విచిత్రమే సౌందర్యం సౌందర్యమే విచిత్రం

‘డిగ్నిటీ అఫ్ అర్త్ అండ్ స్కై, అమెరికా, సౌత్ డకోటా రాష్ట్రంలో మిస్సౌరీ నది పక్కన నేటివ్ అమెరికన్ శిల్పం (ఫొటో క్రెడిట్స్: ‘రస్తా”)

 

 

ఏది కవిత్వం?

ఏది మనసును తాకుతుందో అదే కవిత్వం.

ఎప్పటిదో నొప్పి వెలికి వచ్చి ఆపై మది శుభ్రమై పోవాలి. బిగుసుకుపోయిన మనస్సు కొంచెం కదిలి చిర్నవ్వాలి. ఓర్నీ నా భాషలో ఇన్నిన్ని అందాలున్నాయా అనిపించి నీ భాష మీద నీకు చాల బోల్డు ప్రేమ పుట్టాలి. నీ భాష కానోడికి దీన్ని నేర్చుకోవాలని కోరిక పుట్టాలి, నేర్చుకోడానికి నీ పద్యమొక నిర్దుష్టమైన సాధనం కూడా కావాలి, .

కొందరు కవి విమర్శకులుంటారు. విమర్శక నామధేయులు. వాక్యాల్ని మధ్యలో విరిచి తుంపులు తుంపులుగా లైన్లు లైన్లు గా రాసి ఇది కవిత్వమంటున్నారు అని అదేదో దాన్ని తామే ప్రతి రోజూ పొద్దున్నే కనిపెడుతున్నట్టు గొణుగుతుంటారు. ఆ కిందనే సరిగా దానికి తగిన కొన్ని లైన్లు… ఏదో వ్యాసం లోంచి తెంచి తెచ్చినవి… వెదజల్లి… అది కవిత్వమంటారు.

లైన్లుగా రాస్తావా, పేరాలుగా రాస్తావా, ఐదారు పేజీలు సాగే వాక్యాన్ని ఫుల్స్టాపుల్కామాల్లేకుండా రాస్తావా అని కాదు.

చదువుతుంటే, వూపిరి బిగబట్టినట్టో, కంట నీరొలికినట్టో, ఓర్నీ అని ఆశ్చర్యం వుబికినట్టో, ఉన్నట్టుండి నువ్వు ఊహించని సత్యమేదో గోచరించినట్టో అయినప్పుడు… అయ్యా ఆ రాసిన వాడు నీ వూరు, నీ కులం కాకపోయినా, నీ పార్టీ, నీ దేవుడి భక్తుడు కాకపోయినా, నీ మనస్సే నువ్వు అయిపోయి మనో వేగంతో వెళ్లిపోయి, నువ్వెన్నడూ చూడని ఆ కవిని కావిలించేసుకుంటావు.

కవిత్వలో చాల సార్లు కథ ఏమీ వుండదు. కొత్త సంగతి చెప్పే వ్యాస పీఠమూ కాదది. అందుకే కొందరు ఏముంది ఇందులో అని వివరమడిగి కవిని అవాక్కు చేశామని కాలెరగరేస్తూ ఏ పేకాటకో ఆలీసమయిందనవసరంగా అని వెళ్లి పోతుంటారు. అలాంటి వేమీ వుండవు కవిత్వంలో.

కవిత్వంలో భాషకు, జీవితానికి సంబంధించి బిల్డింగ్ బ్లాక్స్ వుంటాయి. బిల్డిం బ్లాక్స్ లో బిల్డింగుల కోసం చూడొద్దు. శరీరానికి జన్యువుల వంటిది కవిత్వం. దానిలోని అణువులతో, కణాలతో ఇక ఏమైనా చెయ్యొచ్చు నువ్వు. శిల్పాలకు పనికొచ్చే రాళ్ళను చెయ్యొచ్చు. మెల మెల్లన గాలికి వూగడం తప్ప మరేమీ చేయని పువ్వులను చెయ్యొచ్చు. నీ ప్రియుడి, ప్రియురాలి శరీరాన్ని కూడా చెయ్యొచ్చు ఆ జీవ కణాలతో. కవిత్వం భాషకు, జీవితానికి ప్రాథమిక పాఠశాల. అందుకే నేనకుంటాను, సమాజంలో కవిత్వానికి కాలం చెల్లే రోజు ఎప్పటికీ రాదు. వచనం… వచనం మాత్రమే వుండే రోజెన్నటికీ రాదు.

ఆ జ్ఞానం చదివే వాళ్లకే కాదు, రాసే వాళ్ళకు కూడా వుండాలి. ముందుగా రాసే వాళ్ళకే వుండాలి. చదివే వాళ్లు వాళ్లకు తెలీకుండానే పద్యం నుండి నేర్చుకుంటారనే స్పృహ వుండాలి కవికి. నేర్చుకునేది బతుకు పాఠం కావొచ్చు, భాషా విశేషం కావొచ్చు.

ఇంతకూ కవిత్వం అంటే ఏమిటి?

అడిగితే నేను మాత్రమెలా చెప్పగలను. బెల్లం తియ్యగా వుంటుంది సరే, తీపి ఎలా వుంటుంది? చెప్పడానికి కొన్ని తీపి వస్తువులను పరిచయం చేయడమే ఉత్తమ ఉపాయం. వాటిని ఇచ్చి ఒక్కొక్కటి ఎలా వుందో వర్ణించడమే చేయగలిగిందీ, చేయాల్సిందిన్నీ… తీపిలో మళ్లీ వెరైటీస్ వుంటాయి. పుల్లా రెడ్డి స్వీట్ లా మరోటుండదు.

ప్రత్యేకించి ఈ పని కోసం గత పది పదిహేన్రోజులుగా నాకు వీలు చిక్కినప్పుడల్లా ఫేస్ బుక్ లో కవిత్వాన్ని చదివాను.  అప్పుడు నా మనస్సు లోపలి కనులకు, చెవులకు ఇంపు గొల్పిన పద్యాలు ఓ మూడు ఏరుకొచ్చాను.

ఈ కింద కొవ్వూరు మిథిల్ కుమార్ పద్యం చూడండి.

అల్లూరి సీతారామ రాజు ఏ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయబోయేది ముందే మిరపకాయ టపా వేసినట్లు ఇది ‘వొక అల్కెమీ’ అని చెప్పి మరీ చేశారు తన రసవిద్యా ప్రదర్శనం కవి మిథిల్ కుమార్. కను దెరిచి చూస్తే ‘గుడిసెలు నిశ్శబ్దాన్ని తాగుతుంటాయి’… ఎక్కడో అడివిలో గట్టు మీద ప్రికేరియస్ గా నుంచుని నీళ్లు తాగుతున్న జింకలో ఇంకేవో గుర్తొస్తాయి. భయం దాపున ఒక రకం మసక శాంతి. వెలుగు మరకల శాంతి. దానికి తోడు బైరాగి రాగం… ట్రింగ్ ట్రింగ్ మంటున్న ఏక్ తార. (బైరాగుల వద్ద వీణలుండవు). ‘మనుషుల్నివదిలి నీడలు మెల్లగా జారుకు’న్న’ చీకటిలో పేరు లేని ‘పిల్లాడొకడు వూరి చివర చెరువుకు ఏదో రహస్యం’ మోసుకెళ్తున్నాడు. రహస్యుడు కదా, తన పేరు చెబుతాడా ఏం? బలవంతం చేస్తే, ఏదో అలియాస్ పేరు చెబుతాడేమో. పద్యంలో అడుగడునా, పాద పాదానా ఇదే వైచిత్రి తో కూడిన… ముందుగా విషాదం, తరువాత ఆశానందాల అంచుల మీద నడుస్తాయి పద్యమూ, దాన్ని చదువుతున్న కన్నూ.

చివరికి ఒక వూరట… విషాదం కైపెక్కిన కంటికి మంచి ఉపశమనం. వెలుగులు వెదజల్లే సూర్యుడు. ఎప్పుడు కనిపించే సూర్యుడే.. కొత్తగా లేడూ?!

చింతపండేసి తోమి ఆకురాయి మీద బాగా నూరిన కత్తి లాగా?!

అలా దృశ్యాల్ని, పదాల్ని నూరి కొత్త మెరుపులు ఇచ్చే వాడే కవి… తెలిసీ తెలియని సమస్యల జాబితాలిచ్చి, తన మనసులో లేని రంకెలు వేసే వాడు కాదు.

దాదాపు ఇదే పని, అయితే, దానికి పదాల వైచిత్రిని జత చేసే పని వాడు వంశీ ధరరెడ్డి. మిథిల్ కుమార్ ను చదివేశాక, వంశీధర రెడ్డి కవిత కోసం కిందికి రండి.

  1. వొక ఆల్కెమీ
  • కొవ్వూరు మిథిల్ కుమార్

 

వెలుగు రెప్ప దిగితే చాలు

అక్కడ గుడిసెలన్నీ నిశ్శబ్దాన్ని తాగుతూంటాయ్

దారులన్నీ మిమోస అస్తిత్వాన్ని నింపుకుంటాయి

మనుషుల్నివదిలి నీడలు మెల్లగా జారుకుంటాయి

వీటిని గమనిస్తూ వో బైరాగి –

ఊరిని నిద్రపుచ్చుతూ ఒక అజ్ఞాత రాగాన్ని అందుకుంటాడు.

ఆ రాగానికి స్పందిస్తూ ఇళ్ల మధ్య దారులన్నీ మౌనమునికి ప్రతీకలౌతాయి.

~~~~~~~

ఎందుకో గానీ ,

ఓ అనామక పిల్లాడు ఒక రహస్యాన్ని రాస్కొని

ఈసారి ఊరి చివర చెరువుకి చెప్పేందుకు వెళ్తున్నాడు.

నక్షత్రాలని దాచుకుని –

చంద్రుణ్ణి లిక్విడ్ స్టేట్లోకి తర్జుమా చేసేందుకు

ఆ చెరువు నీటిగూడుని అల్లి పెట్టుకుని సిద్ధంగా ఉంది.

బహుశా ఆ పిల్లాడ్ని చూసుంటే

ఆ చెరువు కాగితపు పడవతో కాలక్షేపం చేసేదేమో,

ఆరోజుకి తెల్ల కాగితమే చంద్రుడు అయ్యేవాడేమో …

~~~~~

రాత్రి గర్భంలో మరుసటి వేకువ పురుడుకి ప్రయత్నిస్తోంది

ఈమారు ఆ నెప్పుల్ని భరించడం చెట్లపై వేకువ పిట్టల వంతు అవబోతుంది.

అటు పక్కగా వున్న వొక కవి

దీన్నంతటినీ తన కవిత్వంలోకి ఆత్మగా ప్రవేశపెట్టే పనిలో పడ్డాడు.

~~~~~

తెల్లవారింది –

ఈ అబ్స్ట్రాక్ట్ కలల్ని నా నించి లాక్కుంటూ

సూర్యుడు వెలుగు నీళ్లు చల్లాడు .

అంతటితో ఆ రాత్రి మరణం …

 

జూన్ 4, ఫేస్ బుక్

 

‘విచిత్రమే సౌందర్యం సౌందర్యమే విచిత్రం’ అని శ్రీశ్రీ, “ఫిడేలు రాగాల డజన్’  ఇంట్రో లో.

పైన మిథిల్ కుమార్, దిగువన పన్యాల దాస్ లో కూడా పఠితను ఆకట్టుకుని చదివిస్తో దానిలో ‘వైచిత్రి’ వుంది. ‘వైచిత్రి’ కొన్ని సార్లు నేరుగా కనపడుతుంది. కొన్ని సార్లు దాక్కుంటుంది.

డాక్టర్ వంశీధర రెడ్డి ఒక మనసున్న ‘విచిత్ర’ కవి. తను చూసిన రోజు వారీ జీవితాన్ని దాటి సాధారణంగా వెళ్ళడు. ఏం చెప్పినా ప్రత్యేకించి పని గట్టుకుని చెప్పి నట్టుండదు. పని గట్టుకునే చెబుతాడు, శ్తద్ధగా చెక్కుతాడు. చదువుతుంటే అలా వుండదు. తను రాసింది తాను రెండో సారి చూసుకోలేదేమో, ఇది కవికి వుండగూడని నిర్లక్ష్యమేమో అని అన్పిస్తాడు. అది ‘మోసం’. అది కవి పనితనంలో భాగం.

పద్యం టైటిల్ చూడండి. జనంలో వున్న మాటను ‘నిర్లక్ష్యం’గా మార్చేసి ఏంటిదీ అనిపించి పఠితను నిలబెడ్తాడు. పఠిత మన్సస్సులో కుంచెం చర్చ జరిగేట్లు చూస్తాడు. ఔ మల్ల ‘జీవితాంతం’ మాత్రమేనా? చనిపోయాక కూడా! చనిపోయాక వుండే దాని ఆంతం వరకు కూడా అని స్ఫురిం జేస్తాడు ‘నిర్జీవితాంతం’ అనే కొత్త పదంతో. ఆ సంగతి చెప్పకపోతే తను అంటున్నదేదో ఈ జీవితం వరకేనని, ‘వెధవాయిత్వం’ మరణానంతరం వుండదని అనుకుంటారేమో, అదేం కాదు, అప్పటికీ వుంటుందనే వూహతో.., బహుశా, ఒక విచిత్ర అతిశయోక్తితో వెళ్తాం పద్యం లోనికి.

‘వర్షం వెల్సిన క్షణాలు’..  అవి దిగులు పడడం అయిపోయిన సమయాలు కావొచ్చు, చేస్తున్న పనులయిపోయిన తీరికలు కావొచ్చు. ఏదేమైనా, తీరిగ్గా చూసుకుంటే తానెంత వెధవో అని ఊహించుకుంటాడు కవి. అందుకోసమైనా కావాలి తీరిక, అది తెలుసుకోడానికైనా.

తాను వూహించేదేమిటి?

గాలి కాల్చని వాక్యాలు’, ‘తలుపు సందులోంచి తప్పించుకుంటూ పిల్లి వెనక కాలు రాల్చిన వెంట్రుక’ వంటి యాదాలాప దృశ్యాలు పఠితను కవి ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్తాయి. అక్కడి నుంచి కవితో పాటు పాఠకుడు…  ‘బండకేసి తల బాదుకున్నా చిట్లని చినుకు జారి’పోయి చేరుకునే ‘ముత్యపు రహస్యాలు’ చూస్తాడు.

రహస్యాలు ఎప్పుడూ ముత్యపు చిప్పలోని ముత్యాలే, కవికి చిక్కిన ముత్యం… మనిషి వెధవాయిత్వం.

తన దారిలో ఏముంటాయి?

తొండల కింద నలిగి పగిలిన పూవులేవో వుంటాయి.

ఆపుడొస్తుంది ‘నిర్జీవితాంతం’ సంగతి.

‘జీవితాంతం’లో ఏం వుంటుంది? స్వర్గమో ఏదో వుంటుంది.

‘స్వర్గంలో కూడా దుఃఖం ఉండే ఉంటుంది ఏదోమూల..’ అని అక్కడ వుండేది కూడా ఈ దుఃఖమేనని తేల్చేస్తూ. కొండ మీద బాగా పైకి తీసుకెళ్లి వొదిలేస్తాడు వంశీ ధర రెడ్డి తన, మన ‘నేను’ని.

ఈ రెండు పద్యాలలో కనపడిన పని తనాన్నే మరో విధంగా వాడుకుంటాడు మరో కవి పన్యాల జగన్నాథ దాస్ తన ‘వెదుకులాట’లో. వంశీధర రెడ్డిని చదివాక. జగన్నాథ దాస్ కోసం మరింత  కిందికి రండి.

  1. * నిర్జీవితాంతం..*
  • వంశీధర రెడ్డి

నేనెంత వెర్రివెధవనో ఊహించుకోడానికైనా

అప్పుడప్పుడూ

భయపడ్తుంటాను ఎక్కడున్నానని ఎక్కడికెళ్ళాలనీ

ఎవరూ ఎప్పటికీ లెక్కించలేని

వర్షంవెలిసిన క్షణాల్ని దండగుచ్చుకుంటూ .

రోజుకి 24 గంటలేగా, ఎన్ని రోజులు??..

అన్నిపనులూ చేసి అలిసిపోయాకే

వెతుకుతున్న కొత్తదారి మాయమైనట్టు

నేనెంత వెర్రివెధవనో చెప్పుకోడానికైనా

అప్పుడప్పుడూ

మాట్లాడ్తుంటాను గాలికాల్చని వాక్యాల వ్యాకులతలతో ..

తలుపుసందులోంచి

తప్పించుకుంటున్న పిల్లి వెనకకాలు విదిల్చిన వెంట్రుకలా

ఏ ఆకునో ఐ అలా కాకిరెట్టల్ని కప్పేయకపోయుంటే,

బండకేసి బాదబడి చిట్లని మేఘపుచినుకై

లోయల్లోని ముత్యపురహస్యాల్లోకి జారకుంటే

నేనెంత వెర్రివెధవనో నాకూ తెలిసేది కాదు..

నిర్జీవితాంతం

ఆకాశానికావల ఏముందో చూడాలంటే,

గోడలులేని గుండ్రటి రాత్రి

తొండలు నడిచిన పూలు పగిలిన దారుల్లో

వెన్నెల జుట్టు పాడిన నవ్వులగీతాలు తింటూ

రంగుమారని బానపొట్ట కల మెలకువలో నిద్రించాలి

ఐనా మనం నమ్ముతామా ఏంటి

స్వర్గంలో కూడా దుఃఖం ఉండే ఉంటుంది ఏదోమూల..

(June 10, 2018 FB.)

 

బహుశా, విరోధాభాస (ఆక్సిమోరాన్) పలికినంత సులువుగా వైచిత్రిని పలికే అలంకారం మరొకటుండదేమో. ఈ పద్యం చూడండి ‘అనంత శూన్యంలో ఇంత చోటు’ వెదుక్కుంటున్నారు పన్యాల జగన్నాథ దాస్. శూన్యం, చోటు (స్థలం) పరస్పర విరుద్ధాలు. కవికి వాస్తవం (చోటు) ఏమీ బాగోలేదు. శూన్యమే వాస్తవమన్పిస్తున్నది. తానైతే వుండాలి. శున్యంలోనే తన కోసం ఒకింత చోటు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. తానే కాదు, మనలో చాల మందిమి చోటు వెదుక్కుంటున్నది వాస్తవంలో కాదు శూన్యంలోనే.

కాసారంలో ..నీటి చుక్కలను వెదుక్కోడం కూడా ఒక రకంగా విరోధాభాసే. కాకపోతే ఇవి క..న్నీటి చుక్కలు. నీటిలో కరిగేవయితే దొరుకుతాయి. నీటిలో కరగని కన్నీటి చుక్కలు వుండవు. సో, జగన్నాథ దాసు గారి అన్వేషణ ఇక్కడ కూడా ఫలించదు.

అనంత శూన్యమైనా, తరగని కాసారమైనా జీవితమే.

ఆ తరువాత పద్యంలో ఇక అన్నీ విరోధాభాస లే. గుక్కపట్టిన నవ్వులు, పగలబడిన ఏడ్పులు. చాల సార్లు మన నవ్వుల్లో వుంటున్నది విషాదమే. మనకు మిగిలిన ఆనందం ఏడుపే. ఈ సంగతి ఏ చెయి దిరిగిన కార్టూనిస్టును అడిగినా చెబుతాడు. సెన్సాఫ్ హ్యూమర్ వుండాలి, దూషించబడినప్పుడూ నవ్వడానికి, సెన్సాప్ఫ్ టియర్స్ కూడా వుండాలి ఏడ్చి ఏలికలకు కన్నీటి విన్నాపాలు చేయడానికి. సినేమా కు వెళ్లి బాగా ఏడ్చి వస్తే మంచి సినేమా. ఆక్సిమోరాన్ లేదా విరోధాభాస్ అంటే… పరస్పర విరుద్ధ పదాలు లేదా భావాలు పక్కపక్కనే వుండి విచిత్రపరిచి, అదే సమయంలో ‘వాస్తవం’ఆయ్యుండడం. 

పన్యాల పద్యం చాల విచిత్ర విషాదంగా మొదలై, అలాంటి విరుద్ధాలతోనే మనల్ని ముందుకు తీసుకెళ్లి, పెనల్టిమేట్ చరణంలో ఫట్ మని కొట్టినట్టు ముగుస్తుంది.

“మ‌ర‌ణానికి ముందు చిటికెడు జీవితాన్ని వెతుకుతున్నాను.’

చనిపోయే లోగా కాసేపయినా జీవిద్దామని కదా మనందరి వెతుకులాట?! ఎలాగూ మరణిస్తాం, కాసేపు జీవిద్దాం అని కూడా అంటున్నాడు కవి. కుదరదేమో, ఉన్నది నిరంతర మరణమేనేమో అని గొప్ప క్రియాశీల నిరాశను వ్యక్తం చేస్తున్నాడు.

ఈ పద్యంలో చిట్టచివరి లైనుని కొట్టేయాలని కవి గారికి నా విన్నపం. అదొక మూడ్ బ్రేకర్. భావాన్ని అప్పటికే చాల బలంగా చెప్పారు. జోకును వివరించినట్టు ఈ రిపిటిషన్ బాగోదు.

 

  1. వెతుకులాట‌
  • పన్యాల జగన్నాథ దాస్

 

అనంత శూన్యంలో

ఇంత చోటు వెతుకుతున్నాను…

త‌ర‌గ‌ని కాసారంలో

క‌ర‌గ‌ని క‌న్నీటి చుక్క‌లు వెతుకుతున్నాను…

గుక్క‌ప‌ట్టిన న‌వ్వుల్లోని

విషాదాన్ని వెతుకుతున్నాను…

ప‌గ‌ల‌బ‌డిన ఏడ్పుల్లోని

ఆనందాన్ని వెతుకుతున్నాను.

ఆనంద విషాదాల్లోని

ఆశ నిరాశ‌ల‌ను వెతుకుతున్నాను…

గ‌డ్డ‌క‌ట్టిన మ‌న‌సుల్లోని

క‌రుగుతున్న మంచుఖండాల‌ను వెతుకుతున్నాను…

వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ…

మ‌ర‌ణానికి ముందు చిటికెడు జీవితాన్ని వెతుకుతున్నాను.

ఔను! బండ‌బారిన బ‌తుకులో చిటికెడు జీవితాన్నే!

 

 

(11 జూన్, 2018)

 

  • కె. సంజీవి

 

 

 

 

 

కె. సంజీవి 

 

కె సంజీవి

కె. సంజీవి: పెన్ నేమ్. అసలు పేరు వొద్దని రచయిత కోరిక.

4 comments

  • మూడు కవితలూ బావున్నాయి. వివరించడం బావుంది. కొత్త కవులకి పాఠాల్లా ఉపకరిస్తాయి. కవిత్వాభిరుచినీ పెంపొందిస్తాయి. ఈ శీర్షిక కొనసాగిస్తే బాగుండు

  • అనిమిత్తమాత్రుల విచిత్ర రాతల మీద గొప్ప విశ్లేషణ, కంగ్రాట్స్ టు అవర్ రాక్ స్టార్ “మిథిల్” అండ్ పన్యాల జగన్నాధ దాస్ గారికి .. 🙂

  • కొత్తతరం కవులమీద ఇలా రాయడం బావుంది . మీ వ్యాసం చదివించేవిధంగా ఉంది , మరింత మందిని ఇలా పరిచయం చేయండి మీకు వీలయితే

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.