ఏడు రంగుల చేపపిల్ల – దేవీప్రియ కవిత్వం

టీవలే కేంద్ర సాహిత్య అకాడేమీ బహుమతి పొందిన దేవీప్రియ1951 లో గుంటూరులో జన్మించారు. కవిగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులు. జర్నలిజంలో సృజన శీలి అయిన ఎడిటర్ గా అందరికీ తెలుసు. ఆయన రన్నింగ్ కామెంట్రీ ‘ఉదయం’, మరి కొన్ని పత్రికల్లో మొదటి పేజీ దిగువ కార్నర్ లో ప్రతి ఉదయం కనిపించి, తెలుగు వాళ్ళను అలరించేది. ‘గరీబు గీతాల’ వంటి కవితా ప్రయోగాలూ చేశారు. మెత్తగా, మృదువుగా వుండమే కాదు, మెత్తని, మృదు పదాలతో ఆయన అల్లే కవిత్వం ‘అరణ్య పర్వం’, ‘అమ్మ చెట్టు’ సహా తొమ్మిది కవితా సంపుటాలు గా వెలువడింది. ఇటీవలి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు సందర్భంగా అభినందనలు చెబుతూ ఆయన క ’వనం’లో కాసేపు తిరిగొద్దాం పదండి.

‘రస్తా’ అడగ్గానే ఆయన ప్రేమగా స్పందించి, పంపించిన తన ఇటీవలి మూడు అన్ పబ్లిష్డ్ కవితలివి. రోజూ చూసే వాటినే కొత్తగా చూపించడమెలాగో యువకవులు ఈ కవితల్ని చూసి నేర్చుకోవచ్చు. తనను తాను ఏడు రంగుల చేపగా పరిచయం చేసుకున్న ఒక గడుగ్గాయి పిల్లాడు ఈ కవితల నిండా పరుచుకుని కన్పిస్తాడు. భార్యా వియోగం, విమాన ప్రయాణం, పల్లెటూరి సౌందర్యం దేవీప్రియ తో రాయించిన కవిత్వం… ఇదిగో మీ కోసం. నాకు తెలిసినంత వరకు దేవీ ప్రియ మందు కొట్టడు. ఆయినా తన కవిత్వపు మత్తులో, మనకేం, మనం చెబుదాం… త్రీ ఛీర్స్ టు దేవీప్రియ అండ్ పొయెట్రీ.

1. ఇంకా వుంది

 

నీట మునిగిన
సూర్యరశ్మి కోసం
ఒక తటాకం నుంచి
మరొక తటాకానికీ
ఒక లోతు నుంచి
ఇంకొక లోతుకీ
ఒక అట్టడుగు నుంచి
వేరొక అట్టడుగుకీ
ఈదులాడుతూ వెదుకుతున్న
ఏడు రంగుల చేప పిల్లని నేను

“`

ఒక
మస్తిష్క మహాయోగ దశలో
కళ్ళకు కానరాని దానిని చూశాను
చెవులకి వినిపించని దానిని విన్నాను
పలుకుకి అందని దానిని అన్నాను
స్పర్శకి తగలని దానిని తాకాను
గంధానికి దొరకని దానిని వాసన చూశాను
ఊపిరికి ఆవల వున్న దానిని
ఊపిరితిత్తుల నిండా పీల్చుకున్నాను…
నేను అందరికీ కనిపిస్తూనే
అదృశ్యంగా వున్నాను.

“`

ఆమె మాట్లాడితే నాకు
నక్షత్రం మాట్లాడినట్టుండేది
ఆమె ముట్టుకుంటే
వానాకాలపు కోనేరు నా
ముఖం మీద చిందినట్టుండేది
ఆమె నన్ను చూసినప్పుడల్లా
వెన్నెల నా కళ్ళలోకి సూటిగా చూసినట్టుండేది.
ఇప్పుడామె మరణించిన తరువాత
ప్రతిక్షణం తనురహితంగా
తాను నాలో జన్మిస్తుంటుంటుంది.
(ఇంకా వుంది)
2, సెప్టెంబర్‌ 2017

 

2. ఇంకొక విమాన కవిత

 

మేఘాలు బయట కాదు
లోపలే వేలాడుతున్నట్టు
ఈ విమాన మనుషుల లోనే
అనేక విమానాలు ఎగురుతున్నట్టు
ఆకాశం అనంత విశాలంగా కాక
అరలు అరలుగా పొరలు పొరలుగా వున్నట్టు
కింద నేల మీద పొడుచుకు వచ్చిన
పచ్చపచ్చని కొండలూ,
మెరిసే ఎండలో ధగధగలాడుతూ
ధవళ నాగుల్లా పాకుతున్న
వాగులూ సెలయేళ్లూ,
ఏ ఏలె లక్ష్మణో
రంగు పెన్సిళ్ళతో మట్టిరంగు కేన్వాసుమీద
విశ్వవ్యాప్తంగా గీసినట్టున్న వరిచేల అనంతమైన గట్టు
ఒకచోట నలు దిశలా
ఉప్పొంగుతున్న సముద్రం,
మరొకచోట
ఉప్పెనలా పైకిలేస్తున్న
ఉత్తుంగ కెరట సందోహం.
ఈ వైపు
విహాయసంలో విహరిస్తున్న
అవిరి రెక్కల హంస సమూహం
ఆవైపు
నిరంతర నీలాంబర అనాఘ్రాత
మేఘవనకుసుమ తటిల్లతా తటాకం,
మరొక కింద
వెండి లావాలా పాయలు పాయలుగా
సుడులుసుడులుగా గమిస్తున్న బ్రహ్మపుత్రం,
అనుకుంటా కానీ
విమానం ఒక వాహనమని
ఇది నిజానికి
ఒక యంత్రాతీత భావన,
ఒక భావాతీత లోహ అనుభవం.

(ఇంఫాల్‌ నుంచి గౌహతి మీదుగా హైదరాబాద్‌ వెళుతూ…)

 

3. అనంతారంలో ఇప్పుడు.

 

రిమళించే కృష్ణ
రవళించే కృష్ణ
పరుగులెత్తే కృష్ణ
ఇప్పుడు ఇక్కడే ఎక్కడో వున్నట్టుండి
ఈవేళప్పుడు
నిజానికి ఎక్కడో కాయవలసిన వెన్నెల
ఇప్పుడు ఇక్కడ ఈ ఎండలోనే కలసి మెరుస్తున్నట్టుండి,
రక్త దాహ బర్మా బౌద్ధులని త్యజించి వచ్చిన బుద్ధుడు
ఇక్కడే మన మధ్యలోనే
ఎవరిలోనో చేరి కూర్చున్నట్టుంది,
అభివృద్ధిలో అంతర్ధానమైన
సతత సస్య శ్యామ క్షేత్రాలు
ఇంద్ర ధనుసు చీరలలో ఇక్కడిక్కడే
ఇంకా నడయాడుతున్నట్టుంది.
అనుపమ కవిని కన్న ఆ తల్లి
అప్పుడెప్పుడో వేసిన పారాణి పాదాల తొలి అడుగు
ఇక్కడే ఎక్కడో ఇప్పుడు మళ్ళీ
కాటుకరేఖ కళ్ళు రెపరెపలాడిస్తున్నట్టుండి
ఈ సిమెంటు రోడ్డు కింద
ఏడడుగుల లోయన ఎక్కడో అరకలు భుజాన వేసుకున్న
మాధవ్‌ తాతు తండ్రులు
పొగమంచుచలిలో
పొలాల వైపు ఎడ్లని తోలుకెళుతున్న సందడి
నాకు ఇప్పుడు కూడా ఇక్కడ వినిపిస్తున్నట్టుంది,
ఊరి చుట్టూ వున్న చేలూ చేమలే కాదు
ఊరికి కాపలా కాస్తున్న కొండలూ గుట్టలు కూడా
తోకలు లేని గాలిపటాల్లా ఏ ఉల్లాసంతోనో
ఎందుకో గాలిలో ఎగురుతూ
ఇక్కడ ఏం జరుగుతోందో చూద్దామని
కుతూహలంతో
కిందికి వంగిన ఆకాశాన్ని ఢీ కొడుతున్నట్టుంది
మాధవ్‌ వాళ్ళ అమ్మని చూస్తే అప్పుడు
గుంటూరులో మరణించిన మా అమ్మ
ఇప్పుడు ఇలా అనంతారంలో బతుకుతున్నట్టుంది.
అనంతారాన్ని చూస్తే
మనిషి ప్రాణం మాయలఫకీరు మహా నగరాలలో కాదు
మట్టిరంగు మాయని మన పల్లెల్లోనే
ఇప్పటికీ కొట్టుకుంటున్నట్టుంది

(బండ్లమాధవరావు కొత్త ఇంటి ప్రవేశం సందర్భంగా, మాధవ్‌ని కనిపెంచి, తనతోనే వుంచుకుంటున్న, ఇంకా తనలోనే పెంచుకుంటున్న అనంతారానికి)

29 సెప్టెంబర్‌ 2017,
హైదరాబాద్‌, ఉదయం 1.25 ని॥కు
***

దేవీ ప్రియ

దేవీ ప్రియ: 1951 లో గుంటూరులో జన్మించారు. కవిగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులు. జర్నలిజంలో సృజన శీలి ఎడిటర్ గా అందరికీ తెలుసు. ఆయన రన్నింగ్ కామెంట్రీ ‘ఉదయం’ మరి కొన్ని పత్రికల్లో మొదటి పేజీ దిగువ కార్నర్ లో ప్రతి ఉదయం కనిపించి, తెలుగు వాళ్ళను అలరించేది. ‘గరీబు గీతాల’ వంటి ప్రయోగాలూ చేశారు. మెత్తగా, మృదువుగా వుండడమే కాదు, మెత్తని పదాలతో ఆయన అల్లే కవిత్వం ‘అరణ్య పర్వం’, ‘అమ్మ చెట్టు’ తో సహా తొమ్మిది కవితా సంపుటాలు గా వెలువడింది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.