గూగుల్ నుంచి మరో సంచలనం…

గూగుల్ మరొక సంచలనం సృష్టించబోతున్నది. ‘బులెటిన్’ పేరుతో ఒక యాప్ ను తయారు చేసి  ప్రపంచం మీదికి వదలబోతున్నది. భావోద్వేగం కల్పించే ప్రతివిషయాన్ని షేర్ చేయాలనుకోవడం మిలెన్నియల్స్ ప్రధాన లక్షణం. వాళ్లకి నచ్చితే సరి పోస్టు షేర్ అవుతుంది. వైరలవుతుంది. చదివినా చదవకపోయినా లైక్ చేయించడం, షేర్ చేయించడం సోషల్ మీడియా అనుచరులకు అందించే గొప్ప శక్తి. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వగైరా సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ లలో అకౌంట్ ఉన్నపుడు అవి అందిస్తున్న అంశాలను షేర్ చేయకపోయినా, లైక్ అయినా చేయకుండా నిగ్రహం పాటించిన వ్యక్తి నాకు ఇంతవరకు కనిపించలేదు. ఒక వ్యక్తిని  ఒక  కార్యానికి  ప్రేరేపించడంలో సోషల్ మీడియాకు ఉన్న శక్తి ఈ యుగంలో మరే ఐడియాలజీకి లేదు. సోషల్ మీడియాలో ఉంటూ ఎంగేజ్ కాకుండా ఉండటం చాలా కష్టం. నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్  నలభై సంవత్సరాల పాటు కలం పట్టనే లేదు. రిటైరయిన పదేళ్ల తర్వాత ఈ మధ్య ఫేస్ బుక్ లో కవిత్వం రాస్తున్నారు. తాను రాయడమే కాదు, రాసినవన్నీ చదువుతున్నారు. వాటిని లైక్ చేస్తున్నారు. కామెంట్స్ పెడుతున్నారు. షేర్ చేస్తున్నారు. ఈ వ్యాపకం చూస్తే ఆయన యూనివర్శిటీలో క్లాస్ రూంలో  ఎంతసేపు గడిపారో ఇపుడు ఫేస్ బుక్ లో కూడా అంతేసేపు గడుపుతున్నారనిపిస్తుంది. అందునా 75 సంవత్సరాల వయసులో. ఇదే విధంగా ఒక హోటల్ యజమాని 85 సంవత్సరాల వయసులో తనకు ఇష్టమయిన ప్రతి విషయాన్ని స్నేహితులతో బంధువులతో వాట్సాప్ , ఫేస్ బుక్ లలో షేర్ చేయడం నాకు తెలుసు. పిల్లలు కొనిచ్చిన స్మార్ట్ ఫోన్ లోకి తొంగిచూడకుండా ఒక్క నిమిషం కూడా గడపలేని పరిస్థితి ఆయనది. చాలా మంది వయోవయవృద్ధులు ఇపుడు వాట్సాప్, ఫేస్ బుక్ లు చూస్తూ కామెంట్ చేస్తూ, లైక్ కొడుతూ, షేర్ చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇదే సోషల్ మీడియా గొప్పతనం.

ఈ గుణాన్ని సొమ్ము చేసుకునేందుకు గూగుల్ ‘బులెటిన్ ’ యాప్ తెస్తున్నది.  ఇరుగుపొరుగున జరిగే ఏ విషయం గురించయినా సరే ఎరయినా రాయవచ్చు, వీడియో తీసి పోస్టు చేయవచ్చు. హైపర్ లోకల్ (ఇరుగుపొరుగు) సమాచారాన్నంతా గూగుల్ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. పూర్వం ‘నైబర్ హుడ్ జర్నలిజం’ పేరుతో ప్రింట్ మీడియాలో ఇలాంటి ప్రయత్నం జరిగింది. నైబర్ హుడ్ పేపర్లు చాలా మటుకు ఉచితంగా అందిస్తారు. ఈ విషయాన్నే సోషల్ మిడియా యుగానికి తీసుకెళ్లేందుకు గూగుల్ పెద్ద ఎత్తున పనిచేస్తున్నది. దీనికోసం ప్రపంచవ్యాపితంగా ఉచితంగా ఆసక్తి ఉన్నవాళ్లకు శిక్షణ కూడా ఇస్తున్నది. సిటిజన్ జర్నలిజం విశ్వరూపం అపుడు కనబడుతుంది. ఇపుడిది సూచన ప్రాయంగా కనిపిస్తుంది. ‘బులెటిన్’తో, సిటిజన్ జర్నలిస్టుల సైన్యం సహకారంతో గూగుల్ జర్నలిజం స్వరూపం మార్చేయాలనుకుంటున్నది. అపుడు దీనిని జర్నలిజం లాగా  ‘గూగులిజం’ అనవచ్చా?

సోషల్ మీడియా వినియోగదారుని సైకాలజీనే మార్చేస్తుంది. సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తూనే మీరు మీ వయసు  మీ భూప్రపంచంలోని మీ అనుభవాలు మర్చిపోయి సోషల్ మీడియా కల్చర్ కి అలవాటు పడిపోతారు. సొషల్ మీడియాకు ఒక ఐడియాలజీ ఉంది. దానికి మీరు దాసోహమంటారు. మీరేమిటో, మీ వయసేమిటో, మీ హోదా ఏమిటో  అన్ని మర్చిపోయి అక్కడి ప్రజలతో మమేకం అయిపోతారు, వారి ఆచారాలూ అలవాట్లని ప్రశ్నించకుండా జీర్ణించుకుంటారు. అక్కడి కార్యకలాపాలలో భాగస్వామి అవుతారు.  వినియోగదారుడి అనుభవం (యూజర్ ఎక్స్ పీరియన్స్ –UX) అంటే ఇదే. దీనికి ఇంటర్నెట్ లో చాల ప్రాముఖ్యం ఉంటుంది. మీ సైకాలజీని లక్ష్యంగా పెట్టుకుని చేసే దాడియే యూజర్ ఎక్స్ పీరియన్స్. దీనికోసం వస్తున్నదే గూగల్ బులెటిన్.

ఇపుడు మళ్లీ మొదటికి వెళ్దాం. ఒక మనిషి రోడ్డు మీద వెళ్తూ  ఒక కుక్కను కొరికాడు- ఇది పూర్తిగా హైపర్ లోకల్ స్టోరి. న్యూస్  నిర్వచనానికి పనికొచ్చినా, ఇది న్యూస్ పేపర్ కి పెద్దగా పనికొచ్చే స్టోరీ కాదు ఈ రోజుల్లో. ఒక వేళ పనికొచ్చినా అది ఏమూలో ఒక పెట్టెలో ఇరుక్కు పోయి ఉంటూంది. సోషల్ మీడియా యుగంలో భారీగా విస్పోటనం చెందే ఘటనలివే. సాధారణంగా ప్రతికల్లో వచ్చే వార్త అయిదారు ప్రశ్నలకు (ఏమిటి, ఎక్కడ, ఎపుడు, ఎందుకు, ఎవరు, ఎలా) సమాధానం చెబితే వార్త గా సంపూర్ణమవుతుందని నమ్మకం. సోషల్ మీడియా కూడా ఈ ప్రాథమిక సూత్రాన్నే అనుసరిస్తుంది. ఇది చాలా విస్తృత స్థాయిలో జరుగుతుంది. ‘Newsworthiness of the story would be closely connected to the voluntary behavior of the audience and would shift according to the needs of that audience. The story would then erupt into a user-driven multimedia package with nearly infinite incarnations involving perhaps one journalist, several staffers, freelancers, citizen journalists, bloggers and consumers providing different informational pieces of the totally puzzling experience అని Michele Weldon అనే మీడియా సోషియాలజిస్టు మొత్తం వ్యవహారాన్ని ఒక పేరా లో క్లుప్తంగా చెప్పారు. ఇదెలా జరుగుతుందో చూద్దాం.

ఒక రోజు ఏదో ఒక న్యూస్ పోర్టల్ లోకి వినియోగదారుడు (సోషల్ మీడియాలో పాఠకుడు అనే మాట లేదు.Users లేదా consumers లేదా audience  మాత్రమే ఉన్నారు) ప్రవేశిస్తాడు. ఆయనకు  ‘కుక్కను కరిచిన మనిషి’ అని  బ్లూ రంగులో అండర్ లైన్ చేసిన శీర్షిక కనిపిస్తుంది. అంతే కాదు, అది మిణుకు మిణుకుమంటూ యూజర్ ని తన వైపు గుంజేలా ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తూనే ఈ వార్త విశ్వరూపం కనిపిస్తుంది. మనిషి కుక్కను పట్టుకుని కొరికేస్తున్నపుడు అక్కడ దారిన పోతున్న ఒక కుర్రాడు స్మార్ట్ ఫోన్ నుంచి తీసిన వీడియో మొదట మీకు కనిపిస్తుంది. అపైన మరొక వీడియో- కుక్కను కొరికి పారిపోతున్న మనిషి రియాల్టీ టివి షో లాగా వెంబడించి రోడ్డంతా కల్లోలం సృష్టించి, చివరకు పట్టుకున్న పోలీసు గురించిన వీడియా. ఇది ఆ ఏరియాలో ఉన్న సిసి కెమెరాల్లో రికార్డయిన పుటేజి. పోలీసుల కంట్రోల్ రూం నుంచి లీకయిన వీడియో క్లిప్. ఈ లోపు గాయపడి రక్తం మడుగులో ఉన్న కుక్కని చూసి తల్లడిల్లి పోతున్న యాజమాని (ముఖ్యంగా మహిళ) రోదన ఆడియోని పోస్టు చేస్తారు.  దానికింద మరొక వార్త.  గాయ పడిన కుక్కను ఎపుడు కొన్నది, ఎలా పెంచింది, ఏమి తినిపించింది, ఎంత ప్రేమగా చూసుకున్నది వగైరా వివరాలతో యాజమాని సుదీర్ఘ ఇంటర్య్యూ ఉంటుంది. ఇంతలో ఈ సైట్ లో నుంచి ఫోటో లను వీడియోలను కాపి చేసుకుని ఆ కుక్క బ్రీడ్, దాని ధరలు, దాని పుట్టు పూర్వోత్తరాలు, అది ఏ దేశం నుంచి ఇండియా వచ్చింది, ఎపుడొచ్చింది… మరొక వ్యక్తి  ఫేస్ బుక్ లో పోస్టు చేస్తాడు. ఈ లోపు మరొకరు చరిత్రలో మనిషి కుక్కను కరిచిన సంఘటనల వివరాలన్ని సేకరించి ఒక బ్లాగ్ లో పోస్టు చేస్తాడు.అంతలోనే మరొక చానెల్ వాళ్లు కుక్క ప్రవర్తన మీద కుక్క యజమాని ఇరుగుపొరుగు వారిని ఇంటర్వ్యూ చేసి, కుక్క క్రమశిక్షణతో ఉండిందా లేక కట్టుబాట్లు తప్పి దారిన పోయే వారి సతాయిస్తూ ఉండిందా అనే విషయాన్ని వివరంగా చూపిస్తారు. ఈ లోపు ఒక యు ట్యూట్ చానెళ్లో  మనిషిని కుక్కను కరిచిన అరుదైన సంఘటన మీద ఒక వెటర్నరీ డాక్టర్, ఒక మనుషులు డాక్టర్, ఒక సైకాలజిస్టు, ఒక సోషియాలజిస్టు, ఒక క్రిమినాలజిస్టు, ఒక పొలిటికల్ కామెంటేటర్, లోకల్ డిసిపి లను లైన్ లో ఉంచి డిబేబ్ నిర్వహిస్తారు. అది వైరల్ అయిపోతుంది. ఈ లోపు మరొక వైబ్ సైట్ లో కుక్కను కరిచిన మనిషితో ఇంటర్వ్యూ ప్రత్యక్ష మవుతుంది. ఇందులో కుక్కను కరిచేందుకు దారితీసిన పరిస్థితులను గ్రాఫిక్ డిటైల్స్ తో పోస్టు చేస్తారు.  ఆయన ఎన్ని గంటలకు ఇంటి దగ్గర బయలు దేరాడు, సంఘటన జరిగిన స్థలానికి ఎన్ని గంటలకు వచ్చాడు, కుక్క ఏ వైపు నుంచి వచ్చింది, అది అతగాడిని ఎందుకు కవ్వించింది, అపుడు అతను ఎలా రియాక్టయ్యాడు, పళ్లతో ఎలా మెడని కొరికాడు అనే వివరాలు అన్ని ఇందులో ఉంటాయి. ఈ దుర్ఘటన తర్వాత ఆ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, మిగతా కుక్కల పరిస్థితి ఎలా వుంది, కొంత మంది కుక్కల వోనర్లతో మాట్లాడి ఒక డిజిటల్ న్యూస్ ఫ్లాట్ ఫామ్ మరొక స్టోరి అందిస్తుంది. ఈ లోపు వాట్సాప్ లో ఆ వూర్లో మనిషి కుక్కను కరచిన తొలిసంఘటన ఫోటో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. దాని వెబ్ సైట్స్ ఆబగా రిప్రొడ్యూస్ చేసి కుక్కలకి, మనిషికి ఘర్షణ చాలా కాలంగా ఉందని చెబుతాయి. #ManBitesDog  ట్విట్టర్ లో హ్యాష్టాగ్  మొదలవుతుంది. ఇందులో  ఆ ఆగంతకుడు కుక్కను ఎత్తి పట్టుకుని మెడమీద కొరుకుతున్నప్పటి క్లోజ్ అప్ ఫోటో ఎవరో పోస్టు చేస్తారు. అది వైరలవుతుంది. 24 గంటలలో మనిషికి కుక్కను కరచిన ఒక చిన్న హైపర్ లోకల్  సంఘటన 120లక్షల వ్యూస్ సాధించింది.ఇది మళ్లీ ఒక వార్తగా న్యూస్ పోర్టల్స్ లో అవే ఫోటోలతో, వీడియోలతో గ్రాఫిక్స్ ప్రత్యక్షమవుతుంది.  MySpace, Facebook, Whatsapp, Instagram, Flickr అన్ని వైపుల నుంచి డేగల్లా వాలి మనిషి కుక్కని కరిచాడనే సంఘటనని వీడియో, ఫోటో, గ్రాపిక్స్ రూపాలలో ప్రపంచమంతా వ్యాప్తి చేస్తాయి. సోషల్ మీడియాలో సమాచార ప్రవాహం ఇలా ఉంటుంది. More about less అంటే ఇదే. బాగా అతిచేయడం అని మనం అనుకుంటుంటాం కదా అదే ఇది. అది ఈ యుగ ధర్మం.

సమాచార సేకరణ పనిముట్లు పూర్వం కొందరి చేతుల్లోనే ఉండేవి. ఇపుడవి సర్వత్రా వ్యాపించాయి. ఏదైనా సంఘటన జరిగినపుడు ఎవరూ విలేకరి కోసం ఎదురు చూడరు. అలాగే రేపటి వార్తా పత్రిక కోసమో తదుపరి టివి న్యూస్ బులెటీన్ కోసమో ఎవరూ ఎదురుచూడరు.  సంఘటన జరిగినపుడు ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇపుడు జర్నలిస్టే. ఎన్ని వీడియో క్లిప్స్, ఫోటోలు వస్తాయో లెక్కేలేదు. టివి జర్నలిస్టులు, జర్నలిస్టులు ఆ స్పాట్ కు వచ్చే సరికే వార్త విస్పోటనం చెంది ఉంటుంది. అందుకే ఇపుడు పత్రికలు, టివిలు కూడా సోషల్ మీడియా నుంచి వార్తలను ఎత్తిపోస్తున్నాయి. లేదంటే, ఇంకా ముందుకు వెళ్లి లోతైన పరిశోధన చేయాలి. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఆ  ‘ఏరియా’లో ప్రవేశించేందుకు, ప్రతిమనిషిని విలేకరిని చేసేందుకు గూగుల్ ‘బులెటిన్’ ను తెస్తున్నది.

-జింకా నాగరాజు

జింకా నాగరాజు

జింకా నాగ రాజు సుప్రసిద్ధ పాత్రికేయులు, ప్రింట్, విజువల్ మీడియాలో  చిరకాలం అనుభవం ఉన్న ప్రజా ప్రేమి

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.