తిరిగి వినిపిస్తున్న మార్టిన్ (1968) మాట

 

యాభై ఏళ్ళ క్రితం (1968) మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన సందేశం అమెరికాలో మళ్లీ వినిపిస్తోంది.  ఆగిపోయిందనుకున్న సివిల్ రైట్స్ ఉద్యమ చరిత్ర కొనసాగుతున్నది. కొత్త చేతుల్లో చరిత్ర నిర్మాణం కొనసాగుతున్నది.

రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ రూపొందించిన  ‘’పూర్ పీపుల్స్ క్యాంపైన్’ (poor people’s campaign) స్ఫూర్తితో,  ‘’న్యూ పూర్ పీపుల్స్ క్యాంపైన్” అని ఏర్పడిన కూటమి కింద వేల మంది ప్రజలు రాజధాని నగరం వాషింగ్టన్ డి.సి.లో జూన్ 23 న పెద్ద ప్రజా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు  ‘నార్త్ కరోలినా’ కు చెందిన రెవరెండ్ విలియం బార్బర్, ‘న్యూయార్క్’ కు చెందిన రెవరెండ్ డాక్టర్. లిజ్ థోహరిస్ నాయకత్వం వహించగా మార్టిన్ లూథర్ కింగ్ తో కలిసి పనిచేసిన రెవరెండ్ జెస్సి జాక్సన్ వంటి వారు ప్రదర్శనలో పాల్గొన్నారు.

పేరు వుపయోగించుకోడమే కాదు, మార్టిన్ లూథర్ కింగ్  లేవనెత్తిన సమస్యలను ప్రముఖంగా పేర్కొంటున్నది ‘న్యూ పూర్ పీపుల్ క్యాంపైన్’. అదే అహింసా పద్ధతుల్లో సహాయ నిరాకరణ విధానాలనూ అనుసరిస్తున్నారు దీని నాయకులు. గత రెండేళ్ళుగా  దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్త్రుతంగా పర్యటించి, వందలాది ప్రజా సంఘాలనూ, నాయకులనూ కూడగట్టగలిగారని అంటున్నారు. జూన్ 23 న వాషింగ్టన్ డి.సి. లో రాలీ నిర్వహించడానికి ముందు 40 రోజుల పాటు(ఆరు వారాలు) అనేక కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహించినట్టు తెలుస్తున్నది. ప్రతి సోమవారం ఆయా రాష్ట్రాల్లో లేజిస్లేచర్ బిల్డింగుల ముందు సహాయ నిరాకరణ (civil disobedience) పాటించడంతో అనేక చోట్ల అరెస్టులు జరిగాయనీ, దేశవ్యాప్తంగా 3,000 మంది అరెస్టులకు గురయ్యారనీ వార్తలు తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా అనేక నగరాల్లో  పర్యటిస్తూ, రెవరెండ్ విలియం బార్బర్ అనేక చోట్ల అరెస్టులకు గురయ్యారని అంటున్నారు .

ఒహాయో రాష్ట్రంలో ఓటర్స్ లిస్టు నుంచి ఓటర్లను తొలగించిన కేసు విషయంలో, సుప్రీం కోర్టు ఓటు హక్కలపై ఎదురుదెబ్బ తీస్తూ తీర్పు వెలువరించిన నేపధ్యంలో, కోర్టు మెట్ల మీద నిలబడి మే 11 న  నిరసన తెలిపినందుకు విలియం బార్బర్ను, లిజ్ థోహరీస్ తో పాటు  మరో తొమ్మిది మంది నాయకులను అరెస్టు చేసి చేతులకు బేడీలు వేసి జైలుకు తీసికెళ్ళారు. వారిని ఒక రాత్రంతా బొద్దింకలున్న సెల్ లో నిర్బంధించి, మరునాడు విడుదల  చేసినట్టు తెలిసింది.

పౌర హక్కులు (సివిల్ రైట్స్) సాధించుకున్నంత మాత్రాన ఆఫ్రికన్-అమెరికన్ ప్రజల జీవన పరిస్థితులు మెరుగు పడవని గుర్తించి, ఆర్థిక న్యాయం (economic justice) కోసం ఎస్.సి.ఎల్. సి. ( సదరన్ క్రిస్టియన్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్) తో కలిసి, ‘పూర్ పీపుల్ క్యాంపైన్’ కార్యక్రమాన్ని మార్టిన్ లూథర్ కింగ్ రూపొందించారు. ఆఫ్రికన్- అమెరికన్లనే గాక, ఆసియా- అమెరికన్లనూ, హిస్పానిక్ అమెరికన్లనూ, నేటివ్ అమెరికన్లనూ కలుపుకుని, పేదరికం నిర్మూలన ధ్యేయంగా ఆ కార్యక్రమం ప్రకటించారు.   

రేసిజం, మిలిటరిజం, ఆర్థిక అసమానతలు ముప్పేటగా ప్రజలకు వినాశకారిగా వున్నాయని, వీటికి వ్యతిరేకంగా అహింసాయుతంగా పోరాడి “విప్లవాత్మక విలువలు’’ సాధించుకోవడానికి  ‘పూర్ పీపుల్స్ క్యాంపైన్’ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన హత్యకు ముందు 1968, జనవరి 16 న ప్రకటించారు. ఈ కార్యక్రమం మే 15న ప్రారంభమవుతుందని ప్రకటించారు. వాషింగ్టన్ మాల్ వద్ద చెక్కలతో, ప్లాస్టిక్ షీట్లతో నిర్మించిన తాత్కాలిక టెంట్లు వేసి నిరసన శిబిరం నిర్వహించాలనుకున్నారు. 3,000 మంది వుండడానికి వీలుగా షాంటి టౌన్ ను నిర్మించారు. ఏప్రిల్ 4న మార్టిన్ లూథర్ కింగ్ హత్యకు గురయ్యాడు. అయినప్పటికీ అనుకున్న ప్రకారం రాల్ఫ్ అబెర్నాథి నాయకత్వంలో మే 15న తాత్కాలికంగా నిర్మించిన టెంట్లలో ‘పూర్ పీపుల్ క్యాంపైన్’  కొనసాగించారు. షాంటి టౌన్ లోని అరకొర సౌకర్యాలు, అరెస్టులు, ప్రలోభాలు, నాయకుల మధ్యనే భిన్నాభిప్రాయాలు వంటి అనేక కారణాలతో 40 రోజులకు అంటే 6 వారాల తరువాత ‘ పూర్ పీపుల్ క్యాంపైన్’ ఆగిపోయింది. ఆగిపోయింది అనడం కన్నా హత్య చేయబడింది అనడం సరైంది.

ఈ 50 ఏళ్ళలో సమస్యలు పరిష్కారం కాకపోగా అంతకంతకు పెరగడంతో పేద ప్రజల బ్రతుకులు దుర్భరమయ్యాయి. రేసిజం, ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు తనకు ముగింపు లేదని ‘న్యూ పూర్ పీపుల్ క్యాంపైన్‘ కొత్త శక్తులను కూడగట్టుకుని మరోసారి ప్రజల ముందుకు వచ్చింది.

సమస్యలు ఒకటి కాదు, రెండు కాదు. వందలు, వేలు. ఏదీ దేనికది విడివిడిగా లేదు. ప్రతి సమస్య మరో సమస్యతో ముడిపడి వుంది. అలా అన్ని సమస్యలు  జాతీయ ( దేశ) సమస్యలుగా ముందుకు వస్తున్నాయి. ఇవి ఏ ఒక్క దేశ సమస్యలుగానో లేవు. ఇవి అన్ని దేశాలకూ సంబంధించిన సమస్యలు. దేశమంటే ప్రజలు. దేశమంటే మార్కెట్ కాదు. దేశ సమస్యలంటే ప్రజల సమస్యలే. మార్కెట్ సృష్టించిన, సృష్టిస్తున్న సమస్యలు. ‘మరో వైపు ప్రజల్ని సంఘటితపరిచే శక్తులు బలహీనమైపోయాయి. తమకిక ఎదురు లేద’ని కార్పొరేట్ శక్తులు భావించాయి. ప్రజలు నోరు తెరిస్తే జైళ్ల సంఖ్య పెరుగుతున్నది.

‘అమెరికా గొప్ప’దని (Ametica the great), అమెరికాను తిరిగి ఉన్నత స్థానంలో నిలబెడతానని, ఉద్యోగాలు కల్పిస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచాడు ఇప్పటి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. అంటే అమెరికా గొప్పగా లేదని, నిరుద్యోగం ప్రబలిందని, ప్రజలు పేదరికంలో వున్నారని రెండేళ్ళ క్రితమే అమెరికా దేశ పరిస్థితిని వెల్లడించాడు ట్రంప్.

‘న్యూ పూర్ పీపుల్ క్యాంపైన్’ ప్రకటించిన అంశాలు – రేసిజం, మిలిటరిజం, పేదరికం-ఆర్థిక అసమానతలు, పర్యావరణ విధ్వంసం, అన్నీ మార్టిన్ లూథర్ కింగ్ ప్రకటించిన అంశాలనే పోలి వున్నాయి. 50 ఏళ్ళ నాటికన్నా నేడు దేశంలో రేసిజం పెచ్చరిల్లింది. అమెరికా పౌరులయిన పేద ప్రజల ఓటు హక్కులు తొలగించబడుతున్నాయి. ఓటు హక్కులు నిరాకరించబడిన  పౌరుల సంఖ్య అనేక రాష్ట్రాల్లో లక్షల్లో వుంటున్నది. పేదరికం, ఆర్థిక అసమానతలు 50 ఏళ్ల నాటికన్నా పెరిగాయి. 140 మిలియన్ల (14 కోట్ల) మందికి కనీసవేతనాలు ( గంటకు 15 డాలర్లు) లభించడం లేదు. అమెరికాలో 40 మిలియన్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నారని యు.ఎన్. ప్రకటించింది. లక్షలాది మందికి ఆరోగ్య పథకం లభించడం లేదు. వేలాది మందికి గృహ వసతి కూడా లేదు. మిలిటరిజం  కూడా1968 కన్నా పెరిగింది. వియత్నాం యుద్ధం కన్నా నేడు జరుపుతున్న యుద్ధాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నది అమెరికా. డాలర్ లో 54 సెంట్లు యుద్ధాలకు, 15 సెంట్లు ప్రజా సౌకర్యాలకు వెచ్చిస్తున్నదని ఒక అంచనా. మరో పక్క అదుపు లేకుండా పర్యావరణ విధ్వంసం జరుగుతున్నది. ధనికులకు పన్నులు తగ్గించి ప్రజా సౌకర్యాలకూ, పబ్లిక్ పాఠశాలలకూ నిధుల కొరత సృష్టిస్తున్నారు. ధనికులకూ, పేద ప్రజలకూ మధ్య ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగాయి.

1968లో ప్రకటించిన ‘పూర్ పీపుల్ క్యాంపైన్’  అజెండానే తీసుకుంటూ మరికొన్ని అంశాలను తమ కొత్త అజెండాలో చేర్చారు రెవరెండ్ విలియం బార్బర్, రెవరెండ్ లిజ్ థోహరిస్. రేసిజం, మిలిటరిజం, పేదరికం-ఆర్థిక అసమానతలు, పర్యవరణ విధ్వంసం, వక్రీకరించబడుతున్న నైతిక వృత్తాంతాలను ఎదుర్కోవడం – ప్రధానంగా ఈ ఐదు అంశాలను  తమ ఎజెండాలో పేర్కొన్నారు. ఆరు వారాల్లో ఒక్కో వారం ఒక్కో అంశంపై సభ్యులకు అవగాహన తరగతులు నిర్వహిస్తూ, ప్రతి సోమవారం లెజిస్లేచర్ బిల్డింగ్సు ముందు సహాయనిరాకరణ, నిరసన కార్యక్రమాలు నిర్వహించామని అంటున్నారు. ఈ అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమని గుర్తించిన వీరు ఒక వారం పూర్తిగా ఈ అంశంపై శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అన్ని రంగుల ప్రజలను, మతాల ప్రజలను సమీకరించామని, పేదరికం ఆఫ్రికన్- అమెరికన్లే గాక వైట్, బ్రౌన్, ఎల్లో, రెడ్ అన్ని రంగుల ప్రజలూ అనుభవిస్తున్నారని, అన్ని రకాల ప్రజా సంఘాలను, యూనియన్లను సమీకరించామని ప్రకటించుకున్నారు.   

అలబామా నుంచి, అలస్కా వరకు, కాలిఫోర్నియా నుంచి బోస్టన్ వరకు దేశవ్యాప్తంగా వేలాది మందితో చివరి రోజు జూన్ 23న వాషింగ్టన్ డ్.సి. లో  ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనాల కోసం, ఓటు హక్కు కోసం, ఇంటి వసతి కోసం, నీటి కోసం, ఉపాధి కోసం, జెండర్ సమానత్వం కోసం, LGBTQ హక్కుల కోసం, వైద్యం, విద్య కోసం, ఇమ్మిగ్రేషన్ ప్రజల హక్కుల కోసం, మెక్సికో, అమెరికా సరిహద్దులో గోడ కట్టడాన్ని, తలిదండ్రుల నుంచి  వేరు చేసిన పిల్లల్ని తిరిగి తలిదండ్రులకు అప్పగించాలని – ఇలా సవాలక్ష సమస్యలపై నినదించారు.

ప్రజా ప్రదర్శనకు ముందు రెవరెండ్ విలియం బార్బర్, రెవరెండ్ లిజ్ థోహరిస్, రెవరెండ్ జెస్సి జాక్సన్ తో పాటు మరి కొందరు నాయకులు  మాట్లాడారు. రెవరెండ్ లిజ్ మాట్లాడుతూ, ”ఇది ఆరంభం మాత్రమే. 50 ఏళ్ళ తరువాత అందరం కలుసుకున్నాం, ఇంక మనం ఎన్నో పనులు చేయాల్సివుంది.” అని ప్రకటించారు.  ఎక్కడ విడిపోయారో, ఎక్కడ ఉద్యమం హత్య చేయబడిందో అక్కడే తిరిగి పునరుజ్జీవం పొందినట్టు ఒక ప్రతీకగా ఈ 40 రోజుల కార్యక్రమం నిర్వహించారని అనిపిస్తుంది. ఎక్కడయితే వ్యక్తులుగా విడిపోయారో, అక్కడే తిరిగి కలుసుకోవడానికి అన్నట్టు ఎక్కడెక్కడి నుంచో వయసు పైబడిన వారు కూడా వచ్చారు. తాము తిరిగి కలుసుకున్నామని, తమకు గొప్ప చారిత్రక నేపధ్యం వుందని, తాము అనేక సమస్యలపై కలిసికట్టుగా ప్రశ్నిస్తామని గొప్ప ఆత్మ విశ్వాసంతో ప్రకటించారు రెవరెండ్ విలియం బార్బర్ – క్రీస్తు నైతిక సంప్రదాయాలను పాటిస్తామని ప్రకటిస్తూనే, కనీస వేతనాల కోసం, 8 గంటల పనిదినం కోసం పోరాడిన చికాగో కార్మికులకు వారసులమనీ, అపాచీ, ఇంకా అనేక నేటివ్ అమెరికన్ నాయకులూ, అమెరికా యూనియన్ల జాతీయ నాయకుడు సీజర్ చావేజ్, మార్టిన్ లూథర్ కింగ్, రోజా పార్క్, ఆండ్రూ గుడ్ మాన్, ముస్లిం నాయకుడు మాల్కం ఎక్స్, ఇలా ఎందరో తమకు ఆదర్శమని ప్రకటించుకున్నారు.

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.