వాస్తవానికీ కల్పనకీ మధ్య ఘర్షణ: సంజూ

సంజు సినిమా చూసిన వారిలో కొంతమంది ఆ సినిమాలో సంజయ్ దత్ నిజ స్వరూపం బయటపడకుండా జాగ్రత్త పడ్డారనీ, బాలీవుడ్ ‘బ్యాడ్ బోయ్’ ని ‘గుడ్ బోయ్’ గా చూపటానికే ఎక్కువగా ప్రయత్నించారనీ, అతడి జీవితంలోని ఎన్నో చీకటి కోణాలను అసలు చూపకుండానే ముగించేశారనీ అనటం చూస్తుంటాం. ఐతే ఒకప్పటి లాగా చనిపోయిన వారి జీవిత కథలను తెరకెక్కించటం లేదిపుడు. ఇప్పటి ట్రెండేమంటే బతికున్న వారి కథలనే తీసుకుని సినిమాలుగా మలచటం. అంటే క్లాసికల్ బయోపిక్ లో  ఉండేటటువంటి ఒక వ్యక్తి పుట్టడం, ఎదగటం, చనిపోవటం వంటి కాలపరమైన నరేటివ్ సీక్వెన్సుని ఇటువంటి బయోపిక్స్ కలిగి ఉండవు. అంతేకాక ఆ వ్యక్తి జీవితంలోని ప్రధానమైన ఒక అంశాన్ని మాత్రమే చూపటానికి అవి ఇష్టపడతాయి. పైగా ఆ వ్యక్తి బ్రతికే ఉండటం వలన , ఆ వ్యక్తే తన జీవిత చరిత్రలోని ప్రధాన ఘట్టాన్ని కథకునికీ దర్శకునికి వివరించటం జరుగుతుంది. మానవుడు తన కథ చెప్పవలసి వస్తే తనకు ఇష్టమైన భాగాలను, వివరించి చెప్పాలనుకున్న భాగాలనే చెబుతాడు తప్ప తన మనసుకి కష్టం కలిగించే నిష్ఠుర సత్యాలనూ, తన మూర్తిమత్వాన్ని తక్కువ చేసి చూపే సంఘటనలను తప్పక avoid చేస్తాడు. ఐనా గానీ సంజు సినిమా సంజయ్ దత్ డ్రగ్ అడిక్షన్ నీ, ఫ్యామిలీ పట్ల అతడి బాధ్యతా రాహిత్యాన్నీ, వృత్తి పట్ల నిబద్ధత లేమినీ బాగానే చూపించింది. ఐనా కానీ ఇంకా ఏదో తక్కువ చూపించారు, చూపించాల్సినంత చూపించలేదు అనేవారు ఉండనే ఉన్నారు. ఇటువంటి వాదనలు ఒకింత unethical గానూ politically motivated గానూ అనిపిస్తూంటాయి. ముఖ్యంగా సంజయ్ దత్ మొదటి భార్యను గురించి చూపలేదనీ లేదా అతడికి గల వందల వివాహేతర సంబంధాలను చూపలేదనీ, లేదా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తో గల సంబంధాలను చూపలేదనీ ఇవన్నీ చూపించనిది అసలది బయోపిక్ ఎలా అవుతుందనీ వీరి వాదన. బహుశా రెండు గంటల బయో పిక్ వీరికి ఒక ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా’ కావాలని ఉద్దేశమేమో. ఇటువంటి అంశాలను చూపాలంటే, అందులోనూ ఒక బయో పిక్‌ లో అవతలి వ్యక్తుల అంగీకారం కూడా అవసరం అవుతుంది. మొదటి భార్య వివాహం, విడాకులు వంటి అంశాన్ని తెరమీదకు తేవాలంటే ఆమె అంగీకారం కూడా అవసరమే కదా. అనంగీకారం ఉన్నాగానీ సినిమా తీసి లీగల్ ఇష్యూస్ తో దర్శక నిర్మాతలు కోర్టుల చుట్టూ తిరగాలని ఈ విమర్శకుల వాదనలు కావచ్చు. ఏమైనా సంజు సినిమా సంజయ్ దత్ జీవితంలోని నెగేటివ్ షేడ్ ను ఎంత మేరకు చూపించాలో అంత వరకే చూపించింది. ఇది మాత్రమే సరైన పద్ధతి.

ఒక సెలెబ్రిటీ విషయంలో ఉన్న సమాచారం ప్రధానంగా రెండు డొమైన్లలో ఉంటుంది. ఒకటి పబ్లిక్ డొమైన్ లో ఉంటే రెండవది ఆ వ్యక్తి అత్యంత సన్నిహితుల వద్ద ఉంటుంది. పబ్లిక్ డొమైన్లోకి వచ్చే సమాచారం సింహభాగం వార్తా పత్రికలలో లభ్యమయ్యేదే. అందువలన బయోపిక్ తీసే  దర్శకులు ప్రధానంగా రెండు విధాలుగా ఉంటారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలనే మళ్ళీ సినిమాలో ఇంకాస్త కూలంకషంగా చూపుతూ కథలో ఒక జస్టిఫికేషన్ ని తీసుకురావటం. అంటే తాము ఏం చూడబోతున్నామో ప్రేక్షకుడికి ముందే తెలుసు కాబట్టి ప్రేక్షకుడు చూడాలనుకున్న కథనే చూపటం. ప్రేక్షకుడి మనసులో ఉన్నదానినే మెల్లిమెల్లిగా unfold చేయటం. ఈ మధ్య వచ్చిన ‘మహానటి’ సినిమా అదే పని చేసింది. ఇక రెండవది ఆ సెలబ్రిటీ గురించి  ప్రేక్షకుడికి అసలు ఏ మాత్రం తెలియని విషయాలను సంపాదించి సినిమాగా తీసి ప్రేక్షకుడిని అబ్బుర పరచటం. ఇందుకు తగ్గ సమాచారం ఆ సెలబ్రిటీ దగ్గరో అతడి సన్నిహితుల దగ్గరో మాత్రమే లభిస్తుంది. ఐతే సంజు సినిమాలో ఈ రెండు డొమైన్లలో ఉండే సమాచారాల మధ్య దర్శకుడు ఒక ఫ్రిక్షన్ ని ప్రవేశ పెట్టడం చూస్తాం. ముఖ్యంగా సినిమా రెండవ సగంలో ఈ ఫ్రిక్షన్ కనిపిస్తుంది. పబ్లిక్ డొమైన్ లోకి ఒక సమాచారం ఏ విధంగా వస్తుంది అంటే ఈ రోజు ప్రధానంగా చెప్పవలసినది మీడియా గురించే. పబ్లిక్ డొమైన్ లో సమాచారం facts రూపంలో ఉంటుంది. అది truth కాదు. కంటికి కనిపించినది, కెమెరా కంటికి చిక్కినదీ యథాతథంగా fact అవుతుంది. వార్త ఈ ఫ్యాక్ట్ ఆధారంగానే రూపొందించబడుతుంది. వార్త వ్యాపారం అయ్యే కొద్దీ అది ట్రూత్ మీద కంటే ఫ్యాక్ట్ మీద ఆధారపడుతుంది. ట్రూత్ ఒక వ్యాపార వస్తువు కాదు కానీ ఫ్యాక్ట్ మాత్రం టీఆర్పీలను తెచ్చిపెట్టే అద్భుతమైన వ్యాపారం. “సంజయ్ దత్ ఇంటి దగ్గర ఆర్డీఎక్స్ దొరికిందా?” అని హెడ్డింగ్ వస్తుంది టీవీలో. వాక్యం చివరన ఒక క్వశ్చన్ మార్కు. ఈ వార్తకు ఆధారం ఆ ఇంటి దగ్గర తీసిన ఒక ఫోటోగ్రాఫ్ అనుకుందాం. అపుడు ఈ వార్తను వండి వార్చడానికి వాళ్ళకు దొరికిన ఒక ఆధారం ఈ ఫోటోగ్రాఫ్.  అది ఒక ఫ్యాక్టు. ఇపుడు ఈ ఫ్యాక్ట్ చుట్టూ ఒక వార్త రాస్తే అది ఫక్తు వ్యాపారం. ఇంకాస్త సత్య సంధ్యతతో ఎంక్వైరీ చేస్తే ఆ ఫోటోగ్రాఫ్ కూ సంజయ్ దత్ కూ ఏమాత్రం సంబంధం లేదనే ట్రూత్ అప్పుడే బయటపడవచ్చు. కానీ ఆ ట్రూత్, వార్తా వ్యాపార వస్తువు కాదు.

ఇలా చూసినపుడు సంజయ్ దత్  ఫ్యాక్చువల్ జీవితానికి ఆక్చువల్ జీవితానికీ మధ్య పెద్ద ఫ్రిక్షన్ కనిపిస్తుంది. ట్రూత్ తో సంబంధం లేకుండా, కేవలం ఫ్యాక్ట్స్ ఆధారంగా వార్తలు వండుతూన్న మీడియా ఒక వ్యక్తి గురించి ఒక స్థిరమైన అభిప్రాయాలను ప్రజలలో కలిగించగలుగుతుంది. ప్రజల కల్లెక్టివ్ కాన్సియస్నెస్ ని ప్రభావం చేయగలుగుతుంది. “సంజయ్ దత్” అనగానే ముంబై వరుస పేలుళ్ళలో ఆయన పాత్ర గుర్తుకు రావడమూ, ఆయనొక టెర్రరిస్ట్ గా ముద్రపడటమూ వంటివన్నీ కేవలం మీడియా వండి వార్చిన ఫ్యాక్చువల్ విషయాలే. ఈ సినిమాలో దర్శకుడు రాజ్కుమార్ హిరానీ సంజయ్ దత్ కు మీడియా ఆపాదించిన ఫ్యాక్చువల్ జీవితాన్ని undo చేస్తూ అతడి ఈ ఆక్చువల్ జీవితాన్ని ప్రేక్షకుల ముందు ఎస్టాబ్లిష్ చేస్తాడు. దీనికి ఆయన ఉపయోగించిన స్క్రీన్ప్లే కానీ, చెప్పడంలోని ఈజ్ కానీ extraordinary గా ఉన్నాయి. పైగా రణబీర్ కపూర్, పరేష్ రావల్ లో నటన సినిమాలోకి కావలసినంత ఎమోషన్ నూ తీసుకు వచ్చింది. ముంబై బాంబు బ్లాస్ట్ సంఘటన చుట్టూ పరుచుకుని ఉన్న రాజకీయ పరిస్థితులూ, మన న్యాయ వ్యవస్థ నిర్లిప్తతా, జైలు జీవితాలూ, మీడియా అత్యుత్సాహాలూ, బాలీవుడ్ నట వారసత్వాలూ, డ్రగ్ ఎడిక్షన్ లూ, వీటన్నింటి మధ్య నలిగే ఒక బాలీవుడ్ అగ్రహీరో కుమారుడు. ఒక బయోపిక్ లో ఆనాటి రాజకీయ, సామాజిక విషయాలను కథకు దగ్గరగా తీసుకుని వచ్చి కథలో భాగం చేయగలగటం ఒక చేయితిరిగిన దర్శకుడికే సాధ్యం అవుతుంది. రాజ్కుమార్ హిరానీ ఇటువంటి కథనంలో సక్సెస్ సాధించాడనే చెప్పాలి. ఐతే ఈ బయోపిక్ చూసిన తర్వాత సంజయ్ దత్ విషయంలో మనం ఇప్పటిదాకా ఏర్పరుచుకున్న ఒక అభిప్రాయం మొత్తం మారిపోతుంది. పూర్తిగా కొత్త సంజయ్ దత్ మనముందు ఆవిష్కారమౌతాడు. ఇదే ఈ సినిమా సాధించే సక్సెస్. సంజయ్ దత్ దుర్మార్గుడే అనుకునే వారిని ఇది ఒకింత ‘కాగ్నిటివ్ డిసోనాన్స్’ కి గురిచేయక తప్పదు. అందుకే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. అంటే వీళ్ళమీద మీడియా పప్పరాజీ  ప్రభావమెంతో అర్థం చేసుకోవచ్చు. సంజయ్ దత్ జీవితం తెలుసుకోవాలని లేకున్నా అసలు మీడియా సృష్టించే కలెక్టివ్ కాన్సియస్నెస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికైనా ఈ సినిమా చూడవచ్చు.

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

15 comments

 • ఇది సంజు రివ్యూ లా అనిపించలేదు
  సంజు సినిమా ని ఇష్ట పడని వాళ్ళ గురించి రాసిన విశ్లేషణ లా అనిపించింది

  • ఇది రివ్యూ కాదు.
   కాబట్టి మీకు అలా అనిపించి ఉండవచ్చు.
   రివ్యూ లకోసం చాలా వెబ్సైట్లు ఉన్నాయి. అక్కడ మీరు కోరుకున్నది దొరకవచ్చు

 • We want to reach out to others when we write…and positively influence them…it’s our ultimate purpose! Thanks for coming by !
  Good one 👍

 • మంచి ఎనాలిసిస్.. విరించి అన్నగారు సంజు సినిమాను చాలా బాగా విశ్లేషించారు. రస్తా బాగుంది.. అభినందనలు..

 • చక్కని విశ్లేషణ. నేను సినిమా చూడలేదు. పరేష్ రావల్ అత్యద్భుతంగా నటించేడని విన్నాను. ‘ఇక్కడి చెట్ల గాలి’ అప్పుడే కనువిందు చేసిందే!

 • బావుంది సార్…ఇలాగే కంటిన్యూ చెయ్యండి.

 • సినిమా అనేది మొదటగా వ్యాపారం. ఆ తర్వాతే, కళా, గాడిద గుడ్డూనూ.
  ఈ వ్యాపారం ఒక సరుకుని తయారు చేస్తుంది. ఈ సరుకులో అనేక పదార్థాలు (విషయాలు) రక రకాల పాళ్ళలో వుంటాయి. ఆ పాళ్ళని, ఆ సరుకు తయారు చేసే వాళ్ళు నిర్ణయిస్తారు, కొనుగోలు దార్లనీ, తమ సామర్ధ్యాన్నీ బుర్రలో పెట్టుకుని.

  ప్రతీ వ్యక్తీ, ఆ సరుకుని, పూర్తి విలువ చెల్లించి, కొనడం జరుగుతుంది (ఈ జరగడం అనే పదం వాడడం ఎందుకంటే, ‘వ్యక్తి కొనుక్కుంటాడు’ అనే పురుషాధిక్య వాక్యం రాయడం ఇష్టం లేక). ఒక సరుకుని కొనుక్కున్న ప్రతి వ్యక్తికీ, దాన్ని ఇష్ట పడే, వ్యతిరేకించే, విమర్సించే హక్కు వుంటుంది. ఎటొచ్చీ, ఇంకరికి వున్న హక్కుని వ్యతిరేకించకూడదు.

  ఈ ‘సంజూ’ అనే సరుకు లోని పాళ్ళు నచ్చిన వాళ్ళు, దాన్ని మెచ్చుకుంటూ చక్కగా రాసుకోవచ్చు, వ్యాసాలు. ‘ఆ సరుకులో, అది లేదూ, ఇది లేదూ, అని విమర్శించే’ వాళ్ళకి, ‘అది సరి కాదంటూ’, చెప్పడం ఎందుకు?

  ఒక నేరస్తుడి కధని, ఇష్టమొచ్చినట్టు, ఒక సరుకుగా తయారు చేసి, సొమ్ము చేసుకుంటున్నారు. అది ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం. అది సరిగా అర్థం చేసుకోలేక పోతే, ఏ విషయమూ సరిగా అర్థం కాదు.

  పాఠకుడు

  • విమర్శించే వారిని అలా విమర్శించాలి ఇలా విమర్శించకూడదు అని చెప్పడం ఎందుకు?

   పైగా వారు అలా విమర్శించారు అనే చెప్పాను కానీ వారలా విర్శించకూడదు అని చెప్పలేదే.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.