ప్రశ్నలూ జవాబులూ

                                                                

 

 

పి. స్వర్ణలత, చెన్నయ్.

ప్రశ్న:  రామలక్ష్మి( ఆరుద్ర) గారితో, తెలకపల్లి రవిగారు చేసిన ఇంటర్వ్యూ ఈ మధ్యనే చూశాను. నేను టీచర్నండీ. యూ ట్యూబులు చూడడం ఈ మధ్యనే అప్పుడప్పుడూ. ఖాళీ తక్కువ అసలు. రామలక్ష్మిగారు, శోభన్ బాబు భార్యని “గౌడు గేదె” లాగ వుంటుంది అనేసిందండీ! నేను సరిగ్గా వినివుండనని, ఇంకో రెండు సార్లు కూడా మళ్ళీ విన్నాను. నమ్మలేకపోతున్నాను. అడాళ్లయినా, మొగాళ్ళయినా, నల్లగా వుండొచ్చు, లావుగా వుండొచ్చు. అలాంటి వాళ్ళని ‘గౌడు గేదెలు’ అంటారా? ఆవిడ కూడా రచయిత్రి కదండీ. ఇంత చిన్న విషయం తెలియదంటారా మనిషన్న వాళ్ళకి? ఆమెని శోభన్ బాబు ఇష్టపడే చేసుకున్నాడు కదా? ఎవరు చేసుకోకపోయినా ఒక అమ్మాయిని గానీ, అబ్బాయిని గానీ, అటువంటి మాటలు అనేస్తారంటారా?

జవాబు: మీరు ఇది రాయక ముందు, ఈ విషయం నాకు తెలుసు. వెంటనే, తరుచుగా టీవీ ఛానల్స్ చూసే వాళ్ళను అడిగాను. వాళ్ళు మీకన్నా బాధగా చెప్పారు. అప్పుడే ఆ ఇంటర్వ్యూ చూశాను. ఆ కోపంగా మాట్లాడిన వాళ్ళు, ఆమె మీద ఇంకో పాత విషయం చెప్పారు. ఆమె ‘ప్రేమించు ప్రేమకై’ అని ఒక నవల రాసిందట. అది ఏదో ఇంగ్లీషు నవలకి కాపీ అని వీక్లీ వారికి తర్వాత తెలిసిందట. ఆమెని ‘క్షమాపణ’ చెప్పమన్నారట. కాపీ నవల పంపిందని. డబ్బు వెనక్కి ఇచ్చెయ్యమన్నారట! నా నవల విషయంలో కూడా ఆమె అలాగే చేసింది కదా? మీరు నాకు బాధపడుతూ రాశారు గానీ, ఆమెకే విమర్శిస్తూ రాయవలిసింది.

****

 కె. వరలక్ష్మి, విజయవాడ.

ప్రశ్న: మా ఫేమిలీ డాక్టర్ గా పరిచయం వున్న పెద్ద వయసు డాక్టర్ గారు ఈ మధ్య కుడి చేతికి కాశీ దారం కట్టుకున్నారండీ! ఇదేమిటని మా నాన్న అడిగితే, ”దీనివల్ల, మన ఆత్మశక్తి ఇనుమడిస్తుంది” అన్నారు. మా ఇంట్లో అందరం తెల్లబోయాం. కానీ, మా తమ్ముడు ఆ దారం కట్టుకుంటానని పేచీ పెట్టాడు. ఆ డాక్టర్ ని వాడు అడిగి ఒక దారం కట్టించుకున్నాడు. మేమెవ్వరం వాడితో మాట్లాడడంలేదు. వాడికి 11 ఏళ్ళు దాటాయి ఇప్పుడు.

జవాబు: కొన్నాళ్ళు వూరుకోండి! విమర్శలతో చెప్పండి! కొన్నాళ్ళు సహించండి! హేతువాదం పుస్తకాలు చదవండి వాణ్ణి కూర్చోబెట్టి. మారతాడని నా నమ్మకం.

***                                                                                    *

 ఎన్. విజయ, ఒంగోలు.

ప్రశ్న: మా బంధువుల్లో ఒకావిడ, తన సెల్ ఫోన్లో కుక్కని ఒళ్ళో పెట్టుకుని, దాన్ని ముద్దాడుతూ, ఆ ఫొటో పెట్టుకుంది. ఆ ఫొటో వద్దంటే ఆవిడ ఫోనులే మానేసింది. ఆ కుక్కకు ఒక సినిమా తార పేరు పెట్టింది. ‘ మా తారని ప్రేమిస్తేనే నాతో మాటలు వుంటాయి’ అని రాసింది. నేను పూర్తిగా వదిలేశాను. ఆమె నాకు దూరం బంధువు కాదు. అక్క వరస మనిషి. కుక్క కోసం బంధుత్వం వదిలేసింది!

జవాబు: పూర్తిగా బ్రతికారు మీరు. ఆమెనే కాదు ఆ కుక్కని కూడా ‘చిన్నక్కా’ అని పిలవగలిగితే, మీ బంధుత్వం మీకు దొరుకుతుంది. చెయ్యగలరా అలాగ?

***                                            

వి. మార్కండేయులు, రాజమండ్రి.

ప్రశ్న: సమాజంలో జరిగే, కార్మికులు చేసే పనుల్ని ‘శ్రమలు’ అంటారు కదా? కానీ కొన్ని పనుల్ని సర్వీసెస్ ( సేవలు) అంటారెందుకు?

జవాబు: ఏదైనా వస్తువుల్నీ, పదార్ధాల్నీ, తయారు చెయ్యడాన్ని ‘శ్రమలు’ అనీ; బండి నడపడం, విద్య నేర్పడం, వైద్యం చెయ్యడం వంటి పనుల్ని ‘సేవలు (సర్వీసెస్’) అనీ అంటారు, పెట్టుబడిదారీ అవగాహనలో. కానీ, ఆ ‘సేవలు’ అంటున్నవి కూడా శ్రమలే, మార్క్సిజం ప్రకారం.

***

ఆర్. సంపత్, వరంగల్.

ప్రశ్న: ఈ నాడు  సెల్ ఫోన్లకి బాగా అలవాటు పడ్డ వాళ్ళు, ‘’ ప్రపంచం అంతా మన అరిచేతిలో వుంది” అంటారు. ‘అది నిజమే కదా’ అనిపిస్తుంది. నిజమంటారా?

జవాబు: సెల్ ఫోన్ల వాళ్ళ అరిచేతుల్లో వున్నది, ‘బూర్జువా ప్రపంచమే’. అది, మొత్తంలో పదో వంతు కావొచ్చు. మిగతా ప్రపంచం అంతా విషాద ప్రపంచం! దాన్నీ, దాని నిజాల్నీ, అరిచేతుల్లో చూడగలుగుతున్నారా? – అది చెప్పమనండి వాళ్ళని.

***

ఎ. అరుణ్ కుమార్, హైదరాబాదు.

ప్రశ్న: మార్క్సు రాసిన ‘కాపిటల్’ పుస్తకాన్ని చదవడం, “పెటీ బూర్జువా దృష్టి” అని ఎవరో పెద్ద కమ్యూనిస్టు నాయకుడే అన్నాడని మీరు ఒకచోట రాసింది చదివాను. నమ్మలేని విధంగా వుంది అది. అయినా నమ్ముతున్నాను. మీరు, ఆ నాయకుడితో, “ అయితే మార్క్సు, ‘శ్రమ దోపిడీ’ గురించి, దాన్ని తీసివెయ్యాలని అంత పుస్తకం వ్రాయటం ‘పెటీ బూర్జువా దృష్టితోనే రాశాడా?’ అని మీరు అని వుండరా? మీరు అలా అన్నట్లు రాసినది గుర్తు లేదు.

జవాబు: ఆయనతో ఆ మాట అన్నానో లేదో గానీ, ”ఇదేం మాట!” అని ఆశ్చర్యపోతూ అన్నాను. వాళ్ళ పార్టీ డాక్యుమెంట్లే చాలని ఆయన అన్నాడు. అసలు ఆయన, ‘కాపిటల్’ చదవకుండానే పార్టీ నాయకుడు అయ్యాడు!

***

హరి. ఎస్. బాబు ( ‘నెట్’ నుంచి)

ప్రశ్న: “ఆదిమ కమ్యూనిస్టు సమాజం” గురించి కొంచెం శాస్త్రీయమైన వివరణ ఇవ్వగలరా? ఎందుకంటే, మార్క్సు ప్రతిపాదించిన ‘మానవాళికి అంతిమ లక్ష్యమైన వర్గ రహిత సమాజం, కొన్ని తేడాలతో ఆదిమ దశనే ప్రతిఫలిస్తుంద’ని చెప్పారు కదా? వర్గ రహితమైన ఆదిమ సమాజం ఉనికిలోకి ఎలా వచ్చింది?

జవాబు: మీరు అడిగిన ప్రశ్నలో, మొదటి భాగం ఇది. మొదట దీన్ని గురించి అసలు విషయం తెలిస్తే, తర్వాత విషయాల్ని అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. మీ ప్రశ్నలో ‘ ఆదిమ సమాజం’ ఎటువంటి సమాజం అయినట్టు కనపడుతోందంటే, ఆ సమాజం కన్నా పూర్వం ‘శతృ వర్గాలు’ వుండేవనీ, ‘శతృ వర్గం’ మీద పోరాటం వల్ల అ సమాజం, వర్గాలు లేని సమాజంగా మారిందనీ, అందుకే అది, ఆదిమ కమ్యూనిజం’ అయిందనీ, మీరు అర్థం చేసుకున్నట్టు కనబడుతోంది. ఇదంతా పొరపాటు. ‘ఆదిమ కమ్యూనిజం’ అనడం వల్ల, ఆ సమాజం గురించి, అటువంటి అభిప్రాయం ఏర్పడి వుంటుంది. సరిగా అర్ధం చేసుకోవలిసిన విషయం ఏమిటంటే, ‘ఆదిమ సమాజంలో’ ఉన్న కాలం, వర్గ భేదాలు వున్న కాలం కాదు. అప్పటికి ఆ భేదాలేవీ లేవు. ఆ ప్రారంభ సమాజంలో, ‘యజమానీ శ్రామిక’ భేదాలు లేవు. అవి అప్పటికి ఇంకా ఏర్పడలేదు. సమాజంలో మనుషులందరూ శ్రమలు చేసుకుని బ్రతుకుతున్నారు. అప్పుడు, శ్రమలు చెయ్యని వాళ్ళెవరూ లేరు. ఆ రకంగా, అప్పటి మనుషులు ‘సమానులు’! వాళ్ల సంబంధాలు, సమానత్వ సంబంధాలు! ‘ యజమానీ శ్రామికులు’ అనే భేదాలు ప్రారంభమైనది, ఆదిమ సమాజం తర్వాతే. మానవులు అందరూ శ్రమలు చేస్తూ వున్న స్తితి, సమానులుగా వున్న స్తితే. అదంతా వాళ్ళు, ‘ సమానులుగా వుండాలి’ అని తెలిసి వున్న స్తితి కాదు. ఏదో ఒక పని చెయ్యకపోతే ‘తిండి’ వుండదు కాబట్టి, ఆ స్పృహతో అందరూ పనులు చేసుకున్నారు. అది ‘ సమానత్వం’ అని వాళ్లు ఎరుగరు. వాళ్ళకు తెలియకపోయినా వాళ్ల సంబంధాల స్వభావం, ‘సమానత్వమే’ అవుతుంది. ఆ సమానత్వం చెడిపోయింది, ఆ తర్వాత కాలంలోనే. బానిసత్వం  ఏర్పడింది ఆ తర్వాతే. ఆదిమ సమాజంలో, అందరూ శ్రమలు చేస్తూ వున్నవారే కాబట్టి, దాన్ని ‘సమ సమాజం’గా ( ‘కమ్యూనిజం’గా) తర్వాత చరిత్రకారులు అన్నారు. ‘ఆదిమ కమ్యూనిజం’ అనే మాటలు మార్క్సు- ఎంగెల్సుల రచనలలో కనపడవు. వాళ్ళు, ఆదిమ సమాజాన్ని ‘కమ్యూనిజం’ అనడానికి వ్యతిరేకులు అని కాదు. ఆ మాట అయితే వాళ్ళు వాడలేదు. మానవుల్లో ఏ భేదాలైనా పుట్టడం, ఆదిమ కాలంలోనే ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళకి, సమానత్వమూ తెలియదు; అసమానత్వమూ తెలియదు, ఏమీ తెలియని కాలం అది. అది, ఒక గ్రహింపుతో ఏర్పడిన సమానత్వం కాదు. కానీ, మార్క్సు ఎంగెల్సులు ‘కమ్యూనిజం’ గురించి చెప్పిన అర్ధాల్ని బట్టి, మానవులు ఆదిలో జీవించిన కాలాన్ని ‘కమ్యూనిజం’తో పోల్చవచ్చు- అనడానికి వీలు వుంది. మార్క్సు ఎంగెల్సులు రాసిన ‘’జర్మన్ ఐడియాలజీ’’లో, ఆ పాత కాలంలో, క్రమంగా పాత శ్రమ విభజన మారుతూ వుండడం వల్ల, వర్గాలు ప్రారంభమయ్యాయి- అని అర్ధం చేసుకునే వివరాలు వున్నాయి. మీరు, 2వ ప్రశ్నలో, ‘తీసిస్- యాంటీ తీసిస్- సింతసిస్’- అనే విషయాలు చెప్పి, “ఇది నాకు గందరగోళంగా వుంది’’ అన్నారు. దేన్ని అయినా, అది ఎంత వరకూ పనికి వస్తుందో తేల్చుకోకపోతే, అది గందరగోళమే. ఈ విషయాల గురించి, నా ‘తత్వ శాస్త్రం’ పుస్తకంలో కొంత విమర్శగా రాశాను. ‘తీసిస్’ అనేది, ఏదో ఒక విషయం గురించి ఒక అభిప్రాయం. ‘యాంటీ తీసిస్’ అనేది, మొదటి వాదన మీద వ్యతిరేక వాదన. ఈ 2 పరస్పర వ్యతిరేక వాదనల వల్లా, ‘సింతసిస్’ అని ఫైనల్ అయిన వాదన నిర్ధారణ అవుతుంది- అని!

ఆదిమ సమాజమే, శతృ వర్గం మీద పోరాటం చేసి, ‘కమ్యూనిజం’గా ఏర్పడిన సమాజం అయితే, అది ఎలా పోయింది? మంచీ-చెడ్డా వాదాల మధ్య పోరాటం జరిగి, చివరికి మంచి వాదం స్తిరపడుతుంది- అన్నట్టయితే, ’ఆదిమ కమ్యూనిజం’ మళ్ళీ వర్గ  భేదాలతో ఎలా ఏర్పడింది? ఇలా జరిగితే, ‘తీసిస్- యాంటీ తీసిస్- సింతసిస్’ అనే సూత్రం తప్పు అవుతుంది కదా?- అన్నారు మీరు. సరిగా ఆలోచించారు. అసలు మీ మొదటి తప్పు, ‘ఆదిమ కమ్యూనిజం’ అనే దాన్ని వర్గ పోరాటాలు చేసి ఏర్పడినది – అని భావించడం! అది తప్పు. ఇక ‘తీసిస్’ల  సంగతి. అది ‘ప్రకృతి’కి వర్తించేదే గానీ, సమాజానికి వర్తించేది కాదు. రేపు ‘ వర్గ రహిత సమాజం’లో ఏదో చెడ్డ పుట్టిందంటే, అది మళ్ళీ వర్గ పోరాటంతో, వర్గాలే లేని విధంగా మారవలిసిందే. అది తప్పకుండా చెడ్డగా మారిపోతుంది అనే అవగాహన సరికాదు.

మానవ సమాజంలో, వర్గాలు లేకపోవడమే సరైన దశగా కొనసాగుతూ వుండాలి. జనాలకు ఆ చైతన్యం వుండాలి- అని. అలా గాక, ఎప్పుడూ తప్పులుగా మారుతూ వుంటే, ‘సింతసిస్” దశ ఎలా నిజం అవుతుంది?   

*** *** *** ***

రంగనాయకమ్మ

2 comments

    • మరోసారి చూశాం. ప్రూఫ్ మిస్టేక్స్ వుండినై. సరి చేశాం. థాంక్యూ.

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.