అమ్మ క్యాలండర్

నేను అమెరికాకు వొచ్చి ఎన్నాళ్ళయిందా అని ఆలోచన వచ్చింది ఇవాళ పగలెప్పుడో రోడ్డు మీద నడుస్తుండగా.

రోడ్డు మీద నడవక ఆకాశంలో  నడుస్తావా అని అడక్కండి.

మనూళ్లో అయితే, ఎంచక్కా రోడ్డు విడిచి చెట్ల మధ్య మన దుమ్ములో మన ధూలిలో నడవొచ్చు. ఇక్కడ అలాంటి ప్రదేశాలుండవు. ఏమేనా వుంటే,  ‘ట్రెక్కింగ్’ అనే ప్రత్యేక నడక కోసం కొన్ని ప్రదేశాలుంటాయి, దూరంగా.

ఎప్పుడు కావాలంటే అప్పుడు ‘ట్రెక్కింగ్’ చేయలేం కదా?! ముఖ్యంగా ‘నిష్కారు’ లైన నా వంటి వాళ్లు అంత దూరం వెళ్ళడమూ కుదరదు.

ఇక, ‘పగలు ఎప్పుడో’ అని ఎందుకన్నానంటే, ఈ వూళ్లో నాకు దిక్కులే కాదు వేళలు కూడా సరిగ్గా తెలియడం లేదింకా. ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు మూసిన తలుపులు తీసి, బయటికి నడవడమే.

ఇదేం చలికాలం కాదు. ఎండాకాలం. అయినా, బయటికి వెళ్తే, ఎడారిలో ఒంటరి ఒంటెనే. ఇళ్ళ బయట ఎవరూ వుండరు. కార్లుంటాయి, వాటి లోపలి మొహాలు కనబడకుండా గాజు ముసుగులేసుకుని.

బాగా సాయంత్రం కొందరొస్తారు, వాళ్లు కుక్కపిల్లల్ని పట్టుకెళ్తున్నారో, కుక్క పిల్లలు వాళ్ళని పట్టుకెళ్తున్నాయో తెలవకుండా.

సకృతుగా కన్పించే సైక్లిస్టులూ, పరుగుల వాళ్ళు మాత్రం… ఎదురయినప్పుడు ఒక నిరపేక్షిక, నిరపాయకర దరహాసమొకటి విసిరి, దాన్ని మనం అందుకునే లోగా వెలిపోతారు.

అదిగో అప్పుడొచ్చింది… నేనీ దేశానికి వొచ్చి ఎన్నాళ్ళయిందీ… అని ఆలోచన.

దానితో పాటు కాలాన్ని లెక్క గట్టడానికి మా అమ్మ అనుసరిస్తుండిన పద్ధతి గుర్తొచ్చి నవ్వొచ్చింది.

‘అమ్మా నేను ఏ  సంవత్సరం పుట్టాను’ అని అడిగానొక సారి.

‘ఏమోరా, ఎవురికి మతికుంటాయి అట్టాంటివన్నీ’ అంది అమ్మ.

నాక్కుంచెం కోపం వొచ్చింది. నేను గారు పుట్టడం ‘అట్టాంటి’ ఏవో వాటిల్లో ఒకటా, హమ్మా అనేసుకున్నాను లోపల. అది గ్రహించినట్టుంది అమ్మ. ఆలోచిస్తున్నట్టు ఎటో చూసి, “అవ్, అయాల పండ్గ. దస్ర పండ్గ. బాగా బచ్చాలు దిని నిద్రపొయినాం. రాత్రి నాకు నొప్పులు. దొంగనాకొడుక ఆ పండ్గనాడు, నువ్వు నన్ను తున్కలు (మాంసం) తిననియ్యకుండ పుట్టినావు. రాత్రి యా టైముకో కాన్పయ్యింది. అవ్, నువ్వు దస్ర పండ్గ రాత్రి పుట్టినావ్రా” అంది.

మాకు … అది ఏ పండుగ అయినా… అసలు పండుగ రోజు కేవలం భక్ష్యాలే. ఆ మరునాడు తునకలు అనగా యావదాంధ్ర భాషలో ముక్కలు. మాంసం కూర. ఆ పండుగ నాడు నేను కూడా తునకలు తిన్లేదనుకోండి. ఇంతకూ ఇక్కడ ముఖ్య విషయం మాంసం కాదు. అమ్మ మాట.

అమ్మ మాట వల్ల తెలిసిందేమిటంటే…  నేను గారు విజయదశమి రాత్రి పుట్టినారన్న మాట.

మరి ఏ సంవత్సరం?

ఇంగ్లీషుదే కాదు, తెలుగు సంవత్సరం కూడా మా అమ్మకు తెలీదని తెలిసే అడిగానామెను.

‘యా సమ్ముచ్చరమంటే నాకెట్ట తెలుచ్చాది. నన్ను మా వోల్లు బడికి పంపిచ్చినారా ఏమన్న నీ లెక్క? అయిన గాని, కాన్పు కంటె రెండ్రోజుల ముందు వరకు నేను గడాములలో తెల్సినోల్ల ఇంటికాడుంటి.’ అంది అమ్మ.

“నిండు మంచివి గదమ్మా, ఇంటికాడ వుండకుండా గడాముల్ల వుండడమేంది’ అని అడిగాను.

‘కమ్నిస్టోల్ల బయం’ అంది అమ్మ.

నాక్కొంచెం విచిత్రమైంది. ఈ మాటల కాలానికి నేను కొంచెం కమ్యూనిస్టును అనుకుంటున్నానాయె.

“ఏం, వాల్లంటే ఎందుకు బయం?”

“ఏమో మల్ల, వూర్లల్లొ అందరు అనుకుంటొండ్రి. వాల్లు ఇండ్ల మీద వడి యావుంటే అయి  జవుర్క పోతారని, దురమార్గులని. అందుకే మా బొల్లారంలో అందరు పగులు ఇండ్ల కాడ పన్లు జేసుకోని రేత్తిరికి గడాములకు వొయ్యి పండుకుంటొండ్రి. నాలెక్క నడ్సలేని ఆడోల్లు ఆన్నే వుండ్రి.

”కమ్యూనిస్టులు అట్టా దుర్మార్గులు కార్లే అమ్మా, వూరికె మీ బయం, అయన్ని సెప్పుడు మాటలు” అన్నాన్నేను.

“ఆ, కాదులేరా, దురమార్గులే. నేను గడాముల్లో వున్నెప్పుడే, ఆ వూర్లొ ఇండ్ల మీద పడ్రి గద”. అందామె.

“ఆ, ఎవురి ఇండ్ల మీద పడినారమ్మా…”, బాగా వున్నోళ్ళ ఇండ్ల మీద అయ్యుంటుంది, అది చెబుదామని ఆడిగాను.

“ఇండ్ల మీద అంటే ఇండ్ల మీద కాదనుకో, అయాల వొచ్చి పోలిస్ స్టేషన్ మీద పన్నారు, తుపాకులు ఎత్తకపొయినారు. ఆ రాత్రి పూట స్టేషన్ పక్కన ఇంట్లో ఒగ ముసిలామె ఓంటికి లేసొచ్చింటె, సీకట్ల కన్ను గానక ఆమె మీద కాల్చినారంట. అంతే అంతకు మించి ఏం గాలా? మరి రెండు దినాలకే నాకు కాన్పు. నువ్వు పుట్టినావు.” అంది అమ్మ తన కడుపులో వున్న సంగతులన్నీ చెప్పిన సంతృప్తితో నన్ను మళ్లి కన్నంత ప్రేమగా నా వైపు చూస్తూ.

‘హా దొరికెన్’ అనిపించింది నాకు. గడివేముల పోలీసు స్టేషన్ మీద దాడి గురించి, ముసలమ్మ మరణం సహా అంతకు ముందే తెలుసు నాకు. దాడికి నాయకత్వం వహించిన నాయకుడెవరో కూడా తెలుసు. చండ్ర పుల్లా రెడ్డి.

పెద్దన్న తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న నాయకుడు. పటేల్-నెహ్రూ సైన్యాలు వొచ్చి నిజాం నవాబుతో రాజీ పడ్డాక, కమ్యూనిస్టుల మీద వూచకోత మొదలయ్యింది. పార్టీ సాయుధ పోరాట విరమణ ప్రకటన ఇంకా అప్పటికి చేయలేదనుకుంటాను. (వెరిఫయ్యబుల్). నిర్బంధాన్ని తట్టుకుని, వుద్యమాన్ని కొనసాగించడం కోసం అచ్చంపేట ఆడవుల మీదుగా నల్లమలకు విస్తరించాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే గడివేముల పోలీసు స్టేషన్ మీద దాడి. మరి కొన్ని దాడులు కూడా జరిగి వుండాలి, లేకుంటే, నిండు గర్భిణిగా వున్న అమ్మ అలా తెలిసిన వాళ్ళ ఇంటిలో తల దాచుకోడమెందుకు?

అదంతా సరేనయ్యా, ఆ కథంతా సరే… అయితే ఏంటి?.

ఏం లేదు. గడివేముల స్టేషన్ మీద పెద్దన్న వాళ్ళు దాడి చేసిందెప్పుడు? అది సరిగ్గా నా ఎస్సెస్సెల్సీ రెజిస్టర్ లో మా నాయ్న రాయించిన నా జనన సంవత్సరం, అనగా 1951. సో, అది కరెక్ట్ గానే లెక్కగ్గట్టి రాశారు.

ఇక తెలియాల్సింది నెలా, తారీఖు మాత్రమే.

నెల, తారీఖు తెలుసుకోడానికి ఒక మార్గముంది.

1951 లో దసరా పండగ ఏ తేదీన వొచ్చిందో అదే నేను గారి జయంతి… ఛ ఛ… పుట్తిన్రోజు.

ఆ తేదీ ఎలా తెలుసుకు ఛావడం?

నా బుర్రలో ఈ పరిశోధన చాల కాలం పరిభ్రమిస్తూ వుండింది. చాన్నాళ్ల తరువాత, మేము హబ్సిగూడ ఇంట్లో వుండడం మొదలెట్టాక; నెల్లూరు నుంచి వెలువడే ‘లాయర్’ పత్రిక వాళ్ళు ప్రతి సంచిక ఒక కాపీ నాకు వుచితంగా పంపించే వారు. అందులో భాష నాకు నచ్చడం వల్ల ప్రతి సంచిక శ్రద్ధగా చదివే వాడిని. భాష సరే, అంత కన్న ఎక్కువ ప్రేమతో చదవాల్సిన ఒక సీరియల్ అందులో మొదలైంది. అది మల్లెమాల సుందర రామి రెడ్డి గారి ఆత్మ కథ. హైదరాబాదులో వున్నానంటే, ‘లాయరు’ పత్రికలో మల్లెమాల తీపి వాక్యాల్ని మిస్సయ్యే వాడిని కాను. ఆ ఆత్మ కథలో అయన తన పెళ్లి గురించి రాశారు. తన పెళ్లి 1951 లో విజయదశమి రోజు జరిగిందని, ఇంగ్లీషు కేలండర్ ప్రకారమైతే, అక్టోబరు 10 న జరిగిందని రాశారు.

అదండీ, నా బర్త్ డే(ట్) 1951 అక్తోబర్ 10 అన్న మాట.

రెజిస్టరు లో వున్నట్లు జూన్ ఒకటి అనబడే ‘సర్వనామం’ నాడు కానే కాదన్న మాట.

ఔనూ, ఇదంతా ఎందుకు చెప్పినట్టు? నేను అమెరికాకు ఎప్పుడు వచ్చాననే ఆలోచనకు దీనికి ఏమిటి సంబంధం?

ఏం లేదండీ, నేను కూడా కాలమానం లెక్క కోసం మా అమ్మ పద్ధతినే వుపయోగించాను.

నేను అమెరికాకు వచ్చినప్పుడు ఏం జరిగింది?

ఏదయినా పండగ?

ఔను, ఒక పండగే జరిగింది. ఆ పండగను మర్చిపోవడం ఇంపాజిబుల్.

నా మొదటి కథలో మా అమ్మ గర్భవతి. పుట్టింది నేను.

ఈ రెండో కథలో మా చిట్టితల్లి మమత గర్భవతి. పుట్టింది అనన్య.

అంతవరకు ఆ, అమెరికా ఏం పోతాం లే అనుకునే వాళ్ళం. మమ్మితల్లి ఎప్పుడో తనే వొస్తుందని, తనకు అదే బాగుంటే అక్కడే వుండనీ, మేం మాత్రం వుస్మానియా యూనివర్సిటీ వారన వుండే మా హబ్సిగూడ ఇంట్లోనే శిల పాతుకుని వుంటామని, ఎప్పుడు కావలిస్తే అప్పుడు గోడ పగులు గుండా యూనివర్సిటీలోకి వెళ్లి, ఐ. పి. ఇ. దగ్గర వలయాకారంగా కూర్చినట్లుండే అరుగుల వద్దకు నడిచి వెళ్తుంటామని, అట్నించి ఆర్కే, రమణ జీవి కూడా వస్తే మా నెమళ్ళ కోన దాక నడుస్తామని… అనుకునే వాడిని.

కాని దైవమొకటి తలచెను. మేము మమ్మిగాడు అని పిలుచుకునే మా చిట్టితల్లి నిజంగానే మమ్మి/తల్లి అయ్యే తరుణమాసన్నమాయెను. ఇక వూరుకోగలమా? ఎందుకేనా పనికొస్తాయని తీసి దాచుకున్న పాస్ పోర్టులు హడావిడిగా బయటికి తీశాం. అందరూ చెన్నై వెళ్తారు, మనం ఢిల్లి వెళ్దామని వెళ్లి విఫల మనోరథులమై, తరువాత విడివిడిగా ఒక్కొక్కరుగా చెన్నై కే వెళ్లి వీసాలు సాధించేం. (ఆనాటి అతిధ్యాలకు గాను హస్తినలో కృష్ణుడికీ, చెన్నైలో పసునూరి శ్రీధర్ కీ, కార్టూనిస్టు సురేంద్ర కీ చాల కృతజ్ఞులం).

నేను వీసాయుధుడనై అమెరికా చేరిన రెండు మూడు నెళ్లకు, మా ‘అనన్య మమతా అనిల్’ గారు హాజరు. మొదటి రోజే అనుకుంటాను అమ్మమ్మ ఒళ్లో పడుకుని అమ్మ చేతి లాలలో తన్మయమై అన్య తల్లి చూపిన ఆ మనోహర దరహాసం కోసం… నాకు యా మోక్షం వొద్దుర దేవుడా అనుకుంటాను.

నువ్వు లేవని అంటానా, తప్పైపోయింది, లెంపలు వేసుకుంటా, నన్ను మాత్రం మళ్లి మళ్లి ఇలాగే  ఆ అమ్మకే పుట్టించు, నవ్వితే చాలు… వూరికే కాదు ఇల్లదిరేలా.. నవరత్నాలు రాలే ఈ అమ్మాయినే సహచరిగా ఇవ్వు, చైల్డ్ ఈజ్ ఫాదర అఫ్ మ్యాన్ అవునో కాదో గాని మదర్ అఫ్ మ్యాన్ అని రుజూ చేస్తున్న మా అమ్మాయినే మా పాపగా ఇవ్వు, ఇక అన్య సంగతి చెప్పాలా, అసలీ కథంతా తనదే కదా?!

ఎలా తనది? ఇంకా అర్థం కాలేదా మీకు?

నేను అమెరికా ఎప్పుడొచ్చానని కదా ఒరిజినల్ గా నా నడక ‘ప్రశ్న’?

నేను అనన్య పుట్టటానికి ఒకటి రెండు నెలలు ముందు వొచ్చాను  మొదటి సారి అమెరికా కు. ఇక ఆ తరువాత రెండు మూడేండ్లు ప్రతి ఏటా వొచ్చాను. ఇప్పుడైతే, కార్డు పచ్చబడి, ఏడాదికి ఒక సారి ‘హైడ్రాబ్యాడ్’ కు వెళ్తున్నాను, వీలయినప్పుడు, లేదా అవసరమైనప్పుడు.

ముందు ముందు వీలూ అవసరం లేక పోవచ్చునని కుంచెం దిగులు.

ఎక్కువేం కాదు, కుంచెమే.

సో, ఇక్కడికి నేను వొచ్చి ఎనేళ్ళయ్యిందీ? మా అనన్య కు ఎంత వయసో సరిగ్గా అన్నేళ్ళయింది. మా అన్య పాపకు మొన్ననే పది నిండాయి.

నేను ఇక్కడికి మొదటిసారి వొచ్చి, రోడ్ల మీద మంచు మేటలు చూసి ఆశ్చర్య విస్ఫారిత నేతృడనై పదేళ్ళయిందన్న మాట.

నిజానికి నా కళ్ళు ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు.

అదిగో ఆ ఖాళీ స్టలమమంతా గడ్ది పెంచి, దాన్ని ఆవులకు, బర్రెలకు, గొర్రెలకు అందించక, మరింత ధనం వెచ్చించి ‘మౌ’ చేసి, అలా మిగిలే చెత్తను వొదిలించుకోడానికి మరింత డబ్బు ఖర్చించే ఈ దేశం, వీళ్ళ యవ్వారం నాకు నిత్యా ఆశ్చర్యకరమే.

ఇలాగే, నెలకోసారి, ఇక్కడి నా అశ్చర్యాల్ని మీతో… అనగా ఇండియా లోని వారితో, అమ్రికా లోని ఇండియన్స్ … ర్ర్ ర్ర్.. అంత సీను లేదు లెండి…  ‘తెలుగుల’తో పంచుకుంటాను…

ఇలాగే నడుస్తూ నడుస్తూ… చల్తే చల్తే!

 

(మళ్లీ నెలకి….)

14-7-2018

 

  

హెచ్చార్కె

11 comments

 • చాలా ఆసక్తిదాయకమైన కధనం పుట్టినరోజు కనుక్కున్నారు మొత్తంమీద . రాజకీయమైన సంఘటనలను జోడిస్తూ చెప్పిన విషయాలు ఈనాటి యువతరానికి అర్థమౌతాయ?

  • రవిబాబు గారు!. థాంక్యు సో మచ్. అర్థమయ్యే వాళ్ళు ఈ తరంలో బాగానే వున్నారనుకుంటాను,

 • అమ్మ కాలెండర్…నాదీ అదే కాలెండర్. నువ్వు చరిత్రలో రాజకీయ చరిత్రలోంచి చెప్పుకుంటూ రావడం బాగుంది.

  • థాంక్స్ అఫ్సర్. ఔను, అమ్మలు చాల వరకు అంతే. వాళ్ళకు కట్నం డబ్బులు ఎట్టా సర్దాలా, ఎట్టా పెండ్లి చేసి పంపాలా అనే దిగులే గాని, చదువు చెప్పించి వ్యక్తుల్ని చేయాలనే నిన్న మొన్నటి వరకు లేదు.

 • సర్వనామాన్ని ఛేదించిన విధంబబ్బురమే.
  అయినా
  రాసిందంత జీరవోయిన గొంతుక తోనే

  • ప్రసాద్ గారు, థాంక్స్. ఆ రోజుల్లో ఎస్సెస్సెల్సి రెజిష్టర్లలో అందరూ జూన్ 1 ననే పుట్టే వారు. 🙂

 • “మొదటి రోజే అనుకుంటాను అమ్మమ్మ ఒళ్లో పడుకుని అమ్మ చేతి లాలలో తన్మయమై” —

  ఈ వాక్యం,

  “మొదటి రోజే అనుకుంటాను తాతయ్య ఒళ్ళో పడుకుని నాన్న చేతి లాలలో తన్మయమై”

  అని వుంటే, ఎవరికీ ఎందుకు నచ్చదూ అని ఒక ప్రశ్న.
  నచ్చేటట్టయితే, ఎవరూ ఎందుకు రాయరూ అని ఇంకో ప్రశ్న.
  ఎందుకంటే, అది ఎక్కడ జరగదనా?

  పాఠకుడు

  • అది నేనెందుకు రాయలేదంటే,
   1. అలాంటి దృశ్యం నేను చూడలేదండి.
   2.మా అన్యకు నేనూ ఒక తాతయ్యనే; నాకు కొడుకు(లు) లేరు గనుక నేను నా కొడుకు కొడుకుకు లాల పోసే అవకాశం లేదు.
   మీ ప్రశ్న సరదా అన్పించి ఇదంతా రాశానేమీ అనుకోకుండి.

  • పాఠకుడు గారు, థాంక్స్. ‘అది’ ఎక్కడా జరగదని కాదండీ, నా అనుభవం కాదని. ఇది పర్సనల్ కాలమ్ కదా?!

 • మీ అమెరికా జీవితం గురించి చెప్పిన పద్దతి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అప్పటి పోరాట జ్గ్నాపకం కూడా బలే చెప్పారు .

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.