ఫుట్ బాల్ సీజన్లో గుర్తొచ్చే సినిమాలు

 

“ఫుట్ బాల్ ఆట తుపాకుల మోతలేని యుద్ధం” అన్నాడు జార్జి ఆర్వెల్. ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ ప్రకారం “అంతర్జాతీయ ఫుట్ బాల్ అన్నది యుద్ధాన్ని మరో పద్ధతిలో కొనసాగించడమే.” నేడు ఫిఫా ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. వేసవి వేడికి తోడు సాకర్ తాపంతో భూమి అట్టుడిగి పోతోంది. ఎవరు గెలుస్తారు? గత చాంపియన్ జర్మనీ అవుటైపోయింది. ఇక కప్పు పట్టుకుపోయేదెవరు? నెయిమర్ బ్రజిలా? మెస్సీ అర్జెంటినానా? లేక ఇంగ్లండా? బెల్జియమ్మా? ఇవే చర్చలు ఊరూ వాడా! స్టేడియంలో జట్టు ఆడుతోంటే అక్కడ చూస్తున్న ప్రేక్షకులేకాక దేశప్రజలంతా తమ జట్టు గెలుపోటములతో తమ పరువుప్రతిష్టలని ముడివేసుకుని భావోద్వేగానికి గురవుతారు. ఈ ఆటకున్న ప్రజాదరణ అలాంటిది. అందు వల్లనే ముస్సొలినీ, హిట్లర్ వంటి నియంతలు ప్రజలపై పట్టుసాధించే సాధనంగా ఫుట్ బాల్ని వినియోగించుకున్న తీరును వివరిస్తుంది బిబిసి చానెల్ ఫోర్ వారి డాక్యుమెంటరీ ‘ఫుట్ బాల్ అండ్ ఫాసిజం’. చలనచిత్రాల విషయానికొస్తే ఫుట్ బాల్ పై  చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ప్రగతిశీల కథాకథనాలతో వచ్చినవి కొన్నే. వాటన్నింటిలో అతి ముఖ్యమైనది జోల్టన్ ఫాబ్రీ నిర్మించిన హంగరీ సినిమా. ఈ సినిమా గొప్పతనాన్ని పరిశీలిద్దాం.

రెండున్నర రెట్ల నరకం (TWO HALF TIMES IN HELL)

    అది1944 నాటి వసంతం. రెండో ప్రపంచ యుద్ధ కాలం. హిట్లర్ అధీనంలోని ఉక్రేన్లో ఓ జర్మన్ లేబర్ క్యాంపు. పశువుల కొట్టంలాంటి అపరిశుభ్రమైన ప్రదేశం. టూటైర్ మంచాలపై ఖైదీలు. ఎవరే భంగిమలో వున్నా వారంతా చేస్తున్నదోకటే – ఆదమరచి నిద్రపోవడం. వారెవరికీ నిద్రాభంగం కలిగించకుండా గదంతటినీ నిశ్శబ్దంగా కలయజూస్తూంది కెమెరా. ఆకలికి మించిన అలసటకు చిహ్నంగా చేతిలో సగం బ్రెడ్ ఉండగా నిద్రలోకి జారుకున్న ముసలాడు కనిపిస్తాడు. పారలు, గునపాలు, సుత్తులు వంటి పనిముట్లు గోడకు ఆనించి ఉన్నాయి. ఆరంభ దృశ్యమే చూడబోయే సినిమా రుచిని చూపించేస్తుంది. నిమిషంలో మైదానంలోకి హాజరు కమ్మంటే కావాలి. అర నిమిషంలో బూట్లు తీసి వృత్తం మధ్యలో పెట్టమంటే పెట్టాలి. మళ్లీ అర నిమిషంలో బూట్లు వేసుకోమంటే వేసుకోవాలి. జీర్ణావస్థలోని ఆ బూట్లు కూడా వారి దుస్థితికి అద్దం పడతాయి. అక్కడ కమ్యూనిస్టులున్నారు, ట్రేడ్ యూనియన్ లీడర్లున్నారు, నాటక రచయితలున్నారు, యూదులున్నారు. వారిలో ఒనోడీ (నిక్ నేమ్ డియో‘) అనే ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడున్నాడు.                        

ఒనోడీ దగ్గరికి క్యాంప్ అధికారి ఓ ప్రస్తావన తీసుకొస్తాడు – హిట్లర్ జన్మదినం నాడు జర్మనీ జట్టుతో ఆడేందుకు ఖైదీలతో ఓ ఫుట్బాల్ టీంను తయారుచేయాలి. నాటక ప్రదర్శన యత్నాలు ఫలించలేదు కాబట్టీ, ఆ దినం రాబోతున్న ఉన్నతాధికారిని మెప్పించాలి కాబట్టీ, ఈ మ్యాచ్ తప్పనిసరి. ఒనోడీ మొదట్లో ఒప్పుకోడు. కళేబరాలతో ఫుట్బాల్ టీం  తయారుచేయడం కుదరని పని అనుకుంటాడు. కానీ తోటి ఖైదీల్లో కొందరి సలహా మరోలా ఉంటుంది. దాన్తో, ఒనోడీ తమ అధికారి ముందు కొన్ని షరతులు పెడతాడు. ఆటగాళ్లకు అదనపు ఆహారం ఇవ్వాలి. మ్యాచ్ జరిగే వరకు రోజూ ప్రాక్టిస్ చేసుకోనివ్యాలి. వేరే పనులు చెప్పకూడదు. పై అధికారుల్ని మెప్పించాల్సిన  అవసరం ఉండటాన ఒనోడీ షరతుల్ని అంగీకరిస్తారు జర్మన్లు.

జీవచ్ఛవాల్తో టీం తయారుచేయడం ఒనోడీకి  పెద్ద సవాలుగా మారుతుంది. చివరికి తమ క్యాంపు నుండి ఎనిమిదిమందితో సహా మరో క్యాంపులోని ముగ్గురిని ఎంపిక చేస్తాడు. స్టీనర్ అనే యూదుడు తను ఔట్ సైడ్ లెఫ్ట్ఆటగాడిని అబద్ధం చెప్పి టీంలో చేరతాడు. యూదుడిగా అదనపు అణచివేతతో నిత్యం మృత్యుభయంతో ఉన్న అతడు ఈ అవకాశాన్ని వరంలా వాడుకుంటాడు. కానీ ప్రాక్టీసు మొదలవగానే పట్టుబడతాడు. ఒనోడీ వెళ్ళగొట్టబోతే ఇతర మెంబర్ల అభ్యర్థనతో స్టీనర్ టీంలో కొనసాగుతాడు. క్యాంపులో కొంతమందికి ఒనోడీపై పట్టరాని కోపం -జర్మన్లతో కుమ్మక్కయ్యాడని.

     మ్యాచ్ అయ్యాక విడుదల చేస్తారన్న గ్యారంటీ ఎటూ లేదు కనుక అవకాశాన్ని దొరకబుచ్చుకుని పారిపోవడం ఉత్తమమని మెజారిటీ ఆటగాళ్ల అభిప్రాయం. ఓ మధ్యాహ్నం కాపలాగా ఉన్న కార్పొరల్ పై దాడిచేసి తప్పించుకుంటారు ఆటగాళ్లు. కానీ చివరకు పట్టుబడతారు. ఇప్పుడు వారిపై అదనపు నేరాలు. కోర్టు మార్షల్, ఆపై మరణదండన ఖాయం. కానీ, శిక్ష అమలు మాత్రం మ్యాచ్ తరువాతనే. ఇక, ఆడినా, ఆడ నిరాకరించినా, గెలిచినా, ఓడినా మరణం తథ్యం అన్న పరిస్థితిలో ఆట మొదలౌతుంది.

ఒకవైపు భారీ సైనిక దళాలు, మరోవైపు హంగేరీ శ్రామిక ఖైదీలు. జర్మనీ ప్రధానాధికారి, అతడి లేడీ సమక్షంలో మ్యాచ్ మొదలు. ఒనోడీకి బంతిపై గురిలేదు. జర్మన్ జైలుగార్డులు 3-0 ఆధిక్యత సాధిస్తారు. దద్దమ్మల్లారా? పోతుల్లా మెక్కారు, గోల్ చేయండిఅంటూ రెచ్చగొడతారు ప్రేక్షక ఖైదీలు. ఒనోడీ, నీ తడాఖా చూపించుఅంటూ ఓ కుంటివాడు (ఒనోడీ స్నేహితుడు) అరుస్తాడు. హాఫ్ టైం సరికి ఒనోడీ ఓ గోల్ వేస్తాడు. వాతావరణం మరింత వేడెక్కుతుంది. ఆట 3-2 కు చేరి హంగేరియన్ల కోసం ఓ పెనాల్టీ అవకాశం వస్తుంది.  ఈలోగా జర్మన్లకు సింహస్వప్నమైన రష్యా యుద్ధవిమానాలు పైనుంచి ఎగుర్తూ రావడంతో, అందరూ నేలపై మోకరిల్లుతారు. స్వస్తిక్ జండా భయంతో తనలోకి తను ముడుచుకుపోతుంది. ఓ అధికారి ఒనోడీ దగ్గరికి పాక్కుంటూ వచ్చి గోల్ వెయ్యొద్దని మొరపెట్టుకుంటాడు. ఒనోడీ నిర్ణయం మరింత దృఢమౌతుంది. విమానాలు ఆ ప్రాంతాన్ని దాటిపోయాక ఆట పునఃప్రారంభమౌతుంది. పెనాల్టీతో  ఆట 3-3 అవుతుంది. హంగేరి ఖైదీలను అదుపు చేయడం కష్టమౌతుంది. అంతా బౌండరీ దగ్గరకు వచ్చేస్తారు. డియో! మనం గెలిచితీరాలిముందుకు దూసుకొచ్చి అరుస్తాడు కుంటివాడు. ఒనోడీని మొదట్లో అసహ్యించుకున్న వాళ్లు కూడా ఉత్సాహపరుస్తారు. అంతే, మరో గోల్తో హంగేరి ఆధిక్యం సాధిస్తుంది.

ఏం జరుగుతోందిక్కడ?’ ఉక్రోషంగా గర్జిస్తాడు ప్రధానాధికారి. ఇది కేవలం ఆట సార్ఓ అధికారితో పాటు, అతడి లేడీ కూడా సర్దిచెబుతుంది. కాదు, ఇది తిరుగుబాటు‘. ఈలోగా మేం లీడింగ్లో వున్నాం‘  అంటూ పరుగుతీస్తాడు స్టీనర్. గెలిచిన వారిని మెచ్చుకుంటూ సహకరించాల్సిన పెద్దమనిషి రివాల్వర్ బయటికి తీస్తాడు. మొదట స్టీనర్, ఆపై ఒక్కో ఆటగాడూ, ముందుకు దూసుకొచ్చిన కొందరు హంగేరీ ఖైదీలూ భారీ మూల్యం చెల్లించుకుంటారు. గాఢనిద్ర దృశ్యంతో మొదలైన సినిమా ఫుట్ బాల్ హీరోల శాశ్వతనిద్రలో ముగుస్తుంది.

ఉక్రేన్లో జరిగిన డెత్ మ్యాచ్ఉదంతంపై వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత కాలంలో వచ్చిన చాలా సినిమాలకు మాతృకయింది. సిల్వస్టర్ స్టాలన్, మైఖేల్ కెరోటిన్ వంటి భారీ తారాగణంతో, పెలే, బోబీ మూర్ వంటి నిజజీవిత ఫుట్ బాలర్లతో వచ్చిన ఎస్కేప్ టూ విక్టరీ‘(1981), ‘లాంగెస్ట్ యార్డ్‘(1974, మరోసారి 2005), ‘మీన్ మెషిన్‘(2001) వంటి సినిమాలు ఈ సినిమాకు మారు రూపాలుగా నిలిచాయి. 1962 లో బోస్టన్ ఫెస్టివల్లో ఈ సినిమా క్రిటిక్స్ అవార్డు సాధించింది.

ఇటలీ వాస్తవవాద ప్రభావంతో సహజ సుందరంగా సినిమాలు నిర్మించాడు దర్శకుడు జోల్టన్ ఫాభ్రీ. ’20వ శతాబ్దం గురించి మాట్లాడాలంటే మానవజాతి అనుభవించిన క్రూరత్వం గురించే మాట్లాడాలి’ అని చెప్పే ఫాభ్రీ క్రూరత్వానికి నిలయంగా నిలిచిన ఓ ఒరిజినల్ లేబర్ క్యాంప్ లో సినిమా మొత్తం చిత్రీకరించాడు. తూర్పు యూరోప్ లో సుప్రసిద్ధుడైన ఈ దర్శకుడికి హంగేరి దేశపు అతిపెద్ద పౌర సన్మానం దక్కింది. ‘బేలింట్ ఫేబియన్ మీట్స్ గాడ్’ (1980) చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును కూడా కైవశం చేసుకున్నాడు.

‘పలాయనాన్ని మించిన విజయం’ (Escape to Victory) (1981)

నలుపు తెలుపు హంగేరి సినిమా నుండి విపరీతంగా ప్రేరణ పొందిన అమెరికన్ సినిమా ‘ఎస్కేప్ టు విక్టరీ’. దర్శకుడు జాన్ హూస్టన్. సిల్వస్టర్ స్టాలన్, మైకెల్ కెయిన్ వంటి తారాగణంతో పాటు నిజ జీవిత ఫుట్ బాలర్లైన పెలె, బాబీ మూర్ వంటి ఆటగాళ్ళు కూడా ఈ సినిమాలో నటించారు.

అది జర్మనీలోని ఒక యుద్ధ ఖైదీల కారాగారం. మిత్ర కూటమికి సంబంధించిన ఎన్నో దేశాల ఖైదీలు ఆ బందిఖానాలో వున్నారు. పై సినిమాలోని ఒనోడీ స్థానంలో కెప్టెన్ జాన్ కొల్బీ (మైకెల్ కెయిన్) ఉంటాడు. ఇతడు యుద్ధబందీ కాక మునుపు వెస్ట్ హాం ఆటగాడు. పారిపోవాలన్న పంతం వున్నవాడు రాబర్ట్ హచ్ (సిల్వస్టర్ స్టాలన్) అనే అమెరికన్ సైనికుడు. యుద్ధఖైదీలతో ప్రాక్టీసు కొనసాగిస్తుంటాడు కొల్బి. షరా మామూలుగానే జర్మనీ తో ఫ్రెండ్షిప్ మ్యాచ్ ప్రస్తావన అందుతుంది కొల్బికి. జర్మనీ అధీనంలో వున్న పారిస్ లో ఆట జరగాల్సి వుంది.  ప్రాక్టీసు అవకాశాన్ని వినియోగించుకుని పారిపోతాడు హచ్. పారిస్ లో ఫ్రెంచ్ రెసిస్టన్స్ వారితో సంప్రదింపులు జరిపి వస్తాడు. ఆట నెపంపై వచ్చిన ఆటగాళ్ళను తప్పించుకునే ఏర్పాటు చేయడానికి ఒప్పుకుంటారు రెసిస్టన్స్ వాళ్ళు. పక్షపాతంతో వ్యవహరిస్తున్న రిఫరీతో ఆట సాగుతుంది. హాఫ్ టైం సరికి ఆట జర్మనీ 4 ఖైదీలు 1 స్కోరులో వుంటుంది. ఆ సరికే వారికి తప్పించుకునే దారి రెడీ అవుతుంది. అయితే తప్పించుకునేదా లేక ఆటాడి జర్మనీని ఓడించేదా? కొంత ఘర్షణ పడ్డాక ఆడ్డానికే సిద్ధపడతారు ఆటగాళ్ళు. ఆట 4-4 అయ్యేలోగా ఒక గోల్ ను కాదని కొట్టిపారేస్తాడు రిఫరీ. చివరికి ఫెర్నాండేజ్ పాత్రదారి పేలే మోటార్ సైకిల్ గోలుతో 4-4 డ్రా అవుతుంది. ఓ లెక్కన మిత్రపక్ష ఖైదీలు 4-5  తో గెలిచినట్టే. (గోల్ కాన్సల్ కాని పక్షంలో) కానీ జర్మనీని గెలవనీయలేదన్న సంతృప్తి మిగులుతుంది. ఆవేశం పట్టలేక స్టేడియం లోని జనాలు గ్రౌండ్ లోకి దూసుకొస్తారు. ఈ గందరగోళంలో ఆటగాళ్ళు తప్పించుకుంటారు. జర్మనీ అహాన్ని దెబ్బతీసిమరీ తప్పించుకుంటారు. పీడితుల పట్టుదల ముందు నియంతలు తలదించుకోవలసిందే. అయితే ఈనాటి పరిస్థితిలో అమెరికా వాళ్ళనుంచి ఫాసిజం వ్యతిరేక సినిమాలు చూస్తే ఫన్నీగా వుంటుంది.

 2006 వరల్డ్ కప్ కాలంలో టీనేజి అమ్మాయిల క్రికెట్ క్రేజ్ ని చాలా హృద్యంగా చూపింది జాఫర్ పనాహీ ఇరాన్ సినిమా ‘ఆఫ్ సైడ్’. ఈ దర్శకుడు తన దుస్సాహసిక సినిమాల కారణంగా గృహబందీగా వున్నాడు. బౌద్ధ బిక్షువుల ఫుట్ బాల్ పిచ్చిని కామికల్ గా తెరకెక్కించిన భూటాన్ సినిమా ‘ది కప్’ కూడా సాకర్ పై వచ్చిన మరో మంచి సినిమా.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.