మనిషీ మతం

కరు ఫలానా మతం అయినందుకు ప్రేమించడం వున్నంత కాలం
ఒకరు ఫలానా మతం అయినందుకు ద్వేషించడం కూడా వుంటుంది.

ఈ రాగ ద్వేషాలు రెండూ మనిషిని దుంపనాశనం చేసేవే. రాగద్వేషాలకు మతం ఒక పతాకం అయినంత కాలం మనుషులు మనుషులుగా వుండరు.

నా మతం ప్రాబల్యంలో వున్న చోట నేను పెత్తనం చేస్తాను. నా మాట వినకపోతే ధాష్టీకం కూడా చేస్తాను. నీ మతం ప్రాబల్యంలో వున్న చోట నువ్వూ అదే చేస్తావు.

అలా జరగదని ఏ మతం సామాన్యుడూ హామీ ఇవ్వలేడు. అది సామాన్యుని చేతిలో లేదు. అతడు నిర్ణేత కాడు. అనుయాయి మాత్రమే.  

నీ యిష్టం. నీకు మతం కావాలంటే, వుంచుకో. కాని మతం ప్రాతిపదికగా రాజకీయార్టికాలు నడపొద్దు. నడపనీయొద్దు. మతం పునాది మీద పాజిటివ్, నెగటివ్ రాజకీయాలు ఏవీ నడపొద్దు. 

దీనికి అన్ని మతాలలోని పేదవాళ్ళు, సామాన్యులు అంగీకరిస్తారు. ఆ మతాలలోని బలిసినోళ్లు, గురువులు, పూజారులు అంగీకరించరు. అంగీకరిస్తే వాళ్ళ ఆదాయానికి గండి పడుతుంది. అప్పనంగా దొరికే చాల సౌకర్యాలు దొరక్కుండా పోతాయి. తాము కూడా పేడ తట్టలెత్తే శారీరక పనినో, లెక్క పక్కాల ‘వుద్యోగి’ పనినో చేపట్టాల్సి వుంటుంది. 

మతానికి నజరానాలు చెల్లించడంలో తప్ప దాన్ని ‘వాడుకోడం’లో సామాన్యునికి ఏ వాటా వుండదు. మతానికి నజరానాలు అంటే మత పెద్దలకే. ఏ దేవుడూ దిగి వచ్చి నజరానాలు తీసుకోడు, తీసుకోడు గనుక బదులుగా నీకు ఏమీ ఇవ్వడు, తాత్కాలిక శాంతిని కూడా ఇవ్వడు.

ఏ మధ్య యుగాలలోనో మొదలై ఇప్పటికీ అధికారం చలాయిస్తున్న మతం మీద, ఇప్పటికీ అదే స్థాయిలో నెత్తురుటేళ్లు పారిస్తున్న మతం మీద, ఇప్పటికీ అణిచివేత నిచ్చెన మెట్లకు వూతమిస్తున్న మతం మీద… ప్రగతిశీలురు వుండాల్సినంత కచ్చితంగా లేకపోవడం వల్ల అనుభవించాల్సిన కష్టాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాం.

అందరికీ చెందాల్సిన జీవన వనరులను కొందరు తమ నీచ భోగ విలాసాలకు వాడుకునే దుర్మార్గానికి మానసిక వూతం ఇస్తున్నాం.

ఔను ఏసు కూడా పేద వాడే. మీరు అదేం చెప్పనక్కర్లేదు. పాలకులు ఒప్పుకుంటారు. ఇంకేం, ఏసు వలె నువ్వు కూడా పేదవాడిగానే వుండమంటారు, పేదరికపు బాధలలోనే శాల్వేశాన్ వెదుక్కోమంటారు. 

ఇండియాలో ‘పరివారం’ ఏకంగా ఎన్నికల్లో గెలిచి, రాజదండం వూపుతున్నది, మతం మెజారిటీని ఓట్లుగా మార్చుకుని.

ఆ, అదేం కాదు అంటారా? అలా జరగలేదంటారా? అనలేరు.

వాళ్ళు రాజ్యాధికారానికి రావడానికి మూలం అటు శిలాన్యాసంలో ఇటు గుజరాత్ తరహా మత కల్లోలాల్లో వుంది. ఆందులో నేరగాళ్ళెవరో తెలిసినా, ఆయూబ్ రాణా వంటి సాహస జర్నలిస్టులు రుజూ చేసినా ఏమీ కాదు. మతం నేరగాళ్లను కాపాడుతుంది. కాపాడడమే కాదు, ఆ కారణాలతోనే వాళ్ళ పీఠాల్ని పదిలం చేస్తుంది కూడా.

రాజకీయ ఏకీకరణలకు మతం పునాది అయినంత కాలం
‘మెజారిటీ’ మతం పునాది మీద నిలబడిన తమకు ధోకా లేదని వారికి తెలుసు.

ఇది మీకు తెలుసా, ప్రగతివాదులారా?! తెలిస్తే, మీరు సైతం రాజకీయ ఏకీకరణలకు, పునరేకీకరణలకు మతాల మీద ఆధారపడుతున్నారెందుకు? 
మతం ప్రాతిపదిక మీద జరిగే రాజకీయ తర్కానికి మతమే ఎండ్ ప్రొడక్ట్ కాదా?

మనుషులు కేవలం మతస్థులుగానే కాదు. పేదలుగా ధనికులుగా; పని చేసి బతికే వాళ్లుగా, పని చేయకుండా మేనేజ్ చేసే వాళ్లుగా కూడా వున్నారు. నిజానికి ఈ విభజనే మనుషుల రోజువారీ సుఖ సంతోషాలను నిర్ణయిస్తోంది, మత విభజన కాదు.

అర కొర జ్ఞానపు మధ్య యుగాల నుంచి పేదలకు మతం ఒక ఓదార్పుగా వుంది. వారి సైకీ లోతుల్లోకి ఇంకి పోయింది. ఇప్పుడిప్పుడే పోదు.

జనం తమ బతుకులకు తామే భర్తలం, కర్తలం అని తెలుసుకునే కొద్దీ మతం దానికదే పోతుంది.

ఈలోగా మన రాజకీయార్థిక వ్యూహాలతో, అసందర్భ పేట్రనైజేషన్లతో మతం వూబిని విస్తరించొద్దు.

మతవాదం వల్ల బాధ పడే జనం కోసం నిలబడదాం. ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతం కోసం కాదు.

మతం జనం పాలిట మత్తు మందు. మానవ తాత్విక  చేతనకు అది మొదటి నుంచీ ప్రతిబంధకమే. ఈ సంగతి ఎన్నడూ దాచిపెట్టొద్దు. ఏ సోషలిజమో వచ్చాక రేపు మాపు సరే, ఇప్పుడు ఇవాళ కూడా దాన్ని దాచి పెట్టొద్దు. మతం ప్రగతి వ్యతిరేకత గురించి బయటికి మాట్లాడాల్సిన ఏ సందర్భాన్నీ అరకొర రాజకీయ వ్యూహాల కోసం వొదులుకోవద్దు. అలాంటి ఒక కీలక సందర్భంలో ఇవాళ భారత దేశం వుంది, ప్రపంచమూ వుంది.

ఈ ఉద్దేశం తోనే, కాస్త కష్టమే అయినప్పటికీ, ఎక్కడ చూసినా అమ్మకపు కలాల సంఖ్య పెరుగుతున్న వేళ  మెయిన్ స్ట్రీంకు దూరం చేసే ఈ కష్టం. పాలకులకు కోపం తెప్పించే కష్టం ఎందుకని అనిపిస్తున్నప్పటికీ… మతం గురించి మార్క్స్ ఎంగెల్స్ మాటల్ని ‘రస్తా’ ద్వారా మీకు చేర్చే పని పెట్టుకున్నాం. చదివి చర్చించండి.

***

ఇది సబాల్టర్న్ దళాలు కదం తొక్కుతున్న అద్భుతమైన కాలం. ‘మనం’ చాల తక్కువ మందిమి, మనలో మనం చీలిపోయి వున్నాం, పాలకుల పంచమాంగ దళాలు మనలో… దేహంలో పురుగుల్లా… తిరుగుతున్నాయి అని భయపడకుండా పలు రకాల ‘అల్ప సంఖ్యాకులు’ రాజకీయార్థిక ప్రజాస్వామ్యంలో తమ వాటా తమకు కావాలని గొంతెత్తుతున్నారు. అడుగులు కదుపుతున్నారు.

వాళ్లు దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పుతున్న దలిత వాదులు కావొచ్చు. అంతగా కాకపోయినా…. ‘మేమూ పౌరులమే, నిర్ణయీకరణలో జలాలు, నిధుల వంటి వనరులలో మాకు న్యాయం జరగాలం’టో ‘పెద్దన్నల’ను (బిగ్ బ్రదర్స్) నిలదీస్తున్న రాసీమ ప్రజలు కావొచ్చు.

అసమాన అభివృద్ధి ఆధారంగా సొంత గాదెలు నింపుకున్న వాళ్ల వల్లనే ప్రాంతీయ అసమానతలు ఇంకా పెరిగి, రాష్ట్రం ఒక సారి నిట్టనిలువుగా చీలి పోయింది. అదే అతి కేంద్రీకరణ పన్నాగాన్ని ఆంధ్ర ప్రదేశ్ మిగులు ముక్కలోనూ పాలకులు మొదలెట్టారు. నాడు రాష్ట్రం ఏర్పాటుకు మూలకందమైన అంశాలలో కీలకమైనది శ్రీబాగ్ ఒప్పందం. దానికి నిర్దయగా తూట్లు పొడిచారు. నాటి ఏర్పాట్లలో ఒకటైన కర్నూలు రాజధాని నిర్ణయాన్ని ఏకపక్షంగా తుంగలో తొక్కేశారు. ఈ పనులతో కొత్త/పాత పాలకులు సాధించబోయేది పచ్చని పంట భూముల వినాశం, రాష్ట్రం మరో చీలికకు బలమైన విత్తనం వేయడం.

అనగా తెలంగాణా వుద్యమం మాదిరిగానే మరొక ఎడతెగని అశాంతి.

అశాంతికి వెరచి ప్రయోజనం లేదు. నాగార్జున సాగర్ నుంచి నేటి వరకు జరుగుతున్న ఒకే రకం దాయాది అన్యాయాన్ని పసిగట్టి తొలగించుకోవడం, తమ నీళ్లు, వనరులు తమకు దక్కడమే గాక, ఇన్నాళ్ళ నష్టాలకు పరిహారం పొందడం రాయల సీమ జనం హక్కు. జరిగిన, జరుగుతున్న అన్యాయాల్ని పూస గుచ్చినట్టు చెప్పి, వేటి కోసం పోరాడాల్సి వుందో వాటిని జనం ముందు వుంచారు… ఈ సంచిక ‘రస్తా’లో బొజ్జా దశరథ రామి రెడ్డి.

దలితులు సైతం తమ నాయకత్వంలోని అవకాశ వాదాన్ని ప్రక్షాళనం చేసుకుని మనువాద పాలనను ధిక్కరించడం ఎంత అవసరమో, అంబేడ్కర్ ఆలోచనలను కాపాడుకుని చురుగ్గా అనుసరించడం ఎంత అవసరమో డాక్టర్ నూతకోటి రవి కుమార్ నొక్కి చెప్పారు.

***

మొదట్లోనే అనుకున్నాం మతం గురించి.

మతం మనిషి పుటకకు ముందు తరువాత ‘వున్న’ సంగతుల గురించి మాట్లాడుతుంది.

అవి ఎలా తెలుసు మత గురువులకు?

నాణానికి మరో ముఖం… మతం చెప్పే దేవుడూ అదీ ఏమీ లేవు అని, అసలేమీ ‘లేవం’టారు నాస్తికులు. వీళ్ల మాటా హేతుబద్ధం అనిపించదు. ఇది కూడా వట్థి ప్రచారార్భాటమే.

అసలు సంగతి ఏమంటే మనకు ‘తెలీదు’. మనకెవరికీ ఇప్పటికి ‘తెలీదు’. రేపు తెలుస్తుందేమో గాని, ఇప్పటికి తెలీదు. ఇప్పటికి తెలిసింది నేను, నువ్వు, తాను, ప్రకృతి. మనకు వున్న సమస్యలు కూడా మనకు తెలుసు. ఇవి చాలు, క్రియాశీలంగా బతకడానికి. బతికే క్రమంలో మరెన్నో సంగతులు తెలుసుకోడానికి.

ఈ సంచికలోనే… ‘ఫ్లాట్ లాండర్’ సైన్సు గల్పిక మిస్ కాకండి.

ఇంకా కథా, కవితల కోసం, యాత్రా కథనాల కోసం, పుస్తక సమీక్షల కోసం… పదండి ముందుకు… 🙂

15-6-2018

 

హెచ్చార్కె

4 comments

 • ఈ మీ సంపాదకీయానికి సరిగ్గా అతికినట్లుగా అనిపించే ఒక వార్త ఇవాళ్టి వార్తాపత్రికలో(17 -06 – 2018 ) కనిపించింది. ఎన్ని రకాలుగా వలలు విసురుతున్నా మైనారిటీలు, దళితులు చివరికి ఎన్నికల సమయంలో సంఘటితమై తమ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు. ఈ విధమైన గోముఖవ్యాఘ్ర న్యాయం ఇంకా కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం. కనుక ఇహ నుంచి యథాప్రకరాం పార్టీ మూల సిధ్దాంతం అయిన హిందూ అతివాదాన్నే భుజానికి ఎత్తుకొని ముందుకు పోవాలని ఆరెస్సెస్ భాజపాకి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. భాజపా అధినేత అమిత షా కూడా ఆ దిశగా తమ తమ కార్యకర్తలను సమాయత్తం చేయాలని రహస్య ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మీరు సంపాదకీయంలో అన్నట్లు మధ్యయుగాల నుంచి సామాన్యుని భయశంకలకు నివారణగా.. ఉపశమనంగా ఉపయోగిస్తున్నందువల్ల మతం అనే అంశాన్ని అతని నాడులలో నుంచి విడదీసే ప్రయత్నం సాధ్యం కాదు సరికదా! బెడిసికొట్టే ప్రమాదమూ కద్దు. కనుక పౌరుని సుఖజీవనానికి అవసరమైనది మతం కాదు.. అన్న వస్త్రాదులు వంటివి సాధించుకునే మరేదో ఉపాధి మార్గమో, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొనే పాటి స్వతంత్రమైన ఆలోచనో అని సామాన్యునికి నచ్చచెప్పే దిశగా కొత్తరాజకీయాలు బాధిత వర్గాలనుంచి, సహానుభూతి పొందే మేధోజీవుల సహకారంతో పుంజుకోవాల్సిన అవసరమైతే తప్పక ఉంది. లేదంటే మరోసారి మునుపటికి మల్లేనే అనాలోచితంగా భావోద్వేగాలకు మళ్లీ లొంగి మరో ఐదేళ్ల పాటు తమ జీవితాలను ఛిద్రం చేసే అవకాశం స్వయంగా మతవాదుల చెతికి అందిచినవాళ్ళమవుతాం.

 • మతాన్ని అనభలషణీయంగా తీర్మానించి అది సృష్టించిన విభజనలలో పోరాటచైతన్యం చూడటం సరైనదేనా? ఎవరో ఒకరి ఏలికలో ఒక పేరు సంపాదించుకున్న ఒక భౌగోళిక ప్రాంతానికి ఏదో అన్యాయం జరిగిందని ఎలుగెత్తటంలో చైతన్యం చూడటం సరైన చూపేనా? పాలకులు పాలితులుగా ఉన్నారు జనం, ఏ ప్రాంత “అబివృద్ది ” అయినా పాలకుల లాభాల కోసం జరిగే కార్యకలాపమే గాని ఆ ప్రాంతం పట్ల అక్కడి పాలిత జనం పట్ల ప్రత్యేకాభిమానం కాదని ఎరిగీ జనంలో చైతన్యాన్ని విభజించటంలో మనమూ ఓ చెయ్యివెయ్యాలా? ఈ సబాల్రన్ అనే మాటను మేతావులలో వ్యాపింపజేయటానికి ఎన్ని కోట్ల కోట్ల రూపాయలు అంతర్జాతీయ వ్యాపారి సమకూర్చాడో దానివల్ల చైతన్యం విభజితమై ఆయన దుకాణం సజావుగా సాగటానికి ఆయన శత్రువులే బోయూలైపోటం మనం గమనించవద్దా సార్

  • వివినమూర్తి గారు, చదివి స్పందించినందుకు చాల కృతజ్ఞతలు.

   ‘బోయీల’ వంటి మాటలు నచ్చలేదు.

   ‘మతం సృష్టించిన విభజనలో పోరాట చైతన్యం’ అంటే ఏమిటా అని కాసేపు కనఫ్యూజ్ అయ్యాను. మీ ఉద్దేశం కులం అయ్యుంటుంది. సరిగ్గా అందుకే మతం అభిలషణీయం కాదు. అది కులం, జెండర్ అనే అత్యంత హానికరమైన విభజనలను సృష్టించింది కాబట్టే.

   పెట్టుబడిదారీ విధానం సృష్టించిన వర్గవిభజనలో కూడా నేను పోరాటా చైతన్యాన్ని చూస్తాను. అది మీరు కూడా చూస్తారనుకుంటాను. మరి కులం విషయంలో ఎందుకు అలా ప్రశ్నించారో అర్థం కాలేదు. అందుకే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వచ్చింది మీ మాటల్ని అర్థం చేసుకోడానికి.

   మతం కులాలను తయారు చేసింది కనుక, కుల వ్యత్యాసాల్ని చూడొద్దని, దాని వెనుకనున్న బ్రాహ్మణ వాదాన్ని చూడొద్దని, అలా చూడడం మంచి చైతన్యం కాదని… మీకు తెలియకుండా మీరొక కొత్త తర్కానికి తెర తీస్తున్నారు.

   ‘రాయల సీమ’ఎవరో ఏలిక పాలనలో ఆ పేరు సంపాదించుకుందనే విషయాన్ని మీరు ఎక్కడ చదివి తెలుసుకున్నారో తెలియదు. అదొక పేరు మాత్రమే. పేర్లు రకరకాల కారణాల వల్ల, రకరకాల సన్నివేశాల వల్ల ఏర్పడతాయి. మీ పేరుకు అర్థం ఏమీటో నాకు తెలీదు గాని, దానికీ మీ గుణగణాలకు సంబంధం వుండదు. సీమ జనులు మాట్లాడుతోంది ఆ నాలుగు జిల్లాల దుఃఖం గురించి. పేరు అలా వుంచండి. ఆ నాలుగు జిల్లాలకు ఒక వ్యక్తిత్వం వుంది. ఇది పేరు సమస్య కాదు.

   ప్రాంతాల విషయంలో పాలకుల భావాలకు పాలితులు వత్తాసు పలుకుతారు. ఆధిపత్య ప్రాంతాల ప్రజలు అధీన ప్రాంతాల ప్రజల్ని ఈసడిస్తారు. అందుకే ఇండియాలోని ప్రజలు బ్రిటన్ లోని ప్రజల ప్రయోజనాలతో వైరుధ్యం కలిగి వుంటారు. ఒక బృందం (దేశం/ప్రాంతం) మరొక బృదం… విరుద్ధ ప్రయోజనాలు కల్గి వుంటాయి. దేశాలు అనేవి వాస్తవానికి ప్రాంతాలే, అవి దైవ దత్తాలేమీ కాదు. ప్రాంతాల మధ్య వాస్తవ వైరుధ్యాలంటూ వుంటే వాటిని పరిష్కరించకపోతే, మిత్ర వైరుధ్యాలు శత్రు వైరుధ్యాలుగా మారిపోతాయి. ప్రాంతాలు రాష్ట్రాలుగా, రాష్ట్రాలు దేశాలుగా మారిపోతాయి. దానికి నేనూ మీరూ చెయ్యి వేయనక్కర్లేదు. ఏవేవో తర్కాలతో చేయాల్సిన పనులు చేయకుండా నోరూ కళ్లూ మూసుక్కూర్చుంటే చాలు. (అంతటి సోవియెట్ల దేశం… నిర్బంధం పోగానే ఏమయ్యిందో చూశారుగా).

   సబాల్టర్న్ అనే మాటకు ఏ వ్యాపారి ఎన్ని కోట్లు సమకూర్చాడో మీ రహస్య సమాచారం మాక్కూడా కాస్త చెప్పండి సారూ! యూనివర్సిటీలలో ఫండ్స్ గురించి మాట్లాడుతున్నారేమో, అయితే, యూనివర్సిటీలు ఫండ్ చేయని రంగం ఏదీ లేదు. అది క్రైటీరియన్ కాదు.

   సబాల్టర్న్ వుద్యమాలు అనేవి సోషలిజం పూర్వ దశ అయిన బూర్జువా ప్రజాస్వామ్యంలో తక్షణం పరిష్కారం కావలసిన కనీస సమస్యలు. అవి ప్రాంతీయాలు కావొచ్చు, రంగు లేదా కుల సమస్యలు కావొచ్చు, జెండర్ సమస్యలు కావొచ్చు. సో, మనం ‘ఇప్పటికిప్పుడు’ గమనించాల్సిన వాటినే,వేటిని గమనించకపోతే ముందుకు అడుగు పడదో వాటినే ఈ సంపాదకీయం ప్రస్తావించింది. మరోసారి చూడాలని సవినయ మనవి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.