భాష పేరు “తెనుగు”

దిమ దశ నుండి విడివడి ముందుకుసాగి మానవులు చిన్న చిన్న సమూహాలుగా సంచరించిన నాటి నుండి, పరిపక్వతనొందిన సమాజ వ్యవస్థలుగా పరిణితి సాధించి, సంఘటిత జాతులుగా ఎదిగి చరిత్రకెక్కే దశ వరకూ చేరడానికి ఉపకరించిన అతి ముఖ్యమైన సాధనం భాష. ఆ విధంగా నిలదొక్కుకొని తమకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న జాతులకు వారివైన మరియు వారికే చెందిన భాషలు వెలుగొందాయి. అలా ఉద్భవించిన  వేలకొలది భాషలలో లిపి ఉన్న కొన్ని భాషలు మాత్రమే ముందుకు సాగి నిలదొక్కుకో గలిగాయి. తొలి దశలో సొంతగా లిపి లేని భాషలు వారు మాట్లాడుకొనేదాన్ని వేరే భాషల లిపిలోనే రాసే వారు. ఉదాహరణకు మన భాష ఆవిర్భావ దశలో బ్రాహ్మీ లిపి లో మన ప్రాచీన రాతగాళ్ళు రాసిన చరిత్ర మనకు తెలియనిదేమీ కాదు.

అలా సొంత లిపిని సృజించుకొని ప్రచారం చేసి విస్తృత పరచుకొని, నిలబెట్టుకొని అశేష జన సమూహం ఆ భాషలో మాట్లాడి గుర్తింపు పొందిన జాతులుగా ఎదిగినవి కేవలం కొన్ని వందలు మాత్రమే. ఆ స్థాయికి చేరడానికి  ఎన్నో పరిస్తితులు స్తూలంగా కలిసి రావాలి. ఆ భాషలో జన బాహుళ్యం మాట్లాడాలి, ఒక దేశంగా ముందు ఒక భూభాగంలో సుదీర్ఘ కాలంగా ఆ జాతి వారు మనుగడ సాగించాలి, పరిశ్రమ చేయాలి, మధ్య యుగంలో పరిపాలన సాగించిన రాజులు ఆ భాషకు చెందిన వారై ఉండాలి, వాటిని పోషించిన వారై ఉండాలి, శాసనాలు రాయించిన వారై ఉండాలి. అలాగే సాహిత్యం , కళలు, సాంప్రదాయాలు ఇలా ఎన్నో విషయలు తోడుగా వచ్చి అభివృద్ధి సాధించి  ఒక వాఙ్మయ  సాంప్రదాయాన్ని సంతరించుకొని సారస్వత సంపదను పోగుచేసుకోగాలి. కచ్చితంగా అలా జరగడం వల్లనే  మరి ప్రపంచంలోనే విశేషంగా మాట్లడబడే 15 భాషలలో మన భాష ఒకటిగా అవతరించ గలిగింది. ఈ విషయాన్ని ప్రతీ రోజూ తలచుకొని దానిలో మాట్లాడుతూ గర్వంగా మనం భావించాలి. ఈ విధమైన తలపు ఒక్కటి చాలు మనకు మిగిల్చిన భాషను కొనియాడి దానికి కారకులైన వారిని స్మరించుకొని పండుగగా చేసుకోవడానికి. రాజులు. పోషకులు, భాషా శాస్త్రవేత్తలు, సాహిత్య కారులు, కళాకారులు అన్నిటికీమించి జన బాహుళ్యంలో ఆ పదాలు మనకు మిగిల్చిన అతి సామాన్యులైన ప్రజలు, జానపదులు ఇలా ఎందరో  మనదైన మన పలుకు నిలబడడమనే సుదీర్ఘమైన పోరాట ప్రక్రియలో సైనికులు.

తెలుగు పలుకుల తేనెలొలికించిన తిక్కన,  ఆటవెలదుల ఈటెలు విసిరిన యోగి వేమన, కొత్త సంస్కృతికి నాంది పలికిన  కందుకూరి, తెలుగు బాసను ప్రజల భాషగ చేయగోరిన గిడుగు, దేశమంటే మనుజులేననని తెలుయజెప్పిన గురజాడ.. ఒకరా ఇద్దర వేలూ లక్షలు ఉన్నరెందరొ వీరులన్నట్లు , చుక్కానులై వెలుగులు ప్రసరించిన తేజోమూర్తులెందరో. ఎంత మంది యుగ పురుషులో అంతకు మించిన సంఖ్యలో కీలక చరిత్ర మలుపులు, దిశను నిర్దేశించిన ఘనులు. అటువంటి వాటిలో కొండ గుర్తులు గా బట్టీయం కొట్టవలసిన పాఠమొకటి ఉంది. మన భాషను ఫలాన అంటారు, దీని పేరిది, దీని స్వరూపమిది అని చెప్పిన చారిత్రక సత్యాలు కలిగిన ఒక పాఠం. అదే మొదటిగా తెలుగు అనే పదం ఒక రచయిత ప్రయోగించిన చారిత్రక సందర్భం.

భాషా వికాసపు యుగ సంధ్యలో, ఒక జాతిగా నిలదొక్కుకోవడానికి కావలసిన దృఢమైన పునాది రాళ్ళను  వెదుక్కొనే కాలంలో జాతికి ఒక ఆత్మ ఉన్నదని , దాని పేరు ఇదీఅని దాని రూపమిదని ఎవరో ఒక తెలివైనవాడు మిగతా వారికి చెప్పాలి. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఒక నాయకుడి స్థానంలో ఉన్నట్టుగా చెప్పాలి.  అటువంటి వారిలో ఆద్యులైన ఇద్దరు మూర్తులను మరచిపోరాదు. వేములవాడలో జీవించి వర్దిల్లిన కవిజనాశ్రయుడు మల్లియ రేచన మరియు గోదావరీ దేవి సాక్షిగా తెలుగు సాహిత్యబాల పురిటి గడ్డైన రాజామహేంద్రిలో వెలుగొందిన నన్నయ భట్టు. భాష పేరును స్వరూపాలను మొదటిగా ప్రకటించి ప్రయోగించిన వారిలో వీరే మొదట.

నన్నయ 1040 వాడయితే మల్లియ రేచన వందేళ్ళ ముందు వాడు. కవిజనాశ్రయమనే లక్షణ (శాస్త్ర) గ్రంథంలో ఛందస్సును గూర్చి వివరించాడు. ఏ పద్యంలో ఎన్ని గణాలు, యతిప్రాసల నియమాలను సూచించే శాస్త్ర గ్రంథం. ఇది కవిత్వం కాదు . కవిత్వానికి పనికి వచ్చే సూత్రాలను పద్యాల్లోనే వివరించే సూత్ర గ్రంథం. అప్పటికే దాదాపు 400 ఏళ్ళ బట్టి ఛందోబద్ద పద్యాలు తెలుగు శాసనాలలో రాయబడుతూ వచ్చాయి. కాబట్టి అప్పటికే కవిత్వం రూఢిగా సమాజంలో ఉంది అని చెప్పవచ్చు. కావ్యాలు కూడ రాసే ఉంటారు, కాని అవి లభ్యం కావడం లేదు. అప్పటికి పద్య కవిత్వం లేక పోతే రచయితకు పద్య  లక్షణాలను చెప్పే అవసరం ఎందుకు వస్తుంది ? అందుచేత అప్పటికే కవిత్వం ఉందని చెప్పాలి. ఇక కవిని గురించి మాట్లాడితే నిజ జీవతంలో కూడా ఆయన కవిజనాశ్రయుడే. శ్రీమంతుడై ఎంతో మంది కవులను పోషించాడు. దానికి తగినట్లుగానే తన గ్రంథానికి కూడా ఆ పేరే పెట్టాడు. వేములవాడ నిజంగా ఒక గొప్ప నగరం. కన్నడ భాషకు ఆదికవి అయిన పంప కవి,  ఆయన తమ్ముడు జినవల్లభుడూ  సాక్షాత్తూ మల్లియ రేచన కాలం వారే. వీరు ముగ్గురూ వేములవాడనుండి వచ్చిన వారే. గ్రంథం అవతారికలో మల్లియ రేచన ఈ పద్యంలో తెనుగు అనే పదాన్ని ఉపయోగించి ఇది ఈ భాష అని చెప్పాడు. తెనుగు మరియు తెలుగు రూపాంతరాలుగా చెప్పుకోవాలి. ఇప్పటికీ మనం నకారాన్ని లకారంగా కొన్ని పదాలలో ఉపయోగిస్తాం.ఉదాహరణకు ములగ కాయని మునగ అని కూడా అంటాము. మరి కొన్ని ఉదాహరణలు: నేదు-లేదు, నాగలి-లాంగలి.

అనవద్య కావ్య లక్షణ 
 మొనరుగా కవి జనాశ్రయుండు మల్లియ రే
చన సుకవి కవిజనాశ్రయ
 మను ఛందము తెనుగుబాస నరుదుగ చెప్పెన్

అనవద్య = దోషములేని, స్వచ్చమైన ; ఒనరుగా = ఇంపుగా ; అరుదుగ = అపురూపముగా

తాత్పర్యము = కవిజనులను పోషించు వాడునూ, సుకవియునూ అయినట్టి  మల్లియ రేచన స్వచ్చమైన కావ్య లక్షణములను ఇంపుగా కవిజనాశ్రయమను ఛందోగ్రంధమునందు  తెనుగు భాషలో అపురూపముగా చెప్పెను.

మల్లియ రేచనే తొలిగా తెనుగు పదాన్ని వాడినట్లుగా ఆరుద్ర వారు సమగ్రాంధ్ర సాహిత్యంలో సూచించారు. సుప్రసిద్ధ పరిశోధకులు పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారు నిర్ధారించిన దాని ప్రకారం మల్లియ రేచన మిత్రుడు తోటి సాహిత్య కారుడు అయినట్టి జిన వల్లభుడు 940 కాలం వాడైనట్టి వాడై నన్నయ్యకు వంద సంవత్సరాల ముందు వాడై “తెనుగు” అనే పదాన్ని మనకు లభ్యమవుతున్న ఒక గ్రంధంలో రాసిన ఈ అపురూప సందర్భాన్ని తెలుగు అక్షరాన్ని ప్రేముంచువారెవరూ మరువరాదు.

మల్లియ రేచన తరువాత వంద యేళ్ళకు తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని కొలువులో కుల బ్రాహ్మణుడుగా (శాసనపాఠ రచయిత) ఉన్న నన్నయ్యభట్టు మొదటిగా సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రీకరించిన సందర్భంలో తను ఏ భాషలోకి అనువదిస్తున్నదీ చాల స్పష్టంగా చెప్పి తెలుగు భాషలో మొదటి కావ్యాన్ని వెలువరించి ఆదికవి పీఠాన్ని అధిరోహించాడు. ఎన్ని చారిత్రక సత్యాలు తరచి చూసినా తెలుగు భాషలో లభిస్తున్న మొదటి కావ్యం మనకదే కాబట్టి నన్నయ్య ను ఆదికవి పీఠం నుండి ఇప్పటికింకా ఎవరూ తొలిగించ లేదు. అందుకు ఆ మహాకవి అర్హుడు. ఆయన తెలుగు పదాన్ని ప్రయోగించిన పద్యాలు వచ్చే సంచికలో తెలుసుకుందాం.

లెనిన్ వేముల

లెనిన్ బాబు వేముల: వృత్తికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఎమ్మే లో చదువుకున్న తెలుగు భాషా సాహిత్యాల సౌందర్యం మత్తు వదలని పాఠకుడూ వ్యాఖ్యాత. ప్రస్తుతం అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి టాంటెక్స్ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్)  నెల నెలా తెలుగు వెన్నెల క్రియాశీలురలో ఒకరు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.