హింసలెన్ని ఎదురైనా తల వంచని చింతన!

 

‘నేనెప్పటికీ నా సంకెళ్ళు వొదులుకోడం కోసం, వాటికి బదులు బానిస సేవకత్వం తీసుకోను. జేయస్ (దేవుడి) సేవకు బానిస కావడం కన్న ఈ రాయికి కట్టేయబడడమే బాగుంది’. – ప్రొమీథియస్

 

పుస్కకాన్ని శ్రీ శ్రీ ప్రింటర్స్ యు విశ్వేశ్వర రావు చక్కగా జిరాక్స్ చేయించి, బైండు చేయించి ఇచ్చి  రెండు మూడేండ్లయ్యింది. ప్రజా శక్తి బుక్ హస్ కోసం అనువాదం చేస్తానన్నాను. అనారోగ్యం వల్ల కొంతా, మొదట చదవగానే ఇది నాతో ఎప్పటికయ్యేను అనే ఆధైర్యం వల్ల మరికొంతా అప్పుడు వెనుకడుగు వేశాను. ఒక మంచి పనిని పక్కన పెట్టిన దిగులు వుండిపోయింది. కొంచెం కొంచెం చేస్తూపోతే తొందర్లోనే పూర్తి అవుతుందిలే, పూర్తయ్యాక ప్రజా శక్తి వారికే ఇస్తానులే అని ఇపుడిలా మొదలెట్టాను. ‘రస్తా’లో ఈ అనువాదం క్రమం తప్పక చదవండి. మార్క్సు జ్ఞాని మాత్రమే కాదు, గొప్ప చమత్కారి కూడా. ఆయన ఇచ్చే పోలికలు, సాహిత్య ప్రస్తావనలు భలే వుంటాయి. చదివి  వ్యాఖ్యలు చేయండి. నా అనువాదం మెరుగుదలకు సూచనలు చేయండి. …. హెచ్చార్కె 

(ఇది 1957 లో మాస్కో లోని ‘ఫారిన్ లాంగ్వేజెస్ పబ్లిషింగ్ హౌస్’ ప్రచురించిన ఇంగ్లీషు పుస్తకం)

రష్యా కూర్పు ముందుమాట

కూర్పులో… మతం పుట్టుక, సారం, వర్గ సమాజంలో అది నిర్వహించిన పాత్ర గురించిన మార్క్సు, ఎంగెల్స్ రచనలున్నాయి. ఇవి శ్రామిక వర్గ, మార్క్సిస్ట్ నాస్తికత్వానికి సైద్ధాంతిక పునాది వేసే రచనలు. మార్క్సు, ఎంగెల్స్ ప్రాపంచిక దృక్పథం ప్రకృతి, సామాజిక అభివృద్ధి సూత్రాల మీద ఆధారపడుతుంది. సైన్సు అందించే వాస్తవాలపై ఆధారపడుతుంది. మతంతో మౌలికంగా విభేదిస్తుంది.

‘డెమోక్రిటస్ ప్రకృతి తత్వశాస్త్రం, ఎపిక్యురస్ ప్రకృతి తత్వశాస్త్రాల మధ్య తేడా’ అనే మార్క్సు డాక్టొరల్ సిద్ధాంతంతో ఈ సంపుటి మొదలవుతుంది. ఇందులో.. ఎపిక్యురస్ భౌతిక వాద తత్వానికి, మతంతో ఎలా పడదో మార్క్సు వివరిస్తారు. ‘పవిత్ర కుటుంబం లేక విమర్శనాత్మక విమర్శపై విమర్శ’  పుస్తకం ఎంపిక చేసిన భాగాల్ని కూడా ఇందులో చేర్చాం. అభివృద్ధి  నిరోధక ఫ్యూడల్, మత దృక్పథానికి వ్యతిరేకంగా 18 వ శతాబ్ది ఫ్రెంచి భౌతిక వాదులు నిర్వహించిన గొప్ప పాత్రను ఈ భాగాల్లో మార్క్సు ఎంగెల్స్ వివరించారు. భౌతికవాద తత్వశాస్త్రం పురోగతి, ప్రకృతి శాస్త్ర విజయాలు నాస్తికవాద ప్రచారంతో  ఎలా ముడివడి వున్నాయో చూపించారు. ఎప్పటికప్పుడు ప్రగతి శీల వర్గాలకు నాస్తికత్వం ఎలా స్వాభావికమో పేర్కొన్నారు. ఇంగ్లీషు, ఫ్రెంచి భౌతిక వాద నాస్తికులు అప్పుడే తలెత్తున్న బూర్జువజీకి ఎలా సిద్ధాంత కర్తలయ్యారో నిరూపించారు. బుర్జువజీ తాను ఆధిపత్యంలోకి రాగానే, తనకూ శ్రామిక వర్గానికీ మధ్య వర్గ వైరుధ్యాలు తీవ్రం కాగానే.. తన పూర్వ స్వేచ్ఛా యోచనల్ని వదిలేసుకుని, శ్రామిక ప్రజలను మత్తులో ముంచెత్తే ‘నల్లమందు’గా మతాన్ని వాడడం మొదలెడుతుంది. ‘సోషలిజం: ఊహా జనితం, శాస్త్రీయం’ అనే తన పుస్తకం ఇంగ్లీషు కూర్పు ముందుమాటలో ఎంగెల్స్ ఈ విషయం సోదాహరణంగా వివరించారు. అది కూడా ఈ పుస్తకంలో వుంది.

మునుపటి భౌతిక వాద నాస్తిక వాద ప్రచారం చేసిన మేళ్లను (17వ, 18 వ శతాబ్దాల ఇంగ్లీష్, ఫ్రెంచి భౌతిక వాదులు, ఎల్. ఫ్యూర్ బా తదితరులు చేసిన మేళ్ళను) నొక్కిచెబుతూనే, అదే సమయంలో బూర్జువా నాస్తికుల అరకొర వైఖరిని, నిలకడ లేని తనాన్ని, వారి వర్గ పరిమితులను, నిష్క్రియ తత్వాన్ని, మతం సామాజిక మూలాలను వెల్లడించడంలో సంకోచాల్ని కూడా మార్క్స్, ఎంగెల్స్ ఎత్తి చూపించారు.

మతం సారాన్ని స్పష్టం చేసింది మార్క్సిజం ఒక్కటే. “మానవుల దైనందిన జీవితాన్ని నియంత్రించే బాహిర శక్తులు మానవ మస్తిష్కంలో ‘అద్భుత’ రీతిలో, అతీత శక్తుల రూపంలో ప్రతిబింబిస్తాయ”ని మార్క్సిజం నిరూపించింది. (ఈ మాటలు ఈ సంపుటి లోనివే, ఇంగ్లీషు ప్రతి 146)

‘క్యాపిటల్’, ‘యాంటీ-డూరింగ్’, ‘లుడ్విగ్ ఫ్యూర్ బా’ తదితర మార్క్, ఎంగెల్స్ రచనలు మతం మూలాలను బహిర్గతం చేస్తాయి. ప్రకృతి-శక్తులతో పోరాటంలో ఆదిమ మానవుల నిస్సహాయత నుంచి మత విశ్వాసం పుట్టుకొచ్చింది. ఇక, శతృ పూరిత వర్గ వైషమ్యాల సమాజంలో పీడన నుంచి, పీడన వ్యతిరేక పోరాటంలో శ్రామిక ప్రజల నిస్సహాయత నుంచి… మతం పుట్టి పెరుగుతుంది.

‘జర్మన్ ఐడియాలజీ’, ‘కమ్యూనిజం అఫ్ ‘’రెయినిస్చెన్ బియోబక్టర్’, ‘మేనిఫెస్టో అఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ’ తదితర మార్క్స్, ఎంగెల్స్ రచనల నుంచి ఎంపిక చేసిన భాగాలు…  సామాజిక చైతన్య రూపాలలో, వర్గ సమాజ ఉపరితలం అంశాలలో మతం ఒకటని చెబుతాయి. సామాజిక సంబంధాల అభివృద్ధి మీద, సమాజపు వర్గ నిర్మాణం మీద మతం ఆధారపడుతుంది. ప్రజా బాహుళ్యాన్ని తయారు చేయడంలో, అణిచివేయడంలో దోపిడి వర్గాలు మతాన్ని ఎలా వినియోగించుకుంటాయో మార్క్స్, ఎంగెల్స్ వివరించారు. “ప్రజలకు మతం నల్లమందు వంటిది” అన్నాడు 1844 లో మార్క్స్. మతం గురించిన మార్క్సిస్టు దృక్పథానికి ఈ మాట పునాది రాయి అయ్యింది

ఎంగెల్స్ తన ‘బ్రూనో బార్ అండ్ అర్లీ క్రిష్తియానిటీ’, ‘ది బుక్ అఫ్ రెవెలేషన్’, ‘ఆన్ ది హిస్టరీ అఫ్ అర్లీ క్రిష్టియానిటీ’ పుస్తకాలలో… రోమన్ సామ్రాజ్య పతన దశలోని సామాజిక, రాజకీయ, సైద్ధాంతిక పోరాటాల చారిత్రక స్టితి గతుల పై దృష్టి సారించారు. ఈ స్థితిగతులే క్రైస్తవ మతావిర్భావానికి నిర్ణయాత్మక రీతిలో దోహదం చేశాయి. రోమన్ సామ్రాజ్యం మీద బానిసలు, మూలవాసి ప్రజలు, బానిస జాతుల తిరుగుబాట్లెన్నో నెత్తురుటేళ్లలో ముంచెత్తబడిన నిరాశావహ దశలో…  ఆ ప్రజల దృక్పథంగా క్రైస్తవం తలెత్తిందని ఈ రచనలు విశదీకరిస్తాయి.

‘డయలెక్టిక్స్ అఫ్ నేచర్’ పుస్తకం నుంచి తీసి ఈ సంపుటిలో ఇస్తున్న భాగాలలో… శాస్త్రీయ దృక్పథం, మత దృక్పథాల మధ్య నిరంతరాయంగా సాగిన ఘర్షణను ఎంగెల్స్ బయట పెట్టారు. మతం ఏ విధంగా సైన్సు పురోగమనాన్ని అడ్దగించిందో వెల్లడించారు. మతం చరిత్ర అంతా శాస్త్రీయ ఆలోచనల పురోగతికి వ్యతిరేకంగానే సాగింది. చర్చి గొప్ప శాస్త్రజ్ఞులను క్రూరంగా వేధించి వేటాడింది. చిత్రహింసల పాల్జేసింది. రాటలకు కట్టి దహనం చేసింది. వారి పుస్తకాలను నిషేధించింది, కాల్చి వేసింది. ఇంక్విజిషన్ (మతం పేరిట విచారణ, మరణ శిక్షల) ను ఒక పనిముట్టుగా వాడుకున్న క్యాథలిక్ చర్చి శాస్త్రజ్ఞులను హింసించి చంపడంలో మరింత వుత్సాహం  చూపించింది. చర్చి శతాబ్దాల తరబడి చాల ప్రగతినిరోధక పాత్ర నిర్వహించింది. ప్రపంచం గురించిన శాస్త్రీయ దృక్పథం మీద, ప్రజాతంత్ర, సోషలిస్టు వుద్యమాల మీద నిర్దయగా దాడి చేసింది. అయినా, ప్రకృతి శాస్త్రాలు పురోగమించే కొద్దీ, అనివార్యంగానే, మత వాద, భావ వాద దృక్పథానికి తూట్లు పడ్డాయి. అందుకే, మతం మీద సమరంలో శాస్త్రీయ, భౌతిక వాద ప్రచారం శక్తివంతమైన ఆయుధమని మార్క్సిజం సంస్ఠాపకులు భావించారు.

మతానికి వ్యతిరేకంగా బలప్రయోగ పద్ధతులు వాడాలని డూరింగ్ మొదలైన అనార్కిస్టులు, బ్లాంక్విస్టులు చేసిన ప్రయత్నాలను మార్క్స్, ఎంగెల్స్ తీవ్రంగా ఖండించారు. (ఈ సంపుటిలో ‘యాంటీ డూరింగ్ అండ్ ఎమిగ్రాంట్ లిటరేచర్’ నుంచి తీసి ఇచ్చిన భాగాల్ని చూడండి). మతాన్ని నిషేధించడం, వేధించడం వంటివి మత భావనల్ని మరింత బలపరుస్తాయని మార్క్స్, ఎంగెల్స్ స్పష్టం చేశారు. అనిర్దిష్ట సైద్దాంతిక ప్రచారం, సంకుచిత  సాంస్కృతిక వాదాలతో కూడిన బూర్జువా నాస్తికత్వానికి భిన్నంగా… మార్క్సు, ఎంగెల్స్… మతానికి దోహదం చేసే సాంఘిక, రాజకీయ పరిస్టితులు పోకుండా మతం పోదని స్పష్టం చేశారు. తమ ఆర్థిక, రాజకీయ విముక్తి కోసం సాగించే విప్లవ పోరాట బాటలోనే శ్రామిక ప్రజలు మత భావనల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి బయట పడతారని పేర్కొన్నార్తు. ప్రజలకు భౌతిక వాద విద్య గరపాలి.  ప్రొలిటేరియన్ పార్టీలు చక్కని భౌతిక వాద సాహిత్యాన్ని, ప్రకృతి శాస్త్రాలూ సాంఘిక శాస్త్రాలూ సాధించిన విజయాల్ని శ్రామిక వర్గాల్లో ప్రచలితం చేయాలని మార్క్సిజం సంస్థాపకులు పిలుపునిచ్చారు.

(ఇక్కడి నుంచి రెండు పేరాలు వొదిలేస్తున్నాను. అందులో… ఈ విషయమై సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ చేసిన పనులను పేర్కొన్నారు. అవి ఇక్కడ అనవసరం అనిపించింది – అనువాదకుడు).

ఈ సంపుటిలోని రచనల భాగాలన్నీ ఇంతకు ముందు ‘ఇన్స్టిట్యూట్ అఫ్ మార్క్సిజం లెనినిజం’ ప్రచురించిన ‘వర్క్స్ అఫ్ మార్క్స్ ఎంగెల్స్’ తదితర ప్రచురణల నుంచి తీసుకున్నవి. అవన్నీ ఇన్స్టిట్యూట్ యొక్క తాజా కూర్పులే. రచనలన్నిటినీ తేదీల వారీగా వుంచాం. సంపుటి చివర సంపాదక వివరణలు, పేర్ల సూచిక, బిబ్లికల్, మైథలాజికల్ పేర్లు, సంక్షిప్త విశయ సూచిక ఇచ్చాం.(ఇప్పటి ఇక్కడి పాఠకుల అవసరం మేరకు, అనువాదానికి వొదిగిన మేరకు… అలాంటి వివరాల్ని… ‘రస్తా’లో ఏ సంచికలో వచ్చే భాగం లోనివి ఆ సంచికలోనే  ఎక్కడికక్కడ అందిస్తాను- అనువాదకుడు)

‘ఇన్స్టిట్యూట్ అఫ్ మార్క్సిజం లెనినిజం’

అఫ్ ది సి.సి., సి.పి.ఎస్.యు.

*****

కార్ల్ మార్క్స్

డెమోక్రిటస్ ప్రకృతి తత్వశాస్త్రం, ఎపిక్యురస్ ప్రకృతి తత్వశాస్త్రాల మధ్య తేడా:

సిద్ధాంత వ్యాసానికి ముందు మాట

మొదట దీన్నొక డాక్టొరల్ సిద్ధాంత వ్యాసమని అనుకోకపోయి వుంటే, ఈ సిద్ధాంత వ్యాసం మరింత ఖచ్చితమైన శాస్త్రీయ రచన అయ్యేది. కొన్ని అంశాలలో కాస్త తక్కువ విద్యాడంబరంగానూ వుండేది. ఏది ఏమైనా కొన్ని బయటి కారణాల వల్ల దీన్నిలా అచ్చేయడానికి ఒప్పుకున్నాను. అంతే కాదు, గ్రీకు తత్వశాస్త్రంలో ఇన్నాళ్ళు పరిష్కారం కాని ఒక సమస్యను నేనిందులో పరిష్కరించానని నమ్ముతున్నాను.

విషయ పరంగా ఈ సిద్దాంత వ్యాసానికి పనికొచ్చే పూర్వ రచనలేవీ లేవని నిపుణులకు తెలుసు. ఇంత కాలం సిసిరో, ప్లుటార్క్ ల చాటభారతాల్ని మళ్లీ మళ్లీ చెప్పడం తప్ప మరేమీ జరగలేదు.  ఎపిక్యురస్ ను చర్చి ఫాదర్ల నుంచీ, మొత్తం మధ్య యుగాల నుంచీ- భౌతికీకృత అహేతువాద యుగం నుంచి- విముక్తి చేసిన గాస్సెండీ పరిశీలనల్లో ఒక ఆసక్తికరం ఏమిటంటే… గాస్సెండీ తన ‘నాస్తిక’ (హీదెన్) జ్ఞానానికీ తన క్యాథలిక్ చేతనకూ మధ్య సామరస్యం కుదిరించాలని ప్రయత్నించాడు. ఆనాడు ఎపిక్యురస్ చర్చితో సామరస్యానికి యత్నించినట్లే, ఇది కూడా, నిస్సందేహంగా వ్యర్థ ప్రయత్నమే. ఎంత నిస్సందేహ వ్యర్థ ప్రయత్నమంటే,.. ఒక క్రైస్తవ సన్యాసిని అంగీని గ్రీకు రాజనర్తకి వొంటి మీద కప్పబోయినంత వ్యర్థ ప్రయత్బం. గాసెండీ ప్రయత్నం….. ఎపిక్యురస్ తత్వ శాస్త్రాన్ని మనకు నేర్పించడం కన్న ఎక్కువగా తాను ఎపిక్యురస్ నుంచి తత్వశాస్త్రం నేర్చుకుంటున్నట్లుగానే వుంటుంది.  

ఈ సిద్ధాంత గ్రంధాన్ని నేను తలపెట్టిన మరొక పెద్ద రచనకు పూర్వగామిగా భావించాలి. ఆ పెద్ద రచనలో చాల వివరంగా ఎపిక్యురియన్, స్టాయిక్ (వైరాగ్య), స్కెప్టిక్ (సందేహవాద) తాత్విక చట్రాలను, మొత్తం గ్రీకు వేదాంతం (స్పెక్యులేషన్) తో అనుసంధానిస్తాను. రూపం మొదలైన వాటికి సంబంధించి ఈ సిద్దాంత వ్యాసంలో లోపాలుంటే వాటిని కూడా అప్పుడే సవరిస్తాను.

ఈ తాత్విక చట్రాల సాధారణ లక్షణాలను, హెగెల్, మొత్తం మీద, సరిగ్గానే నిర్వచించారు. ఆయన తన ‘తత్వ శాస్త్ర చరిత్ర’ కు చాల విస్తృతమైన, సాహసోపేతమైన ప్రణాఌక వేసుకున్నారు. నిజానికి తన రచనతో తత్వ శాస్త్ర చరిత్ర మొదలయిందనవచ్చు. అయితే, దీనిలో కొన్ని కష్టాలున్నాయి. ఒకటి…దీంతో ఆ చట్రాల వివరాల్లోనికి (డిటెయిల్స్) లోనికి వెళ్ళలేం. మరొకటి… ‘అత్యున్నత వేదాంతం’ (స్పెక్యులేషన్ పార్ ఎక్స్ లెన్స్) అని తానే పేర్కొన్న తన దృక్త్పథం… ఆ హెగెల్ కు పరిమితులు విధించింది. గ్రీకు తత్వ శాస్త్ర చరిత్రలోనూ, మొత్తంగా గ్రీకు ఆలోచనల చరిత్రలోనూ ఆ తాత్విక చట్రాలకు వున్న వున్నత ప్రాముఖ్యాన్ని   హెగెల్ చూడలేకపోయారు. గ్రీకు తత్వ శాస్త్రపు వాస్తవ చరిత్రకు తాళంచెవి ఆ తాత్విక చట్రాలే. వాటికీ గ్రీకు జీవితానికి మధ్య వున్న మరింత లోతైన సంబంధాన్ని, నా మిత్రుడు కోపేన్ ‘ఫ్రెడరిక్ ది గ్రేట్ అండ్ హిజ్ అపోనెంట్స్’ పుస్తకంలో చూడొచ్చు.

ఎపిక్యురస్

ఎపిక్యురస్ వేదాంత శాస్త్రం మీద ప్లూటార్క్ రేపిన వివాదం మీద విమర్శను అనుబంధంగా చేర్చడం ఎందుకంటే, ఆ వివాదం ఏమంత అపూర్వం కాదు గాని, అది ఒక రకం ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తత్వ శాస్రం పట్ల థర్మ శాస్త్రపు తర్క వైఖరికి ఆ వివాదం ప్రాతినిధ్యం వహిస్తుంది.

మత వేదిక ముందు తత్వశాస్త్రాన్ని వుటంకించడంలో ప్లూటార్క్ వైఖరిలోని డొల్లతనాన్ని  ఈ విమర్శలో పట్టించుకోలేదు. ఈ విషయంలో డేవిడ్ హ్యూమ్ నుంచి ఒక పేరా చాలు, వేరే ఏ చర్చ కన్న.

” ఎవరి సార్వభౌమ అధికారాన్ని ప్రతి చోటా గుర్తించక తప్పదో ఆ తత్వ శాస్త్రం… తాను వచ్చిన నిర్ధారణలకు గాను… ప్రతి చోట క్షమాపణ చెప్పుకోవలసి రావడం, తన వల్ల బాధ పడే ప్రతి కళ ముందు, ప్రతి శాస్త్రం ముందు తనను తాను సమర్తించుకోవలసి రావడం, తప్పని సరిగా, ఒక రకం అవమానం. ఇది రాజు తన ప్రజలకు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు పాల్పడ్డాడని విచారించడం వంటిది.” (డేవిడ్ హ్యూమ్ , వాల్యూం 1, లండన్, 1874, పేజ్ 532.)

తత్వశాస్త్రం…  ప్రపంచాన్ని జయించే తన స్వేచ్చా హృదయంలో ఒక్క నెత్తురు చుక్కయినా వున్నంత వరకు… ఎపిక్యురస్ గొంతుతో… విరోధులకు సవాలు విసురుతూనే వుంటుంది ‘మూకల దేవుళ్లని తిరస్కరించిన వాడు కాదు అపవిత్రుడు, దేవుళ్ల గురించి మూకల అభిప్రాయాన్ని కావిలించుకున్న వాడే అపవిత్రుడు’. (ఇలాంటి చోట్ల ఒరిజినల్ రచనల్లో ఆయా భాషల్లో మాటల్ని  ఇచ్చారు. అలా నేనివ్వలేను. ఇన్స్టిట్యూట్ వాళ్లు ఫుట్ నోట్ గా ఇచ్చిన ఇంగ్లీషు రూపాన్నే తెలుగు చేస్తున్నాను.-అనువాదకుడు).

తత్వశాస్త్రం ఈ సంగతిని ఎప్పుడూ దాచి పెట్టలేదు. ప్రొమీథియస్ ఎప్పుడో ఒప్పేసుకున్నాడు, “నిజానికి నేను సకల దేవుళ్ళను తిరస్కరిస్తాను”. భూ, దివాలలో ఎక్కడైనా మానవ చేతనను దైవంగా భావించని దేవుళ్లందరిని వ్యతిరేకించే నినాదమిది (మోట్టో). మానవ చేతనకు సమానమైన దేవుడు ఏదీ లేదు.

సమాజంలో తత్వ శాస్త్రం హోదా దిగజారిందని సంబరపడే ‘మార్చ్- కుందేళ్ళ’ కు కూడా అదే జవాబు.*
(* మార్చ్ కుందేళ్లు: పిల్లలు పెట్టే రుతువు(మార్చినెల)లో  కుందేళ్ళలా విచిత్రంగా, పిచ్చెక్కినట్లు ప్రవర్తించే వాళ్లు… ఇంగ్లీషు పలుకుబడి)

దేవతల దూత అయిన హెర్మ్స్ కు ప్రొమీథియస్ చెప్పిన మాట:

‘నేనెప్పటికీ నా సంకెళ్ళు వొదులుకోడం కోసం,

వాటికి బదులు బానిస సేవకత్వం తీసుకోను.

జేయస్ (దేవుడి) సేవకు బానిస కావడం కన్న

ఈ రాయికి కట్టేయబడడమే బాగుంది’.

తత్వ శాస్త్ర చరిత్రలోని మహా రుషులు, అమరులు అందరిలో మహోన్నతుడు ప్రొమీథియస్.

బెర్లిన్, మార్చ్ 1841.

అనువాదం: హెచ్చార్కె

 

హెచ్చార్కె

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.