స్వాతంత్ర్యానికి అమెరికన్ అర్థం!

 

నిమిదో తరగతి నుంచి నేను మా పక్క ఊరి లో ఉన్న హైస్కూల్ కి మారాను. వెళ్ళిన కొన్నాళ్ళకి  ఆగష్టు 15 వచ్చింది. ఆ సందర్భంలో ఇండిపెండెన్స్ డే నాడు జరిగిన సమావేశం లో ఎవరయినా మాట్లాడవచ్చు అన్నారు. అప్పుడే ఇండిపెండెన్స్ అన్న పదానికి అర్థం నేర్చుకొన్నాను. అపుడు మిడి మిడి జ్ఞానం తో, మన దేశం వేరే దేశాల మీద డిపెండెంటు గా ఉన్నన్నాళ్లూ మన స్వాతంత్ర్యానికి అర్థం లేదు అని మాట్లాడాను. నాకు తర్వాత తెలిసింది, నెహ్రూ కూడా అలానే ఆలోచించి, “దిగుమతుల ప్రతిక్షేపణ” (import substitution) అని, పంచ వర్ష ప్రణాళికలు పెట్టి, ఒక ఆర్ధిక వ్యవస్థ ను నిర్దేశించాడు.

కానీ, independence అంటే అర్థం ఇదా? జపాన్ దేశం ఖనిజాలన్నీ వేరే దేశాల నుండి తెచ్చుకుంటుంది. జర్మనీ కూరగాయల్నే దిగుమతి చేసుకొంటుంది. యూరోప్ లో ప్రతి ఒక్క దేశం, వేరే దేశం మీద ఆధార పడి ఉంటుంది. నిజానికి, అంతర్జాతీయ వాణిజ్యం ఒక దేశపు అభివృద్ధికి చిహ్నం. ఆర్ధిక శాస్త్రం ప్రకారం, ఒక్కొక్క దేశం తమ శక్తి యుక్తుల మేరకు కొన్నిటిని ఎగుమతి చేయడంలో నైపుణ్యం సంపాదిస్తుంది (రికార్డో అన్న ఆర్ధిక శాస్త్ర వేత్త దీని మీద విస్తృతంగా పరిశోధించాడు). అందు చేత ఇండిపెండెన్స్ అనగా స్వాతంత్ర్యానికి వేరే అర్థం వెతుక్కోవలసిందే.

ఈ జులై 4 నాడు అమెరికా తన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నది. ఈ సందర్బంగా ఈ దేశం లో ముందు ఇండిపెండెన్స్ అంటే ఏమనుకున్నారు? ఎందుకు కావాలను కున్నారు? ఏ విధమైన నిర్వచనం ఇచ్చారు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చూద్దాం.

ముందు కొంచెం నేపథ్యం. జులై 2, 1776 నాడు, అమెరికా (అంటే అప్పుడు ఉన్న పదమూడు రాష్ట్రాలు) ఇంగ్లాండ్ నుండి విడిపోయాయి. జులై 4 నాడు, వాళ్ళు ‘డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’ అని ఒక పత్రం రాసి, అందరూ సంతకాలు పెట్టారు. దానికి ముఖ్య కర్త థామస్ జెఫర్సన్. అనేక విధాలుగా ఈ పత్రం ఇండిపెండెన్స్ ఎందుకు కావలసి వచ్చింది, ఇండిపెండెన్స్ అంటే ఏమి కోరుకుంటున్నారు, అనే విషయాలు క్లుప్తంగా చెప్పింది.

ఈ రోజు మనం ఆ స్వాతంత్ర్య ప్రకటన గురించి ముచ్చటించుకుందాం. మీరు ఆ ప్రకటన నెట్ లో చదవ వచ్చు. నేను దానికి ముక్కస్య ముక్క అనువాదం చెయ్యడం లేదు. దానిలోని కొన్ని విషయాలను ఎత్తి చూపుదామనుకుంటున్నాను.

ఈ ప్రకటన కొన్ని భాగాలుగా ఉంటుంది. ముందు ఉపోద్ఘాతం, అవతారిక, దోషారోపణ, అధిక్షేపం, ముగింపు.  ఎక్కువ భాగం ఎందుకు ఇంగ్లాండ్ నుంచి విడిపోవలసి వచ్చిందో రాసినప్పటికీ, ముందు రెండు భాగాలు కలకాలం నిలిచి ఉండేలా ఉంటాయి.

ఉదాహరణకి, ఈ వాక్యం తీసుకోండి: We hold these truths to be self-evident, that all men are created equal, that they are endowed by their Creator with certain unalienable Rights, that among these are Life, Liberty and the pursuit of Happiness.

ఇది ఒక గొప్ప విషయం అనిపించక పోవచ్చు గానీ, అంత వరకు మానవ ప్రధాన హక్కుల గురించి ఎవరూ ఆలోచించలేదు. ప్రతి ఒకరు మానవుడిని కుటుంబం, సంఘం, మతం, దేశం — వీటితో ఎటువంటి సంబంధాలుంటాయో వివరంగా రాసారు. మానవ సమాజం ఎదుగుదలలో అది ఒక దశ. మనం “nasty, brutish, and short” దశ నుండి బయటకు రావాలంటే బలమైన సమాజం ఏర్పడాలి.

సమాజం నుండి వ్యక్తి  ప్రాధాన్యం వైపు అప్పటికే ప్రపంచ పవనాలు వీస్తున్నాయి. ఫ్రెంచ్ విప్లవం గాలిలో ఉన్నదపుడు. అప్పటికే On Liberty అని జాన్ స్టువర్ట్ మిల్ ఒక పుస్తకం రాసాడు. వ్యక్తి కి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా సమాజం కూడా బలపడుతుందనే అభిప్రాయం కొంతమంది మేధావులకు అప్పటికే కలిగింది.

అందుకే ముందు వ్యక్తిగత స్వేచ్ఛల గురించి రాయడం జరిగింది. ఏమిటీ స్వేచ్ఛలు? మనిషి ప్రాణం మీద మనిషికి హక్కు. మనిషి స్వేచ్ఛ మీద తన హక్కు. మనిషి తన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకొనే హక్కు. ఇవి సరిపోతాయా? ఇవి మరీ ఎక్కువగా చెప్పారా? దీనిగురించి చాలా చర్చలు జరిగాయి.

ముందు, అసలు పరమార్థం ఏమిటంటే, అప్పటి అమెరికన్లకు ప్రభుత్వం అంటే నమ్మకం లేదు. రాజ్యాంగం ప్రజల్ని ప్రభుత్వం నుండి రక్షించడం కోసం అని భావించారు. అదే విధంగా, ఈ స్వాతంత్ర్య ప్రకటన లో కూడా, మనిషి ని సమాజం కన్నా, ప్రభుత్వం కన్నా ముందు ఉంచడం జరిగింది. ఈ హక్కులకు హద్దులు కేవలం మిగతా వారి హక్కులకు హాని కలిగించకుండా వుండే వరకు …

థామస్ జెఫర్సన్

మరి “ఆనందమె జీవన మకరందం” లాగ, ఈ pursuit of happiness ఏమిటి? నిజానికి, కొంత మంది ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు లాగా భావించారు. John Locke  ఈ మూడింటి గురించి రాశాడు (ప్రాణ హక్కు, స్వేచ్ఛ, ఆస్తి హక్కు). ఇంతకు ముందున్న ఇటువంటి ప్రకటనలు (ముఖ్యంగా magnacarta చూస్తే), ఆస్తి హక్కు గురించి ఎక్కువ ప్రస్తావన ఉంది. దాని బదులుగా, ఈ ప్రకటన లో ఆనంద ప్రయత్నానికి ముందు పీట వేశారు. దీనికి మూల కారకుడు జెఫర్సన్.

ఒక విధంగా చూస్తే, ఇది సుఖ లాలసత్వంలాగా కనబడుతుంది గానీ, దీనిలో వేరే భావం ఉన్నది. జీవితానికి బ్రతకటమే ఒక పరమావధిగా భావించే రోజుల్లో, మనల్ని ముందుకు నడిపించేది, రేపు కోసం ఎదురు చూసేలా చేసేదీ ఈ pursuit అని భావించారు. ఆనందం అంటే కేవలం సుఖం మాత్రమే కాదు. అన్ని విధాలుగా మనిషిని పరిపూర్ణం చేసే కార్యం ఇది.

ఈ వాక్యంలో  మరో ముఖ్య విషయం ఉన్నది “సెల్ఫ్-ఎవిడెన్ట్” అని. అంటే ఈ విషయాలకు వేరే ఋజువులు, సాక్ష్యాలు అవసరం లేదు. ఇవి  ప్రతి ఒక్కరూ ఒప్పుకొనే విషయాలే. వీటిని ఆది సత్యాలు అని అనవచ్చు.

కానీ, ఏవి ఋజువులు అక్కర్లేని విషయాలు? అందరూ ఒప్పుకునేవి ఉంటాయా? సాధారణంగా, ఇటువంటి ఆది సత్యాలు మత పరంగా వచ్చిన నిర్దేశితాలు. నిజానికి, కొన్ని వేల ఏళ్లుగా మతం మనిషికి చట్టాన్నిచ్చింది. అమెరికా మొదటి రోజుల్లో మత విశ్వాసాలతో ప్రారంభమైన దేశం అయినప్పటికీ, ఈ జాతి పితల్లో కొందరు నాస్తికులు, మరి కొందరు మతాన్ని పూర్తిగా నమ్మని వారు. అన్ని దేశాలనుంచి అమెరికా కి  వస్తున్న ప్రజలు రకరకాల మతాలకి (లేదా, మాట శాఖలకు) చెందిన వారు. అందుకే మత పరంగా ఆది సత్యాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు.

ఆది సత్యాలు మరికొన్ని ఆచారాల నుంచి వచ్చిన సత్యాలు. ఉదాహరణకి మనం కుక్క మాంసం తినం. ఇది మన ఆచారం.  చైనీయులు తింటారు. అది వారి ఆచారం. ఏది తప్పు? మనకి వాళ్ళు చేసేది తప్పు. వాళ్ళకి మనం చేసేది తప్పు. అప్పటికే రక రకాల ఐరోపా దేశాలనుండి వచ్చిన మనుషులు వేరే వేరే ఆచారాలతో వచ్చినప్పటికీ, చదువుకున్న వారంతా enlightnment అంటే ప్రగతిశీల భావాల ప్రభావానికి లోనై ఉన్నారు. మరి ఆచార పరంగా కాకపోయినా, వీళ్ళు కొన్ని కొన్ని విషయాలు ప్రశ్నించ కుండా ఒప్పుకుంటారు.

ప్రగతి శీల వాదంలో అన్నిటికన్నా ముఖ్యం సహజ సత్యాలు. అంటే natural law. ఇవి మానవుడిలో అంతర్గతంగా ఉండి మానవ తత్వాన్ని శాసించే లక్షణాలు. ఉదాహరణకి, బిడ్డలు తల్లిదండ్రుల బాధ్యత. ఇది మతం చెప్పింది కాదు, ఆచారం కాదు. ప్రకృతిలో కోతులూ, కొండముచ్చులూ కూడా ఈ బాధ్యతను పాటిస్తాయి. అందుకే ఇది సహజ సత్యం అయింది.

ఆ విధంగా, ఈ మూడు హక్కులూ అన్ని విధాలుగా సెల్ఫ్-ఎవిడెన్ట్ అని రాశారు.

మరి Creator విషయమేమిటి? అందునా నాస్తికులు ఉన్న గ్రూప్ ఈ మాట ఎలా ఒప్పుకున్నారు? అది ఒక అమెరికన్ వైరుద్ధ్య భావం. మొదటిగా ఈ దేశం మరీ మత పిచ్చి ఉన్న వలస దారులతో నిండి ఉంది. కాల క్రమేణా మిగిలిన వారొచ్చినా, మతం ఇంకా ముఖ్యంగా ఉంది. అన్ని పక్షాల వాళ్ళు రాజీ పడ్డ మాట అది.

అంతే కాకుండా, జెఫర్సన్ deist — మతాన్ని నమ్మలేదు. కానీ, ఒక అతీత శక్తి ఉన్నదనీ, అది కూడా హేతుబద్ధంగా ఉంటుందనీ, నమ్మాడు. ఇక్కడ క్రియేటర్ అంటే ఆ అతీత శక్తి.  ఆ శక్తికి పూజలు, పునస్కారాలు, ప్రవక్తలూ అవసరం లేదు. అంతే కాకుండా ఆ శక్తికి మానవులకుండే స్పృహ ఉండకపోవచ్చు కూడా.

ఇక ఈ వాక్యం తర్వాత, ఒక పెద్ద వాక్యం ఉంటుంది. దాన్ని ఒక్కొక్క ముక్కగా చదువుకుందాం. That to secure these rights, Governments are instituted among Men, deriving their just powers from the consent of the governed. అంటే, ప్రభుత్వానికి అధికారం ప్రజల ఆమోదం నుంచి వస్తుంది అని. కానీ, ఆ అధికారం కూడా “జస్ట్” అంటే న్యాయపరమైన అధికారం కావాలి. ఏది న్యాయపరం? వ్యక్తి స్వేచ్ఛ, క్షేమం కాపాడడం న్యాయం చేయాల్సిన ముఖ్యమైన పని.

— That whenever any Form of Government becomes destructive of these ends, it is the Right of the People to alter or to abolish it, and to institute new Government, laying its foundation on such principles and organizing its powers in such form, as to them shall seem most likely to effect their Safety and Happiness. ఒక వేళ ప్రభుత్వం తన అధికారం ప్రజల సమ్మతి లేకుండా తీసుకున్నా, లేదా ఆ అధికారం న్యాయబద్ధమైనది కాకపోయినా, ప్రజలకు ఆ ప్రభుత్వాన్ని మార్చి మరో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనే హక్కు ఉన్నది.

దీనికీ, ఎన్నికలకూ తేడా ఏమిటీ? మరి ఎన్నికలలో కూడా ప్రభుత్వం మారుస్తారు కదా? ఇది ఎన్నికలగురించి మాటాడటం లేదు. ఇది ప్రభుత్వ వ్యవస్థ (Form  of Government) గురించి మాట్లాడుతుంది. ఎన్నికల ద్వారా కేవలం ప్రభుత్వమే మార్చగలం. నిజానికి వ్యవస్థ ను కూడా ఎన్నికల ద్వారా మార్చ వచ్చు గానీ, దానికి కొన్ని కష్టతరమైన అవరోధాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజల ఆమోదం లేకుండా అధికారం చలాయిస్తే, దాన్ని, ఎన్నికల ద్వారా మార్చ లేము. లేదా, ప్రభుత్వం న్యాయానికి బద్ధంగా లేక పోయినా ఎన్నికల ద్వారా మార్చలేము. అందుకే ఇంతకు ముందున్న వాక్య భాగం ప్రధానం.

మరి ప్రభుత్వం కూలగొట్టటమంటే చిన్న విషయం కాదు. సాధారణంగా విప్లవ వాదులు కూడా ఈ మాటలే వాడతారు. వీళ్ళు, తరవాత వాక్యంలో చెబుతారు: Prudence, indeed, will dictate that Governments long established should not be changed for light and transient causes — అంటే, ప్రభుత్వాన్ని చిన్న చిన్న కారణాల ద్వారా, లేదా, తాత్కాలిక కారణాల ద్వారా మార్చుకోగూడదు.

ఇక తర్వాత, ఈ పత్రం ఎందుకు ఇది చిన్న కారణం కాదో, ఎందుకు తాత్కాలిక కారణం కాదో, ఈ విధంగా ఈ ప్రభుత్వ వ్యవస్థ  అధికారం న్యాయబద్ధం కాదో, ఏ విధంగా ప్రజలు తమ అసమ్మతి తెలియచేశారో, ఏ విధంగా ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయో వివరంగా, క్లుప్తంగా చెబుతుంది. మొత్తం అంతా ఇక్కడ (https://www.archives.gov/founding-docs/declaration-transcript) చదవ వచ్చు.

ఈ ప్రకటన అంతా చదువుతుంటే, రెండు విషయాలు కొట్టవచ్చినట్లు కనబడతాయి. ఒకటి, ఇది చాలా బాగా రాసిన వచనం. ఎక్కడా పొల్లు మాటలు తగలవు. ఇంకా, కవితాత్మంగా కనబడుతుంది. ఉదాహరణకి ( Enemies in War, in Peace Friends).

రెండవ విషయం, ఈ పత్రంలో అడుగడుగునా కనబడే ఆదర్శవాదం. మనిషి కి కావలసిందేమిటి అటువంటి ప్రాథమిక అంశాలనుంచి, ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది అని భవిష్యత్ తగోగ్లెరాల వారికి సంజాయిషీ ఇచ్చుకుంటూ, ఆశాజనకంగానూ, వినమ్రంగాను, ధైర్యంగానూ వ్యక్త పరిచింది.

కానీ, రెండు విషయాలు మరిచి పోకూడదు. సాధారణంగా men అని కనబడితే అది సమస్త ప్రజానీకానికీ బదులుగా వాడతాం. కానీ, ఇది కేవలం పాశ్చాత్య దేశపు మగవాళ్లకు మాత్రమే. ఆడవాళ్ళకు ఈ హక్కులు ఇవ్వలేదు. నల్లవాళ్ళకు ఇవ్వలేదు (సరికదా, వాళ్ళను జనాభాలెక్కల్లో ⅗ భాగం కింద లెక్క వేశారు). ఇది ఒక విధంగా చూస్తే ఆశ్చర్యం లేదు. ఓటు హక్కు కేవలం ఆస్తి ఉన్న వారికే అని ఉండేది. ప్రభుత్వం పని కేవలం పన్నులు వెయ్యడం, ఆస్తి సంరక్షించడం కాబట్టి, అది సరిపోయింది.

కానీ, మరో విధంగా ఆశ్చర్యమే — చాల మంది జెఫర్సన్ లాంటి వాళ్ళు బానిసలు ఉన్న వ్యవస్థ ని వ్యతిరేకించారు. ఎందుకు ఈ అవకాశం తీసుకొని ఆ వ్యవస్థని రూపు మాపలేదు? అమెరికా వైరుద్ధ్య భావం ఇక్కడ తలెత్తుతుంది. కొన్ని రాష్ట్రాల్లో బానిసలు ఆర్ధిక వ్యవస్థకు ఎంత ముఖ్యమంటే, వాళ్ళు నల్ల వాళ్ళ హక్కులు అంటే, ఈ పత్రంమీద సంతకం పెట్టి ఉండే వాళ్ళు కాదు.

ఇదీ అమెరికా స్వాతంత్ర్య చరిత్ర. ఈ చిన్న ప్రకటన రక రకాల దేశాల మీద ప్రభావం చూపింది. ఇది చట్టం కాకపోయినా, ఇందులో భావాలు ఇప్పటికీ, రచయితలు, విలేఖరులు, న్యాయ వేత్తలు, పిల్లలూ, పెద్దలూ ఈ పత్రం నుంచి ఉటకింస్తారు. ముఖ్యంగా విప్లవ వాదులు ప్రభుత్వ వ్యవస్థ ను మార్చేటపుడు, ఈ పత్రం నుంచి ప్రేరణ తీసుకొన్న సంఘటనలు చరిత్రలో అనేకం కనబడతాయి (ఉదాహరణకి ఫ్రెంచ్ విప్లవం)

రామారావు కన్నెగంటి

రామారావు కన్నెగంటి కంప్యూటర్ సైన్సెస్ లో పీహెడీ చేసి 1986 నుండీ అమెరికా లో ఉంటున్నారు. మొన్న మొన్నటి వరకు HCL లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండి, ఈ మధ్యనే ఒక కొత్త కంపెనీ పెట్టారు. కంప్యూటర్లలో తెలుగులో పెట్టటానికి కృషి చేసిన తొలితరం నిపుణులు -- RTS అనే తెలుగు ట్రాన్స్ లిటరేషన్ విధానం వీరు చేసినదే.

6 comments

  • అన్నిటికన్నా అద్భుతం అనిపించింది ‘ ప్రజలని ప్రభుత్వం నించి కాపాడటం రాజ్యాంగం యొక్క లక్షణం’, అని మీరు చెప్పడం. నిజమే. నేను మన ఫండమెంటల్ రైట్స్ చదివినప్పుడు కలిగిన uncomfortable feeling కి సమాధానం దొరికింది అనిపించింది. నేను ఈ article share చెయ్యవచ్చు నా?

  • చాలా రోజుల తరువాత తెలుగులో చరిత్ర కాకుండా, డిక్లరేషన్ అఫ్ ఇండిపెండెన్స్ – దాని నేపధ్యం గురించి చదవడం బాగుంది.

  • తామే మనుషులమన్న భావన అమెరికాలో తెల్ల మగ వారికి చాలా బలంగా ఉండేది

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.