I Quit your World

 

నిరాశ పొడగట్టనీయకు.
​దుఃఖాన్ని గూడు కట్టనీయకు. ​

తెలుగు ఓడుతోన్న  కమ్మని నేతి గారెల్లాంటి పుస్తకాలు.
చదువుకో హాయిగా,ఏ చెట్టు కిందో కూచుని.    

అక్కడ ఒకటే కోలాహలం.  
ఎవడి మాట- ఎవడికీ – వాడికే – వినిపించడంలేదు.
లోకమంతా అల్లుకుపోయిన సాలె గూటిలో
తల్లకిందులుగా చిక్కుకున్న మెదళ్ళు.  

దానికి  ఎంత జనత ఉన్నా,
వద్దే వద్దు మనకి.
పారిపోదాం పద.

గిన్నె పువ్వుల్లోకి
తామర తూడుల్లోకి.  

తటాకాన్ని కలచి,
వాలబోతోన్న కవితలను
చెదరగొడుతుంది
ఒక వాగ్వివాదం.

మానసిక ఆకాశాన్ని
పులిమేసిన రంగులలో,
పోగొట్టుకు పోతుంది
కవిత.  

ప్రజలు అవకాశం ఉన్న చోట గొంతు పట్టుకుంటారు.
అవసరం ఉన్న చోట పాదాలు.

ప్రేమైక మూర్తులని చెంత చేరబోతే,
గర్వోన్మత్తులై
అవహేళన చేయబోతారు,
అధికార దర్పం ప్రదర్శిస్తూ ప్రబోధాలు చెయ్యబోతారు కొక్కిరిస్తూ.       

ఆ మానసిక సంకెల తెంచుకుని నీ దారిన నువ్వు మౌనంగా పోబోతే
దక్కవలసినదేదో దక్కకుండా పోతోందని
ఆశాభంగం చెంది, తిట్లు లంకించుకుంటారు.

అహంకారమని,ఉన్మాదమని.             
 
ఊరు​కుంటేనే ఉత్తమం.

అబ్బే, నీ వ్యధలు, బాధలు, ముళ్ళు?

నాకేమిస్తావు అంటుంది లోకం.
నీ కాలం, వయసు, డబ్బు, తెలివి- ఏదో ఒకటి
ఇవ్వు, ఇవ్వు –
అందుకేగా వచ్చింది-
అంటుంది లౌక్యపు బురదల్లోంచి.

​కాలం సుడిలో కొట్టుకుపోయే ​
​కల్ల ​మాటల డొల్ల వీరులూ ​
భావుకుల్లాంటి కాముకులూ ​
కాముకుల్లాంటి పాషండు​లూ ​
పాషండుల్లాంటి ​శత్రువులూ  
​శత్రువుల్లాటి మిత్రులూ.

దీపపు క్రీనీడల్లో వెలుగు కోసం తచ్చాడకు
హృదయ వ్యాపారంలో  ఆత్మను మారకం చెయ్యకు.      
​మెరమెచ్చు మాటలు, గాజు పూసలు, భ్రమిసిపోకు.

ఆత్మీయత, స్నేహం అంటావు నీ హైస్కూలు గొంతుతో.

నీ అమాయకత్వాన్ని చూసి, తమలోని పచ్చి స్వార్ధాన్ని చూసుకుని చప్పున తప్పుకుపోతారు కొందరు ఉత్తమ జనులు.

ఉత్తినే? అంత కల్మషం లేకుండానా, అబ్బే,  అంటుంది-

ఒట్టిపోయిన ఇంటి ఆవును కబేళాలకి తోలేసే మిగతా లోకం
మూలనున్న ముసలమ్మకు మంచి నీళ్ళైనా ఇవ్వని లోకం.   ​

అవతల ఒడ్డుకి పారిపో పడవ వేసుకుని.

నిమ్మళంగా ఈ  కాలువ, మెల్లమెల్లమెల్లగా రెల్లు గడ్డి- గుసగుసలు విను.
గలగల్లాడే చెట్టు మాట్టాడ్డం ఆపాక.
ఆపుతుందిలే వేచి ఉండు.
ఆపకపోతే
ఆగాగు నేనూ వస్తున్నానని
గలగల అలల్లో
మునిగి అక్కడే ఉండు, బయటికి రాక.   

వచ్చే పోయే తెలి మబ్బులను చూస్తూ
కలలను కాడ కుట్టు కుట్టుకో నిశ్చింతగా.

గడ్డిలో అడ్డంగా పరిగెత్తి పోతోంది కుందేలు.
అడపాదడపా వాలిపోయే తోక పిట్టలు.

చూడూ, మధ్యాహ్నం కదలడం లేదు.   

 ***

పాలపర్తి ఇంద్రాణి

పాలపర్తి ఇంద్రాణి:  ప్రస్తుత నివాసం: హూస్టన్, టెక్సాస్, అమెరికా. చదువు: బి. టెక్, సిద్ధార్థ ఎంజినీరింగ్ కాలేజ్, విజయవాడ, ఎం ఎస్., వేన్ యూనివర్సిటీ, డెట్రాయిట్,. ఉద్యోగం: ఐటీ సెక్టారు..రచనలు:  ​వానకు తడిసిన పువ్వొకటి (కవితా సంకలనం,2005) అడవి దారిలో గాలిపాట (కవితా సంకలనం,2012) ఇంటికొచ్చిన వర్షం (కవితా సంకలనం,2016) ఱ  (నవలిక,2016) చిట్టి చిట్టి మిరియాలు  (చిన్ని కథలు ,2016)

2 comments

  • బాగుంది.చలం శైలి కనపడుతోంది.
    కానీ మొత్తం మీద, ఏదో అనువాద కవితమల్లే రాశారు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.