సాందినీస్తా భూమి, కవుల నేల- నికారాగువా!!

1920ల్లో ఒక పాట గని కార్మికుల ఆకలినీ, భూమికోసం రైతుకూలీల ఆర్తినీ నికరాగువా అడవుల్లో ప్రతిధ్వనించింది:

ఓహోయ్ పెద్దమనుషులూ, ఇది నికరాగువా!

ఇక్కడ, ఎలుక పిల్లిని చంపుతుంది.

శత్రువునుంచి ఎత్తుకొచ్చిన కొన్ని తుపాకులూ, కత్తులూ, రాళ్లతో నింపిన టిన్నులే ఆయుధాలుగా ఒక చిన్న గెరిల్లా దళం, 12,000 మంది యు.ఎస్.ఏ సైనికులనూ నికరాగువా నేషనల్ గార్డునూ ఎదుర్కొంది.

ఆ దళానికి నాయకుడు ఎవరంటే, ఇదిగో, ఎడువార్డో గలియానో (Eduardo Galeano) మాటల్లో …:

“అతను పొట్టివాడు, కడ్డీ అంత సన్నటివాడు. నికరాగువా మట్టిలో అతని అణువణువూ అంతలా పాతుకుని ఉండకపోయి ఉంటే, చెదురు గాలి కూడా అతన్ని ఎగరేసుకు వెళ్లిపోయేది.

ఈ మట్టిలో, తన సర్వస్వమూ అయిన ఈ మట్టిలో, నిటారుగా నిలబడి మట్టి తనతో ఏం మాట్లాడిందో చెప్పాడు. ఎందుకంటే అతను రాత్రిపూట ఈ మట్టిలో పడుకున్నప్పుడు మట్టి తన ఆనందాన్నీ, తన దుఃఖాన్నీ అతనితో పంచుకునేది. ముట్టడించబడీ, అవమానాలకు గురైన ఈ నేల రహస్యాలను విప్పి చెప్పి, తను ప్రేమించినంతగా ఈ నేలను ఎవరు ప్రేమిస్తారో ముందుకు రండి అని ఎలుగెత్తి పిలిచాడు!”

లియోన్ నగర సమీపంలో బంగారు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకోసం ఆ వీరుడు రాసిన ఒకే ఒక కవిత:

 

అగస్టో శాందీనో

మరణమే మేలు

 

లియోన్ ప్రజలారా, మీ ఛాతీ

అగ్ని నుండి ఎర్రబడినదై ఉండాలి.

పైన అడవులతో సారవంతమైన ఈ భూమిలో

పుట్టిన నాయకులను మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి

 

సాకాసా, అర్జెలూయో మరియు పరాజోన్ వంటి వీరుల

పేర్లు మరిచిపోకండి;

వాళ్లను ఎప్పుడైనా ప్రేమించి ఉంటే

మీ ఆలోచనల్లోనూ, హృదయంతోనూ వాళ్లను అనుసరించండి.

 

మాతృభూమి స్వేచ్ఛనూ, గౌరవాన్నీ

కోరుకుంటుంది కానీ

అనాధ శోకాన్ని కాదని

ధైర్యంతో ముందడుగు వెయ్యండి.

 

ఓ లియోన్ ప్రజలారా! పోగొట్టుకున్న గౌరవాన్నీ, అభిమానాన్నీ

భయంకరమైన పోరాటంతో సాధించాల్సిందే.

మాతృభూమిని ప్రేమించలేని బానిసత్వం కన్నా

మరణించడం మంచిది.”

 

అతనే, తన పదిహేడేళ్ల పసిప్రాయంలో జరిగిన ‘సెలదోన్’ తిరుగుబాటునూ, దాని అణిచివేత గ్నాపకాన్నీ అగ్నిలా గుండెల్లో దాచుకున్న, అగస్టో సందీనో!

ఉత్తర అమెరికాలోని ఒక కంపెనీ కోసం బంగారాన్ని వెలికి తీస్తూ, ఆ ఖాళీల్లో తమ జాతినీ, తమనూ పూడ్చిపెట్టేసుకుంటున్నామని తెలుసుకున్నారు గని కార్మికులు. తాము పనిచేస్తున్న గనిని డైనమైట్లతో పేల్చివేసి సందీనోతో కలిసి కొండల్లోకి వెళ్లిపోయారు. త్వరలోనే మరి కొందరు కార్మికులూ, రైతు కూలీలూ వాళ్లను కలిశారు.

12,000 మంది సైన్యమూ, పోరాటానికి ప్రతికూలంగా ప్రపంచానికి వార్తలందించిన అమెరికా పత్రికలూ ఆ చిన్న గెరిళ్లా దళాన్ని మట్టు బెట్టలేకపోయాయి. మొదట, ‘బందిపోటు’ అని ముద్రవేసి, తరువాత అగస్టో సందీనో మార్క్సిస్టు అనీ, కమ్యూనిస్టు అనీ ప్రజలను భయపెట్టాలని చూశారు కానీ, సందినో జాతీయవాది మాత్రమే. తన దేశమైన నికరాగువాకు సంబందించిన ప్రతివిషయంలో యు.ఎస్.ఏ కలగజేసుకోవడం సహించలేకపోయాడు.

1927లో మొదలైన సందీనో ఉద్యమం, చెదురుమదురు దాడులతో యు.ఎస్.ఏ సైన్యాన్నీ, నికరాగువా ప్రభుత్వ ‘నేషనల్ గార్డు’ దళాలను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రతిఘటనకు అసలు రూపంగా, ఇతర లాటిన్ అమెరికన్ దేశాలకు మార్గదర్శకమయ్యాడు సందీనో. 1933లో యు.ఎస్.ఏ ను కలవరపరచిన ‘మహా మాంద్యం’ ‘గ్రేట్ డిప్రెషన్’ కాలంలో, నికరాగువాలో ఎన్నికలను నిర్వహించి, ‘ఉవాన్ బటిస్టా సకాస’ (Juan Batista Sacasa) ను ప్రెసిడెంటుగా నిలబెట్టింది. యు.ఎస్.ఏ రాయబారి పట్టుదల మీద ‘నేషనల్ గార్డ్’ సైన్యానికి డైరక్టరుగా ‘అనస్తాసియో సొమొసా గార్సియా’ (Anastasio Somoza Garcia) నియమితుడయ్యాడు.

గెరిల్లాలుగా సైన్యాన్ని ఎదుర్కున్న తన అనుచరలపై కేసులను మాఫీ చేసి, వారికి భూమిని కేటాయించే ఒప్పందం మీద, ‘సకాస’ ప్రభుత్వానికి తన పూర్తి మద్దతును ప్రకటించాడు సందీనో. యు.ఎస్.ఏ ప్రభుత్వానికి తొత్తులా పనిచేస్తున్న ‘నేషనల్ గార్డు’ ను ఎత్తివేస్తే తప్ప నికరాగువా పూర్తి స్వతంత్ర దేశం అవదని ‘సకాస’ కు చెప్పాడు సందీనో. ఎన్నికలు జరిగిన సంవత్సరం తిరగకుండానే, అధ్యక్షుడితో సంప్రదింపుల కోసం సందినోను పిలిపించి, దారి కాచి అతనని చంపివేశారు ‘నేషనల్ గార్డ్’ మనుషులు.

సందీనో హత్య తరువాత ‘సకాస’ ప్రభుత్వాన్ని పడగొట్టి, యు.ఎస్.ఏ మద్దతుతో ‘సొమోసా’ తనను తాను అధ్యక్షుడిగా నియమించుకున్నాడు. వందల సంవత్సరాల హింసాత్మక మార్పుల తరువాత, నియంతగానైతేనేమి, దేశంలో శాంతి నెలకొంటుందని భావించారు కొంతమంది కళాకరులూ, మేధావులూ. వాళ్ల ఆశల్ని వమ్ము చేస్తూ, యు.ఎస్.ఏ ఆధ్వర్యంలో, దేశాన్ని ఉక్కు పాదం కింద వుంచి పాలించాడు ‘సొమోసా’. అయినా సందినో గ్నాపకం నివురుగప్పిన నిప్పులా దేశంలో రగులుతూనే ఉంది. ‘రిగోబెర్తో లోపెస్ పెరెస్’ అనే యువకవి పదిహేడేళ్ల ప్రాయంలోనే, నికరాగువా కోసం తను చెయ్యబోయే నేరాంగీకారాన్ని ఇలా ప్రకటించాడు:

 

రిగోబెర్తో లోపెస్ పెరెస్

సైనికుడి నేరాంగీకారం

 

బుల్లెట్ గాయాలతో

నేలకొరిగి ఇలా ప్రార్థన చేస్తున్నాను,

నేను ఒంటరిగా ఉన్నాను

నా నేలపైనుంచి నేరాంగీకారం చేస్తున్నాను.

 

ఇది నికరాగువా! నా ప్రియమైన మాతృభూమి

నికరాగువా నా గొప్ప దేశం

నా దేశం కోసమే నా గుండె గాయమై రక్తం ఓడుతోంది.

 

స్వేచ్ఛా సూరీడు ఉజ్వలంగా ప్రకాశిస్తూ

నీ ఆకాశంలో మెరిసేట్టు

ఈ నగరం నుండి ఆ నగరం దాకా రక్షిస్తూ

నీ కోసం నేను పోరాటం కొనసాగిస్తాను

 

ఇక సెలవు, ఓ నా దేశమా!

నీ ఎదపై సేద తీరబోయే నా చల్లని సమాధిని

నీ సూర్యుడు వెచ్చబరుస్తాడనే అనుకుంటాను.

 

ఇప్పటి వరకు ఎవరో ఒకరు

నీకు అండగా ఉండేట్టు చూశాడు దేవుడు.

నేను వెళ్లిపోయాక, ప్రత్యర్థిని ఓడించే వరకు

మరొక వ్యక్తి నా స్థలంలో నీకోసం నిలబడతాడు.

 

ఈ నేరాంగీకార ప్రకటన చేసిన పదేళ్లకు, ఒక పార్టీలో పాల్గొంటున్న ‘సొమోసా’ ను తుపాకీతో కాల్చి చంపేశాడు. ‘రిగొబెర్తో’ ఎదురుకాల్పుల బుల్లెట్ల వర్షంలో ప్రాణాలు వదిలాడు.

 

 

కొడిదెల మమత

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.