సూర్యుడికై ఎదురు చూపులు

“సిద్ధమా?”

“సిద్ధం!”

“ఇప్పుడేనా!”

“ఆగు”

“శాస్త్రజ్ఞులకు ఇది రూడిగా తెలుసా? ఇవాళ అది నిజంగా జరుగుతుందా?”

”చూడు చూడు నువ్వే చూడు”

పిల్లలందరూ అందమైన గులాబీల గుచ్చంలా ఒకరికొకరు దగ్గరిగా జరిగి గుంపుగా కలిసిపోయి దాక్కున్న సూర్యుడిని చూసేందుకు తయారవుతున్నారు.

వర్షం కురుస్తోంది.

ఏడు సంవత్సరాలుగా అలా ధారాపాతంగా వర్షం కురుస్తూనేవుంది. వేల రోజులుగా దిక్కుల్ని కలుపుతూ జలధారలుగా కుండపోతగా దూరాన వున్న ద్వీపాలనుండి అలలుగా తుఫాను కెరటాలుగా వర్షం కురుస్తూనే వుంది. వేల అరణ్యాలు వర్షం కింద పడి నలిగి నాశనమయ్యాయి. మళ్ళీ మళ్ళీ అలా నాశనమవ్వడానికి వేల సార్లు మొలకెత్తుతూనే వున్నాయి. శుక్ర గ్రహం మీద జీవితం ఇలాగే అనాదిగా సాగుతున్నది. నాగరికతలు ఏర్పరచుకోవడానికి భూమి మీదనుంచి ఉపగ్రహయానం ద్వారా ఈ వర్ష గ్రహం మీదికి వచ్చిన వాళ్ళ పిల్లలున్న బడి అది.

“ఆగుతోంది ఆగుతోంది”

“అవును అవును”

మాగీ వాళ్లకు కొంత ఎడంగా నిలుచుంది. ఈ పిల్లలెవరికైనా ఎప్పుడైనా వర్షం పడని జ్ఞాపకముందా? వీళ్ళందరికీ తొమ్మిదేండ్ల వయసు ఉండొచ్చు. ఎప్పుడో ఏడు సంవత్సరాలక్రితం ఒక గంట పాటు సూర్యుడు వెలిగి విస్తుపరిచిన వైనం వీళ్ళకెవరికైనా గుర్తుంటుందా? గుర్తుండదు. బహుశా ఏ అర్ధరాత్రో కలవరింతల్లో ఒక పచ్చని బంగారు రంగు చాయతో ఈ ప్రపంచాన్ని కొనగలిగినంత నాణెంలానో ఒక పెద్ద క్రేయాన్ బొమ్మలానో కనిపించి ఉంటుంది. ఆ వెచ్చదనం వారి మొహంపై చేతులపై కాళ్ళపై చిరు దేహాలపై కొత్త ఊపిరులూది వుంటుంది. ఎడతెగని పూసలదండలా అనంతంగా కురుస్తున్న వర్షం దారులపై, పైకప్పులపై, చెట్లపై, అడవులపై పడుతూ చేస్తున్న శబ్దం వీళ్ళను ఆ కలలనుంచి దూరం చేసే వుంటుంది.

నిన్నటి రోజంతా వాళ్ళు సూర్యుడిగురించి చదువుతూనే వున్నారు. ఒక నారింజకాయలాగా, వేడిగా ఉండడంగురించి తెలుసుకుంటూనే వున్నారు. సూర్యుడి గురించి వ్యాసాలూ రాశారు, బొమ్మలు గీశారు, కవితలు రాశారు. “సూర్యుడంటే ఒక పుష్పం. వికసిస్తుంది ఒక గంట కాలం” అని మాగీ ఒక కవిత రాసింది. బయట వర్షం కురుస్తుండగా మంద్రస్వరంతో తరగతి గదిలో చదివింది.

“అది నువ్వు రాసినది కాదు” అరిచాడు ఒక పిల్లవాడు.

“నేనే రాశాను” అంది మాగీ.

“విలియం” అరిచింది టీచర్.

అదంతా నిన్న జరిగింది. ఈరోజు వర్షం సన్నబడుతోంది. పిల్లలందరూ గుంపులుగా కిటికీలకు అతుక్కుపోయి వున్నారు.

“టీచర్ ఎక్కడ”

“వస్తుందిలే”

“ తొందరగా వస్తే బాగుండు. మనం చూడలేమేమో”

ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఒక అద్భుతాన్ని కోల్పోతామేమో అన్న ఆత్రుతతో వున్నారు. మాగీ ఒక్కతే ఒక పక్కన నిల్చుని వుంది. ఏళ్ళ తరబడి వర్షంలో తడుస్తూ కళ్ళలో నీలి కాంతినీ, పెదవులపై ఎర్రదనాన్నీ, జుట్టులోని పసుపు రంగునీ కోల్పోయినట్లు బలహీనంగా వుంది. ఒక పాతబడి, రంగు మాసిపోయిన ఛాయాచిత్రం అప్పుడే ఒక బీరువాలోంచి తీసినట్టుగా వుంది మాగీ. ఒంటరిగా నిల్చుని కిటికీ అద్దం అవతల భారీగా కురుస్తున్న వర్షాన్ని చూస్తోంది ఆమె.

“ ఏం చూస్తున్నావ్” అడిగాడు విలియం.

జవాబివ్వలేదు మాగీ.

“అడిగినప్పుడు మాట్లాడొచ్చుగా” చిన్న తోపు తోశాడు.

మాగీ కదలలేదు. వారి మధ్య దూరం పెరిగింది. ఇతర పిల్లలు మాగీని చూడడం లేదు. మాగీ వాళ్ళను పట్టించుకోలేదు. మాగీ వాళ్ళతో ఆ భూగర్భ నగరంలోని వీధులలో ఆడదని వాళ్లకు కోపం. వాళ్ళు ఆమెను తాకి పరిగెత్తితే ఆమె పట్టించుకోదు. వాళ్ళంతా తరగతి గదిలో జీవితంగురించి, ఆనందం గురించి పాటలు పాడుతున్నప్పుడు. ఆమె పెదవులు యాంత్రికంగా కదిలేవి. వాళ్ళు సూర్యుడి గురించో వేసవి గురించో పాడుతున్నపుడు మాత్రం ఆమె పెదవులు జత కలిసేవి, ఆమె చూపులు కిటికీలోంచి, యెడ తెగకుండా కురుస్తున్న వానపై నిలిచేవి. అన్నింటికన్నా ఆమె చేసిన పెద్ద నేరం ఏమిటంటే ఆమె భూమినుండి ఐదు సంవత్సరాలక్రితమే ఇక్కడికి వచ్చింది. ఆమె తన నాలుగేళ్ల వయసులో వున్నప్పుడు ఒహాయోలో తాను చూసిన సూర్యుడినీ నిర్మలమైన ఆకాశాన్నీ ఇప్పటికీ గుర్తుంచుకుని వుంది. మిగతా పిల్లలందరూ వాళ్ళు పుట్టినప్పటినుండి ఇక్కడే వున్నారు. క్రితం సారి ఏడు సంవత్సరాల కిందట సూర్యుడు వచినప్పుడు వాళ్ళందరికీ రెండేళ్ళ వయస్సే. సూర్యుడి రంగునూ రూపాన్నీ వాళ్ళు చూశారో లేదో కూడా వాళ్లకు జ్ఞాపకం లేదు. మాగీకి మాత్రం తన నాలుగేండ్ల వయసులో సూర్యుడినీ ఆకాశాన్నీ చూసిన జ్ఞాపకాలింకా పదిలంగా వున్నాయి.

“ ఒక రూపాయి లాగా ఉంటుంది” చెప్పింది మాగీ ఒకప్పుడు కళ్ళు మూసుకుని.

“అలా ఏం ఉండదు” అరిచారు పిల్లలందరూ.

“కొలిమిలో మంటలాగ” చెప్పింది మాగీ.

“ నువ్వు అబద్దం చెబుతున్నావు. నీకేం గుర్తులేదు” అరిచారు వాళ్ళు.

కానీ తనకు అన్నీ గుర్తున్నాయి. ఒక పక్కగా నిలుచుని కుండపోతగా కురుస్తున్న వానను కిటికీలలోంచి చూస్తోంది మాగీ. ఒక నెల క్రితం తను బడిలోని స్నానాల గదుల్లో తల స్నానం చేయడానికి నిరాకరించింది. ఆకాశం నుండి కురుస్తున్న వర్షపు ధారల శబ్దంలా వున్న స్నానపు గదుల నీటి ధారల శబ్దం ఆమెకు తలపోటును తెచ్చేలా వుండేది. ఆమెకు తను మిగతా పిల్లలలా ఉండలేనని అర్థమైంది. మిగతా పిల్లలు కూడా ఆమెకు దూరంగా మెలగసాగారు. వచ్చే సంవత్సరం ఆమె భూమి మీద వున్న తన అమ్మా నాన్నల

దగ్గరికి వెళ్ళబోతున్నదని గుసగుసలు కూడా వున్నాయి. ఆమె కుటుంబానికి కొన్ని వేల డాలర్ల ఖర్చు ఐనప్పటికీ అదే ఆమెకు మంచిది అనుకుంటున్నారు కొందరు. ఈ చిన్నా పెద్దా కారణాలు, ఆమె బలహీనమైన దేహం, తెల్లని ముఖం, నిరంతర మౌనం మిగతా పిల్లలకు ఆమె పట్ల ద్వేషాన్ని పెంచాయి.

“దూరం పో. ఇక్కడెందుకు నిలుచున్నావు?” విలియం ఆమెను ఇంకొక తోపు తోశాడు.

మాగీ మొదటిసారి విలియం వంక తీక్షణంగా చూసింది.

“ఇక్కడ నిలవకు”. విలియం గట్టిగా అరిచాడు. “ఇక్కడ నువ్వేమీ చూడలేవు”

ఆమె పెదవులు చిన్నగా కదిలాయి.

“ఇక్కడేమీ లేదు. ఇదంతా ఒట్టి తమాషా. కాదా?” ఇతర పిల్లలవైపు తిరిగి అరిచాడు. “ఈ రోజేమీ కనపడదు. అంతేనా?”

ఒక్కసారి పిల్లలందరూ ఆశ్చర్యంగా చూశారు. వెంటనే అర్థమైన వాళ్ళలా నవ్వుతూ తలలూపారు.

“ ఏమీ లేదు. ఏమీ లేదు”.

“ఓహ్. కానీ!” మాగీ గొణిగింది. ఆమె కళ్ళు నిస్సహాయంగా చూశాయి. “శాస్త్రజ్ఞులు చెప్పింది ఈ రోజేకదా! వారికి తెలుసు సూర్యుడు ఈ రోజే…”

“అంతా ఒట్టిదే” విలియం ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. “పిల్లల్లారా రండి. టీచర్ వచ్చేలోపు ఈమెను ఒక చీకటి గదిలో వేద్దాం”

“వద్దూ” ప్రతిఘటించింది మాగీ.

పిల్లలందరూ గట్టిగా మాగీని పట్టుకున్నారు.ఆమె పెద్దగా అరుస్తూ వేడుకోసాగింది. ఆమెను సోరంగంలోనికి ఈడ్చుకు వచ్చారు. అక్కడ ఒక గదిలోకి తోసి గదికి తాళం వేశారు. మాగీ వాకిలిదగ్గరే నిలబడి దబాదబా తలుపులు బాదుతూ అరుస్తోంది. పిల్లలంతా ఆ వాకిలి వైపూ, దాని వెనకనుంచి వస్తున్న అరుపులవైపూ చూస్తూ నవ్వుతూ, తుళ్ళుతూ టీచర్ వచ్చేసరికి సొరంగ ముఖ ద్వారం వద్దకు వచ్చారు.

“పిల్లలూ! సిద్ధమా” టీచర్ తన గడియారం వైపు చూసుకుంది.

అందరూ “ఆ!” అని అరిచారు.

“అందరూ వచ్చారా?”

“వచ్చారు”

వాన మరింత పలుచబడింది.

వారంతా ఒక పెద్ద వాకిలి దగ్గరికి చేరారు.

వాన ఆగిపోయింది.

ఒక పెనుతుఫానునూ, ఒక అగ్ని పర్వతం బద్దలవ్వడాన్నీ, ఒక ప్రళయాన్నీ చూపిస్తున్న చిత్రం తటాలున ఆగిపోయి, అత్యంత నిశబ్దంగా తయారై, ఆ నిశ్శబ్దం లోంచి ఒక నిశ్చల అద్భుత చిత్రం ఆవిష్కృతమైనట్లు ప్రపంచమంతా స్తబ్దమైంది. చెవులను పూర్తిగా కప్పేసినట్లు అసలు వినికిడి జ్ఞానమే కోల్పోయినట్లు అనిపించే ఆ మహా నిశ్శబ్దం వింతగా ఉంది. పిల్లలందరూ తమ చేతులతో చెవులను తడుముకుంటున్నారు. ఒకరికొకరు కొంచం దూరంగా నిలబడ్డారు. నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. నిశ్శబ్దంగా వేచిచూస్తున్నట్ట్లున్న ప్రపంచం వారిని చేరింది.

సూర్యుడు బయటికొచ్చాడు.

మండుతున్న కంచు గోళంలా చాలా పెద్దగా ఉన్నాడు. సూర్యుడి చుట్టూ ఉన్న ఆకాశం నీలం రంగుతో మెరుస్తోంది. భూమిమీద వున్న అడవి మొత్తం సూర్య కిరణాలను తాగుతోంది. వేడెక్కుతోంది. మండుతోంది. పిల్లలందరూ వసంతోదయంలా ఎగురుతూ అరుస్తూ బయటికొచ్చారు.

“పిల్లలూ, ఎక్కువ దూరం వెళ్ళకండి. మనకు రెండు గంటల సమయం మాత్రమే ఉంది. తెలుసుకదా, మీరు ఎవ్వరూ బయట ఎక్కడో చిక్కుబడి పోగూడదు”. అరిచింది టీచర్.

కానీ పిల్లలంతా అప్పటికే పరుగెత్తుతున్నారు. వారి మొహాలను సూర్యుడివైపు తిప్పి వెచ్చని సూర్య కిరణాలు తమ చెంపలను తాకేలా చూసుకుంటున్నారు. వారి కోట్లను తీసేసి తమ చేతులమీద సూర్య కిరణాలను ప్రసరింపనిస్తున్నారు.

“పగటి దీపాలకంటే ఇది ఎంతో బాగుంది కదా”.

“అవును, చాలా బాగుంది”

వారు పరుగులు ఆపి శుక్ర గ్రహాన్ని కమ్మేసిన ఘనమైన అడవి మధ్య నిలుచున్నారు. ఆ అడవి అలా పెరుగుతూ పెరుగుతూ నిరంతరాయంగా వృద్ధి చెందుతూనే వుంది. అది ఆక్టోపస్ లాంటి మెత్తటి శరీరం కలిగిన జీవ జాలానికి గూడులా ఉంది. అడవంతా రబ్బరు రంగు తోనో, బూడిద రంగుతోనో నిండి వుంది. కొన్ని సంవత్సరాలుగా సూర్య కాంతి లేక అక్కడి రాళ్ళూ గుట్టలూ అన్నీ కూడా చంద్ర కాంతితో వున్నాయి.

పిల్లలందరూ ఆ అడవి మధ్యలోని మైదానం మీద నిలబడి అక్కడి నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని భంగం చేస్తూ చుట్టూ ఉన్న చెట్ల దగ్గరికి పరుగెడుతూ పడుతూ లేస్తూ ఒకరినొకరు తోసుకుంటూ కళ్ళలోంచి నీళ్లు ధారలు కారేవరకు సూర్యుడిని చూస్తూ ఆ పసుపు వర్ణ కాంతికై తమ చేతులను చాస్తూ ఆ పచ్చని అడవిలోని స్వచ్చమైన గాలినీ నిశ్శబ్దాన్నీ వింటూ తమ చుట్టూ వున్న ప్రతి విషయాన్నీ ఆసక్తిగా చూస్తూ గుహలనుండి బయటపడిన జంతువులవలె వలయాలు వలయాలుగా పరుగెత్తుతూ అరుస్తూ అలా ఆగకుండా ఒక గంట కాలం గడిపారు.

అంతలో ఆ పరుగు మధ్యలో ఒక పిల్ల ఆగింది. అందరూ తన చుట్టూ చేరారు.

ఆ పిల్ల తన చేతిని ముందుకు చాస్తూ “చూడండి చూడండి” అంది వణుకుతూ.

అందరూ నిదానంగా ఆ పిల్ల తెరిచిన అరచేతివైపు చూడసాగారు. గుంతగా పెట్టిన ఆ పిల్ల అరచేతిలో ఒక పెద్ద వాన చుక్క. ఆ పిల్ల ఏడుపు మొదలు పెట్టింది. పిల్లలందరూ నిశ్శబ్దంగా సూర్యుడి వైపు చూసారు.

“అయ్యో, అయ్యో”.

చల్లని కొన్ని చినుకులు వారి ముక్కులనూ చెంపలనూ పెదవులనూ తడిపాయి. సూర్యుడు మెల్లగా మబ్బులచాటుకు జారుకుంటున్నాడు. వారి చుట్టూ ఒక శీతల పవనం కమ్మింది. వారంతా వెనుదిరిగి భూగర్భ గృహం వైపు నడవ సాగారు. చేతులు భుజాలకు వేలాడుతున్నాయి. ముఖాలమీద నవ్వులు మాయమవుతున్నాయి.

ఒక పెద్ద ఉరుము శబ్దం ఒక పెనుగాలి ఆకులను వణికించినట్లు పిల్లలను వణికించింది. అందరూ ఒకరికొకరు దగ్గరగా జరిగి పరుగెత్తుతూ వున్నారు. పది మైళ్ళ దూరంలో ఒక పిడుగు పడినట్లు మెరుపు మెరిసింది. ఒక ఐదు మైళ్ళ దూరంలో పిడుగు, ఒక మైలు, అర మైలు. రెప్పపాటులో ఆకాశం అర్ధరాత్రికి మారి పోయింది.

పిల్లలందరూ వాన వుదృతంయ్యేవరకు భూగర్భ గృహం లోని వాకిలి వద్ద నిలబడ్డారు. తలుపు మూసి వేశారు. పెద్ద పెద్ద పైపుల్లోంచి

నీళ్ళు జారుతున్నట్లు హిమ నగాలు విరిగి పడుతున్నట్లు హోరుమని శబ్దం ప్రతిచోటా నిరంతరం.

“మళ్ళీ ఏడేళ్ళకేనా?”.

“అవును ఏడేళ్ళకే”.

ఎవరో చిన్నగా అరిచారు.

“మాగీ”

“ఏమిటీ”

“మనం తాళం వేసిన గదిలోనే తను వుంది”.

“మాగీ”

వారందరూ ఎన్నో ఏళ్ళుగా భూమిలోకి పాతబడినట్లు స్థానువుల్లా నిలబడ్డారు.

ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. చూపులు తిప్పుకున్నారు. వడి తప్పకుండా వర్షం కురుస్తున్న ప్రపంచంలోకి చూస్తున్నారు. ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు కలపలేక పోతున్నారు. వారి ముఖాలు పేలవమయ్యాయి. ముఖాలు దించుకుని తమ చేతులనూ కాళ్ళనూ చూసుకుంటున్నారు.

“మాగీ”

ఎవరో ఒక పిల్ల అరిచింది “ఆ!”.

ఎవరూ కదలలేదు.

రే బ్రాడ్ బరీ

“పదండి” మెల్లగా చెప్పింది ఆ పిల్ల.

పిల్లలంతా నిదానంగా వాన శబ్దం మధ్యలో హాలు దాటారు. తుఫానూ ఉరుముల శబ్దాలతో ఉన్న బయటి ప్రపంచం నుండి దూరంగా, ముఖాలను ప్రయత్న పూర్వకంగా నవ్వులతో పులుముకుంటూ తాళం వేయబడిన వాకిలి వద్ద నిలుచున్నారు.

వాకిలి వెనుక నిశ్శబ్దం మాత్రమే.

నెమ్మదిగా తాళం తీసారు. మాగీని బయటికి రానిచ్చారు.

 

 

(మూలం: ‘All Summer in a Day’ by Ray Bradbury. అనువాదం: చంద్రశేఖర్ కర్నూలు.).

చంద్రశేఖర్

తన గురించి తానే రచయిత చంద్రశేఖర్: నేను కర్నూలులో ఉంటాను. నాన్న గారి వల్ల ఆంధ్ర సాహిత్యంపై మక్కువతో నేను చదివిన పద్య కావ్యం "విజయవిలాసం". అందరి లాగే నా చదువుల మధు మాసాన్ని "చందమామ" "బాలమిత్ర" "బొమ్మరిల్లు" లతో ప్రారంభించడానికి కారణం మా పెద్దమ్మ "కృష్ణవేణమ్మ". "రాబిన్సన్ క్రూసో" సంక్షిప్త నవలతో మొదలైన ఇంగ్లీషు పఠనం ‘ఫాదర్స్ అండ్ సన్స్’ నుండి ‘డిస్గ్రేస్’, ‘డ్రీమ్స్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ వార్’ అలా కొనసాగుతూ..... నేనంటే ఒక కూర్చబడ్డ పలు సమాజ శకలాలు తప్ప మరేమీ కాదనే ఎరుకతో జీవిస్తున్నాను. ‘Illusion and Reality’ సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి నాకున్న దిక్సూచి.
 Mob: 9866608190

3 comments

  • సూర్యుడికై ఎదురు చూపులు కథను చదువుతున్నపుడు నాకు నా ఇంటర్మీడియట్ రోజులు గుర్తుకు వచ్చాయి. కథలోని పిల్లలు అందరూ కొన్ని సంవత్సరాలనుండి సూర్యుడిని చూడటానికి ఎదురుచూసిన విదానం, హాస్టల్లో కొత్తగా చేరినప్పుడు వచ్చే సెలవుల కోసం మేము ఎదురుచూసిన విధంగా అనిపించింది. కథలో సూర్యుడు అలా వచ్చి ఒక రెండు గంటల తర్వాత వెళ్లిపోతున్నట్లు మా సెలవులు కూడా త్వరగా అయిపోయేవి కానీ ఉన్నంత సేపు ఆనందంగా ఉండేది. మ్యాగీ పాత్ర మన సమాజంలోని అనేక విషయాలను గురించి చెపుతుంది. తను అందరిలా శుక్ర గ్రహంలో పుట్టలేదు. చదువు కొరకు భూమి నుంచి అంత దూరం వెళ్లింది. అక్కడ ఆ తరగతిలో ఇతరులు తనను వారిలో ఒకరిగా చూడలేదు. తనను ఒక గదిలో ఉంచి తాళం వేశారు. మాగి సూర్యుడి గురించి కవిత రాసినప్పుడు అది తనది కాదని అన్నారు. మాగి మిగతా పిల్లలలాగే ఉన్నా కూడా తనను వేరుగా చూశారు. ఇది మన చుట్టూ ఉన్న racism లాగా అనిపించింది. మనం ఏర్పరచుకున్న నమ్మకాలు, ఆచారాలు ఆలోచన విధానాన్ని ఎవరైనా తప్పు పడితే మనం సహించలేము. మన నమ్మకం తప్పు అయినా సరే మనం వాళ్ళదే తప్పు అని ఎత్తి చూపుతాము, మన నుంచి వాళ్లను దూరం చేసే ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్నీ ఈ కథలో మాగి సూర్యుడి గురించి కవిత రాసినప్పుడు ఆ కవితలోని సూర్యుడు తన తోటి విద్యార్థుల ఊహకు విరుద్ధంగా ఉండటం వల్ల తనకు సూర్యుడి గురించి ఏమి తెలియదు అని, ఆ కవిత తను రాసింది కాదు అని అంటారు. Out of the box ఆలోచనను అంగీకరించని తత్వం మనలో జీర్ణించుకు పోయింది. ఇక శుక్ర గ్రహంలో నివాసం అనే ఊహకు బాల్యాన్ని చేర్చి రచయిత హృద్యంగా కథ చెప్పారు. ఇలా చాలా విషయాలు ఈ కథలోని పాత్రలు ద్వారా నాకు అర్థం అయ్యాయి. అనువాదం బాగుంది

    • శాస్త్ర విజ్ఞాన కాల్పనిక సాహిత్యం మానవతా విలువలనూ, స్నేహ బందాలనూ పెంపొందించాలని నేననుకుంటాను. సైన్స్ ఫిక్షన్ పేరుతో అభూత కల్పనలను రాసినప్పటికీ అవి తార్కికతకు అందేలా ఉండాలి. రే బ్రాడ్బరీ కథలలో ఈ రెండూ కనిపిస్తాయి. వీటితోపాటు పర్యావరణ స్పృహ కూడా. ధన్యవాదాలు జయంత్ భరద్వాజగారూ.

  • వేల రోజులుగా దిక్కుల్ని కలుపుతూ జలధారలుగా కుండపోతగా దూరాన వున్న ద్వీపాలనుండి అలలుగా తుఫాను కెరటాలుగా వర్షం కురుస్తూనే వుంది. వేల అరణ్యాలు వర్షం కింద పడి నలిగి నాశనమయ్యాయి. మళ్ళీ మళ్ళీ అలా నాశనమవ్వడానికి వేల సార్లు మొలకెత్తుతూనే వున్నాయి. శుక్ర గ్రహం మీద జీవితం ఇలాగే అనాదిగా సాగుతున్నది. నాగరికతలు ఏర్పరచుకోవడానికి భూమి మీదనుంచి ఉపగ్రహయానం ద్వారా ఈ వర్ష గ్రహం మీదికి వచ్చిన వాళ్ళ పిల్లలున్న బడి అది.

    ఎక్స్ల్లెంట్!…. I don’t know how i missed to see this.. This is an excellent story.. my personal taste hidden inside my heart!.. beautiful redition.. very nice!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.