ప్రొఫైల్

 

పేరు: మ్యావ్ మ్యావ్ రావ్ ఊరు:మార్జాల్పూర్

మధ్య మా ఊరి పిల్లలో చుట్టాల పిల్లలో చాలా మందే వస్తున్నారు.  అప్పట్లో కెనడా పంపమంటే యేముందక్కడ యూ ఎస్ పోతున్నాం అనేవారు. ముల్లు పొయ్యి కత్తొచ్చె లాగా ఇప్పుడు యూ ఎస్ తగ్గి కెనడా రాకలు పెరిగాయి… వచ్చిన పిల్లలు నెలో రెండు నెలలో ఉండి కాలేజికి దగ్గరగా వెళుతుంటారు.. పిల్లలు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నించి పిక్ చేసుకోవడం ఒక్కటే కష్టం మాకు. విమానాలు వచ్చే టయిము మా పని వేళలు ఎప్పుడూ క్లాష్ అవుతుంటాయి. ఎక్కువగా కార్ పార్కింగ్ లో పెట్టి గంటలు గంటలు వెయిట్ చెయ్యడానికి ఇంట్లో ఎవరూ ఇష్టపడరు. పిల్లలకి మా ఫోన్ నంబరు తెలుసు కాబట్టి ల్యాండ్  అయ్యాక కాల్ చేస్తే లగేజీ పిక్ చేసుకునేలోపు అక్కడుంటాము. మేము వెళ్ళేటప్పటికి బయటికి వచ్చి ఉంటారు. 30 వ నంబరు పిల్లర్ లాంటి బండ గుర్తులు చెప్పేస్తామన్నమాట.. లగేజ్ తీసుకున్నాక వైఫై ఉండగా ఫోన్ చేసి బయటకొచ్చి నించుంటే సెక్యూరిటీ వాళ్ళు తరిమే లోపు మనవాళ్ళని చూసి కార్ ఎక్కించుకురావడమే.

దూరపు చుట్టాలబ్బాయి వస్తున్నాడుట. పొయిన సంవత్సరమెప్పుడో ఎలా ఉంటుందీ ఏంటీ అని ఫోన్ చేసి మాట్లాడారు కానీ మళ్ళీ వస్తున్న విషయం తెలియలేదు. పాపం బాధ పెట్టొద్దు అనుకున్నారేమో ముందే ఆ పిల్లోడి సీనియర్ ల సహాయం తో వాళ్ళతో పాటు ఉండడానికి  ఇల్లూ అవీ మాట్లాడేసుకున్నారుట. ఇంటి ఓనరొచ్చి తీసుకెళతా అన్నాడుట. తీరా చివరలో నాకు ఇంకో పని పడింది ట్యాక్సీ తీసుకుని వచ్చెయ్ అన్నాడుట..అబ్బాయి తలితండ్రులు బోలెడు ఖంగారు పడిపోయారు. అసలే కొత్త ఊరు. ట్యాక్సీ వాళ్ళూ అదీ మంచివాళ్ళుంటారో పెట్టే బేడా తో సహా పిల్లడిని ఎత్తుకుపోతారో అని భయపడి  అప్పటికప్పుడు వాళ్ళ చుట్టాల దగ్గర మా నంబరు తీసుకుని ట్యాక్సీలవీ ఖంగారు గా ఉంది. మా అబ్బాయిని ఎయిర్పోర్ట్ నించి పిక్ చేసుకుంటారా అని అడిగారు..

సరే అన్నాను కానీ ఖంగారు పడ్డాను. ఇంట్లో ఎవరెవరు ఏ ఏ టయిం లో ఖాళీ ఉంటారో ఉండరో ఎవరు పిక్ చేసుకుంటారో తెలియదు.. నెమ్మదిగా అందరినీ గీకా.. గీకేడప్పుడు కొద్దిగా గీస్తున్న పుల్లకి బటర్ రాసా.. కుదరలేదు బిస్కట్ క్రీం పూసా . వర్కవుటయింది.. పెద్దోడు సరే నేనెళతాలే అన్నాడు . హమ్మయ్య అనుకున్నా. ఎప్పుడు అని అడిగాడు.. నిన్న రాత్రి బయల్దేరాడు ఈ రోజే వచ్చేది సాయంత్రం అని చెప్పాను. అబ్బా కాస్త ముందు చెప్పచ్చు కదా అన్నాడు. లేదమ్మా వాళ్ళు ఏదో అర్రేంజ్ చేసుకుంటున్నారుట కానీ అది కుదరలేదుట. ఈ రోజు పొద్దున్న ఫోన్ చేసి ” మా వాడు  బయల్దేరాడు, ఆ అరేంజ్మెంట్ కుదరలేదుట పిక్ చేసుకుంటారా అని అడిగారు” అన్నాను. సరే అయితే ఆఫీస్ నించి వెళతాలే అన్నాడు. హమ్మయ్య అనుకున్నా .. ఆ పిల్లోడికి లగేజ్ పిక్ చేసుకున్నాక ఫలానా నుంబర్ కి ఫోన్ చేసి చెప్పమని వచ్చి తీసుకెళతామని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. లండన్ లో ఆగాక ఫోన్ చేస్తాడండీ.. మా అబ్బాయి నంబర్ ఇదిగో అని చెప్పారు. ఆ నంబర్ ని అలాగే పెద్దోడికి పంపేసి చేతులు దులుపుకున్నా.. దులుపుకోవడమంటే ఎలా దులుపుకుంటాలెండి ఇంటికెళ్ళి వంట ప్రయత్నాలు చేసా.. పాపం ఆ పిల్లోడు ఎంత ఆకలిగా వస్తాడొ 23 గంటలు ప్రయాణం కదా అనుకుంటూ..

పెద్దోడి నంబర్ ఇచ్చా కానీ ఆ పిల్లోడి నించి ల్యాంద్ లయిన్ కి ఫోన్ వచ్చింది. ఎయిపోర్ట్ లో ఎవరి ఫోన్ లో నించో చేసాడు . నువ్వు ఉన్న చోట గేట్ నంబరు చెప్పమన్నా. చెప్పాడు. సరే అక్కడే నించో మా అబ్బాయి వస్తాడు అని చెప్పి పెద్దోడికి ఫోన్ చేసా. సరే అమ్మా ఆ గేట్ దగ్గరకెళుతున్నా అన్నాడు.

ఇంకో పది నిమిషాల్లో పెద్దోడి నించి ఫోన్ వచ్చింది.  అమ్మా ఎయిర్పోర్ట్ దగ్గరున్నా ఆ అబ్బాయి ఫొటో ఉంటే పంపు ఎలా గుర్తించడం అన్నాడు. అయ్యో నేను ఎప్పుడూ చూడలేదమ్మా.. పెద్దత్తయ్య తోటికోడలి చెల్లికి బావగారి కసిన్ కొడుకుట , అన్నాను.. అవన్నీ నాకు అర్థం కావులే కానీ ఫొటో పంపు అన్నాడు. సరే గబ గబా పిల్లోడికి వాట్సాప్ ఉందా అని చూసా.. హమ్మయ్య ఉంది.. కానీ రాముడు బాణం సంధిస్తున్న బొమ్మ ఉంది.. వాళ్ళ నాన్న కి అమ్మకి ఉందేమో అని చూసా..  తండ్రికి వినాయకుడి బొమ్మ, తల్లి కి లక్ష్మీ దేవి బొమ్మ ఉన్నాయి. గబ గబా ఫేస్బుక్ లో పేర్లు వెతికా.. ఒక వంద పేర్లొచ్చాయి.. ఊరు వాడ అన్నీ చూసి చూసి వీళ్ళే అని గుర్తించా… తీరా చూస్తే పిల్లోడి ప్రొఫైల్ లో ప్రభాస్ బొమ్మ, తల్లి కి అనుష్క బొమ్మ, తండ్రి కి …అబ్బ పొండి! నాకు లోకజ్ఞానం తక్కువ.. ఆ బొమ్మ ఎవరిదో అర్థం కాలేదు..

పెద్దోడు ఒకొక్క కుర్రోడిని చూసి నువ్వేనా నువ్వేనా అని అడిగేలోపు సెక్యూర్టీ వాళ్ళు తోలేస్తుంటే 4 5 రవుండులేసి అమ్మా నా వల్ల కావట్లేదు , ఆ పిల్లోడిని తెలుసుకోలేకపోతున్నాను బిలబిల్లాడుతూ 150 మంది స్టూడెంట్స్ వచ్చేస్తున్నారని చెప్పాడు.. చాలా ఖంగారు పడిపోయాను, ఆడపడుచు దగ్గర మాట పోతుంది కదా… నాన్న ఇంకో రవుండు వెయ్యమ్మా అని బతిమాలుకున్నా.. ‘అలా ఎలా వచ్చేస్తానే , ఏదో ఊరికే అన్నాలే’ అన్నాడు.. ఇంకో రెండు రవుండ్లు వేసేసరికి పిల్లలందరు వెళ్ళిపోయి, నలుగురైదుగురు మిగిలారు. వాళ్ళల్లో ఆతృతగా , ఆందోళనగా చూస్తున్న పిల్లాడిని చూసి ఫలానా నువ్వేనా అని అడిగి గుర్తుపట్టి తీసుకొచ్చాడు. రాగానే ‘బాబూ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ మార్చు అన్నా, ఎందుకన్నాడు , నిన్ను వెతుకుతూ రాముడి లాగా బాణము చేత ధరించి ఉన్నవాళ్ళ కోసం వెతికాడుట మా అబ్బాయి.. అందుకు అన్నా.. హహ్హహహహ్.. పిన్నీ ప్రయాణం కదా దేవుడి దీవెనల కోసమని మార్చుకున్నా కానీ అసలు నా పిక్ యే ఉంటుంది అన్నాడు.. పోనీలే అవసరం తీరాక రాముడైనా కృష్ణుడైనా ఒకటే ఏదో ఒకటి ఉంచుకో అన్నా.. సరే అన్నాడు….

ఇంకో తెలిసున్న పిల్లకి చదువయ్యి పూర్తయ్యి ఉద్యోగాలు వెతుకుతోంది.. మొన్నొకడు ఇంటర్వ్యూ కి పిలిచాడుట.. . ఆ  పిల్లకి తన కుక్కపిల్ల భలే ఇష్టం ట. దాన్ని వదిలొచ్చింది కదా బెంగ పోతుందని తన కుక్కపిల్ల మొహం లింకుడిన్ (LinkedIn) ప్రొఫైల్ పిక్ పెట్టుకుంది.. ఇంటర్వ్యూ కి ముందు ఈ మధ్య లింకుడిన్ ప్రొఫయిల్ చూస్తున్నారు హయిరింగ్ మేనేజర్ లు(Hiring managers) .. మొహం చూసి ముచ్చటపడితే ఉద్యోగాలిస్తారెవరైనా. చీ ఫో అనుకున్నట్టున్నాడు ఫొటో నచ్చలేదు ఇంటర్వ్యూ కాన్సెల్ అన్నాడుట. అయ్యొ అది నా మొహం కాదయ్య బాబూ అంటే, నాకేం తెలుసు నీ పేరు పక్కన అదే కదా పెట్టావు అన్నాడుట..

ఇంటి దగ్గర పిల్లల ఫొటోలు పెట్టడానికి భయపడుతుంటారు నేను అర్థం చేసుకుని అమ్మలు 10 మంది ఉన్న గ్రూప్ ఫోటో పెట్టచ్చు అందులో మీరుంటారు కదా అది చాలు అంటుంటా..

ఇంక ఈ మధ్య చిన్నప్పటి స్నేహితుల వివరాలు దొరుకుతాయేమో అని తెగ వెతికేస్తుంటామా… అదేదో వయసు చెప్పకూడదనో ఏంటో పారాడుతున్న ఫొటోలు, గౌన్లు వేసుకున్నప్పటి ఫొటోలో  పెడుతున్నారు కొందరు. ఇంకొందరు మరీ.. మనవడు పుట్టగానే ఆసుపత్రి లో చేతికిస్తున్నప్పుడు తీసిన ఫొటో పెట్టుకుంటున్నారు. ఆ ఫుటో లో నవజాత శిశువు , ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం లా రెండు జతల చేతులు తప్ప ఏమీ కనబడవు.. ఆ శిశువుని చూసి అమ్మమ్మనో నానమ్మనో గుర్తుపట్టేద్దామంటారా.. సరే మీరుండండి ఆ పనిలో.. నా వల్ల కాదు బాబూ. నాకు పిల్లలందరూ ఒకే లాగా ఉంటారు పువ్వుల్లాగా..!  

అవునబ్బా నాకూ తెలుసు, మీ పిల్లలు, పిల్లులు, కుక్క పిల్లలూ , గాజులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు కావేవీ ప్రొఫయిలు పిక్ కి అనర్హం కానీ చూసుకోండబ్బా… అక్కడ ఉన్నది మీ ముఖారవిందం చూపమని కదా ….నగుమోము కనలేనీ నా జాలీ తెలిసీ నను బ్రోవరాదా అని పాడే వాళ్ళకోసమైనా.. ప్లీస్ అబ్బా…

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

8 comments

 • చాలా ఆహ్లాదకరమయిన హాస్యం. చాలా బావుంది

 • బావుంది లక్ష్మి గారు. 🙂 బా గా రాశారు. చక చకా చదివించారు. కంగ్రాట్స్.

 • హాస్యం అంటూనే అచ్చమైన సత్యం చెప్పారు …నిజం ప్రొఫైల్ పిక్లో ఎవరి పోటో వాళ్ళది లేకుంటే తెలుసుకోవడం ఎంత కష్టం …అర్ధం చేసుకోరూ..ఈ జనాలు ఏంటో….

 • లక్ష్మి– నేను కెనడా వస్తున్నా నా ప్రొఫైల్ పిక్ లో రాముడే ఉంటాడు.. అయినా సరే నువ్వు nannuగుర్తు పట్టాలి తప్పదు లేదంటే నీతో కటీఫ్–ఆహ్హ్హాహ్హాహ్హా–

 • వావ్.. హాస్యంగా అనిపించినా వో మంచి సందేశం వుంది. ఇదిగో ఇలాంటి సహాయగుణాల వల్లే మనుషులు వున్నతీకరించబడతారు. అభినందనలు లక్ష్మి గారూ..

 • సరదాగానే వుంది.
  కొడుక్కి ప్రభాస్ బొమ్మా, తల్లికి అనుష్క బొమ్మా. అదో సంస్కృతి.
  నవ్వొచ్చింది.

  ఇలా ఎయిర్ పోర్టు పిక్ అప్‌లు పెట్టుకునే వాళ్ళు, తమ ఫోటోలు ఒకరి కొకరు ఇచ్చుకోవాలి, ముక్కూ మొహం తెలియనప్పుడు, ఈమెయిళ్ళలో. దూర దేశాల ప్రయాణాలు చేస్తారు గానీ, కాసింత తెలివితో వుండరు.

  పాఠకుడు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.