆర్థికంగా వెనుక‌బ‌డిన ప్ర‌జ‌లు ప‌రాధీన‌త‌లో ఏదో ఒక రాజ‌కీయ పార్టీకి, నాయ‌కుడికి కొమ్ముకాస్తుండడం ఇలా ఈ దుస్థితికి అనేక కారణాలున్నాయి.

ప్రశ్న:  ఎందుకీ ప‌రాధీన‌త?

జ‌వాబుః ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఈ ప్రాంత ప్ర‌జ‌లు భూమి నీళ్ల‌కు ద‌ప్పిక‌గొన్నారు. వాన‌ను చూస్తే చాలు ప్రజలకు పోయే ప్రాణాలు కూడా లేచొస్తాయి. అంతెందుకు టీవీల్లో జ‌ల‌జ‌ల‌పారే నీళ్ల‌ను చూస్తే ఈ ప్రాంత ప్ర‌జానీకం క‌ళ్ల‌లో నీళ్లు ఊరుతాయంటే ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.   దీన్నిబ‌ట్టి నీళ్ల కోసం ఎంత అల్లాడిపోతున్నారో అర్థంచేసుకోవచ్చు. అలాంటి నీళ్లు క‌ల‌ల్లో త‌ప్ప , ఎదురుచూసే కళ్ళలో తప్ప ఈ నేలపై పారకపోవడంతో క‌రవులు విల‌య‌తాండ‌వం చేస్తున్నాయి. ఒక‌టా, రెండా…ద‌శాబ్దాల త‌ర‌బ‌డి పంట‌లు పండ‌క‌పోతే రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు బ‌తకాల‌ని ఎందుకు అశ ఉంటుంది. చావ‌డానికే బ‌తుకు అన్న‌ట్టు వాళ్ల‌ జీవితాలు ఉంటున్నాయి. అందుకే కూటి కోసం వ‌ల‌స‌లు, అడ్డ‌మైన నాయ‌కుల పంచ‌న చేరాల్సిన దుస్థితి ఏర్ప‌డి ప‌రాధీన‌త అనుభ‌విస్తున్నారు. ఇదేమీ కోరుకున్న‌ది కాదు. ప‌రిస్థితుల ప్ర‌భావం.

ప్ర‌శ్నః రాయ‌ల‌సీమ నుంచి ఎంతో మంది మేధావులు, క‌వులు, ర‌చ‌యిత‌లు వ‌చ్చారు. అలాగే ఎక్కువ మంది ముఖ్య‌మంత్రులు ఈ సీమ నుంచే వ‌చ్చారు. చివ‌రికి ఈ ప్రాంతానికి చెందిన నేత రాష్ట్రపతి కూడా అయ్యారు. వీరంతా ఈ సీమ‌కు ఏమీ చేయ‌లేదా?

జ‌వాబుః ఈ ప్రాంతం నుంచి అనేక మంది ముఖ్య‌మంత్రులు, ఒక ప్ర‌ధాని, రాష్ర‌ప‌తి వ‌చ్చిన మాట నిజ‌మే. వీరంతా రాయ‌ల‌సీమ‌కు అస‌లేమీ చేయ‌లేద‌ని చెప్ప‌లేం. కాని రాయ‌ల‌సీమ‌ కోసం చేయ‌డానికి ఉన్న అవ‌కాశాల‌ను వుపయోగించలేక పోయారు. ప్రజల అవ‌స‌రాల‌ను నెర‌వేర్చ‌డంలో అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాయ‌ల‌సీమ‌కు హ‌క్కుగా ఉన్న నీటిలో 50 శాతం నీటిని కూడా పొంద‌లేక‌పోతున్నాం.  రాయ‌ల‌సీమ‌లోని 90 ల‌క్ష‌ల ఎక‌రాల వ్య‌వ‌సాయ యోగ్య‌మైన భూమిలో కేవ‌లం 19 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు మాత్ర‌మే సాగునీటి వ‌స‌తి క‌ల్పించారు. ఇందులో తుంగ‌భ‌ద్ర‌, కృష్ణా న‌దుల్లో నీళ్లు పుష్క‌లంగా ప్ర‌వ‌హిస్తున్న కాలంలో కూడా 8 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు మించి నీటిని ఇవ్వ‌లేని దుస్థితి ఉంది. వాటికి కావ‌ల‌సిన రిజ‌ర్వాయ‌ర్లు, కాలువ‌ల నిర్మాణంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌శ్నః రాయ‌ల‌సీమ‌లో పుట్టి, ఇక్క‌డ నాయ‌కులుగా ఎదిగారు. ఈ సీమ‌కు ఏమీ చేయ‌న‌ప్పుడు వారిని ఈ ప్రాంత‌వాసులుగా ఎలా గుర్తిస్తారు?

జవాబుః. రాయ‌ల‌సీమ‌లో పుట్టిన ముఖ్య‌మంత్రులే కాకుండా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నాయ‌కులు త‌మ అధినాయ‌కుల మ‌న్న‌న‌లు పొందేందుకు తాగు, సాగునీటి విష‌యంలో మ‌భ్య‌పరిచే మాట‌లు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారిని రాయ‌ల‌సీమ నాయ‌కులుగా గుర్తించ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించి చైత‌న్య‌ప‌రిచేందుకు ఇక్క‌డి ప్ర‌జాసంఘాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను గుర్తించిన‌ట్టుగా న‌టిస్తూ మ‌భ్య‌పెట్టే మాట‌లు మాట్లాడే నాయ‌కులు  ఎప్ప‌టికీ రాయ‌ల‌సీమ వాసులు కారు, కాలేరు.

ప్ర‌శ్నః న‌దీజ‌లాల పంప‌కాల్లో రాయ‌ల‌సీమ‌కు మొద‌టి నుంచీ జ‌రుగుతున్న అన్యాయం గురించి వివ‌రిస్తారా?

జ‌వాబు: 1953లో రాష్ట్ర అవతరణకు ముందే సిద్దేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి ప్లానింగ్ క‌మిష‌న్ ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టే ద‌శ‌లో  రాష్ట్రవిభ‌జ‌న జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేప‌డితే త‌మిళ‌నాడుకు కూడా 2-3 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌ంటూ త‌మిళ విద్వేషాన్ని రెచ్చ‌గొట్టింది కృష్ణా జిల్లా నాయ‌క‌త్వం. కృష్ణా పెన్నార్ బ‌దులు నాగార్జున సాగ‌ర్ క‌ట్టుకుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌ని చెప్పి రాయ‌ల‌సీమ వాసుల‌ను మ‌భ్య‌పెట్టారు. అనంత‌రం వాళ్ల‌నుకున్న‌ట్టు నాగార్జున సాగ‌ర్ నిర్మాణాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంలో కీల‌కంగా గుర్తించుకోవ‌ల‌సిన అంశం ఏంటంటే ఉమ్మడి మ‌ద్రాస్ రాష్ట్రంలో ఉన్న‌ప్పుడు నిర్మించుకున్న ప్రాజెక్టుల‌కు బ‌చావ‌త్ క‌మిష‌న్ ప్ర‌కారం 122.7 టీఎంసీల నీటి కేటాయింపు జ‌రిగింది. ఇదే సంద‌ర్భంలో ఒక్క నాగార్జున సాగ‌ర్ కు 281 టీఎంసీల కేటాయింపు పొందారు. ఉమ్మ‌డి మ‌ద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర  రాష్ట్రం ఏర్పాటుకు రాయ‌ల‌సీమ నాయ‌కులు అంగీక‌రించ‌ని సంద‌ర్భంలో శ్రీ‌బాగ్ అనే పెద్ద మ‌నుషుల ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒడంబ‌డిక ప్ర‌కారం సాగునీటి విష‌యంలో కృష్ణా, పెన్నా, తుంగ‌భ‌ద్ర న‌దుల్లో రాయ‌ల‌సీమ సాగునీటి అవ‌స‌రాలు తీరిన త‌ర్వాతే… ప‌దేళ్లు లేదా అంత‌కంటే ఎక్కువ కాలమైనా రాయ‌ల‌సీమ‌లో సాగునీటి ప్రాజెక్టులు పూర్త‌య్యాకే, అప్పుడు మిగిలే నీటిని మాత్ర‌మే కోస్తా ప్రాంతానికి తీసుకెళ్లాల‌ని ఒప్పందం జ‌రిగింది. దీనికి విరుద్ధంగా నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టి కృష్ణా జ‌లాల‌ను త‌ర‌లించి రాయ‌ల‌సీమ‌కు తీవ్ర ద్రోహం చేశారు.

ప్ర‌శ్నః జ‌లాల పంపిణీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఏమిటి?

జ‌వాబు: ఇందులో రెండు ముఖ్య‌మైన అంశాలున్నాయి. చ‌ట్ట‌బ‌ద్ధంగా రాయ‌ల‌సీమ‌కు కేటాయించిన నీళ్లు కూడా  రావ‌డం లేదు. తుంగ‌భ‌ద్ర‌, కృష్ణా న‌దుల్లో నీళ్లు స‌మృద్ధిగా ఉన్న కాలంలో కూడా తుంగ‌భ‌ద్ర ఎగువ‌కాలువ‌కు 40 శాతం నీళ్లు కూడా ల‌భించ‌డం లేదు. తుంగ‌భ‌ద్ర దిగువ కాలువ‌కు 30 శాతం ఆయ‌క‌ట్టుకు కూడా నీళ్లు రావ‌డం లేదు. భైర‌వానితిప్ప ప్రాజెక్టుకు ప‌దిశాతం నీళ్లు కూడా రావ‌డం లేదు. శ్రీ‌శైలం కుడిగ‌ట్టు కాలువ‌ (ఎస్ ఆర్‌బీసీ), కేసీకెనాల్ కాలువ‌ల‌కు నిర్ధిష్టంగా ఏ రోజు వ‌ర‌కు నీటిని అందిస్తారో చెప్ప‌లేని దుస్థితి నెల‌కొంది. ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు చ‌ట్ట‌బ‌ద్ధంగా సీమ హ‌క్కుగా ఉన్న నీటిని వినియోగించుకోడానికి చేప‌ట్టాల్సిన కాలువ‌లు, రిజ‌ర్వాయ‌ర్ల నిర్మాణాల గురించి సాగునీటి నిపుణులు ప్ర‌భుత్వాల‌కు అనేక నివేదిక‌లు అంద‌జేశారు. రాయ‌ల‌సీమలో నెల‌కొన్న క‌రవును పార‌దోలేందుకు అనేక మార్గాలు ఉన్న‌ప్ప‌టికీ ఈ ప్రాంతంపై పాల‌కులకు చిత్త‌శుద్ధి కొర‌వ‌డడంతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిల‌మైంది. రెండో విష‌యానికి వ‌స్తే మిగులు జ‌లాల‌పై నిర్మాణంలో ఉన్న గాలేరు-న‌గ‌రి, హంద్రీ-నీవా, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో తీవ్ర‌మైన ఇబ్బందులున్నాయి. కృష్ణా జ‌లాల్లో మిగులు జ‌లాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాడుకునే స్వేచ్ఛ‌ను బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ ఇచ్చింది. ఇది కేవ‌లం  స్వేచ్ఛ‌ మాత్ర‌మే హ‌క్కు కాద‌నే విష‌యాన్ని బ‌చావ‌త్ క‌మిష‌న్ స్ప‌ష్టంగా పేర్కొంది. ఆ త‌ర్వాత 2000లో ఏర్ప‌డ‌బోయే కృష్ణా జ‌లాల వివాదాల ప‌రిష్కార ట్రిబ్యున‌ల్ ఈ మిగులు జ‌లాల కేటాయింపుపై విధివిధానాల‌ను ప్ర‌క‌టిస్తుంద‌ని పేర్కొన్నారు. అదే విధంగా ఆ త‌ర్వాత ఏర్ప‌డిన బ్రిజేష్‌కుమార్ క‌మిష‌న్ త‌న తుది నివేదిక‌ను 2013, డిసెంబర్‌లో ప్ర‌క‌టించింది. కృష్ణా జ‌లాల్లోని మిగులు జ‌లాల‌ను కూడా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున‌ల్ క‌ర్నాట‌క‌, మ‌హారాష్ర్ట‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అంటే ఈ రోజు నిర్మాణంలో ఉన్న గాలేరు-న‌గ‌రి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల‌కు ఎలాంటి నిక‌ర జ‌లాలు కాదు క‌దా మిగులు జ‌లాల కేటాయింపు కూడా చేయ‌లేదు.

ఈ ప్రాజెక్టుల‌కు నీటి కేటాయింపులు జ‌ర‌గాలంటే ఉన్న ఏకైక మార్గం గోదావ‌రి జ‌లాల‌ను కృష్ణా న‌దికి మ‌ళ్లించ‌డ‌మే. దీని కోసం గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు రెండు ప్రాజెక్టుల‌ను ప్రారంభించింది. ఇందులో ఒక‌టి పోల‌వ‌రం ప్రాజెక్టు, రెండు దుమ్ముగూడెం-నాగార్జున‌సాగ‌ర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు. పోల‌వ‌రం ప్రాజెక్టు నుంచి నీళ్ల‌ను తెచ్చుకోవ‌డం ద్వారా 45 టీఎంసీల కృష్ణా జ‌లాలు ఆదా అవుతాయి. అదే విధంగా దుమ్ముగూడెం-నాగార్జున‌సాగ‌ర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల కృష్ణా జ‌లాలు ఆదా అవుతాయి. కాని రాష్ట్ర విభ‌జ‌న బిల్లులో దుమ్ముగూడెం-నాగార్జున‌సాగ‌ర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును చేర్చ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. పోల‌వ‌రం నుంచి 45 టీఎంసీల నీటిని రాయ‌ల‌సీమ‌కు కేటాయించ‌డంతో పాటు దుమ్ముగూడెం-నాగార్జున‌సాగ‌ర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొన‌సాగించేలా కేంద్ర‌ప్ర‌భుత్వంపై అన్ని రాజ‌కీయ పార్టీలు ఒత్తిడి తేవాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌త్యేక హోదా కంటే కూడా కీల‌క‌మైన ఈ అంశాల‌పై రాజ‌కీయ పార్టీలు మౌనంగా ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ప్ర‌శ్నః అన్నట్లు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాయ‌ల‌సీమ‌కు క‌లిగే ప్రయోజనాలు ఏంటి?

జ‌వాబుః ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాయ‌ల‌సీమ‌కు ప్ర‌యోజ‌నాలు లేవ‌ని చెప్ప‌లేం. కాని రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు క‌నీస అవ‌స‌రాలు, ఈ ప్రాంతం నివాస యోగ్యంగా ఉండ‌డానికి సాగు, తాగునీరు అత్యంత అవ‌స‌రం. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున‌ల్ నీటి పంప‌కాలు చేస్తున్న ఈ త‌రుణంలో, రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన ఈ నేప‌థ్యంలో చ‌ట్ట‌బ‌ద్ధంగా నీటిహ‌క్కును సాధించుకోవ‌డం అత్యంత కీల‌కం. అదే విధంగా రాయ‌ల‌సీమ‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ గురించి మాట్లాడ‌కుండా కేవ‌లం త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని అన్ని రాజ‌కీయ పార్టీలు, కృష్ణా జిల్లా ఆధిప‌త్య మీడియా త‌మ భుజాలకెత్తుకున్నాయి.

ప్ర‌శ్నః నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో రాయ‌ల‌సీమ స‌మస్య‌ల‌పై ఎవ‌రూ నోరెత్త‌లేదెందుకు?

జ‌వాబుః.నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో రాయ‌ల‌సీమ‌లోని అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు కూడా ఈ ప్రాంత స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ, దుమ్ముగూడెం-నాగార్జున‌సాగ‌ర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును విభ‌జ‌న చ‌ట్టంలో చేర్చ‌క‌పోయినా ఏ రాజ‌కీయ నాయ‌కుడికీ చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేదు. అంతేకాకుండా రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో గాలేరు-న‌గ‌రి, హంద్రీ-నీవా, వెలిగొండ‌, తెలుగుగంగ ప్రాజెక్టుల నిర్మాణాల‌ను చేప‌డుతామన్నారు. వీటికి నీటి కేటాయింపుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున‌ల్ ముందు అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. దీనిపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున‌ల్ స్పందిస్తూ విభ‌జ‌న చ‌ట్టంలో సెక్ష‌న్ 89లో ఈ ప్రాజెక్టులకు సంబంధించి నీటి కేటాయింపు అంశాన్ని చేర్చ‌క‌పోవ‌డం వ‌ల్ల తాము జోక్యం చేసుకోలేమ‌ని స్పష్టం చేసింది.

ప్రశ్న: రాయలసీమకు అన్యాయం జ‌రిగితే వేర్పాటు ఉద్య‌మం రావ‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌ద‌ని  రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించి కేంద్ర‌ప్ర‌భుత్వం వేసిన జ‌స్టిస్ శ్రీ‌కృష్ణ‌ క‌మిటీ హెచ్చ‌రించింది క‌దా!రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రిగింద‌ని మీరంటున్న‌ప్పుడు ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ ఉద్య‌మం ఏ స్థాయిలో ఉంది?

జవాబుః ఈ రోజు రాష్ట్రంలోని అన్ని ప‌త్రిక‌లు, టీవీ చాన‌ళ్లు ఏదో ఒక రాజ‌కీయ పార్టీకి కొమ్ము కాస్తూ మ‌భ్య‌ప‌రిచే వార్త‌ల‌ను వండుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌జాసంఘాలు వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో కొంత ఆల‌స్యం జ‌రుగుతోంది. ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌లు అవ‌గాహ‌న చేసుకొని చైత‌న్య‌వంతుల‌య్యే కార్య‌క్ర‌మాలు సిద్ధేశ్వ‌రం అలుగు శంకుస్థాప‌న‌తో ఊపందుకున్నాయి. ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో అనేక ప్ర‌జాసంఘాలు త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని, ద్రోహాన్ని ప్ర‌జ‌ల చెంత‌కు తీసుకెళ్లి వారిని చైత‌న్య‌ప‌ర‌చ‌డంతో చాలా వ‌ర‌కు విజ‌య‌వంత‌మ‌య్య‌యాయి. ఈ కార్య‌క్ర‌మాలు ఇంత బ‌లంగా జ‌రుగుతున్న‌ప్ప‌టికీ మీడియాలో రాక‌పోవ‌డం వ‌ల్ల ఇక్క‌డ ఏమీ జ‌ర‌గ‌లేద‌నే భావ‌న‌లో రాజ‌కీయ పార్టీలున్నాయి. ఈ మార్పును రాజ‌కీయ పార్టీలు త్వ‌ర‌గా గ్ర‌హించ‌క‌పోతే అలాంటి పార్టీల‌కు ఈ ప్రాంతంలో ఉనికి గ‌ల్లంతు కాక త‌ప్ప‌దు. స‌హ‌జంగా నిప్పును నీళ్లు ఆర్పివేస్తాయి. కాని ఈ ప్రాంతం విష‌యానికి వ‌స్తే పాల‌క‌, ప్ర‌తిప‌క్షాలు త‌మ ఓట్లు, సీట్లు రాజ‌కీయాల‌తో ఈ ప్రాంతాన్ని విస్మ‌రిస్తే ఇవే నీళ్లు రాయ‌ల‌సీమ ఉద్య‌మాగ్నిని ర‌గుల్చుతాయ‌న‌డంలో అతిశ‌యోక్తిలేదు.

ప్ర‌శ్నః రాయ‌ల‌సీమ  ప్రాంత ప్ర‌జ‌లు ప్ర‌త్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారా?

జవాబు:. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. వివక్షకు తావులేకుండా గౌరవంగా బ్రతకాలని కోరుకుంటున్నారు. ‘సమన్యాయం’ కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీలు వాటి స్వార్థ ప్రయోజనాలకోసం రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.  ఎక్క‌డైతే అంత‌రాలు ఉంటాయో అప్పుడే విడిపోవాల‌నే ఆలోచ‌న‌కు అంకురార్ప‌ణ పడుతుంది. ఆ దిశ‌గానే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. చ‌రిత్ర‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను గుర్తించుకుని పాల‌కులు అధికార, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ చేప‌ట్టాల్సి ఉంది. పాల‌కులు ఆ విష‌యాన్ని విస్మ‌రించి కృష్ణా జిల్లా కేంద్రంగానే అధికార‌, అభివృద్ధి కేంద్రీక‌ర‌ణ చేస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో ఏ రాజ‌కీయ పార్టీ కూడా ఈ విష‌యాల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దేసేందుకు ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం ఆందోళ‌న‌ను, ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. విభజనకు బీజాలేస్తున్నది ప్రజలు కాదు, ప్రాంతాలపై పాలకుల చిన్నచూపు, నిర్లక్ష్య వైఖరి.

ప్ర‌శ్నః మరి టీడీపీ ప్ర‌భుత్వం కేవ‌లం కృష్ణా జిల్లా కేంద్రంగా చేస్తున్న అభివృద్ధిపై ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నించేందుకు ఎందుకు భ‌య‌ప‌డుతున్నాయ్‌?

జ‌వాబుః కృష్ణా జిల్లా అంటే కోస్తాంధ్ర అనే భావ‌న‌లో ప్ర‌తిప‌క్షాలున్నాయి. కృష్ణా జిల్లా గురించి మాట్లాడితే ఎక్క‌డ త‌మ ఓటు బ్యాంక్‌ దెబ్బ‌తిని అధికార పీఠానికి చేరువ కాలేమోన‌నే భ‌యం, అభ‌ద్ర‌త ప్ర‌తిప‌క్ష పార్టీల్లో బ‌లంగా నాటుకొంది. కృష్ణా జిల్లా అంటే కోస్తాంధ్ర అనే భావం, మ‌త్తు  నుంచి ప్ర‌తిప‌క్షాలు బ‌య‌ట‌ప‌డితే త‌ప్ప ఏమీ మాట్లాడ‌లేరు. కృష్ణా జిల్లా వేరు, కోస్తాంధ్ర‌, ఉత్త‌రాంధ్ర‌, ప్ర‌కాశం జిల్లాలు వేర‌ని ప్ర‌తిప‌క్షాలు గ్ర‌హించాలి. ఒక్క జిల్లాలో ఓట్ల కోసం మిగిలిన 12 జిల్లాల‌ను విస్మ‌రించ‌డం అంటే అంత‌కంటే ఆత్మ‌హ‌త్యా స‌దృశం మ‌రొక‌టి ఉండ‌దు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ విధంగానైతే అభివృద్ధినంతా ఒక్క హైద‌రాబాద్‌కు ప‌రిమితం చేసి  రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌కుల‌య్యారో అదే త‌ప్పు మ‌రోసారి కృష్ణా జిల్లా కేంద్రంగా జ‌రుగుతుంద‌నే వాస్త‌వాన్ని ప్ర‌తిప‌క్షాలు గ్ర‌హించి త‌మ గ‌ళాల‌ను స‌వ‌రించుకోవాలి.

ప్ర‌శ్నః అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్ట‌డాన్ని ఎట్లా చూస్తారు?

జ‌వాబుః 1953లో ఏర్ప‌డిన రాష్ట్రం, 2014లో మిగిలిన ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్రం భౌగోళికంగా ఒక‌టే. ఈ నేప‌థ్యంలో ఆ రోజు శ్రీ‌బాగ్ ఒప్పందం ప్ర‌కారం క‌ర్నూలులో రాజ‌ధాని ఏర్పాటు చేశారు. శ్రీ‌బాగ్ ఒప్పందంపై ఏ మాత్రం గౌర‌వం ఉన్నా 2014లో కూడా క‌ర్నూలులో రాజ‌ధాని ఏర్పాటు చేసి ఉండేవారు. ఆ ఒప్పందాన్ని గౌర‌వించ‌కుండా పాల‌కప‌క్షం ఏక‌ప‌క్షంగా రాజ‌ధానిని అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసింది. దాన్ని ప్ర‌శ్నించ‌ని ప్ర‌తిప‌క్షం కూడా శ్రీ‌బాగ్ ఒప్పందాన్ని గౌర‌వించ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు రెండూ క‌ల‌సి రాయ‌ల‌సీమ‌కు తీవ్ర ద్రోహం చేశాయి. అంతేకాకుండా రాజ‌ధాని – అధ్య‌య‌నం కోసం కేంద్రం నియ‌మించిన‌ శివ‌రామ‌కృష్ణ‌ క‌మిటీ రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌క ముందే, పాల‌కులు విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. శివ‌రామ‌కృష్ణ క‌మిటీ త‌న నివేదిక‌లో సార‌వంత‌మైన వ్య‌వ‌సాయ భూముల్లో రాజ‌ధాని వ‌ద్ద‌ని చెప్పిన‌ప్ప‌టికీ రాష్ట్ర  ప్ర‌భుత్వం ఖాత‌రు చేయ‌లేదు. అంతేకాకుండా న‌దీ గ‌ర్భంలో రాజ‌ధాని నిర్మాణం చేప‌డుతూ నిర్మాణ ఖ‌ర్చు ఎక్కువ కావ‌డం వ‌ల్ల వేలాది కోట్ల రూపాయ‌ల ప్ర‌జా ధ‌నం దుర్వినియోగం అవుతోంది.  అమ‌రావ‌తి త‌మ రాజ‌ధానిగా రాయ‌ల‌సీమ వాసులు భావించ‌డం లేదు. ఎందుకంటే వాళ్ళ మ‌నోభావాల‌కు విరుద్ధంగా అక్క‌డ రాజ‌ధాని రూపుదిద్దుకుంటోంది.

ప్ర‌శ్నః ప‌ట్టిసీమ ద్వారా రాయ‌ల‌సీమ‌కు 150 టీఎంసీల నీటిని విడుద‌ల చేసి ఈ ప్రాంతాన్ని స‌స్య‌శ్యామ‌లం చేస్తున్నామ‌ని  రాష్ట్ర ప్ర‌భుత్వం అంటున్న మాట‌ల్లో నిజ‌మెంత‌?

జ‌వాబుః ప‌ట్టిసీమ ప్రాజెక్టు పోల‌వ‌రం కుడి కాలువ‌కు ఒక తాత్కిలిక ప్రాజెక్టు మాత్ర‌మే. ప‌ట్టిసీమ  ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అందించేందుకు వీలు క‌లుగుతుంది. బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ ప్ర‌కారం కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీళ్లు శ్రీ‌శైలం నుంచి చ‌ట్ట‌బ‌ద్ధంగా విడుద‌ల అయ్యేవి. ప‌ట్టిసీమ నిర్మాణం త‌ర్వాత కేవ‌లం 80 టీఎంసీల నీటిని మాత్ర‌మే శ్రీ‌శైలం ప్రాజెక్టులో ఆదా చేసుకునే వీలు క‌లుగుతుంది.  ఇందులో కూడా మ‌హా రాష్ట్ర, క‌ర్నాట‌క‌ల‌కు 35 టీఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఇక్క‌డ మిగిలేది కేవ‌లం 45 టీఎంసీలు మాత్ర‌మే. ఈ ప‌ట్టిసీమ నిర్మాణం పూర్త‌యిన త‌ర్వాత ఈ 45 టీఎంసీల నీటిని కూడా ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ‌కు అందించ‌లేక‌పోయింది. ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టు రాయ‌ల‌సీమ‌కు 150 టీఎంసీల నీటిని అందించామ‌న‌డం ప‌చ్చి అబ‌ద్ధం.

ప్ర‌శ్నః రాయ‌ల‌సీమను స‌స్య‌శ్యామ‌లం చేయ‌డానికి మీ ప్ర‌తిపాదిత ప్ర‌ణాళిక ఏమిటి?

జ‌వాబుః రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేయ‌డానికి ముందుగా చెప్పుకున్న‌ట్టుగా చ‌ట్ట‌బ‌ద్ధంగా నిక‌ర జ‌లాలున్న ప్రాజెక్టుల‌కు నీళ్లు స‌క్ర‌మంగా అందేలా నిర్మాణాలు చేప‌ట్టాలి. ఇందులో కీల‌క‌మైన‌వి..తుంగ‌భ‌ద్ర ఎగువ కాలువ‌కు సంబంధించి ‘తుంగ‌భ‌ద్ర ఎగువ స‌మాంత‌ర కాలువ’ నిర్మాణం చేప‌ట్టాలి. తుంగ‌భ‌ద్ర దిగువ కాలువ‌కు నీళ్లు స‌క్ర‌మంగా అందించేందుకు వేద‌వ‌తి పై ఎత్తిపోతల ప‌థ‌కాన్ని చేప‌ట్టాలి. కేసీ కెనాల్ స్థిరీక‌ర‌ణ కోసం గుండ్రేవుల రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణాన్ని చేప‌ట్టాలి. ఎస్ఆర్బీసీకి, తెలుగుగంగ‌కు నీళ్లు స‌క్ర‌మంగా అంద‌డానికి శ్రీ‌శైలం క‌నీస నీటిమ‌ట్టం 854 అడుగులు పెట్టాలి. 875 అడుగుల పైన ఉన్న‌ప్పుడు మాత్ర‌మే నాగార్జున సాగ‌ర్‌కు వాటాగా ఉన్న నీటిని విడుద‌ల చేయాలి. పులిచింతల నిర్మాణం ద్వారా కృష్ణా నీటియాజ‌మాన్య నిర్వ‌హ‌ణ‌లో ఉండే సౌల‌భ్యంతో మిగిలిన 54 టీఎంసీలను చింత‌ల‌పూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా ఆదా అయ్యే 32 టీఎంసీల కృష్ణా జ‌లాల‌ను, పోల‌వ‌రం ద్వారా ఆదా అయ్యే 45 టీఎంసీల కృష్ణా జ‌లాల‌ను రాయ‌ల‌సీమ‌కు చ‌ట్ట‌బ‌ద్ధంగా కేటాయించాలి. అదే విధంగా దుమ్ముగూడెం-నాగార్జున‌సాగ‌ర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టులను చేప‌ట్ట‌డం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జ‌లాల‌ను తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో మిగులు జ‌లాల‌పై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల‌కు నిక‌ర జ‌లాలు కేటాయించాలి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున‌ల్ శ్రీ‌శైలం ప్రాజెక్టుకు కేటాయించిన 60 టీఎంసీల క్యారీ ఓవ‌ర్ (అత్య‌వ‌స‌రానికి వినియోగించుకునేందుకు నిలువ ఉంచిన‌) రిజ‌ర్వ్‌ను రాయ‌ల‌సీమ‌కు ఉప‌యోగించుకునేలా చ‌ట్టం తేవాలి. ఆ నీటిని నిలువ చేసుకునేందుకు సిద్ధేశ్వ‌రం అలుగు నిర్మాణం చేప‌ట్టాలి. ఈ రోజు రాయ‌ల‌సీమ‌లో చెరువులు, కుంట‌ల నిర్మాణం, పున‌రుద్ధ‌ర‌ణ కోసం ప్ర‌త్యేక ఇరిగేష‌న్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాలి. అలాగే సామాజిక అడ‌వుల పెంప‌కం చేప‌ట్టాలి.  రాష్ట్ర విభ‌జ‌న బిల్లులో పేర్కొన్న బుందేల్‌ఖండ్‌-కోరాపుట్, బోలాంగేర్ ప్యాకేజీలో భాగంగా నిర్ధిష్ట కాలం, నిర్ధిష్ట నిధుల‌తో, ల‌క్ష్యంతో ప్ర‌త్యేక ఇరిగేష‌న్ క‌మిష‌న్ చేప‌ట్టే చెరువులు, కుంట‌ల నిర్మాణం చేప‌ట్టాలి. మొత్తం మీద రాయ‌లసీమ‌లో 90 ల‌క్ష‌ల ఎక‌రాల సాగుకు క‌నీసం 400 టీఎంసీల నీళ్ల అవ‌స‌రం ఉంది.

ప్ర‌శ్నః మీ ఆధ్వ‌ర్యంలో రెండేళ్ల క్రితం సిద్ధేశ్వ‌రం అలుగు నిర్మాణ ఉద్య‌మం జ‌రిగింది క‌దా! ఈ అలుగు నిర్మిస్తే రాయ‌ల‌సీమకు ఎలా ఉప‌యోగం? ఈ అలుగు నిర్మాణ విష‌యంలో రాయ‌ల‌సీమ ఉద్య‌మ నాయ‌కుల్లోనే భిన్నాభిప్రాయాల‌పై మీరేమంటారు?

జ‌వాబుః సిద్ధేశ్వ‌రం అలుగు ఒక్క రాయ‌ల‌సీమ‌కే కాదు…ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ భ‌విష్య‌త్‌కు కూడా అత్యంత  కీల‌క‌మైన ప్రాజెక్టు. మొద‌ట‌గా రాయ‌ల‌సీమ‌కు సంబంధించిన హంద్రీ-నీవా, గాలేరు-న‌గ‌రి, తెలుగుగంగ‌, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టుల‌కు , అదే విధంగా 80 వేలు ఎక‌రాలు మునిగిపోయిన నందికొట్కూరు ప్రాంతంలోని అనేక ప‌ల్లెల‌కు తాగు, సాగునీటిని అందించే ఎత్తిపోతల ప‌థ‌కాల‌కు నీళ్లు రావాలంటే శ్రీ‌శైలం  రిజ‌ర్వాయ‌ర్‌లో 841 అడుగుల‌కు పైన్నే నీళ్లు ఉండాలి. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణంతో 854 అడుగుల నీటిని నిలువ చేసుకునే వ‌స‌తి క‌లుగుతుంది. దీంతో శ్రీ‌శైలం గేట్లు ఎత్తిన‌ప్ప‌టికీ కూడా రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌కు నీటి ల‌భ్య‌త‌లో ఇబ్బందులు ఉండ‌వు. శ్రీ‌శైలంలో ప్ర‌తి ఏడాది మూడు నుంచి నాలుగు టీఎంసీల పూడిక చేర‌డం వ‌ల్ల 305 టీఎంసీల నిలువ సామ‌ర్థ్యం ఉన్న ప్రాజెక్టు ఈ రోజు 205 టీఎంసీల సామ‌ర్థ్యానికి ప‌డిపోయింది. సిద్ధేశ్వ‌రం అలుగు నిర్మాణం చేప‌డితే శ్రీ‌శైలంలో పూడిక‌ను నివారించ‌వ‌చ్చు.  దీంతో శ్రీ‌శైలం ప్రాజెక్టు జీవ‌న కాలాన్ని పెంచ‌వ‌చ్చు. సిద్ధేశ్వ‌రం అలుగు ముందు చేరిన పూడిక‌ను చెరువులో మ‌ట్టిని తొల‌గించిన‌ట్టుగా అత్యంత సులువుగా తొల‌గించేందుకు అవ‌కాశం ఉంది. సిద్ధేశ్వ‌రంలో ఉన్న సాంకేతిక విషయాల గురించి తెలియ‌క‌పోవ‌డం వల్ల దీనిపై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం వ‌ల్ల తెలంగాణ కూడా నీరు వాడుకుంటుంద‌నే వాద‌న తీసుకొస్తున్నారు. ఇక్క‌డ కీల‌కంగా గ‌మ‌నించాల్సిన విష‌యం ఒకటుంది. ఉమ్మ‌డి మ‌ద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర‌రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు కృష్ణా పెన్నార్ క‌ట్టుకుంటే త‌మిళ‌నాడు లాభ‌ప‌డుతుంద‌ని అడ్డుకున్నారు. దాంతో రాయ‌ల‌సీమ‌తో పాటు త‌మిళ‌నాడుకు నీళ్లు రాలేదు. ఇప్పుడు కూడా అదే వాద‌న తీసుకొచ్చి తెలంగాణ‌పై ద్వేషం క‌లిగించేందుకు య‌త్నిస్తున్నారు. దీంతో తెలంగాణ‌, రాయ‌ల‌సీమ రెండూ న‌ష్ట‌పోతాయి. చ‌రిత్ర పున‌రావృత‌మ‌వుతుంది. నీళ్ల‌న్నీ అభివృద్ధి చెందిన కృష్ణా జిల్లాకే పోతూ వారి చేప‌ల చెరువులు క‌ళ‌క‌ళ‌లాడ‌ట‌మే కాకుండా అధిక‌మైన కృష్ణా జ‌లాలు స‌ముద్రం పాలవుతాయి. వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో రాయ‌ల‌సీమ‌, తెలంగాణ ఈ ప్రాజెక్టు నిర్మాణం సంయుక్తంగా చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ప్ర‌శ్నః సిద్ధేశ్వ‌రం ఉద్య‌మపై ప్ర‌భుత్వ పాశ‌విక అణ‌చివేత చ‌ర్య‌ల గురించి వివ‌రిస్తారా? అడ్డంకుల‌న్న‌టిని ఎలా అధిగ‌మించి విజ‌య‌వంతం చేయ‌గ‌లిగారు?

జ‌వాబుః సిద్ధేశ్వం అలుగు శంకుస్థాప‌నం ఉద్య‌మం సంద‌ర్భంగా పాల‌కులు పోలీసుల ద్వారా  ప్ర‌తి గ్రామంలో తీవ్ర‌మైన భ‌యాందోళ‌న‌లు సృష్టించి అణ‌చివేసేందుకు య‌త్నించింది. ఉద్య‌మంలో పాల్గొంటే కేసులు పెట్టి జైళ్ల‌కు పంపుతామని పోలీసులు హెచ్చ‌రించారు.  కాని ఉద్య‌మ స‌న్నాహ‌క స‌మావేశాల్లో త‌మ నీటి వ‌న‌రుల విష‌యాన్ని రైతులు తెలుసుకున్నారు. నీటి లెక్క‌లను అర్థం చేసుకున్నారు. పాల‌కుల దుర్మార్గాన్ని ప‌సిగ‌ట్టారు. ఇన్ని రోజులు త‌మ క‌ర‌వుకు, క‌ష్టాల‌కు ప్ర‌కృతి శాప‌మ‌ని న‌మ్ముతూ జీవ‌చ్ఛ‌వాల్లా బ‌తుకుతున్న ప్ర‌జ‌లు అస‌లు వాస్త‌వం అర్థ‌మ‌య్యాక పాల‌కుల నిర్భందాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. దిన‌దినం జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌తో బ‌తుకీడిస్తున్న రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు త‌మ నీటి హ‌క్కులు సాధించుకుంటే భ‌విష్య‌త్ త‌రాల‌కు బంగారుబాట‌లు వేయ‌గ‌ల‌మ‌నే విశ్వాసంతో పాల‌కుల బెదిరింపుల‌ను లెక్క‌చేయ‌క సిద్ధేశ్వ‌రం అలుగు శంకుస్థాప‌న‌కు క‌ద‌నోత్సాహంతో క‌దిలారు. ఆ విధంగా బ‌య‌ల్దేరిన ప్ర‌జ‌లకు దారి పొడ‌వునా అడుగ‌డుగునా అవ‌రోధాలు ఎదుర‌య్యాయి. వాటిని ఎక్క‌డిక‌క్క‌డ ఛేదించుకుని మొక్క‌వోనిదీక్ష‌తో ముందుకు క‌దిలారు. ప్ర‌జ‌లు సిద్ధేశ్వ‌రం చేర‌కుండా అడుగ‌డుగునా రోడ్ల‌ను త‌వ్వి ప్ర‌జా ఆస్తుల‌ను పాల‌కులే విధ్వంసం చేసి అడ్డంకులు సృష్టించారు.  ప్ర‌జ‌లే త‌మ దోసిళ్ల‌తో, తువ్వాళ్ల‌తో మ‌ట్టిని, రాళ్ల‌ను మోసుకుని రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌ను చేసుకొని ల‌క్ష్యంపై అడుగులేశారు. తీవ్ర‌మైన వేస‌విలో మండుటెండ‌లో ప్ర‌జ‌లు తెచ్చుకున్న నీటిని పోలీసులు పార‌బోసి వారిని ముందుకు సాగ‌కుండా అవ‌రోధాలు క‌లుగ‌జేసినా ఏమాత్రం ఆవేశానికి లోనుకాకుండా శాంతియుతంగా త‌మ ల‌క్ష్యాన్ని దిగ్విజ‌యంగా పూర్తి చేసి ప్ర‌భుత్వ వెన్నులో చ‌లి పుట్టించారు.

ప్ర‌శ్నః కృష్ణా జ‌లాలు రాయ‌ల‌సీమ‌కు మ‌ళ్లించ‌డానికి ముఖ‌ద్వారం లాంటి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యాన్ని పెంచ‌డానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారు తూముల నిర్మాణం చేశారు క‌దా! ఆ పెంచిన సామ‌ర్థ్యాన్ని అమ‌లు చేయాల‌ని మీరెందుకు ఉద్య‌మించ‌లేదు?

జ‌వాబుః కాంగ్రెస్ హ‌యాంలో వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు పోతిరెడ్డిపాడు గేట్ల సామ‌ర్థ్యం 44 వేల క్యూసెక్కుల‌కు పెంచేందుకు అంకురార్ప‌ణ చేశారు. ఆ కార్య‌క్ర‌మం పూర్త‌యింది. కాని పోతిరెడ్డిపాడు నుంచి బ‌న‌క‌చ‌ర్ల క్రాస్ రెగ్యులేట‌ర్ వ‌ర‌కు కాలువ వెడ‌ల్పు ప‌నులు ఈ రోజుకూ పూర్తి కాలేదు. అదే విధంగా బ‌న‌క‌చ‌ర్ల క్రాస్ రెగ్యులేట‌ర్ నుంచి  గోరుక‌ల్లు రిజ‌ర్వాయ‌ర్‌కు వ‌చ్చే ఎస్ఆర్బీసీతో పాటు గాలేరు-న‌గ‌రి నీటిని త‌ర‌లించ‌డానికి చేప‌ట్టాల్సిన కాలువ వెడ‌ల్పు పూర్తి కాలేదు. అలాగే గోరుక‌ల్లు రిజ‌ర్వాయ‌ర్ నుంచి అవుకు రిజ‌ర్వాయ‌ర్ వ‌ర‌కు గాలేరు-న‌గ‌రిని తీసుకొచ్చే కాలువ నిర్మాణం, ట‌న్న‌ల్స్ నిర్మాణం పూర్తి కాలేదు. ఈ విష‌య‌మై పాల‌కుల‌పై ఒత్తిడి పెంచేందుకు ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రుస్తున్నాం. ఎస్ఆర్బీసీ నుంచి ఓ చెంబెడు నీళ్ల‌ను గండికోట రిజ‌ర్వాయ‌ర్‌కు తీసుకెళ్లి అక్క‌డి నుంచి పైడిపాళెం లిప్ట్ ద్వారా పులివెందుల ప్రాంతానికి నీళ్లు ఇస్తున్నామ‌నే మ‌భ్య‌ పరిచే పని వంటి కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ప్ర‌భుత్వ మోస‌పూరిత విధానాల‌ను తిప్పికొట్టేందుకు య‌త్నిస్తున్నాం.

ప్ర‌శ్నః బీజేపీ ప్ర‌క‌టించిన రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ గురించి మీరేమంటారు?

జ‌వాబుః రాయ‌లసీమ డిక్ల‌రేష‌న్‌ను మేము ఆహ్వానిస్తున్నాం. బీజేపీ 2014 ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో రాయ‌ల‌సీమ‌కు 200 టీఎంసీల‌ను కేటాయిస్తామ‌ని పేర్కొంది. రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్‌తో పాటు 200 టీఎంసీల నీటిని అందించేందుకు బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం, కేంద్ర నాయ‌క‌త్వం కార్యాచ‌ర‌ణ చేప‌ట్టి త‌మ విశ్వ‌స‌నీయ‌త‌ను నిరూపించుకునేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

ప్ర‌శ్నః రాయ‌ల‌సీమ‌కు ఇంత అన్యాయం జ‌రుగుతున్నా ఉద్య‌మం నిల‌దొక్కుకోక‌పోవ‌డానికి కార‌ణం?

జ‌వాబుః. రాయ‌ల‌సీమ‌లో గ‌తంలో జ‌రిగిన ఉద్య‌మాల‌కు, ప్ర‌స్తుత ఉద్య‌మాల‌కు చాలా తేడా ఉంది. గ‌తంలో  ఉద్య‌మాల‌న్నీ కొంద‌రు పెద్ద‌ల చేత‌ల్లోనే జ‌రిగాయి. ఉద్య‌మాల‌న్నీ కేంద్రీకృతంగానే జ‌రిగాయి. స‌మాచారాన్ని త‌మ గుప్పిట్లో ఉంచుకుని చేశారు. ఆ ఉద్య‌మాల‌న్నీ ధ‌న‌, రాజ‌కీయ‌, సామాజిక బ‌లం ఉన్న నేత‌లు చేశారు. ఈ రోజు ఉద్య‌మం కంటే కూడా అవ‌గాహ‌న‌, చైత‌న్యం తీసుకొచ్చే కార్య‌క్ర‌మాలు ఉధృతంగా జ‌రుగుతున్నాయి. ఈ రోజు అనేక సంఘాలు, వ్య‌క్తులు విడివిడిగా, ఉమ్మ‌డిగా ఏకైక ల‌క్ష్యంతో రాయ‌ల‌సీమ అభివృద్ధిపై ప‌నిచేస్తున్నాయి. స‌మాచారం అంతా అంద‌రికీ అందేలా కృషి జ‌రుగుతోంది. ఈ స్ఫూర్తి రాయ‌ల‌సీమ ఉద్య‌మం కొత్త రూపు సంత‌రించుకునేందుకు బీజాలు వేస్తోంది. దీనికి నిద‌ర్శ‌న‌మే సిద్ధేశ్వ‌రం ఉద్య‌మం. ఈ ఉద్య‌మానికి ప్ర‌జ‌లే క‌ర్త‌, క‌ర్మ‌, క్రియగా కార్యాచ‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో మాదిరిగా  నాయ‌కులు ప్ర‌లోభాల‌కు లొంగి ఉద్య‌మం ముగిసే ప్ర‌శ్నే ఉద‌యించ‌దు.

సొదుం రమణా రెడ్డి

సొదుం ర‌మ‌ణారెడ్డి:  స్వస్థలం క‌డ‌ప జిల్లా వీర‌పునాయునిప‌ల్లె మండలం ఉరటూరు గ్రామం. జ‌ర్న‌లిస్టుగా 17 ఏళ్ల అనుభ‌వం. రాయ‌ల‌సీమ‌కు సాగు, తాగునీటిని సాధించే మ‌హ‌త్త‌ర కార్యానికి చాతనైన సాయం చేయాల‌ని ఆకాంక్ష.

4 comments

  • ఇప్పుడున్న వారిలో రాయలసీమ గురించి, ఈ ప్రాంత ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులలో ఏ స్వార్థం లేకుండా పోరాడే వ్యక్తి బొజ్జ దశరథ రామిరెడ్డి గారు.

  • సమయోచితమైన ఇంటర్వ్యూ.. very informative.. thank you sir..

  • Good effort. Awareness is amust to enlist the support of people for the cause.It takes time.persistence and consistency are needed.keep on till the goal is reached.

    All the best
    Somaraju

  • రాయలసీమ ప్రజలు అమరావతి ని తమ రాజధాని గా భావించటం లేదు అన్నది వంద శాతం నిజం

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.