ప్రజా పోరాట చరిత్రే అక్కడ టూరిస్టు ఆకర్షణ

ప్రజలను,, ప్రజా యోధులను కాపాడిన క్యూ చి టన్నెల్స్

  ప్రస్తుతం ప్రపంచం లో వున్న ఐదు ”కమ్యూనిస్ట్’ దేశాలలో మేము చూసిన మొదటి దేశం వియత్నాం . దేశమంతా కాకుండా వియత్నాం  మాజీ రాజధాని  హో చి మిన్ (Ho chi minh ) నగరం దాని చుట్టుపక్కల కొన్ని గ్రామీణ ప్రాంతాల వరకు   మా పర్యటన సాగింది. ఆ పరిమిత పర్యటనలోనే మాకు విభిన్నమైన విషయాలు తెలిశాయి. వియత్నాం  ఉత్తర  ప్రాంతం లోని హో చి మిన్ సిటీ ని ఒకప్పుడు సైగాన్ (Saigon) అనేవారు. ఇప్పటికీ అక్కడి జనం ఎక్కువ మంది సైగాన్ అనే  అంటారు. వియత్నాం   ప్రస్తుత రాజధాని హనోయి (Hanoi) కంటే హో చి మిన్ నగరానికే ఎక్కువ ప్రాచుర్యం వుంది. వ్యాపారం మొత్తం హో చి మిన్  లో కేంద్రీకృతమైంది. వీటన్నిటికంటే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా వ్యతిరేక వియత్నాం సమరానికి కేంద్రంగా నిలిచిన నగరం కూడా  ఇదే.

మా వియత్నాం  పర్యటనకు  అంతకు మునుపు మేము పోయిన కౌలాలంపూర్, సింగపూర్  పర్యటనలకు   ప్రధాన తేడా ‘ప్రపంచీకరణ’. కౌలాలంపూర్, సింగపూర్ లలో  ప్రధాన పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా షాపింగ్ మాల్స్ లేదా గ్లోబల్ స్పేసేస్ (Global Spaces). నిజమైన మలేసియా పర్యాటక ప్రదేశాలలో ఎక్కడా కనిపించదు. మనకు సంబంధంలేని ఓ కొత్త ప్రపంచం లోకి వచ్చినట్లుంటుంది.  కానీ హో చి మిన్ నగరం లో మాకు ప్రధాన కూడలిలో కూడా వియత్నాం కనిపించింది. చివరకు పర్యాటకులు  చూసే ప్రదేశాలు కూడా  వారి చరిత్రకు సంబంధించినవే. వారి గ్రామీణ జీవన విధానం, గ్రామీణ పరిశ్రమలు, హస్తకళలే ప్రధాన పర్యాటకాలు. బాంగ్ కాక్  లో ఎం బి కె మాల్ ( M B K mall ) ప్రధాన టూరిస్ట్ కేంద్రమైతే హో చి మిన్ సిటీ ప్రధాన పాపులర్ మార్కెట్ సైతం… ఎక్కువగా  చిన్న వ్యాపారస్తులు వుండే బెన్ తాన్హ మార్కెట్. అలాగని ప్రపంచీకరణ సోకని ప్రాంతమని చెప్పలేం. బార్ లు, నది  మీద  క్రూజ్ (cruise ) టూర్  కొంత వరకు పర్యాటకులను ఆకర్షించడానికి వున్నాయి. నగరం మొత్తం చిన్న మోటార్స్ మీద నడుస్తున్నట్టు ఉంటుంది. తొంబైశాతం చిన్న మోటార్స్ (Two wheelers ). కార్లు తక్కువగా కనిపిస్తాయి. పర్యాటక ప్రాంతాలలో కాకుండా నగర సాధారణ  జీవన ప్రాంతాలలోని ఏ హోటల్ కు పోయినా  ప్రతి ఒక్కరికి  ఉచితంగా మొదట గ్రీన్ టీ (green tea) ఇస్తారు (మన దేశం లో పోగానే నీళ్లు ఇచ్చినట్లు ).
వియత్నాం  చూసే ప్రతివారు తప్పక చూసేది, ఖచ్చితంగా చూడవలసినది  క్యూ చి టన్నెల్స్ (cu chi tunnels). హో చి మిన్ నగరం సరిహద్దుల్లోని చిన్న ప్రాంతం క్యూ చి. అక్కడ అమెరికన్ సైనికుల మీద మెరుపు  దాడి చేయడానికి కమ్యూనిస్ట్ కార్యకర్తలు భూమి లోపల  మనిషి పట్టేటంత చిన్న చిన్న సొరంగాలు తవ్వుకొని రోజుల తరబడి అందులోనే వుంటూ అమెరికన్ సైనికులను ముప్పుతిప్పలు పెట్టారు. ఒక్కో సొరంగం కిలోమీటరు కంటే ఎక్కువగా పొడవు  వున్నవి కూడా వున్నాయి. వీటిని ఈ రోజుకు కూడా చూడవచ్చు. శరీరం సహకరిస్తే ఆ సొరంగాల లో  మనం కూడా కొంచెం దూరం ప్రయాణం చేయవచ్చు. అయితే క్యూ చి సొరంగ యుద్ధంలో వియాత్నం కమ్యూనిస్ట్ పార్టీ చాలా మందిని కోల్పయింది. మా గైడ్ మాత్రం విజయ గాథ గానే మాకు చెప్పాడు.

మెకాంగ్ నది దక్షిణ తూర్పు దేశాలలో ప్రధానమైనది. టిబెట్ లో పుట్టి చైనా దాటి వియాత్నం, లాఓస్ (Loas) కంబోడియా , థాయిలాండ్, బర్మా వరకు కూడా ఇది ప్రధానమైన నది. ఒక విధంగా అది వారి జీవనాడి. మేము పోయిన మెకాంగ్ డెల్టా రివర్ టూర్  (Mekong delta river tour ) ఆ నదికి  సంబంధించినదే. హో చి మిన్  నుండి దాదాపు గంటన్నర బస్సు ప్రయాణం, ఆ తదనంతరం విడతల వారీగా బోటు ప్రయాణాల తరువాత మేము నది పారివాహక ప్రాంతం లోని వ్యవసాయ, చేతివృత్తుల పరిశ్రమలను నదీ పారివాహక జీవితాన్ని చూశాం.

వియత్నాం ప్రత్యేకం తియ తీయని ఆవిరి దోసెలు

ప్రయాణం లో మేము  మొదట చూసిన చోట కొంత మంది  ఆవిరి దోసెలు చేస్తూ  కనిపించారు. అవి మన దోసెలలాగా  కాకుండా  మన అప్పడాలంత పలుచగా  తియ్యగా వున్నాయి. ఆ తరువాత ఓ పెద్ద వ్యవసాయ క్షేత్రం లోకి పోయి ప్రాంతీయంగా పండే పళ్ళ తోటలను చూసాం (మా భోజనాలు అక్కడే కానిచ్చాం).  అక్కడ మరో సారి బోటు ప్రయాణం తరువాత కొబ్బరి ఆధార పరిశ్రమలు, అలాగే  తేనెటీగల  పరిశ్రమలను పరిచయం చేయటంతో పాటు అక్కడి ఆచార వినోద కార్యక్రమాలను పరిచయం చేశారు.  ఆ తరహా మరెన్నో కార్యక్రమాల తరువాత మమ్మల్ని స్వయంగా గుర్రపు బగ్గీ నడపటం చేయమన్నారు,  చిన్న బోట్  నడపటం లాంటివి మనచేత చేయించడం టూర్ మొత్తానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. మాకు ఇచ్చిన భోజనం కూడా వియత్నాం సాంప్రదాయిక వంటలతో నిండివుంది. ఉడికించిన చేపలను,చిన్న రొయ్యలను   బియ్యంతో చేసిన పల్చటి దోస లాంటిది  కిల్లి లాంటి దాంట్లో  చుట్టిఇవ్వడం… చాలా తమాషాగా ఉంటుంది. అందులో ఉప్పు కారం రెండు తక్కువే.

ఆనాడు శత్రువును భయపెట్టిన ఒక సాధనం
చివరిరోజున మేము “వార్ మెమోరియల్ మ్యూజియమ్” ఎంచుకొన్నాము. దాదాపుగా ఇరవై సంవత్సరాలు సాగిన అమెరికా-వియాత్నం యుద్ధం రెండు దేశాల చరిత్రలలో ఖచ్చితంగా మరువలేని ఘట్టాలు. అమెరికాకు చేదు గుర్తయితే వియాత్నం  కు  విషాదం తో కూడిన విజయ చిహ్నం. వియాత్నం ప్రజల మీద అమెరికన్ పాలకుల కిరాతక చేష్టలు చివరకు అమెరికా ప్రజలే అసహ్యహించుకొనేటంత దారుణంగా వున్నాయి. అలాగే, వియాత్నం ప్రజల పోరాటపటిమను ఆ మ్యూసియం లోని  ప్రతి ఫోటో లోను చూడవచ్చు.
వియత్నాం యాత్ర లో  ప్రధానంగా చెప్పుకోవలసినది మా బడ్జెట్. అక్కడ నగరం నడిబొడ్డు దాటి సాధారణ ప్రజలు వుండే ప్రాంతాలకు వెలితే, మన దేశం లోని చాలా ప్రాంతాలకంటే ధరలు తక్కువ లో వున్నాయి ( ఉదాహహరణ కు  కొబ్బరి బొండం  హైదరాబాద్ లో అమ్మే ధర లో  సగం ధరకు మనకు అక్కడ దొరుకుతుంది). ఒక కుటుంబం  హైదరాబాద్ నుంచి ఢిల్లీ చూడటానికి వెళ్ళితే అయ్యే బడ్జెట్ లో సగం బడ్జెట్ లో వియత్నాం ను చూడవచ్చు.

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

1 comment

  • జి.ఎల్.ఎన్ రెడ్డి గారు, ఒక పాత సినిమా (మంచి మనసులు) పాటలోని చరణంలో కవి ఇలా అంటాడు “నా కనులు నీవిగా చేసుకొని చూడు”. అక్కడ సందర్భం కథానాయకుని భార్య అంధురాలు. ఇక్కడి సందర్భంలో పాఠకులందరూ స్వదేశంలోనే ఉన్నా మీరు మాత్రం మీ రచనల ద్వారా విదేశాల్లోని వింతల్నీ, విశేషాల్నీ మా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. అంతకు మించిన మరో విషయం ఏమిటంటే, విదేశీ ప్రయాణం అంటేనే అది భారీ ధనంతో లక్షలతో కూడుకున్న వ్యవహారంగా భావించి భయపడే మధ్యతరగతి కుటుంబీకులకు “మనం కూడా కుటుంబ సమేతంగా విదేశీ ప్రయాణాలు చేయవచ్చు” అనే మనో ధైర్యాన్ని కలుగ చేస్తున్నారు. మీకు శతకోటి ధన్యవాదాలు!
    – విశ్వనాథ శ్రీ నగేష్ కుమార్.

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.