వేకువని కలగనడం ఇప్పుడు నేరం

‘తన ప్రేమ లోనూ, ద్వేషంలోనూ స్పష్టంగా లేనివాడు తన కాలాన్ని ప్రభావితం చెయ్యలేడు’
                                                                                 – డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
ధిపత్య ప్రపంచం మన మీద రుద్దే తప్పుడు భావాల నుంచి మనం నిరంతరం మన మనోప్రపంచంతో పోరాడాల్సిన కాలం ఒకటి మనముందు నిలబడి మనల్ని గేలి చేస్తున్నది.
ఈ ఆధిపత్య ప్రపంచం మనల్ని మనకి కాకుండా చేయడంలో ఇరవై నాలుగుగంటలూ అలుపెరగకుండా పని చేస్తూనే వున్నది.
వాస్తవ ప్రపంచానికి
అది చేసే మానసిక కల్లోలానికి మధ్య ఏర్పడిన  పెద్ద అగాధం పూడ్చడానికి వీల్లేనంతగా తయారవుతున్నది
ఇప్పుడు వివేచన లేని కాలంలో బతుకుతున్న మనం ప్రాణాల్ని మూక మనస్తత్వపు త్రాసులో వేసి చావుకోసం ఎదురుచూడాల్సిన లోకం మనకి ప్రాప్తిఞ్చచింది.
మనవి కాని పదాల మధ్య
మనవే కాని వాక్యాల మధ్య మనం కొన్ని జైళ్లని దాటి మెసలని ప్రయాణంలో కాలు కూడదీసుకోవాల్సిన గత్తర వచ్చిపడింది.
ఏవో కొన్ని చిన్న అక్షరాలు మాత్రమే, ఏవో కొన్ని స్వల్ప పదాలు మాత్రమే, ఏవో కొన్ని వాక్యాలు మాత్రమే మన చేతుల్లో నిజాయితీగా ఒదిగి ఉన్నాయి. వాటికి మన ప్రేమని తాపి నిలబెట్టాల్సి వుంది.
నిజానికి మనం మన నుంచి ఎప్పుడో తప్పిపోయామో తెల్సుకోలేనంత అగాధం లోకి కూరుకుపోయాం. హిందూ నాజీలు మనల్ని అజ్ఞానాంధకారరంలో తోసి దారీతెన్నూ లేకుండా చేసి పారేస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాలే మన ప్రాణ రక్షణలు అన్నంతగా మనలో నాగజెమూడు మొక్కలు నాటి ఏళ్ల తరబడి నీళ్లు పోస్తున్నారు.
నిజానికి మనమెవ్వరమూ
మనం వాళ్ళ నాయకత్వం జోలికెళ్ళం.
వాళ్ళ కళలూ, సాహిత్యం జోలికెళ్ళం. వాళ్ళ సాంస్కృతిక ఉన్మాద రథాన్ని మనపై దొర్లించుకుంటో జుగుప్సాకర హాయిని అనుభవిస్తో సచ్చిపోతాం.
నిజానికి ప్రపంచం ఆలోచించే విధానాన్ని మౌలికంగా మార్చిన గ్రంధం ” కుల నిర్మూలన”.
దీన్ని చదవడం ద్వారా ఈ పేరుకుపోయిన నాగరికత లోని మకిలంతా స్కానింగ్ రిపోర్ట్ తీసినట్టు కనిపిస్తుంది.
పుస్తకాల్ని చదువుతాం. ప్రగతిశీల ముసుగుకింద ఎంచక్కా బజ్జుని నిద్రిస్తాం. దాన్ని జీవితంలోకి తొంగి చూడనివ్వం.
మనం నేర్చుకోలేకపోతాం. మన అశక్తత మీద మనమే నిరసన ప్రకటించుకోలేకపోతాం.  పొరలు పొరలుగా సత్యాన్ని దర్శించే సాహసాన్ని ప్రదర్శించలేకపోతాం.
కళలూ, సాహిత్యం చుట్టూ మూగిన కుట్రని బద్దలు కొట్టలేకపోతాం.
చివరికి మన చేతుల్లోనే ఉన్న సామాజిక మాధ్యమం ను బాధ్యతగా స్వీకరించలేకపోతాం.
మనల్ని నత్తగుల్లతో ఐనా పోల్చుకోడానికి సిద్ధంగా ఉండం. ఊరు జైలు కావడాన్ని చూసినోళ్లం,
నగరం జైలు కావడాన్ని చూస్తునోళ్లం,
దేశమే జైలు కావడమ్ కోసం ఎదురుచూస్తుంటాం.
కుంచించుకుపోయే స్వతంత్రం మన ముఖాల్ని వెక్కిరిస్తుంటుంది. ఒక సామూహిక జైలు నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా పని చేసే మౌనం ఒకటి మన నిర్వ్యాపక బతుకులోకి కొండచిలువలా పాకడాన్ని చూస్తుంటాం.
జీవితంలోకి పాకిన
కొండచిలువ గర్భకుహరంలో
ఎవ్వరి శోకమూ వినబడలేనంతగా
మన చెవులు
ఎప్పుడు దిబ్బల్లడిపోతాయి.
మనం ఎవరిమో కూడా తెల్సుకోలేం.
మన తెల్సుకునేలోగా
ఎవడో మన కళ్ళే కాదు,
పెదాల్ని కూడా పెకలించుకుపోతారు వాళ్ళు.
చివరికి మనకో దేహం ఉందనే మినిమం సత్యాన్ని కూడా గుర్తించలేని ఉన్మాదం కింద పడి మనలో మనిషి కోసం చెయ్యి సాచడం కూడా మర్చిపోతాం.
భద్రమని నిర్మించుకున్న బోర్లించిన బొరియలో తలదాచుకోవడం ఒకటి ప్రాక్టీస్ చేస్తో నిద్రిస్తాం. ఏ సందడీ మనల్ని పలకరించదు. ఏ పచ్చని మొక్కలూ మన కేసి చూడవు.
మరణం కోసం ఎదురుచూడ్డం అనే క్రియ కోసం కాళ్ళు చెప్పుకుని ఎదురుచూస్తుంటాం.
నిజానికి
దేశం డెబ్భై ఏళ్ల స్వతంత్రంలో స్మశానాల కోసం దేబిరించేవాళ్ళు నెత్తుటి కన్నీళ్ల తో దిశమొలతో మనముందు నిలబడి ఉంటారు. వాళ్ళకీ మనకీ మధ్య గీతలు గీసిన
‘ రామరాజ్యం’ ఒకటి సరసరా తెల్ల తాసు పామై వెళ్తో మన కళ్ళల్లోకి చూస్తూ బుసకొడుతుంటుంది.
ప్రతీ ప్రసార మాధ్యమం
ధర్మ పన్నాలు వల్లె వేస్తో రక్త పింజారుల కలల్ని పండించే ఎరువులై తమ కళ్ళు తామే పొడుచుకుని దొర్లాడుతుంటాయి.
మేలుకొలిపే ప్రశ్నలన్నీ సామూహిక ఆత్మహత్య కోసం బలిపీఠం మీద నిలబడి జాలిగా చూస్తుంటాయి.
శాపాలు పెట్టే సాములుకి
పాపాలు చేసే ప్రభుత్వాలు తాము అండంటే తాము అండ అని పోటీలు పెట్టుకుంటుంటాయి. జుట్లు ముడేసేవాళ్ళు
జడ్జీలవుతూ కప్పస్తంభం కు కట్టేసుకుని ఎవరైనా తమల్ని విముక్తి చేస్తారేమోనని అరవలేక ” దాశరధీ… కరుణా పయోనిధీ” అంటా ముక్కుతుంటారు.
రాముడిప్పుడు సుగ్రీవులూ, విభీషణుల కోసం వెతుకుతుంటాడు. లక్షలాది మంది  వాలులు, రావణుళ్ళు మళ్లీ మళ్ళి చావడానికి ఉత్సాహం ప్రదర్శిస్తుంటారు.
ఎవ్వరికీ ఏ నమ్మకాలూ వుండవు.
మనుషులుగా నిలబడాలన్న తపన ఏదీ కనిపించదు.
సుదీర్ఘ పోరాటాలు చేసిన కమ్యూనిస్టులు ‘జనసేన’తోకగా ఐనా బతికేద్దామని జపం చేసే విషణ్ణకాలం దాపురించింది.
ప్రతి ఇంట్లో, ప్రతి గల్లీల్లో,
 కాళ్ళయినా లేని కట్టప్పలు తమ అస్తిత్వం కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తుంటారు. బానిసత్వం పల్లెల చుట్టూ ఇనపబూట్ల చప్పుడై స్వతంత్రాన్ని వెక్కిరిస్తుంటుంది.
నిజానికి రోహిత్ కు ఉరేసిందేవరో అందరికీ తెల్సు. అతని కులమేదో తెలుసుకోడానికి, అతనికి పేనిన ఉరిలో తమ చేతుల ఉనికి గ్రహించినోళ్లంతా అతని
కుల ధ్రువీకరణపత్రం కోసం గాలించి చతికిల పడతారు.
ఉద్యమాలు, ఆత్మార్పణలతో సిద్దించిన రాష్ట్రాల నేతలు ‘చండీయాగం’ ముందు తలొంచుతారు.’ ముక్కుపుడక’ పండగల్లో దళితుల వెలి కోసం నాలుకలు చాస్తారు.
పరమ డగుల్బాజీ చరిత్ర పరమానందంగా నడిచే కాలం.
నడక తెలీదు. నడత తెలీదు.
బుర్రల్లో కుదురుగ్గా బజ్జున్న
కట్టప్ప జట్లుగా మనుషులంతా
విడిపోయి ఎవరెంత రక్తం హాంతకుడికి తాకట్టు పెట్టాలనే యోచనలో తలమునకలై ఉంటారు.
ప్రశ్నలిప్పుడు
పూతనలూ.. తాటాకీలూ ఐపోతాయి. వాటిని
చంపడం న్యాయంగా,చావడం ధర్మంగా నానుడి ఏర్పడింది.
ఒకప్పుడు
 హెచ్ సి యూ మాత్రమే వెలివాడ. ఈ వెలివాడల పోటీలో నిలబడి హైదరాబాద్ ఊరేగుతుంటుంది.
నిజానికి ఎప్పుడూ ఊరేనా వేలేసేది?
నగరం కూడా జంధ్యం సవరించుకోవాలని ఉవ్విల్లూరుతుంటుంది. తెగిపడ్డ బొటనేళ్లు నగరం మధ్య. వధించబడ్డ సత్యాలు నగరం మధ్య.
న్యాయమూర్తులుంగారు అట్లా పదవిలోకి కాలు పెట్టారో లేదో కప్పస్తంభం పిలవడంతోనే జెట్ విమానం లో పరుగులు తీస్తారు.
అవునూ..ఏ న్యాయానికైనా బొడిగుండు చేసిన
రక్షక భట వర్గం
న్యాయస్థానం పై అజమాయిషీ చేస్తుండడం పరిపాటే కదా.
ఇప్పుడిది ఖర్మభూమి.
ఆర్య కంకళాలు చట్ట సభల్లో
సురాపానాంతరమ్
నగ్న జాతర చేసే సమయం.
మట్టి మనుషుల అస్తిత్వం అపహాస్యం అయ్యే నేల.
మనువిప్పుడు
యోగనిద్రలో గునుస్తూ  పాలిస్తున్న వేదభూమి యిది.
కరాళ దంష్ట్రలతో
హాస్యం వోలకబోస్తున్న స్వచ్ఛభూమి యిదిప్పుడు.
తొలగండి తొలగండి
స్వాములవారు వేంచేస్తున్నారు.
కూల్చండి కూల్చండి
గుడిశల్ని కూల్చండి.
స్వచ్ఛ భారతం కోసం, శ్రేష్ఠ భారతం కోసం పేదల శవాల ఇటుకలు పేర్చండి.

రవికుమార్ డాక్టర్ నూకతోటి

రవికుమార్ నూకతోటి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తయారు చేసిన విద్యార్థి యోధులలో ఒకరు. ఉద్యమాలు వట్టి గొప్పలు చెప్పుకోడం కాకుండా అంబేద్కర్ దారిలో అన్ని విధాలుగా దాడులకు గురవుతున్న  దలితుల కోపు  నిలబడాలని మొహమాటం లేకుండా మాట్లాడుతున్న నిత్య జీవన యోధుడు. తన చుట్టు పక్కల జీవితంలో జన సమస్యలలో పేదల పక్షాన కలుగ జేసుకుంటూ క్రియాశీలిగా రచయితగా కష్జజీవుల కోసం పని చేస్తుంటారు, రాస్త్రుంటారు.

4 comments

  • ‘మనవి కాని పదాల మధ్య
    మనవే కాని వాక్యాల మధ్య మనం కొన్ని జైళ్లని దాటి మెసలని ప్రయాణంలో కాలు కూడదీసుకోవాల్సిన గత్తర వచ్చిపడింది’
    కాలాన్ని సరిగ్గా నిర్వచించడం
    అభినందనలు రవీ!

  • గొప్ప వ్యంగ్య వాస్తవిక రచన. మేధాల్లోకి గుచ్చుకుంటుంది. ప్రభావితం చేస్తుంది ఇంకా ఇలాంటి రచనలెన్నో మీ కలం నుండి జాలువారాలని ఆకాంక్షిస్తూ ..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.