శ్రుతి మించిన మెలో డ్రామా

ల్లీశ్వరి రచించిన నీల నవల, చిననవీరభద్రుడు  గారు ముందు మాటలో చెప్పినట్టు “ సిద్ధాంతాల ప్రాతిపదిక మీద కాకుండా, అనుభవాల ప్రాతిపదిక మీద నిర్మించిన ఒక ప్రతిపాదన”.

ఈ నవల చదవడం మొదలుపెట్టి కొన్నిపేజీలు గడిచాక, మల్లీశ్వరి గారు 2015 లో  రాసిన “శతపత్ర సుందరి కధ “ గుర్తుకొచ్చింది. ఆ కధలో కూడా ఆవిడ స్త్రీ స్వేచ్చ గురించి, ముఖ్యంగా స్త్రీ-పురుష సంబంధాలలో , స్త్రీ కి కావలసిన స్పేస్ గురించి మాట్లాడారు. ఈ కధ మీద ఫేస్బుక్ లో పెద్ద చర్చ జరిగింది, ముఖ్యంగా ఆడా-మగా సంబంధాలలో కావలసిన నైతికత గురించి.

మళ్ళీ ఇన్నాళ్టికి ఈ నవల, ఇంచుమించు అదే ఆలోచనతో, అదే భావన తో వచ్చింది.  నీల నవల మీద చాలామంది, పాఠకులు+సాహిత్యకారులూ, ఫేస్బుక్ లో విపరితమయిన ప్రశంసలు చేశారు. విమర్శాత్మక విశ్లేషణలు తక్కువే వొచ్చాయి .

ఈ నవల చదవడం  పూర్తి చేయగానే నాకు   తెలుగు నాటకంలో తరచూ చూసే మెలోడ్రామా గుర్తుకొచ్చింది సాధారణంగా ఒక నవల/కధ/కవిత చదువుతున్నప్పుడు గాని ఒక నాటక ప్రదర్శన చూసినప్పుడు గాని… వాటిని నడిపించిన శైలి, కధనం కోసం ఎన్నుకున్న సన్నివేశాలు, పాత్రలూ , వాటి సంఘర్షణలూ, ఆలోచనలూ, సృష్టించిన పద్ధతి, ఒక పాఠకుడిని, ప్రేక్షకుడిని సులభంగా తమతో తీసుకువెళ్లాలి, అలా తీసుకెడుతూ ఆలోచింపచేయ గలగాలి.  నాకెందుకో నీల నవలలో ఆ భావన కలగలేదు.

సాధరణంగా విశ్లేషణలు, విమర్శలు నవల గురించే ఉంటాయి. దానికి భిన్నంగా , నేను “నీల” నవల విశ్లేషణను నవల ముందుమాటల తో మొదలు పెడుతున్నాను. ఈ నవలకు ఇద్దరు…వాడ్రేవు చినవీరభద్రుడు , ఏ.కె.ప్రభాకర్ ముందు మాటలు రాశారు .

సాహిత్యం లో నవల ప్రక్రియ గురించి వివరంగా యూరోప్ తదితర  దేశాల సాహిత్యల్లో నవల పరిణామం సూక్ష్మంగా తెలుపుతూ, తెలుగులో కూడా దాదాపు బెంగాలీకి సమకాలంగా తెలుగులో నవల పుట్టిందని చిన వీరభద్రుడు రాశారు. ఆయన అంచనా ప్రకారం 1872 నుంచి 2017 దాకా సుమారు  40000 తెలుగు నవలలు వచ్చాయట. కానీ “గత నూటయాభై ఏళ్ళ తెలుగు నవలా వికాసాన్ని పరిశీలించినట్లయితే తెలుగు నవల ఒక ప్రక్రియగా పొందవలసిన వికాసాన్ని పొందలేదనే అనిపిస్తుంది” అంటారు .

“ప్రధాన స్రవంతి దృక్కోణం కన్న భిన్నమయిన దృక్కోణాన్ని ప్రతిబింబించి నవలలు రాసిన రచయితలు, చలంలాంటి వాళ్ళు కూడా, ఆఖ్యాయిక పద్ధతిలోనే అంటే ఒకే దృక్పధాన్ని వివరించే పాత్రలతో నవలలు రాసేరు తప్ప, అందులో బహుళ దృక్పధాలను వివరించే పాత్రలు కనబడవు. అంటే అవన్నీ దాదాపుగా ఏదో ఒక పాత్ర చెప్పుకుంటూ పోయే ఆత్మకధల్లాంటి రచనేలే తప్ప, నవలలు కావన్నమాట” అన్నారాయన.

అంటే నీల(వేణి) తన కధగా చెప్పుకుంటూ పోయిన “నీల” నవల కూడా చినవీరభద్రుడి లెక్ఖ ప్రకారం ఒక నవల కాకూడదు కదా!?.

“అటువంటి నవలల గురించి  ఎదురు చూస్తున్న నాకు ఈ “నీల” రచన విలువయిన రచన అనిపించింది” అని అంటారు.

ఆ వెంటనే “ఎటువంటి నవలలు తెలుగు సాహిత్యంలో రావాలని నేను కోరుకుంటున్నానో, ఆ ఆకాంక్షల్ని ఈ రచన నెరవేరుస్తున్నదని చెప్పలేను” అని వారనడం చాలా ఆశ్చర్యం కలిగించింది. బహుశా నాలాంటి ఆశ్చర్యపోతులుంటారనే అనుమానం కలిగే, వారు వెనువెంటనే “గాని తెలుగు నవలా  వికాసంలో ఒక aesthetic turn సంభవించగలదనే ఆశ కలిగిస్తున్న రచన ఇది “ అని కూడా అంటారు.

ఒకే పేరాలో ఇన్ని విభిన్న/విరుద్ధమైన  మాటలా?!.

చినవీరభద్రుడు గారంటారు “ నీల అనే ఒక స్త్రీ కధ చెప్పడం ద్వారా , 1986 నుంచి 2011 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన సాంఘిక-ఆర్ధిక-రాజకీయ పరిణామాల్ని ఈ నవల చిత్రిస్తున్నది. అంటే , ఒక చరిత్ర లాగా కేవలం  ఆ పరిణామాల్ని ఏకరువు పెట్టుకుంటూ పోవడం కాదు, ఆ పరిణామాల్లో, ఒక వ్యక్తి, అందునా ఒక స్త్రీ తనను తాను కనుగొన్న వైనం, ఈ కధకి ప్రధాన ఇతివృత్తం”.

కానీ నాకు ఆ సన్నివేశాలు, చాలావరకు అవసరానుకూలంగా, తెచ్చిపెట్టుకున్నవి గా, ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే contrived అంటే obviously planned, artificial, or lacking in spontaneity  గా కనిపించాయేగానీ నీల నవల కధనం లో కానీ ఆమె వ్యక్తిత్వ ఎదుగుదలలో కానీ సహజ పరిణామం గా కనపడలేదు.

చినవీరభద్రుడు చెప్పినట్టు ”వర్ణనలు, పోలికలు, కవులకు మాత్రమే కాగలవనుకున్నవి ఈమె రచనలలో కూడా తక్కువేమీ కాదు”.  

నిజమే, ముఖ్యంగా మెలోడ్రామాలో ఈ వర్ణనలు, పోలికలూ చాలా అవసరమవుతాయి. ఎక్కువయిన ఈ వర్ణనల  వల్ల నవల నడకలో సహజత్వం తగ్గుతుంది.

ఇక, ఎ. కె. ప్రభాకర్ దృష్టిలో “ బలీయమయిన స్వేచ్చకి సంకెలగా పరిణమించిన సంఘర్షణాత్మక సందర్భాలలో క్లేశాన్ని అధిగమిస్తూ చిక్కుముడులు విప్పుకుంటూ ఆ రెండిటి మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నించిన జీవిత శకలం “నీల” నవల”.  ప్రభాకర్ గారికి “ పగలూ రాత్రి- రోజులు కాదు వారాలు కాదు నెలలతరబడి నీల ఆలోచనలు స్వేచ్చతో నిండిన సహజమయిన ప్రేమకోసం నీల చేసిన అన్వేషణ నన్ను వదల్లేదు. నీలని పాతికేళ్లపాటు జీవితంలో ఆమె చేసిన సాహస ప్రయాణాన్ని నిండుగా అర్ధం చేసుకోవాలంటే నీలలోకి పరకాయ ప్రవేశం చేయాల్సిందే కానీ ఆ విద్యా నాకు అబ్బలేదు” అంటారు ఎకె ప్రభాకర్. అంటే ఒక మామూలు పాఠకుడు ఈ నవల అర్ధం చేసుకుందుకు చాలా కష్టపడాల్సిందే కదా!.

“వాక్యాన్ని రసాత్మకంగా చేసే కళని మల్లీశ్వరి అలవోకగా సాధించింది అనడానికి నవల నిండా ఎన్నో ఉదాహరణలు. కేవలం వచనంగా ఆమె ఎక్కడా జారిపోలేదు. అవసరానుగుణంగా వాక్యానికి కవిత్వ పరిణామాలు అద్దింది. సంతోషం దుఃఖం  కరుణ ప్రతి ఉద్వేగ సందర్భాన్ని అందమయిన ఆలాంకారిక వచనంగా మలిచింది” అంటారాయన్. ఇవి నవలలోని రాజమండ్రి భాగం లో సరళ, ప్రసాద్ , నీల మధ్య జరిగే సన్నివేశాల్లో, సంభాషణాల్లో , పరదేశి తో ఉన్న సన్నివేశాల్లోనూ ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడే మల్లీశ్వరి ఎక్కువ మెలోడ్రామా ను కూడా వాడేరు. (melodrama is a dramatic work in which the plot, which is typically sensational and designed to appeal strongly to the emotions, takes precedence over detailed characterization.). నిజానికి ఈ వాక్య రసాత్మకం మల్లీశ్వరి గారి ప్రత్యేకత. వారి రచనలలో, ఈ ప్రత్యేకత తోనే చెప్పే సన్నివేశాన్ని కానీ జరిగే సంభాషణ కానీ పాఠకుడికి అర్ధం కాదేమోనని ఒకటికి రెండు సార్లు చెపుతూ  ఉంటారు.

మల్లీశ్వరి స్త్రీ స్వేచ్ఛ ను దృష్టిలో పెట్టుకొని నీల చిన్నపటినుంచి పెరిగిన వాతావరణాన్ని, పెరిగిన పద్ధతి, ఈ నవల లో రాశారు.  స్త్రీ స్వేచ్చ తో పాటు తనకు తెలిసిన 25 సంవత్సరాలలో, 1986-2011, అప్పటి ఉమ్మడి రాష్ట్రం లో జరిగిన సామాజిక-ఆర్ధిక-రాజకీయ పోరాటాలు గురించి చాలా  విషయాలు పాఠకులకు తెలియచేయాలన్న అత్యాశతో రాసిన ఈ నవల నడకలో ఎన్నో అనవసరమైనవ, అవసరం లేని విషయాలు, అసందర్భ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. చాలా చోట్ల నీల ప్రవర్తన లో విరుద్ధ ధోరణలు కూడా కనిపిస్తాయి.అంతే కాక, ఈ నవలలో సరయిన  అవగాహన లేకుండా స్వేఛ్ఛ గురించి రాయటం జరిగిందని కూడా  నాకనిపించింది.

నీల  పెరుగుదల, తన చిన్నతనం జరిగిన చోళదిబ్బ లో  1986 లో మొదలవుతుంది. తల్లి చంద్రకళ, ఆరంజ్యోతి , స్టాలిన్ సూర్యం , ఆటో రాజు తదితరులు నీల చిన్నతనం లో ముఖ్య పాత్రలు. తాగుబోతు తండ్రి,  ఒక తమ్ముడు , తల్లి చంపబడ్డాకా సహకరించిన పాస్టరమ్మ, పాస్టర్ లు కూడా ఆ పరిణామంలో ముఖ్యులే. అప్పుడే , ఆరంజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం, జ్యూట్ మిల్ లాకౌట్ కి వ్యతిరేకంగా జరిగిన సామూహిక పోరాటం, వాటిలో సూర్యం, స్టాలిన్, ఆటోరాజులు నిర్వహించిన పాత్ర..   

తాగుబోతు భర్త పెట్టే దౌర్జన్యలను తట్టుకుంటూ, కుట్టు పని ద్వారా సంసారాన్ని నడుపుతూ, కూతురు నీల(వేణి) కి ఇంచుమించు మార్గదర్శి గా చంద్రకళ పాత్రను బాగా చూపించారు రచయిత్రి. ఆరంజ్యోతి తో కలిసి చంద్రకళ, సారా వ్యతిరేక పోరాటంలోనూ , జ్యూట్ మిల్లు లాకౌట్ పోరాటంలోనూ చురుగ్గా పాల్గొంటుంది. చంద్రకళ లో ఇంకో మంచి విషయం పిల్లలను, ఆప్యాయంగా, స్నేహంగా పెంచడం .

అప్పుడు జరిగిన రెండు సంఘటనలూ అందులో ఆరంజ్యోతి తమ్ముడు స్టాలిన్ సూర్యం పనిచేసే తీరు చూసి అతనంటే చాలా ఇష్ట పడుతుంది నీల. ఆందోళన జరుగుతున్న సమయంలో అనుకోకుండా సూర్యం మాయమౌతాడు. అతను ఎంఎల్ కార్యకర్తేమోనన్న మాట తరవాత పోలీసు మాటల్లో తెలుస్తుంది.  అతను కనపడకపోవడం బాధ పెట్టినా ఏమి చేయలేని నిస్సహాయత. సూర్యం ను నీల మరిచిపోలేదని చాలా ఏళ్ల తర్వాత తాను సదాశివ తో సూర్యం గురించి  మాట్లాడడం ద్వారానూ అప్పుడప్పుడు తలచుకోడం వల్లా తెలుస్తుంది. అందుకే , నీల జీవితంలో, ప్రభాకర్ తన ముందు మాటలో చెప్పినట్టు ముగ్గురు… ప్రసాద్, పరదేశి, సదాశివ.. కాకుండా సూర్యంను కూడా కలపాలని నేననుకుంటాను.

ఇవన్నీ ఒక ఎత్తయితే, నవలలో కీలక మలుపుకోసం, రచయిత్రి,  ఆటోరాజు – చంద్రకళ మధ్య చూపిన లైంగిక సంబంధం ఇంకో ఎత్తు. ఆటోరాజు, చంద్రకళల సంబంధం గురించి చాలా లీలగా 20 పేజీలో ఒకసారి , 50 వ పేజీలో ఒకసారి కనిపిస్తుంది కానీ , వారికి లైంగిక సంబంధం ఉందేమో ఉన్న ఆలోచన కలిగించదు. కేవలం నీలను పాస్టరమ్మ దగ్గరకు పంపడానికే, వారిద్దరిని లైంగిక కలయికలో చూపడం, అందువల్ల వాళ్ళిద్దరూ హత్య చేయపడడం జరిగిందేమోనని నా చిన్న బుర్రకు అనిపించింది. ఇదే నేను మొదట్లో చెప్పిన   Contrived   సన్నివేశాలలో ఒకటి.  తెలుగు నాటకాలలో చాలాసార్లు ఇలాంటివి జరుగుతాయి.  

ఇక్కడ ఇంకో సంగతి కూడా చెప్పాలి, సూర్యం అనుకోకుండా అదృశ్యమవ్వడం గురించి.  ఆ సమయంలో జరిగిన ఆందోళనల గురించి రాసిన రచయిత్రి, అప్పటి కాలం లో,  ఇలాంటి విషయాలలో ఉదృతంగా పని చేసిన పౌరహక్కుల జోక్యం చూపించక పోవడం ఆశ్చర్యమనిపించింది.

ఇక చర్చ్ లో నీల పరిచయం ప్రసాద్ తో అవ్వడం, అతను ఆమెను ఇష్టపడటమూ, 17 సంవత్సరాల నీల వివాహం తనకన్నా 12 సంవత్సరాలు పెద్దవాడయిన ప్రసాద్ తో జరగడమూ ఈ నవలలో ఇంకో మలుపు.

ఈ చాప్టర్  కొత్తగా పెళ్ళయిన ప్రసాద్, నీల రాజమండ్రి కి వచ్చి కాపరం పెట్టడం, అంతకు ముందే ప్రసాద్ కు తెలిసిన సరళ సంసారం తో నీల పరిచయం కావడంతో మొదలవుతుంది. సరళ కూ ప్రసాద్ కు లైంగిక సంబందం ఉందన్న ఆలోచన మనకు 98 – 99 వ పేజీలలో సరళను రచయిత్రి చేసిన అసభ్య వర్ణన తో  ఇంచుమించు అర్ధం అవుతుంది. ఎందుకో, ఆ వర్ణన  ఒక స్త్రీవాద రచయిత్రి దగ్గరనుంచి రావడం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.

ఆ ముగ్గురి జీవితాన్ని అందులో ఉన్న సంఘర్షణలనూ చెప్పడానికి అన్ని  పేజీలూ, అంత గందరగోళమూ అవసరమా అని నాకనిపించింది. ఇన్ని పేజీలలోనూ, ముందు మాటల్లో చిన వీరభద్రుడు గారు చెప్పిన “వాక్యాన్ని రసాత్మకంగా చేసే కళని మల్లీశ్వరి అలవోకగా సాధించింది” . ఇక్కడే చెప్పలేనన్ని మెలోడ్రామా మెరుపులు కూడా బాగా కనిపిస్తాయి. ఉదాహరణకు, అనుకోకుండా నీల, సరళా, ప్రసాద్ లు చూసిన తెలుగు పాతివ్రత్య సినిమా, ఆ సినిమాలోని భావనకి  సరళ అవమానపడడమూ, ప్రసాద్ కూడా బాధపడడమూ, మెలోడ్రామా లో తప్ప ఊహించలేని మలుపు.

నీలకు నవనీత వనిత మండలి తెలియడమూ, అక్కడ ఎడ్వొకేట్ వసుంధరతో పరిచయం, సాన్నిహిత్యం పెరగడమూ, ఆవిడ సలహాతో ఆవిడ ఆధ్వర్యంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం లో  పాటలు పాడటమూ, ఆవిడ ప్రోద్భలంతో గ్రాడ్యుయేషన్ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయటం ఒకపక్క ప్రసాద్ తో సంఘర్షణా భరిత జీవితం కొనసాగిస్తూనే జరిగాయి. ఆ ఉద్యమం లో పరిచమయిన రవితో స్నేహాన్ని ప్రసాద్ తప్పు పట్టమే కాక అనుమానించడమూ ఇంకో భాగం. ఈ స్వేచ్చ పోరాటంలో, అర్ధరాత్రి ప్రసాద్ ఇంటికి వచ్చి రవి కోసం ఇల్లంతా వెతకటం ఇంకో మెలోడ్రామా అంశం. వీళ్ళు పాటలు పాడి ఇంటికి వస్తుంటే, హిజ్రాలు దాడిచేయడం చూపించారు . ( ఈ నవలలో అర్ధం కానీ ఎన్నో సంఘటనలలో ఒకటి)

హింస భరించలేక భర్తను వదిలి పెట్టి వచ్చిన నీల, ప్రసాద్ మీద హింస పెట్టినట్టు పోలీసు ఫిర్యాదు చేయకపోవడం నన్ను ఆశ్చర్య చకితుడిని చేసింది. అలాగే, న్యాయవాది అయిన వసుంధర వల్ల కాక, సదాశివ సహాయంతో (బహుశా ఒక పేరున్న న్యాయవాది అవడం వల్లనేమో) విడాకులు రావడం, కూతురు తన దగ్గరకు రావడం ఇంకో మలుపు.  

తిరిగి కూతురుతో చోళదిబ్బ వచ్చి సంపూర్ణ సహకారం తో జీవించడం, డ్వాక్రా సంఘాల అధ్యయనం కోసం వచ్చిన పరదేశి సహకారంతోనూ ఆకర్షణతోనూ  విశాఖ తీరప్రాంత మత్స్యకారుల జీవితాలతో పరిచయం, శ్రీకాకుళ ప్రాంతాల పర్వటన అనంతరం పరదేశి కి ఇంకొక స్త్రీ తో సంబంధం ఉందని తెలిసి అతనితో సంబంధాన్ని కాదనుకోవటం, హైదరబాద్ రావడంతో నవల సగభాగం పూర్తవుతుంది.

అనంతరం అజిత తో కలిసి స్వచ్చంద సంస్థ లో పని చేస్తూ గతం లో వ్యక్తిగత సమస్య పరిష్కారం లో సహాయపడిన సదాశివం పరిచయంతో సదాశివం తల్లి దగ్గర స్వచ్చంద సంస్థలో పనిలో చేరి సదాశివ ఆకర్షణతో అతనికి దగ్గరవుతుంది. సదాశివంకు అనేకమంది స్త్రీలతో సంబంధమున్నదని తెలిసినా అతనికి దగ్గరవుతుంది. అతని ఆకర్షణ నుంచి తప్పించుకోలేక పోవటం సదాశివం తో కలిసి జీవించిడం నీల స్వేచ్చ అన్వేషణలో భాగమే!

నవల కానీ, కధ కానీ నాటకం కానీ రాస్తున్నప్పుడు, రచయిత(త్రి) సాధారణంగా ఒక framework లేదా structure పెట్టుకుంటారు. రచయిత్రి   అనుకొన్న స్త్రీ స్వేచ్చ నే కాకుండా ఉద్యమాల గురించి రాయడం ఆలోచన సరే , కానీ ఆ ఉద్యమాలు ఆమె లో తీసుకొచ్చిన పరిణతి విషయంలో ఏ మాత్రం స్పష్టత  లేకపోవడం ఈ నవల లో చెప్పుకోదగ్గ లోటు. ఇన్ని ఉద్యమాలు, ఆందోళనలో పనిచేసిన నీలను , నవలలో   ఎక్కువబాగం సానుభూతి కోరుకునే స్త్రీగా చిత్రించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?!

నవలకు నీల అని పేరు పెట్టడం వల్ల చర్చ అంతా నీల పాత్ర చుట్టూ తిరుగుతోంది. నీల అనేది నెపం మాత్రమే. పురాణాలు, మహాభారతంలోని ఉపకధల్లాగా ఈ నవలలో డ్వాక్రా, సారా, జూట్ మిల్ కార్మికుల ఉద్యమాలు, ఉత్తరాంధ్రా ఉద్యమాలు, విశాఖ సముద్రం దగ్గర మత్స్యకారుల ఆందోళన వగయిరాలు  నవలలో సగం భాగం కన్నా ఎక్కువ  నడిచాయి . అలాగే సరళా -ప్రసాద్- నీల ఘర్షణల గురించి,   సదాశివ ఫ్యామిలి గురించి కూడా చాలా పేజీలు రాశారు .

ఇక మల్లీశ్వరి గారు తరచూ రాసే స్వేచ్చా, స్పేస్  విషయాల్లోకి వస్తే, అవన్నీ ఈ నవలలో చాలా confused గా కనిపిస్తాయి. సదాశివంకు అనేకమంది స్త్రీలతో సంబంధమున్నదని తెలిసినా అతనికి దగ్గరవుతుంది. అతని ఆకర్షణ నుంచి తప్పించుకోలేక పోవటం, సదాశివం తో కలిసి జీవించాలనుకోవటం నీల బలహీనతను తెలియజేస్తోంది. తన తల్లి బలహీనతను క్షమించని, భర్త ప్రసాదుకు సరళతో ఉన్న సంబంధాన్ని జీర్ణించుకోలేక బయటకు వచ్చిన నీల, పరదేశి కి వేరే సంబంధం ఉన్న కారణం గా బయటకు వచ్చిన నీల, సదాశివంతో  కలిసి జీవించడానికి  తీసుకున్న నిర్ణయం చాలా  వివాదాస్పదంగా ఉంది.  అలాగే పరదేశిని కలవడానికి విశాఖ వెళ్ళిన నీల పరదేశి గురించి ఆలోచిస్తూ, అతనితో ఉండి ప్రజా ఉద్యమాలతో మమేకమైతే బాగుండును  అనే పునరాలోచన ఒక్క క్షణం మెరుపులా మెరిసినా, మళ్ళీ వెనక్కి  తిరిగి రావటం ఆమె లోని అనిశ్చిత స్థితి ని తెలియచేసింది..

ఇంక ఉద్యమాల గురించి చూస్తే, పాఠకులను ప్రజా ఉద్యమాల పట్ల  సానుభూతి కల్గించి ఆ ఉద్యమాల వైపు ఆలోచించేలా చేయగలిగుంటే, ఈ నవల ఇంకొక మలుపు తిరిగి ఉండేది. కానీ అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చిన నీల తన సౌఖ్యం కోసం సదాశివం తో సహజీవనం అనే దానినే రచయిత్రీ ఆదర్శీకరించినట్లు కనబడుతోంది. వ్యక్తులు ఎలాజీవించినా సమూహంకోసం, సంఘంకోసం పనిచేస్తే తప్పకుండా గొప్పవారుగానే ఉంటారు. కానీ నీలను అలా కాకుండా వ్యక్తిగత సౌఖ్యం కోసం చూపడం ఈ నవలలో ముఖ్య లోపం.

దేవరకొండ సుబ్రహ్మణ్యం

దేవరకొండ సుబ్రహ్మణ్యం – విశాఖపట్నం లోని సింధియా కాలని లో పుట్టి పెరిగి, 1960-66 ల మధ్య అక్కడున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం లో చదువుకొని, ఉద్యోగం కోసం 1969 లో ఢిల్లీ వెళ్ళి అక్కడే స్థిరపడిపోయి, ప్రస్తుతం ఢిల్లీకి ఆనుకొని ఉన్న గురుగ్రామ్ లో ఉంటున్నారు. తన మేనమావ ఆకెళ్ళ కృష్ణమూర్తి గారి ద్వారా పరిచయమయి, ఫ్యామిలి మిత్రులయిన రావి శాస్త్రి గారంటే అంతులేని గౌరవం. నాటకం ప్రాణంగా భావించే సుబ్రహ్మణ్యం తెలుగు సాహిత్యమంటే కూడా అంతే ఇష్టం చూపుతారు.

18 comments

 • నేను నవల చదవలేదు. ఇప్పటివరకూ ఆ నవల మీద అన్నీ పొగడ్తలే చదివేను. మొదటిసారిగా ఒక different version చదివేను. ఇక నవల చదవాలి.

  • చదివాకా నా వ్యాఖ్యలకు మీ స్పందన తెలపండి కళ్యానరామరావు గారూ.

 • ఒక నవలని ఎలా చదవాలో, ఏ విధంగా రాయాలో మీ రాత ద్వారా చూపినందుకు మీకు కృతజ్ఞతలు.

 • నవల చదవలేదు. సమీక్షలో నిర్మొహమాటం కనిపించింది. ఏకపక్షంగా సాగే పొగడ్తలకు ఏంటీడోట్ గానే రాసారు కానీ, సమీక్షడికి నవల్లో నచ్చిన అంశాలు ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించారని అనిపిస్తోంది.

  ఇక నీలపాత్ర గురించి చెప్పాల్సి వస్తే, సమాజంలో అనేక మంది వివిధ స్థలకాలాల్లో వివిధరకాలుగా ప్రవర్తించటం అత్యంత సహజం.

  ఇరవయ్యేళ్ళయువకుడికి తండ్రి చేసే అనేక పనులు తెలివితక్కువగా కనపడుతూ, మరోపదేళ్ళు గడిచేకా తాను అవేపనులు చేయాల్సి వచ్చినపుడు, గతంలో తనతండ్రిని తాను తప్పుపట్టిన విషయం మరిచిపోతాడు. గుర్తొచ్చినా ఆపరిస్తితులు వేరు, ఈపరిస్తితులు వేరు అనే పలాయన వాదం ఆశ్రయిస్తాడు.

  నీల ను ఇందుకు అతీతురాలిగా చిత్రిస్తే అది వోల్గా గారి పందాలోనో, రంగనాయకమ్మగారి పంధాలోనో నడవాలి

  • రవికుమార్ గారూ , రచనలో పదస్పూర్తి బావుంటుంది. నేను నా సమీక్షలో రాసినట్టు అవి ఏదయినా భావాన్ని ఒకటికి రెండు సార్లు చెప్పడం కోసం వాడడం వల్ల వాటి లోని కవిత్వ భావనా ఆహ్లాదించడం కష్టమయింది. ఇక నీలపాత్ర గురించి చెప్పాల్సి వస్తే, సమాజంలో అనేక మంది వివిధ స్థలకాలాల్లో వివిధరకాలుగా ప్రవర్తించటం అత్యంత సహజం” అన్నారు నిజమే. అయితే ఉద్యమాల , ఆందోళన నేపధ్యంలో పెరిగిన వ్యక్తి లో అలా ఉండదు. వాళ్ళలో నిస్సహాయత కనపడదు. నిస్సహాయత కనపడితే ఉద్యమాలలోంచి ఏమి నేర్చుకోలేదని నాకు అనిపించింది.

 • తెలుగులో మొహమాటం రివ్యూలే యెక్కువ, అందునా రచయిత పరిచయస్తులైతే రివ్యూలంటే ప్రశంసల జల్లులే! ఒక పాపులర్ రచన పట్ల ఇలా సూటిగా, ధైర్యంగా, నిక్కచ్చిగా మీ అభిప్రాయాల్ని రాయడం అభినందనీయం.

 • “రచయిత్రి చేసిన అసభ్య వర్ణన తో ఇంచుమించు అర్ధం అవుతుంది. ఎందుకో, ఆ వర్ణన ఒక స్త్రీవాద రచయిత్రి దగ్గరనుంచి రావడం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. “…స్ట్రీట్ వాదులు అసభ్య వర్ణ చేయకూడదా? ఇవేం స్టాండర్డ్స్?

  • అయ్యా అనిల్ కుమార్ గారు, స్త్రీ ని వస్తువుగా అవమాన పరుస్తున్నారని బాధపడే స్త్రీ సాహిత్యకారులు, తాము కూడా అలాగే స్త్రీ ని వర్ణించడం ఎందుకో నాకు సారి కాదనిపించింది . అంతే కాక నవల లో సరళ పాత్ర కూడా అల్గే చిత్రించపడిందని నాకనిపించింది.

 • థాంక్స్ టు సుబ్రహ్మణ్యం గారు .. ఒక మంచి విశ్లేషణని చదివించినందుకు .

 • విశ్లేషణ బావుంది..
  మరోకోణంలో మరోసారి చదివే పని కల్గించేరు

 • మంచి విశ్లేషణ
  నవల మరోసారి చదివేటట్టుగా చేసేరు
  మీకు అభినందనలు

 • నీల ఈ విమర్శకుడు అనుకునేలా ప్రవర్తించే ఫ్లాట్ క్యారెక్టర్ కాదు . మానవ సహజమైన లోపాలు ..స్వేచ్ఛ కోసం ఆరాటం … అనుకూలించని పరిస్థితులూ … జీవితంతో రాజీ … మళ్ళీ పోరాటం .. ఇదొక గోళాకార క్యారెక్టర్ …సంపూర్ణ వ్యక్తిత్వం …. అసలు రచయిత్రి గొప్పదనం ఎక్కడా జడ్జిమెంటల్ గా లేక పోవడమే . నాటకీయత రచనపై ఆసక్తి కోసం ఉపయోగపడింది . ఎన్నో అంశాలని సృజించడం కొంత అత్యాశే అయినా రచన విస్తృతి పెరిగింది . కధనం లో కొన్ని లోపాలున్నా చదివించగలగడం లో ఈ రచన ఎక్కడా తక్కువ కాదు .

 • సాహిత్య విమర్శ అంటే వ్వక్తి గత విమర్శ అని అనుకుండే కాలం ఇది. అందుకే తెలుగు సాహిత్యంలో పెద్దగా విమర్శ లు లేవు. విశ్లేషణ ను విమర్శ అనే ధోరణి కూడా ఉంది.
  నవల చదవలేదు కాని సమీక్షలు చదివాను. మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది! జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు గా చిత్రిస్తే అది నవల కావొచ్చు కానీ దానివల్ల సామాజిక ప్రయోజనం ఉండదు. మనం నాయక, నాయికలని ఎందుకు అంటామంటే వారు పాఠకులను ఒక కొత్త ఆలోచనా ప్రపంచంలో కి తీసుకొని పోవాలి! ఆ ఆలోచన వారి జీవిత దృక్పథం లో కొంతయినా మార్పు తీసుక రావాలి! కథలు, నవలలు రాసే వాళ్లు రచయితలు అయిఅతే కావచ్చు కానీ, వారి రచన ల వలన పాఠకులకు రావాల్సిన ప్రయోజనం రాదు.

 • ఏది మంచి అని నిర్ణయించేది పాఠకుడు, అది ఎటువంటి సాహిత్య ప్రక్రియ అయినా.

  ఇటీవల కాలంలో రచయితతో పరిచయం ఉన్నప్పుడు, అభిమానంతోనో, మొహమాటంతోను, మరేదో ప్రయోజనం ఆశించో పొగడ్తలే కనబడుతున్నాయి. అలాగని నిష్పక్షపాత విమర్శలు లేవని కావు. చాలా తక్కువ. తెలుగులో విమర్శకులు తక్కువ.

  తానా బహుమతి అందుకున్నందున ఈ నీల నవల చాల ప్రాచుర్యం పొందింది. నీల నవలని విపరీతంగా అభిమానించిన వారున్నారు. అలాగే విపరీతంగా విమర్శించినవారున్నారు. రెండూ అటో, ఇటో.

  ఇంత నిర్మొహమాటమైన సమీక్షని ఇటీవలి కాలంలో చదవలేదు. ఇది అహ్వానించదగ్గ పరిణామం. మనకి మరింత మంది సమీక్షకుల / విమర్శకుల అవసరం ఉంది. అలాగే రచయితలలో కూడా సహనం పెరగాలి. నా వ్యాఖ్యలు ఇక్కడ నీల కి మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుతం తెలుగు సాహిత్యరంగంలో ఉన్నవారందరికి వర్తిస్తుంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.