మృతుల, వార్తల దేవుడు హెర్మ్స్

కార్ల్ మార్క్స్:

కొలినిస్చె జేటంగ్ సంచిక 179 లో వ్యాసం

కొలినిస్చె జేటంగ్ పత్రికను… ఇన్నాళ్లు ‘రైన్ ల్యాండ్ మేధావుల పత్రిక’గా కాకపోయినా, కనీసం, ‘రైన్ ల్యాండ్ వాణిజ్య ప్రకటన’గా మన్నించే వాళ్ళం. పత్రిక రాజకీయ వ్యాసాలు … పాఠకులకు రాజకీయాలంటే అసయ్యం పుట్టించడం ద్వారా, చాల సుఖమైన, పారిశ్రామిక స్పందనలతో అలరారే, తరచు బహు సుందరమైన వాణిజ్య ప్రకటనల వైపు మల్లించేవి. రా జకీయాలు, వాణిజ్య ప్రకటనల మధ్య కొనసాగిన ఈ సమతూకం ఇటీవల రాజకీయ పరిశ్రమ ప్రకటనల వల్ల కాస్త అనువు చెడింది. కొత్త రకాన్ని మొదలెడుతున్నప్పుడు మొదట్లో వుండే తడబాటు వల్ల, ఒక వాణిజ్య ప్రకటన ముఖ్య రాజకీయ వ్యాసంగా మారిపోయి, ముఖ్య రాజకీయ వ్యాసం వాణిజ్య ప్రకటనగా మారిపోయింది. రెండోది… రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఒక ఖండన. దాని కోసం పైకం చెల్లించి వుంటే, అది కేవలం వాణిజ్య ప్రకటనే అయ్యుండేది.

(ఈ పేరాలో మేధావులు, ప్రకటనలు; ప్రకటనలు,ఖండనలు అనే పదాల జర్మన్ రూపాల్లో వుండే శబ్ద సారూప్యంతో మార్క్సు ఆడుకున్నాడు. తెలుగులో అది నాకు కుదరలేదు- అను.)

ఉత్తారాదిలో ఒక ఆచారం వుంది. భోజనాలు ఎంత అరకొరగా వున్నా వాటికి ముందు మాంఛి ‘మందు’ పోయిస్తారు. ఉత్తరాది ఆచారానికి అనుగుణంగా, తిండికి ముందు మాంఛి ‘స్పిరిట్స్’ అందించాలనుకుంటున్నాం. ఎందుకంటే… తరువాత వొడ్డించే భోజనంలో, అంటే, ‘కొలినిస్చే జేటంగ్ 179 సంచిక ‘ అరకొర వ్యాసంలో స్పిరిట్ ఏమాత్రం లేదు. ముందుగా, పాఠకులకు లూసియన్ ‘దేవుళ్ల సంవాదాలు’ పుస్తకం అందరికీ దొరికే అనువాదం నుంచి ఒక దృశ్యం అందిస్తున్నాం. మా పాఠకులలో గ్రీకు మనిషి కాని వారొక్కరైనా వుంటారని తలుస్తాం.

హెర్మ్స్, మాయ్యా

లూసియన్ ‘దేవుళ్ల సంవాదాలు’

XXIV. హెర్మ్స్ గారి ఫిర్యాదులు

హెర్మ్స్, మాయ్యా

 

హెర్మ్స్: అమ్మా! మొత్తం స్వర్గ లోకంలో నా కన్న ఎక్కువ వేధింపబడే దేవుడు ఇంకెవరైనా వున్నారా?

మాయ్యా: అలా అనకు, కొడుకా!

హెర్మ్స్: ఎందుకు అనగూడదమ్మా? నేను ఎన్నెన్నో పనులు చేయాలి. ఆన్ని ఒక్కణ్నే చేయాలి, బానిస పనులన్నీ చేయాలి. పొద్దున తెల్లారక ముందే లేచి భోజనాల గది శుభ్రం చేయాలి, కౌన్సిల్ గదిలో ఆసనాలు సర్దాలి, అన్నీ సరిగ్గా వున్నాయో లేదో చూసుకుని, జూపిటర్ పురమాయించే పనులు చేయాలి, రోజంతా తన దూతగా అటు ఇటు పరిగెత్తాలి. ఒళ్ళంతా దుమ్మ కొట్టుకుని తిరిగొస్తానో లేదో, నేనే వెళ్లి ఆయనకు అమృతం పోసి ఇవ్వాలి. అన్నిటి కన్న చిరాకేసేదేమిటంటే, రాత్రి కాసేపు విశ్రాంతి దొరకని వాణ్ని నేనొక్కడినే, రాత్రి మృతుల ఆత్మలను ప్లూటో కి చేర్చి, వాళ్ళ తీర్పు కార్యక్రమంలో అటెండరుగా పని చేయాలి. పగలూ రాత్రి చేసే ఈ పనులన్నీ చాలక, వ్యాయామశాలల్ని నిర్వహించాలి. ప్రజా సమావేశ స్థలాల్లో నిర్వాహకుడిగా ప్రసిద్ధ వక్తలకు ఉపన్యాసాలు నేర్పించాలి. బాబోయ్, ఇన్ని పనుల్లో సతమతమయ్యే నేను, అన్నిటికీ మించి, ఈ మృతుల వ్యవహారాలన్నీ చూడాలి.

ఒలింపస్ నుంచి బహిష్కరించినప్పటి నుంచి, హెర్మ్స్ ఆ అలవాటు వదలక, ‘బానిస పనులు’ చేస్తూనే వున్నాడు, చనిపోయిన వాళ్ళ వ్యవహారాలు చూడడంతో సహా.

కొలినిస్చె జేటంగ్’ 179 సంచికలో అరకొర భోజనం లాంటి ఆ వ్యాసం రాసింది హెర్మ్స్ గారా లేక అతడి కొడుకు, చపల చిత్త దేవుడు పాన్ గారా… ఆ నిర్ణయాన్ని పాఠకుడికే వొదిలేస్తున్నాం. గ్రీకు దేవుడు హెర్మ్స్… ఉపన్యాస కళకు, తర్కానికి సంబంధించినవాడనే సంగతి మాత్రం పాఠకుడు మరిచిపోకూడదు.

(హెర్మ్స్ అనేది ‘కొలినిస్చే జేటంగ్’ పత్రిక సంపాదకుని పేరు)

“వార్తా పత్రికల ద్వారా తాత్విక, మత భావాలను విస్తరించడం, ఆ రెండిటి గురించి వార్తా పత్రికల్లో పేచీలు పడడం మంచిది కాదు” అంటాడాయన.

పెద్దాయన మాట్లాడే కొద్దీ, ఇలా ప్రవచనాలు చేస్తూ పోతాడని నాకు అర్థమయిపోయింది. అయినా, చిరాకు ఆపుకున్నాను. తన సొంత ఇంట్లో తన అభిప్రాయాలు ఇంత నిష్పాక్షికంగా చెప్పగల విజ్ఞుడిని నమ్మకుండా ఎలా వుంటాం మనం? నేను చదువుతూ పోయాను. ఓహ్, చూడండి. వ్యాసం ఒక్కటంటే ఒక్క తాత్విక యోచన లేకుండా శుభ్రంగా వుంది. అయితే, తాత్విక యోచనలను ఖండించి, మత దృక్పథాన్ని విస్తరించే దిశగా మొగ్గు మాత్రం కనిపిస్తోంది.

తన వునికి హక్కును తానే ఖండించుకుని, తన అసమర్థతను తానే ప్రకటించుకునే వ్యాసంతో ఎలా వేగడం? గొప్ప వాచాలత్వంతో వ్యాస  రచయిత స్వయంగా… చెబుతున్నాడు. తన అద్భుత వ్యాసాల్ని ఎలా చదువుకోవాలో వివరిస్తున్నాడు. ఆయన తన ఆలోచన ముక్కలను మాత్రం ఇస్తాడు. ఆ ఆలోచనల్లో, ముఖ్యంగా తాను చేపట్టిన ‘ప్రకటన’ ముక్కల ‘దండలో వరుస క్రమాన్ని, అంతస్సంబంధాల్ని’ కనుక్కునే పని మాత్రం ‘పాఠకుడి తెలివి తేటలకు’ వదిలేశాడు. కనుక,  ‘ దండ వరుస క్రమం, అంతస్సంబంధాల్ని’ కలిపే పని మనం చేద్దాం. చివరాఖరికి, అదొక రుద్రాక్ష దండ కాకపోతే, అది మన తప్పు కాదు.  

రచయిత ఇలా అంటున్నారు.

“మా అభిప్రాయం ప్రకారం, ఈ సాధనాలను వుపయోగించే పక్షం’’ (అంటే, వార్తా పత్రికల్లో తాత్విక యోచనల్ని, మత భావాలను విస్తరించడం, ఎదుర్కొనడం చేసే పక్షం) “ తన ఉద్దేశాలు గౌవరవనీయమైనవి కావని, ప్రజలకు బోధించడం, వినోదం కల్పించడం కాకుండా ఇంకేవో దురుద్దేశాలు తనకున్నాయని నిరుపించుకుంటోంది.”

అదీ ఆయన అభిప్రాయం. దీన్ని బట్టి , ఇంకేవో దురుద్దేశాల్ని చూపించడం తప్ప మరో ఆలోచన ఆయనకు వుండే అవకాశం లేదు. ఆ ‘ఇంకేవో దురుద్దేశాల’ను దాచి వుంచడం కుదరదు.  ‘నాన్ ప్రొఫెషనల్ వాగుడు కాయల నోరు మూయించడం’ రాజ్యం యొక్క హక్కు, కర్తవ్యం అంటున్నారు వ్యాస రచయిత. ఆయన ఉద్దేశం తన భావాల్ని కాదనే వారి నోరు మూయించడమని అర్థమయిపోయింది. ఎందుకంటే, ఆయన ‘ప్రొఫెషనల్ వాగుడుకాయ’ అని ఆయనకు ముందే తెలుసు.

ఇది మత సెన్సార్శిప్ ను మరింత బిగించే యోచన. ఇప్పుడిప్పుడే వూపిరి పీల్చడం మొదలెట్టిన పత్రికల మీద తాజా పోలీసు చర్యల ఆలోచన.

“రాజ్యం అత్యుత్సాహం కాదు, అనవసర సహనం ప్రదర్శిస్తోందని మా అభిప్రాయం.”

ఇక్కడ వ్యాస రచయిత కాస్త ఆగి ఆలోచించాడు. రాజ్యాన్ని తప్పు పట్టడం ప్రమాదం. అందుకని అధికారులను సంబోధించి మాట్లాడాడు. పత్రికా స్వేచ్చ మీద విమర్శ కాస్తా సెన్సార్స్ మీద విమర్శగా మారిపోయింది. సెన్సార్ వాళ్ళు “మరీ తక్కువ సెన్సార్షిప్’ కు పాల్పడుతున్నారని వ్యాస రచయిత ఆభియోగం.

“నిజమే. రాజ్యం కాదు గాని, ‘వ్యక్తి గత అధికారులు’ చాల తప్పుడు సహనం ప్రదర్శించారు. కొత్త తత్వశాస్త్ర బృందం పబ్లిక్ పత్రికల్లో, ఇతర అచ్చు పుస్తకాల్లో… క్రైస్తవ మతం మీద అవాంఛనీయ దాడులు చేస్తుంటే, అనుమతించారు.”

వ్యాస రచయిత మళ్లీ కాస్త ఆగి, పునరాలోచించాడు: ఎనిమిది రోజుల కిందటే సెన్సార్షిప్ స్వేచ్చ వల్ల పత్రికా స్వేచ్చ తగ్గిందని కనిపెట్టాడు. ఇప్పుడేమో, సెన్సార్షిప్-మీద అదుపు వల్ల సెన్సార్షిప్-నుంచి అదుపు మరీ తగ్గిపోయిందని కనుక్కున్నాడు.

ఈ లోపాన్ని సరి చేయాలి.

“సెన్సార్షిప్ అనేది వున్నంత కాలం…  ఇటీవల మన కళ్ళను పదే పదే నొప్పిస్తున్న పిల్ల రాతల అవాకులు చెవాకులను కత్తిరించి పారేయడం, సెన్సార్షిప్ అత్యవసర కర్తవ్యం.”

ఎంత బలహీనమైన కళ్ళు! ఎంత బలహీనమైన కళ్ళు!

“విశాల ప్రజానీకానికి అర్థం కావాలని రాసే మాటల వల్ల సున్నితమైన కళ్ళు నొప్పి పడతాయి”

సెన్సార్షిప్ ప్రాలుమాలి అలా సున్నిత కళ్ళను నొప్పించే మాటల్ని అనుమతిస్తే, అప్పుడిక పత్రికా స్వేచ్చ వల్ల ఏం ప్రయోజనం? మన కళ్లు సెన్సార్షిప్ కత్తిరించిన ఈ అవాకులనే భరించలేనంత బలహీనమైతే, ఇక స్వేచ్చాయుత పత్రికల దుస్సాహసాన్ని ఎలా భరిస్తాయి?

ఇది సెన్సార్షిప్ అనేది వున్నంత కాలం సంగతి.  సరే…. మరి, సెన్సార్షిప్ అసలు లేకపోతేనో, ఆప్పుడు? అప్పుడు, ఆయన వాక్యాన్ని ఇలా  అర్థం చేసుకోవచ్చు. సెన్సార్షిప్ ఎంతకాలం వీలయితే అంత కాలం వుండడం సెన్సార్షిప్ అత్యవసర కర్తవ్యం.

ఇంతలో వ్యాస రచయిత మరోసారి పునరాలోచిస్తాడు. “పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించడం మా పని కాదు, అందుకని ప్రత్యేక చర్యల గురించి మాట్లాడకుండా నిగ్రహం వహిస్తున్నాం”

ఆహా, ఎంత దయార్ద్ర హృదయుడో ఈయన. ప్రత్యేక చర్యలు చెప్పడు, నిగ్రహం వహిస్తాడు. కాని చాల నిర్దిష్టమైన, చాల స్పష్టమైన సూచనలతో… తాను ఏమనుకుంటున్న్శాడో  అది సూచిస్తాడు. అస్పష్టంగా, గొణుగుడు పదాలతో అనుమానాలు వెల్లడిస్తాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించడం తన పని కాదు. ముసుగు నేరారోపకుడుగా వ్యవహరించడం తన పని.

హెర్మ్స్, పాన్

చిట్ట చివరి సారిగా పునరాలోచిస్తాడు ఈ దగుల్బాజీ మానవుడు. ఉదార వాద వ్యాసాలు రాయడం, “పత్రికా స్వేచ్ఛకు విధేయ మద్దతుదారుడి’గా నటించడం….  ఆయన పని. ఇప్పుడిక తన చివరి వైఖరికి దూకేస్తాడు.

“మేము ఒక విధానానికి నిరసన తెలుపకుండా వుండలేం. అదేదో పొరపాటున చేపట్టిన విధానం అయ్యుండాలి. లేకుంటే,  జనం దృష్టిలో పత్రికా వుద్యమాన్ని అపఖ్యాతి పాలు చేసి, అన్యాయస్థులకు మేలు చేయడమే ఆ విధానం లక్ష్యం అని చెప్పకతప్పదు.”

ఎంత లోతయిన విశ్లేషకుడో అంత సాహసి కూడా అయిన ఈ పత్రికా స్వాతంత్ర్య సముద్ధారకుడు… ఇంకా ఇలా అంటాడు. ‘నేను నిద్రపోతున్నా, నన్ను లేపొద్దు’ అని వొంటి మీద లిఖించుకున్న ఇంగ్లీషు చిరుతపులి మాదిరి… జనం దృష్టిలో పత్రికా స్వేచ్చను అపఖ్యాతి పాలు చేయడం కోసం ‘దైవ రహిత’ విధానాన్ని అనుసరిస్తోందట సెన్సార్షిప్.

ఇలా పత్రికా వుద్యమం సెన్సార్షిప్ నుంచి ‘పరమ నిర్లక్ష్యాన్ని’ సంపాదించగలిగాక, సెన్సార్షిప్ కలం-కత్తిని తప్పించుకోగలిగాక, ఇక అది జనం దృష్టిలో అపఖ్యాతి పాలు కాకుండా ఎలా వుంటుంది?        

సిగ్గుమాలినతనానికి దొరికే అనుమతినే ‘స్వేచ్చ’ అనుకోగలిగితే, అప్పుడిక పత్రికలు చాల ‘స్వేచ్చ’గా వున్నాయని అనొచ్చు. ఇద్దరు పోలీసులు గట్టిగా పట్టుకుని నిలబెట్టకపోతే, పత్రికా ప్రపంచం (ప్రెస్) ఒరిగి చెత్తకుప్పలో పడిపోతుందని ఒక పక్కన  ప్రవచిస్తూ… మరో పక్కన పత్రికా స్వేచ్చ సముద్ధారకులమని చెప్పుకోడం… ఇంత కన్న అసంగతం (అబ్సర్డిటీ), సిగ్గుమాలినతనం ఇంకేముంటాయి.

తాత్విక పత్రికలు తమకు తామే జనం కళ్ళ ముందు అపఖ్యాతి పాలవుతున్న మాట నిజమైతే, ఇక సెన్సార్షిప్ ఎందుకు, ఈ వ్యాసమెందుకు?

వ్యాస రచయిత “శాస్త్ర పరిశోధన స్వేచ్చ”కు పరిమితి విధించాలనుకోడం లేదట.

“మనం శాస్త్ర పరిశోధనకు చాల విస్తృతమైన, అవధులు లేని అవకాశం ఇస్తున్నాం.”     

ఈ కింది మాటల్ని బట్టి శాస్త్ర పరిశోధనపై ఈ పెద్దమనిషి అవగాహన అర్థమవుతుంది.

“శాస్త్ర పరిశోధనా స్వేచ్ఛ వల్ల క్రైస్తవానికి మేలే. అలాంటి శాస్త్ర పరిశోధనకు ఏవి అవసరమో ఏవి అవసరం కాదో… వాటి మధ్య ఖచ్చితమైన రేఖ వుండాలి”

శాస్త్ర పరిశోధన అవసరాలేమిటో స్వయంగా శాస్త్ర పరిశోధన కాకుండా మరెవరు నిర్ణయిస్తారు? వ్యాసకర్త అభిప్రాయం ప్రకారం, శాస్త్ర పరిశోధనకు సరిహద్దులు నిర్ణయించాలి. ఎందుకు? దానికి ‘అధికారిక కారణం’ వ్యాస కర్తకు తెలుసు. సెన్సార్షిప్ శాస్త్ర పరిశోధన నుంచి నేర్చుకోదు, నేర్పిస్తుంది. శాస్త్రీయ గడ్డం ప్రపంచ ప్రఖ్యాతి పొందాలంటే, దానిలో ఒక్కో వెంట్రుక ఎంత పొడవు వుండాలో… దివ్య వాణి మాదిరి…నిర్ధారిస్తుంది. సెన్సార్షిప్ కు అలాంటి శాస్త్రీయ పూనకం వస్తుందని ఈ వ్యాసకర్త నమ్మ్మకం.  

‘శాస్త్ర పరిశోధన’ గురించి ఈ వ్యాసం ఇంకెన్ని ‘చిలిపి’ వ్యాఖ్యానాలు చేస్తుందో చూసే ముందు, శ్రీ హెచ్. (హెర్మ్స్) గారి “మత తత్వ శాస్త్రా’న్ని, ఆయన “సొంత శాస్త్రా”న్ని చూసి ఆనందిద్దాం.

(అనువాదం తరువాయి… వచ్చే సంచికలో…)

హెచ్చార్కె

Add comment

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.