రాజ్యాధికారం అంత ముఖ్యమా?

దుర్మార్గమని చాల మందికి తెలిసిన పలు దుర్మార్గాలు మన మధ్య ఎలా వుండగలుగుతున్నాయి? మన లోపల ఎలా వుండగలుగుతున్నాయి?

ఎన్ని విధాల ఆలోచించినా మిగిలే సమాధానం ఒక్కటే.

సన్మార్గ శ్రేణుల్లోని రాజీ బేరాల వల్లనే దుర్మార్గాలు వుండ గలుగుతున్నాయి. మన లోనికి వొచ్చి లోపల్నించి చెట్టును పాడు చేయగల్గుతున్నాయి.  

రాజీ బేరాలు ఎందుకు? ఎలాగైనా సరే రాజ్యాధికారానికి వచ్చేయాలనే కోరిక వల్లనే ఈ అడుగడుగు రాజీలు.

‘మన’కు రాజ్యాధికారం ఎందుకు? ప్రతి వుద్యమానికి, ఏదో ఒక దశలో రాజ్యాధికారం ధ్యేయం అయిపోతున్నది, ఎందుకు? వుద్యమ ఎత్తుగడలన్నీ రాజ్యాధికార ధ్యేయానికి లోబడుతున్నాయెందుకు? అతి, మిత వాదాలన్నీ రాజ్య.. ధ్యేయం కింద వివరణలు వెదుక్కుంటున్నాయెందుకు?

కింది నుంచి ఎన్నాళ్ళు అరుస్తూ వుండిపోతాం. పైనుంచి మనమే మార్పులు తీసుకు రావాలని…. దీనికొక సమర్థన.

అన్ని రోడ్లు రోమ్ కే అనే సామెత వలె అన్ని చర్యలు ‘రాజ్యాధికారం’ కోసమే అయిపోయాయి. దాని కోసమే ఏ రాజీ అయినా సమర్థనీయమయిపోయింది. మత శక్తులతో,  పవన్ కల్యాణ్ తో రాజీ కూడా. 

ప్రతిపక్షంలో వుండి రాజ్యాన్ని డిమాండ్ చేయడం కన్న,  ఎలాగో ఒక లాగ, మనమే రాజ్యాధికారం చేపట్టి, సంఘాన్ని బలిమిని మార్చగలమనే అవగాహన దీనికి పునాది. 

రాజ్యాధికారం తీసుకోవాలనడం సరైనదే, కాని, అన్ని సార్లు సరైనది కాదు. చాల సార్లు సరైనది  కానే కాదు.

***

సరైనది కాదని ఇంటా బయటా పలు మార్లు నిరూపణ అయ్యింది.

రష్యాలో సుమారు డెబ్బయ్యేళ్లు ‘మన’దే రాజ్యం. అందులో సగం రివిజనిజం కనుక అది ‘మనం’ కాదని కొందరు అంటారు.

నేనైతే అదీ మనమే నంటాను. పోనీ, మీ మాటే కానివ్వండి. ఆ మొదటి ఇరవై ముప్పయ్యేళ్ళు ఏం చేశాం?  అక్కడే కాదు, మరెక్కడైనా ఏం చేశాం? ‘వుపగ్రహాలు’ (శాటెల్లైట్స్) అని పేరొందిన ‘సోషలిస్టు’ దేశాల్లో ఏం చేశాం? ఒకటి రెండు చోట్ల కాస్త సంక్షేమ రాజ్యంగా వుండొచ్చు. అంతకు మించి ఏం చేశాం?

నిజం చెప్పాలంటే ఏమీ చేయలేదు. వుపగ్రహాల్లో ఏం చేయలేదు, గ్రహంలో ఏం చేయలేదు. .

ఐ మీన్, ఏ సోషలిజం కోసమని రాజ్యాధికారం చేపట్టామో ఆ సోషలిజం కోసం ఏమీ చేయలేదు.

రాజ్యాంగ యంత్రాన్నుపయోగించుకుని బలవంతంగా, పై నుంచి మంచి పనులు చేస్తున్నాం అని చెప్పుకున్న రోజుల్లో చేసింది కూడా ఏమంత మంచిది కాదని ఇప్పుడు తెలుస్తోంది, ఇనుప తెర తొలగే సరికి.

కార్మిక కర్షకులతో రాత్రింబవళ్ళు పని చేయించి, వాళ్ళ వుసురు తీసి, మరింత పెట్టుబడిని పోగు చేసి, చివరికి ఆ కుప్ప మీద ప్రైవేటు పెట్టుబడిని కూర్చోబెట్టామంతే, రావణ సభలో వాలం చుట్టుకు కూర్చున్న హనుమంతుని వలె.

రష్యా మరీ మెటా న్యారేటివ్.

ఇక్కడ మన చిన్న చిన్న కథల్లో ఏం చేశాం? మన దేశంలో ఏం చేశాం?

జనం ఎన్నికల్లో అన్ని సంవత్సరాలు రాజ్యాధికారమిచ్చారు కదా, బెంగాల్లో, కేరళలో.

ఇక్కడ ఏం చేశాం?

ఇప్పుడు. రాజకీయంగా వెనక్కి వంగి వంగి వెల్లకిలా పడిపోతున్నాం. ఎవరితో ఎలా రాజీ బేరాలాడుదామా అని యుక్తుల మీద యుక్తులు పన్నడంలోనే మన తెలివితేటలన్నీ ఖర్చు చేస్తున్నాం.  

పట్టుకున్న ఏ కుక్క తోకా అచ్చి రాక, నడి గోదాట్లో మునకలేస్తున్నాం.  

మరి, అచ్చం మనమే అధికారానికి వస్తే మాత్రం ఏం చేస్తాం?

పవర్ కరప్ట్స్, మోర్ పవర్ కరప్ట్స్ మోర్ అని మరి మరి నిరూపిస్తాం. ‘వర్గ చేతన’ అని అనడమే గాని, మనం మనుషులమే, మనం కూడా కరప్ట్ అవుతాం. అది పవర్ కు సహజం.

అత్యవసరం,  సహజ అవసరం అయితే తప్ప పవర్ ను ముట్టుకోవద్దు. అదొక అడివి గుర్రం. వైల్డ్ హార్స్.

***

కింది నుంచి వుద్యమాల రూపంలో చేయలేని ఏ పనీ పై నుంచి ‘రాజు’లమై చేయలేం.

కింది నుంచి వుద్యమాలుగా చేసిన దాన్ని పై నుంచి రాజ్యాధికారంతో స్థిరీకరించగలం.

రాజ్యం పని స్టిరీకరించడమే. మార్చడం కాదు.

మార్చడం వుద్యమాల పని. ఏ మార్పైనా వొచ్చిందీ అంటే ఉద్యమాల వల్లనే వొచ్చింది.

ప్రతి వుద్యమం రాజ్య వ్యతిరేకమే.  

వుద్యమాలు తమ ధ్యేయ సాధనలో కన్సిడరబుల్ స్థాయికి పురోగమించిన తరువాత లేదా తాము అనుకున్న మార్పు సాధించాక దాన్ని కన్సాలిడేట్ చేసుకోడానికే రాజ్యాధికారం.

రాజ్యాధికారం మన అంతిమ ధ్యేయం ఎప్పుడూ కాదు. ప్రతి సారీ, అదొక మజిలీ. చాల మజిలీల తరువాత, చాల సార్లు రాజ్యాధికారాల తరువాత ఇక రాజ్యాధికారం అక్కర్లేని కాలం. మనుషులు ప్రజలుగా కాకుండా మనుషులుగా బతికే కాలం.

రాజ్యాధికారమే అంతిమ ధ్యేయమనుకుంటే, అన్నాళ్ళుగా, అప్పటి వరకు మనం ప్రవచించిన దానికి మనమే అవరోధమవుతాం. ప్లెయిన్ భాషలో చెప్పాలంటే, ‘అభివృద్ధి నిరోధకులమ’వుతాం. అయ్యాం, అవుతున్నాం. అవుతాం. అది దాని సహజ స్వభావం.

వుద్యమం అనేది ఘర్షణకీ, మార్పు ప్రయత్నానికీ కొనసాగింపు. అది నిరంతరం.

రాజ్యాధికారం ఆ ఘర్షణకీ, మార్పు ప్రయత్నానికీ విరామం. అది తాత్కాలికం.

ఘర్షణ శాశ్వతం. విరామం తాత్కాలికం.

***

క్లాసికల్ వుదాహరణ రష్యా.

థర్డింటర్నేషనల్ కమ్యూనిజానికి జన్మస్థానం, దాని వాస్తవ అమలు కేంద్రం రష్యా (సోవియెట్ యూనియన్).

తన దేశంలో తన అధికారం కాపాడుకోడం రష్యా పార్టీకి, సోవియెట్ రష్యాను కాపాడుకోడం ప్రపంచానికి పరమ ధ్యేయమయ్యాయి. దాని కోసం పలు రాజీలు.

లెనిన్ కాలంలో జరిగింది, దాదాపుగా, లెనినిస్టులు రాజ్యానికి రాక ముందుండిన జీవితాన్ని (పెట్టుబడిదారీ విధానాన్ని) అలాగే వుంచడం.

ఆప్పటి వరకు మార్పు కోసం జరిగిన వుద్యమం సాధించిన పాక్షిక విజయమే ఆ రాజ్యాధికారం.

అప్పుడు రాజ్యాధికారంలోనికి రావడమంటే ఆ పాక్షిక విజయాన్నే అంతిమ విజయంగా స్థిరీకరించడమే.

రాజ్యాన్నుపయోగించి మార్పుల కోసం బలిమిని ప్రయత్నించింది స్టాలిన్ కాలంలోనే. అందుకే స్టాలిన్ తన పాలనలోని సమాజమే సోషలిజమన్నాడు. వర్గాలిక లేవన్నాడు. అంటే కమ్యూనిస్టులకు సంబంధించి అది ఘర్షణ-రహిత కాలమని… ఏవో కొన్ని చిన్న చిన్న రిపేర్లే తప్ప… ఇక, ఇదే ఘర్షణకు అంతిమ విరామమని… తను నమ్మి, లోకాన్ని నమ్మించ జూశాడాయన. ఆ కాలంలో జరిగిన హింస… అది కార్మిక కర్షకుల మీద జరిగిన హింస కూడా. ఆ మాట నిజం కాదని, గిట్టని వాళ్ళ ప్రాపగాండా మాత్రమేనని కొట్టి పారేయడం ఒక అబద్ధం.

ఇప్పటికీ దాన్నే నమ్ముతున్నారు చాల మంది, తమ మనస్సులను తామే తన్ని గుద్ది అణిచేసుకుని.

మనల్నీ నమ్మమంటున్నారు తిరపతి కొండెక్కి మరీ.

అది కుదరదు. కుదరదంటోంది మన కాలం.

బోల్షెవిక్కులు సాధించిన (బూర్జువా) డెమోక్రసీని స్టిరపరిచే వరకే, దాన్నింకా బలపరిచే వరకే లెనిన్, స్టాలిన్ ల రాజ్యాధికారం వుపయోగపడింది. మార్పు కోసం… సోషలిజం కోసం ప్రయత్నం నామ్ కే వాస్తే.

ఆ పేరుతో జరిగింది… సోషలిజం ఎవరి కోసమో వాళ్ళతో సహా మొత్తం సమాజానికి మరింత హింసతో….  (బూర్జువా) డెమొక్రసీని మరింత బల పరచడమే.

***

మరి వాళ్ళు ‘ఏం చేయాలి?’ బోల్షివిక్కులు ఏంచేయాల్సి వుండింది? చేతులు ముడుచుక్కూర్చోవాల్సిందా?

చేతులు ముడుచుకోవడం లేదా చాచడం ఏ డాన్సులయినా చేయడం…  చేయాల్సింది పార్టీ కాదు…కార్మిక వర్గం, ఏ కార్మిక వర్గం పేరిట ఎర్రజెండాలెత్తారో ఆ కార్మిక వర్గం చేయాలి.

రాజ్యాధికారం చేపట్టాల్సింది అచ్చంగా ఆ కార్మిక కర్షకులే… కార్మిక కర్షకులు ఎన్నుకున్న ప్రతినిధులే.

వాళ్ళ సైద్ధాంతిక ప్రతినిధులు కాదు.

కమ్యూనిస్టులు… కార్మిక కర్షకులకు మంచి సెబ్బరలు చేప్పే వాళ్ళే. ఏది సోషలిజమో, ఏది కమ్యూనిజమో, ఏది మార్క్సిజమో దాన్ని జనాలకు అందించి, నేర్పించి, ఎక్విప్ చేసే వాళ్లు కమ్యూనిస్టులు. కార్మిక కర్షకులు రాజ్యాధికారం చేపట్టడానికి దోహదం చేసే వాళ్లు. ఆ కెటలిస్టు పనిలో ప్రాణ త్యాగాలకు సైతం తెగించే వాళ్లు. సత్యం కోసం మరణమైనా సరే అనే వాళ్ళు కమ్యూనిస్టులు.

అంతే గాని, కార్మిక కర్షకుల పేరిట తామే మంత్రులు, ముఖ్య మంత్రులయే వాళ్ళు కాదు. చారిత్రక తప్పిదం జరక్కపోయి వుంటే ప్రధాన మంత్రులయి ఎర్ర జెండాను ప్రకాశింపజేసే వాళ్ళు కూడా కాదు.

***

మరి, ఎన్నికైన కార్మిక కర్షక ప్రత్రినిధులు రాజ్యాధికారాన్ని సరిగ్గా నిర్వహించలేక విఫలమయితే ఎలా? అధికారం చేతికందాక కరప్ట్ అయితే ఎలా?

ఏం లేదు. ఆ అధికారం పడిపోతుంది. సమాజంలో తక్షణం, లేదా మరి కొన్నాళ్ళకు మళ్లీ ఘర్షణ మొదలవుతుంది. మళ్లీ కార్మిక కర్షకులు అధికారం చేపట్టే తరుణం ముందుకు వస్తుంది. ఈ సైకిల్ పునః పునః పునరావృతమవుతుంది.

క్యాపిటలిజం వున్నంత కాలం అర్థిక, సాంఘిక సంక్షోభాలు అనివార్యం, మనం (పార్టీ) అధికారం చేపట్టినా సంక్షోభాలు తప్పవు. పునః పునః పోరాటాలు తప్పవు.  

జనం తమను తాము ఎలా పరిపాలించుకోవాలో, ఎవరి పరిపాలనా అక్కర్లేని కాలంలోనికి ఎలా పయనించాలో ఈ పడి లేచే అనుభవాలతోనే తెలుసుకుంటారు, అలవర్చుకుంటారు. ఇంటర్నలైజ్ చేసుకుంటారు. జెనెటికల్ ట్రెయిట్స్ లాగే ఈ అలవాటు కూడా తరం నుంచి తరానికి సంక్రమించి బలపడుతుంది.

ప్రజలు తమకు తాము అధికారం చేపట్టడం, వొదులుకోడం, మళ్లి చేపట్టడం… … ఇదంతా విసుగ్గా వుంది కదూ? ఉంటుంది. మరి, ‘ప్రజా చేతనను నరనరానా’ జీర్ణించుకున్న మనం (పార్టీ) రాజ్యం చేస్తే అలా పడి లేచే అవసరం వుండదా? ఏం, మనం మాత్రం రాజ్యాధికారులుగా పతనం కామా? రాజ్యాధికారాన్ని పోగొట్టుకోమా? ఎంచక్కా పోగొట్టుకుంటామని గత వందేళ్ల కాలం పలు మార్లు ఇల్లస్ట్రేటివ్ గా చూపించింది. ఇంకా చూపిస్తోంది.

కార్మిక కర్షకుల పక్షాన మనం అధికారం చేపట్టడం వల్ల వాళ్ళకు వొరిగేదేమీ లేదు. తాముగా తమ అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశాన్ని వాళ్లు కోల్పోవడం తప్ప. విజయాలకు ముందుండినంత అనుభవరహితులుగా అపజయానంతరం కూడా మిగిలిపోవడం తప్ప. అప్పటి వరకు చేసిన త్యాగాలు, పొందిన కష్టనష్టాలు వారికి వ్యర్థం కావడం తప్ప.

అంతే కాదు.

పడి లేవడం అనే ప్రాతిపదిక మీద ప్రజలకు రాజ్యాధికారం కాకుండా;  పార్టీకి రాజ్యాధికారమే ఉద్యమ ధ్యేయమైతే, ఆ అధికారం కోసం.. వుద్యమ కాలంలో సైతం పార్టీ ఎన్ని రాజీబేరాలకు దిగుతుందంటే, ఇక దాన్ని కమ్యూనిస్టు పార్టీ అనడం మార్క్సుకు అపచారమవుతుంది. 

చూడ రాదూ,

బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు మతాల మెట్ల మీంచి గద్దెలెక్కడం నుంచి మనాళ్ళు తీసిన ‘చారిత్రక’ పాఠాలేమిటి? వాళ్ళ లాగే మనం కూడా ‘సాంస్కృతిక’ అంశాలను వాడుకోవాలని పాఠం. సంస్కృతి అంశాలు అంటే ఏమిటి? ఎక్కడ ఏ మతం మెజారిటీ అయితే అది… జుట్టిరబోసుకుని కరాళ నృత్యం చేస్తుంటే, దాన్నీ దాని ప్రభావాన్నీ ప్రజా మానసాల నుంచి ఉచ్చాటన చేయడానికి కచ్చితమైన వైఖరితో హేతు విద్యా వ్యాప్తికి కృషి చేయక పోగా, మనకు అంది వచ్చిన మతాలతో లేదా మత శకలాలతో హాబ్నాబింగ్ కి పాల్పడడం. 

దీనికి ఒకే ఒక సమర్థన. జనం మతస్టులుగా వున్నారని. మారరని. అదొక అబద్ధం. మత నేతలూ గురువులు, ‘అగ్రులు’ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న అబద్ధం.

ఎస్, ఇవాళ తిరపతి కొండకు వెళ్లి గుండ్లు చేయించుకునే వాళ్ళంతా మతస్టులూ కారు. మతవాదులూ కారు. హిందూ మతం మీద మీరు ప్రచారాత్మక విమర్శ పెడితే ఈ నిశ్శబ్ద ప్రజానీకం మిమ్మల్ని వెంటనే మెచ్చకపోయినా, మిమ్మల్ని మీద పడి గిచ్చరు, కొరకరు. తాముగా ఆలోచించడానికి సమయం తీసుకుంటారంతే. ఇప్పటీకిప్పుడు వాళ్ళలో చాల మంది… మీ వైఖరికి ఓటేయక పోవచ్చు. మీరు ఎన్నికల్లో గెలవడానికి ఈ ప్రచారం వుపయోగపడక పోవచ్చు.  

దీని వల్ల సమాజంలో నెమ్మదిగానో, ‘మన’ ప్రచారం వుధృతంగా వుంటే వుధృతంగానో వచ్చే మానసిక మార్పులే… మనుషుల్ని మనుషుల్ని చేస్తాయి. కార్మిక కర్షకులు, సాఫ్ట్ వేర్లు, లాయర్ల వంటి మధ్యతరగతి శ్రామిక వర్గం కూడా శ్రామిక వర్గంగా ఆలోచించడానికి భూమిక ఏర్పడుతుంది. హేతుబద్దంగా ఆలోచించడం అనేది ఒక ‘సరైన పని’ అని ప్రాచుర్యం పొందుతుంది.

లేకుంటే, అయ్యా! మనకున్న కాస్త ప్రజాశక్తిని పళ్ళెంలో చక్కగా సర్ది వాళ్ళ భోజనం బల్ల మీద పెట్టడం అవుతుంది, వాళ్ళకు ఒక డెజెర్ట్ గా.

ప్రతీప శక్తులను ఓడించడం మాట ‘దేవుడె’రుగు, మనమే వాళ్ళలో కలిసిపోవడం అవుతుంది, ఇక మనం వేరుగా వుండడం ఎందుకు, వాళ్ళ లాగే మనమూ కొన్ని బిస్కెట్లు ఏరుకుంటే పోలా అని మనలోని వాళ్ళకే అనిపిస్తుంది? 

చూడ రాదూ చుట్టూరా. ఎక్కడికి చేరాం మనం?!

రాజ్యాధికారం ముఖ్యమే.

ఆ పనిముట్టుతో మనం ఏం చేయాలనుకున్నామో ఆ పని కన్న రాజ్యాధికారం ముఖ్యం కాదు.

13-7-2018     

హెచ్చార్కె

16 comments

 • Congratulations hrk for your thought-provoking self criticism of left movement. I request all left intellectuals should join in the debate to get a positive concrete action programme for a new human civilisation and for a new human culture .

 • Thanks Somayya garu, I liked the word ‘self criticism’. its need of the hour for everybody, every group and Party. it needs to be debated in depth.

 • కమ్యూనిస్టుల రాజ్యాధికార భావన మీద రాశారు. యధావిధిగా బాగా రాసారు. మరి సామాజిక ఉద్యమ శక్తుల రాజ్యాధికార జపం గురించి కూడా రాయండి.

  • చాల థాంక్స్, శీను! జనరల్ గా ‘వుద్యమాల’ను, ప్రత్యేకించి వామపక్షాల్ని పేర్కొన్నాను. ఇప్పటికి వామపక్షాల రాజ్యాధికార అనుభవమే పరిశీలనకు తగినంత స్థాయిలో వుంది. ఏ వుద్యమమైనా, రాజ్యాధికారమే పరమ ధ్యేయమైతే, దాని అసలు ఆశయం చతికిల పడుతుందనేది నిజమే.

 • ఆలోచన రేకెత్తించే వ్యాసం. మళ్ళీ చగవాలి.

 • చాలా చక్కటి విశ్లేషణ
  అభినందనలు సర్

  • థాంక్సెలాట్ రాజశేఖర్ చంద్రం గారు!

 • చక్కని పాఠం, గుణపాఠం, సమగ్ర సింహావలోకనం మీ సంపాదకీయం. మీ ప్రత్యక్షరం నిజం నిజం! చాదస్తాల్ని, అజ్ఞానాన్ని దులిపేస్తోంది ‘రస్తా’! అవును! తక్షణావసరం ఆత్మ విమర్శ. అభినందనలు.

  • థాంక్యూ సో మచ్ చల్లా రామఫణి గారు.

 • మనం ఏ విలువల నుంచి జారిపడిపోతున్నామో., ఏ విలువ కోసం అర్రులు చాస్తున్నామో… బలంగా గుర్తు చేసిన వ్యాసం. ఆలోచనల్లో ఘర్షణ రేకెత్తించినందుకు హెచ్చార్కెకు ధన్యవాదాలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.