కొవ్వు సంగతి నిజమే గాని…

ప్రశ్న: డాక్టరు గారూ, ఇటీవల నేనొక వాణిజ్య ప్రకటన చూశాను. పురుషులకు శరీరంలో కొవ్వులు పేరుకుపోవడం వల్ల పురుష హార్మోన్ అయిన టెస్తోస్టెరాన్ ఉత్పత్తి తగ్గి, సెక్సు సామర్థ్యం తగ్గుతుందని, పోతుందని అన్నారు అందులో. అది నిజమేనా? అసలు ఒక వయసు వచ్చాక సామర్ర్త్యం పోవడం ఎందువల్ల జరుగుతుంది? నాలో ఉన్న అసలు ప్రశ్న ఏమిటంటే,  సెక్సు సామర్థ్యం పోవడం అనేది మిగతా శారీరక సామర్థ్యాలు ఒక్కొక్కటీ పోవడానికి… సూచన వంటిదా? తీసుకోవలిసిన జాగర్తలేమిటి?

-సుధీర్, ఢిల్లీ

జవాబు: మీరు చూసిన వాణిజ్య ప్రకటనలో చెప్పిన విషయం నిజమైనదే. కానీ ఇప్పటి ట్రెండ్ ఏంటంటే సహజంగా మనుషులు శరీరంలో జరిగే మార్పులను జబ్బు కిందగా జమకట్టి వ్యాపారం చేసుకోవడం.ఈ మధ్య ముసలితనం రాకుండా చేయగలిగే మందులొచ్చేశాయని, ఈ ఫలానా మందులు వాడేస్తే ఏ వయసు వారికైనా కోరికలీరికలెత్తుతాయనీ చెప్పే వాణిజ్య ప్రకటనలు పెరిగిపోయాయి. ‘Direct to consumer’ అనేది ఈ వ్యాపార జోగరగండల స్ట్రాటజీ. వయసు రీత్యా తగ్గిపోయే తిమ్మదీయాన్ని తమ మందులతో పెంచి, యవ్వనాన్ని మరలా తీసుకువస్తామనేది ఈ వ్యాపార ప్రకటనలు సారాంశం. టెస్టోస్టిరాన్ మందులు ఈ మధ్య ఊపందుకున్న లాభదాయక వ్యాపారం. కేవలం Hypogonadism అనే జబ్బు నిర్ధారణ జరిగాక మాత్రమే ఇచ్చే ఈ మందులు ఇపుడు ఇటువంటి వ్యాపార ప్రకటనల పుణ్యమా అని మగసిరిని పెంచే ఔషధాలుగా అవతరించాయి. వయసు రీత్యా సహజంగా తగ్గే లైంగిక పటుత్వాన్ని అవి ఒక జబ్బుగా ప్రొజెక్ట్ చేస్తాయి. ఐతే వయసు పెరిగే కొద్దీ కనిపించే అలసట, తగ్గే లైంగిక ఆసక్తి వంటి వాటికి కేవలం టెస్టోస్టీరాన్ తగ్గిపోవడమే కారణం అని చెప్పటం మాత్రం మోసంతో కూడిన వ్యాపార ధోరణి. సహజ మానసిక పరిపక్వత కూడా కారణం కావచ్చు. చాలా సార్లు ఇంటి పరిస్థితులు, ఇంటి సభ్యుల మధ్యన సంబంధ బాంధవ్యాలు, తగ్గిన గాఢ నిద్రలూ, పెరిగిన కలత నిద్రలూ, తల్లడిల్లిన రోజూవారి ఉద్వేగాలూ, వీటితో పాటు జీవిత సహచరి శారీరక మానసిక ఆరోగ్యాలూ వంటివి  చూపినంత ప్రభావం ఈ టెస్టోస్టీరాన్ లెవెల్స్ చూపవు. మగసిరిమి అనేది కేవలం లైంగికత లోనే ఉంటుందనుకునే తొందరపాటూ దీనికి తోడవుతుంది. ఇటువంటి ప్రకటనలు చూసి డాక్టరుతో సంబంధం లేకుండా డైరెక్టుగా టెస్టోస్టీరాన్ మందులు అమ్మకాలు పెరిగిపోతున్నాయట. టెస్టోస్టీరాన్ అనేది టెస్టిస్ నుండి ఉత్పత్తి అయ్యే ఒక స్టీరాయిడ్ హార్మోన్. మగవారిలో పురుషలక్షణాలను, లైంగిక ఆలోచనలనూ, సామర్థ్యాన్ని, కండరాల పటుత్వాన్ని కలిగించటం దీని పని.

అయితే శరీరంలో కొవ్వు పెరిగే కొలది రక్తంలో ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. దీనికి కారణాలు వివరించటం కష్టమే ఐనా సింపుల్ గా చెప్పాలి అంటే,  లావు పెరిగేకొద్దీ రక్తంలో sex harmone binding globulin అనేది తగ్గిపోవడమూ అలాగే Hypothalamus-pitutary-testicular (HPT) Axis పని తీరు తగ్గటం వలన టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గి లైంగిక సామర్థ్యం తగ్గుముఖం పడుతుంది. శారీరక శ్రమ తగ్గి ఒబెసిటీ పెరిగిపోతున్న ఈ కాలంలో “లైంగిక పటుత్వం కొరకు” మా మందులు వాడండి నిత్య యవ్వనులుగా ఉండండి అనే వ్యాపారమూ పెరిగింది. దీనికి తోడు వయసు పెరగకుండా ఉండాలంటే టెస్టోస్టీరాన్ శరీరంలో‌ వరదలై పారాలి అనే తప్పుడు సమాచారమూ పెరిగింది. నిత్య యవ్వనులైన  దేవతలు తాగే అమృతం ఏమిటనుకున్నారు!? అది మా మందే అని కూడా చెప్పి ఒప్పించగలరు. ఈ అసహజ రీతులతో శరీరం తంపటి దోసకాయ లాగా తయారవుతుందే తప్ప మరోటి కాదు. “ఎంతటి ముసలివాడవయ్యావు అనేదానికంటే ఎలా ముసలివాడవయ్యావో చెప్పు ముందు” అనడిగాడట ఒకడు. ఆరోగ్యకరంగా ముసలివాడవటం అవసరం. ఎవరైతే ఆరోగ్యకరంగా ముసలితనాన్ని పొందుతారో వారిలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఏమంతగా తగ్గటం లేదని చెప్పే మెడికల్ ఎవిడెన్సు కీ కొదువలేదు. ఎందుకంటే వయసు రీత్యా టెస్టిక్యులార్ టెస్టోస్టిరాన్ ఉత్పాదన తగ్గినా మానసికంగా ఉత్సాహంగా ఉండే వారిలో మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి ల్యుటెనైజింగ్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి దాని ప్రభావం వలన టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది అన్నది ప్రస్తుతం ఋజువవుతున్న సత్యం. “ముసలితనం పెరిగేకొద్దీ ఆటలాడటం తగ్గుతుంది అనేదానికన్నా ఆటలాడటం తగ్గే కొద్దీ ముసలితనం పెరుగుతుంది” అనేది వాస్తవం. కాబట్టి లైంగికత, పటుత్వమూ, మగసిరిమి వంటివి శారీరకం మాత్రమే కాదు, మానసికం కూడా. మానసికోల్లాసం తగ్గకుండా చూసుకునేవారెవరైనా నిత్య యవ్వనులే.

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.