కట్టకడాకు, దాన్ని మడి కయ్యల కాడ మల్లగొడ్తి.
ఇంటిదావ పట్టిచ్చి ‘తక్కె… ఇంటికి పా నీకీపొద్దు ఉంటాది.. బడితెపూజ సేచ్చాపాయే కంచర్ దానా!’ అనుకుంటి మనసులో .
దానికి ఉసి తిరక్కుండా ఉషారుగా ఎగదోల్తా ఇంటి మలుపు తిప్పితి.
పడ్డ పరిగెత్తా ఇంట్లోకి దూరె. దాన్ని గాటికి తలుగు పెట్టి కట్టేసి ముళ్ళ గట్టె తీసుకుంటి. బెదుర్కొని గంజుపోసుకుండ్య గొడ్డు. బిత్తరపోయి ఆపక్కకు ఈ పక్కకు గుంజుకలాడె. ఎనక్కాళ్ళు జారుకుండ్య. ఐనా ఇర్సిపెడ్తానా !
“బయట బాగ పండుకోవే అని ఇడిచ్చే…దొంకలమ్మడీ వంకలమ్మడీ పరిగిత్తావా … భయం భక్తి ల్యాకుండా…ఆ..ఇప్పడు పరిగెత్తు. మంచి అదిలిచ్చాంటే లెక్కజమ ల్యాకుండా దూరి దూరి పరిగిత్తావా దొరక్కుండా ! ఇనపరాదా కంచర్ దానా” అంటూ ముల్లకట్టెతో నడ్డినేసి పెరికితి ౼ సెయ్ జంపున. ‘సెట్లల్లో అడ్డం పడి పోతావుబ్బా అడ్డం. ఆ…ఎది ఇప్పుడు పో యాడికి పోతావో…” అనుకుంటా మింద మింద మళ్లా రెండేట్లు ఏచ్చి బిసకొద్ది. ‘కాల్లిడుచ్చా అట్నే, ఏమనుకున్యావో…ఏమో’ అని నాలిక మడతపెట్టి మళ్లా కట్టె పైకెత్తితి నిలువెత్తు కోపంతో.
అంతలోకే అన్నందిని బయట పంచనరుగు మీద యవారాలు సేచ్చన్న్య మాయమ్మ “బ్బీ ఏంది పడ్డనట్ల కొడ్తనావ్? రోంతన్నా అర్థం పర్థం ల్యాకుండా “ అర్సుకుంటా గబగబా ఇంట్లోకొచ్చ.
“ దీన్ని కొట్టడం గాదు ఈ పొద్దు. కోసి కండలు బండికేచ్చా. శానా మకురు పట్టింది మాటినకుండా” అనుకుంటా మళ్లా ముళ్ళగట్టె పైకెత్తితి.
“మల్లాసూడు! తెలివుందా లేదా నీకు? మూగజీవిని పట్టుకోని అంతగా కొడ్తనావ్. దించు కట్టె . మనిసన్నాక బుద్దుండాల రోంతన్నా. “ అని గదురుకుంటా సరసరా గాటి పక్క నర్సె మాయమ్మ.
ఆ మాటలకు నా అహం దెబ్బ తిన్య. అరికాళ్ల లోని కోపం సరసరా నసాలానికెక్కె. “నీకు మాకంటే ఎములే ఎక్కువైపాయలే. సూడు కాళ్లకు ఎట్లా జీరికెలు పన్నాయో ఇది చేసిన పనికి. అడ్డం పరిగెత్తాది అడ్డం. ఎంత ముప్పుతిప్పలు పెట్టిందనుకున్యావ్ మొబ్బులో. ఈ మద్యన నువ్వు ఎద్దలకు ల్యాకుండా బేసే తౌడు తిని బాగ కొవ్వుబట్టి బొత్తిగా మాటినకుండా వచ్చాంది ‘ అనుకుంటా గాటిపాట నుంచి నడవలోకి నడిచ్చి ఇసురుగా. ముళ్ళ గట్టెను సెయ్ జంపునా వాకిలి పంచనకేసి ఇసిరిగొడ్తి. ఇంట్లోకి పోయి నీళ్లు తాగి మళ్లా నడవలోకొచ్చి నిలబడ్తి.
మాయమ్మ పడ్డ పక్కనే నిలబడి దాని నడ్డిపై సెయ్యేసి నిమరబట్య. అట్లనే దాని సుట్టూ ప్రదక్షిణ కొట్టబట్ట్య.
దెబ్బలకు దాని ఈపు వాతలు తేలి పొంగిందో ఏమో “ఎంతగా కొడ్తివి బ్బీ…ముందే అది ఒట్టి గొడ్డు కూడా కాదు. కట్టింది . తొలిసూరి పడ్డ” అనె మాయమ్మ. ఆ గొంతులో తడి జీర పారాడినట్లాయ.
దాని ఒళ్లంతా మళ్లా ఇంగోసారి నిమిరింది నిబ్బరంగా. అది తోకతో పై ని తట్టర్సుకుంటా మోరనాపక్కకూ ఈ పక్కకూ తిప్పబట్య. అది మాయమ్మ తిక్కే దిగులుగా దిక్కులేని దాని మాదిరి సూడబట్య. దాని మూగభాష అర్థమాయనో ఎట్లనో… మాయమ్మ దాని మోరను సంకలోకి తీసుకుని దాని కండ్ల కిందుండే పిసురు తీసి మెడకింద తట్టడ్సె.
ఇంత జరిగినా నేను మాత్రం సల్లుకోల్య. నా మంకు నాదే. నీళ్లుతాగి మూతి తుర్సుకున్య టవల్ ను దండెం పైకి ఇసిరికొట్టి నేను బయటకు పోతాంటే నా పక్క ఉరుమురిమి సూచ్చా ‘దీనికేం తక్కువల్యా పో ‘ అంటా మాటలతోనే వాతపెట్టె మాయమ్మ.
నేను బజార్లో వేసిన మంచంపై వాలిపోతి. అప్పటిదాకా మా పడ్డ కట్టిందని నాకు తెలియకపాయ. ‘తొలిసూరి పడ్డ ‘ అన్న మాటలు నా మనసును తొల్చబట్టె. మళ్ల రోంచేపటికంతా పడ్డకు ఆట్టంపై ఉండే పొట్టు పోసి మళ్లా అరుగుపై కొచ్చి కూకుండ్య మాయమ్మ.
బాగ పొద్దుపాయ. బజార్లో ఎగులేచ్చన్య పిల్లగాల్లంతా యాడోల్లాడ మంచాలపై గూట్లో గువ్వ పిల్లల మాదిరి ఒదిగొదిగి పండుకుంటిరి. పంచన అరుగులపైన యవారాలు చేసే ఇరుగుపొరుగు ఆడోల్లు పక్కలు పర్సే పనిలో పడిరి..సందకాడ ఊరంతా సద్దుమనిగ్య. సందులోంచి సల్లని గాలి తగిల్య. ఆకామంతా తడిగుడ్డేసి తుర్సిన నడవ మాదిరి తళతళ మెరుచ్చాంది. సుక్కలు ఎంతబాగుండాయి ఈపొద్దు, ముగిలలికి ముగ్గేసినట్లు అనుకుంటి. నేనేం తక్కువ తిన్నానా అన్నెట్లు సల్లగాలికి ఎన్నెల గూడా తోడై పిండారబోసినట్లుంది. మానాయన దొడ్లో గాటికి కట్టేసిన ఎద్దల్ను లేపి పొట్టుబోచ్చాన్య శబ్దమాయ. రోంచేపటికంతా ఊరంతా సద్దుమనిగ్య. కుక్కలు మంచాల కింద దూరి ముర్సుకుని పండుకునె. నేను నిద్దర్లోకి జారుకుంటి.
బాగా పొద్దుబోయినాక ఒక జామున ఒకంటికి వచ్చినట్లనిపించి మెలకవొచ్చింది. నిద్దర్లేచ్చి. మాయమ్మ నా మంచం పక్కనే మంచంలో బాగ నిద్దర్లో మునిగి ఉంది. మా నాయన ఇంటి తలాకిలి పంచన అరుగుపై బొంతేసుకోని గురకదీసి నిద్రపోతనాడు. నేను మంచం మీద నుంచి లేసి అటుపక్క బైలులో ఒంకంటికి పోసి అరుగుపై ఉండే చెంబులో రోన్ని నీళ్లు తాగి మళ్లా పండుకుంటి.
గాలి మలయమారుతమై వీచ్చాంది. ఉయ్యాల్లో పండుకున్న్య సంటి పిల్లోని మాదిరి ఊరంతా కిసిక్కిమనకుండా బజ్జుకుంది. అబ్బా ఎంత బాగుంది ఈ పొద్దు అనుకుంటి.
ఏమాయనో ఏమో గాని, కన్నెని నీళ్ళల్లో రాయేసినట్లు ఉన్నెట్లుండి నాకు మా పడ్డ దూడ మతికొచ్చ. మాయమ్మ దాన్ని తొలిసూరి పడ్డ అన్నెప్పట్నుంచి మనసులో ఏదో ఒక దిగులు ముళ్ళు గుచ్చుకోబట్య. అప్పుడు బయటపల్యాక పోతి గానీ, రానురాను అది సిలికి సిలికి గాలీ వానైనట్లు మనసును సివసివమని సలపబట్య. అదిప్పుడు ఒట్టి కడుపుతో లేదంట. ఎంత పన్జేచ్చి? ఎంతేట్లు ఏచ్చి!.
దాని కడుపులో ఉండే సంటిదూడ అమ్మా అని అర్సినట్లనిపిచ్చ. ఎంతగా కొట్నానో అని బో బాదలేసె. పశువు మాదిరి దానిపైబడి కొట్నెందుకు నేను మనిషిని కాదనిపిచ్చ. నాకంటే అదేనయం అనుకుంటి. అది ఆ దెబ్బలకు ఎంతగానం ఏర్సుకుందో అనిపిచ్చ. నాకండ్ల ముందు దాని మొకం కనిపిచ్చ. ఆ మొకంలో దాని కండ్లపక్క సూచ్చి. మాయవ్వ గారి తొట్లో బిల్లబాయి మతికొచ్చ. కండ్ల కిందర జాలుగా పార్తాన్న్య కన్నీళ్లు కనపచ్చ. చ్చ …చ్చ … ఎంత పన్జేచ్చి. అసలు పశువదా నేనా? ఎవరో లోపల రేనిమండ ఇగ్గబడ్తిరి. ముల్లుల సులుకు తగలబట్టె. నెత్తర కారబట్య. నువ్వు అసలు మంచివే గాదు, బండరాయివి, అనుకుంటా నన్ను బోన్లో పెట్టి పంచాయతి జెప్పె. నేను గూడా ఎదురు తిరిగి మాట్లాల్ల్య. అవ్… నేన్జేసింది తప్పని నా నేరం ఒప్పుకుంటి. బుద్ది గడ్డిదినింది. ఆ కోపంలో నేనేం సేచ్చనానో నాకే తెలియని మూర్ఖత్వం . నా మింద నాకే కోపమేస్య. థూ..అని నా ముఖాన నేనే ఉమ్మేసుకుంటి.
అంతే, మంచం పై నుంచి గబగబా లేసి పోయి వాకిలి మెల్లెంగ తీచ్చి. గాటికటుపక్క ఉన్నె పడ్డను ఇటుపక్క కట్టేసిండ్య-మాయమ్మనుకుంటా. నడవలో లైటేచ్చి. పడ్డ పండుకోనుండాది. గబగబా గాటిపక్క నడిచ్చి. నాపక్కజూసి అది బెదురుకుని లేసి నిలబడి మోర నటూ ఇటూ తిప్పబట్య. నేను నేరుగా దాని మోరకాడికిపోతి. మోరను రెండు సేతల్లోకి తీసుకుని దాని కండ్లల్లోకి సూచ్చి. అప్పడే పారి సాలిచ్చుకున్య మడవ కాలవన్జూసినట్లుండ్య. మోరనిదిలిచ్చుకునె మెల్లెగ. ‘ తీ…కొట్టింది సాల్లేదని మళ్లా వచ్చినావా సిగ్గన్నా ల్యాకుండా’ అని అలిగినట్లనిపిచ్చ. అసలు అంతగా కొట్టడానికి నేనేం తప్పు జేచ్చి అని నన్ను నిలదీసినట్లనిపిచ్చ. దాంతో మళ్లా మోరను సేతల్తో తీసుకుని నా గుండెలపై ఆనిపిచ్చుకుని గాటిబండ మీద రోంతట్ల ఆనుకోని కూచ్చుంటి. ‘ ఎంతగా కొట్నానో…’ అని మాట్లాడ్డం మొదలు బెడ్తి. అప్పటికే లోపలాకాశం మొబ్బులు కమ్మి ఉండ్య. దాని మోరకు నా సెంపనానిచ్చి . నా కండ్లల్లో నుంచి సన్నగ సినుకులు రాలబట్ట్య. ‘ఇంగెప్పుడూ కొట్టును. నిజ్జంగా. మాయమ్మ తోడు. నిన్నింగ అస్సలు కొట్టను. ప్రామిస్’ . అనుకుంటా బోరుమంటి. మోడం ముసురుగప్పి కురసబట్య. యాడాడి కుళ్ళునూ కన్నీళ్లు మోసకచ్ఛి గడ్డకేస్య. లోన బరువు మెల్లెగా తగ్గబట్య. లేసి దాని పొట్టను, నడ్డిని నిమిరితి. దాని కండ్లు తుడిచ్చి. మెడకింద సాదితి. సెవుకున్న పిరుదులు పెరికితి.
ఎందుకో ఇంట్లో ఉడకనిపిచ్చ. ఎట్ల పండుకుంటావ్. బైట బాగ సల్లగుండాది. రా పదాంపా . అని దాని మెల్లో తలుగు తప్పిచ్చి. . అయినా అది కదల్లె. దాని నడ్డినట్లా అరసేత్తో తట్టడ్సి పా.. అని బైటికి అదిలిచ్చి. అది మెల్లెగ బైటకు నర్సబట్య. దాని ఎనకే నేను సంటి దూడ నర్సినట్లు నడిచ్చి. అట్లా అది దొంక మలుపు దాటి వంక దావ పట్టేవరకూ అట్లనే నిలబడి సూచ్చి. అదట్ల సీకట్లో కలిసిపోగానే నేను మంచం మీదొచ్చి వాల్తి.
ఆకాశంలో అప్పుడే కుర్సిన రెండు దూది మేఘాలు భుజాలమీద సెయ్యేసుకుని తేలిపోతా కనిపిచ్చ. లోపల కొండంత బరువు ఒ్కసారిగా దించుకున్నెట్లాయ. ఈ వెన్నెల కురిసే సల్లని రాత్రి వంకలో పండుకుంటే ఎంత బాగుంటాది అనిపిచ్చ. ఐనా అది అంతకు మించి ఏం కోరుకున్యాది?! అంతేకదా అనుకుంటి. పడ్డనింగెప్పుడే గానీ కొట్టద్దని లోన ప్రమాణం చేసుకుంటి. మాయమ్మ పక్క జూచ్చి. పైనుంచి దిగొచ్చి ప్రశాంతంగా పండుకున్య ఆకాశం మాదిరి కనిపిచ్చ అమ్మ.
ఇంగ్లీషు పై మోజు తో దాని వెనుక పరిగెత్తే ఈ రోజుల్లో భాషా సంస్కృతి ని మరిచి పోని శ్రీకాంత్ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్.
ప్రామిస్ పడ్డని ప్రేమించే రాయల సీమ రైతన్న మాట కాదు.మిగిలిన మాండలీకపు సొగసు లో ఆ పదం మునిగిన ..కొంచెం…
చక్కగా చిక్కని మాండలీకంలో గ్రామీణ పశు సౌందర్యాన్ని చూపిన ప్రయత్నం చాలా బాగుంది.
సర్, మీరన్న మాట నిజమే. సవరించుకుంటాను. ధన్యవాదాలు.
ఇప్పుడు ఏ రైతు ఇంటికి వెళ్లినా పురుగుల మందు గుమ్మానికి కట్టి ఉంటుంది. అలా దిగజార్చాయి రాజకీయాలు.
True, Anna
నీ లాగా నాకు.. రాతలు చేతకావు.. నీ. కవిత్వం.. మన సీమ యాస.. మనసు నిండి పోయింది…. అభినందించడం తప్ప.. ఎం చేయగలను..
అన్నా, మంచి రచయితల కాదు. మంచి పాఠకులు కూడా ఉంటారు కదా. ధన్యవాదాలు
ఇంగా రవంత సహజత్వం ఉంటే కతా బాగా తయా రయితా వుండే. అయినా పెద్ద సదువులోళ్లు ఈ మాత్రం రాసిందానికి నాకి శానా ఆనందం గా వుంది
అన్నా, ధన్యవాదాలు. ఇది నేను డిగ్రీలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన . బహుశా రాయడంలో నేను కొంత మెరుగుపడాల్సి ఉండొచ్చు. ప్రయత్నిస్తాను.
Bagundabba nee Katha
మాండలికం అదుర్స్ ….
అహం, ప్రదక్షిణ, మలయమారుతం పదాలను ఒకసారి చూడగలరు.
కన్నీళ్ళొచ్చాయి
చాలా బావుంది సర్ !
మాండలికంలో narration సూపర్.
అభినందనలు
మలయమారుతంలా, ప్రదక్షిణ, అహం పదాలు కొంత ఆలోచించగలరు.