దేశంలో అమలవుతున్నది మనుస్మృతి కాదా?

భారత రాజ్యాంగం మూల అంశాలైన స్వేచ్చ, సమానత్వం, సోదర భావం అనేవి హిందూమత ప్రాబల్యం ఉన్న భారత దేశానికి ఏనాటికీ వంటబట్టేటట్టుగా లేవు. రాజ్యాంగంలో ఏమున్నప్పటికీ పరిపాలిస్తున్నది హిందూ ధర్మకర్తలే. కనుక భారత సమాజంలో ఎలాంటి మార్పులు ఆశించినా అది ఇప్పుడు అత్యాశే అవుతున్నది.

ఈ దేశంలో బౌద్ధ ధర్మ పాలన కొన్ని శతాబ్దాలుగా సాగినట్టు, అప్పుడు అన్ని సామాజిక వర్గాలు ప్రశాంతంగా జీవించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలు ముస్లిం రాజులు, బ్రిటీష్ పాలకులు ఈ దేశాన్ని పాలించారు. ఐనా, హిందూ సమాజం ఎటువంటి మార్పులకీ లోను కాలేదు.

స్వాతంత్ర్యం అనంతరం భారత రాజ్యాంగం, దాని ద్వారా వచ్చిన అనేక చట్టాలు, అవి ఉద్దేశించిన మార్పులు హిందూమతంలో కనబడడం లేదు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు సమాజం ఆమోదం పొందని ఏ చట్టాలయినా అమలుకు నోచుకోవడం సాధ్యపడదు. అదే జరుగుతోంది అప్పటి నుంచీ.

భారతీయ సమాజంలో హిందూ ధర్మ ఆచార వ్యవస్థ సృష్టించిందే దుర్మార్గ అంటరానితనం. వేల సంవత్సరాలుగా సామాజిక బహిష్కరణకు గురి అయిన సమాజాన్ని తమతో కలుపుకొని పోవడానికి హిందూ ధర్మం ఒప్పుకోవడం లేదు. హిందూ ధర్మ రక్షణ నిర్విఘ్నంగా కొనసాగినంత కాలం వెలివాడలు అదృశ్యం కావడం జరిగదు. ఈ నేపథ్యంలో పరిశీలించినప్పుడు భారత దేశంలో అంటరాని జాతులు నివసించే ప్రదేశాలన్నీ ఏదో ఒక స్థాయిలో సాంఘిక బహిష్కరణ అమలు అవుతున్న ప్రదేశాలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నిశ్శబ్దంగా అమలు అవుతున్న ఈ దుర్మార్గ ఆచారానికి అప్పుడప్పుడు ఏర్పడుతున్న కొద్దిపాటి ఆటంకాలే అలజడులుగా మారుతున్నాయి.

కారంచేడు నుంచి గరగపర్రు దాకా జరుగుతున్న సంఘటనలు ఇలాటి అలజడులే.

అంటరాని జాతులుగా ముద్రపడినవాళ్ళు కొద్దిపాటి చైతన్యం ప్రదర్శించిన ప్రతి చోటా దాడులు, దుర్మార్గ హింస నిరాటంకంగా అమలు అవుతున్నది.

నిజానికి ఇటీవల గరగపర్రు నుంచి చూసుకుంటే దళితుల సామాజిక బహిష్కరణ రెండు నెలల తర్వాత బయట సమాజానికి తెలిసింది. అప్పటిదాకా అదొక సాధారణ విషయంగా చెలామణి అయ్యింది. గ్రామంలో ఉన్న దళితేతర సమాజానికి మొత్తానికి ఆమోదంగా ఉన్న ఈ చర్య… చట్టం ప్రకారం వేరే దృష్టిలో ఉండడంతో అది ఉన్నట్టుండి ఒక సమస్య గా మారింది.

గరగపర్రు లాటి అనేకచోట్ల దళితుల్ని ఎందుకు సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు?

ఫ్యూడల్ కులాలు అటువంటి శిక్షలు విధించడానికి కారణాలు ఏమిటి?

అనేకచోట్ల అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు టార్గెట్ అవుతున్నాయి?

అనే ప్రశ్నలకు జవాబులు స్పష్టమే. వాళ్లంతా అంబేద్కర్ కేంద్రకంగా చైతన్య వంతం అవుతున్నారు. ఫ్యూడల్ కులాలకి ఇది నచ్చడం లేదు.

దళితులు రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. స్వేచ్ఛగా ఎదుగుతున్నారు.

విగ్రహాలు కేంద్రకంగా తమ చైతన్యాన్ని చాటుకుంటున్నారు. అందుకే వీళ్ళ స్వేచ్చని, స్వాతంత్రాన్ని అపహాస్యం చెయ్యడం కోసం, వాళ్ళ చైతన్యం మీద దెబ్బకొట్టడం కోసం ఫ్యూడల్ కులాలు దాడులు చేస్తున్నాయి. గరగపర్రులో జరిగిందదే. చెరువు కట్ట మీద అన్ని విగ్రహాలకు లేని అడ్డంకి అంబేద్కర్ విగ్రహానికి వచ్చింది. అదెక్కడిదాకా వచ్చిందంటే సామాజిక బహిష్కరణ దాకా. విగ్రహం వేయనీకుండా అడ్డుకోవడంతో ఆగకుండా వాళ్ళని సామాజిక బహిష్కరణ కి గురి చెయ్యడం ద్వారా మళ్ళీ అవమానించడం. తద్వారా భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మనుస్మృతిని అమలు పర్చడం.

విగ్రహం వెయ్యనీకపోవడం

సాంఘిక బహిష్కరణ చెయ్యడం

అడిగినందుకు యాకోబును హత్య చెయ్యడం

చివరికి దళిత ప్రతినిధులు వెళ్లి రాజీ చేసినా పట్టించుకోకుండా ఉండడం

ఇవన్నీ మనుస్మృతి ఆచరణలో భాగమే.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 వ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అట్టహాసంగా జరిపించాయి.

అంతే కాదు. తెలుగు రాష్ట్రాలు లో అంబేద్కర్ స్మృతి వనాల పేరుతో నమూనాలు గీయించారు. 150 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి చూపుతాం అన్నారు. ఇక కేంద్రం ప్రభుత్వం ఐతే, అంబేద్కర్ గతంలో నివసించిన ఇళ్ళూ, ఆయన స్మారక స్థలాలను స్మృతి చిహ్నాలు గా మార్చి కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించుకుంది. ఇలా ఓ వైపు ఆయా ప్రభుత్వాలు అంబేద్కర్ కోసం ఏదో చేస్తామని చెబుతుండగా గ్రామ, మండల స్థాయిల్లో మాత్రం అంబేద్కర్ విగ్రహాలకు అవమానం జరగడానికి, ఆ పనికి ఆయా ప్రభుత్వాధి నేతల అనుయాయులే పాల్పడడం… దీనికి కారణం హిందూ సమాజమే.

అంటే ఇక్కడ అంబేద్కర్ విగ్రహాలు ప్రభుత్వాలు పెట్టాలని అనుకోవడం రాజకీయం. చైతన్య వంతం అయిన దళితులు పెట్టుకోవాలి అనుకోవడం హిందూ సమాజ వ్యతిరేకం. వినాయక చవితికి అనేకచోట్ల గణపతి విగ్రహాలు దానం చేసినట్లుగా అంబేడ్కర్ విగ్రహాలు కూడా దానం చేస్తారు. ఇట్లా ఫ్యూడల్ కులాలు దానం చేసే చోట, వాళ్లు చూపించిన స్థలాల్లో ఏర్పాట్లు చేసుకున్న చోట ఇబ్బందులు రావు. తద్వారా దళితులే కాదు, అంబెడ్కర్ విగ్రహాలు సైతం వాళ్ళ అదుపాజ్ఞల్లో ఉండాలన్నది వాళ్ళ పోకడ.  అలా కాకుండా చైతన్యంతో దళితులే విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ప్రతిచోటా ఇబ్బందులే, గొడవలే, కూల్చివేతలే, సాంఘిక బహిష్కరణలే.

జాగ్రత్తగా గమనిస్తే ప్రతి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వెనక ఒక లొంగుబాటు కధనో, తిరుగుబాటు కధనో విధిగా వుంటుంది.

ఇక సాంఘిక బహిష్కరణల సంగతి చెప్పనవసరం లేదు.

దేశంలోని గ్రామాల్లో 90 శాతం ఏదో ఒక సందర్భంలో సాంఘిక బహిష్కరణ అమలు చేసినవే ఉంటాయ్. కారణం దళితులకు భూమి లేకపోవడం. తిండి గింజల కోసం వారు ఫ్యూడల్ కులాల పంట పొలాలపై ఆధారపడటం.

ఇందుకోసమే వాళ్ళ ఆధారాన్ని గుంజుకోవడం కోసం, తమ పెత్తనాన్ని కొనసాగించడం కోసం హిందూ ధర్మాన్ని నిరంకుశంగా అమలుపరచడం.

చదువుకుంటున్న తరం, చైతన్యవంతం అవుతున్న తరం సొంతంగా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకునే చర్యలు ప్రారంభించడం వల్ల, గ్రామీణ హైందవత్వం జూలు విదిలించి జులుం ప్రదర్శిస్తో వుంటుంది.

అందుకోసమే ఫ్యూడల్ కులాల అదుపాజ్ఞల్లో విగ్రహాలు ఏర్పాటు కావాలి. లేదా పల్లెల్లోని వాళ్ళ ఏజెంట్లు ఐనా ఏర్పాటు చేయాలి. అంతవరకే. అంబేద్కర్ సూచించిన మార్గం వాళ్ళకి చేరకుండా వుంటే చాలు.

గరగపర్రు లాంటి గ్రామాల్లో  ఆత్మగౌరవ సమస్య ఐతే

దేవరపల్లి లాంటి గ్రామాల్లో భూమి సమస్య.

గరగపర్రు వంటి గ్రామాల్లో స్థానిక జమీందారులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే దళితుల భూమి సమస్యల విషయంలో ఏకంగా ప్రభుత్వాలే చట్టాలని వక్రీకరించడం మొదలెట్టాయి. దళితులు ఆర్ధికంగా ఎదిగితే ఆత్మగౌరవంతో పాటు రాజ్యాధికారం గురించి ఆలోచిస్తారనే భయం ప్రభుత్వాలకి బలంగా వుంది. ఈ భయంతోనే నీరు- చెట్టు, నీరు- ప్రగతి అనే రెండు పధకాల్ని విడతల వారీగా ప్రవేశపెట్టారు. తద్వారా ఎన్నో ఏళ్లుగా దళితులు సాగుచేసుకుంటున్న భూముల ఆరా తీశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యేలు ప్రధాన ఇరుసు. దళితుల ఆర్ధిక స్వావలంబన కోసం ఒకప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన భూములనే ఇప్పుడు ఏదో ఒక వంకతో గుంజుకోవడం ప్రారంభించారు. ఏపీ లో అనేక గ్రామాల్లో దళితుల భూములు ఈ పధకాల అమలు పేరుతో లాగేసుకున్నారు. పెద్డ ఎత్తున వామపక్షాలు, దళిత సంఘాలు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దరిమిలా అధికారం అండతో స్థానిక భూస్వాములు రెచ్చిపోవడం, వారికి వత్తాసుగా పోలీసు శాఖ వ్యవహరించడం ఒకెత్తయితే, పోలీసులు అత్యుత్సాహంతో డ్రోన్ కెమెరాలతో పల్లెల మీద నిఘా విధిస్తున్నారు. పల్లెల్లో పోలీసు పటాలాలు దించి జనాలని భయకంపితుల్ని చేస్తున్నారు.

దీనికి దేవరపల్లి మొదలు అనేక గ్రామాలు ఉదాహరణలు.

నిజానికి గరగపర్రులో ఆత్మగౌరవ సమస్య, దేవరపల్లిలో భూమి సమస్య. రెండు చోట్లా దళిత మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఏమీ చేయలేకపోయారు. సరికదా, స్థానిక ఆధిపత్య సంస్కృతి లో ఒక్క ఇటుకనూ కదిలించలేకపోయారు.

పని చేయాల్సిన అధికారులు సైతం మిన్నకుండి పోవడమే కాదు అధికార ఫ్యూడల్ ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఆడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.

నిజానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండేళ్ల లోపే రాజ్యాంగ ఆకాంక్షలు చిగురులు వెయ్యలేకపోవడం, దళితులకు రాజ్యాంగ రక్షణలు ఆచరణలోకి రాకపోవడం అప్పుడే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించారు. న్యాయశాఖ మంత్రిగా పదవికి రాజీనామా చేసే సందర్భంగా ఈ విషయమై ప్రస్తావన చేశారు. దళితులకు రక్షణ కల్పించడంలో నాటి ప్రభుత్వాలు విఫలం కావడానికి కారణం వాళ్లు హిందూ సమాజంలో భాగం కావడం అని ఆయన గుర్తించారు. అందుకే దళితులు హిందూ సమాజంలో కొనసాగలేరని చెప్పారు. తనతోపాటు లక్షలాది మంది దళితులతో బౌద్ధ మతం స్వీకరించారు. దేశంలో హిందూ తాత్వికాచారణతో కొనసాగుతున్న అనేక రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మాణం కోసం సన్నద్ధం అవుతూ మరణించారు. ఆర్ పి ఐ, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీలపై పూర్తి చర్చ ఇక్కడ కుదరదు గాని, అవి సంపూర్ణ తాత్వికతని పుణికిపుచ్చుకున్నవి కాదని చెప్పక తప్పదు.

రాజ్యాంగ రక్షణలు ఎన్ని ఉన్నప్పటికీ వాటిని అమలు జరిపే యంత్రాంగం లేకుండా దళితులకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. కారణం ఆ పాలన నిండా, ఆ యంత్రాంగం నిండా హిందూ సాంస్కృతిక ‘మైండ్ సెట్’ నిండిపోయి వున్నప్పుడు, దాని సహజాత గుణాలైన అణచివేత స్వభావాన్ని నరనరాల్లో ఇంకించుకున్నప్పుడు దళితులకు కనీస న్యాయం జరిగే అవకాశం లేదు. రాజ్యాంగం అలా పైపైకి చూయించుకోడానికి, ఫ్యూడల్ పార్టీలు సామాన్య జనానికి రాజ్యాంగ రక్షణలు కల్పిస్తున్నాయని చెప్పుకోడానికి అదలా ఉంటుందంతే.

ఐతే అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగం ద్వారా దళితులకు, ఇతర బలహీన బడుగు వర్గాలకు సాధించిపెట్టిన హక్కులు క్రమంగా ఆయా వర్గాలు కోల్పోవడానికి కారణం వాళ్ళు రాజ్యాధికారం లోకి రాకపోవడమే.

ఈ వర్గాలకు ఉన్న కొద్దిపాటి స్వేచ్చా స్వాతంత్రాల్ని కాపాడుకోవాలన్నా, ఉన్న కొద్దిపాటి ఆర్ధిక స్థితిగతులు నిలదొక్కుకోవాలన్నా కింది వర్గాలకు రాజ్యాధికారం రావాలి. కింది వర్గాలకు చెందిన ఒకరిద్దరు ఫ్యూడల్ పార్టీల్లోకి చెంచాలుగా ఎగబాకి, ఆ వర్గాల హక్కులను ఏమార్చడానికి ఫ్యూడల్ పార్టీల నేతలకు ఉపకరిస్తూ వంచనకి పాల్పడుతూ, అదే అంబేద్కర్ సూచించిన రాజ్యాధికార దృక్పథం అని కూడా దగుల్బాజీ తనాన్ని ప్రకటిస్తున్నారు. ఇది కింది వర్గాలని మరింత గందరగోళం చేసే అంశం. దీనికి ఉదాహరణగా ఇటీవల ఎస్సిఎస్టీ ప్రతినిధులు అట్రాసిటీ చట్టం రక్షణ కోసమని రాష్ట్రపతిని కలిసిన సంఘటన.

గరగపర్రు ఆత్మగౌరవ పోరాట సందర్భంలో కానీ, దేవరపల్లి భూ పోరాట సందర్భంలో కానీ, లేదా తెలుగు రాష్ట్రాలలో 150కి పైగా జరిగిన దళితులపై జరిగిన దాడుల సంఘటనలలో కానీ న్యాయం జరిగే వరకూ బాధితుల పక్షాన నిలబడని వాళ్ళు అట్రాసిటీ చట్టం అమలు కోసం అడగడం అనేది కనీసం కంటి తుడుపు చర్యగా కూడా కాదు, అదొక ఫ్యూడల్ శక్తుల ఇన్స్టాన్ట్ నాటకం మాత్రమే కాదు లక్షిత వర్గాల హక్కులని కించపరిచే దుర్మార్గ నాటకమని అభివర్ణిస్తే తప్పు కాదు.

అధికారంలోకి రాని జాతులు అంతరించిపోతాయని కాన్షీరాం చెప్పింది ఇటువంటి సందర్భంలొనే.

  • డాక్టర్ నూకతోటి రవికుమార్
  •   డాక్టర్ నూకతోటి రవికుమార్

98481 87416

రవికుమార్ డాక్టర్ నూకతోటి

రవికుమార్ నూకతోటి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తయారు చేసిన విద్యార్థి యోధులలో ఒకరు. ఉద్యమాలు వట్టి గొప్పలు చెప్పుకోడం కాకుండా అంబేద్కర్ దారిలో అన్ని విధాలుగా దాడులకు గురవుతున్న  దలితుల కోపు  నిలబడాలని మొహమాటం లేకుండా మాట్లాడుతున్న నిత్య జీవన యోధుడు. తన చుట్టు పక్కల జీవితంలో జన సమస్యలలో పేదల పక్షాన కలుగ జేసుకుంటూ క్రియాశీలిగా రచయితగా కష్జజీవుల కోసం పని చేస్తుంటారు, రాస్త్రుంటారు.

3 comments

  • ఆలోచింపచేసే వ్యాసం రవీ, అభినందనలు

  • భారత రాజ్యాంగం వచ్చ్చేవరకూ మనుస్మృతి ఇక్కడ అమలయ్యేదని పాపం వెండీ ధోనీగర్ అన్నారు కానీ తర్వాత కూడా మనుస్మృతే భారత శిక్షాస్మృతి గా ఉంటుందని ఆమెలాంటి విదేశీయులకు తెలీదు
    వ్యాసం ఆలోచనాత్మకంగా వుంది రవీ కంగ్రాచ్యులేషన్స్! కీప్ గోయింగ్

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.